18-03-1987 అవ్యక్త మురళి

18-03-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యమైన ఆత్మిక ప్రేయసిల గుర్తులు.

సదా ప్రాప్తులతో సంపన్నంగా తయారుచేసే బాప్ దాదా తన యొక్క అవినాశి ప్రేయసిలతో అన్నారు.

ఈరోజు ఆత్మిక ప్రియుడు తన యొక్క ఆత్మిక ప్రేయసి ఆత్మలను కలుసుకునేటందుకు వచ్చారు. కల్పమంతటిలో ఈ సమయంలో ఆత్మిక ప్రేయసి ప్రియుల మిలనం జరుగుతుంది. బాప్ దాదా తన యొక్క ప్రతి ప్రేయసి ఆత్మను చూసి హర్షిస్తున్నారు - ఆత్మిక ఆకర్షణకి ఆకర్షితమై తమ యొక్క సత్యమైన ప్రియుడిని గుర్తించారు మరియు పొందారు. విడిపోయిన ప్రేయసిలు తిరిగి తమ యొక్క యధార్ధ గమ్యానికి చేరుకున్నారు అని వారిని చూసి ప్రియుడు కూడా సంతోషిస్తున్నారు. సర్వప్రాప్తులను చేయించే ఇటువంటి సత్యమైన ప్రియుడు మరెవ్వరూ దొరకరు. ఆత్మిక ప్రియుడు తన ప్రేయసిలను కలుసుకునేందుకు సదా ఎక్కడికి వస్తారు? ప్రియుడు మరియు ప్రేయసిలు ఎలా అయితే శ్రేష్టమైనవారో అలాగే కలుసుకునేది కూడా శ్రేష్ట స్థానంలోనే. కలుసుకునే ఈ స్థానం ఎటువంటిది? ఈ స్థానాన్ని ఎలాగైనా అనవచ్చు, అన్ని పేర్లను ఈ స్థానానికి ఇవ్వవచ్చు. మామాలుగా అయితే కలుసుకునేటందుకు ఏ స్థానం ప్రియంగా అనిపిస్తుంది? పూలతోటలో కలుసుకుంటారు లేదా సముద్రం ఒడ్డున కలుసుకుంటారు. దానినే మీరు బీచ్ అని అంటారు. అయితే ఇప్పుడు అందరూ ఎక్కడ కూర్చున్నారు? జ్ఞాన సాగరం యొక్క ఒడ్డున, ఆత్మిక కలయిక స్థానంలో కూర్చున్నారు. ఆత్మిక లేదా ఈశ్వరీయ పూలతోట ఇది. ఇతర అనేక రకాలైన పూలతోటలు చూసి ఉంటారు, కానీ ఇది ఎటువంటి తోట అంటే ఇక్కడ ఒకటికంటే ఒకటి బాగా వికసించిన పుష్పాలు ఉంటాయి, ఒకొక్కటి తమ శ్రేష్ట సుందరత ద్వారా సువాసన ఇస్తూంటాయి, ఇది అటువంటి పూలతోట. ఈ పూలతోట మధ్యలో బాప్ దాదా లేదా ప్రియుడు కలుసుకునేటందుకు వస్తారు. అలాగే అనేక రకాల బీచ్ లు  కూడా చూసి ఉంటార.  కానీ ఇది ఎటువంటి బీచ్ అంటే ఇక్కడ జ్ఞాన సాగరుని యొక్క స్నేహ అలలు, శక్తి అలలు భిన్న భిన్న అలలు వస్తూ మిమ్మల్ని సదాకాలికంగా తాజాగా చేస్తాయి, ఇటువంటి బీచ్ ని ఎప్పుడైనా చూశారా? ఈ స్థానం మీకు ఇష్టమే కదా? ఈ స్థానం స్వచ్చంగా కూడా ఉంటుంది మరియు రమణీయంగా కూడా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఇన్ని ప్రాప్తులు ఉన్నాయి. ఇటువంటి మనోరంజనమైన విశేష స్థానాన్ని ప్రేయసిలైన మీ కోసం విశేషంగా ప్రియుడు తయారు చేయించారు. ఆ స్థానానికి రాగానే ప్రేమ అనే గీత లోపలికి రాగానే అనేక రకాల శ్రమల నుండి విడిపించబడతారు. బాబా యొక్క స్మృతి సహజంగా ఉండాలి అని చాలా శ్రమ చేస్తారు. కానీ ఇక్కడ దానిని సహజంగా అనుభవం చేసుకుంటారు. ఇంకా ఏ శ్రమ నుండి విడిపిస్తున్నారు? లౌకిక ఉద్యోగం నుండి కూడా విడిపించబడతారు, భోజనం తయారుచేసుకునే శ్రమ నుండి కూడా విడిపించబడతారు, అన్నీ తయారైనవి దొరుకుతాయి కదా! స్మృతి కూడా స్వతహాగా ఉండే అనుభవం అవుతుంది. జ్ఞాన రత్నాలతో జోలె కూడా నిండుతూ ఉంటుంది. ఇటువంటి స్థానంలో శ్రమ నుండి విడిపించబడి ప్రేమలో లీనం అయిపోతున్నారు. 

మామూలుగా కూడా స్నేహానికి విశేషంగా ఏమి గుర్తు చెప్తారంటే ఇద్దరు ఇద్దరు వలె ఉండకూడదు, ఇద్దరూ కలిసి ఒకటి అయిపోవాలి. దీనినే లీనమైపోవటం అని అంటారు. స్నేహంలో ఈ స్థితినే భక్తులు ఐక్యం అయిపోవటం లేదా కలిసిపోవటం అని అన్నారు. లీనం అవ్వటం అంటే అర్ధం ఏమిటో వారికి తెలియదు. ప్రేమలో లీనం అయిపోవాలి - ఇది స్థితి. దీనిని వారు స్థితిగా చెప్పడానికి బదులు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదాకాలికంగా సమాప్తి చేసుకోవటంగా భావించేశారు. లీనమైపోవటం అంటే సమానంగా అయిపోవటం. ఎప్పుడైతే బాబా యొక్క లేదా ఆత్మిక ప్రియుని యొక్క మిలనంలో నిమగ్నం అయిపోతారో అప్పుడు బాబా సమానంగా అంటే లీనమైపోయిన అనుభూతి చేసుకుంటారు. ఈ స్థితినే భక్తులు లీనమైపోవటం అని అన్నారు. లీనం అయిపోతున్నారు, కలిసిపోతున్నారు కానీ ఇది ప్రేమ మిలనం యొక్క స్థితి యొక్క అనుభూతి. అర్థమైందా! బాప్ దాదా తన ప్రేయసులను చూస్తున్నారు. 

సత్యమైన ప్రేయసి అంటే సదా మరియు స్వతహా ప్రేయసి. సత్యమైన ప్రేయసి యొక్క విశేషతలు మీకు తెలుసు కూడా! అయినా కానీ వారి యొక్క ముఖ్య విశేషతలు ఏమిటంటే, 1. ఒకే ప్రియుని ద్వారా సమయానుసారంగా సర్వ సంబంధాలను అనుభవం చేసుకోవటం. ప్రియుడు ఒక్కరే కానీ ఒకనితో సర్వ సంబంధాలు. ఏ సమయంలో ఏ సంబంధం అవసరమో ఆ సమయంలో ఆ సంబంధం రూపంలో ప్రీతి యొక్క రీతి ద్వారా అనుభవం చేసుకోగలరు. మొదటి గుర్తు ఏమిటంటే సర్వ సంబంధాల అనుభూతి. సర్వ అనే మాటను అండర్ లైన్ చేసుకోవాలి. కేవలం సంబంధం కాదు, సర్వసంబంధాలు. కొంతమంది తుంటరి ప్రేయసిలు కూడా ఉన్నారు - సంబంధం జోడించబడిపోయింది కదా అని అనుకుంటారు. కానీ సర్వ సంబంధాలు జోడించబడ్డాయా? 

2. సమయానుసారం సంబంధం యొక్క అనుభూతి అవుతుందా? జ్ఞానం ఆధారంగా సంబంధం ఉందా లేక మానసిక అనుభూతి ఆధారంగా సంబంధం ఉందా? సత్యమైన మనస్సుకే బాప్ దాదా రాజీ అవుతారు. తీవ్రమైన బుద్ధి గల వారికి రాజీ అవ్వరు, మనోభిరాముడు మనస్సుకే రాజీ అవుతారు. మనస్సు యొక్క అనుభవం మీ మనస్సుకి తెలుస్తుంది మరియు మనోభిరామునికి తెలుస్తుంది. లీనం చేసుకునే స్థానం మనస్సు కానీ బుద్ది కాదు. జ్ఞానాన్ని ఇముడ్చుకోవలసిన స్థానం - బుద్ధి, కానీ ప్రియుడిని నింపుకోవలసిన స్థానం - మనస్సు. ప్రియుడు, ప్రేయసిల మాటలే చెప్తారు కదా! కొంతమంది ప్రేయసులు బుద్ధిని ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ మనస్సు ద్వారా బుద్ది యొక్క శ్రమ సగం తక్కువ అయిపోతుంది. ఎవరైతే మనస్సుతో సేవ చేస్తారో లేదా స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువ ఉంటుంది. 

ఎవరైతే మనస్సు యొక్క స్నేహంతో కాకుండా కేవలం జ్ఞానం ఆధారంగా, బుద్ది ఆధారంగా స్మృతి చేస్తారో లేదా సేవ చేస్తారో వారికి శ్రమ ఎక్కువ చేయవలసి ఉంటుంది, సంతుష్టత తక్కువ ఉంటుంది. సఫలత లభించినా కానీ మనస్సు యొక్క సంతుష్టత తక్కువగా ఉంటుంది. మంచిగానే జరిగింది కానీ, కానీ... ఇలా అంటూనే ఉంటారు. కానీ మనస్సుతో చేసేవారు సదా సంతుష్టత యొక్క పాటలు పాడుతూ ఉంటారు. మనస్సు యొక్క సంతుష్టత యొక్క పాటలు పాడుతూ ఉంటారు కానీ నోటి యొక్క సంతుష్టత యొక్క పాటలు కాదు. సత్యమైన ప్రేయసి సమయానుసారం మనస్సుతో సర్వ సంబంధాల యొక్క అనుభూతి చేసుకుంటుంది. 

రెండవ గుర్తు - సత్యమైన ప్రేయసి ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు. ఒకటి - అనుభూతి, రెండు - ప్రాప్తి. కొంతమంది నా తండ్రి, ప్రియుడు మరియు బిడ్డ కూడా అని అనుభూతి చేసుకుంటారు కానీ దాని ద్వారా ఎంత ప్రాప్తిని కావాలనుకుంటున్నారో అంత పొందలేరు. తండ్రియే కానీ వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క సంతోషం వారికి ఉండదు. కనుక అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం కూడా ఉండాలి. తండ్రి యొక్క సంబంధం ద్వారా సదా వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క అనుభూతి అవ్వాలి, నిండుదనం ఉండాలి. సద్గురువు ద్వారా వరదానాలతో సంపన్న స్థితి యొక్క లేదా సదా సంపన్న స్వరూపం యొక్క అనుభూతి ఉండాలి. ఇలా ప్రాప్తి యొక్క అనుభూతి కూడా అవసరం. అది సర్వ సంబంధాల యొక్క అనుభవం, ఇది ప్రాప్తుల యొక్క అనుభవం. కొంతమందికి సర్వప్రాప్తుల యొక్క అనుభవం అవ్వదు. మాస్టర్ సర్వశక్తివంతులు కానీ సమయానికి శక్తుల యొక్క ప్రాప్తి ఉండదు. ప్రాప్తి యొక్క అనుభూతి అవ్వటం లేదు అంటే ప్రాప్తిలోనే లోపం ఉంది. కనుక అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపం కూడా ఉండాలి - సత్యమైన ప్రేయసికి గుర్తు ఇదే.

మూడవ గుర్తు - ఏ ప్రేయసికి అయితే అనుభూతి మరియు ప్రాప్తి ఉంటుందో ఆ ప్రేయసి తృప్తిగా ఉంటుంది. ఏ విషయంలోను అప్రాప్తి ఆత్మగా అనిపించరు. ప్రేయసి యొక్క విశేషత - తృప్తి. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పక ఉంటుంది. తృప్తి లేదు అంటే తప్పక ప్రాప్తిలో లోటు ఉన్నట్లు. లేదంటే సర్వ సంబంధాల అనుభూతిలో లోపం ఉన్నట్లు. అయితే గుర్తులు ఏమిటంటే - అనుభూతి, ప్రాప్తి మరియు తృప్తి. సదా తృప్తి ఆత్మగా ఉంటారు. ఎటువంటి సమయం అయినా, ఎటువంటి వాయుమండలం అయినా, సేవాసాధనాలు ఏవిధంగా ఉన్నా, సంఘటనలో ఎటువంటి సేవాసహయోగులు అయినా కానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి నడవడికలో తృప్తిగా ఉంటారు. ఇటువంటి సత్యమైన ప్రేయసులు కదా! తృప్త ఆత్మకి హద్దు యొక్క కోరిక ఏదీ ఉండదు. మామూలుగా కూడా తృప్త ఆత్మలు చాలా తక్కువమంది ఉంటారు. పేరు విషయంలోనో, గౌరవం విషయంలోనో ఏదొక ఆకలి ఉంటుంది, ఆకలిగా ఉన్నవారు ఎప్పుడూ తృప్తిగా ఉండరు. కడుపునిండుగా ఉన్నవారు తృప్తిగా ఉంటారు. శారీరకంగా భోజనం కోసం ఎలాగైతే ఆకలి ఉంటుందో అలాగే మనస్సుకి ఆకలి - పేరు, గౌరవం, సాధనాలు, సౌకర్యాలు. ఇవి మనస్సు యొక్క ఆకలి. శారీరకంగా తృప్తిగా ఉన్నవారు సదా సంతుష్టంగా ఉంటారు. అలాగే మానసికంగా తృప్తిగా ఉన్నవారు సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అనేది తృప్తికి గుర్తు. తృప్త ఆత్మగా లేకపోతే శారీరకంగా లేదా మానసికంగా ఆకలిగా ఉన్నవారికి ఎంత లభించినా కానీ, వారికి ఎక్కువగానే లభిస్తుంది కూడా అయినా కానీ తృప్త ఆత్మలు కాని కారణంగా వారు సదా అసంతృప్తిగానే ఉంటారు, వారికి అసంతుష్ఠతయే ఉంటుంది. రాయల్ గా ఉండేవారు కొంచెంలోనే తృప్తి అయిపోతారు. రాయల్ ఆత్మలకు గుర్తు - సదా నిండుగా ఉంటారు. ఒక రొట్టె లభించినా కానీ, 36 రకాల భోజనం లభించినా కానీ తృప్తిగా ఉంటారు. ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వారికి 36 రకాల భోజనం లభించినా కానీ తృప్తిగా ఉండరు. ఎందుకంటే వారికి మానసికంగా ఆకలి ఉంటుంది. సత్యమైన ప్రేయసికి గుర్తు - సదా తృప్తి ఆత్మగా ఉంటారు. కనుక ఈ మూడు గుర్తులను పరిశీలించుకోండి. నేను ఎవరికి ప్రేయసిని! అనేది సదా ఆలోచించండి. సదా సంపన్నుడు అయిన ప్రియునికి ప్రేయసులు మీరు. కనుక సంతుష్టతను ఎప్పుడూ వదలకండి. సేవను వదిలేయండి కానీ సంతుష్ఠతను వదలకండి. ఏ సేవ అయితే మిమ్మల్ని అసంతుష్టం చేస్తుందో అది సేవ కాదు. సేవ అంటే ఫలాన్ని ఇచ్చేదే సేవ అని అర్థం. సత్యమైన ప్రేయసి సర్వ హద్దులోని కోరికలకు అతీతంగా, సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటుంది. 

ఈ రోజు ప్రేయసుల కథలను వినిపిస్తున్నాను. చాలా వయ్యారం, తుంటరితనం చూపిస్తున్నారు. వాటిని చూసి ప్రియుడు కూడా నవ్వుకుంటున్నారు. వయ్యారంగా, తుంటరిగా ఉండండి కానీ ప్రియుడిని ప్రియునిగా భావించి అవన్నీ ప్రియుని ముందే చేయండి కానీ ఇతరుల ముందు కాదు. భిన్న భిన్న స్వభావ, సంస్కారాల వయ్యారాన్ని చూపిస్తున్నారు. నా స్వభావం, నా సంస్కారం అనే మాట వచ్చిన చోటే వయ్యారం, తుంటరితనం వస్తుంది. బాబా స్వభావమే నా స్వభావం, నా స్వభావం బాబా స్వభావానికి భిన్నంగా ఉండదు అని అనుకోవాలి. అవి మాయా స్వభావాలు, పరాయి స్వభావాలు. వాటిని నావి అని ఎలా అంటున్నారు? మాయ పరాయిది, మీది కాదు. బాబా మీవారు. కనుక నా స్వభావం అంటే బాబా స్వభావమే. మాయా స్వభావాన్ని నా స్వభావం అని అనటం కూడా తప్పే. నాది అనే మాటే వలయంలోకి తీసుకువస్తుంది. ప్రేయసులు ప్రియుని ఎదుట ఇటువంటి వయ్యారం కూడా చూపిస్తున్నారు. బాబాది ఏదైతే ఉందో అదే నాది అనుకోవాలి. భక్తిలో కూడా ప్రతి విషయంలో అంటూంటారు - నీదే నాది, నాదంటూ ఏదీ లేదు అని. బాబా సంకల్పమే మీ సంకల్పం. సేవా పాత్రను అభినయించే బాబా యొక్క స్వభావ సంస్కారాలే నావి. దీని ద్వారా ఏమౌతుంది? హద్దులోని నాది అనేది నీది అయిపోతుంది. నీదే నాది అంతే, నాదంటూ వేరుగా ఏమీ లేదు. బాబాకి భిన్నమైనది నాది కానే కాదు, అది మాయా జాలం. అందువలన ఈ హద్దులోని తుంటరితనాన్ని తొలగించుకుని నేను నీ దానిని, నీవు నావాడవు అని అనుకోండి. భిన్న భిన్న సంబంధాల అనుభూతి యొక్క తుంటరితనాన్ని చూపించండి కానీ ఇటువంటి తుంటరితనం చేయకండి. సంబంధం జోడించటంలో కూడా ఆత్మిక తుంటరితనం చేయవచ్చు. ప్రేమపూర్వక తుంటరితనం బావుంటుంది. సఖుని సంబంధంతో ప్రేమపూర్వక తుంటరితనాన్ని అనుభవం చేసుకోండి, అది తుంటరితనంగా అనిపించదు, అతీతంగా అనిపిస్తుంది. స్నేహ పూర్వక తుంటరితనం ప్రియమనిపిస్తుంది. చిన్నపిల్లలు చాలా స్నేహీ మరియు పవిత్రంగా ఉంటారు. కనుక వారి తుంటరి పనులు అందరికీ ఇష్టం అనిపిస్తాయి. పిల్లలలో శుద్ధత మరియు పవిత్రత ఉంటుంది. పెద్దవారు ఎవరైనా తుంటరి పనులు చేస్తుంటే దానిని చెడుగా భావిస్తారు. అదేవిధంగా మీరు తుంటరిగా ఉండాలనుకుంటే బాబాతో కూడా భిన్న భిన్న సంబంధాల యొక్క, స్నేహ పూర్వక, ప్రేమ పూర్వక, పవిత్రత పూర్వక తుంటరితనం చేయండి.

సదా చేతిలో చేయి మరియు తోడు - సత్యమైన ప్రేయసి ప్రియుల గుర్తు ఇదే. తోడును మరియు చేయిని వదలరు. అదేవిధంగా సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండాలి మరియు బాబా యొక్క ప్రతి కార్యంలో సహయోగం అనే చేయి ఉండాలి. ఒకరికొకరు సహాయోగి అనేదానికి గుర్తుగానే చేతిలో చేయిని చూపిస్తారు. సదా బాబాకి  సహాయోగిగా అవ్వాలి - ఇదే సదా చేతిలో చేయి వేసి ఉండటం. సదా బుద్ధితో బాబా తోడుగా ఉండాలి. మనస్సు యొక్క సంలగ్నత మరియు బుద్ధి యొక్క తోడు. ఈ స్థితిలో ఉండటం అంటే సత్యమైన ప్రేయసి ప్రియుల ఫోజులో ఉండటం. అర్థమైందా? సదా వెంటే ఉంటాను - ప్రతిజ్ఞ ఇదే కదా! అప్పుడప్పుడు తోడు పెట్టుకుంటాను అనే ప్రతిజ్ఞ కాదు కదా! మనస్సు యొక్క తగుల్పాటు అప్పుడప్పుడు ప్రియునితో ఉండటం, అప్పుడప్పుడు లేకపోవడం ఇలా ఉంటే సదా తోడుగా ఉన్నట్లు కాదు కదా! అందువలన సదా సత్యమైన ప్రేయసి యొక్క స్థితిలో ఉండండి. దృష్టిలో కూడా ప్రియుడే, వృత్తిలో కూడా ప్రియుడే, సృష్టి అంతా ప్రియుడే.

ఇది ప్రేయసీప్రియుల సభ. ఇది పూలతోట కూడా మరియు సముద్రం ఒడ్డు కూడా. ఇది ఎంత అద్భుతమైన వ్యక్తిగత బీచ్ అంటే వేలమంది మధ్యలో కూడా వ్యక్తిగతంగా ఉండవచ్చు. ప్రియునికి నాతో వ్యక్తిగతమైన ప్రేమ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రేమ యొక్క అనుభూతి జరగడమే ఈ ప్రేయసీప్రియుల అద్భుతం. ప్రియుడు ఒక్కడే కానీ అందరివాడు. అందరికీ అందరికంటే ఎక్కువ అధికారం ఉంది. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. అధికారంలో నెంబరు లేదు. అధికారాన్ని ప్రాప్తింప చేసుకోవడంలో నెంబరువారీ అయిపోతున్నారు. ఈశ్వరీయ పూలతోటలో బాబా చేతిలో చేయి వేసి తోడుగా నడుస్తున్నాను లేదా కూర్చున్నాను అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఆత్మిక బీచ్ లో చేయి మరియు తోడు యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాను అని అనుకోండి. అప్పుడు సదా మనోరంజనంలో ఉంటారు,  సదా సంతోషంగా ఉంటారు,  సదా సంపన్నంగా ఉంటారు. మంచిది. ఈ డబల్ విదేశీయులు డబల్ అదృష్టవంతులు. ఇక్కడికి వచ్చారు ఇంతవరకు మంచిది,  ఇకముందు ఎలా పరివర్తన అవుతారో  అది డ్రామా, కానీ సమయానికి చేరుకున్నారు కనుక మీరు డబల్ అదృష్టవంతులు.

సదా అవినాశి ప్రేయసిగా అయ్యి ఆత్మిక ప్రియునితో ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారికి సదా స్వయాన్ని సర్వ ప్రాప్తిలతో సంపన్నంగా అనుభవం చేసుకునేవారికి,  సదా ప్రతి స్థితి మరియు పరిస్థితిలో తృప్తిగా ఉండేవారికి, సదా సంతుష్టత యొక్క ఖజానా  ద్వారా నిండుగా ఉంటూ, ఇతరులను కూడా నిండుగా చేసేవారికి, సదా తోడు మరియు చేతిలో చేతిని కలిపి ఉంచే సత్యమైన ప్రేయసికి ఆత్మిక ప్రియుని యొక్క మనస్పూర్వక  ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments