26-01-1988 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“సంగమయుగంలో నంబరువన్ పూజ్యులుగా అయ్యేందుకు అలౌకిక విధి”
ఈ రోజు అనాది తండ్రి మరియు ఆది తండ్రి, తమ పిల్లలను అనాది సాలిగ్రామాలుగా మరియు ఆది బ్రాహ్మణ పిల్లలుగా డబల్ రూపంలో చూస్తున్నారు. సాలిగ్రామ రూపంలో కూడా పరమపూజ్యులే మరియు బ్రాహ్మణ సో దేవతా స్వరూపంలో కూడా గాయన మరియు పూజనీయ యోగ్యులు. ఆది మరియు అనాది తండ్రులిరువురు పూజ్య ఆత్మలను రెండు రూపాలలోనూ చూసి హర్షిస్తున్నారు. అనాది తండ్రి, ఆదిపిత సహితంగా అనగా బ్రహ్మాబాబా మరియు బ్రాహ్మణ పిల్లలను తనకంటే ఎక్కువగా డబల్ రూపంలో పూజ్యులుగా చేశారు. అనాది తండ్రి పూజ కేవలం నిరాకార రూపంలోనే జరుగుతుంది కానీ బ్రహ్మా సహితంగా బ్రాహ్మణ పిల్లల పూజ నిరాకార మరియు సాకార - రెండు రూపాలలో జరుగుతుంది. కనుక తండ్రి తన పిల్లలను తనకంటే ఎక్కువగా డబల్ రూపంలో మహాన్ గా భావిస్తారు.
ఈ రోజు బాప్ దాదా పిల్లల విశేషతలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరికి వారి వారి విశేషత ఉంది. కొంతమంది తండ్రి మరియు సర్వ బ్రాహ్మణాత్మలలోని విశేషతలను తెలుసుకొని స్వయంలో సర్వ విశేషతలను ధారణ చేసి శ్రేష్ఠంగా అనగా విశేష ఆత్మలుగా అయ్యారు. మరికొంతమంది విశేషతలను చూసి, తెలుసుకొని సంతోషిస్తారు కానీ స్వయంలో సర్వ విశేషతలను ధారణ చేసే ధైర్యం లేదు. మరికొందరు ప్రతి ఆత్మలో లేక బ్రాహ్మణ పరివారంలో విశేషతలు ఉన్నా కానీ ఆ విశేషతల యొక్క మహత్వంతో చూడరు, ఇతరులను సాధారణ రూపంలో చూస్తారు. వారికి విశేషతలను చూసే లేక తెలుసుకునే అభ్యాసం లేదు మరియు గుణగ్రాహక బుద్ధి అనగా గుణాలను గ్రహించే బుద్ధి లేనందున విశేషతలను లేక గుణాలను తెలుసుకోలేరు. ప్రతి బ్రాహ్మణాత్మలో ఏదో ఒక విశేషత తప్పకుండా నిండి ఉంది. 16 వేలలోని చివరి పూసగా ఉన్నా కానీ వారిలో కూడా ఏదో ఒక విశేషత ఉంది, అందుకే బాబా దృష్టి ఆ ఆత్మపై పడుతుంది. భగవంతుని దృష్టి పడింది అంటే, భగవంతుడు తనవారిగా చేసుకున్నారు అంటే తప్పకుండా విశేషత ఇమిడి ఉంది. అందుకే ఆ ఆత్మ బ్రాహ్మణుల లిస్టులోకి వచ్చింది కానీ సదా ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడడం మరియు తెలుసుకోవడంలో నంబరువారుగా అవుతారు. ఎలాంటి వారైనా సరే, ఒకవేళ జ్ఞాన ధారణలో, సేవలో, స్మృతిలో బలహీనంగా ఉన్నా కానీ, తండ్రిని తెలుసుకునే మరియు తండ్రికి చెందినవారిగా అయ్యే విశాలబుద్ధి, తండ్రిని చూసే దివ్యదృష్టి - ఈ విశేషత అయితే ఉందని బాప్ దాదాకు తెలుసు. ఎవరినైతే ఈ రోజుల్లోని ప్రసిద్ధిగాంచిన విద్వాంసులు కూడా తెలుసుకోలేరో, గుర్తించలేరో, వారిని ఆ ఆత్మలు తెలుసుకున్నారు! కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరు అనే ఈ లిస్టులోకైతే వచ్చేశారు కదా, అందుకే కోట్లలో విశేష ఆత్మలుగా అయితే అయ్యారు కదా. విశేషమైనవారిగా ఎందుకయ్యారు? ఎందుకంటే ఉన్నతోన్నతుడైన తండ్రికి చెందినవారిగా అయ్యారు.
ఆత్మలందరిలోనూ బ్రాహ్మణాత్మలు విశేషమైనవారు. అయితే, కొందరు తమ విశేషతలను కార్యంలో వినియోగిస్తారు కనుక ఆ విశేషత వృద్ధి చెందుతూ ఉంటుంది మరియు ఇతరులకు కూడా అది కనిపిస్తుంది. మరికొందరిలో విశేషత రూపీ బీజమైతే ఉంది కానీ కార్యంలో వినియోగించడం అనగా బీజాన్ని ధరణిలో నాటడం. ఎంతవరకైతే బీజాన్ని ధరణిలో నాటరో అంతవరకు వృక్షము ఉత్పన్నమవ్వదు, విస్తారాన్ని పొందదు. చాలామంది పిల్లలు విశేషత అనే బీజాన్ని విస్తారంలోకి తీసుకొస్తారు అనగా వృక్ష రూపంలో వృద్ధిని కూడా ప్రాప్తి చేసుకుంటారు, ఫలాన్ని కూడా ప్రాప్తి చేసుకుంటారు కానీ ఫలం వచ్చినప్పుడు ఆ ఫలాన్ని తినేందుకు పిచ్చుకలు, పక్షులు కూడా వస్తాయి అనగా ఫలం వచ్చే సమయానికి ‘నేను విశేష ఆత్మను, నాలో ఈ విశేషత ఉంది’ అనే రూపంలో మాయ వస్తుంది. ఇది బాబా ద్వారా ప్రాప్తించిన విశేషత అని భావించరు. విశేషతను నింపేవారు బాబా. బ్రాహ్మణులుగా అయిన తర్వాతనే ఆ విశేషత వచ్చింది. ఆ విశేషత బ్రాహ్మణ జీవితం ఇచ్చిన కానుక, బాబా ఇచ్చిన కానుక కావున ఫలం పొందిన తర్వాత అనగా సేవలో సఫలత పొందిన తర్వాత ఈ అటెన్షన్ తప్పకుండా ఉంచుకోవాలి. లేదంటే మాయ రూపీ పిచ్చుకలు, పక్షులు ఫలాన్ని ఎంగిలి చేస్తాయి లేదా కింద పడేస్తాయి. ఎలాగైతే ఖండిత మూర్తికి పూజ జరగదో, దానిని మూర్తిగా భావిస్తారు కాని పూజించరో, అలా బ్రాహ్మణాత్మలు సేవకు ఫలాన్ని అనగా సేవలో సఫలతను పొందుతారు కానీ ‘మైపన్ (నేను, నాది)’ అనే పక్షి ఫలాన్ని ఖండితం చేసింది కనుక కేవలం వీరు చాలా బాగా సేవ చేస్తారు, మహారథులు, సర్వీసబుల్ అని అందరూ అనుకుంటారు కానీ సంగమయుగంలో కూడా సర్వ బ్రాహ్మణ పరివారం మనసుల్లో స్నేహానికి పాత్రులుగా లేక పూజ్యులుగా అవ్వలేరు.
సంగమయుగంలో హృదయపూర్వక స్నేహాన్ని, హృదయపూర్వక గౌరవాన్ని పొందడమే పూజ్యులుగా అవ్వడము. ఫలంలో ‘నేను’ అనే భావాన్ని తీసుకొచ్చేవారు పూజ్యులుగా అవ్వలేరు. మొదటిది - ఎవరినైనా హృదయపూర్వకంగా ఉన్నతమైనవారిగా భావించడము, మరి ఉన్నతమైనవారిని పూజ్యులని అంటారు. ఈనాటి ప్రపంచంలో కూడా తండ్రి ఉన్నతమైనవారు కావున అతని పిల్లలు ‘పూజ్యులైన తండ్రిగారు’ అని పిలుస్తారు లేక వ్రాస్తారు. ఇలా హృదయపూర్వకంగా ఉన్నతమైనవారిగా భావించడం అనగా హృదయపూర్వకంగా గౌరవాన్నివ్వడము. రెండవది - బాహ్య మర్యాదల అనుసారంగా గౌరవాన్ని ఇవ్వాల్సే వస్తుంది. కనుక ‘హృదయపూర్వకంగా ఇవ్వడము’ మరియు ‘ఇవ్వాల్సే వస్తుంది’ - వీటి మధ్యన ఎంత తేడా ఉంది! పూజ్యులుగా అవ్వడం అనగా అందరూ హృదయపూర్వకంగా స్వీకరించడము. మెజారిటీ స్వీకరించాలి. 5 శాతం మందైతే ఎలాగూ మిగిలిపోతారని ఇంతకుముందు కూడా వినిపించాము కానీ మెజారిటీ హృదయపూర్వకంగా స్వీకరించాలి - ఇదే సంగమయుగంలో పూజ్యులుగా అవ్వడము. పూజ్యులుగా అయ్యే సంస్కారాన్ని కూడా ఇప్పటి నుండే నింపుకోవాలి. కానీ భక్తి మార్గంలో పూజ్యులుగా అవ్వడానికి మరియు ఇప్పుడు పూజ్యులుగా అవ్వడానికి తేడా ఉంది. ప్రస్తుతం మీ శరీరాలకు పూజ జరగదు ఎందుకంటే ఇవి అంతిమ పాత శరీరాలు, తమోగుణి తత్వాలతో తయారైన శరీరాలు. అలానే, ఇప్పుడు పూల హారాలు వేయరు. భక్తి మార్గంలోనైతే దేవతలకు వేస్తారు కదా. పూజ్యులకు గుర్తులు - ధూపం వెలిగించడం, మాల వేయడం, హారతి ఇవ్వడం, కీర్తన చేయడం, తిలకం దిద్దడం. సంగమయుగంలో ఈ స్థూలమైన పద్ధతులు లేవు. కానీ సంగమయుగంలో సదా హృదయపూర్వకంగా ఆ పూజ్య ఆత్మలకు సత్యమైన స్నేహమనే హారతిని ఇస్తూ ఉంటారు. ఆత్మల ద్వారా సదా ఏదో ఒక ప్రాప్తి యొక్క కీర్తన జరుగుతూనే ఉంటుంది, సదా ఆ ఆత్మల పట్ల శుభ భావన అనే ధూపం లేక దీపం వెలిగిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మలను చూసి సదా, ఎలాగైతే ఆ ఆత్మలు స్వయం బాబాపై బలిహారమయ్యారో అలా ఇతర ఆత్మలలో కూడా బాబాపై బలిహారమయ్యే ఉత్సాహం కలుగుతుంది. కనుక బాబాపై బలిహారమయ్యే హారము సదా ఆ ఆత్మలకు స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఇలాంటి ఆత్మలు సదా స్మృతి-స్వరూప తిలకధారులుగా ఉంటారు. ఈ అలౌకిక విధి ద్వారా ఈ సమయంలో పూజ్య ఆత్మలుగా అవుతారు.
భక్తి మార్గంలో పూజ్యులుగా అవ్వడం కంటే ఇప్పటి పూజయే శ్రేష్ఠమైనది. ఎలాగైతే భక్తి మార్గంలో పూజ్య ఆత్మల రెండు క్షణాల సంపర్కం ద్వారా అనగా కేవలం మూర్తి ఎదురుగా వెళ్ళడంతోనే రెండు క్షణాల కోసమైనా శాంతి, శక్తి, సంతోషము అనుభవమవుతాయో, అలా సంగమయుగ పూజ్య ఆత్మల ద్వారా ఇప్పుడు కూడా ఒకటి-రెండు క్షణాలు వారి దృష్టి లభించినా సరే సంతోషం, శాంతి మరియు ఉల్లాస-ఉత్సాహాల శక్తి అనుభవమవుతుంది. ఇలాంటి పూజ్య ఆత్మలు అనగా నంబరువన్ విశేష ఆత్మలు. రెండు మరియు మూడవ నంబరు వారి గురించైతే వినిపించాము, దానిని ఏమి విస్తారం చేస్తాము. ఉండడం అందరూ విశేష ఆత్మల లిస్టులోనే ఉన్నారు కానీ వన్, టూ, త్రీ - నంబరువారుగా ఉన్నారు. లక్ష్యమైతే అందరికీ నంబరువన్ అవ్వాలనే ఉంటుంది. కావున ఇలాంటి పూజ్యులుగా అవ్వండి. బ్రహ్మాబాబా గుణాల పాటలను పాడుతారు కదా. పూజ్యులుగా అయ్యే లేక నంబరువన్ విశేష ఆత్మలుగా అయ్యే ఈ విశేషతలన్నీ బ్రహ్మాబాబాలో చూశారు మరియు విన్నారు కదా. సాకార బ్రహ్మా ఆత్మ, నంబరువన్ సంగమయుగ పూజ్యము నుండి భవిష్యత్తులో నంబరువన్ పూజనీయంగా అవుతారు. లక్ష్మి-నారాయణులు నంబరువన్ పూజ్యులు కదా. మీరందరూ కూడా అలా తయారవ్వగలరు.
ఎలాగైతే శివబాబాతో పాటు బ్రహ్మాబాబా అద్భుతాలను కూడా పాడుతారో, అలా మీరు కూడా సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మల ద్వారా కమాల్ (అద్భుతము) చేయండి. కమాల్ (అద్భుతము) జరిగినప్పుడు ధమాల్ (తిరుగుబాటు) ఉండదు. కమాల్ చేయకపోతే తిరుగుబాటు చేస్తారు. సంకల్పాల ద్వారా గాని, మాటల ద్వారా గాని తిరుగుబాటు చేస్తారు. సంకల్పాలలో కూడా వ్యర్థం యొక్క తుఫాను వస్తే అది తిరుగుబాటు కదా. ఇప్పుడు తిరుగుబాటు కాదు, కమాల్ చేయాలి ఎందుకంటే ఆదిపిత బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణులు సదా పూజ్యులుగా మహిమ చేయబడ్డారు. ఇప్పుడీ చివరి జన్మలో కూడా చూసినట్లయితే అన్నింటికంటే ఉన్నతమైనదిగా ఏ వర్ణము మహిమ చేయబడింది? బ్రాహ్మణ వర్ణమని అంటారు కదా. ఉన్నతమైన పేరు మరియు ఉన్నతమైన శ్రేష్ఠమైన కార్యాల కోసం కూడా బ్రాహ్మణులనే పిలుస్తారు, ఎవరి కళ్యాణం కోసమైనా బ్రాహ్మణులనే పిలుస్తారు. కనుక చివరి జన్మ వరకు కూడా బ్రాహ్మణాత్మల ఉన్నతమైన పేరు, ఉన్నతమైన కార్యం ప్రసిద్ధంగా ఉన్నాయి. పరంపర నుండి నడుస్తుంది. కేవలం పేరుతో కూడా పనులు కానిస్తున్నారు. పని మీదే కానీ ఆ నామం పెట్టుకున్నవారి పని కూడా నడుస్తుంది. దీని బట్టి సత్యమైన బ్రాహ్మణులకు ఎంత మహిమ ఉంది మరియు వారు ఎంత మహానులో చూడండి. ‘బ్రాహ్మణ’ అనే పేరు కూడా అవినాశీ అయింది. అవినాశీ ప్రాప్తుల కల జీవితంగా అయింది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత - శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ, ఎందుకంటే ప్రేమ ఉన్న చోట శ్రమ ఉండదు. ఇప్పుడీ చివరి జన్మలో కూడా బ్రాహ్మణులు శ్రమ చేయరు, ప్రశాంతంగా తింటూ ఉంటారు. ఒకవేళ మీ ‘పేరు’ యొక్క పని చేసినా ఆకలితో ఉండరు. కనుక ఈ సమయంలోని బ్రాహ్మణ జీవితంలోని విశేషతల యొక్క గుర్తులను ఇప్పటివరకు చూస్తున్నారు. ఇంతటి శ్రేష్ఠమైన విశేషాత్మలు! అర్థమయిందా?
వర్తమాన సమయంలోని పూజ్యులు భవిష్య పూజ్యులు. వీరినే విశేష ఆత్మలు, నంబరువన్ అని అంటారు. కనుక చెక్ చేసుకోండి. బ్రహ్మాబాబా కథను వినిపిస్తున్నాము కదా. ఇప్పుడింకా మిగిలి ఉంది. బ్రహ్మాబాబా విశేషతలను సదా ముందుంచుకోండి. ఇక వేరే విషయాల్లోకి వెళ్ళకండి, కేవలం విశేషతలను చూడండి మరియు వర్ణన చేయండి. ప్రతి ఒక్కరికీ విశేషతల మహత్వాన్ని వినిపించి విశేషంగా తయారుచేయండి. ఇతరులను అలా తయారుచేయడమంటే స్వయం విశేషంగా అవ్వడము. అర్థమయిందా. అచ్ఛా.
నలువైపులా ఉన్న నంబరువన్ విశేషాత్మలందరికీ, బ్రాహ్మణ జీవితం కల విశేషాత్మలందరికీ, సదా బ్రహ్మాబాబాను ముందుంచుకొని సమానంగా అయ్యే పిల్లలకు అనాది తండ్రి, ఆది తండ్రుల రెండు రూపాల ద్వారా సర్వ సాలిగ్రామాలు మరియు సాకార బ్రాహ్మణాత్మలకు స్నేహభరితమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో కలయిక - 1. స్వయాన్ని సదా తండ్రి చేయి మరియు తోడు ఉన్న భాగ్యశాలిగా భావిస్తున్నారా? ఎక్కడైతే తండ్రి చేయి మరియు తోడు ఉంటుందో అక్కడ సదా ఆనందాల జీవితం ఉంటుంది. తికమకపడేవారిగా ఉండరు, ఆనందంగా ఉంటారు. ఏ పరిస్థితి తన వైపు ఆకర్షించదు, సదా తండ్రి వైపు ఆకర్షితులవుతారు. అందరికంటే పెద్దవారు మరియు అందరికంటే గొప్పవారు తండ్రి కనుక తండ్రి తప్ప వేరే ఏ వస్తువు లేక వ్యక్తి ఆకర్షించలేవు. ఎవరైతే తండ్రి చేయి మరియు తోడులో పాలన పొందుతున్నారో, వారి మనసు ఇంకెటువైపు వెళ్ళలేదు. మరి అందరూ ఇలా ఉన్నారా లేక మాయ పాలనలోకి వెళ్ళిపోతున్నారా? ఆ దారిని మూసేశారు కదా. కనుక సదా తండ్రి తోడు యొక్క ఆనందంలో ఉండండి. తండ్రి లభించారంటే అంతా లభించింది, ఏ అప్రాప్తి లేదు. ఎవరు ఎంతగా చేతిని, తోడును విడిపించినా, మీరు విడిచేవారు కాదు. విడిచిపెట్టి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్తారు? ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేదీ ఉండదు. కుమారీలైతే సదా భాగ్యవంతులు. డబల్ భాగ్యం కదా. ఒకటి - కుమారి జీవితం యొక్క భాగ్యం, రెండు - బాబాకు చెందిన వారిగా అయ్యే భాగ్యం. కుమారి జీవితము పూజించబడుతుంది. కుమారి జీవితం సమాప్తమైనప్పుడు అందరి ముందు వంగాల్సి వస్తుంది. గృహస్థ జీవితమంటేనే మేక సమానమైన జీవితం, కుమారి జీవితం పూజ్య జీవితం. ఒకవేళ ఎవరైనా ఒకసారి కింద పడినా, కింద పడడం వలన ఎముకలు విరిగిపోతాయి కదా. తర్వాత ఎంతగా అతికించినా, బాగుచేసినా ఎముకలు బలహీనమవుతాయి. కనుక తెలివైనవారిగా అవ్వండి. టేస్ట్ చూసిన తర్వాత తెలివైనవారిగా అవ్వకండి.
2. సదా స్వయాన్ని కల్ప-కల్పపు విజయీ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? విజయులుగా అయ్యే పాత్రను అనేక సార్లు అభినయించారు మరియు ఇప్పుడు కూడా అభినయిస్తున్నారు. విజయీ ఆత్మలు సదా ఇతరులను కూడా విజయులుగా చేస్తారు. అనేక సార్లు చేసినది చేయడం సదా సహజమవుతుంది, కష్టమనిపించదు. అనేక సార్లు విజయీ ఆత్మలము అనే ఈ స్మృతితో ఏ పరిస్థితినైనా దాటడం ఆటలా అనిపిస్తుంది. సంతోషం అనుభవమవుతుందా? విజయీ ఆత్మలకు విజయమనేది అధికారంగా అనుభవమవుతుంది. అధికారము శ్రమతో లభించదు, స్వతహాగానే లభిస్తుంది. కనుక సదా విజయం యొక్క సంతోషంతో మరియు అధికారంతో ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. లౌకిక పరివారంలో ఉంటూ లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేయండి ఎందుకంటే అలౌకిక సంబంధము సుఖాన్నిస్తుంది. లౌకిక సంబంధాల ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది, సదాకాలికమైనది కాదు. కనుక సదా సుఖవంతులుగా అయ్యారు. దుఃఖితుల ప్రపంచం నుండి సుఖం యొక్క ప్రపంచంలోకి వచ్చారు. ఇలా అనుభవం చేస్తున్నారా? ముందు రావణుని పిల్లలుగా ఉండేవారు కనుక దుఃఖం ఇచ్చేవారిగా ఉండేవారు, ఇప్పుడు సుఖదాత పిల్లలుగా, సుఖ స్వరూపులుగా అయ్యారు. ఈ అలౌకిక బ్రాహ్మణ పరివారము మొదటి నంబరు పరివారము, దేవతలు కూడా రెండవ నంబరు వారు అయ్యారు. కనుక ఈ అలౌకిక జీవితము ప్రియంగా అనిపిస్తుంది కదా.
3. సదా స్వయాన్ని పదమాపదమ భాగ్యశాలి అనుభవం చేస్తున్నారా? పూర్తి కల్పంలో ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తించదు ఎందుకంటే భవిష్య స్వర్గంలో కూడా ఈ సమయంలో చేసే పురుషార్థానికి ప్రారబ్ధంగానే రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. భవిష్యత్తు కూడా వర్తమాన భాగ్యం అనుసారంగా లభిస్తుంది. ఈ సమయంలోని భాగ్యానికే మహత్వముంది. బీజం ఈ సమయంలో వేస్తారు మరియు ఫలం అనేక జన్మలకు ప్రాప్తిస్తుంది. కనుక బీజానికి మహత్వమున్నట్లు కదా. ఈ సమయంలో భాగ్యాన్ని తయారుచేసుకోవడం లేక భాగ్యం ప్రాప్తించడం - ఇది బీజాన్ని నాటడం. కనుక ఈ అటెన్షన్ తో సదా పురుషార్థంలో తీవ్రగతితో ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఈ సమయంలోని పదమాపదమ భాగ్యం సదా స్మృతిలో ఇమర్జ్ రూపంలో ఉండాలి, కర్మలు చేస్తూ స్మృతి ఉండాలి, కర్మల్లో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని మర్చిపోకూడదు. స్మృతి స్వరూపులుగా ఉండండి. వీరినే పదమాపదమ భాగ్యశాలి అని అంటారు. ఈ స్మృతి యొక్క వరదానాన్ని సదా తోడుగా పెట్టుకుంటే సహజంగానే ముందుకు వెళ్తూ ఉంటారు, శ్రమ నుండి విడుదలవుతారు. అచ్ఛా.
Comments
Post a Comment