27-03-1988 అవ్యక్త మురళి

27-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘‘సర్వ శ్రేష్ఠ సితార - సఫలతా సితార’’

ఈ రోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ అలౌకిక తారామండలాన్ని చూస్తున్నారు. ఇది అలౌకికమైన, విచిత్రమైన తారామండలము. దీని విశేషత గురించి కేవలం తండ్రి మరియు బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసు. ప్రతి సితార తన మెరుపు ద్వారా ఈ విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తోంది. బాప్ దాదా ప్రతి సితార యొక్క విశేషతను చూస్తున్నారు. కొందరు శ్రేష్ఠ భాగ్యవాన్ లక్కీ సితారలుగా ఉన్నారు, కొందరు బాబాకు సమీప సితారలుగా ఉన్నారు మరియు కొందరు దూరంగా ఉండే సితారలుగా ఉన్నారు. అందరు సితారలే కానీ రకరకాల విశేషతలు ఉన్న కారణంగా సేవలో మరియు స్వ-ప్రాప్తిలో వేరు-వేరు ఫలము యొక్క ప్రాప్తిని అనుభవం చేసేవారిగా ఉన్నారు. కొందరు సదా సహజ సితారలుగా ఉన్నారు కనుక సహజ ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేస్తారు. మరికొందరు శ్రమ చేసే సితారలుగా ఉన్నారు, కొద్దిగా శ్రమించినా లేక ఎక్కువగా శ్రమించినా, వారు చాలావరకు శ్రమను అనుభవం చేసిన తర్వాత ఫల ప్రాప్తిని అనుభవం చేస్తారు. కొందరు సదా కర్మ చేసే ముందు ‘సఫలత మా జన్మ సిద్ధ అధికారము’ అనే అధికారాన్ని అనుభవం చేస్తారు. అందుకే ‘నిశ్చయం’ మరియు ‘నషా’ తో కర్మ చేసిన కారణంగా కర్మలో సహజంగా సఫలతను అనుభవం చేస్తారు. వీరిని సఫలతా సితారలు అని అంటారు.

అందరికంటే శ్రేష్ఠమైనవారు సఫలతా సితారలు ఎందుకంటే వారు సదా జ్ఞానసూర్యుడు మరియు జ్ఞానచంద్రునికి సమీపంగా ఉంటారు, అందుకే వారు శక్తిశాలిగా కూడా ఉంటారు మరియు సఫలతకు అధికారులుగా కూడా ఉంటారు. కొందరు శక్తిశాలిగా ఉంటారు కానీ సదా శక్తిశాలిగా ఉండరు కావుననే సదా ఒకే విధమైన మెరుపు ఉండదు. వెరైటీ సితారల మెరుపు అత్యంత ప్రియంగా అనిపిస్తుంది. సేవను సితారలందరూ చేస్తారు కానీ సమీప సితారలు ఇతరులను కూడా సూర్యునికి, చంద్రునికి సమీపంగా తీసుకొచ్చే సేవాధారులుగా అవుతారు. కనుక ప్రతి ఒక్కరు ‘నేను ఎలాంటి సితారను?’ అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. లవ్లీ (ప్రియమైన) సితారలా? లక్కీ సితారలా? సదా శక్తిశాలిగా ఉండేవారా? శ్రమను అనుభవం చేసేవారా? లేక సహజంగా సఫలతను పొందే సితారలా? జ్ఞానసూర్యుడైన బాబా సితారలందరికీ అనంతమైన ప్రకాశాన్ని మరియు శక్తిని ఇస్తారు కానీ కొందరు సమీపంగా, కొందరు దూరంగా ఉన్న కారణంగా తేడా వస్తుంది. ఎంత సమీపమైన సంబంధమో, అంత ప్రకాశం మరియు శక్తి విశేషంగా ఉంటాయి, ఎందుకంటే సమీప సితారల లక్ష్యమే సమానంగా అవ్వడము.

అందుకే బాప్ దాదా సితారలందరికీ సదా ఇచ్చే సూచన ఏమిటంటే - లక్కీ మరియు లవ్లీ సితారలుగా అయితే అందరూ అయ్యారు. ఇప్పుడిక స్వయాన్ని పరిశీలించుకోండి - సదా సమీపంగా ఉండే మరియు సహజంగా సఫలతను అనుభవం చేసే సఫలతా సితారలుగా ఎంతవరకు అయ్యాము? అని. ఇప్పుడు కింద పడే సితారలు అయితే కారు మరియు తోకచుక్కలు కూడా కారు. తోకచుక్కలు అని ఎవరిని అంటారంటే, వారు పదే-పదే స్వయాన్ని లేక బాబాను లేక నిమిత్తంగా ఉన్న ఆత్మలను ‘ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇది ఎలా’ అని ప్రశ్నిస్తూనే ఉంటారు. పదే-పదే ప్రశ్నించే వారే తోకచుక్కలు. ఇలా అయితే లేరు కదా? సఫలతా సితారలు అనగా ఎవరి ప్రతి కర్మలో సఫలత ఇమిడి ఉందో వారు. ఇలాంటి సితారలు సదా బాబాకు సమీపంగా అనగా బాబాతో పాటు ఉంటారు. విశేషతలను విన్నారు, ఇప్పుడీ విశేషతలను స్వయంలో ధారణ చేసి సదా సఫలతా సితారలుగా అవ్వండి. ఎలా అవ్వాలో అర్థమయిందా? లక్కీ మరియు లవ్లీతో పాటు సఫలత - ఈ శ్రేష్ఠతను సదా అనుభవం చేస్తూ ఉండండి. అచ్ఛా.

ఈ రోజు అందరినీ కలుసుకోవాల్సి ఉంది. బాప్ దాదా ఈ రోజు విశేషంగా కలుసుకునేందుకే వచ్చారు. అందరికీ కలుసుకోవాలనే లక్ష్యమే ఉంటుంది. కానీ పిల్లల అలను చూసి బాబాకు పిల్లలందరినీ సంతోషపెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే పిల్లల సంతోషంలోనే బాబా సంతోషముంది. కనుక ఈ రోజు బాబాను వేరుగా కలుసుకోవాలనే అల ఉంది. కావున సాగరునికి కూడా అదే అలలోకి రావాల్సి ఉంటుంది. ఇది ఈ సీజన్లోని అల కావున రథానికి కూడా విశేషమైన సకాష్ ఇచ్చి నడిపిస్తున్నారు. అచ్ఛా.

నలువైపులా ఉన్న అలౌకిక తారామండలంలోని అలౌకిక సితారలకు, సదా విశ్వానికి ప్రకాశాన్నిచ్చి అంధకారాన్ని తొలగించే మెరిసే సితారలకు, సదా తండ్రికి సమీపంగా ఉండే శ్రేష్ఠ సఫలతా సితారలకు, అనేక ఆత్మల భాగ్యరేఖను పరివర్తన చేసే భాగ్యవాన్ సితారలకు, జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రులైన బాప్ దాదాల విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

వ్యక్తిగత మిలనము -

1. ‘సదా ప్రతి ఆత్మకు సుఖాన్నిచ్చే సుఖదాత తండ్రి పిల్లలము’ అని అనుభవం చేస్తున్నారా? అందరికీ సుఖాన్నిచ్చే విశేషత ఉంది కదా. ఈ విశేషత డ్రామానుసారంగా లభించింది. ఈ విశేషత అందరిలోనూ ఉండదు. అందరికీ సుఖాన్నిచ్చేవారికి అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి, అందుకే వారు స్వయం కూడా సదా సుఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తారు. ఈ విశేషత ద్వారా వర్తమానం కూడా బాగుంటుంది, భవిష్యత్తు కూడా మంచిగా తయారవుతుంది. ఇది ఎంత మంచి పాత్ర! అందరి ప్రేమ కూడా లభిస్తుంది, అందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. దీనినే ‘ఒకటి ఇచ్చి వెయ్యి పొందడం’ అని అంటారు. సేవ ద్వారా సుఖం ఇస్తారు కనుక అందరి ప్రేమ లభిస్తుంది. ఈ విశేషతను సదా నిలుపుకోండి.

2. సదా స్వయాన్ని ‘సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క శక్తిశాలి ఆత్మను’ అని అనుభవం చేస్తున్నారా? శక్తిశాలి ఆత్మ సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. ఇలాంటి శక్తిశాలురేనా? సంతుష్టతయే మహానత. శక్తిశాలి ఆత్మ అనగా సంతుష్టతా ఖజానాతో నిండుగా ఉండే ఆత్మ. ఈ స్మృతితోనే సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఖజానాయే అందరినీ నిండుగా చేస్తుంది.

3. ‘బాబా మొత్తం విశ్వం నుండి మమ్మల్ని ఎన్నుకొని తమవారిగా చేసుకున్నారు’ అనే సంతోషం ఉంటుంది కదా. బాబా ఇంతమంది ఆత్మల నుండి ఆత్మనైన నన్నొక్కరినే ఎన్నుకున్నారు - ఈ స్మృతి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది! కనుక సదా ఈ సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. బాబా నన్ను తమవారిగా చేసుకున్నారు ఎందుకంటే నేనే కల్పక్రితపు భాగ్యవాన్ ఆత్మను, ఇప్పుడు కూడా నేనే అయ్యాను. తర్వాత కూడా నేనే అవుతాను. ఇలాంటి భాగ్యవాన్ ఆత్మను అనే స్మృతితో సదా ముందుకు వెళ్తూ ఉండండి.

4. ‘సదా నిశ్చింతులుగా అయి సేవ చేసే బలం ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది.’ వీరు చేసారా లేక మేము చేసామా అనే సంకల్పం నుండి నిశ్చింతగా ఉంటే సేవ నిశ్చితంగా (తప్పకుండా) జరుగుతుంది మరియు ఆ సేవా బలం సదా ముందుకు తీసుకువెళ్తుంది. కావున మీరు నిశ్చింత సేవాధారులే కదా? లెక్కపెట్టుకుని సేవ చేసేవారు కాదు. దీనినే నిశ్చింత సేవ అని అంటారు. ఎవరైతే నిశ్చింతులై సేవ చేస్తారో, వారికి నిశ్చితంగానే ముందుకు వెళ్ళే అనుభూతి సహజంగా కలుగుతుంది. ఈ విశేషతయే వరదాన రూపంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది.

5. సేవ కూడా అనేక ఆత్మలను బాబాకు స్నేహీలుగా చేసే సాధనంగా ఉంది. చూసేందుకు కర్మణా సేవే కావచ్చు కానీ కర్మణా సేవ, వాచా సేవ కంటే కూడా ఎక్కువ ఫలాన్నిస్తుంది. కర్మణా ద్వారా ఎవరి మనసునైనా పరివర్తన చేసే సేవ జరుగుతుంది కనుక ఆ సేవకు ఫలంగా ‘విశేషమైన సంతోషం’ ప్రాప్తిస్తుంది. కర్మణా సేవ చూసేందుకు స్థూల సేవలా కనిపిస్తుంది కానీ అది సూక్ష్మ వృత్తులను పరివర్తన చేసేదిగా ఉంటుంది. కనుక ఇలాంటి సేవకు మేము నిమిత్తంగా ఉన్నాము - ఈ సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. భాషణ చేసేవారు భాషణ చేస్తారు కానీ కర్మణా సేవ భాషణ చేసేవారి సేవ కంటే పెద్ద సేవ ఎందుకంటే దీనికి ప్రత్యక్షఫలం అనుభవమవుతుంది.

6. ‘సదా పుణ్య ఖాతాను జమ చేసుకునే శ్రేష్ఠమైన ఆత్మను’ అని అనుభవమవుతుందా? ఈ సేవ, పేరుకు సేవ కానీ ఇది పుణ్య ఖాతాను జమ చేసుకునే సాధనము. కనుక పుణ్య ఖాతా సదా నిండుగా ఉంది మరియు ఇకముందు కూడా నిండుగా ఉంటుంది. ఎంత సేవ చేస్తారో, అంత పుణ్య ఖాతా పెరుగుతూ ఉంటుంది. కనుక పుణ్య ఖాతా అవినాశీగా అయిపోయింది. ఈ పుణ్యము అనేక జన్మల కొరకు నిండుగా చేస్తుంది. మీరు పుణ్యాత్ములుగా ఉన్నారు మరియు సదా కోసం పుణ్యాత్ములుగా అయి ఇతరులకు కూడా పుణ్యము యొక్క దారిని తెలియజేసేవారు. ఈ పుణ్య ఖాతా అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది, అనేక జన్మలు సుసంపన్నులుగా ఉంటారు. ఈ సంతోషంలో సదా ముందుకు వెళ్తూ ఉండండి.

7. ‘సదా ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసే శ్రేష్ఠ ఆత్మను’ అని అనుభవం చేస్తున్నారా? ఎక్కడైతే ఒక్క తండ్రి స్మృతి ఉంటుందో, అక్కడ ఏకరస స్థితి స్వతహాగా సహజంగా అనుభవమవుతుంది. కనుక ఏకరస స్థితి శ్రేష్ఠమైన స్థితి. ఏకరస స్థితిని అనుభవం చేసే శ్రేష్ఠ ఆత్మను అనే స్మృతి సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ స్థితి ద్వారా అనేక శక్తుల అనుభూతి కలుగుతూ ఉంటుంది.

8. మీరు బాప్ దాదాకు విశేషమైన అలంకారము కదా! అన్నిటికంటే శ్రేష్ఠమైన అలంకారము మస్తకమణి. మణి సదా మస్తకంపై మెరుస్తుంది. కనుక ఇలాంటి మస్తకమణిగా అయి సదా తండ్రి కిరీటంలో మెరిసేవారు ఎంత బాగుంటారు! మణి సదా తన మెరుపు ద్వారా బాబాకు కూడా అలంకారంగా అవుతుంది మరియు ఇతరులకు కూడా ప్రకాశాన్నిస్తుంది. కనుక ఇలాంటి మస్తకమణిగా అయి ఇతరులను కూడా అలా తయారుచేసే వారము అనే లక్ష్యం సదా ఉంటుందా? సదా శుభ భావన సర్వుల భావనలను పరివర్తన చేస్తుంది.

9. సదా బాబాను ఫాలో చేయడంలో ‘త్వరిత దానం మహా పుణ్యం’ అనే విధితో ముందుకు వెళ్తున్నారు కదా. ఈ విధిని సదా ప్రతి కార్యంలో ఉపయోగించడం ద్వారా సదా బాబా సమాన స్థితి స్వతహాగానే అనుభవమవుతుంది. ప్రతి కార్యంలో ఫాలో ఫాదర్ చేయడంలో ఆది నుండి అనుభవీలుగా ఉన్నారు కనుక ఇప్పుడు కూడా ఈ విధి ద్వారా సమానంగా అవ్వడం అత్యంత సహజము ఎందుకంటే ఇమిడి ఉన్న విశేషతను కార్యంలో ఉపయోగించాలి. బాబా సమానంగా అయ్యే విశేషమైన అలౌకిక అనుభూతులను చేస్తూ ఉంటారు. అంతేకాక, ఇతరులకు కూడా చేయిస్తూ ఉంటారు. ఈ విశేషత యొక్క వరదానం స్వతహాగా లభించింది. కనుక ఈ వరదానాన్ని సదా కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి.

10. సదా పరివర్తన శక్తిని యథార్థ రీతి ద్వారా కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠ ఆత్మలు కదా. ఈ పరివర్తన శక్తి ద్వారానే సర్వుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు పాత్రులుగా అవుతారు. ఉదాహరణకు గాఢాంధకారం ఉన్న సమయంలో ఎవరైనా ప్రకాశాన్ని చూపిస్తే, ఆ అంధకారంలో ఉన్నవారి మనసు నుండి ఆశీర్వాదాలు వెలువడతాయి కదా! అలాగే ఎవరైతే యథార్థమైన పరివర్తనా శక్తిని కార్యంలో ఉపయోగిస్తారో, వారికి అనేక ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అందరి ఆశీర్వాదాలు ఆ ఆత్మను సహజంగా ముందుకు తీసుకువెళ్తాయి. ఈ విధంగా ‘ఆశీర్వాదాలు తీసుకునే కార్యాలు చేసే ఆత్మను’ అనే స్మృతిని సదా ఉంచుకుంటే, ఏ కార్యము చేసినా, ఆశీర్వాదాలు తీసుకునేటువంటిదే చేస్తారు. శ్రేష్ఠ కార్యాలు చేయడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. కావున ‘నేను అందరి నుండి ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను’ అనే స్మృతి సదా ఉండాలి. ఈ స్మృతే శ్రేష్ఠంగా అయ్యేందుకు సాధనము, ఈ స్మృతే అనేకుల కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. కనుక ‘నేను పరివర్తన శక్తి ద్వారా సర్వుల ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను’ అని గుర్తుంచుకోండి. అచ్ఛా.

గ్లోబల్ కోఆపరేషన్ ప్రాజెక్టు మీటింగ్ సమాచారాన్ని బాప్ దాదాకు వినిపించారు

బాప్ దాదా సంతోషిస్తున్నారు - ఇంతమంది కలిసి ప్లాన్ తయారుచేస్తున్నారు, దానిని ప్రాక్టికల్ లోకి తీసుకొస్తున్నారు మరియు ఇక ముందు కూడా తీసుకొస్తూ ఉంటారు. బాప్ దాదా కు ఇంకేమి కావాలి! అందుకే బాప్ దాదాకు ఇష్టము. ఒకవేళ ఏదైనా కష్టముంటే, దానిని బాప్ దాదా సహజం చేయగలరు. ఇలా బుద్ధి నడవడం కూడా ఒక వరదానము. కేవలం బ్యాలెన్స్ పెడుతూ నడుచుకోండి. బ్యాలెన్స్ ఉన్నప్పుడు బుద్ధి చాలా త్వరగా నిర్ణయిస్తుంది, అప్పుడు 4 గంటల పాటు చర్చించే విషయానికి ఒక గంట సమయం కూడా పట్టదు. అందరికీ ఒకే రకమైన ఆలోచనలు వస్తాయి. కానీ ఇది కూడా మంచిదే, ఆటలా ఉంది, కొన్ని తయారుచేస్తారు, కొన్ని తుంచేస్తారు..... ఇందులో కూడా మజా అనిపిస్తుంది. ప్లాన్లు తయారుచేయండి, తర్వాత రిఫైన్ చేయండి. బిజీగా అయితే ఉంటారు, కేవలం భారంగా అనుభవం చేయకండి, ఆట వలె ఆడండి. సమయం తక్కువగా ఉంది, ఎంత చేయగలరో అంత చేయండి. సేవ కూడా నడుస్తూనే ఉంటుంది. ఎలాగైతే భండారా (కిచెన్) ఎప్పుడూ మూయబడదో, అలా సేవ కూడా భండారా వంటిది, అవినాశీగా నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ ఏ కార్యంలోనైనా ఆలస్యమైతే, ఆ కార్యం ఇంకా బాగా జరగాల్సి ఉంది కనుక ఆలస్యమవుతుంది. ఇకపోతే అందరూ శ్రమపడుతున్నారు, సోమరిగా లేరు, అందుకే బాప్ దాదా ఫిర్యాదు చేయరు. అచ్ఛా.

Comments