24-02-1988 అవ్యక్త మురళి

24-02-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

వరదాత ద్వారా ప్రాప్తించిన వరదానాలను వృద్ధి చేసుకునే విధి.

ఈ రోజు బాప్ దాదా తమ ఆత్మిక చాతకులు (స్వాతి చినుకు కోసం ఎదురుచూసే పక్షి) వంటి పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు బాబా నుండి వినేందుకు, బాబాను కలుసుకునేందుకు మరియు బాబా సమానంగా అయ్యేందుకు చాతకులుగా ఉన్నారు (దాహంతో ఉన్నారు). వారి నుండి వినడం ద్వారా జన్మజన్మల దాహం తీరిపోతుంది. జ్ఞానామృతము దప్పికతో ఉన్న ఆత్మలను తృప్త ఆత్మలుగా చేస్తుంది. వింటూ-వింటూ ఆత్మలు కూడా బాబా సమానంగా జ్ఞానస్వరూపులుగా అవుతారు లేదా జ్ఞాన మురళిని వింటూ-వింటూ స్వయం కూడా ‘మురళిధరుని పిల్లలుగా’ అవుతారు. ఆత్మిక మిలనం జరుపుకుంటూ బాబా స్నేహంలో ఇమిడిపోతారు. మిలనం జరుపుకుంటూ లవలీనులై (ప్రేమలో లీనమై), మగ్న స్థితి కలవారిగా తయారవుతారు. మిలనం జరుపుకుంటూ ‘ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు’ అనే అనుభూతిలో నిమగ్నమై ఉంటారు. మిలనం జరుపుకుంటూ నిర్విఘ్నంగా ఉంటారు, సదా బాబా సాంగత్యమనే రంగులో ఎర్రగా (ప్రకాశవంతంగా) అవుతారు. ఇలా ఇమిడిపోయినప్పుడు లేక స్నేహంలో లవలీనమైనప్పుడు ఏ ఆశ ఉంటుంది? ‘బాబా సమానంగా’ అవ్వాలనే ఆశ ఉంటుంది. బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసేవారు అనగా బాబా సమానంగా తయారయ్యేవారు. ఎలాగైతే బాబాకు సదా సర్వశక్తివాన్ స్వరూపం ఉంటుందో, అలా పిల్లలు కూడా సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపులుగా అవుతారు. బాబా స్వరూపము ఎలా ఉందో - సదా శక్తిశాలి, సదా లైట్, అలా సమానంగా అవుతారు.

సమానంగా అవ్వాల్సిన విశేషమైన విషయాలేవో తెలుసు కదా? ఏయే విషయాలలో బాబా సమానంగా అవ్వాలి? అవుతూ ఉన్నారు మరియు అయ్యారు కూడా. బాబాకు ఏ పేరైతే ఉందో, పిల్లలకు కూడా అదే పేరు ఉంది. ‘విశ్వకళ్యాణకారి’ - మీ అందరి పేరు ఇదే కదా. బాబాకు ఏ రూపముందో, అదే పిల్లల రూపం, బాబాలో ఏ గుణాలున్నయో, అవే పిల్లల గుణాలు. బాబాలోని ప్రతి గుణాన్ని ధారణ చేసేవారే బాబా సమానంగా అవుతారు. బాబా కార్యమే పిల్లల కార్యము. అన్ని విషయాలలోనూ బాబా సమానంగా అవ్వాలి. లక్ష్యమైతే అందరిది ఇదే కదా. మీరు సమ్ముఖంలో ఉండేవారు కాదు, కానీ సమానంగా అయ్యేవారు. ఇటువంటివారినే ఫాలో ఫాదర్ చేసేవారని అంటారు. కనుక అన్ని విషయాలలోనూ ఎంతవరకు బాబా సమానంగా అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. సమానంగా అయ్యే వరదానాన్ని బాబా ఆది నుండి పిల్లలకు ఇచ్చారు. ఆదిలో ఇచ్చిన వరదానము - ‘సర్వశక్తులతో సంపన్న భవ’. లౌకిక జీవితంలో తండ్రి లేక గురువు వరదానాలిస్తారు. ‘ధనవాన్ భవ’, ‘పుత్రవాన్ భవ’, ‘దీర్ఘాయుష్మాన్ భవ’ లేక ‘సుఖీ భవ’ అనే వరదానాలను ఇస్తారు. బాప్ దాదా ఏ వరదానాన్ని ఇచ్చారు? ‘సదా జ్ఞాన ధనం మరియు శక్తుల ధనంతో సంపన్న భవ’ అనే వరదానాన్ని ఇచ్చారు. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క ఖజానా.

బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి సంగమయుగంలో జరిగే స్థాపనా కార్యంలో చివరి వరకు జీవించడమే ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఒకవేళ మధ్యలో బ్రాహ్మణ జీవితం నుండి బయటకు వచ్చి పాత సంస్కారాల వైపు లేక పాత ప్రపంచం వైపుకు వెళ్ళిపోతే, జన్మ తీసుకున్నారు కానీ తక్కువ ఆయుష్షు కలవారని అంటారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితం నుండి మరణించారు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయిన వారిలా ఉంటారు అనగా ఉన్నా లేనట్లే ఉంటారు, వారు అప్పుడప్పుడు మేల్కొంటారు కానీ వారి బ్రతికి ఉన్నా మరణించినవారి సమానంగానే ఉంటారు. కనుక ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అనగా సదా ఆది నుండి అంతిమము వరకు బ్రాహ్మణ జీవితం లేక శ్రేష్ఠ దివ్య జీవితానికి గల సర్వ ప్రాప్తులతో జీవించడము. దీర్ఘాయుష్షుతో పాటు ‘నిరోగి భవ’ అనే వరదానం కూడా అవసరము. ఒకవేళ ఆయుష్షు ఎక్కువగా ఉన్నా కానీ, మాయ వ్యాధి మాటిమాటికి బలహీనంగా చేస్తే, ఇలా జీవించడం జీవించనట్లు కాదు. కనుక ‘దీర్ఘాయుష్మాన్ భవ’తో పాటు సదా ఆరోగ్యంగా ఉండాలి అనగా నిర్విఘ్నంగా ఉండాలి. మాటిమాటికి తికమకపడకండి లేదా నిరాశ స్థితి అనే మంచం పాలవ్వకండి. ఎవరైనా అనారోగ్యంపాలైతే మంచం పాలవుతారు కదా. చిన్న-చిన్న సమస్యలనైతే నడుస్తూ-తిరుగుతూ కూడా సమాప్తం చేస్తారు కానీ ఏదైనా పెద్ద సమస్య వస్తే, తికమకపడితే, నిరాశ చెందుతారు. అప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎలాగైతే శరీరం మంచం పాలైనప్పుడు లేవాలని, నడవాలని, తినాలని లేక తాగాలని అనిపించదో, అలా ఇక్కడ కూడా యోగంలో కూర్చొన్నా సరే, మనసు లగ్నమవ్వదు, జ్ఞానం వింటారు కానీ మనసు పెట్టి వినరు. సేవ కూడా మనస్ఫూర్తిగా చేయరు. చూపించుకోవడానికి లేక భయంతో లేక ఎవరేమనుకుంటారో అని చేస్తారు. దీనిని సదా ఆరోగ్యవంతమైన జీవితమని అనరు. కనుక ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అనగా ‘నిరోగి భవ’ అంటే ఇదే.

‘పుత్రవాన్ భవ’ లేక ‘సంతాన భవ’ (సంతాన ప్రాప్తిరస్తు). మీకు సంతానమున్నారా? ఇద్దరు లేక నలుగురు పిల్లలకు జన్మనివ్వలేదా? ‘సంతాన భవ’ అనే వరదానముంది కదా. ఇద్దరు లేక నలుగురు పిల్లల కొరకు వరదానం లభించదు కానీ ఎప్పుడైతే బాబా సమానంగా మాస్టర్ రచయిత స్థితిలో స్థితులవుతారో, అప్పుడు ఈ రచన అంతా మీదిగా అనిపిస్తుంది. అనంతమైన మాస్టర్ రచయితగా అవ్వడమే - అనంతమైన ‘పుత్రవాన్ భవ’, ‘సంతాన భవ’ గా అవ్వడము. నేను ఇద్దరు లేక నలుగురు జిజ్ఞాసువులను తయారుచేసాను, వీరు నావారు అని అంటూ హద్దు రచయితగా అవ్వడం కాదు. మాస్టర్ రచయిత యొక్క స్థితి అనంతమైన స్థితి. ఈ స్థితిలో ప్రతి ఆత్మను మరియు ప్రకృతి పంచతత్వాలను తమ రచనగా భావిస్తూ విశ్వకళ్యాణకారి స్థితితో ప్రతి ఒక్కరి పట్ల కళ్యాణం చేయాలనే శుభ భావన, శుభ కామన ఉంటుంది. రచనకు, రచన పట్ల ఇలాంటి భావనలే ఉంటాయి. అనంతమైన మాస్టర్ రచయితగా అయినప్పుడు ఏ హద్దు ఆకర్షణ ఆకర్షించలేదు. సదా స్వయాన్ని ఎక్కడ నిలబడి ఉన్నట్లుగా చూస్తారు? ఉదాహరణకు వృక్షానికి రచయిత ‘బీజము’, వృక్షము అంతిమ స్థితికి చేరుకున్నప్పుడు ఆ బీజము పైకి వచ్చేస్తుంది కదా. అలా అనంతమైన మాస్టర్ రచయిత సదా స్వయాన్ని ఈ కల్పవృక్షం పైన నిలబడి ఉన్నట్లు అనుభవం చేస్తారు. వారు బాబాతో పాటు వృక్షం పైన మాస్టర్ బీజరూపులుగా అయి శక్తులు, గుణాలు, శుభ భావన, శుభ కామన, స్నేహం మరియు సహయోగం యొక్క కిరణాలను వ్యాపింపజేస్తారు. ఉదాహరణకు సూర్యుడు పైన ఉంటాడు కనుక ఆ కిరణాలు మొత్తం విశ్వంలో స్వతహాగానే వ్యాపిస్తాయి కదా. అలా మాస్టర్ రచయిత మరియు మాస్టర్ బీజరూపులుగా అయి మొత్తం వృక్షానికి కిరణాలను లేక నీటిని ఇవ్వగలరు. కనుక మీకు ఎంతమంది సంతానమున్నట్లు? మొత్తం విశ్వమంతా మీ రచన అయినట్లు కదా. కనుక ‘మాస్టర్ రచయిత భవ’. దీనినే ‘పుత్రవాన్ భవ’ అని అంటారు. ఎన్ని వరదానాలున్నాయి! దీనినే బాబా సమానంగా అవ్వడమని అంటారు. బాబా ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మ తీసుకుంటూనే ఈ వరదానాలన్నీ ఇచ్చేసారు. వరదానాలు లభించాయి కదా లేక ఇప్పుడింకా లభించాలా?

ఎవరికైనా ఏదైనా వరదానం లభించినప్పుడు ఆ వరదానంతో పాటు ఆ వరదానాన్ని కార్యంలో ఉపయోగించే విధి కూడా వినిపించడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధిని పాటించకపోతే ఆ వరదానం యొక్క లాభం తీసుకోలేరు. కనుక వరదానాలైతే అందరికి లభించాయి కానీ విధి ద్వారా ప్రతి వరదానంలో వృద్ధిని ప్రాప్తి చేసుకోగలరు. వృద్ధిని ఎలా ప్రాప్తి చేసుకోగలరు, దానికి అన్నింటికంటే సహజమైన మరియు శ్రేష్ఠమైన విధి ఏమిటంటే - ఎటువంటి సమయమో, ఆ సమయమనుసారంగా వరదానం స్మృతిలోకి రావాలి. స్మృతిలోకి రావడం ద్వారా సమర్థంగా అవుతారు మరియు సిద్ధి స్వరూపులుగా అవుతారు. ఎంతెంతగా సమయమనుసారంగా కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా ఆ వరదానం వృద్ధి అవుతూ ఉంటుంది అనగా సదా ఆ వరదానం యొక్క ఫలాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. మీకు ఎంత శ్రేష్ఠమైన, శక్తిశాలి వరదానాలు లభించాయంటే, వాటిని కేవలం మీ పట్ల కార్యంలో ఉపయోగించి ఫలాన్ని ప్రాప్తి చేసుకోవడమే కాక ఇతర ఆత్మలకు కూడా వరదాత తండ్రి ద్వారా వరదానాలను ప్రాప్తి చేసుకునేందుకు యోగ్యులుగా చేయగలరు. సంగమయుగంలోని ఈ వరదానాలు 21 జన్మలు వరకు రకరకాల రూపాలలో మీతోపాటు ఉంటాయి. సంగమయుగంలో ఈ వరదానాల రూపం వేరుగా ఉంటుంది మరియు 21 జన్మలలో ఇవే వరదానాలు మీ జీవితంలో అప్పటి సమయం అనుసారంగా మీతోపాటు ఉంటాయి. కానీ వరదాత మరియు వరదానాలు ప్రాప్తించే సమయం ఇదే. కనుక సర్వ వరదానాలను కార్యంలో ఉపయోగిస్తూ సహజంగా ముందుకు వెళ్తున్నామా అని చెక్ చేసుకోండి.

ఈ వరదానాల విశేషత ఏమిటంటే - వరదానాలు ప్రాప్తి చేసుకున్నవారికి ఎప్పుడూ శ్రమించాల్సిన అవసరం ఉండదు. భక్తాత్మలు కూడా శ్రమించి అలసిపోయినప్పుడు తండ్రి నుండి వరదానాలనే వేడుకుంటారు. మీ వద్దకు కూడా మనుష్యులు వచ్చి, యోగం జోడించే శ్రమను చేయాలనుకోకపోతే ఏ భాష మాట్లాడుతారు? వారు ఏమంటారంటే - మీరు కేవలం మాకు వరదానమివ్వండి, మా తలపై చేయి పెట్టండి, చాలు. బ్రాహ్మణ పిల్లలైన మీ పై వరదాత తండ్రి చేయి సదా ఉంది. వారి శ్రేష్ఠమైన మతమే చేయి. స్థూలమైన చేతినైతే 24 గంటలు ఉంచరు కదా. బాబా ఇచ్చే శ్రేష్ఠ మతమనే వరదాన హస్తం పిల్లలైన మీపై సదా ఉంటుంది. అమృతవేళ నుండి రాత్రి నిదురించే వరకు ప్రతి శ్వాస కోసం, ప్రతి సంకల్పం కోసం, ప్రతి కర్మ కోసం శ్రేష్ఠ మతమనే చేయి ఉండనే ఉంది. ఈ వరదానాన్ని విధి పూర్వకంగా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ శ్రమించాల్సిన అవసరం ఉండదు.

‘ఇచ్ఛా మాత్రం అవిద్య (కోరికలంటే తెలియని స్థితి)’ అని దేవతలకు మహిమ ఉంది. ఇదే ఫరిశ్తా జీవితం యొక్క విశేషత. దేవతల జీవితంలోనైతే కోరిక అనే మాటే లేదు. బ్రాహ్మణ జీవితమే ఫరిశ్తా జీవితంగా అవుతుంది అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఏదైనా శుద్ధ కర్మ లేక వ్యర్థ కర్మ లేక వికర్మ లేక వెనుకటి కర్మ, ఇలా ఏ కర్మ యొక్క బంధనంలోనైనా బంధించబడి కర్మ చేయడాన్ని కర్మాతీత అవస్థ అని అనరు. ఒకటేమో కర్మ సంబంధము, మరొకటి బంధనము. ఎలాగైతే హద్దు కోరికల విషయంలో అవిద్య అనే మహిమ ఉందో, అలా ఫరిశ్తా జీవితం మరియు బ్రాహ్మణ జీవితం అనగా ‘కష్టం’ అనే మాటతో అవిద్యగా, భారం అనే మాటతో అవిద్యగా అనగా అసలదేమిటో కూడా తెలియదు అన్నట్లుగా ఉంటారు. కనుక వరదాని ఆత్మ అనగా కష్టమైన జీవితం గురించి అవిద్యను అనుభవం చేసేవారు. ఇటువంటివారిని వరదాని ఆత్మ అని అంటారు. కనుక బాబా సమానంగా అవ్వడం అనగా సదా వరదాత నుండి ప్రాప్తించిన వరదానాలతో పాలన పొందుతూ సదా నిశ్చింతగా, నిశ్చిత విజయాన్ని అనుభవం చేయడము.

చాలామంది పిల్లలు పురుషార్థమైతే చాలా బాగా చేస్తారు. కానీ పురుషార్థంలో భారాన్ని అనుభవం చేస్తే - అది యథార్థమైన పురుషార్థం కాదు. అటెన్షన్ పెట్టడం బ్రాహ్మణ జీవితం యొక్క విధి. కానీ అటెన్షన్ టెన్షన్ లోకి మారిపోతుంది. న్యాచురల్ (సహజమైన) అటెన్షన్ ఉండకపోతే దానిని యథార్థమైన అటెన్షన్ అని అనరు. ఉదాహరణకు జీవితంలో - ఈ వస్తువు బాగుంది, ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే స్థూలమైన జ్ఞానం ఉంటుంది. అలా జ్ఞానం ఆధారంగా జ్ఞానసంపన్నంగా ఉన్నవారి గుర్తు ఏమిటంటే, వారికి - ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే అటెన్షన్ న్యాచురల్ గానే (సహజంగానే) ఉంటుంది. వారికి ప్రతి అడుగులో - ఇలా చేయనా, వద్దా, ఇది తిననా, వద్దా, ఇలా నడవనా, వద్దా అనే టెన్షన్ ఉండదు. జ్ఞాన శక్తితో న్యాచురల్ (సహజమైన) అటెన్షన్ ఉంటుంది. ఇలాంటి యథార్థమైన పురుషార్థుల ప్రతి అడుగు, ప్రతి కర్మలో న్యాచురల్ (సహజమైన) అటెన్షన్ ఉంటుంది ఎందుకంటే జ్ఞానం యొక్క లైట్-మైట్ స్వతహాగానే యథార్థ రూపంతో, యథార్థ పద్ధతిలో నడిపిస్తుంది. కనుక పురుషార్థం చేయండి, అటెన్షన్ తప్పకుండా పెట్టండి కానీ టెన్షన్ రూపంలో కాదు. టెన్షన్ లోకి వచ్చినట్లయితే - చాలా పని చేయాలని అనుకుంటారు, నంబరువన్ అవ్వాలని అనుకుంటారు కానీ ‘టెన్షన్’ అనేది ఎంత అనుకుంటారో అంత చేయనివ్వదు, ఎలా అవ్వాలని అనుకుంటారో అలా అవ్వనివ్వదు. అంతేకాక ‘టెన్షన్’ మరింత టెన్షన్ ను ఉత్పన్నం చేస్తుంది ఎందుకంటే ఏది కోరుకుంటారో అది జరగదు కనుక ఇంకా టెన్షన్ పెరుగుతుంది.

పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కానీ కొందరు పురుషార్థాన్ని చాలా భారంతో చేస్తారు, కొందరు పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు - ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది, చూద్దాములే, ఎవరు చూస్తారు, ఎవరు వింటారు..... ఇలా నిర్లక్ష్యంగా అవ్వడము మంచిది కాదు, భారంగా చేసుకోవడము మంచిది కాదు. అందుకే, బ్యాలెన్స్ ద్వారా బాబా ఆశీర్వాదాలను, వరదానాలను అనుభవం చేయండి. తండ్రి చేయి సదా నా పై ఉంది అనే అనుభవాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఎలాగైతే భక్తాత్మలు స్థూలమైన చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుని వరదాన హస్తం తలపై ఉన్నట్లుగా అనుభవం చేస్తారో, అలా మీరు కూడా నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో ఈ అనుభవమనే చిత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. అర్థమయిందా? చాలా పురుషార్థం చేసారు. ఇప్పుడిక వరదానాలతో పాలన పొందుతూ, ఎగురుతూ ఉండండి. బాబాను జ్ఞాన దాతగా, విధాతగా అనుభవం చేసారు, ఇప్పుడు వరదాతగా అనుభవం చేయండి. అచ్ఛా.

సదా ప్రతి అడుగులో బాబాను ఫాలో చేసేవారు, సదా స్వయాన్ని వరదాత తండ్రి యొక్క వరదాని శ్రేష్ఠ ఆత్మనని అనుభవం చేసేవారు, సదా ప్రతి అడుగు సహజంగా దాటేవారికి, సదా సర్వ వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించేవారు, ఇలాంటి బాబా సమానంగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు వరదాత రూపంలో బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

ముఖ్యమైన మహారథి అన్నయ్యలతో కలయిక - జన్మ తీసుకుంటూనే ఎన్ని వరదానాలు లభించాయి. ప్రతి ఒక్కరికి వారి వారి వరదానాలు లభించాయి. ఈ జన్మయే వరదానాలతో జరిగింది. లేకుంటే ఈ రోజు ఇంత ముందుకు వెళ్ళలేకపోయేవారు. వరదానాలతో జన్మ జరిగింది, అందుకే ముందుకు వెళ్తున్నారు. పాండవుల మహిమ తక్కువేమీ కాదు. ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణిస్తే ఎన్ని ఉన్నాయి! ఏదైతే భాగవతం తయారై ఉందో, అలాంటిది తయారవుతుంది. బాబా దృష్టిలో ప్రతి ఒక్కరి విశేషతలు ఉన్నాయి. మిగతావి చూస్తూ కూడా చూడరు, తెలిసినా కూడా తెలియనట్లు ఉంటారు. కనుక విశేషతలు సదా ముందుకు తీసుకువెళ్తున్నాయి మరియు ఇంకా తీసుకువెళ్తూ ఉంటాయి. ఎవరైతే జన్మతోనే వరదాని ఆత్మలో, వారు ఎప్పుడూ వెనుకడుగు వేయలేరు. మీరు సదా ఎగిరే వరదాని ఆత్మలు. వరదాత తండ్రి యొక్క వరదానాలు ముందుకు తీసుకువెళ్తున్నాయి. పాండవులు గుప్తంగా ఉంటారు కానీ బాప్ వాదా హృదయంలో సదా ప్రత్యక్షంగా ఉన్నారు. మంచి మంచి ప్లాన్లు అయితే పాండవులే తయారుచేస్తారు. శక్తులు వేటాడుతారు కానీ అద్భుతమైతే ఆ వేటను తీసుకొచ్చేవారిదే. ఒకవేళ తీసుకొచ్చేవారు తీసుకురాకపోతే, ఏమి వేటాడుతారు? కనుక పాండవులకు తమ విశేషమైన వరదానాలు ఉన్నాయి. ‘స్మృతి’ మరియు ‘సేవ’ల బలం విశేషంగా లభించి ఉంది. ‘స్మృతి బలం’ కూడా విశేషంగా లభిస్తుంది, ‘సేవా బలం’ కూడా విశేషంగా లభిస్తుంది, ఎందుకు? దీనికి కూడా కారణముంది. ఎందుకంటే ఎవరెంతగా అవసరమైన సమయంలో కార్యంలోకి వచ్చారో, వారికి విశేషమైన వరదానాలు లభించి ఉన్నాయి. ఉదాహరణకు ఆదిలో స్థాపన జరిగినప్పుడు పాండవులైన మీరు మర్జ్ అయి (గుప్తంగా) ఉన్నారు, ఎమర్జ్ అయి (ప్రత్యక్షంగా) లేరు. శక్తులు ఉదాహరణగా అయ్యారు మరియు వారి ఉదాహరణను చూసి మీరు ఇంకా ముందుకు వెళ్ళారు. కనుక శక్తులు అవసరమైన సమయంలో ఉదాహరణగా అయ్యారు. అలా ఎవరెంతగా అవసరమైన సమయంలో సహయోగులుగా అయ్యారో - వారి జీవితం ద్వారా కావచ్చు, సేవ ద్వారా కావచ్చు..... వారికి డ్రామా అనుసారంగా విశేషమైన బలం లభిస్తుంది. మీ పురుషార్థము తప్పకుండా ఉంది కానీ ఎక్స్ ట్రా బలం లభిస్తుంది. అచ్ఛా.

సేవ చేయడంతో సర్వ ఆత్మలు సంతోషపడతారు కదా, దాని ద్వారా కూడా చాలా బలం లభిస్తుంది. అనుభవీ ఆత్మల సేవ యొక్క అవసరముంది ఎందుకంటే ఎవరైతే సాకారంలో పాలన తీసుకున్నారో, వారిని చూసి సదా బాబా గుర్తుకొస్తారు. ఎప్పుడైనా మీరు (దాదీలు) ఎక్కడికైనా వెళ్తే విశేషంగా ఏమి అడుగుతారు? చరిత్ర వినిపించండి, ఏవైనా బాబా విషయాలు వినిపించండి అని అడుగుతారు. మరి ఇది విశేషత కదా. కనుక సేవ విశేషత యొక్క వరదానం లభించి ఉంది. స్టేజిపై నిలబడి ఉపన్యాసం చేయకపోయినా సరే, ఇది అన్నింటికంటే గొప్ప ఉపన్యాసం. చరిత్రను వినిపించి చరిత్రవంతులుగా అయ్యే ప్రేరణనివ్వడం అన్నింటికంటే పెద్ద సేవ. కనుక సేవ కొరకు వెళ్ళాల్సిందే మరియు సేవకు నిమిత్తంగా అవ్వాల్సిందే. అచ్ఛా.

Comments