19-11-1989 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘తనువు, మనసు, ధనము మరియు జనము యొక్క భాగ్యము’’
ఈ రోజు సత్యమైన సాహెబ్ తమ కుమారులను మరియు కుమార్తెలను చూస్తున్నారు. తండ్రిని ‘సత్యము’ అని అంటారు. అందుకే, బాప్ దాదా ద్వారా స్థాపించబడిన యుగము పేరు కూడా సత్యయుగము. తండ్రిని మహిమ చేయడం కూడా - సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు అని అంటూ మహిమ చేస్తారు. సత్యతకు సదా శ్రేష్ఠమైన మహిమ ఉంది. మీరంతా సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణులుగా అయ్యేందుకు సత్యమైన కథను వింటున్నారు. ఇటువంటి సత్యమైన సాహెబ్, తన పిల్లల్లో ఎంతమంది సత్యమైన సాహెబ్ ను రాజీ చేసుకున్నారు అనేది చూస్తున్నారు. సత్యమైన సాహెబ్ కు గల అన్నిటికంటే గొప్ప విశేషత ఏమిటంటే - వారు దాత, విధాత, వరదాత. రాజీగా ఉండే పిల్లల గుర్తు ఏమిటంటే - దాత సదా వారిపై రాజీగా ఉంటారు. కావున ఇటువంటి ఆత్మలు సదా స్వయాన్ని జ్ఞాన ఖజానాలు, శక్తుల ఖజానాలు, గుణాల ఖజానాలు, అలా అన్ని ఖజానాలతో నిండుగా ఉన్నట్లు అనుభవం చేస్తారు. వారు స్వయాన్ని ఎప్పుడూ కూడా ఖజానాలు లేకుండా ఖాళీగా ఉన్నట్లుగా భావించరు. వారు ఏ గుణముతో గాని, శక్తితో గాని, జ్ఞానము యొక్క గుహ్యమైన రహస్యాలతో గాని వంచితులుగా ఉండరు. గుణాలలో లేక శక్తులలో శాతము ఉండవచ్చు కానీ ఏ గుణమైనా లేక శక్తి అయినా అసలు ఆత్మలో లేనే లేకుండా ఉండడమనేది అసంభవము. సమయ ప్రమాణంగా చాలామంది పిల్లలు - నాలో మిగిలిన శక్తులన్నీ ఉన్నాయి గాని ఫలానా శక్తి లేక గుణము లేదు అని అంటారు. ‘లేదు’ అనే పదము నిషిద్ధము. ఇటువంటి దాత పిల్లలు సదా ధనవంతులుగా ఉంటారు అనగా నిండుగా మరియు సంపన్నంగా ఉంటారు. రెండవ మహిమ ‘భాగ్యవిధాత’. భాగ్యవిధాత అయిన సాహెబ్ ను రాజీ చేసుకున్న వారి గుర్తు ఏమిటంటే - ఇటువంటి మాస్టర్ భాగ్యవిధాత పిల్లల మస్తకంపై సదా భాగ్యపు సితార మెరుస్తూ ఉంటుంది అనగా వారి మూర్తి మరియు ముఖము నుండి సదా ఆత్మిక మెరుపు కనిపిస్తూ ఉంటుంది. వారి మూర్తి నుండి సదా రాజీగా ఉండే ఫీచర్స్ కనిపిస్తాయి. వారు ముఖము ద్వారా సదా ఆత్మిక గుణము అనుభవమవుతుంది. దీనిని మస్తకంలో మెరుస్తున్న భాగ్యపు సితార అని అంటారు. ప్రతి విషయంలోనూ తనువు, మనసు, ధనము, జనము - ఈ నాలుగు రూపాల్లోనూ తమ భాగ్యాన్ని అనుభవం చేస్తారు. ఇందులో ఏ ఒక్క భాగ్యము కూడా తక్కువగా ఉన్నట్లు అనుభవం చేయరు. నా భాగ్యంలో మూడు విషయాలు బాగున్నాయి కానీ ఒక్కటి తక్కువగా ఉందని అనరు.
తనువు యొక్క భాగ్యము - శారీరక లెక్కాచారము ప్రాప్తి లేక పురుషార్థ మార్గంలో ఎప్పుడూ విఘ్నముగా అనుభవమవ్వదు. తనువు ఎప్పుడూ సేవ నుండి వంచితం కానివ్వదు. కర్మను భోగించే సమయంలో కూడా ఇటువంటి భాగ్యశాలురు ఏదో ఒక రకంగా సేవకు నిమిత్తంగా అవుతారు. కర్మభోగాన్ని నడిపిస్తారు కానీ కర్మభోగానికి వశమై అరవరు. అరవడం అనగా కర్మభోగాన్ని పదే-పదే వర్ణించడము లేక పదే-పదే కర్మభోగం వైపు బుద్ధిని, సమయాన్ని వెచ్చించడము. చిన్న విషయాన్ని చాలా విస్తారం చేయడము - దీన్ని అరవడం అని అంటారు. పెద్ద విషయాన్ని జ్ఞాన సారంతో సమాప్తం చేయడము - దీన్ని నడిపించడం అని అంటారు. కనుక సదా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి - యోగీ జీవితం కొరకు, కర్మభోగం చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు, దానిని వర్ణించకండి, కర్మభోగం యొక్క కథను విస్తారం చేయకండి ఎందుకంటే వర్ణించడంలో సమయం మరియు శక్తి అటు వైపే ఉన్న కారణంగా హెల్త్ కాన్షస్ గా అవుతారు, సోల్ కాన్షస్ గా ఉండరు. ఈ హెల్త్ కాన్షస్ నెస్ మెల్లమెల్లగా ఆత్మిక శక్తి నుండి నర్వస్ గా చేస్తుంది. అందుకే, ఎప్పుడూ ఎక్కువగా వర్ణించకండి. యోగీ జీవితం కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేస్తుంది. ఇవి తనువు యొక్క భాగ్యానికి గుర్తులు.
మనసు యొక్క భాగ్యము - మనసు సదా హర్షితంగా ఉంటుంది. ఎందుకంటే హర్షితంగా ఉండడమే భాగ్యము ప్రాప్తించినదానికి గుర్తు. ఎవరైతే నిండుగా ఉంటారో, వారు సదా మనసుతో చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. మనసు యొక్క భాగ్యము కలవారు సదా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి (కోరిక అంటే ఏమిటో తెలియని స్థితి) కలవారిగా ఉంటారు. భాగ్యవిధాత రాజీగా ఉన్న కారణంగా, సర్వ ప్రాప్తుల సంపన్నతను అనుభవం చేస్తున్న కారణంగా వారి మనసు ఏ వ్యక్తి లేక వస్తువు వైపు ఆకర్షించబడదు లేక వంగదు. దీనినే సార రూపంలో ‘‘మన్మనాభవ’’ అని అంటారు. మనసును తండ్రితో జోడించడంలో ఎలాంటి కష్టము ఉండదు. వారి మనసు సహజంగానే బాబా ప్రేమ ప్రపంచంలో ఉంటుంది. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు - ఈ అనుభూతినే మనసు యొక్క భాగ్యమని అంటారు.
ధనము యొక్క భాగ్యము - జ్ఞాన ధనమైతే ఉండనే ఉంది కానీ స్థూల ధనానికి కూడా మహత్వముంది. ధనము యొక్క భాగ్యము అనగా బ్రాహ్మణ జీవితంలో లక్షలకు లేక కోట్లకు అధికారులుగా అవుతారని కాదు కానీ సంగమయుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు తినడానికి, త్రాగడానికి మరియు ప్రశాంతంగా ఉండడానికి ఎంత అవసరమో అంత ప్రశాంతంగా లభిస్తుంది. అంతేకాక సేవ కొరకు కూడా ధనం కావాలి కదా. సేవ కొరకు కూడా ఎప్పుడూ సమయానికి తక్కువైనట్లుగా లేక పెనుగులాటను అనుభవం చేయరు. ఎలాగైనా సరే, ఎక్కడో ఒక చోట నుండి సేవ చేసే సమయానికి భాగ్యవిధాత అయిన తండ్రి ఎవరో ఒకరిని తప్పకుండా నిమిత్తంగా చేస్తారు. ధనము యొక్క భాగ్యము కలవారు ఎప్పుడూ పేరు-ప్రతిష్ఠల కోరికతో సేవ చేయరు. ఒకవేళ పేరు-ప్రతిష్ఠలు కావాలనే కోరిక ఉంటే, అటువంటి సమయంలో భాగ్యవిధాత సహయోగం ఇప్పించరు. అవసరానికి మరియు కోరికకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. సత్యమైన అవసరము ఉంటే మరియు సత్యమైన మనసు ఉంటే, ఎలాంటి సేవా కార్యమైనా, ఆ కార్యము తప్పకుండా సఫలమవుతుంది, అంతేకాక భండారా ఇంకా నిండుగా అవుతుంది, ఇంకా మిగులుతుంది కూడా. అందుకే, ‘శివుని భండారా మరియు భండారీ సదా నిండుగా ఉంటాయి’ అనే మహిమ ఉంది. కనుక సత్యమైన మనసు కలవారికి మరియు సత్యమైన సాహెబ్ రాజీ అయ్యారు అన్నదానికి గుర్తు ఏమిటంటే - భండారా కూడా నిండుగా ఉంటుంది, భండారీ కూడా నిండుగా ఉంటుంది. ఇది ధనము యొక్క భాగ్యానికి గుర్తు. విస్తారమైతే చాలా ఉంది కానీ సారంలో వినిపిస్తున్నాము.
నాల్గవది జనము యొక్క భాగ్యము - జనము అనగా బ్రాహ్మణ పరివారము మరియు లౌకిక పరివారము, లౌకిక సంబంధంలో వచ్చే ఆత్మలు లేక అలౌకిక సంబంధంలో వచ్చే ఆత్మలు. కనుక జనము యొక్క భాగ్యము కలవారి మొదటి గుర్తు ఏమిటంటే - జనము యొక్క భాగ్యము కలవారికి జనము ద్వారా సదా స్నేహము మరియు సహయోగము ప్రాప్తిస్తూ ఉంటాయి. కనీసం 95 శాతం ఆత్మల ద్వారా ప్రాప్తి అనేది తప్పకుండా అనుభవమవుతుంది. ఇంతకుముందు కూడా వినిపించాము - మిగిలిన 5 శాతం ఆత్మల యొక్క లెక్కాచారం కూడా సమాప్తమవుతుంది కనుక వారి ద్వారా ఒక్కోసారి స్నేహం లభిస్తుంది, ఒక్కోసారి పరీక్ష వస్తుంది అని. కానీ అటువంటివారు 5 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. అటువంటి ఆత్మలతో కూడా మెల్లమెల్లగా శుభ భావన, శుభ కామనల ద్వారా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటూ ఉండండి. లెక్క సమాప్తమైనప్పుడు ఖాతా కూడా సమాప్తమైపోతుంది కదా! అప్పుడిక లెక్కాచారమే ఉండదు. కనుక భాగ్యశాలి ఆత్మల గుర్తు ఏమిటంటే - జనము ద్వారా మిగిలి ఉన్న లెక్కాచారాన్ని సహజంగా సమాప్తం చేసుకుంటూ ఉండడము, 95 శాతం ఆత్మల ద్వారా సదా స్నేహాన్ని మరియు సహయోగాన్ని అనుభూతి చేస్తూ ఉండడము. జనము యొక్క భాగ్యము కల ఆత్మలు జనము యొక్క సంబంధ-సంపర్కంలోకి వస్తూ సదా ప్రసన్నంగా ఉంటారు. ప్రశ్నచిత్తులుగా ఉండరు, ప్రసన్నచిత్తులుగా ఉంటారు. వీరు ఇలా ఎందుకు చేస్తారు లేక ఇలా ఎందుకు అంటారు, ఇది ఇలా కాదు, ఇలా జరిగి ఉండాలి - అనే ప్రశ్నలు ఎవరి మనసులోనైతే ఉత్పన్నమవుతాయో వారిని ప్రశ్నచిత్తులని అంటారు. ప్రశ్నచిత్తులు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. వారి మనసులో సదా ‘ఎందుకు’ అనే ప్రశ్నల క్యూ ఏర్పడి ఉంటుంది. అందుకే, ఆ క్యూ ను సమాప్తం చేయడంలోనే సమయం గడిచిపోతుంది. అంతేకాక, ఈ క్యూ ఎలా ఉంటుందంటే, దానిని మీరు వదలాలని అనుకున్నా సరే వదల్లేరు, దానికి సమయం ఇవ్వాల్సే వస్తుంది. ఎందుకంటే ఈ క్యూ రచయిత మీరే. రచనను రచించినప్పుడు పాలన చేయాల్సి వస్తుంది. పాలన చెయ్యకుండా తప్పించుకోలేరు. ఎంతగా తప్పదన్నా సరే సమయాన్ని, శక్తిని ఇవ్వాల్సే వస్తుంది. అందుకే, ఈ వ్యర్థ రచనను కంట్రోల్ చేయండి. ఈ బర్త్ కంట్రోల్ చేయండి. అర్థమయిందా? ధైర్యముందా? ఎలాగైతే ప్రపంచంలోని వారు ఇది ఈశ్వరుడిచ్చినది, ఇందులో మా తప్పేమీ లేదని అంటారో, అలా బ్రాహ్మణాత్మలు ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉందని అంటారు. కానీ మీరు డ్రామా యొక్క మాస్టర్ క్రియేటర్లుగా, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయి ప్రతి కర్మను శ్రేష్ఠంగా చేసుకుంటూ వెళ్ళండి. అచ్ఛా!
టీచర్లు విన్నారా! సత్యమైన సాహెబ్ నాపై ఎంత రాజీగా ఉన్నారు - ఈ రహస్యం విన్నారు కదా! రహస్యం విన్నందున టీచర్లందరూ రాజయుక్తంగా అయ్యారా లేక నాకు ఈ భాగ్యం తక్కువగా ఉందని మనసుకు అనిపిస్తుందా? ఒక్కోసారి ధనం విషయంలో ఇబ్బంది, ఒక్కోసారి జనం విషయంలో ఇబ్బంది - అనేటువంటి జీవితాన్ని అనుభవం చేయడం లేదు కదా? విశేషంగా నిమిత్త టీచర్ల కొరకు ఒక స్లోగన్ వినిపించాము కదా, వాస్తవానికి అది అందరి కోసము - ప్రతి విషయంలోనూ తండ్రి శ్రీమతమనుసారంగా ‘జీ హజూర్, జీ హజూర్’ (సరే ప్రభూ, సరే ప్రభూ) అని అంటూ ఉండాలి. పిల్లలు ‘జీ హజూర్’ అని అన్నప్పుడు, తండ్రి పిల్లల ముందు ‘హాజిర్ హజూర్’ (ప్రభువు హాజరు) అని అంటూ హాజరవుతారు. ఎప్పుడైతే ప్రభువు హాజరవుతారో, అప్పుడు ఏ విషయంలోనూ లోటు ఉండదు, సదా సంపన్నులుగా అవుతారు. దాత మరియు భాగ్యవిధాత -ఇరువురి ప్రాప్తుల యొక్క భాగ్యపు సితార మస్తకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. టీచర్లకైతే డ్రామానుసారంగా చాలా భాగ్యం లభించింది. మొత్తం రోజంతా తండ్రి మరియు సేవ తప్ప ఇంకేమి పనుంది! ఇదే మీ వ్యాపారము. ప్రవృత్తిలో ఉన్నవారికైతే ఎన్ని పనులు చూసుకోవాల్సి వస్తుంది. మీకైతే ఒకే పని. మీరు చాలా విషయాలలో స్వతంత్ర పక్షులు. మీ భాగ్యాన్ని అర్థం చేసుకున్నారా? ఏదైనా బంగారు పంజరాన్ని లేక వజ్రాల పంజరాన్ని తయారుచేసుకోరు కదా? స్వయమే తయారుచేసుకుంటారు, అందులో స్వయమే చిక్కుకుంటారు. తండ్రేమో మిమ్మల్ని స్వతంత్ర పక్షులుగా చేసారు, ఎగిరే పక్షులుగా చేసారు. మీరు చాలా-చాలా-చాలా అదృష్టవంతులు. అర్థమయిందా? ప్రతి ఒక్కరికి భాగ్యం యొక్క విశేషత తప్పకుండా లభించింది. ప్రవృత్తి మార్గము వారి విశేషత వేరు, టీచర్ల విశేషత వేరు, గీతా పాఠశాల వారి విశేషత వేరు... ఎవరి విశేషత వారిదే. భిన్న-భిన్న విశేషతలతో అందరూ విశేష ఆత్మలే కానీ సేవాకేంద్రంలో ఉండే నిమిత్త టీచర్లకు చాలా మంచి ఛాన్స్. అచ్ఛా.
సదా అన్ని రకాల భాగ్యాన్ని అనుభవం చేసే అనుభవీ ఆత్మలకు, సదా ప్రతి అడుగులో ‘జీ హజూర్’ అని అంటూ తండ్రి సహాయానికి అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా ప్రశ్నచిత్తులకు బదులుగా ప్రసన్నచిత్తులుగా ఉండేవారు - ఇటువంటి ప్రశంసలకు యోగ్యులైన యోగీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పంజాబ్, హర్యానా, హిమాచల్ గ్రూపు:- అందరూ స్వయాన్ని మహావీరులుగా మరియు మహావీరనీలుగా భావిస్తున్నారా? మహావీరులే కానీ సదా మహావీరులుగా ఉన్నారా? లేక ఒక్కోసారి మహావీరులుగా, ఒక్కోసారి కొద్దిగా బలహీనులుగా అవుతున్నారా? సదా మహావీరులు అంటే సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ లు. జ్ఞానము అంటే లైట్, యోగము అంటే మైట్ కనుక మహావీరులంటే జ్ఞానీ ఆత్మలు కూడా మరియు యోగీ ఆత్మలు కూడా. జ్ఞాన-యోగాలనే రెండు శక్తులతో - లైట్ మరియు మైట్ తో సంపన్నంగా ఉండాలి, వీరినే మహావీరులని అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా జ్ఞానము అనగా లైట్ లోపించకూడదు మరియు మైట్ అనగా యోగము లోపించకూడదు. ఏ ఒక్కటి లోపించినా సరే, పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క సెకండులో పాస్ అవ్వలేరు, సమయం పడుతుంది. పాస్ అవుతారు కానీ సమయానికి పాస్ అవ్వకపోతే, అది పాస్ అయినట్లవుతుందా! ఎలాగైతే స్థూల చదువులో కూడా ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినా సరే, మళ్ళీ ఒక సంవత్సరం చదువుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం తర్వాత పాస్ అయితే సమయం పోయినట్లే కదా! అలాగే జ్ఞానీ మరియు యోగీ ఆత్మలు, లైట్ మరియు మైట్ స్వరూపంగా లేకపోతే, వారికి కూడా పరిస్థితిలో పాస్ అయ్యేందుకు సమయం పడుతుంది. ఒకవేళ సమయానికి పాస్ అవ్వని సంస్కారం ఏర్పడితే, ఫైనల్ లో కూడా ఆ సంస్కారం ఫుల్ పాస్ అవ్వనివ్వదు. కనుక పాస్ అయ్యేవారే కానీ సమయానికి పాస్ అయ్యేవారు కాదు. ఎవరైతే సదా సమయానికి ఫుల్ పాస్ అవుతారో, వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారు. పాస్ విత్ ఆనర్ అనగా ధర్మరాజు కూడా వారిని గౌరవిస్తారు. వారికి ధర్మరాజపురిలో కూడా శిక్షలు ఉండవు, గౌరవముంటుంది. వారికి పాస్ విత్ ఆనర్ అనే మహిమ జరుగుతుంది.
పాస్ విత్ ఆనర్ అవ్వాలంటే విశేషంగా స్వయాన్ని - ఏ విషయంలోనైనా, ఏ సంస్కారంలోనైనా, స్వభావంలోనైనా, గుణాలలోనైనా, శక్తులలోనైనా లోపం ఉండనివ్వకూడదు. అన్ని విషయాలలోనూ సంపూర్ణమవ్వడమంటే - పాస్ విత్ ఆనర్ గా అవ్వడము. అందరు ఇలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? (అవుతూ ఉన్నాము). అందుకే వినాశనమవ్వకుండా ఆగి ఉంది. అవ్వకుండా మీరే ఆపారు. విశ్వం యొక్క వినాశనం కన్నా అనగా పరివర్తన కన్నా ముందే బ్రాహ్మణులలోని లోపాలు వినాశనమవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణుల లోపాలు వినాశనమవ్వకపోతే విశ్వ వినాశనం అనగా పరివర్తన ఎలా అవుతుంది? కనుక పరివర్తనకు ఆధారమూర్తులు బ్రాహ్మణాత్మలైన మీరే.
పంజాబ్, హర్యానా, హిమాచల్ వారు ముందు తయారవ్వాలి కదా. అంత్యాన్ని తీసుకొచ్చే మీరు తయారుగా లేరు. అందుకే, ఆటంకవాదులు తయారయ్యారు. కనుక అందరూ మొదటి నంబరు తీసుకునేవారా లేక ఏది లభిస్తే దానితో రాజీగా ఉంటారా? అనేకుల కంటే బాగున్నామని అనుకోవడం లేదు కదా? బాగానే ఉన్నారు కానీ చాలా చాలా బాగా తయారవ్వాలి. కోట్లలో కొంతమందిగా అయితే అయ్యారు, ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఆ కొంతమందిలో కూడా కొంతమందిగా అవ్వాలి. అందుకే సదా ఎవర్రెడీగా అవ్వండి. చివర్లో రెడీ అవ్వడం కాదు, ఎవర్రెడీ అనగా సదా రెడీగా ఉండేవారు. ఒకవేళ అవుతూ ఉన్నాము అని అంటే - పురుషార్థము తీవ్రముగా జరగదు.
తండ్రి దృష్టి మొదటగా పంజాబుపై పడింది కదా. తండ్రి దృష్టి మొదటగా పడింది కనుక మొదటి నంబరులోనే రావాలి. మీరు పునాదిలో ఉండేవారు. పునాది సదా పక్కాగా ఉంటుంది. ఒకవేళ కచ్చాగా ఉంటే భవనమంతా కచ్చాగా అయిపోతుంది. కనుక మేము ప్రతి పరిస్థితిలో పాస్ విత్ ఆనర్ అయ్యేవారము - అనే వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. అందుకు విధి - ఎవర్రెడీగా ఉండడము. అచ్ఛా.
అన్నింటికంటే పెద్ద జోను మధువనమే. బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలందరి అసలైన ఇల్లు మధువనమే కదా. ఆత్మల ఇల్లు పరంధామము కానీ బ్రాహ్మణుల ఇల్లు మధువనము. కనుక మీరు అమృత్సర్ లేక లుధియానాకు చెందినవారు కాదు, పంజాబు లేక హర్యానాకు చెందినవారు కాదు, మీ పర్మనెంటు అడ్రసు మధువనము. మిగిలినవన్నీ సేవాస్థానాలు. ప్రవృత్తిలో ఉన్నా, అది కూడా సేవాస్థానమే, ఇల్లు కాదు. స్వీట్ హోమ్ మధువనము. ఇలానే భావిస్తున్నారు కదా! లేక ఆ ఇల్లే గుర్తుకొస్తుందా? అచ్ఛా!
Comments
Post a Comment