20-02-1987 అవ్యక్త మురళి

20-02-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్మృతి, పవిత్రత మరియు సత్యమైన సేవాధారి యొక్క 3 రేఖలు.
 
ప్రతి బిడ్డ యొక్క వర్తమాన (రిజల్ట్) ఫలితాన్ని చూస్తూ విశ్వస్నేహి బాప్ దాదా మాట్లాడుతున్నారు-

 ఈ రోజు సర్వస్నేహి, విశ్వసేవాధారి తండ్రి తన యొక్క సదా సేవాధారి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. సేవాధారి అయిన బాప్ దాదాకి తన సమానమైన సేవాధారి పిల్లలంటే ఇష్టం. ఈ రోజు విశేషంగా సేవాధారి పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం త్రిమూర్తి తిలకంతో మెరుస్తుంది. ఈ 3 రేఖలు దేనికి గుర్తు? ఈ 3 రకాలైన తిలకం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ యొక్క వర్తమాన ఫలితం చూస్తున్నారు. 1. సంపూర్ణ యోగి జీవితం యొక్క రేఖ 2. పవిత్రత యొక్క రేఖ. 3. సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ 3 రేఖలలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఫలితాన్ని చూస్తున్నారు. స్మృతి యొక్క రేఖ అందరికీ మెరుస్తుంది. కానీ నెంబర్‌వార్‌గా ఉన్నారు. కొంతమంది రేఖ ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా అంటే సదా ఒకే సంలగ్నతలో నిమగ్నం అయ్యి ఉంటున్నారు. రెండవ విషయం - సదా ఏకరసంగా, నిరంతరం, నిర్విఘ్నమైన మరియు తెగిపోని రేఖ. మధ్యమధ్యలో తెగిపోతూ మరియు మరలా జోడిస్తూ ఉంటున్నారా లేదా సదా తెగిపోనిదిగా ఉంటుందా? సదా స్పష్టమైన రేఖ అంటే డైరెక్ట్ బాబాతో సర్వసంబందాల అనుభూతి సదా ఉంటుందా లేదా ఏదోక నిమిత్తాత్మల ద్వారా బాబాతో సంబంధం జోడించే అనుభవిగా ఉన్నారా? డైరెక్ట్ బాబా యొక్క తోడు ఉందా లేదా ఏదోక ఆత్మ యొక్క తోడు ద్వారా బాబా యొక్క తోడు తీసుకుంటున్నారా? ఒకరు, స్పష్టమైనరేఖ కలిగినవారు. రెండవవారు మధ్యమధ్యలో కొద్దిగా వంకర రేఖ కలిగినవారు. ఇవి స్మృతి రేఖ యొక్క విశేషతలు. 

రెండవది - సంపూర్ణపవిత్రత యొక్క రేఖ. దీనిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఒకరు, బ్రాహ్మణజీవితం తీసుకుంటూనే బ్రాహ్మణజీవితం యొక్క మరియు బాబా యొక్క విశేష వరదానాన్ని పొంది సదా మరియు సహజంగా ఈ వరదానాన్ని జీవితంలో అనుభవం చేసుకునేవారు. వారి రేఖ ఆది నుంచి ఇప్పటివరకు స్పష్టంగా ఉంటుంది. రెండవ వారు, బ్రాహ్మణజీవితం యొక్క ఈ వరదానాన్ని అధికార రూపంలో అనుభవం చేసుకోవటం లేదు. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు శ్రమ ద్వారా, అప్పుడప్పుడు పురుషార్ధం ద్వారా పొందేవారు. వీరి యొక్క రేఖ సదా స్పష్టంగా మరియు మెరుస్తూ ఉండటం లేదు. స్మృతి మరియు 
సేవ యొక్క సఫలతకి ఆధారం - పవిత్రత. కేవలం బ్రహ్మచారిగా అవ్వటం అనేదే పవిత్రత కాదు కానీ సంపూర్ణ పవిత్రత అంటే బ్రహ్మచారిగా అవ్వటంతో పాటు బ్రహ్మాచారిగా అవ్వాలి. బ్రహ్మాచారి అంటే బ్రహ్మ యొక్క ఆచరణలో నడిచేవారు. వారినే ఫాలోఫాదర్ (తండ్రిని అనుసరించేవారు) అని అంటారు. ఎందుకంటే బ్రహ్మాబాబానే అనుసరించాలి. స్థితిలో శివబాబా సమానంగా అవ్వాలి కానీ ఆచరణలో మరియు కర్మలో బ్రహ్మాబాబాను అనుసరించాలి. ప్రతి అడుగులో బ్రహ్మాచారిగా అవ్వాలి. బ్రహ్మచర్యవత్రం సదా సంకల్పం మరియు స్వప్నంలో కూడా ఉండాలి. పవిత్రత అంటే - సదా బాబాని తోడుగా చేసుకోవాలి మరియు సదా బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. బాబా నా వాడు అని తోడుగా చేసుకున్నారు ఇది అవసరమే కానీ ప్రతి సమయం బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. దీనినే సంపూర్ణపవిత్రత అంటారు. సంఘటన యొక్క తోడు పరివారం యొక్క స్నేహ మర్యాద ఇది వేరే విషయం, ఇది కూడా అవసరమే కానీ బాబా వలనే ఈ సంఘటన స్నేహం యొక్క తోడు లభించింది అనేది మర్చిపోకూడదు. పరివారం యొక్క ప్రేమ ఉంది కానీ ఆ పరివారం ఎవరిది? బాబాది. బాబాయే లేకపోతే పరివారం ఎక్కడి నుంచి వస్తుంది? పరివారం యొక్క ప్రేమలో, పరివారం యొక్క సంఘటనలో ఉండటం మంచిదే కానీ పరివారం యొక్క బీజాన్ని మర్చిపోకూడదు. బాబాని మర్చిపోయి పరివారాన్ని తోడుగా చేసేసుకుంటున్నారు. మధ్యమధ్యలో బాబాని వదిలేస్తే కనుక స్థానం ఖాళీ అయిపోయింది, కనుక ఆ ఖాళీ స్థానంలోకి మాయ వచ్చేస్తుంది. అందువలన స్నేహంలో ఉంటూ, స్నేహం ఇస్తూ మరియు స్నేహాన్ని తీసుకుంటూ సమూహాన్ని మర్చిపోకండి. దీనినే పవిత్రత అంటారు. అర్ధం చేసుకోవటంలో తెలివైనవారు కదా!

 కొంతమంది పిల్లలకు సంపూర్ణపవిత్రత యొక్క స్థితిలో ముందుకి వెళ్ళడంలో శ్రమ అనిపిస్తుంది, అందువలన మధ్యమధ్యలో ఎవరోకరిని తోడుగా చేసుకోవాలనే సంకల్పం కూడా వస్తుంది మరియు సాంగత్యం కూడా అవసరం అనే సంకల్పం కూడా వస్తుంది. సన్యాసిగా అవ్వకూడదు కానీ ఆత్మల సాంగత్యంలో ఉంటూ బాబా యొక్క తోడుని మర్చిపోకండి లేకపోతే కనుక సమయానికి ఆ ఆత్మ యొక్క తోడు స్మృతి వస్తుంది మరియు బాబాని మర్చిపోతారు. కనుక సమయానికి మోసపోతారు. ఎందుకంటే సాకార శరీరధారిని తోడుగా చేసుకునే అలవాటైతే కనుక అవ్యక్త బాబా మరియు నిరాకారి బాబా తర్వాత స్మృతి వస్తారు, మొదట శరీరధారియే స్మృతి వస్తారు. ఒకవేళ ఏ సమయంలోనైనా మొదట సాకారతోడు స్మృతి వస్తే ఆ ఆత్మ నెంబర్ వన్ అయిపోతుంది మరియు బాబా రెండవ నెంబర్ అయిపోతారు. ఎవరైతే బాబాని రెండవ నెంబర్‌గా పెడతారో వారికి ఏ పదవి లభిస్తుంది? మొదటి నెంబర్ పదవి లభిస్తుందా లేదా రెండవ నెంబర్ పదవి లభిస్తుందా? సహయోగం తీసుకోవటం, స్నేహిగా ఉండడం ఇది వేరే విషయం కానీ తోడుగా చేసుకోవటం అనేది వేరే విషయం. ఇది చాలా గుహ్యమైన విషయం. దీనిని యదార్థంగా తెలుసుకోవాలి. మరికొందరు సంఘటనలో స్నేహి అవ్వడానికి బదులు అతీతం అయిపోతున్నారు. తెలియకుండా చిక్కుకుపోతామేమో, వీరి నుండి దూరంగా ఉండటం మంచిది అని భయపడుతున్నారు. కానీ ఇలా కూడా ఉండకూడదు. 21 జన్మలు ప్రవృతిలో, పరివారంతో ఉండాలి కదా! భయపడి వేరుగా అయిపోవటం, అతీతంగా అవ్వటం చేస్తే ఇది కర్మసన్యాసం యొక్క సంస్కారం అయిపోతుంది. కర్మయోగిగా అవ్వాలి కానీ కర్మసన్యాసిగా కాదు. సంఘటనలో ఉండాలి, స్నేహి అవ్వాలి కానీ బుద్ది ఒక బాబా యొక్క తోడులో ఉండాలి. ఇంకెవ్వరు ఉండకూడదు. బుద్ధికి ఏ ఆత్మ యొక్క తోడు లేదా గుణాలు లేదా ఏ విశేషత ఆకర్షితం చేయకూడదు. దీనినే పవిత్రత అంటారు. 

పవిత్రతలో శ్రమ అనిపిస్తుంది అంటే వరదాత బాబా నుండి జన్మ యొక్క వరదానం తీసుకోలేదు అని సిద్ధి అవుతుంది. వరదానంలో శ్రమ ఉండదు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి బ్రాహ్మణ జన్మ యొక్క మొదటి వరదానం - “యోగీభవ” మరియు “పవిత్రభవ”. కనుక మిమ్మల్ని మీరు అడగండి - పవిత్రత యొక్క వరదాని ఆత్మనేనా లేదా శ్రమతో పవిత్రతను ధారణ చేసే ఆత్మనా? అని. మనది బ్రహ్మణజన్మ అనేది స్మృతి ఉంచుకోండి. దీనిలో కేవలం జీవితం పరివర్తన చేసుకోవటమే కాదు, బ్రాహ్మణజన్మ ఆధారంగా జీవితాన్ని పరివర్తను చేసుకోవాలి. జన్మతో వచ్చే సంస్కారాలు చాలా పక్కాగా ఉంటాయి. పవిత్రత అనేది బ్రాహ్మణజన్మ యొక్క ఆది సంస్కారం. జన్మతో వచ్చే సంస్కారాలు సహజంగా మరియు స్వతహాగా ఉంటాయి. నాకు జన్మతోనే ఈ సంస్కారం ఉంది అని పరస్పరం కూడా అనుకుంటారు కదా! కానీ అవి బ్రాహ్మణజన్మ యొక్క సంస్కారాలు కావు వెనుకటి జన్మలలో మిగిలి ఉన్న సంస్కారాలు. బ్రాహ్మణజన్మ యొక్క సంస్కారాలు - "యోగీభవ” మరియు “పవిత్ర భవ”. ఇవి మనకి వరదానం కూడా మరియు నిజసంస్కారాలు కూడా. జీవితంలో రెండు విషయాలు అవసరం అవుతాయి. 1. తోడు 2. సాంగత్యం. అందువలనే త్రికాలదర్శి అయిన బాబా అందరి అవసరాలు తెలుసుకుని చాలా గొప్ప తోడుని మరియు చాలా గొప్ప సాంగత్యాన్ని కూడా ఇస్తున్నారు. విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు రెండూ కావాలి. అందువలనే బాప్ దాదా బ్రహ్మణజన్మ తీసుకోవటంతోనే తోడుని అనుభవం చేయించారు మరియు సౌభాగ్యవంతులుగా తయారుచేసారు. జన్మతోనే తోడు లభించింది కదా? తోడు లభించిందా లేదా వెతుకుతున్నారా? కనుక పవిత్రత అనేది నిజ సంస్కార రూపంలో అనుభవం చేసుకోవాలి. దీనినే శ్రేష్టరేఖ లేదా శ్రేష్టరేఖ కలిగిన వారు అంటారు. పునాది పక్కాగా ఉంది కదా? 

మూడవ రేఖ - సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ సేవాధారి యొక్క రేఖ కూడా అందరి మస్తకంలో ఉంది. సేవ లేకుండా కూడా ఉండలేరు. సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా చేసే సాధనం కూడా మరియు సేవలోనే విఘ్నాల యొక్క పరీక్షలు కూడా చాలా వస్తాయి. నిర్విఘ్నసేవాధారినే సత్యమైన సేవాధారి అంటారు. విఘ్నాలు రావటం అనేది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. రావల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు మరియు పరీక్షలు అనేవి అనుభవీగా చేస్తాయి. దానిని విఘ్నంగా భావించకుండా, అనుభవం యొక్క ఉన్నతి అవుతుంది అనే భావంతో చూస్తే ఉన్నతి యొక్క అనుభవం అవుతుంది. దీని ద్వారా ఇంకా ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే సేవ అంటే సంఘటన యొక్క మరియు సర్వాత్మల యొక్క ఆశీర్వాదాలను అనుభవం చేసుకోవటం. సేవాకార్యం అనేది సర్వాత్మల ఆశీర్వాదాలు పొందడానికి సాధనం. ఈ విధి ద్వారా, వృత్తి ద్వారా చూస్తే కనుక సదా అనుభవం యొక్క అధికారంతో ముందుకి వెళ్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. విఘ్నాన్ని విఘ్నంగా భావించండి మరియు విఘ్నానికి నిమిత్తమైన ఆత్మని విఘ్నకారి ఆత్మగా చూడకండి. వారిని సదా పాఠం చదివించే మరియు ముందుకి తీసుకువెళ్ళే నిమిత్త ఆత్మగా భావించండి. ఎలా అయితే నిందించేవారే మిత్రులు అని అంటారు కదా! అలాగే విఘ్నాలను దాటించి అనుభవీగా చేసేవారు శిక్షకులు అవుతారు కదా! పాఠం చదివించారు కదా! ఏవిధంగా అయితే ఈ రోజుల్లో జబ్బులు తగ్గించే వైద్యులు కూడా వ్యాయామాన్ని చేయిస్తున్నారు, వ్యాయామంలో మొదట నొప్పిగా అనిపిస్తుంది, కానీ ఆ బాధ సదాకాలికంగా నొప్పి లేకుండా చేయటానికి నిమిత్తమౌతుంది. కానీ వారు అర్థంచేసుకోకుండా వీరు ఇంకా నొప్పి కలిగిస్తున్నారు అని అరుస్తారు. కానీ ఆ నొప్పిలోనే మందు దాగి ఉంటుంది. అదేవిధంగా భలే అది విఘ్నంగా కనిపిస్తుంది, మీకు ఆ ఆత్మ విఘ్నకారి ఆత్మగా కనిపిస్తుంది కానీ సదాకాలికంగా విఘ్నాలు దాటించడానికి నిమిత్తంగా, అచంచలంగా చేయడానికి ఆ ఆత్మే నిమిత్తం అవుతుంది. అందువలనే సదా నిర్విఘ్నసేవాధారినే సత్యమైన సేవాధారి అంటారు. ఈ విధమైన శ్రేష్టరేఖ కలిగిన వారినే సత్యమైన సేవాధారి అంటారు. సేవలో సదా స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి మరియు స్వచ్ఛమైన కర్మ - సఫలతకి సహజ ఆధారం. ఏదైనా సేవాకార్యం ప్రారంభించే ముందు పరిశీలించుకోండి - బుద్ధిలో ఏ ఆత్మ గురించి అయినా స్వచ్చతకి బదులు ఒకవేళ జరిగిపోయిన విషయాలు స్మృతి ఉంటే అదే వృత్తి మరియు దృష్టి ద్వారా చూడటం, మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు స్వచ్చత ద్వారా సేవలో ఏదైతే సంపూర్ణ సఫలత రావాలో అది రావటం లేదు. జరిగిపోయిన విషయాలు లేదా వృత్తులు మొదలైనవి అన్నీ సమాప్తి చేయటమే స్వచ్ఛత. జరిగిపోయిన వాటి గురించి సంకల్పం చేయటం కూడా పాపమే కానీ తక్కువ శాతం. సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది. వర్ణన చేయటం అనేది చాలా పెద్ద విషయం కానీ సంకల్పం చేయటం ద్వారా కూడా పాత సంకల్పం యొక్క సృష్టి మరియు వాతావరణాన్ని కూడా ఆవిధంగా తయారుచేసేస్తుంది. మరలా ఆ తర్వాత నేను ఏమి చెప్పానో అదే అయ్యింది కదా అంటారు. కానీ ఎందుకు అలా అయ్యింది? మీ యొక్క బలహీన మరియు వ్యర్థ సంకల్పం అనేది వ్యర్ధ వాయుమండలం యొక్క సృష్టిని తయారు చేసింది. అందువలనే సదా సత్యమైన సేవాధారి అంటే పాత తరంగాలను సమాప్తి చేసేవారు. ఎలా అయితే వైజ్ఞానికులు శస్త్రంతో శస్త్రాన్ని సమాప్తి చేస్తున్నారు, ఒక విమానంతో రెండవ విమానాన్ని పడేస్తున్నారు. ఇలా యుద్ధం చేసి సమాప్తి చేసేస్తున్నారు కదా! అలాగే మీ శుద్ద తరంగాలు శుద్ధ తరంగాలను ప్రత్యక్షం చేస్తాయి మరియు వ్యర్థ తరంగాలను సమాప్తి చేస్తాయి. సంకల్పం అనేది సంకల్పాన్ని సమాప్తి చేసేస్తుంది. ఒకవేళ మీ సంకల్పం శక్తిశాలిగా ఉంటే సమర్ధ సంకల్పం అనేది వ్యర్థాన్ని తప్పకుండా సమాప్తి చేసేస్తుంది. అర్థమైందా? సేవలో మొదట స్వచ్చత అంటే పవిత్రత శక్తి కావాలి. ఈ 3 రేఖలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. సేవా విశేషత యొక్క అనేక విషయాలు విన్నారు. అన్ని విషయాల యొక్క సారం - నిస్వార్థ, నిర్వికల్ప స్థితిలో సేవ చేయటమే సఫలతకి ఆధారం. ఈ సేవలో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవ లేకుండా సంఘటన ఉండదు. సంఘటనలో రకరకాల విషయాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు, సాధనాలు - ఇవన్నీ ఉంటాయి. చాలా విషయాలు వస్తాయి కూడా కానీ రకరకాల సాధనల గురించి వింటున్నా కానీ మీరు మాత్రం అనేకాన్ని ఒకే బాబా స్మృతిలో కలిపేసేవారిగా మరియు ఏకరసస్థితి కలిగినవారిగా ఉండండి. ఇప్పుడు ఏమి చేయాలి, చాలా ఆలోచనలు అయిపోయాయి, ఎవరిది అంగీకరించాలి, ఎవరిది అంగీకరించకూడదు? ఇలా అనేకతలో ఎప్పుడూ అయోమయం అయిపోకండి. నిస్వార్థంగా మరియు నిర్వికల్పభావంతో నిర్ణయం చేస్తే ఎప్పుడూ ఎవరికీ ఏ వ్యర్థసంకల్పం రాదు. ఎందుకంటే సేవ లేకుండా కూడా ఉండలేరు మరియు స్మృతి లేకుండా కూడా ఉండలేరు. అందువలన సేవని కూడా పెంచుకుంటూ వెళ్ళండి మరియు స్వయాన్ని కూడా స్నేహం, సహయోగం మరియు నిస్వార్ధభావంతో ముందుకి నడిపించుకుంటూ వెళ్ళండి. అర్థమైందా! 

బాప్ దాదాకి సంతోషంగా ఉంది దేశ విదేశాలలో చిన్నవారు, పెద్దవారు అందరూ ఉత్సాహ, ఉల్లాసాలతో సేవ యొక్క రుజువు చూపించారు. విదేశం యొక్క సేవ కూడా సఫలతాపూర్వకంగా సంపన్నం అయ్యింది మరియు దేశంలో కూడా అందరి సహయోగం ద్వారా సర్వకార్యాలు సంపన్నం అయ్యాయి మరియు సఫలం అయ్యాయి. బాప్ దాదా పిల్లల సేవ యొక్క సంలగ్నత చూసి సంతోషిస్తున్నారు. బాబాని ప్రత్యక్షం చేయాలి అనే లక్ష్యం అందరికీ మంచిగా ఉంది మరియు బాబా యొక్క స్నేహంలో శ్రమని కూడా ప్రేమలోకి మార్చు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం చూపించారు. విశేషసేవకు నిమిత్తమైన పిల్లలందరూ వచ్చారు. బాప్ దాదా కూడా " ఓహో పిల్లలు” ఓహో అనే పాట పాడుతున్నారు. అందరు మంచిగా చేసారు. కొందరు చేసారు, కొందరు చేయలేదు అనేది లేదు. చిన్న స్థానం అయినా, పెద్ద స్థానం అయినా అందరూ మంచిగా సేవ చేసారు. కానీ చిన్న స్థానం వారు కూడా తక్కువగా చేయలేదు. సర్వుల శ్రేష్ఠభావనలు మరియు శ్రేష్టకామనల ద్వారా కార్యం మంచిగా జరిగింది మరియు సదా మంచిగా జరుగుతుంది. సమయాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు మరియు సంకల్పాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు. ప్లాన్ తయారుచేసారంటే సంకల్పం చేసారు కదా! శారీరకశక్తిని కూడా ఉపయోగించారు, ధనశక్తిని కూడా ఉపయోగించారు మరియు సంఘటనాశక్తిని కూడా ఉపయోగించారు. సర్వశక్తుల ఆహుతితో సేవాయజ్ఞం రెండు వైపుల (దేశ,విదేశాలలో) సఫలం అయ్యింది. చాలా మంచి కార్యం.మంచిగా చేసారా, చేయలేదా అనే ప్రశ్నే లేదు. సదా మంచిగా ఉంది మరియు సదా మంచిగానే ఉంటుంది. మల్టీమిలియన్ పీస్ కార్యక్రమం చేశారు మరియు గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం చేశారు, రెండు కార్యాలు చాలా సుందరంగా ఉన్నాయి. ఏ విధితో చేసారో ఆ విధి కూడా బావుంది. అక్కడక్కడ వస్తువు యొక్క విలువను పెంచటానికి ఆ వస్తువుని పరదాలో ఉంచుతారు. పరదా దాని విలువని మరింత పెంచుతుంది. అది ఏమిటో చూడాలి, పరదా లోపల ఏదో ఉంది అనే జిజ్ఞాస వస్తుంది. కానీ ఈ పరదాయే ప్రత్యక్షతా పరదా అవుతుంది. ఇప్పుడు భూమిని తయారుచేసారు. భూమిలో బీజాన్ని నాటేటప్పుడు లోపల పెట్టి పాతుతారు. బీజాన్ని బయటికి ఉంచరు, లోపల పెట్టి పాతుతారు. ఆ గుప్త బీజానికి ప్రత్యక్ష స్వరూపంగా వృక్షం మరియు ఫలాలు వస్తాయి. కనుక ఇప్పుడు బీజం వేసారు కనుక వృక్షం అనేది బయట వేదికపైకి స్వతహాగానే వస్తుంది. సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా? ఓహో బాబా! అని అంటున్నారు కానీ ఓహో సేవ! అని కూడా అంటున్నారు. మంచిది. బాప్ దాదా అయితే సమాచారం అంతా చెప్పారు.

Comments