20-02-1988 అవ్యక్త మురళి

 20-02-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

తనువు మరియు మనసుల అలసటను దూరం చేసే సాధనం - శక్తిశాలి స్మృతి.

ఈ రోజు పరదేశి తండ్రి తన అనాది దేశవాసులు, ఆది దేశవాసులు, సేవార్థం విదేశీయులుగా ఉన్న పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. వీరే చాలా కాలం దూరమై తర్వాత కలిసిన నా గారాబాల పిల్లలు మరియు అనాది దేశమైన పరంధామ నివాసులు అని బాప్ దాదాకు తెలుసు. అంతేకాక, సృష్టి ఆదిలో ఇదే భారతభూమిలో సత్యయుగ స్వదేశమున్నప్పుడు, మీ రాజ్యమున్నప్పుడు, దేనినైతే అందరూ భారత్ అని అంటారో, ఆ ఆదిలో ఇదే భారతదేశ వాసులుగా ఉండేవారు. ఈ భారతభూమిలోనే బ్రహ్మాబాబాతో పాటు రాజ్యం చేసారు. అనేక జన్మలు మీ రాజ్యంలో సుఖ-శాంతులతో సంపన్నమైన జీవితాలను ఎన్నో గడిపారు. కావున ఆదిదేశవాసులైన కారణంగా భారతభూమి పట్ల హృదయపూర్వకమైన స్నేహముంది. ఇప్పుడీ అంతిమ సమయంలో భారతదేశము ఎంత పేదదిగా లేక ధూళి-మట్టితో కూడినదిగా అయిపోయినా సరే, మీ దేశం మీదే కదా. కావున ఆత్మలైన మీ అందరి దేశము ఏది మరియు శరీరధారి దేవతా జీవితాన్ని గడిపిన దేశము ఏది? భారతదేశమే కదా. భారతభూమిలో ఎన్ని జన్మలు ఉన్నారో, గుర్తుందా? అందరూ తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకున్నారు కావున భారతభూమిలో 21 జన్మలైతే ఉంటారని గ్యారంటీ ఉంది. తర్వాత కూడా ప్రతి ఆత్మ భారతభూమిలోనే అనేక జన్మలు తీసుకుంది ఎందుకంటే బ్రహ్మాబాబాకు సమీప ఆత్మలు, సమానంగా అయ్యే ఆత్మలెవరైతే ఉన్నారో, వారు తామే పూజ్యులుగా, తామే పూజారులుగా అయ్యే పాత్రను బ్రహ్మాబాబాతో పాటు కలిసి అభినయిస్తారు. ద్వాపరయుగంలోని మొదటి భక్తులుగా బ్రాహ్మణాత్మలైన మీరే అవుతారు. ఆది కాలమైన స్వర్గంలో మీరు ఈ దేశవాసులుగానే ఉండేవారు మరియు అనేక సార్లు భారతదేశవాసులుగా అయ్యారు. అందుకే బ్రాహ్మణుల అలౌకిక ప్రపంచమైన మధువనం పట్ల అతి ప్రేమ ఉంది. ఈ మధువనము బ్రాహ్మణుల చిన్న ప్రపంచము. కావున ఈ ప్రపంచం చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడి నుండి వెళ్ళడానికి మనసు ఒప్పదు కదా. ఒకవేళ ఇప్పటికిప్పుడు మధువనవాసులుగా అయిపోండి అన్న ఆజ్ఞ లభిస్తే సంతోషిస్తారు కదా. లేదా సేవ ఎవరు చేస్తారు అనే సంకల్పం వస్తుందా? సేవ కోసమైతే వెళ్ళాల్సిందే. బాప్ దాదా ఇక్కడే ఉండిపోండి అని చెప్పినా సరే, సేవ గుర్తుకొస్తుందా? సేవ చేయించేవారు ఎవరు? బాబా నుండి లభించిన డైరెక్షన్లను, శ్రీమతాన్ని అదే రూపంలో పాటించేవారిని సత్యమైన ఆజ్ఞాకారి పిల్లలు అని అంటారు. మధువనంలో కూర్చోబెట్టాలా లేక సేవకు పంపించాలా అనేది బాప్ దాదాకు తెలుసు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి విషయంలోనూ ఎవర్రెడీగా ఉండాలి. ఇప్పటికిప్పుడు ఏ డైరెక్షన్ లభించినా, దానికి ఎవర్రెడీగా ఉండాలి. సంకల్పమాత్రంగా కూడా మన్మతం మిక్స్ అవ్వకూడదు. ఇటువంటివారినే శ్రీమతంపై నడిచే శ్రేష్ఠ ఆత్మ అని అంటారు.

సేవా బాధ్యత బాప్ దాదాది అని మీకు తెలుసు కదా లేక మీదా? ఈ బాధ్యత నుండైతే మీరు ఫ్రీగా ఉన్నారు కదా లేక కొద్ది-కొద్దిగా భారముందా? ‘ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలి, ఇది చేయాలి’ - దీనిని భారంగా అయితే భావించడం లేదు కదా. చేయించేవారు చేయిస్తున్నారు. చేయించేవారు బాబా ఒక్కరే, ఎవరో ఒకరి బుద్ధిని టచ్ చేసి విశ్వ సేవ కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు మరియు చేయిస్తూ ఉంటారు. పిల్లలను కేవలం నిమిత్తంగా పెడతారు ఎందుకంటే ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. పొందేవారు పిల్లలే, బాబాకు పొందాల్సిన అవసరం లేదు. ప్రారబ్ధాన్ని పొందడం లేక సేవా ఫలాన్ని అనుభవం చేయడం - ఇది ఆత్మల పని కావున పిల్లలను నిమిత్తంగా చేసారు. సాకార రూపంలో కూడా సేవ చేయించే కార్యం చూసారు మరియు ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా చేయించేవారైన తండ్రి అవ్యక్త బ్రహ్మ ద్వారా సేవను ఎలా చేయిస్తున్నారు అనేది చూస్తున్నారు. అవ్యక్త రూపంలో సేవ వేగం ఇంకా తీవ్రంగా ఉంటుంది. చేయించేవారు చేయిస్తున్నారు మరియు మీరు తోలుబొమ్మల వలె నాట్యం చేస్తున్నారు. ఈ సేవ కూడా ఒక ఆట. చేయించేవారు చేయిస్తున్నారు మరియు మీరు నిమిత్తులు అయి ఒక అడుగుకు పదమాల రెట్ల ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. కావున భారము ఎవరిపై ఉంది? చేయించేవారిపై ఉందా లేక చేసేవారిపై ఉందా? వాస్తవానికి ఇది భారము కాదు అని బాబాకు తెలుసు. మీరు భారము అని అంటారు కావున బాబా కూడా భారము అనే పదాన్ని ఉపయోగించారు. బాబా దృష్టిలో అయితే అంతా జరిగే ఉంది, ఇప్పుడు కేవలం గీత గీస్తున్నట్లు, గీత గీయడం పెద్ద విషయంలా అనిపిస్తుందా? కావున ఈ విధంగా బాప్ దాదా సేవ చేయిస్తారు. సేవ కూడా ఒక గీతను గీసినంత సులభమైన విషయము. మీరు కేవలం రిపీట్ చేస్తున్నారు, నిమిత్తంగా ఆడుతున్నారు.

ఎలాగైతే మాయ విఘ్నాలు ఆట వంటివో, అలా సేవ కూడా శ్రమ కాదు కానీ ఆట వంటిది, ఇలా భావించడం ద్వారా సేవలో సదా రిఫ్రెష్మెంట్ ను అనుభవం చేస్తారు. ఏదైనా ఆటను ఎందుకు ఆడతారు? అలసిపోయేందుకు కాదు, రిఫ్రెష్ అయ్యేందుకు ఆడతారు. ఎంత పెద్ద కార్యమైనా సరే, ఎలాగైతే ఆట ఆడితే రిఫ్రెష్ అవుతారో అలా రిఫ్రెష్ అయినట్లు అనుభవం చేస్తారు. ఎంత అలసట కలిగించే ఆట అయినా సరే, ఆటగా భావించడం వల్ల అలసట అనిపించదు ఎందుకంటే ఆటను మనస్ఫూర్తిగా అభిరుచితో ఆడతారు. ఆటలో ఎంత కష్టపడాల్సి వచ్చినా సరే, అది కూడా మనోరంజనంగా అనిపిస్తుంది ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తారు. అదే లౌకిక కార్యమైతే భారముగా అనిపిస్తుంది, శరీర నిర్వహణార్థం చేయాల్సిందే కదా అని అనిపిస్తుంది. డ్యూటీగా భావిస్తూ చేస్తారు కనుక శ్రమ అనిపిస్తుంది. శారీరిక శ్రమతో కూడిన పని అయినా, బుద్ధితో శ్రమించే పని అయినా, అది డ్యూటీగా భావిస్తూ చేయడం వల్ల అలసటను అనుభవం చేస్తారు ఎందుకంటే ఆ పనిని మనస్ఫూర్తిగా, సంతోషంగా చేయరు. ఏ పనినైతే ఉల్లాసభరితమైన మనసుతో, సంతోషంగా చేస్తారో, అందులో అలసట ఉండదు, భారము అనుభవమవ్వదు. ఒక్కోసారి పిల్లలకు సేవ పరంగా ఎక్కువ పనులు కూడా చేయాల్సి వస్తుంది, దీని వల్ల కూడా అప్పుడప్పుడు అలసట అనుభవమవుతుంది. చాలామంది పిల్లలు అలసటలేనివారిగా ఉంటూ సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. ఎంతైనా ధైర్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు - ఇది చూసి బాప్ దాదా హర్షిస్తారు కూడా, కానీ బుద్ధిని తప్పకుండా సదా తేలికగా ఉంచుకోండి.

పిల్లలు చేసే ప్లాన్లు, ప్రోగ్రాంలు అన్నింటినీ బాప్ దాదా వతనంలో కూర్చుని కూడా చూస్తూ ఉంటారు. ప్రతి సమయంలోని స్మృతి మరియు సేవల రికార్డు, పిల్లలు ప్రతి ఒక్కరిది బాప్ దాదా వద్ద ఉంటుంది. మీ ప్రపంచంలో రికార్డులు పెట్టుకునేందుకు చాలా సాధనాలున్నాయి. బాబా వద్ద సైన్స్ సాధనాల కంటే రిఫైన్డ్ సాధనాలున్నాయి. అవి స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటాయి. సైన్స్ సాధనాలు ఏ కార్యాన్ని అయినా లైట్ ఆధారంతో చేస్తాయి. సూక్ష్మ వతనమైతే ఎలాగూ లైట్ తో కూడినదే. సాకార వతనంలో లైట్ ద్వారా పని చేసే సాధనాలు ఎంతైనా ప్రకృతి సాధనాలు కానీ అవ్యక్త వతనంలోని సాధనాలు ప్రకృతి సాధనాలు కాదు. ప్రకృతి అయితే రూపాన్ని మారుస్తూ సతో, రజో, తమోలలోకి పరివర్తన అవుతుంది. ఈ సమయంలో ఉన్నదే తమోగుణి ప్రకృతి, అందుకే ఈ సాధనాలు ఈ రోజు పని చేస్తాయి, రేపు పని చేయవు. కానీ అవ్యక్త వతనంలోని సాధనాలు ప్రకృతికి అతీతమైనవి కావున అవి పరివర్తన అవ్వవు. ఎప్పుడు కావాలన్నా, ఎలా కావాలన్నా సూక్ష్మ సాధనాలు సదా తమ కార్యాన్ని చేస్తూ ఉంటాయి కావున పిల్లలందరి రికార్డులను చూడడం బాప్ దాదాకు పెద్ద విషయమేమీ కాదు. మీకైతే సాధనాలను సంభాళించడమే కష్టమైపోతుంది కదా. కావున బాప్ దాదా స్మృతి మరియు సేవ - రెండింటి రికార్డులను చూస్తారు ఎందుకంటే రెండింటి బ్యాలెన్స్ ఎక్స్ ట్రా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) ను ఇప్పిస్తుంది.

సేవ కోసం సమయాన్ని తీసినప్పుడు, ఒక్కోసారి దానికి నియమము కంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సేవలో సమయాన్ని వినియోగించడం చాలా మంచి విషయము మరియు సేవా బలం కూడా లభిస్తుంది, సేవలో బిజీగా ఉన్న కారణంగా చిన్న-చిన్న విషయాల నుండి రక్షించబడతారు కూడా. బాప్ దాదా పిల్లల సేవ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు, ఆ ధైర్యానికి బలిహారమవుతారు. కానీ ఏ సేవ అయితే స్మృతిలో, ఉన్నతిలో కొద్దిగానైనా ఆటంకం కలిగించడానికి నిమిత్తమవుతుందో, అలాంటి సేవ చేసే సమయాన్ని తగ్గించుకోవాలి. ఉదాహరణకు రాత్రివేళ మేల్కొంటారు, 12.00 లేక 1.00 గంట వరకు చేస్తారు, అప్పుడు అమృతవేళ ఫ్రెష్ గా ఉండదు. కూర్చున్నా సరే, నియమం ప్రకారంగా కూర్చుంటారు. ఒకవేళ అమృతవేళ శక్తిశాలిగా లేకపోతే, పూర్తి రోజంతటి స్మృతి మరియు సేవలో తేడా వచ్చేస్తుంది. సేవా ప్లాన్లు తయారుచేయడంలో లేక సేవను ప్రాక్టికల్ లోకి తీసుకురావడంలో సమయం పట్టవచ్చు, అప్పుడు రాత్రి సమయాన్ని తగ్గించి 12.00 గంటలకు బదులు 11.00 గంటలకు పడుకోండి. ఆ తగ్గించిన ఒక గంట సమయంలో శరీరానికి విశ్రాంతినిస్తే అమృతవేళ బాగుంటుంది, బుద్ధి కూడా ఫ్రెష్ గా ఉంటుంది. లేదంటే సేవ అయితే చేస్తున్నాము కానీ స్మృతి చార్టు ఎంత ఉండాలో అంత లేదు అని మనసు తింటుంది. ఇది ఇలా అవ్వాలి కానీ అవ్వడం లేదు అని మనసులో ఏ సంకల్పమైతే పదే-పదే వస్తుందో, ఆ సంకల్పం వల్ల బుద్ధి కూడా ఫ్రెష్ గా ఉండదు. ఒకవేళ బుద్ధి ఫ్రెష్ గా ఉన్నట్లయితే, ఆ ఫ్రెష్ బుద్ధితో 2-3 గంటల్లో చేసే పనిని ఒక గంటలో పూర్తి చేయగలుగుతారు. అలసిపోయిన బుద్ధితో పని చేస్తే ఎక్కువ సమయం పడుతుంది, ఇది అనుభవమే కదా. బుద్ధి ఎంత ఫ్రెష్ గా ఉంటుందో, శరీరం పరంగా కూడా ఫ్రెష్ మరియు ఆత్మిక ఉన్నతి పరంగా కూడా ఫ్రెష్ - డబల్ ఫ్రెష్ గా ఉంటుంది కావున ఒక గంట పనిని అర్ధగంటలో చేసేస్తారు. అందుకే, సదా మీ దినచర్యలో ఫ్రెష్ బుద్ధి ఉండేలా అటెన్షన్ పెట్టండి. ఎక్కువ నిద్రపోయే అలవాటు కూడా ఉండకూడదు, శరీరం పరంగా ఎంత సమయం అవసరమో, దాని పట్ల అటెన్షన్ పెట్టండి. అప్పుడప్పుడు ఏదైనా సేవ చేసే ఛాన్స్ లభించినప్పుడు నెల లేక రెండు నెలల్లో 2-4 సార్లు ఆలస్యమవ్వడం వేరే విషయం కానీ ఒకవేళ నియమిత రూపంలో (ప్రతిరోజు) శరీరం అలసిపోతే స్మృతిలో తేడా వస్తుంది. ఎలాగైతే సేవా ప్రోగ్రాం తయారుచేసేటప్పుడు, దాని కోసం 4 గంటల సమయం తీయాలంటే తీస్తారు కదా, అలా స్మృతి కోసం కూడా నిశ్చితమైన సమయాన్ని కేటాయించాల్సిందే. ఇది కూడా అవసరమని భావిస్తూ ఈ విధంగా మీ ప్రోగ్రాంను తయారుచేసుకోండి. బద్ధకం కలగకూడదు, శరీరానికి విశ్రాంతినివ్వాలి - ఈ విధితో నడుచుకోండి ఎందుకంటే రోజు రోజుకు సేవ ఇంకా తీవ్రగతితో ముందుకు వెళ్ళే సమయం వస్తోంది. మీరు అనుకుంటారు - అచ్ఛా, ఈ ఒక్క సంవత్సరంలో కార్యం పూర్తి అయిపోతుంది, అప్పుడు విశ్రాంతి తీసుకుందాము, సరిచేసుకుందాము, స్మృతిని ఎక్కువగా పెంచుకుందాము అని. కానీ సేవా కార్యమైతే రోజు రోజుకు కొత్త కొత్తగా మరియు పెద్ద పెద్దగా జరగనున్నది కావున సదా బ్యాలెన్స్ పెట్టండి. అమృతవేళ ఫ్రెష్ గా ఉండాలి, తర్వాత అదే పనిని రోజంతటిలో సమయప్రమాణంగా చేయండి, అప్పుడు బాబా ఆశీర్వాదాలు కూడా ఎక్స్ ట్రాగా లభిస్తాయి మరియు బుద్ధి కూడా ఫ్రెష్ గా ఉన్న కారణంగా చాలా త్వరగా మరియు సఫలతా పూర్వకంగా కార్యం చేయగలరు. అర్థమయిందా?

బాప్ దాదా చూస్తున్నారు - పిల్లల్లో చాలా ఉల్లాసముంది కావున శరీరం గురించి కూడా ఆలోచించరు. ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళడం బాప్ దాదాకు బాగా అనిపిస్తుంది కానీ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు చాలా పని ఉన్నప్పుడు ఆ పనిలో బుద్ధి అలసిపోయిన కారణంగా ఎంత కావాలనుకుంటారో అంత చేయలేకపోతారు, మరియు చాలా పని ఉన్న కారణంగా కొద్దిగానైనా ఎవరి ద్వారానైనా కొంచెం అలజడి కలిగినా అలసట కారణంగా చికాకు వస్తుంది. దీని వల్ల సంతోషం తగ్గిపోతుంది. ఆంతరికంగా బాగానే ఉంటారు, సేవా బలం కూడా లభిస్తూ ఉంటుంది, సంతోషం కూడా లభిస్తూ ఉంటుంది, కానీ శరీరమైతే పాతది కదా, కావున టూమచ్ లోకి (అతిలోకి) వెళ్ళకండి. బ్యాలెన్స్ పెట్టండి. స్మృతి చార్టు పై అలసట యొక్క ప్రభావం పడకూడదు. సేవలో ఎంతగా బిజీగా ఉంటారో, ఎంత బిజీగా ఉన్నా సరే, అలసటను తొలగించే విశేషమైన సాధనము - ప్రతి గంట లేక రెండు గంటలలో ఒక్క నిముషమైనా శక్తిశాలి స్మృతి కోసం తప్పకుండా కేటాయించండి. ఎలాగైతే ఎవరి శరీరమైనా బలహీనంగా ఉంటే శరీరానికి శక్తినిచ్చేందుకు డాక్టర్లు రెండు గంటలకొకసారి తాగేందుకు శక్తినిచ్చే మందును ఇస్తారు కదా. అప్పుడు సమయం కేటాయించి మందు తీసుకోవాల్సి ఉంటుంది కదా. కావున మధ్య మధ్యలో ఒకవేళ ఒక్క నిముషమైనా శక్తిశాలి స్మృతి కోసం కేటాయిస్తే, అందులో ఎ, బి, సి... అన్ని విటమిన్లు వచ్చేస్తాయి.

శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండడం లేదు అనేది వినిపించాము కదా? మీరు బాబాకు చెందినవారిగా మరియు బాబా మీ వారిగా ఉన్నారు, సర్వ సంబంధాలు ఉన్నాయి, హృదయపూర్వకమైన స్నేహముంది, జ్ఞానవంతులుగా ఉన్నారు, ప్రాప్తుల అనుభవీలుగా ఉన్నారు, అయినా శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండదు, దీనికి కారణమేమిటి? మీ స్మృతి లింకును పెట్టుకోరు. లింకు తెగిపోతుంది కావున జోడించడంలో సమయం కూడా పడుతుంది మరియు శ్రమ కూడా అనిపిస్తుంది, అంతేకాక శక్తిశాలికి బదులుగా బలహీనంగా అవుతారు. విస్మృతి జరగదు (మర్చిపోరు), స్మృతి ఉంటుంది కానీ సదా శక్తిశాలి స్మృతి స్వతహాగా ఉండాలంటే ఈ లింకు తెగిపోకూడదు. ప్రతి సమయం బుద్ధిలో స్మృతి లింకు జోడించబడి ఉండాలంటే, దానికి విధి ఇదే. ఇది కూడా అవసరమని అనుకోండి. ఎలాగైతే ఆ పనులను అవసరమని భావించి, ఈ ప్లాను పూర్తి చేసే లేవాలని అనుకుంటారో, దాని కోసం సమయాన్ని కూడా తీస్తారు, శక్తిని కూడా ఉపయోగిస్తారు, అలా ఇది కూడా అవసరము. ముందు ఈ పని పూర్తి చేసి, తర్వాత స్మృతి చేద్దామని దీనిని వెనుకకు నెట్టేయకండి. మీ ప్రోగ్రాంలో దీని (స్మృతి) కోసం కేటాయించే సమయాన్ని ముందు పెట్టండి. సేవా ప్లాను కోసం రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు - మీటింగ్ కోసమైనా, ప్రాక్టికల్ గా చేయడం కోసమైనా, ఆ రెండు గంటలలో మధ్య మధ్యలో స్మృతి కూడా చేయాల్సిందే అనేది కలపండి. అప్పుడు ఒక గంటలో తయారుచేసే ప్లాను అర్ధగంటలోనే తయారైపోతుంది. చేసి చూడండి. 2.00 గంటలకు వాటంతటవే కళ్ళు ఫ్రెష్ గా తెరుచుకుంటే, అది వేరే విషయము కానీ పని కారణంగా మేల్కోవలసి వస్తే దాని ప్రభావం శరీరంపై పడుతుంది, అందుకే బ్యాలెన్స్ పట్ల సదా అటెన్షన్ పెట్టండి.

పిల్లలు ఇంత బిజీగా ఉండడం చూసి వీరి తలకు మాలిష్ జరగాలని బాప్ దాదా అనుకుంటారు. కానీ సమయం తీస్తే వతనంలో బాప్ దాదా మాలిష్ కూడా చేస్తారు. అది అలౌకికంగా ఉంటుంది, ఇక్కడి లౌకిక మాలిష్ వలె ఏమీ ఉండదు. పూర్తిగా ఫ్రెష్ అయిపోతారు. ఒక్క సెకండు యొక్క శక్తిశాలి స్మృతి అయినా సరే, అది తనువు, మనసు రెండింటినీ ఫ్రెష్ చేసేస్తుంది. బాప్ దాదా వతనానికి వచ్చేయండి, ఏ సంకల్పం చేస్తే అది పూర్తి అవుతుంది. శారీరిక అలసట ఉన్నా, బుద్ధి అలసట ఉన్నా, స్థితి యొక్క అలసట ఉన్నా - బాబా మీ అలసటను దూరం చేసేందుకే వచ్చారు.

ఈ రోజు డబల్ విదేశీయులతో వ్యక్తిగత ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. చాలా బాగా సేవ చేసారు. ఇంకా చేస్తూనే ఉండాలి. సేవ పెరగడం అనేది డ్రామానుసారంగా ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడిక చాలా చేసామని మీరు ఎంతగా అనుకున్నా సరే, డ్రామాలో నిర్ణయించబడి ఉంది కావున సేవ కోసం ప్లాన్లు తయారుచేయాల్సిందే, అంతేకాక మీరందరూ నిమిత్తంగా అయి చేయాల్సిందే. ఈ రాతను ఎవరూ మార్చలేరు. ఒక సంవత్సరం కోసం సేవ నుండి విశ్రాంతినివ్వాలని బాబా అనుకున్నా సరే, ఈ రాత మారదు. సేవ నుండి ఫ్రీ అయి కూర్చోగలరా? ఎలాగైతే స్మృతి బ్రాహ్మణ జీవితానికి పౌష్టికాహారమో, అలా సేవ కూడా జీవితానికి పౌష్టికాహారము. పౌష్టికాహారము లేకుండా ఎవరైనా ఉండగలరా? కాని బ్యాలెన్స్ తప్పనిసరి. బుద్ధిపై భారం పడేంత ఎక్కువగా కూడా చేయకండి మరియు నిర్లక్ష్యం చేసేంత తక్కువగా కూడా చేయకండి. భారము ఉండకూడదు, నిర్లక్ష్యము ఉండకూడదు - దీనినే బ్యాలెన్స్ అని అంటారు. అచ్ఛా.

సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా తండ్రి ఆశీర్వాదాలకు అధికారులు, సదా బాబా సమానంగా డబల్ లైట్ గా ఉండేవారు, సదా నిరంతర శక్తిశాలి స్మృతి యొక్క లింకును జోడించేవారు, సదా శరీరం మరియు ఆత్మను రిఫ్రెష్ గా ఉంచుకునేవారు, ప్రతి కర్మను విధి పూర్వకంగా చేసేవారు, సదా శ్రేష్ఠ సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు - ఇలాంటి శ్రేష్ఠమైన, సమీపమైన పిల్లలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

Comments