20-03-1987 అవ్యక్త మురళి

20-03-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 స్నేహం మరియు సత్యతా అధికారం యొక్క (బేలన్స్) సమానత. 

జ్ఞానం యొక్క అధికారిగా, సత్యం యొక్క అధికారిగా చేసేటువంటి విశ్వరచయిత శివబాబా మాట్లాడుతున్నారు...

ఈ రోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు తన యొక్క సత్యత యొక్క శక్తిశాలి సత్యమైన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. అన్నిటికంటే పెద్దశక్తి లేదా అధికారం - సత్యతా శక్తియే. సత్యానికి రెండు అర్థాలు ఉన్నాయి. 1. సత్యం అంటే నిజం 2. సత్యం అంటే అవినాశి. రెండు అర్ధాల ద్వారా సత్యతా శక్తి చాలా అన్నింటికంటే ఉన్నతమైనది. బాబాని సత్యమైన తండ్రి అంటారు. తండ్రులు చాలామంది ఉంటారు కానీ సత్యమైన తండ్రి ఒక్కరే. సత్యశిక్షకుడు, సద్గురువు ఒక్కరే. సత్యాన్నే పరమాత్మ అంటారు అంటే పరమాత్మ యొక్క విశేషత సత్యత. మీ యొక్క పాట కూడా ఉంది - సత్యమే శివం... ప్రపంచంలో వారు కూడా సత్యం, శివం, సుందరం అని అంటారు. వెనువెంట పరమాత్మనే సత్ చిత్ ఆనందస్వరూపుడు అంటారు. “సత్యం అనే మాటకి చాలా మహిమ ఉంది, మరియు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కార్యంలో అధికారంతో మాట్లాడితే నేను సత్యమైన వాడిని అందువలనే అధికారంతో మాట్లాడాను అని అంటారు. సత్యానికే మహిమ ఉంది. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు. మీరు కూడా అంటారు, సత్యత ఉన్నవారు నాట్యం చేస్తారు అని. సత్యత శక్తి ఉన్నవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు, ఎప్పుడూ వాడిపోరు, అలజడి అవ్వరు, భయపడరు, బలహీనం అవ్వరు. సత్యతాశక్తి ఉన్నవారు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. శక్తిశాలిగా ఉంటారు మరియు ఎదుర్కొనే శక్తి ఉంటుంది అందువలన భయపడరు. సత్యం బంగారంతో సమానం మరియు అసత్యం మట్టితో సమానం. భక్తిలో కూడా ఎవరైతే పరమాత్మతో సంలగ్నత జోడిస్తారో వారిని సత్సంగి అంటారు అంటే సత్యమైన సాంగత్యం చేసేవారు, మరియు అంతిమంలో ఆత్మ శరీరం వదిలేటప్పుడు కూడా సత్యమైన భగవంతుని నామాన్ని జపించమని చెప్తారు. సత్యం అంటే అవినాశి మరియు సత్యం అంటే నిజం. సత్యతా శక్తి గొప్ప శక్తి. వర్తమాన సమయంలో చాలా మంది ఆత్మలు మిమ్మల్ని చూసి వీరిలో సత్యత ఉంది. కనుకనే ఇంత సమయం వృద్ధి చేస్తూ నడుస్తున్నారు అంటారు. సత్యం ఎప్పుడూ చలించదు, అచంచలంగా ఉంటుంది. వృద్ధిని పొందే విధి - సత్యత. సత్యతాశక్తి ద్వారా సత్యయుగాన్ని తయారుచేస్తున్నారు. స్వయం కూడా సత్యమైన లక్ష్మీ, నారాయణులుగా అవుతున్నారు. ఈ సత్యజ్ఞానం సత్య తండ్రి యొక్క జ్ఞానం. అందువలనే ఇది ప్రపంచానికి అతీతమైనది మరియు ప్రియమైనది. 

ఈరోజు బాప్ దాదా పిల్లలందరినీ చూస్తున్నారు - సత్య జ్ఞానం యొక్క సత్యతా అధికారాన్ని ఎంత ధారణ చేసారు? అని. సత్యత అనేది ప్రతి ఆత్మని ఆకర్షితం చేస్తుంది. ఈ ప్రపంచం అసత్యఖండం, దీనిలో అన్నీ అసత్యమే, అన్నింటిలో అసత్యం కలిసి ఉంది. అయినప్పటికీ సత్యతా శక్తి ఉన్నవారు విజయీగా అవుతారు. సత్యతకి ప్రాప్తి - సంతోషం మరియు నిర్భయత. సత్యం మాట్లాడేవారు సదా నిర్భయంగా ఉంటారు, వారికి ఎప్పుడూ భయం ఉండదు. ఎవరైతే సత్యంగా ఉండరో వారికి భయం తప్పకుండా ఉంటుంది. కనుక మీరందరూ సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్టాత్మలు. సత్యమైన జ్ఞానం, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు అన్నీ లభించాయి. ఈ అధికారం యొక్క నషా ఉంటుందా? అధికారం అంటే అభిమానం కాదు. ఎవరికి ఎంత అధికారం ఉంటుందో అంతగా వారి వృత్తిలో ఆత్మిక అధికారం ఉంటుంది. మాటలో స్నేహం మరియు నమ్రత ఉంటుంది - ఇదే అధికారానికి గుర్తు. మీరు వృక్షం యొక్క ఉదాహరణ చెప్తారు కదా! ఎప్పుడైతే వృక్షానికి సంపూర్ణఫలం యొక్క అధికారం వస్తుందో అప్పుడు వృక్షం ఒంగుతుంది అంటే నిర్మాణంగా అయ్యి సేవ చేస్తుంది. అలాగే ఆత్మిక అధికారి పిల్లలు ఎంత ఉన్నతమైన అధికారమో అంత నిర్మాణంగా మరియు సర్వులకి స్నేహిగా ఉంటారు. అల్పకాలిక దేహాభిమానం యొక్క అధికారం ఉన్నవారికి అహంకారం ఉంటుంది. కానీ సత్యతా శక్తి యొక్క అధికారం ఉన్నవారు నిరహంకారిగా ఉంటారు. అధికారిగా కూడా ఉంటారు, నషా కూడా ఉంటుంది మరియు నిరంహకారి కూడా ఉంటారు. దీనినే సత్యజ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపం అంటారు. 

ఏవిధంగా అయితే ఈ అసత్య ఖండంలో బ్రహ్మాబాబా యొక్క సత్యత అధికారాన్ని ప్రత్యక్ష రూపంలో చూసారు కదా! బ్రహ్మాబాబా యొక్క అధికారం యొక్క మాటల్లో ఎప్పుడు కూడా అహంకారంగా మాట్లాడలేదు. మురళి చెప్పేటప్పుడు కూడా ఎంత అధికారంతో మాట్లాడేవారు! కానీ అభిమానంతో మాట్లాడేవారు కాదు. అధికారం యొక్క మాటలలో స్నేహం నిండి ఉండేది, నిర్మాణత, నిరహంకారి ఉండేవి. అందువలన అధికారం యొక్క మాటలు కూడా ప్రియంగా అనిపించేవి. కేవలం ప్రియంగానే కాదు, ప్రభావశాలిగా ఉండేవి. తండ్రిని అనుసరిస్తున్నారు కదా! సేవలో మరియు కర్మలో బ్రహ్మాబాబాని అనుసరించాలి. ఎందుకంటే సాకార ప్రపంచంలో సాకార ఉదాహరణ బ్రహ్మాబాబా. ఏవిధంగా అయితే బ్రహ్మాబాబాను కర్మలో, సేవలో, ముఖం ద్వారా, ప్రతి నడవడిక ద్వారా నడుస్తూ, తిరుగుతూ అధికారి స్వరూపంలో చూసారో అదేవిధంగా బ్రహ్మాబాబాని అనుసరించే వారిలో కూడా స్నేహము మరియు అధికారం, నిర్మాణత మరియు మహానత - రెండూ వెనువెంట కనిపించాలి. స్నేహం కనిపించి అధికారం మాయమైపోకూడదు, అధికారం కనిపించి స్నేహం మాయమైపోకూడదు. బ్రహ్మాబాబాను చూసారు కదా, ఆయన ఇప్పుడు కూడా మురళి వింటున్నారు, ఇది ప్రత్యక్ష రుజువు కదా! బ్రహ్మాబాబా మురళి చెప్పేటప్పుడు పిల్లలూ, పిల్లలూ అని కూడా అనేవారు కానీ అధికారం కూడా చూపించేవారు. స్నేహంలో పిల్లలు అని కూడా అనేవారు మరియు అధికారంతో శిక్షణ కూడా ఇచ్చేవారు. సత్యజ్ఞానాన్ని ప్రత్యక్షం కూడా చేసేవారు మరియు పిల్లలూ, పిల్లలూ అంటూ మొత్తం క్రొత్త జ్ఞానాన్ని స్పష్టం చేసేవారు. దీనినే సత్యత యొక్క అధికారం మరియు స్నేహం యొక్క సమానత అని అంటారు. కనుక వర్తమాన సమయంలో సేవలో ఈ సమానతను అండర్‌లైన్ చేసుకోండి. 

భూమిని తయారు చేసేటందుకు స్థాపన నుండి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు విదేశంలో కూడా ఎక్కువ భూమి తయారయ్యింది. భలే మీకు 50 సంవత్సరాలు అవ్వలేదు కానీ సాధనాలన్నీ తయారైయిన సమయంలో వచ్చారు. కనుక ఆది యొక్క 50 సంవత్సరాలు ఇప్పుడు 5 సంవత్సరాలతో సమానం. డబల్ విదేశీయులు అందరూ అంటున్నారు - మేము (లాస్ట్ సో ఫాస్ట్) అంతిమంలో వచ్చి ముందుకి వెళ్తాము అని. నిర్భయత యొక్క అధికారాన్ని తప్పకుండా ఉంచుకోండి. ఒకే బాబా యొక్క క్రొత్త జ్ఞానం, సత్యజ్ఞానం మరియు క్రొత్తజ్ఞానం ద్వారా కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అనే ఈ అధికారం మరియు నషా స్వరూపంలో ప్రత్యక్షంగా ఉండాలి. 50 సంవత్సరాలు గుప్తంగా ఉంచారు. అలా అని ఇప్పుడు ఎవరైనా వస్తే వారికి మొదటే క్రొత్తజ్ఞానం యొక్క క్రొత్త విషయాలు చెప్పి అయోమయం చేయమని కాదు. దీని అర్థం ఇది కాదు. ఈ భావం కూడా కాదు. స్థానం, నాడి, సమయం చూసి జ్ఞానం చెప్పాలి, ఇది (నాల్డెడ్జ్ పుల్) జ్ఞానస్వరూప ఆత్మకి గుర్తు. ఆత్మ యొక్క కోరిక చూడండి, నాడి చూడండి, స్థానం తయారు చేయండి కానీ లోపల సత్యత యొక్క నిర్భయతాశక్తిని తప్పకుండా ఉంచుకోండి. ప్రజలేమంటారు అనే భయం ఉండకూడదు. నిర్భయంగా అయ్యి భూమిని తయారుచేయండి. ఇది క్రొత్తజ్ఞానం, కొంతమంది అర్ధమే చేసుకోలేరు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు కానీ తెలివితక్కువ వారికే చెప్పాలి. ఎలాంటి వ్యక్తియో అటువంటి రూపురేఖ తయారుచేయాల్సి ఉంటుంది. ఇదైతే తప్పనిసరి కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోకి రాకండి. మీ సత్యజ్ఞానం యొక్క అధికారంతో వ్యక్తిని పరివర్తన చేయాల్సిందే - ఈ లక్ష్యాన్ని మర్చిపోకండి.

ఇప్పటివరకు ఏదైతే చేసారో అది మంచిగా చేసారు. తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే భూమిని తయారుచేయాలి. కానీ భూమిని ఎప్పటి వరకు తయారుచేస్తారు? మరియు ఎంత సమయం కావాలి? మందు ఇచ్చేటప్పుడు కూడా మొదట ఎక్కువ మోతాదు ఉన్న మందు ఇవ్వరు, మొదట తక్కువ మోతాదు మందు ఇస్తారు. అలా అని బలమైన మందు ఇవ్వకుండా, తేలికైన మందు ద్వారానే నడిపించేయటం కూడా చేయకండి. బలహీనంగా ఉన్నవారికి ఎక్కువ మోతాదు ఉన్న మందు ఇవ్వటం కూడా తప్పు. పరిశీలించే శక్తి ఉండాలి. కానీ మీ యొక్క సత్యమైన జ్ఞానం యొక్క అధికారం తప్పకుండా ఉండాలి. మీ సూక్ష్మ అధికారం యొక్క వృత్తియే వారి వృత్తులను పరివర్తన చేస్తుంది. అదే భూమిగా తయారవుతుంది మరియు విశేషంగా సేవ చేసి మధువనం వరకు తీసుకువెళ్ళినప్పుడు వారు తక్కువలో తక్కువ ఇది తప్పని సరిగా తెలుసుకోవాలి. అప్పుడు మధువనం యొక్క భూమిలో వారికి కూడా భూమి తయారవుతుంది. ఎంత పర్వత భూమి అయినా అంటే ఏ ధర్మం వారైనా, ఎటువంటి పదవిలో ఉన్నవారైనా కానీ ఈ భూమికి రాగానే వారు కూడా మెత్తబడిపోతారు మరియు మెత్తని భూమిలో ఏ బీజం వేసినా దానికి ఫలం సహజంగానే వస్తుంది. మీరు భయపడకండి, నిర్భయంగా ఉండండి. యుక్తితో చెప్పండి. నేను ఆ భూమికి వెళ్ళాను కానీ పరమాత్మ జ్ఞానం అంటే ఏమిటి? అనేది నాకు తెలియలేదు అని మిమ్మల్ని నిందించకూడదు. పరమాత్మ భూమిలోకి వచ్చి పరమాత్మ ప్రత్యక్షత యొక్క సందేశం తప్పని సరిగా తీసుకువెళ్ళాలి. ఇలా అధికారం యొక్క లక్ష్యం ఉండాలి. 

ఈరోజుల్లో ప్రాపంచిక లెక్కలలో కూడా నవీనతకే గొప్పతనం ఉంది. ఏదైనా క్రొత్త ఫ్యాషన్ వస్తే దానిని అనుకరిస్తారు. మొదట్లో చిత్రకళ ఎంత గొప్పగా ఉండేది! వాటి ముందు ఈనాటి చిత్రకళ గీతల్లా అనిపిస్తుంది. కానీ ఆధునిక కళనే ఇష్టపడుతున్నారు. మానవునికి ప్రతి విషయంలో నవీనత ఇష్టమనిపిస్తుంది మరియు నవీనత స్వతహాగానే ఆకర్షిస్తుంది. అందువలన నవీనత, సత్యత మరియు మహానత - వీటి సంతోషం తప్పకుండా ఉంచుకోండి. మరలా సమయం మరియు వ్యక్తిని చూసి సేవ చేయండి. దానితో పాటు క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్త జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలనే లక్ష్యం తప్పకుండా ఉంచుకోండి. ఇప్పుడు స్నేహం మరియు శాంతి ప్రత్యక్షం అయ్యాయి. బాబా యొక్క ప్రేమ సాగరస్వరూపాన్ని మరియు శాంతి సాగరస్వరూపాన్ని ప్రత్యక్షం చేసారు కానీ జ్ఞానస్వరూప ఆత్మ మరియు జ్ఞానసాగరుడైన బాబా యొక్క ఈ క్రొత్త జ్ఞానాన్ని ఏ పద్ధతి ద్వారా ఇవ్వాలి అనే ఈ ప్లాన్స్ ఇప్పుడు తక్కువగా తయారుచేసారు. అందరి నోటి నుండి ఇది క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్తజ్ఞానం అనే మాట వచ్చే సమయం కూడా రానున్నది. ఇప్పుడు కేవలం మంచిది అంటున్నారు కానీ క్రొత్తది అని అనటం లేదు. స్మృతి విషయాన్ని బాగా ప్రత్యక్షం చేసారు. అందువలన భూమి మంచిగా తయారయ్యింది. భూమిని తయారుచేయటమనేది మొదటి కార్యం ఇది తప్పని సరిగా చేయాలి. ఏది చేసారో అది చాలా బాగా చేసారు మరియు చాలా చేసారు. తనువు, మనస్సు, ధనం ఉపయోగించి చేసారు. దీనికి బహుమతి కూడా ఇస్తున్నారు. 

మొదట్లో విదేశాల్లో త్రిమూర్తి చిత్రం గురించి చెప్పటం చాలా కష్టంగా ఉండేది! ఇప్పుడైతే ఆ త్రిమూర్తి చిత్రానికే అందరూ ఆకర్షితం అవుతున్నారు. మెట్లవరస చిత్రాన్ని అయితే భారతదేశం యొక్క కధ అని అనుకుంటున్నారు కానీ ఈ చిత్రానికి ఆకర్షితం అవుతున్నారు. ఈ క్రొత్త విషయాన్ని ఏ విధితో చెప్పాలి అని ప్లాన్ తయారుచేసారు కదా! అలాగే ఇప్పుడు కూడా ఆవిష్కరణ చేయండి. బాప్ దాదా యొక్క లక్ష్యమేమిటంటే నవీనత యొక్క మహానతా శక్తిని ధారణ చేయండి. దీనిని మర్చిపోకండి. ప్రపంచం వారికి వివరించాలే కానీ ప్రపంచ విషయాలకి భయపడకూడదు. మీ పద్ధతిని మీరు కనుగొనండి ఎందుకంటే మీరే ఆవిష్కరణకర్త. సేవా ప్లాన్స్ పిల్లలే తయారుచేస్తారు. ఎటువంటి లక్ష్యం పెట్టుకుంటారో అంత మంచి మంచి ప్లాన్స్ తయారైపోతాయి, ఇక సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారం. అందువలన నవీనతను ప్రత్యక్షం చేయండి. జ్ఞానం యొక్క గుహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టం చేసే విధి మీ దగ్గర చాలా మంచిగా మరియు స్పష్టంగా ఉంది. శాస్త్రం అనుసారంగా ఒకొక్క పాయింట్ ని స్పష్టం చేయగలరు. ఇవి మీ అధికారం యొక్క విషయాలు, కల్పిత విషయాలు కాదు. యదార్ధమైనవి, అనుభవంతో కూడినవి. అనుభవం యొక్క అధికారం, జ్ఞానం యొక్క అధికారం, సత్యత యొక్క అధికారం.... ఇలా మీకు ఎన్ని అధికారాలు ఉన్నాయి!అధికారం మరియు సత్యత రెండు వెనువెంట కార్యంలో ఉపయోగించండి. 

బాప్ దాదా సంతోషిస్తున్నారు - శ్రమతో సేవ చేస్తూ ఇంత వృద్ధిని పొందారు మరియు చేస్తూనే ఉంటారు. దేశంలోనైనా, విదేశంలోనైనా వ్యక్తిని మరియు నాడిని చూసి సేవ చేయటంలోనే సఫలత ఉంటుంది. విదేశాలలో కూడా ఈ విధి ద్వారా సఫలత వస్తుంది. మొదట సంపర్కంలోకి తీసుకువస్తున్నారు, అంటే దీని ద్వారా భూమి తయారవుతుంది. సంపర్కంలోకి తీసుకువచ్చిన తర్వాత సంబంధంలోకి తీసుకురండి. కేవలం సంపర్కం వరకు తీసుకువచ్చి వదిలేయకండి. సంబంధంలోకి తీసుకువచ్చి బుద్ధి ద్వారా సమర్పితం అయ్యేలా తయారుచేయండి - ఇది అంతిమ స్థితి. సంపర్కంలోకి తీసుకురావటం కూడా అవసరమే మరలా సంబంధంలోకి తీసుకురావాలి. సంబంధంలోకి వస్తూ ఏదైతే బాబా చెప్పారో అది సత్యం అని బుద్ధితో సమర్పణ అయిపోవాలి. మరలా ప్రశ్నలు రావు. బాబా చెప్పినదే సరైనది అని ఎప్పుడైతే అనుభవం అవుతుందో ప్రశ్నలు సమాప్తి అయిపోతాయి. దీనినే బుద్ధితో సమర్పణ అవ్వటం అంటారు. దీనిలో అన్ని స్పష్టంగా అనుభవం అవుతాయి. బుద్ధితో సమర్పణ అయ్యేంత వరకు తీసుకురావాలి అనే లక్ష్యం పెట్టుకోండి. అప్పుడే మైక్ తయారయ్యింది అని అంటారు. మైక్ ఏమి ధ్వని చేస్తుంది? కేవలం వీరిది మంచి జ్ఞానం అనే కాదు ఇది క్రొత్త జ్ఞానం, ఇదే క్రొత్తప్రపంచాన్ని తీసుకువస్తుంది అనే ధ్వనిని వ్యాపింపచేస్తుంది. అప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు కదా! లేకపోతే కేవలం కళ్ళు తెరిచి చాలా మంచిది, చాలా మంచిది అని అంటున్నారు, మరలా నిద్ర వచ్చేస్తుంది. అందువలన స్వయం బాలకుల నుండి యజమాని ఎలాగైతే అయ్యారో ఆవిధంగా వారిని తయారుచేయండి. దీనులను కేవలం సాధారణ ప్రజలుగా తయారుచేయకండి కానీ రాజ్యాధికారిగా చేయండి. దాని కోసం ప్లాన్ తయారుచేయండి. ఏ విధి ద్వారా తయారు చేయాలి అంటే దాని ద్వారా వారు అయోమయం అవ్వకూడదు, బుద్ధితో సమర్పణ అవ్వాలి. దీని కొరకు ప్లాన్ తయారుచేయండి. నవీనతగా అనిపించాలి, అలజడి అనుభవం చేసుకోకూడదు. స్నేహం మరియు నవీనత యొక్క అధికారం కనిపించాలి.

ఇప్పటివరకు ఏదైతే ఫలితం ఉందో, సేవ యొక్క విధి, మరియు బ్రహ్మణుల యొక్క వృద్ధి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే మొదట బీజాన్ని గుప్తంగా ఉంచారు. ఇది కూడా అవసరమే. బీజాన్ని గుప్తంగానే ఉంచాలి, బయట ఉంచటం ద్వారా ఫలం ఇవ్వదు. భూమి లోపల బీజాన్ని నాటుతారు కానీ అది భూమిలోనే ఉండిపోదు. బయటికి ప్రత్యక్షం అవ్వటం, ఫలస్వరూపంగా అవ్వటం - ఇది ఇక ముందు  యొక్క స్థితి. అర్ధమైందా? క్రొత్తది చేయాలి అనే లక్ష్యం పెట్టుకోండి. అంటే ఈ సంవత్సరమే అయిపోతుంది అని కాదు. కానీ లక్ష్యం అనేది బీజాన్ని కూడా బాహ్యంగా ప్రత్యక్షం చేస్తుంది. అలా అని డైరెక్ట్ గా ఉపన్యాసం చెప్పటం ప్రారంభించమని కాదు. మొదట సత్యతాశక్తి యొక్క అనుభూతిని చేయించే ఉపన్యాసం చెప్పవలసి ఉంటుంది. ఆఖరుకి ఆ రోజు వచ్చింది అనే మాట అందరి నోటి నుండి రావాలి. ఏవిధంగా అయితే డ్రామాలో అన్ని ధర్మాల వారు కలిసి మేమంతా ఒకటే, ఒకటి వాడిమే అంటున్నట్లుగా చూపిస్తారు కదా! ఇది డ్రామాగా చూపిస్తున్నారు కానీ ప్రత్యక్షంగా వేదికపై అన్ని ధర్మాల వారు కలిసి ఒకే వేదికపై ఒకే మాట మాట్లాడతారు. ఒకే బాబా, ఒకే జ్ఞానం, ఒకే లక్ష్యం, ఒకే ఇల్లు - ఇప్పుడు ఈ మాట రావాలి. ఈ విధమైన దృశ్యం ఎప్పుడైతే బేహద్ వేదికపై వస్తుందో అప్పుడు ప్రత్యక్షతా జెండా ఎగరవేస్తారు మరియు ఆ జెండా క్రింద అందరు ఇదే పాట పాడతారు మరియు అందరి నోటి నుండి ఒకే మాట వస్తుంది - "మా బాబా” అని, అప్పుడే ప్రత్యక్ష రూపంలో శివరాత్రి జరుపుకున్నట్లు. అప్పుడే అంధకారం సమాప్తి అయ్యి ( గోల్డెన్ మార్నింగ్ ) స్వర్ణిమ ఉదయం యొక్క దృశ్యాలు కనిపిస్తాయి. దీనినే ఈరోజు మరియు రేపటి ఆట అని అంటారు. ఈరోజు  అంధకారం రేపు స్వర్ణిమ ఉదయం. ఇదే అంతిమ తెర. అర్ధమైందా? ఏదైతే ప్లాన్ తయారుచేసారో అది బావుంది. ప్రతి స్థానం యొక్క భూమిననుసరించి ప్లాన్ తయారుచేసుకోవాల్సి ఉంటుంది. భూమిననుసరించి విధిలో ఏదైనా తేడా చేయాల్సి వచ్చినా ఏమీ పర్వాలేదు. చివరికి అందరినీ తయారుచేసి మధువనం యొక్క భూమిలో ముద్ర తప్పకుండా వేయించాలి. రకరకాలైన వర్గాల వారిని తయారుచేసి ముద్ర తప్పకుండా వేయించాలి. విదేశాలకు వెళ్ళాలంటే కూడా పాస్ పోర్ట్ పై ముద్ర వేయకుండా వెళ్ళనివ్వరు కదా! ఈ స్టాంప్ ఇక్కడ మధువనంలోనే వేస్తారు. మంచిది. వీరందరూ సమర్పణ అయినవారే. సమర్పణ అవ్వకుండా సేవకి ఎలా నిమిత్తం అవుతారు! సమర్పణ అయ్యారు కనుకనే బ్రహ్మాకుమార్, బ్రహ్మకుమారిగా అయ్యి సేవకి నిమిత్తం అయ్యారు. దేశంలో, లేదా విదేశంలో ఎవరూ క్రైస్తవ కుమారీ లేదా బౌద్దకుమారీ అయ్యి సేవ చేయటం లేదు కదా? బ్రహ్మకుమారీగా అయ్యే సేవ చేస్తున్నారు కదా! సమర్పణ అయిన బ్రాహ్మణుల జాబితాలో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇతరులని కూడా సమర్పణ చేయాలి. మరజీవాగా అయిపోయారు, బ్రాహ్మణులుగా అయిపోయారు. పిల్లలు నా బాబా అంటున్నారు మరియు బాబా నా వారు అంటున్నారు అంటే సమర్పణ అయినట్లే కదా! ప్రవృతిలో ఉంటున్నా, సేవాకేంద్రంలో ఉంటున్నా కానీ ఎవరైతే మనస్సుతో నా బాబా అంటారో వారిని బాబా తన వారిగా చేసుకున్నారు. ఇది మనస్సుతో చేసే వ్యాపారం. నోటితో చేసే స్థూల వ్యాపారం కాదు. సమర్పణ అవ్వటం అంటే శ్రీమతం యొక్క అధీనంలో ఉండటం. ఈ సభలో అందరూ సమర్పణ అయ్యారు కదా! అందువలనే ఫోటో కూడా తీసారు కదా! ఇప్పుడు చిత్రంలోకి వచ్చేస్తే ఇక మారరు. పరమాత్మ ఇంటిలో చిత్రంగా అవ్వటం కూడా తక్కువైన భాగ్యమేమీ కాదు. 

సత్యత యొక్క అధికారం కలిగిన శ్రేష్టాత్మలకి, నవీనత మరియు మహానతని ప్రత్యక్షం చేసే సత్యమైన సేవాధారి పిల్లలకు, స్నేహము మరియు అధికారం యొక్క సమానత ఉంచుకొనేవారికి, ప్రతి అడుగులో బాబా ద్వారా ఆశీర్వాదాలు తీసుకునే అధికారి శ్రేష్టాత్మలకు, సత్యం అంటే అవినాశీ రత్నాలకు, అవినాశి పాత్ర అభినయించేవారికి, అవినాశి ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారికి, విశ్వరచయిత సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments