18-01-1986 అవ్యక్త మురళి

18-01-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“మనసా శక్తి మరియు నిర్భయతా శక్తి”

ఈ రోజు వృక్షపతి తన నూతన వృక్షానికి పునాది అయిన పిల్లలను చూస్తున్నారు. వృక్షపతి తన వృక్షం యొక్క కాండాన్ని చూస్తున్నారు. వృక్షపతి పాలనలో పాలింపబడిన శ్రేష్ఠమైన ఫలస్వరూప పిల్లలందరినీ చూస్తున్నారు. ఆదిదేవ్ తమ ఆదిరత్నాలను చూస్తున్నారు. ప్రతి ఒక్క రత్నం యొక్క మహానత, విశేషత ఎవరిది వారిదే. కాని అందరూ కొత్త రచనకు నిమిత్తంగా అయిన విశేష ఆత్మలే ఎందుకంటే తండ్రిని గుర్తించడంలో, తండ్రి కార్యంలో సహయోగులుగా అవ్వడంలో నిమిత్తంగా అయ్యారు మరియు అనేకమంది ఎదురుగా ఉదాహరణగా అయ్యారు. ప్రపంచాన్ని చూడకుండా, కొత్త ప్రపంచాన్ని తయారుచేసే, వారిని చూశారు. చలించని నిశ్చయానికి మరియు ధైర్యానికి ప్రపంచం ఎదుట ఉదాహరణగా అయి చూపించారు కనుక అందరూ విశేష ఆత్మలే. విశేషాత్మలను విశేషంగా సంగఠిత రూపంలో చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు మరియు అటువంటి పిల్లలను మహిమ చేస్తూ పాట పాడుతున్నారు. తండ్రిని గుర్తించారు మరియు తండ్రి, పిల్లలను, వారు ఎవరైనా, ఎలా ఉన్నా, ఇష్టపడ్డారు ఎందుకంటే హృదయాభిరామునికి సత్యమైన హృదయం కల వారే ఇష్టం. ప్రపంచపు తెలివి లేకపోవచ్చు కానీ తండ్రికి ప్రపంచపు తెలివి ఇష్టం ఉండదు, హృదయం కలవారు ఇష్టం. తండ్రి ఎంత గొప్ప బుద్ధిని ఇస్తారంటే దానితో రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది, మధ్య, అంత్యముల జ్ఞానాన్ని తెలుసుకుంటారు, అందుకే బాప్ దాదా హృదయపూర్వకంగా ఇష్టపడతారు. నంబరు కూడా సత్యమైన, స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే తయారవుతుంది. సేవ ఆధారంతో కాదు. సేవలో కూడా సత్యమైన హృదయంతో సేవ చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంతో సేవ చేశారా! హృదయం నుండి వచ్చే శబ్దం హృదయం వరకు చేరుకుంటుంది, బుద్ధి యొక్క శబ్దం బుద్ధి వరకు చేరుకుంటుంది.

ఈరోజు బాప్ దాదా దిల్ వాలా (హృదయమున్న) పిల్లల లిస్టును చూస్తున్నారు. బుద్ధికలవారు పేరు సంపాదిస్తారు, హృదయమున్న వారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు. కనుక రెండు మాలలు తయారవుతున్నాయి ఎందుకంటే ఈరోజు వతనంలో అడ్వాన్స్ లో వెళ్ళిన ఆత్మలు ఇమర్జ్ అయ్యారు. ఆ విశేషాత్మలు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ముఖ్యమైన ఆత్మిక సంభాషణ ఏముంటుంది? మీరందరూ కూడా విశేషాత్మలను ఇమర్జ్ చేశారు కదా! సమయం మరియు సంపూర్ణత, రెండిటి మధ్యన ఎంత తేడా మిగిలి ఉంది అనే విషయంపై వతనంలో కూడా ఆత్మిక సంభాషణ జరిగింది. ఎంతమంది తయారయ్యారు! నంబరు తయారయ్యారా లేక ఇంకా తయారవ్వాలా? నంబరువారుగా అందరూ స్టేజిపైకి వస్తున్నారు కదా. అడ్వాన్స్ పార్టీ వారు ఇలా అడిగారు - ఇప్పుడైతే మేము అడ్వాన్స్ కార్యాన్ని చేస్తున్నాము కానీ మా సహచరులు మా కార్యంలో విశేషంగా ఏ సహయోగాన్ని ఇస్తున్నారు? వారు (అడ్వాన్స్ పార్టీ) కూడా మాలను తయారుచేస్తున్నారు. ఏ మాలను తయారుచేస్తున్నారు? ఎక్కడెక్కడ ఎవరెవరు కొత్త ప్రపంచాన్ని ఆరంభించేందుకు జన్మ తీసుకుంటారో అది నిశ్చితమవుతూ ఉంది. వారికి కూడా వారి కార్యంలో విశేషంగా సూక్ష్మమైన శక్తిశాలి మనసా సహయోగం కావాలి. ఎవరైతే శక్తిశాలి స్థాపనకు నిమిత్తంగా అయ్యే ఆత్మలున్నారో వారు స్వయం పావనంగా ఉన్నారు కానీ వ్యక్తుల వాయుమండలము, ప్రకృతి వాయుమండలము తమోగుణీగా ఉంది. అతి తమోగుణీ ఆత్మల మధ్యలో కొంతమంది సతోగుణీ ఆత్మలు కమలపుష్ప సమానంగా ఉన్నారు. కనుక ఈ రోజు ఆత్మిక సంభాషణ చేస్తూ మీ అతి స్నేహీ శ్రేష్ఠమైన ఆత్మలు చిరునవ్వుతో ఇలా అన్నారు - మా సహచరులకు ఇంత పెద్ద సేవ యొక్క స్మృతి ఉన్నదా లేక సెంటర్లలోనే బిజీ అయిపోయారా లేక జోన్ లోనే బిజీ అయిపోయారా?

ఇంతటి ప్రకృతినంతా పరివర్తన చేసే కార్యం, తమోగుణీ సంస్కారం కల ఇంతమంది ఆత్మల వినాశనం, ఏదో ఒక విధి ద్వారా జరుగుతుంది కానీ అకస్మాత్తు మృత్యువులు, అకాల మృత్యువులు, సామూహిక రూపంలో మృత్యువులు, ఆ ఆత్మల వైబ్రేషన్లు ఎంత తమోగుణీగా ఉంటాయి, వాటిని పరివర్తన చేయడం మరియు స్వయాన్ని కూడా అటువంటి అనవసర రక్తపాత వాయుమండలపు వైబ్రేషన్ల నుండి సురక్షితంగా ఉంచుకోవడం మరియు ఆ ఆత్మలకు సహయోగమివ్వడం - ఈ విశాలమైన కార్యం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారా? లేక కేవలం ఎవరో వచ్చారు, వారికి అర్థం చేయించారు మరియు తిన్నారు, ఇందులోనే సమయం పోవడం లేదు కదా? అని వారు (అడ్వాన్స్ పార్టీ) అడుగుతున్నారు. ఈ రోజు బాప్ దాదా వారి సందేశాన్ని వినిపిస్తున్నారు. ఇంత అనంతమైన కర్తవ్యం చేసేందుకు ఎవరు నిమిత్తంగా ఉన్నారు? ఆదిలో నిమిత్తమైనందుకు అంతిమంలో కూడా పరివర్తన యొక్క అనంతమైన కార్యంలో నిమిత్తంగా అవ్వాలి కదా. ఎవరైతే ముగింపు చేశారో, వారు పూర్తిగా చేశారు అనే సామెత కూడా ఉంది. గర్భమహల్ కూడా తయారుచేయాలి, అప్పుడే యోగబలం ద్వారా కొత్త రచన ప్రారంభమవుతుంది. యోగబలం కోసం మనసాశక్తి అవసరం. తమ రక్షణకు కూడా మనసాశక్తి సాధనంగా అవుతుంది. మనసాశక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమాన్ని సుందరంగా తయారుచేసుకోవడంలో నిమిత్తంగా అవ్వగలరు. లేకపోతే సమయానికి పరిస్థితుల అనుసారంగా సాకార రూపంలో సహయోగం ప్రాప్తి అవ్వకపోవచ్చు కూడా. ఆ సమయంలో ఒకవేళ మనసాశక్తి అనగా శ్రేష్ఠ సంకల్పశక్తి లేకపోతే, ఒక్కరితోనే లైన్ క్లియర్ గా లేకపోతే తమ బలహీనతలు పశ్చాత్తాప రూపంలో భూతాల వలె అనుభవమవుతాయి ఎందుకంటే బలహీనత స్మృతిలోకి వస్తూనే భయమనేది, భూతం వలె అనుభవమవుతుంది. ఇప్పుడైతే ఎలాగోలా నడిపిస్తారు కానీ అంతిమంలో భయం అనుభవమవుతుంది, కనుక ఇప్పటి నుండే అనంతమైన సేవ చేసేందుకు, స్వయం సురక్షితంగా ఉండేందుకు మనసాశక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి, అప్పుడే అంతిమం సుందరంగా ఉంటుంది మరియు అనంతమైన కార్యంలో సహయోగులుగా అయి అనంతమైన విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఇప్పుడు మీ సహచరులు, మీ సహయోగం కోసం వేచి ఉన్నారు. కార్యము వేరు-వేరుగా ఉండవచ్చు కానీ పరివర్తన కోసం ఇరువురూ నిమిత్తంగా ఉన్నారు. వారు తమ రిజల్టును వినిపించారు.

అడ్వాన్స్ పార్టీ వారు కొంతమంది స్వయంగా శ్రేష్ఠాత్మలను ఆహ్వానించేందుకు తయారుగా ఉన్నారు మరియు తయారవుతూ ఉన్నారు, కొంతమంది తయారుచేయించడంలో నిమగ్నమై ఉన్నారు. వారి సేవకు సాధనం స్నేహం మరియు సమీప సంబంధం. వీటి ద్వారా ఇమర్జ్ రూపంలో జ్ఞానచర్చ చేయరు కాని జ్ఞానీ ఆత్మల సంస్కారమున్న కారణంగా పరస్పరంలో శ్రేష్ఠ సంస్కారాలు, శ్రేష్ఠ వైబ్రేషన్లు మరియు సదా హోలీ మరియు హ్యాపి ముఖాల ద్వారా ఒకరికొకరు ప్రేరణనిచ్చే కార్యాన్ని చేస్తున్నారు. వేరు-వేరు పరివారాలలో ఉన్నారు కానీ ఏదో ఒక సంబంధం లేక మైత్రి ఆధారంగా ఒకరికొకరు సంపర్కంలోకి వచ్చినప్పుడు జ్ఞాన స్వరూప ఆత్మలుగా ఉన్న కారణంగా వీరు మా వారు లేక సమీపంలోని వారు అనే ఈ అనుభూతి కలుగుతూ ఉంటుంది. నా వారు అనే భావన ఆధారంగా ఒకరినొకరు గుర్తిస్తారు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక అడ్వాన్స్ పార్టీ వారి కార్యం తీవ్ర వేగంతో నడుస్తుంది. వతనంలో ఇలా ఇచ్చి-పుచ్చుకోవడం జరిగింది. విశేషంగా జగదంబ, పిల్లలందరి పట్ల రెండు మధురమైన మాటలు మాట్లాడారు. రెండు మాటలలో అందరికీ - "సఫలతకు ఆధారం సదా సహనశక్తి మరియు ఇముడ్చుకునే శక్తి, ఈ విశేషతల ద్వారా సఫలత సదా సహజంగా మరియు శ్రేష్ఠంగా అనుభవమవుతుంది" అని స్మృతినిప్పించారు. ఇతరులది కూడా వినిపించాలా? ఈ రోజు విశేషంగా చిట్ చాట్ చేసేందుకు కలిశాము కనుక ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని వర్ణించారు. అచ్ఛా, ఇంకెవరిది వింటారు? (విశ్వకిశోర్ భావూది). వారు మామూలుగానే తక్కువగా మాట్లాడుతారు కానీ ఏదైతే మాట్లాడుతారో అది శక్తిశాలిగా మాట్లడుతారు. వారి అనుభవమంతా కూడా ఒకే మాటలో ఉంది - ఏదైనా కార్యంలో సఫలతకు ఆధారం "చలించని నిశ్చయం మరియు సంపన్నమైన నషా". ఒకవేళ నిశ్చయం చలించకుండా ఉంటే స్వతహాగానే ఇతరులకు కూడా నషా అనుభవమవుతుంది కనుక నిశ్చయం మరియు నషా సఫలతకు ఆధారమయ్యాయి. ఇది వారి అనుభవం. ఎలాగైతే సాకార బాబాకు సదా నేను భవిష్యత్తులో విశ్వ మహారాజుగా అయ్యే ఉన్నాను అనే నిశ్చయం మరియు నషా ఉండేదో, అదేవిధంగా విశ్వకిశోర్కు కూడా నేను మొదటి విశ్వ మహారాజుకు మొదటి రాకుమారుడను అనే నషా ఉండేది. ఈ వర్తమాన మరియు భవిష్య నషా స్థిరంగా ఉండేది. కనుక సమానత ఉన్నట్లు కదా. ఎవరైతే తోడుగా ఉండేవారో, వారు ఇలా చూశారు కదా!

అచ్ఛా - దీదీ ఏం చెప్పారు? దీదీ చాలా బాగా ఆత్మిక సంభాషణ చేశారు. దీదీ అన్నారు - మీరు అందరినీ ఏ సూచన ఇవ్వకుండా ఎందుకు పిలిచేశారు, శెలవు తీసుకొని వచ్చేదానిని కదా, ఒకవేళ మీరు చెప్పి ఉంటే నేను శెలవు తీసుకుని తయారయ్యి వచ్చేదానిని. మీరు శెలవు ఇచ్చేవారా? బాప్ దాదా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేశారు - దేహ సహితంగా దేహపు సంబంధాలు, దేహపు సంస్కారాలు, అందరి సంబంధాలు, లౌకిక సంబంధాలు లేకపోయినా అలౌకిక సంబంధాలైతే ఉన్నాయి కదా. అలౌకిక సంబంధాలతో, దేహంతో, సంస్కారాలతో నష్టోమోహులుగా అయ్యేందుకు డ్రామాలో ఈ విధి నిర్ణయించబడి ఉంది కనుక అంతిమంలో అన్నిటి నుండీ నష్టోమోహులుగా అయి తమ డ్యూటీలోకి వచ్చి చేరుకున్నారు. విశ్వకిశోర్కు ముందు కొద్దిగా తెలుసు కాని ఎప్పుడైతే వెళ్ళే సమయం వచ్చిందో, ఆ సమయంలో వారు కూడా మర్చిపోయారు. డ్రామాలో నష్టోమోహులుగా అయ్యే ఈ విధి ఏదైతే నిర్ణయించబడిందో, అది రిపీట్ అయ్యింది ఎందుకంటే కొంత మీ శ్రమ మరియు కొంత తండ్రి కూడా డ్రామానుసారంగా కర్మబంధన ముక్తులుగా చేయడంలో సహయోగం కూడా చేస్తారు. ఎవరైతే చాలాకాలపు సహయోగీ పిల్లలుగా ఉన్నారో, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే ముఖ్యమైన సబ్జెక్టులో పాస్ అయ్యారో, ఇలా ఒకే అనుభవం చేసేవారికి బాబా విశేషంగా ఇలాంటి ఒక సమయంలో తప్పకుండా సహయోగం ఇస్తారు. కొంతమంది వీరందరూ కర్మాతీతులుగా అయిపోయారా, కర్మాతీత స్థితి అంటే ఇదేనా అని ఆలోచిస్తారు. కాని ఈ విధంగా ఆది నుండి సహయోగులుగా ఉన్న పిల్లలకు అదనపు సహయోగం లభిస్తుంది కనుక వారి శ్రమ కొంత తక్కువగా కనిపించినా కూడా అంతిమ సమయంలో తండ్రి సహాయం అదనపు మార్కులిచ్చి పాస్ విత్ ఆనర్గా చెయ్యనే చేస్తుంది. అది గుప్తంగా జరుగుతుంది - కనుక ఏమిటి ఇలా జరిగింది అనే ప్రశ్న తలెత్తుతుంది. కాని ఇది సహయోగానికి రిటర్న్. సమయానికి పనికొస్తుంది అనే సామెత ఉంది కదా. కనుక ఎవరైతే హృదయపూర్వకంగా సహయోగులుగా ఉన్నారో వారికి అలాంటి సమయంలో అదనపు మార్కులు రిటర్న్ రూపంలో ప్రాప్తిస్తాయి. ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారా? కనుక నష్టోమోహులుగా అయ్యే విధితో అదనపు మార్కుల గిఫ్ట్ ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. అర్థమయిందా - అఖరికి విషయమేమిటి అని అడుగుతారు కదా. అందుకే ఈ రోజు ఈ ఆత్మిక సంభాషణ వినిపిస్తున్నాము. అచ్ఛా - దీదీ ఏం చెప్పారు? వారి అనుభవమైతే అందరికీ తెలుసు కూడా. వారు ఇవే మాటలు చెప్పారు - సదా బాబా మరియు దాదాల వేలు పట్టుకోండి లేక మీ వేలును ఇవ్వండి. కావాలంటే కొడుకుగా చేసుకుని వేలు పట్టుకోండి, కావాలంటే తండ్రిగా చేసుకుని వేలు ఇవ్వండి. రెండు రూపాలలో ప్రతి అడుగులో వేలు పట్టుకుని తోడును అనుభవం చేస్తూ నడవడం, ఇదే నా సఫలతకు ఆధారం. కనుక ఈ విశేషమైన ఆత్మిక సంభాషణ నడిచింది. ఆదిరత్నాల సంగఠనలో దీదీ ఎలా మిస్ అవుతారు కనుక వారు కూడా ఇమర్జ్ అయ్యారు. అచ్ఛా, ఇవి అడ్వాన్స్ పార్టీ వారి విషయాలు, మీరేం చేస్తారు?

అడ్వాన్స్ పార్టీ తన పని చేస్తూ ఉంది. మీరు అడ్వాన్స్ ఫోర్స్ నింపండి, దాని ద్వారా పరివర్తన చేసే కార్యం యొక్క కోర్సు సమాప్తమైపోవాలి ఎందుకంటే పునాదిలో ఉన్నారు. పునాదిలో ఉన్నవారే అనంతమైన సేవాధారులుగా అయి అనంతమైన తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. త్వరలో ఈ సృష్టిపై ప్రత్యక్షత యొక్క ఢంకా మోగడాన్ని వింటారు. నలువైపులా ఒకే ఢంకా, ఒకే రాగంతో మోగుతుంది - "లభించేశారు, వచ్చేశారు" అని. ఇప్పుడింకా చాలా పని ఉంది. పూర్తైపోతుందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడింకా వాణి ద్వారా పరివర్తన చేసే కార్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు వృత్తి ద్వారా వృత్తులు మారాలి, సంకల్పం ద్వారా సంకల్పాలు మారిపోవాలి. ఈ రిసర్చ్ ను ఇప్పుడింకా ప్రారంభించలేదు. కొద్ది-కొద్దిగా చేస్తే ఎలా అవుతుంది. ఈ సూక్ష్మ సేవ స్వతహాగానే చాలా బలహీనతలను దాటిస్తుంది. ఇదెలా జరుగుతుందని భావిస్తారు కానీ, ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా ఉంటారో అప్పుడు స్వతహాగా వాయుమండలం ఎలా తయారవుతుందంటే తమ బలహీనతలు స్వయానికే స్పష్టంగా అనుభవమవుతాయి మరియు వాయుమండలం కారణంగా స్వయమే సిగ్గుపడి పరివర్తనైపోతారు. చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పి చూశారు, ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారుచేయండి. జిజ్ఞాసువులు ఇంకా చాలా పెరుగుతారు, ఆ చింత చేయకండి. రాబడి కూడా చాలా పెరుగుతుంది, దీని గురించి కూడా చింత చేయకండి. ఇళ్ళు కూడా లభిస్తాయి, దీని గురించి కూడా చింత చేయకండి. అన్నీ సిద్ధిస్తాయి. ఈ విధి ఎలాంటిదంటే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. అచ్ఛా.

శక్తులు చాలామంది ఉన్నారు, ఆదిలో చాలామంది శక్తులే నిమిత్తంగా అయ్యారు. గోల్డన్ జూబ్లీలో కూడా శక్తులే చాలామంది ఉన్నారు. పాండవులు కొద్దిగానే లెక్కపెట్టే విధంగా ఉన్నారు. అయినా పాండవులు ఉన్నారు. అచ్ఛా, ఆది సమయంలో ధైర్యముంచి సహనం చేయడంలో ఈ ఆదిరత్నాలే ఋజువుగా నిలిచారు. విఘ్న-వినాశకులుగా అయి నిమిత్తులుగా అయి, నిమిత్తంగా తయారుచేసే కార్యంలో అమరులుగా ఉన్నారు కనుక బాప్ దాదాకు కూడా అవినాశీ, అమరభవ వరదాని పిల్లలు సదా ప్రియమైనవారు. మరియు ఈ ఆదిరత్నాలు స్థాపనా సమయంలో, అవసరమైన సమయంలో సహయోగులుగా అయ్యారు కనుక ఇలా నిమిత్తంగా అయ్యే ఆత్మలకు, సమయానికి సహయోగులుగా అయ్యే ఆత్మలకు, ఏదైనా అలాంటి కష్టం వచ్చినప్పుడు బాప్ దాదా కూడా వారికి దాని రిటర్న్ ఇస్తారు. కావున మీరందరూ ఎవరైతే అలాంటి సమయంలో నిమిత్తంగా అయ్యారో దానికి ఈ అదనపు గిఫ్ట్ డ్రామాలో నిర్ణయించబడి ఉంది కనుక మీరు అదనపు బహుమతికి అధికారులు.

అర్థమయిందా - మాతల బిందువు-బిందువుతో తయారైన కొలను ద్వారా స్థాపనా కార్యం ప్రారంభమయింది మరియు ఇప్పుడు సఫలతకు సమీపంగా చేరుకునే చేరుకుంది. మాతలది హృదయపూర్వక సంపాదన, వ్యాపారం ద్వారా సంపాదించింది కాదు. హృదయం ద్వారా సంపాదన, ఒకటి - వేలతో సమానం. స్నేహమనే బీజం వేశారు కనుక స్నేహమనే బీజం యొక్క ఫలాలు ఫలీభూతమవుతున్నాయి, తోడుగా అయితే పాండవులు కూడా ఉన్నారు. పాండవులు లేకుండా కూడా కార్యం జరగదు కాని శక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది కనుక 5 మంది పాండవులని వ్రాసేశారు. అయినా కూడా ప్రవృత్తిని నిర్వహిస్తూ అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయి ధైర్యం మరియు ఉల్లాసానికి ఋజువునిచ్చారు కనుక పాండవులు కూడా తక్కువేమీ కాదు. శక్తుల యొక్క సర్వశక్తివంతుడని గాయనం ఉంది, అలాగే పాండవుల పాండవపతి అని కూడా గాయనం ఉంది కనుక ఏ విధంగా నిమిత్తంగా అయ్యారో, ఆ విధంగా నిమిత్త భావాన్ని సదా స్మృతిలో ఉంచుకుని ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా.

సదా పదమాపదమ భాగ్యానికి అధికారులు, సదా సఫలతకు అధికారులు, సదా స్వయాన్ని శ్రేష్ఠమైన ఆధారమూర్తులమని భావించి అందరినీ ఉద్ధరించే శేష్ఠాత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments