20-02-1986 అవ్యక్త మురళి

20-02-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“ఎగిరే కళ ద్వారా సర్వులకు మేలు”

ఈ రోజు విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు డబల్ అభినందనలు తెలిపేందుకు వచ్చాము. ఒకటి - దూరదేశంలో భిన్న ధర్మాలలోకి వెళ్ళినా కానీ భారతదేశంలో సమీపంగా ఉన్న అనేక ఆత్మల కంటే త్వరగా తండ్రిని గుర్తించారు. తండ్రిని గుర్తించినందుకు అనగా తమ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు అభినందనలు. రెండవది - ఎలాగైతే తీవ్ర వేగంతో గుర్తించారో అంతే తీవ్ర వేగంతో స్వయాన్ని సేవలో పెట్టారు. కావున సేవలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్తున్నందుకు రెండవ అభినందనలు. సేవలో వృద్ధి తీవ్ర వేగంతో జరుగుతుంది. ఇకముందు కూడా డబల్ విదేశీ పిల్లలు విశేష కార్యము కొరకు నిమిత్తంగా అవ్వాలి. భారతదేశంలో విశేషంగా నిమిత్తమైన ఆదిరత్నాలు స్థాపనా కార్యంలో చాలా దృఢమైన పునాదిగా అయ్యి స్థాపనా కార్యాన్ని చేశారు మరియు డబల్ విదేశీ పిల్లలు నలువైపులా శబ్దాన్ని వ్యాపింపజేయడంలో తీవ్ర వేగంతో సేవ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. కావున పిల్లలందరూ రావటంతోనే, జన్మించటంతోనే చాలా త్వరగా సేవలో ముందుకు వెళ్తున్నందుకు వారికి బాప్ దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. కొద్ది సమయంలోనే సేవను భిన్న-భిన్న దేశాలకు విస్తరింపజేశారు. కావున శబ్దాన్ని వ్యాపింపజేసే కార్యము సహజంగా వృద్ధి చెందుతూ ఉంది. కనుక సదా డబల్ లైట్ గా అయ్యి, డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు, సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తి చేసుకునే తీవ్ర పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఈ రోజు విశేషంగా కలుసుకునేందుకు వచ్చాము. అందరి హృదయాలలో సంతోషపు వాయిద్యాలు మ్రోగుతూ ఉండడం బాప్ దాదా చూస్తున్నారు. పిల్లల సంతోషంతో కూడిన రాగాలు మరియు సంతోషపు గీతాలు బాప్ దాదాకు వినిపిస్తున్నాయి. స్మృతి మరియు సేవలో చాలా ప్రేమతో ముందుకు వెళ్తున్నారు. స్మృతి కూడా ఉంది, సేవ కూడా ఉంది కానీ ఇప్పుడు అదనంగా ఏమి జరగాలి? రెండూ ఉన్నాయి కానీ సదా రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ స్వయానికి మరియు సేవలో తండ్రి ఆశీర్వాదాల అనుభవజ్ఞులుగా చేస్తుంది. సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి. ఇప్పుడింకా సేవలో స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ను ఉంచడం ద్వారా విశ్వంలో ఎక్కువ శబ్దము బిగ్గరగా ప్రతిధ్వనిస్తుంది. విస్తారమును చాలా బాగా చేశారు. విస్తారం తర్వాత ఏమి చేయడం జరుగుతుంది? విస్తారంతో పాటు ఇప్పుడిక సేవ యొక్క సారముగా ఎటువంటి విశేష ఆత్మలను నిమిత్తంగా చేయాలంటే ఆ విశేష ఆత్మలు భారతదేశంలోని విశేష ఆత్మలను మేల్కొల్పాలి. ఇప్పుడు భారతదేశంలో కూడా సేవ యొక్క రూపురేఖలు సమయానుసారంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. నేతలు, ధర్మనేతలు, వీరితో పాటు అభినేతలు (నటులు) కూడా సంపర్కంలోకి వస్తున్నారు. ఇంకా ఎవరు రావాలి? సంపర్కంలోకి అయితే వస్తున్నారు, నేతలు కూడా వస్తున్నారు. కానీ విశేషంగా రాజకీయ నేతలకు కూడా సమీప సంపర్కములోకి రావాలనే సంకల్పము తప్పకుండా ఉత్పన్నమవ్వాలి.

డబల్ విదేశీ పిల్లలు అందరూ ఎగిరేకళలోకి వెళ్తున్నారు కదా! ఎక్కేకళలోనివారు కాదు కదా. ఎగిరేకళ ఉందా? ఎగిరేకళలో ఉండడం అనగా సర్వులకు మేలు జరగడము. ఎప్పుడైతే పిల్లలందరూ ఏకరసమైన ఎగిరేకళలోకి వస్తారో, అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది అనగా పరివర్తన కార్యము సంపన్నమవుతుంది. ఇప్పుడు ఎగిరేకళ ఉంది కానీ ఎగరడంతో పాటు స్టేజేస్ (స్థితులు) కూడా ఉన్నాయి. ఒక్కోసారి చాలా మంచి స్థితి ఉంటుంది. ఒక్కోసారి స్థితి కోసం పురుషార్థము చేయవలసిన స్థితి ఉంటుంది. సదాకాలము మరియు మెజారిటీ వారి ఎగిరేకళ ఉండటం అనగా సమాప్తి జరగటము. ఇప్పుడు ఎగిరేకళయే శ్రేష్ఠమైన స్థితి అని పిల్లలందరికీ తెలుసు. ఎగిరేకళయే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే స్థితి. ఎగిరేకళయే దేహములో ఉంటూ దేహము నుండి భిన్నంగా మరియు సదా తండ్రికి మరియు సేవలో ప్రియంగా ఉండే స్థితి. ఎగిరేకళయే విధాత మరియు వరదాత స్టేజి యొక్క స్థితి. ఎగిరేకళయే నడుస్తూ-తిరుగుతూ ఫరిస్తా మరియు దేవత, రెండు రూపాలను సాక్షాత్కారము చేయించే స్థితి.

ఎగిరేకళ సర్వాత్మలను బికారితనము నుండి విడిపించి తండ్రి వారసత్వానికి అధికారిగా చేస్తుంది. మా ఆత్మలందరి ఇష్ట దేవులు మరియు దేవీలు మరియు నిమిత్తంగా అయిన అనేక దేవతలెవరైతే ఉన్నారో, వారందరూ ఈ భూమిపై అవతరించేశారని ఆత్మలందరూ అనుభవం చేసుకుంటారు. సత్యయుగంలో అయితే అందరూ సద్గతిలో ఉంటారు కానీ ఈ సమయంలో ఏ ఆత్మలైతే ఉన్నారో వారు అందరి సద్గతి దాతలుగా ఉంటారు. ఏదైనా డ్రామా సమాప్తమవుతున్నప్పుడు చివరిలో పాత్రధారులందరూ స్టేజ్ పైకి వస్తారు కదా. అలా ఇప్పుడు ఈ కల్పము యొక్క డ్రామా సమాప్తమయ్యే సమయం వస్తూ ఉంది. విశ్వంలోని ఆత్మలందరికీ, స్వప్నములో కావచ్చు లేక ఒక సెకండు దర్శనం ద్వారా కావచ్చు లేక నలువైపుల నుండి వెలువడే శబ్దము ద్వారా కావచ్చు, ఈ డ్రామాలోని హీరో పాత్రధారులు స్టేజిపై ప్రత్యక్షమయ్యారని, ధరిత్రిని ఉద్ధరించే నక్షత్రాలు భూమిపై ప్రత్యక్షమయ్యారని తప్పకుండా సాక్షాత్కారమవుతుంది. అందరూ తమ తమ ఇష్ట దేవతలను ప్రాప్తి చేసుకొని చాలా సంతోషిస్తారు. ఆధారము లభిస్తుంది. డబల్ విదేశీయులు కూడా ఇష్ట దేవీ దేవతలలో ఉన్నారు కదా! లేక గోల్డెన్ జూబ్లీకి చెందినవారా? మీరు కూడా అందులో ఉన్నారా లేక చూసేవారా? ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ దృశ్యాన్ని చూసారు కదా! ఇప్పుడు ఈ రమణీకమైన పాత్రను అభినయించారు. కానీ ఫైనల్ దృశ్యము జరిగినప్పుడు, అందులో మీరు సాక్షాత్కారము చేయించేవారిగా ఉంటారా లేక చూసేవారిగా ఉంటారా? ఎలా ఉంటారు? మీరు హీరో పాత్రధారులు కదా. ఆ దృశ్యమెలా ఉంటుందో ఇప్పుడు ఇమర్జ్ చేసుకోండి. ఈ అంతిమ దృశ్యము కొరకు త్రికాలదర్శులుగా అయ్యి ఆ దృశ్యము ఎంత సుందరంగా ఉంటుందో, అందులో మీరు ఎంత సుందరంగా ఉంటారో ఇప్పటి నుండే చూడండి. అలంకరింపబడిన దివ్యగుణ మూర్తులైన ఫరిస్తా సో దేవతలుగా ఉంటారు. అందుకు ఇప్పటి నుండే స్వయం సదా ఫరిస్తా స్థితిని అభ్యాసం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. నాలుగు విశేషమైన సబ్జెక్టులున్నాయి కదా - జ్ఞానమూర్తి, నిరంతర స్మృతి మూర్తి, సర్వ దివ్య గుణమూర్తి. ఒక్క దివ్య గుణము లోపించినా 16 కళా సంపూర్ణులని అనరు. 16 కళలు, సర్వము మరియు సంపూర్ణము, ఈ మూడింటికీ మహిమ ఉంది. సర్వగుణ సంపన్నము, సంపూర్ణ నిర్వికారి మరియు 16 కళా సంపన్నమని అంటారు. మూడు విశేషతలూ ఉండాలి. 16 కళలు అనగా సంపన్నంగానూ ఉండాలి, సంపూర్ణంగానూ ఉండాలి. అంతేకాక సర్వమూ ఉండాలి. కనుక ఇది చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం బహుకాలపు లెక్కలో జమ అవుతుందని, తర్వాత ఈ లెక్క సమాప్తమైపోతుందని వినిపించాము కదా. తర్వాత బహుకాలపు లెక్క సమాప్తమైపోతుంది. కొంత సమయపు లెక్క అని అనబడుతుంది, చాలాకాలపు లెక్కలోకి రాదు. కనుక ఇప్పుడు చాలాకాలపు పురుషార్థుల లైనులోకి వచ్చేయండి. అప్పుడే బహుకాలపు రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అధికారులుగా అవుతారు. 2-4 జన్మలు తక్కువైనా బహుకాలములో లెక్కించబడరు. మొదటి జన్మ ఉండాలి మరియు ప్రకృతికి చెందిన మొట్టమొదటి శ్రేష్ఠమైన సుఖముండాలి. వన్-వన్-వన్ గా ఉండాలి. అన్నిటిలో వన్గా ఉండాలి. అందుకు ఏం చెయ్యాల్సి ఉంటుంది? సేవ కూడా నంబరువన్ గా ఉండాలి, స్థితి కూడా నంబరువన్ గా ఉండాలి. అప్పుడే సదా వన్-వన్ లోకి వస్తారు కదా. కనుక సత్యయుగం ఆదిలో వచ్చే నంబరువన్ ఆత్మతో పాటు పాత్రను అభినయించేవారు మరియు నంబరువన్ జన్మలో పాత్రను అభినయించేవారు. కనుక సంవత్సరం కూడా మీరే ప్రారంభం చేస్తారు. మొట్టమొదటి జన్మ తీసుకునేవారే మొదటి తారీఖు, మొదటి నెల, మొదటి సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. కనుక డబల్ విదేశీయులు నంబరువన్ లో వస్తారు కదా! అచ్ఛా - ఫరిస్తా డ్రస్సును ధరించడం వస్తుంది కదా! ఇది మెరిసే డ్రస్సు. ఈ స్మృతిలో ఉండడం మరియు స్వరూపంగా అవ్వడం అనగా ఫరిస్తా డ్రస్సును ధరించడం. మెరిసే వస్తువు దూరం నుండే ఆకర్షిస్తుంది. కనుక ఈ ఫరిస్తా డ్రస్సు అనగా ఫరిస్తా స్వరూపము, దూర దూరాలలో ఉన్న ఆత్మలను ఆకర్షిస్తుంది. అచ్ఛా.

ఈ రోజు యు.కె. వారి టర్ను. యు.కె. వారి విశేషత ఏమిటి? సత్యయుగములో కూడా లండన్ ను రాజధానిగా చేస్తారా లేక కేవలం విహరించే స్థానంగా చేస్తారా? ఉండేది యునైటెడ్ కింగ్ డమ్ కదా. అక్కడ కూడా కింగ్ డమ్ (రాజ్యాము)ను తయారుచేస్తారా లేక కేవలం కింగులు (రాజులు) వెళ్ళి విహరిస్తారా? అయినా కింగ్ డమ్ అనే అంటారు. ఇప్పుడు సేవకు కింగ్ డమ్ గానే ఉంది. మొత్తం విదేశాల సేవకు నిమిత్త రాజధానిగా ఉండనే ఉంది. కింగ్ డమ్ అనే పేరు సరిగ్గా ఉంది కదా! అందరినీ యునైట్ చేసే (కలిపే) కింగ్ డమ్. ఆత్మలందరినీ తండ్రితో మిలనం చేయించే రాజధాని. యు.కె. వారిని బాప్ దాదా ఓ.కె.గా ఉండేవారని అంటారు. యు.కె. అనగా ఓ.కె.గా ఉండేవారు. ఎప్పుడు ఎవరిని అడిగినాగానీ ఓ.కె., అంతే కదా. ఆ, బాగానే ఉన్నాను అని నిట్టూర్పుతో అనరు కదా. అంతా బాగున్నప్పుడు ఆ, ఓ.కె. అని అంటారు. రెండు ఓ.కె.లకు తేడా ఉంటుంది. మరి సంగమయుగ రాజధాని, సేవా రాజధానిలో రాజ్యసత్తా అనగా రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆత్మలు తయారయ్యేందుకు ప్రేరణ నలువైపులా వ్యాపించాలి. కనుక రాజధానిలో రాజ్య అధికారులను తయారుచేసే రాజ్య-స్థానం అయితే అయింది కదా కావున బాప్ దాదా ప్రతి దేశం యొక్క విశేషతను విశేష రూపంలో గుర్తు చేస్తారు. అంతేకాక విశేషత ద్వారా ముందుకు తీసుకువెళ్తారు. బాప్ దాదా బలహీనతలను చూడరు. కేవలం సూచననిస్తారు. చాలా మంచివారు - మంచివారు అని అంటూ అంటూ చాలా మంచిగా అయిపోతారు. బలహీనంగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు అని అంటే బలహీనంగా అవుతారు. ముందే బలహీనంగా ఉన్నవారిని ఎవరైనా నీవు బలహీనంగా ఉన్నావని అంటే మూర్ఛితులవుతారు. ఎంత మూర్ఛితులుగా ఉన్నా వారికి శ్రేష్ఠ స్మృతి అనే, విశేషతల స్మృతి అనే, సంజీవని మూలికను తినిపిస్తే మూర్ఛితుల నుండి మెలుకువలోకి వస్తారు. సంజీవని మూలిక అందరి వద్ద ఉంది కదా. కనుక విశేషతల స్వరూపమనే దర్పణాన్ని వారి ముందు ఉంచండి ఎందుకంటే ప్రతి బ్రాహ్మణ ఆత్మ విశేషమైనదే. కోట్లలో కొద్దిమంది కదా. మరి విశేషమైనవారే కదా! కేవలం ఆ సమయంలో తమ విశేషతను మర్చిపోతారు. వారికి స్మృతి ఇప్పిస్తే విశేష ఆత్మగా తప్పకుండా అవుతారు. విశేషతలను ఎంతగా వర్ణిస్తారో, అంతగా వారికి తమలోని బలహీనతలు ఇంకా ఎక్కువగా, స్పష్టంగా అనుభవమవుతాయి. మీరు అనుభవం చేయించే అవసరముండదు. మీరు ఎవరికైనా వారి బలహీనతలను వినిపిస్తే, వారు వాటిని దాచి పెడతారు. నేను అటువంటివాడిని కాను అని తోసిపుచ్చుతారు. మీరు వారి విశేషతలను వినిపించండి. ఎంతవరకైతే స్వయానికి స్వయమే బలహీనతలను అనుభవం చేయరో, అంతవరకు పరివర్తన చేసుకోలేరు. మీరు 50 సంవత్సరాలు శ్రమించినా వారు పరివర్తన అవ్వలేరు. కావున ఈ సంజీవని మూలికతో మూర్ఛితులైన వారిని కూడా మేల్కొలిపి ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. యు.కె. వారు ఇది చేస్తారు కదా. అచ్ఛా.

లండన్ నుండి వేరు వేరు స్థానాలకు ఎంతమంది వెళ్ళారు? భారతదేశము నుండి అయితే వెళ్ళారు, లండన్ నుండి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా నుండి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా వారు కూడా వృద్ధి చేశారు. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళారు? జ్ఞాన గంగలు ఎంత దూర దూరాలకు ప్రవహిస్తే అంత మంచిది. యు.కె., ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? (అందరూ తమ తమ సంఖ్యను తెలిపారు).

అంటే వృద్ధిని ప్రాప్తి చేస్తున్నారు. ఇంకా ఏదైనా విశేష స్థానము మిగిలి ఉందా? (చాలా ఉన్నాయి). అచ్ఛా, వాటి కొరకు కూడా ప్లాన్ చేస్తున్నారు కదా. చాలా సహజంగా సెంటర్లు తెరవచ్చు అనే లిఫ్టు విదేశాలకు ఉంది. లౌకిక సేవను కూడా చేయగలరు, మరియు అలౌకిక సేవకు కూడా నిమిత్తులుగా అవ్వగలరు. భారతదేశంలో ఆహ్వానంపై సెంటర్ ను స్థాపించే విశేషత ఉంది కానీ విదేశాలలో స్వయానికి స్వయమే ఆహ్వానం ఇచ్చుకుంటారు. ఆహ్వానించేవారూ వారే, చేరుకునేవారు కూడా వారే. ఇది కూడా సేవలో సహజంగా వృద్ధి చెందేందుకు ఒక లిఫ్ట్ వారికి లభించింది. ఎక్కడకు వెళ్ళినాగానీ ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ స్థాపనకు నిమిత్తులుగా అవ్వగలరు మరియు అవుతూ ఉంటారు. గిఫ్ట్ అనండి, లిఫ్ట్ అనండి, ఇది డ్రామానుసారముగా లభించింది. ఎందుకంటే కొద్ది సమయంలోనే సేవను సమాప్తం చేయాలి కనుక వేగం తీవ్రంగా ఉండాలి. అప్పుడే సమయానికి సమాప్తమవుతుంది. భారతదేశంలోని విధికి, విదేశాలలోని విధికి వ్యత్యాసముంది కావున విదేశాలలో వృద్ధి త్వరగా జరుగుతూ ఉంది మరియు జరుగుతూ ఉంటుంది. ఒకే రోజులో చాలా సెంటర్లు తెరవవచ్చు. నలువైపులా విదేశాలలో నిమిత్తంగా ఉండే విదేశీయులకు సేవ చేసేందుకు సహజ అవకాశముంది. భారతీయులను చూడండి, వీసా కూడా కష్టంగా లభిస్తుంది. కనుక అక్కడ ఉండేవారే అక్కడి సేవకు నిమిత్తంగా అయ్యే ఛాన్స్ ఉంది. కావున సేవకు అవకాశముంది. ఎలాగైతే లాస్టు నుండి ఫాస్టుగా వెళ్ళేందుకు ఛాన్స్ ఉందో, అలా సేవ ఛాన్స్ కూడా ఫాస్టుగా లభించింది కనుక నేను ఆలస్యంగా వచ్చాను అన్న ఫిర్యాదు ఇక ఉండదు. ఆలస్యంగా వచ్చినవారికి ఫాస్టుగా వెళ్ళే అవకాశము కూడా విశేషంగా లభించి ఉన్నది కావున ప్రతి ఒక్కరూ సేవాధారియే. అందరూ సేవాధారులేనా లేక సెంటర్లో ఉండేవారే సేవాధారులా? ఎక్కడ ఉన్నా సేవ లేకపోతే ప్రశాంతత ఉండదు. సేవయే సుఖమైన నిద్ర. సుఖంగా నిదురించుటయే జీవితమని అంటారు. సేవయే సుఖమైన నిద్ర అనండి, సుఖంగా పడుకోవడం అనండి. సేవ లేకుంటే ప్రశాంతమైన నిద్ర ఉండదు. సేవ అంటే కేవలం వాచా సేవయే కాదు, ప్రతి సెకండు సేవ అని వినిపించాము కదా. ప్రతి సంకల్పంలో సేవ ఉంది. ఎవ్వరూ కూడా ఇలా అనలేరు - భారతవాసీయులు కావచ్చు, విదేశాలలో ఉండేవారు కావచ్చు, సేవకు అవకాశము లేదని బ్రాహ్మణులెవ్వరూ అనలేరు. అనారోగ్యంతో ఉన్నా కూడా మనసా సేవను, వాయుమండలాన్ని తయారుచేసే సేవను, వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవను, వీటినైతే చేయగలరు కదా. ఏ విధమైన సేవ అయినా చేయండి కానీ సేవలోనే ఉండాలి. సేవయే జీవితం. బ్రాహ్మణులంటేనే సేవాధారులు అని అర్థం. అచ్ఛా!

సదా ఎగిరేకళ ద్వారా సర్వులకు మేలు అనే స్థితిలో ఉండేవారు, సదా స్వయాన్ని ఫరిస్తాగా అనుభవం చేసేవారు, సదా విశ్వం ముందు ఇష్టదేవతల రూపంలో ప్రత్యక్షమయ్యేవారు, దేవాత్మలు, సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ఇతరులకు కూడా విశేషతలను అనుభవం చేయించేవారు, విశేష ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:- సదా స్వయాన్ని కర్మయోగులుగా అనుభవం చేస్తున్నారా? కర్మయోగీ జీవితం అనగా ప్రతి పని చేస్తూ స్మృతియాత్రలో ఉండటము. ఈ శ్రేష్ఠమైన కార్యాన్ని శ్రేష్ఠమైన తండ్రి పిల్లలు మాత్రమే చేస్తారు మరియు సదా సఫలతను పొందుతారు. మీరందరూ కర్మయోగీ ఆత్మలే కదా. కర్మలలో ఉంటూ అతీతంగా, ప్రియంగా ఉంటూ సదా ఇదే అభ్యాసంతో స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. స్వయంతో పాటు విశ్వం యొక్క బాధ్యత అందరిపై ఉంది. కానీ ఇవన్నీ స్థూల సాధనాలు. కర్మయోగీ జీవితం ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి మరియు అందరినీ ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఈ జీవితమే అతి ప్రియమైన జీవితం. సేవ కూడా ఉండాలి, సంతోషం కూడా ఉండాలి. రెండూ కలిసి ఉంటే బాగుంటుంది కదా. ఇది అందరి గోల్డెన్ జూబ్లీ. గోల్డెన్ అనగా సతోప్రధాన స్థితిలో స్థితి అయ్యి ఉండేవారు. కనుక సదా స్వయాన్ని ఈ శ్రేష్ఠమైన స్థితి ద్వారా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అందరూ సేవను బాగా చేశారు కదా! సేవ చేసే అవకాశము కూడా ఇప్పుడు మాత్రమే లభిస్తుంది, తర్వాత ఈ అవకాశము సమాప్తమైపోతుంది. కనుక సదా సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా -

Comments