23-11-1989 అవ్యక్త మురళి

  23-11-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“వరదాతను రాజీ చేసుకునే సహజ విధి”

ఈ రోజు వరదాత తండ్రి తమ వరదాని పిల్లలను చూసి హర్షిస్తున్నారు. వరదాత పిల్లలందరూ వరదానీలు కానీ నంబరువారుగా ఉన్నారు. వరదాత పిల్లలందరికీ వరదానాల జోలిని నింపి ఇస్తారు, మరి నంబరు ఎందుకుంది? వరదాత ఇవ్వడంలో నంబరువారుగా ఇవ్వరు ఎందుకంటే వరదాత వద్ద తరగనన్ని వరదానాలు ఉన్నాయి. భండారీ తెరిచి ఉంది, ఎవరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలాంటి తెరిచి ఉన్న భండారీ నుండి ఎంతో మంది పిల్లలు సర్వ వరదానాలతో సంపన్నులుగా అవుతారు, మరికొంత మంది పిల్లలు యథా శక్తి తథా సంపన్నులుగా అవుతారు. అన్నిటికంటే ఎక్కువగా జోలిని నింపి ఇవ్వడంలో భోళానాథుడిది ‘వరదాత’ రూపమే. ఇంతకుముందు కూడా వినిపించాము - దాత, భాగ్యవిధాత, వరదాత. ఈ మూడింటిలోనూ వరదాత రూపంలో భోళా భగవానుడిగా పిలవబడతారు ఎందుకంటే వరదాత చాలా త్వరగా రాజీ అవుతారు. కేవలం రాజీ చేసే విధిని తెలుసుకుంటే సిద్ధి అనగా వరదానాల జోలిని సంపన్నంగా ఉంచుకోవడము చాలా సులభము. వరదాతను రాజీ చేసుకునేందుకు అన్నిటికంటే సహజమైన విధి ఏమిటో తెలుసా? వారికి అందరికంటే ప్రియంగా ఎవరు అనిపిస్తారు? వారికి ‘ఏక్’ (ఒకటి) అనే పదం అన్నిటికంటే ప్రియంగా అనిపిస్తుంది. ఏ పిల్లలైతే ఆది నుండి ఇప్పటివరకు ఏకవ్రతగా ఉన్నారో, వారే వరదాతకు అతి ప్రియమైనవారు.

ఏకవ్రత అనగా కేవలం పతివ్రత కాదు, సర్వ సంబంధాలలో ఏకవ్రత. సంకల్పంలో కూడా, స్వప్నంలో కూడా రెండవవారు ఉండకూడదు. ఏక-వ్రత అనగా సదా వృత్తిలో ఒక్కరే ఉండాలి. రెండవది - సదా నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు - ఈ పక్కా వ్రతాన్ని తీసుకున్నవారిగా ఉండాలి. చాలా మంది పిల్లలు ఏకవ్రతులుగా అవ్వడంలో చాలా చతురతను చూపిస్తారు. ఏ చతురతను చూపిస్తారు? బాబాకే మధురమైన మాటలను వినిపిస్తారు, ఏమనంటే - తండ్రి, శిక్షకుడు, సద్గురువు - ఈ మూడు ముఖ్యమైన సంబంధాలైతే మీతోనే ఉన్నాయి కానీ సాకార శరీరధారులుగా ఉన్న కారణంగా, సాకార ప్రపంచంలో నడుస్తున్న కారణంగా, ఎవరైనా సాకారి సఖుడు లేక సఖి సాకారంలో సహయోగం కోసం, సేవ కోసం, సలహాల కోసం తప్పకుండా కావాలి ఎందుకంటే తండ్రి అయితే నిరాకారుడు మరియు ఆకారుడు కనుక వారు సేవా సహచరునిగా ఉన్నారు. వేరే ఇంకేమీ లేదు. నిరాకారి మరియు ఆకారి మిలనము జరుపుకునేందుకు స్వయానికి కూడా ఆకారి, నిరాకారి స్థితిలో స్థితులవ్వాల్సి ఉంటుంది. అది అప్పుడప్పుడు కష్టమనిపిస్తుంది కనుక ఆ సమయానికి సాకార సహచరులు కావాలి అని అంటారు. బుద్ధిలో చాలా విషయాలు నిండిపోయినప్పుడు ఏం చేస్తారు? వినేవారు కావాలి కదా! ఏకవ్రత ఆత్మల వద్ద ఇలా ఇతరులకు వినిపించాల్సి వచ్చే బరువైన విషయాలు పోగు అవ్వవు. ఒకవైపు బాబాను చాలా సంతోషపరుస్తారు - బాబా, కేవలం మీరు మాత్రమే సదా నాతో పాటు ఉంటారు, తండ్రి సదా నాతో పాటు ఉంటారు, వారు సహచరుడు అన్నప్పుడు మరి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతారు? బాబా వెళ్ళిపోతారా లేక మీరు పక్కకు తప్పుకుంటారా? వారు ప్రతి సమయం మీతో పాటు ఉంటారా లేక 6-8 గంటలు కోసం మీతో పాటు ఉంటారా? ప్రతిజ్ఞ ఏమని చేసారు? మీతోనే ఉన్నాము, మీతోనే ఉంటాము, మీతోనే వెళ్తాము - ఈ ప్రతిజ్ఞ పక్కాగా ఉంది కదా? బ్రహ్మాబాబాతో ఏమని ప్రతిజ్ఞ చేసారంటే - మొత్తం చక్రమంతా మీతో పాటు పాత్రను అభినయిస్తాము అని. ఇలాంటి ప్రతిజ్ఞను చేసిన తర్వాత, మళ్ళీ సాకారంలో ఎవరైనా విశేషమైన సహచరులు కావాలా?

బాప్ దాదా వద్ద అందరి జన్మపత్రి ఉంటుంది. బాబా ఎదురుగానేమో, మీరే మా సహచరుడు అని అంటారు. పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాగైతే జరుగుతుంది, ఈ మాత్రమైతే కావాల్సిందే... అని బాబాకే అర్థం చేయించడం మొదలుపెడతారు. ఇలా ఉంటే ఏకవ్రత అని అంటారా? సహచరులుగా ఉన్నారంటే అందరూ సహచరులే, ఎవ్వరూ విశేషమైన సహచరులు కాదు. ఇలాంటి వారినే ఏకవ్రత అని అంటారు. వరదాతకు ఇలాంటి పిల్లలు అతి ప్రియమైనవారు. ప్రతి సమయము ఇటువంటి పిల్లల సర్వ బాధ్యతలను వరదాత తండ్రి స్వయంగా తనపై వేసుకుంటారు. ఇటువంటి వరదానీ ఆత్మలు ప్రతి సమయము, ప్రతి పరిస్థితిలో వరదానాల ప్రాప్తి సంపన్న స్థితిని అనుభవం చేస్తారు మరియు సదా సహజంగా దాటి వేస్తారు మరియు పాస్ విత్ ఆనర్ గా అవుతారు. వరదాత సర్వ బాధ్యతలను తీసుకునేందుకు ఎవర్రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ బాధ్యతల బరువును మీ పైకి ఎందుకు వేసుకుంటారు? మీ బాధ్యత అని భావిస్తే, పరిస్థితిలో పాస్ విత్ ఆనర్ గా అవ్వలేరు కానీ ఎవరైనా తోయడంతో పాస్ అవుతారు. ఎవరిదైనా తోడు అనే తోయడం కావాలి. ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో లేకపోతే, కారును తోస్తూ నడిపిస్తారు కదా. తోయడం అనేది ఒక్కరే తోయరు, తోడు కావాలి కావుననే వరదానీలు నంబరువారుగా అవుతారు. వరదాతకు ఒక పదము ప్రియమనిపిస్తుంది - ‘ఏకవ్రత’. ఒకే బలము, ఒకే నమ్మకము. ఒకరిపై నమ్మకము, రెండవ వారి బలము అని అనరు. ఒకే బలము, ఒకే నమ్మకము అనే గాయనమే ఉంది. దీనితో పాటు ఏకమతము ఉండాలి, మన్మతము గాని, పరమతము గాని ఉండకూడదు. ఏకరసము అనగా ఏ వ్యక్తి లేక వైభవాల రసం ఉండకూడదు. అలాగే ఏకత, ఏకాంతప్రియులు. కనుక ఏక్ (ఒకటి) అనే పదమే ప్రియమైనది కదా. ఇలాంటి పదాలు ఇంకా తీయండి.

తండ్రి ఎంతటి భోళా అంటే, వారు కేవలం ఒక్కటి తోనే రాజీ అవుతారు. ఇలాంటి భోళానాథుడైన వరదాతను రాజీ చేయడం కష్టమనిపిస్తుందా? కేవలం ఏక్ (ఒకటి) అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. 5 లేక 7 లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వరదాతను రాజీ చేసేవారు అమృతవేళ నుండి రాత్రి వరకు దినచర్యలోని ప్రతి కర్మలో వరదానాలతోనే పాలింపబడతారు, నడుస్తారు మరియు ఎగురుతారు. ఇలాంటి వరదాని ఆత్మలకు ఎప్పుడూ ఏ కష్టము మనసు ద్వారా గాని, సంబంధ-సంపర్కాల ద్వారా గాని అనుభవమవ్వదు. ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండు, ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదాత మరియు వరదానము సదా సమీపంగా, సమ్ముఖంగా సాకార రూపంలో అనుభవమవుతుంది. వారు సాకారంలో మాట్లాడుతున్నట్లుగా అనుభవం చేస్తారు. వారికి శ్రమ అనుభవమవ్వదు. ఇలాంటి వరదాని ఆత్మలకు, నిరాకారి మరియు ఆకారిని సాకారంలో ఉన్నట్లుగా అనుభవం చేసే విశేషమైన వరదానం ప్రాప్తిస్తుంది. ఇలాంటి వరదానీల ముందు హజూర్ సదా హాజరై ఉంటారు. విన్నారా? వరదాతను రాజీ చేసే విధి మరియు సిద్ధి - సెకండులో రాజీ చేయగలరా? కేవలం ఒకటిలో రెండు కలపవద్దు, అంతే. ఒకటి అనే పాఠం యొక్క విస్తారాన్ని తర్వాత వినిపిస్తాను.

బాప్ దాదా వద్ద పిల్లలందరి చరిత్ర కూడా ఉంది, చతురత కూడా ఉంది. మొత్తం రిజల్టు అంతా బాప్ దాదా వద్ద ఉంది కదా. చతురత యొక్క విషయాలు కూడా చాలా పోగు అయి ఉన్నాయి. కొత్త-కొత్త విషయాలు వినిపిస్తారు. బాబా వింటూ ఉంటారు కదా. కేవలం బాప్ దాదా పేరు వినిపించరు కనుక బాబాకు తెలియదని అనుకుంటారు. అయినా కూడా అవకాశమిస్తూ ఉంటారు. పిల్లలు అసలైన తెలివి నుండి అమాయకులుగా ఉన్నారని బాబా భావిస్తారు. కావున ఇలాంటి అమాయకులుగా అవ్వకండి. అచ్ఛా.

విదేశాలు కూడా తిరిగి పిల్లలు చేరుకున్నారు (జానకి దాదీ, డాక్టర్ నిర్మల మరియు జగదీష్ భాయి విదేశాలు తిరిగి వచ్చారు) -

రిజల్టు బాగుంది మరియు సదా సేవ యొక్క సఫలతలో వృద్ధి జరగాల్సే ఉంది. యు.ఎన్. కి కూడా విశేషంగా సేవా కార్యంతో సంబంధముంది. పేరు వారిది, పని అయితే మీది జరుగుతుంది. ఆత్మలకు సహజంగా సందేశం చేరుకోవటం - మీ ఈ పని జరుగుతోంది. కనుక అక్కడి ప్రోగ్రామ్ కూడా బాగా జరిగింది. రష్యా కూడా మిగిలి ఉండేది, వారు కూడా రావాల్సే ఉండేది. బాప్ దాదా అయితే ముందే సఫలత యొక్క ప్రియస్మృతులు ఇచ్చారు. భారత్ తరఫున అంబాసిడర్గా అయి వెళ్ళారు కనుక భారత్ పేరు ప్రసిద్ధమయింది కదా! చక్రవర్తులుగా అయి తిరిగి రావడంలో మజా వస్తుంది కదా. ఎన్ని ఆశీర్వాదాలను జమ చేసుకొని వచ్చారు! నిర్మల ఆశ్రమ్ (డా. నిర్మల) కూడా తిరుగుతూనే ఉంటారు. వాస్తవానికి అందరూ సేవలో నిమగ్నమై ఉన్నారు కానీ సమయ ప్రమాణంగా విశేషమైన సేవ జరిగినప్పుడు ఆ విశేషమైన సేవ యొక్క శుభాకాంక్షలు తెలుపుతారు. సేవ లేకుండా అయితే ఉండలేరు. లండన్, అమెరికా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా - మీరు ఈ నాలుగు జోన్లు తయారుచేసారు కదా. ఐదవది భారత్. భారత్ వారికి కలుసుకోవటానికి మొదటి ఛాన్స్ లభించింది. ఏదైతే చేసి వచ్చారో మరియు ఏదైతే మున్ముందు చేస్తారో, అంతా బాగుంది మరియు సదా బాగానే ఉంటుంది. నాలుగు జోన్ల యొక్క డబల్ విదేశీ పిల్లలందరికీ ఈ రోజు విశేషమైన ప్రియస్మృతులు ఇస్తున్నారు. రష్యా కూడా ఆసియాలోకే వస్తుంది. సేవకు రెస్పాన్స్ మంచిగా లభిస్తుంది. ధైర్యం కూడా బాగుంది కనుక సహాయం కూడా లభిస్తుంది మరియు లభిస్తూ ఉంటుంది. భారత్ లో కూడా ఇప్పుడు విశాలమైన ప్రోగ్రామ్ చేయటానికి ప్లాన్ తయారుచేస్తున్నారు. ఒక్కొక్కరికీ విశేషతలకు మరియు సేవ యొక్క తపనలో నిమగ్నమై ఉన్నందుకు శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు. అచ్ఛా.

పిల్లలందరికీ సదా సహజంగా నడుచుకునే, సిద్ధిని ప్రాప్తి చేసుకునే, సహజ యుక్తులు ఏవైతే వినిపించారో, ఇదే విధిని సదా ప్రయోగంలోకి తీసుకొచ్చే ప్రయోగీ మరియు సహజయోగులకు, సదా వరదాత యొక్క వరదానాలతో సంపన్నంగా ఉండే వరదానీ పిల్లలకు, సదా ఒకటి అనే పాఠాన్ని ప్రతి అడుగులో సాకార స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి, సదా నిరాకారి, ఆకారి తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా సదా సాకార స్వరూపంలో హాజరై ఉన్నట్లుగా అనుభవం చేసేవారికి, ఇలాంటి సదా వరదాని పిల్లలకు దాత, భాగ్య విధాత, వరదాత అయిన బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

జానకి దాదీతో - ఎంతగా అందరికీ తండ్రి ప్రేమను పంచుతారో, అంతగా ఇంకా ప్రేమ యొక్క భాండాగారం పెరుగుతూ ఉంటుంది. ప్రతి సమయం ప్రేమ వర్షం కురుస్తూ ఉంది అనే అనుభవమవుతుంది కదా! ఒక్క అడుగులో ప్రేమనివ్వండి మరియు పదే-పదే ప్రేమను పొందండి. అందరికీ కావాల్సింది ప్రేమనే. జ్ఞానమైతే వినేసారు కదా. కొంతమంది పిల్లలకు ప్రేమ కావాలి, కొంతమందికి శక్తి కావాలి. మరి ఏ సేవ చేసారు? ఇదే సేవ చేసారు కదా - కొందరికి బాబా ద్వారా ప్రేమనిచ్చారు, మరికొందరికి బాబా ద్వారా శక్తినిప్పించారు. జ్ఞానం యొక్క రహస్యాలనైతే తెలుసుకున్నారు. ఇప్పుడిక వారిలో ఉల్లాస-ఉత్సాహాలు సదా స్థిరంగా ఉండడం కావాలి, అవి హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. అయినా బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను శభాష్ ఇస్తున్నారు - వేర్వేరు ధర్మాలలోకి వెళ్ళిపోయారు కదా! వేర్వేరు దేశాలు, వేర్వేరు పద్ధతులు - అయినా కూడా నడుస్తున్నారు మరియు చాలా మంది వారసులు కూడా వెలువడ్డారు. అచ్ఛా.

మహారాష్ట్ర - పూణె గ్రూపు - అందరూ మహాన్ ఆత్మలుగా అయ్యారు కదా! ముందైతే కేవలం మహారాష్ట్ర నివాసులుగా పిలవబడేవారు, ఇప్పుడు స్వయం మహాన్ గా అయిపోయారు. తండ్రి వచ్చి పిల్లలు ప్రతి ఒక్కరినీ మహాన్ గా తయారుచేసారు. విశ్వంలో మీకంటే మహాన్ గా ఇంకెవరైనా ఉన్నారా? అందరికంటే కిందకు భారతవాసులే పడిపోయారు మరియు అందులోనూ ఏ బ్రాహ్మణాత్మలైతే 84 జన్మలు తీసుకున్నారో వారు కిందకు పడిపోయారు. కావున ఎంత కిందకు పడిపోయారో, ఇప్పుడు అంత ఉన్నతంగా పైకి లేచారు, అందుకే అంటారు - బ్రాహ్మణులు అనగా ఉన్నతమైన శిఖరం. ఏదైతే ఉన్నతమైన స్థానం ఉంటుందో, దానిని శిఖరం అని అంటారు. పర్వతాల ఎత్తును కూడా శిఖరమని అంటారు కనుక ఎలా ఉండేవారము, ఎలా అయ్యాము అనే సంతోషముంది. పాండవులకు ఎక్కువ సంతోషముందా లేక శక్తులకు ఉందా? (శక్తులకు). ఎందుకంటే శక్తులను చాలా కింద పడేసారు. ద్వాపరం నుండి పురుష తనువులో ఉన్నవారే ఏదో ఒక పదవిని పొందారు. ధర్మాలలో కూడా ఇప్పుడిప్పుడే స్త్రీలు కూడా మహామండలేశ్వరీలుగా అయ్యారు. లేదంటే మహామండలేశ్వరులే గాయనం చేయబడేవారు. ఎప్పటి నుండైతే బాబా మాతలను ముందుంచారో, అప్పటి నుండి వారు కూడా 2-4 మహామండలేశ్వరీలను పెట్టారు. లేదంటే ధర్మానికి చెందిన కార్యాలలో మాతలకు ఎప్పుడూ ఆసనం ఇచ్చేవారు కాదు. అందుకే మాతలకు ఎక్కువ సంతోషముంది మరియు పాండవులకు కూడా గాయనం ఉంది. పాండవులు విజయాన్ని ప్రాప్తించుకున్నారు. పేరు పాండవులది వస్తుంది కానీ పూజ ఎక్కువగా శక్తులకు జరుగుతుంది. ముందు గురువులకు చేసారు, ఇప్పుడు శక్తులకు చేస్తున్నారు. జాగరణ గణేశునికి లేక హనుమంతునికి చేయరు, శక్తులకు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు శక్తులు స్వయంగా మేల్కొన్నారు. కనుక శక్తులు తమ శక్తి రూపంలో ఉంటారు కదా! లేక అప్పుడప్పుడు బలహీనమవుతారా? మాతలను దేహ సంబంధాల యొక్క మోహము బలహీనంగా చేస్తుంది. పిల్లల పట్ల, మనవలు, మునిమనవల పట్ల కొద్ది కొద్దిగా మోహముంటుంది. మరియు పాండవులను ఏ విషయం బలహీనంగా చేస్తుంది? పాండవులకు అహంకారం కారణంగా కోపం త్వరగా వస్తుంది. కానీ ఇప్పుడైతే విజయం పొందారు కదా! ఇప్పుడైతే శాంత స్వరూపులైన పాండవులుగా అయ్యారు మరియు మాతలు నిర్మోహులుగా అయ్యారు. ప్రపంచంలోనివారు మాతలలో మోహం ఉంటుందని అంటారు కానీ మాతలైన మేము నిర్మోహులము అని మీరు ఛాలెంజ్ చేయండి. అలాగే పాండవులు కూడా శాంతస్వరూపులు, ఎవరైనా వస్తే - వీరంతా ఇంత శాంతస్వరూపులుగా అయిపోయారు, క్రోధం అంశమాత్రం కూడా కనిపించడం లేదు అని మీ అద్భుతం గురించి పాటను పాడాలి. ముఖంలో, నయనాలలో కూడా కనిపించకూడదు. కొందరు క్రోధం లేదు కానీ కొద్దిగా ఆవేశం వస్తుంది అని అంటారు. మరి అది ఏమిటి! అది కూడా క్రోధం యొక్క అంశమే కదా. పాండవులు విజయులు అనగా సంకల్పంలో కూడా పూర్తి శాంతి, మాటలు మరియు కర్మలలో కూడా శాంతిస్వరూపులు. మాతలు మొత్తం విశ్వం ముందు తమ నిర్మోహీ రూపాన్ని చూపించండి. అందరూ ఇది అసంభవమని భావిస్తారు కానీ మీరు ఇది సంభవమే మరియు చాలా సహజం కూడా అని అంటారు. లక్ష్యం పెట్టుకుంటే లక్షణాలు తప్పకుండా వస్తాయి. ఎలాంటి స్మృతి ఉంటుందో, అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఈ భూమిలో మాత-పితల ప్రేమ అనే నీరు పడింది కనుక ఫలం సహజంగా వెలువడుతుంది. బాగుంది. బాప్ దాదా సేవ మరియు స్వ-ఉన్నతి, రెండింటినీ చూసి సంతోషిస్తారు, కేవలం సేవను మాత్రమే చూసి కాదు. ఎంతగానైతే సేవలో వృద్ధి ఉంటుందో, అంతగా స్వ-ఉన్నతిలో కూడా ఉండాలి, రెండూ కలిపి జరగాలి. ఏ కోరిక లేదు, అన్నీ వాటంతటవే లభిస్తున్నప్పుడు ఏం కోరిక పెట్టుకోవాలి! చెప్పకుండానే, అడగకుండానే ఇంతగా లభించినప్పుడు, అడగాలి అనే కోరిక యొక్క అవసరం లేదు. మరి అలా సంతుష్టంగా ఉన్నారు కదా! మేము సంతుష్టంగా ఉన్నాము మరియు సర్వులను సంతుష్టంగా చేస్తూ ప్రాప్తి స్వరూపులుగా చేసేవారము అనే టైటిల్ ను మీ స్మృతిలో ఉంచుకోండి. కనుక సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టంగా చేయండి - ఇది విశేషమైన వరదానము. అసంతుష్టత యొక్క నామరూపాలు ఉండకూడదు. అచ్ఛా!

గుజరాత్ గ్రూపు - బ్రాహ్మణ జీవితంలో చివరి జన్మ అయిన కారణంగా శరీరం ద్వారా ఎంత బలహీనంగా ఉన్నా లేక వ్యాధిగ్రస్తులుగా ఉన్నా, నడవగలిగినా లేక నడవలేకపోయినా, మనసు ద్వారా ఎగిరేందుకు రెక్కలు ఇచ్చారు. శరీరం ద్వారా నడవలేకపోయినా మనసు ద్వారా అయితే ఎగరగలరు కదా! ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు - 63 జన్మలు భ్రమిస్తూ-భ్రమిస్తూ బలహీనంగా అయిపోయారు. శరీరాలు తమోగుణీగా అయ్యాయి కదా కనుక బలహీనంగా, వ్యాధిగ్రస్తంగా అయిపోయాయి. కానీ మనసైతే అందరిదీ ఆరోగ్యంగా ఉంది. శరీరం పరంగా ఆరోగ్యంగా లేకపోయినా కానీ మనసు పరంగా ఎవరూ అనారోగ్యంగా లేరు కదా! అందరి మనసు రెక్కలతో ఎగిరేదిగా ఉంది. శక్తిశాలి మనసుకు గుర్తు - సెకండులో ఎక్కడికి కావాలనుకుంటే, అక్కడికి చేరుకుంటుంది. ఇలా శక్తిశాలిగా ఉన్నారా లేక అప్పుడప్పుడు బలహీనంగా అవుతారా. మనసుకు ఎగరడం వచ్చినప్పుడు, అభ్యాసమున్నప్పుడు సెకండులో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకార వతనానికి, ఇప్పుడిప్పుడే పరంధామానికి - ఒక్క సెకండు యొక్క వేగము. మరి ఇలాంటి తీవ్ర వేగం ఉందా? సదా మీ భాగ్యం యొక్క పాటలను పాడుతూ ఎగురుతూ ఉండండి. సదా అమృతవేళలో మీ భాగ్యానికి చెందిన ఏదో ఒక విషయాన్ని స్మృతిలో ఉంచుకోండి. అనేక రకాల భాగ్యం లభించింది, అనేక రకాల ప్రాప్తులు లభించాయి. ఒకసారి ఒక ప్రాప్తిని ఎదురుగా ఉంచుకోండి, మరోసారి మరో ప్రాప్తిని ఎదురుగా ఉంచుకోండి, అప్పుడు చాలా రమణీకమైన పురుషార్థము ఉంటుంది. పురుషార్థంలో ఎప్పుడూ బోర్ అనిపించదు, నవీనతను అనుభవం చేస్తారు. లేదంటే చాలామంది పిల్లలు - నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని అంటారు, అంతే, ఇదైతే సదా చెప్తూనే ఉంటారు. కానీ ఆత్మనైన నాకు బాబా ఏయే భాగ్యాన్నిచ్చారు, ఏయే టైటిల్స్ ఇచ్చారు, ఏయే ఖజానాలు ఇచ్చారు. ఇలా రకరకాల స్మృతులను ఉంచుకోండి. లిస్టు తీయండి, స్మృతుల లిస్టు ఎంత పెద్దదిగా ఉంది! ఒకసారి ఖజానాల స్మృతులను ఉంచుకోండి, ఒకసారి శక్తుల స్మృతులను ఉంచుకోండి, ఒకసారి గుణాల స్మృతి ఉంచుకోండి, ఒకసారి జ్ఞానాన్ని స్మృతి చేయండి, ఒకసారి టైటిల్స్ ను స్మృతిలో ఉంచుకోండి. వెరైటీలో సదా మనోరంజనం ఉంటుంది. ఎప్పుడైనా మనోరంజనం ప్రోగ్రామ్ ఉంటే, అందులో వెరైటీ నృత్యాలు ఉంటాయి, వెరైటీ భోజనం ఉంటుంది, వెరైటీ వ్యక్తులను కలుసుకోవడం ఉంటుంది. అప్పుడే కదా మనోరంజనం అవుతుంది! కనుక ఇక్కడ కూడా సదా మనోరంజనంలో ఉండేందుకు వెరైటీ విషయాలను ఆలోచించండి. అచ్ఛా.

Comments