17-10-1987 అవ్యక్త మురళి

17-10-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“బ్రాహ్మణ జీవితం యొక్క అలంకరణ - పవిత్రత”

ఈ రోజు బాప్ దాదా విశేషంగా విశ్వములో నలువైపులా ఉన్న దేవతలుగా కాబోయే తమ పూజ్య పిల్లలను చూస్తున్నారు. మొత్తము విశ్వములో ఎంత కొద్ది మంది అమూల్య రత్నాలు పూజ్యనీయంగా అయ్యారు! పూజ్యనీయ ఆత్మలే విశ్వానికి విశేషమైన వెలుగుగా అవుతారు. ఎలాగైతే ఈ శరీరములో వెలుగు లేకపోతే ప్రపంచం లేదో, అలా విశ్వములో పూజ్యనీయులు, ప్రపంచానికి ప్రకాశమైన శ్రేష్ఠ ఆత్మలైన మీరు లేకపోతే విశ్వానికి కూడా మహత్వము లేదు. స్వర్ణ యుగము లేక ఆది యుగము లేక సతోప్రధాన యుగము, కొత్త ప్రపంచము విశేష ఆత్మలైన మీ ద్వారానే ఆరంభమవుతుంది. మీరు కొత్త విశ్వానికి ఆధారమూర్తులు, పూజ్యనీయ ఆత్మలు. కావున ఆత్మలైన మీకు ఎంతటి మహత్వము ఉంది! పూజ్య ఆత్మలైన మీరు ప్రపంచానికి కొత్త వెలుగు. మీ ఎక్కే కళ విశ్వమును శ్రేష్ఠ కళలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. మీరు పడిపోయే కళలోకి వచ్చినట్లయితే ప్రపంచము కూడా పడిపోయే కళలోకి వస్తుంది. మీరు పరివర్తన అయితే విశ్వము కూడా పరివర్తన అవుతుంది. ఇంతటి మహానులు మరియు మహత్వము కల ఆత్మలు.

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వడము అనగా పూజ్యులుగా అవ్వడము ఎందుకంటే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మరియు దేవతలు అనగా పూజ్యనీయులు. దేవతలందరూ పూజ్యనీయులుగానే ఉంటారు కానీ నంబరువారుగా తప్పకుండా ఉంటారు. కొంతమంది దేవతల పూజ విధిపూర్వకంగా మరియు నియమానుసారంగా జరుగుతుంది మరియు కొందరి పూజ విధిపూర్వకంగా, నియమానుసారంగా జరగదు. కొందరి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది మరియు కొందరికి ప్రతి కర్మకు పూజ జరగదు. కొందరికి విధిపూర్వకంగా ప్రతి రోజు అలంకరణ జరుగుతుంది మరియు కొందరికి ప్రతి రోజూ అలంకరణ జరగదు, పైపైకి ఏదో కాస్త అలంకరిస్తారు కానీ విధిపూర్వకంగా చెయ్యరు. కొందరి ఎదురుగా నిత్యం కీర్తనలు జరుగుతాయి మరియు కొందరి ఎదురుగా అప్పుడప్పుడు కీర్తనలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణము ఏమిటి? అందరూ అయితే బ్రాహ్మణులుగా పిలవబడతారు, అందరూ జ్ఞాన-యోగాల చదువును కూడా చదువుతారు, అయినా సరే ఇంత తేడా ఎందుకుంది? ధారణ చెయ్యటంలో తేడా ఉంది. అయినా కూడా విశేషంగా ఏ ధారణల ఆధారంపై నంబరువారుగా ఉంటారో తెలుసా?

పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము పవిత్రతపై ఉంది. అన్నిరకాల పవిత్రతను ఎంతగా అలవరచుకుంటారో, అంతగానే అన్నిరకాలుగా పూజ్యనీయులుగా అవుతారు మరియు ఎవరైతే నిరంతరము విధిపూర్వకంగా ఆది, అనాది విశేష గుణము యొక్క రూపంతో పవిత్రతను సహజంగా అలవరచుకుంటారో, వారే విధిపూర్వకంగా పూజ్యనీయులుగా అవుతారు. అన్నిరకాల పవిత్రత ఏమిటి? ఏ ఆత్మలైతే సహజంగా, స్వతహాగా ప్రతి సంకల్పములో, మాటలో, కర్మలో సర్వుల అనగా జ్ఞానీ మరియు అజ్ఞానీ ఆత్మలు, అలానే సర్వుల సంపర్కములో సదా పవిత్ర వృత్తి, దృష్టి, వైబ్రేషన్లతో యథార్థమైన సంబంధ-సంపర్కాలను నిర్వర్తిస్తారో - వీరిని అన్నిరకాల పవిత్రత కలవారని అంటారు. స్వప్నములో కూడా, స్వయం పట్లనైనా లేక ఇతర ఏ ఆత్మ పట్లనైనా అన్నిరకాల పవిత్రతలో ఎటువంటి లోపము ఉండకూడదు. స్వప్నములోనైనా బ్రహ్మచర్యము ఖండితమైతే లేక ఏ ఆత్మపట్లనైనా ఈర్ష్య లేక ఆవేశానికి వశమై కర్మ జరగటము లేక మాటలు రావడము, క్రోధము అంశ రూపంలోనైనా వ్యవహారంలోకి రావడము, దీనిని కూడా పవిత్రతా ఖండన జరిగినట్లు భావించడం జరుగుతుంది. ఆలోచించండి, స్వప్నము యొక్క ప్రభావము కూడా పడుతున్నప్పుడు మరి సాకారములో చేసే కర్మకు ఎంతటి ప్రభావము పడుతూ ఉండవచ్చు! కావుననే ఖండితమైన మూర్తి ఎప్పుడూ పూజ్యనీయంగా ఉండదు. ఖండితమైన మూర్తులు మందిరాలలో ఉండవు, ఈ రోజుల్లోని మ్యూజియంలలో ఉంటాయి. అక్కడకు భక్తులు రారు. ఇవి చాలా పాత మూర్తులు అని కేవలము ఇంతవరకే గాయనము ఉంటుంది, అంతే. వారు స్థూల అంగాలు ఖండితము అవ్వడాన్ని ఖండితము అని అన్నారు కానీ వాస్తవానికి ఏ విధమైన పవిత్రతలోనైనా ఖండన జరిగినట్లయితే వారు పూజ్య పదవి నుండి ఖండితులైపోతారు. ఈ విధంగా, నాలుగు రకాల పవిత్రత విధిపూర్వకంగా ఉన్నట్లయితే పూజ కూడా విధిపూర్వకంగా ఉంటుంది.

మనసు, వాణి, కర్మ (కర్మలో సంబంధ-సంపర్కాలు వచ్చేస్తాయి) మరియు స్వప్నములో కూడా పవిత్రత - దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. చాలామంది పిల్లలు నిర్లక్ష్యములోకి వచ్చిన కారణంగా - నా భావము చాలా మంచిది కానీ మాట అలా వచ్చేసింది, లేదా నా లక్ష్యము అది కాదు కానీ అలా జరిగిపోయింది, లేదా ఏదో నవ్వులాటకు అన్నాను లేక చేసాను అని అంటూ పెద్దవారిని అయినా, చిన్నవారిని అయినా ఈ విషయంలో మభ్య పెట్టాలని చూస్తారు. ఇది కూడా నడిపించడమే కావున పూజ కూడా ఏదో నడిపించాము అన్నట్లుగా ఉంటుంది. ఈ నిర్లక్ష్యము సంపూర్ణ పూజ్య స్థితిని నంబరువారులోకి తీసుకువస్తుంది. ఇది కూడా అపవిత్రత ఖాతాలో జమ అవుతుంది. పూజ్య, పవిత్ర ఆత్మల గుర్తు ఇదే - వారి నాలుగు రకాలైన పవిత్రత స్వాభావికంగా, సహజంగా మరియు సదా ఉంటుందని వినిపించాము కదా. వారికి ఆలోచించవలసిన అవసరము ఉండదు, కానీ పవిత్రత యొక్క ధారణ స్వతహాగానే యథార్థ సంకల్పాలను, మాటలను, కర్మలను మరియు స్వప్నాలను తీసుకువస్తుంది. యథార్థము అనగా ఒకటేమో యుక్తియుక్తము, మరొక యథార్థము అనగా ప్రతి సంకల్పములో అర్థము ఉంటుంది, అర్థము లేకుండా ఉండదు. ఏదో మాట్లాడేసాను, వచ్చేసింది, చేసేసాను, అయిపోయింది అని ఇలా ఉండదు. ఇటువంటి పవిత్ర ఆత్మ సదా ప్రతి కర్మలో అనగా దినచర్యలో యథార్థంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. కావుననే పూజ కూడా వారి ప్రతి కర్మకు జరుగుతుంది అనగా పూర్తి దినచర్యకు జరుగుతుంది. మేల్కొన్నప్పటి నుండి పడుకునేంత వరకు రకరకాల కర్మల దర్శనము జరుగుతుంది.

బ్రాహ్మణ జీవితములో తయారైయున్న దినచర్య ప్రమాణంగా ఒకవేళ ఏ కర్మ అయినా యథార్థంగా మరియు నిరంతరం చేయకపోతే, ఆ తేడా కారణంగా పూజలో కూడా తేడా వస్తుంది. ఉదాహరణకు ఎవరైనా అమృతవేళ లేచే దినచర్యలో విధిపూర్వకంగా నడవకపోతే, పూజలో వారి పూజారి కూడా ఆ విధిలో కింద-మీద చేస్తారు అనగా పూజారి కూడా సమయానికి లేచి పూజ చేయరు, ఎప్పుడు తోస్తే అప్పుడు చేస్తారు మరియు అమృతవేళ జాగృత స్థితిని అనుభవము చేయకపోతే, తప్పదు అన్నట్లుగానో లేక ఒక్కోసారి సోమరితనంతో, ఒక్కోసారి చురుకుగా కూర్చున్నట్లయితే పూజారి కూడా ఏదో తప్పదన్నట్లుగా లేక సోమరితనంతో పూజ చేస్తారు, విధిపూర్వకంగా పూజ చెయ్యరు. ఇలా పూజ్యనీయులుగా అవ్వడానికి దినచర్యలోని ప్రతి కర్మ యొక్క ప్రభావము పడుతుంది. విధిపూర్వకంగా నడవకపోవడము, దినచర్యలో ఏదైనా కింద-మీద అవ్వడము - ఇది కూడా అపవిత్రత యొక్క అంశముగా లెక్కింపబడుతుంది ఎందుకంటే సోమరితనము మరియు నిర్లక్ష్యము కూడా వికారాలు. ఏదైతే యథార్థ కర్మ కాదో, అది వికారము కావున అది అపవిత్రత యొక్క అంశమైపోయింది కదా! దీని కారణంగా పూజ్య పదవిలో నంబరువారుగా అయిపోతారు. కావున పునాది ఏమైంది? పవిత్రత.

పవిత్రతా ధారణ చాలా సూక్ష్మమైనది. పవిత్రత ఆధారంగానే కర్మ యొక్క విధి మరియు గతి ఆధారపడి ఉంటుంది. పవిత్రత అనేది కేవలము స్థూలమైన విషయం కాదు. బ్రహ్మచారిగా ఉండడం లేక నిర్మోహిగా అవ్వడం - కేవలము దీనినే పవిత్రత అని అనరు. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క అలంకరణ. కావున ప్రతి సమయము ముఖము ద్వారా, నడవడిక ద్వారా ఇతరులకు పవిత్రతా అలంకరణ యొక్క అనుభూతి కలగాలి. దృష్టిలో, ముఖంలో, చేతులలో, పాదాలలో సదా పవిత్రతా అలంకరణ ప్రత్యక్షమవ్వాలి. ఎవరైనా ముఖం వైపు చూసినట్లయితే వారికి ఫీచర్స్ ద్వారా పవిత్రత అనుభవమవ్వాలి. ఎలాగైతే వేరే రకాల ఫీచర్స్ ను వర్ణిస్తారో, అలా వీరి ఫీచర్స్ (ముఖ కవళికలు) ద్వారా పవిత్రత కనిపిస్తుంది, కళ్ళల్లో పవిత్రతా మెరుపు ఉంది, ముఖముపై పవిత్రతా చిరునవ్వు ఉంది అని వర్ణించాలి. మరే ఇతర విషయాలు వారికి కనిపించకూడదు. దీనినే పవిత్రతా అలంకరణతో అలంకరింపబడిన మూర్తి అని అంటారు. అర్థమైందా? పవిత్రతకైతే ఇంకా ఎంతో గుహ్యత ఉంది, అది తర్వాత వినిపిస్తాము. ఏ విధంగా కర్మల గతి లోతైనదో, అలా పవిత్రత యొక్క నిర్వచనము కూడా చాలా గుహ్యమైనది మరియు పవిత్రతయే పునాది. అచ్ఛా.

ఈ రోజు గుజరాత్ వారు వచ్చారు. గుజరాత్ వారు సదా తేలికగా అయ్యి నాట్యం చేస్తూ, పాడుతూ ఉంటారు. శారీరకంగా ఎంత భారీగా ఉన్నాగానీ తేలికగా అయ్యి నాట్యము చేస్తారు. సదా తేలికగా ఉండటము, సదా సంతోషంలో నాట్యము చేస్తూ ఉండటము మరియు తండ్రి గురించి మరియు తమ ప్రాప్తుల గురించి పాటలను పాడుతూ ఉండటము గుజరాత్ విశేషత. చిన్నతనము నుండే బాగా నాట్యం చేస్తూ, పాడుతూ ఉంటారు. బ్రాహ్మణ జీవితంలో ఏం చేస్తారు? బ్రాహ్మణ జీవితము అనగా ఆనందాల జీవితము. గర్బా రాస్ చేసినప్పుడు ఆనందములోకి వచ్చేస్తారు కదా. ఒకవేళ ఆనందములోకి రాకపోతే ఎక్కువగా చెయ్యలేరు. మౌజ్-మస్తీ (అమితానందము, నషా)లో అలసట ఉండదు, అలసిపోనివారిగా అయిపోతారు. కావున బ్రాహ్మణ జీవితము అనగా సదా ఆనందంలో ఉండే జీవితము, అది స్థూలమైన ఆనందము మరియు బ్రాహ్మణ జీవితంలో మనసు యొక్క ఆనందము. సదా మనసు ఆనందముతో నాట్యం చేస్తూ మరియు పాడుతూ ఉండాలి. వారు తేలికగా అయ్యి ఆడే-పాడే అభ్యాసం ఉన్నవారు. కావున వారికి బ్రాహ్మణ జీవితములో కూడా డబల్ లైట్ (తేలిక)గా అవ్వటంలో కష్టమవ్వదు. కావున గుజరాత్ అనగా సదా తేలికగా ఉండే అభ్యాసం ఉన్నవారనండి, వరదానులు అనండి. కావున గుజరాత్ అంతటికీ డబల్ లైట్ అన్న వరదానము లభించింది. మురళి ద్వారా కూడా వరదానాలు లభిస్తాయి కదా.

మీ ఈ ప్రపంచములో యథా శక్తి, యథా సమయము ఉంటాయని వినిపించాము కదా. యథా మరియు తథా. వతనములో అయితే యథా-తథా అన్న భాషే లేదు. ఇక్కడ పగలును మరియు రాత్రిని కూడా చూడవలసి ఉంటుంది. అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, సూర్యుడు ఉదయించడు, చంద్రుడు ఉండడు. రెండింటి నుండి అతీతముగా ఉంటుంది. అక్కడికే రావాలి కదా. ఎప్పటివరకు అని పిల్లలు ఆత్మిక సంభాషణలో అన్నారు కదా. మేము తయారుగా ఉన్నామని మీరందరూ అన్నట్లయితే ‘ఇప్పుడే’ చేసేస్తాము అని బాప్ దాదా అంటారు. ఇక తరువాత ‘ఎప్పుడు’ అన్న ప్రశ్నే ఉండదు. ఎప్పటివరకైతే మొత్తము మాల తయారవ్వదో, అప్పటివరకు ‘ఎప్పుడు’ అనేది ఉంటుంది. ఇప్పుడు పేర్లు తీసేందుకు కూర్చొంటే, 108 లోకి కూడా ఫలానా పేరు వేయాలా, వద్దా అని ఆలోచిస్తారు. ఇప్పుడు, 108 మాలలోకి కూడా అందరూ అవే 108 పేర్లు చెప్పాలి. అలా జరగదు, తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా అయితే ఈ క్షణమే చప్పట్లు మ్రోగిస్తే వెంటనే ప్రారంభమైపోతుంది - ఒకవైపు ప్రకృతి, ఒకవైపు వ్యక్తులు. ఇంకేమి ఆలస్యం ఉంటుంది. కానీ తండ్రికి పిల్లలందరి పట్ల స్నేహము ఉంది. చేతిని పట్టుకుంటారు, అప్పుడే మీరు తోడుగా వెళ్తారు. చేతితో చేయి కలపడం అనగా సమానంగా అవ్వడము. అందరూ సమానంగా లేక అందరూ నంబరు వన్గా అయితే అవ్వరు కదా అని మీరు అంటారు. కానీ నంబరు వన్ వెనుక నంబరు టూ ఉంటుంది. అచ్ఛా, తండ్రి సమానంగా అవ్వలేదు కానీ నంబరు వన్ పూసగా ఎవరైతే ఉంటారో వారి సమానంగా అవుతారు. మూడవ వారు రెండవ వారి సమానంగా అవ్వాలి. నాల్గవవారు మూడవవారి సమానంగా అవ్వాలి. ఇలా సమానంగా అవ్వాలి, అప్పుడు ఒకరికొకరు సమీపంగా అవుతూ-అవుతూ మాల తయారవ్వాలి. ఇటువంటి స్థితి వరకు చేరుకోవడము అనగా సమానంగా అవ్వడము. 108వ పూస 107తో కలుస్తుంది కదా. వారి లాంటి విశేషతలు వచ్చినా కానీ మాల తయారైపోతుంది. నంబరువారుగా అయితే అవ్వవలసిందే. అర్థమైందా? అవును, అందరూ తయారుగా ఉన్నారు అని గ్యారంటీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని తండ్రి అంటారు. బాప్ దాదాకైతే క్షణం పడుతుంది. చప్పట్లు మ్రోగించారు మరియు దేవదూతలు వచ్చేసారు అనే దృశ్యాన్ని చూపించారు కదా. అచ్ఛా.

నలువైపుల యొక్క పరమ పూజ్య శ్రేష్ఠ ఆత్మలకు, సంపూర్ణ పవిత్రతా లక్ష్యము వరకు చేరుకునే సర్వ తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా ప్రతి కర్మలో విధిపూర్వకంగా కర్మలు చేసే సిద్ధి-స్వరూప ఆత్మలకు, సదా ప్రతి సమయము పవిత్రతా అలంకరణతో అలంకరింపబడి ఉన్న విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు.

పార్టీలతో కలయిక

1. విశ్వములో అందరికంటే ఎక్కువ శ్రేష్ఠ భాగ్యవంతులుగా స్వయాన్ని భావిస్తారా? మొత్తము విశ్వమంతా మా భాగ్యము తెరుచుకోవాలని ఆ శ్రేష్ఠ భాగ్యము కోసం పిలుస్తూ ఉంది. మీ భాగ్యమైతే తెరుచుకుంది. ఇంతకంటే సంతోషకరమైన విషయము ఇంకేముంటుంది! భాగ్యవిధాతయే మా తండ్రి - అటువంటి నషా ఉంది కదా! ఎవరికైతే పేరే భాగ్య విధాత అని ఉన్నదో, వారి భాగ్యము ఎలా ఉంటుంది! దీనికంటే పెద్ద భాగ్యము ఇంకేదైనా ఉండగలదా? కావున భాగ్యము మా జన్మ సిద్ధ అధికారమైపోయింది అని సదా ఈ సంతోషం ఉండాలి. తండ్రి వద్ద ఏ ప్రాపర్టీ అయితే ఉంటుందో, పిల్లలు దానికి అధికారులుగా ఉంటారు. మరి భాగ్యవిధాత వద్ద ఏముంది? భాగ్యపు ఖజానా. ఆ ఖజానాపై మీకు అధికారం ఏర్పడింది. కావున సదా ‘వాహ్, నా భాగ్యము మరియు భాగ్యవిధాత తండ్రి’ అన్న ఈ పాటనే పాడుతూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఎవరికైతే ఇంత శ్రేష్ఠ భాగ్యము కలిగిందో, వారికి ఇంకేమి కావాలి? భాగ్యములో అన్నీ వచ్చేసాయి. భాగ్యవంతుల వద్ద తనువు-మనసు-ధనము-జనము అన్నీ ఉంటాయి. శ్రేష్ఠ భాగ్యము అనగా అప్రాప్తి అన్న వస్తువే ఉండదు. ఏదైనా అప్రాప్తి ఉందా? మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి...... ఇలా లేదు. ఎవరికైతే మానసిక సంతోషము లభించిందో, వారికి సర్వ ప్రాప్తులు లభించాయి! కారు ఏమిటి, వారికి అపారమైన ఖజానా లభించింది! అప్రాప్తి వస్తువనేదే లేదు. మీరు అటువంటి భాగ్యవంతులు! వినాశీ కోరికను ఏం చేసుకుంటారు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు - అటువంటి కోరికలు ఏమి పెట్టుకుంటారు. అందుకే, సదా అవినాశీ ఖజానాల సంతోషంలో ఉండండి, అవి ఇప్పుడూ ఉంటాయి మరియు తోడుగా కూడా వస్తాయి. ఈ ఇల్లు, కారు లేక ధనం తోడుగా రావు కానీ ఈ అవినాశీ ఖజానా అనేక జన్మలు తోడుగా ఉంటుంది. ఎవరూ లాక్కోలేరు, ఎవరూ దోచుకోలేరు. స్వయము కూడా అమరులుగా అయ్యారు మరియు ఖజానా కూడా అవినాశీ అయినది లభించింది. జన్మ-జన్మలకూ ఈ శ్రేష్ఠ ప్రారబ్ధము తోడుగా ఉంటుంది. ఇది ఎంత పెద్ద భాగ్యము! ఎక్కడైతే ఎటువంటి కోరిక ఉండదో, ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉంటారో - ఆ శ్రేష్ఠ భాగ్యము భాగ్యవిధాత తండ్రి ద్వారా ప్రాప్తించినది.

2. స్వయాన్ని తండ్రికి సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? తండ్రికి చెందినవారిగా అయిపోయాము అన్న ఈ సంతోషము సదా ఉంటుందా? దుఃఖపు ప్రపంచము నుండి బయటపడి సుఖపు ప్రపంచములోకి వచ్చారు. ప్రపంచము దుఃఖంలో ఆర్తనాదాలు చేస్తుంది మరియు మీరు సుఖపు ప్రపంచములో, సుఖపు ఊయలలో ఊగుతూ ఉన్నారు. ఎంత తేడా ఉంది! ప్రపంచము వెతుకుతూ ఉంది మరియు మీరు మిలనమును జరుపుకుంటున్నారు. కావున సదా మీ సర్వ ప్రాప్తులను చూసి హర్షితంగా ఉండండి. ఏమేమి లభించాయో, వాటి లిస్టును తయారు చేసినట్లయితే చాలా పెద్ద లిస్టు అయిపోతుంది. ఏమేమి లభించాయి? తనువుకు సంతోషము లభించింది కావున శరీరం ఆరోగ్యంగా ఉంది, మనసుకు శాంతి లభించింది, శాంతి మనసు యొక్క విశేషత మరియు ధనములో ఎంతటి శక్తి వచ్చిందంటే పప్పు-రొట్టె కూడా 36 రకాల సమానంగా అనుభవమవుతుంది. ఈశ్వరీయ స్మృతిలో పప్పు-రొట్టె కూడా ఎంత శ్రేష్ఠంగా అనిపిస్తుంది! ప్రపంచంలోని 36 రకాలు మరియు మీ పప్పు-రొట్టె, వీటిలో ఏది శ్రేష్ఠంగా అనిపిస్తుంది? పప్పు-రొట్టె మంచిది కదా ఎందుకంటే అది ప్రసాదం కదా! భోజనాన్ని తయారు చేసినప్పుడు స్మృతిలో తయారుచేస్తారు, స్మృతిలో తింటారు కావున అది ప్రసాదంగా అయింది. ప్రసాదానికి మహత్వము ఉంటుంది. మీరందరూ ప్రతిరోజూ ప్రసాదాన్ని తింటారు. ప్రసాదంలో ఎంత శక్తి ఉంటుంది! కావున తనువు-మనసు-ధనము అన్నింటిలో శక్తి వచ్చేసింది కనుకనే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ ఉండదని అంటారు. కావున సదా ఈ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకుని సంతోషంగా ఉండండి, హర్షితంగా ఉండండి. అచ్ఛా.

Comments