16-02-1988 అవ్యక్త మురళి

16-02-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

 సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకోండి.

ఈ రోజు విశ్వేశ్వరుడైన తండ్రి విశ్వంలోని తమ శ్రేష్ఠ రచనను మరియు శ్రేష్ఠ ఆది రత్నాలను, అతి స్నేహీ మరియు సమీపమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. విశ్వంలోని సర్వాత్మలు విశ్వేశ్వరుడైన తండ్రి పిల్లలే కానీ బ్రాహ్మణాత్మలు అతి స్నేహీ మరియు సమీపమైన ఆత్మలు ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఆది రచన. బాబాతో పాటు బ్రాహ్మణాత్మలు కూడా బ్రాహ్మణ జీవితంలో అవతరించి బాబా కార్యంలో సహయోగి ఆత్మలుగా అవుతారు కనుక బాప్ దాదా ఈ రోజు పిల్లల యొక్క బ్రాహ్మణ జీవన అవతరణ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు బాబా జన్మదినాన్ని జరుపుకునేందుకు ఉల్లాస-ఉత్సాహాలతో సంతోషంగా నాట్యం చేస్తున్నారు. కానీ బాప్ దాదా పిల్లల యొక్క ఈ బ్రాహ్మణ జీవితాన్ని చూసి, స్నేహం మరియు సహయోగంలో బాబాతో పాటు ప్రతి కార్యంలో ధైర్యంతో ముందుకు వెళ్ళడాన్ని చూసి హర్షిస్తున్నారు. కనుక మీరు బాప్ దాదా జన్మదినాన్ని జరుపుకుంటారు, బాబా పిల్లల జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇది బ్రాహ్మణులైన మీ జన్మదినం కూడా కదా. కనుక బాప్ దాదా అందరికి, జగదంబ మరియు మీ సాథీలైన అడ్వాన్స్ పార్టీలోని విశేషమైన శ్రేష్ఠ ఆత్మలందరి సహితంగా మీ అలౌకిక బ్రాహ్మణ జన్మ కొరకు స్నేహంతో బంగారు పుష్పాల వర్షం సహితంగా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇవి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, కేవలం నోటితో తెలిపే శుభాకాంక్షలు కాదు. హృదయాభిరాముడైన బాబా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, వారు సమ్ముఖంలో కూర్చున్నా లేక మనసుతో బాబా సమ్ముఖంలో ఉన్నా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.

ఈ రోజు భక్త ఆత్మలకు తండ్రి యొక్క బిందు రూపం విశేషంగా స్మృతి ఉంటుంది. శివజయంతి లేక శివరాత్రి సాకార రూపానికి గల స్మృతిచిహ్నం కాదు. కానీ జ్యోతిర్బిందు స్వరూపుడైన నిరాకార తండ్రి, ఎవరినైతే శివలింగ రూపంలో పూజిస్తారో, ఆ బిందువుకు మహత్వముంది. మీ అందరి మనసులో కూడా బాబా యొక్క బిందు రూపం సదా స్మృతి ఉంటుంది. మీరు కూడా బిందువే మరియు బాబా కూడా బిందువే కావున ఈ రోజు భారతదేశంలో ప్రతి భక్త ఆత్మ లోపల విశేషంగా బిందు రూపానికి మహత్వముంటుంది. బిందువు ఎంత సూక్ష్మమైనదో, అంత శక్తిశాలి కూడా, అందుకే బిందువైన తండ్రినే శక్తులలో, గుణాలలో, జ్ఞానములో సాగరుడని అంటారు. ఈ రోజు పిల్లలందరి మనసులో జన్మదినం యొక్క విశేషమైన ఉత్సాహంతో కూడిన అలలు బాప్ దాదా వద్దకు అమృతవేళ నుండి చేరుకుంటున్నాయి. ఎలాగైతే పిల్లలైన మీరు విశేషంగా సేవార్థం మరియు స్నేహ స్వరూపులుగా అయి బాబా జెండాను ఎగరవేశారో, అలా బాబా ఏ జెండాను ఎగరవేశారు? మీరందరూ శివబాబా జెండాను ఎగరవేశారు, మరి బాబా ఈ జెండాను ఎగరవేస్తారా? సాకార రూపంలో ఈ సేవా బాధ్యతను పిల్లలకు ఇచ్చేసారు. బాబా కూడా జెండాను ఎగరవేశారు కానీ ఏ జెండాను మరియు ఎక్కడ ఎగరవేశారు? బాప్ దాదా తన హృదయంలో పిల్లలందరి విశేషతల యొక్క స్నేహమనే జెండాను ఎగరవేశారు. ఎన్ని జెండాలను ఎగరవేసి ఉంటారు? ఈ ప్రపంచంలో ఇన్ని జెండాలను ఎవరూ ఎగరవేయలేరు. ఇది ఎంత సుందరమైన దృశ్యమై ఉంటుంది!

పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత రూపీ జెండా బాప్ దాదా హృదయంలో ఎగురుతూ ఉంది. కేవలం మీరు మాత్రమే జెండాను ఎగరవేయలేదు, బాప్ దాదా కూడా ఎగరవేశారు. జెండాను ఎగరవేసే సమయంలో ఏమి జరుగుతుంది? పుష్పాల వర్షం కురుస్తుంది. బాప్ దాదా కూడా పిల్లల విశేషతల పట్ల స్నేహం యొక్క జెండాను ఎగరవేసినప్పుడు ఏ వర్షం కురుస్తుంది? పిల్లలు ప్రతి ఒక్కరి పై ‘అవినాశీ భవ’, ‘అమర భవ’, ‘అచల్-అడోల్ భవ’ - ఈ వరదానాల వర్షం కురుస్తుంది. ఈ వరదానాలే బాప్ దాదా కురిపించే అవినాశీ అలౌకిక పుష్పాలు. బాప్ దాదాకు ఈ అవతరణ రోజు సందర్భంగా అనగా శివజయంతి సందర్భంగా పిల్లల కంటే ఎక్కువ సంతోషముంది, సంతోషమే సంతోషముంది. ఎందుకంటే ఈ అవతరణ రోజును ప్రతి సంవత్సరం స్మృతిచిహ్నంగా అయితే జరుపుకుంటారు కానీ ఎప్పుడైతే బాబా సాకార బ్రహ్మ తనువులో అవతరిస్తారో, అప్పుడు బాప్ దాదాకు అందులోనూ విశేషంగా శివబాబాకు ఒక విషయంలో సంతోషముంటుంది. అది ఏమిటంటే - ఎంత సమయం నుండి బాబా తన సమీపమైన స్నేహీ పిల్లల నుండి వేరుగా పరంధామంలో ఉన్నారు, పరంధామంలో వేరే ఆత్మలు ఉండవచ్చు కానీ మొదటి రచనకు చెందిన ఆత్మలు, బాబా సమానంగా తయారవ్వబోతున్న సేవా సాథీ ఆత్మలు, చాలా సమయం తర్వాత బాబా అవతరించినప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకుంటారు! ఎంతో సమయం నుండి విడిపోయిన శ్రేష్ఠ ఆత్మలు మళ్ళీ వచ్చి కలుసుకుంటారు. ఒకవేళ ఎవరైనా అతి స్నేహీలైన విడిపోయినవారు కలిస్తే, సంతోషంలో కూడా విశేషమైన సంతోషం ఉంటుంది కదా. అవతరణ రోజు అనగా తమ ఆది రచనను మళ్ళీ కలుసుకోవడము. మాకు తండ్రి లభించారని మీరు అనుకుంటారు మరియు నాకు పిల్లలు లభించారని తండ్రి అంటారు. కనుక తండ్రికి తన ఆది రచన విషయంలో గర్వంగా ఉంది. మీరందరూ ఆది రచనయే కదా, క్షత్రియులైతే కాదు కదా? మీరందరూ సూర్యవంశీ ఆది రచనయే. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు కదా! కనుక బ్రాహ్మణాత్మలు ఆది రచన. వాస్తవానికి అందరూ అనాది రచనయే, విశ్వంలోని ఆత్మలందరూ రచనయే. కానీ మీరు అనాది మరియు ఆది రచన కావున డబల్ నషా ఉంది కదా.

ఈ రోజు బాప్ దాదా విశేషంగా ఒక స్లోగన్ ఇస్తున్నారు. ఈ రోజును ఉత్సవం రోజు అని అంటారు. శివరాత్రి లేక శివజయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారు. బ్రాహ్మణ జీవితంలోని ప్రతి ఘడియ ఉత్సవ ఘడియనే అనే స్లోగన్ ను ఈ ఉత్సవం రోజున గుర్తుంచుకోండి. బ్రాహ్మణ జీవితం అనగా సదా ఉత్సవాన్ని జరుపుకోవడం, సదా ఉత్సాహంలో ఉండడం మరియు సదా ప్రతి కర్మలో ఆత్మకు ఉత్సాహాన్ని అందించడం. కనుక ఉత్సవాన్ని జరుపుకోవాలి, ఉత్సాహంలో ఉండాలి మరియు ఇతరులకు ఉత్సాహాన్ని అందించాలి. ఎక్కడైతే ఉత్సాహం ఉంటుందో, అక్కడ ఎప్పుడూ కూడా, ఏ రకమైన విఘ్నము ఉత్సాహం కల ఆత్మను ఉత్సాహం నుండి దూరం చేయలేదు. ఎలాగైతే అల్పకాలికమైన ఉత్సాహంలో అన్ని విషయాలను మర్చిపోతారు కదా. ఏదైనా ఉత్సవాన్ని జరుపుకొనేటప్పుడు, ఆ సమయంలో సంతోషం తప్ప ఇంకేమీ గుర్తుండదు. అలా బ్రాహ్మణ జీవితంలో ప్రతి ఘడియ ఉత్సవమే అనగా ప్రతి ఘడియ ఉత్సాహంలో ఉంటారు. అప్పుడిక వేరే విషయాలేవైనా వస్తాయా? ఏదైనా హద్దులోని ఉత్సవానికి వెళ్తే అక్కడ ఏమి ఉంటుంది? నాట్యం చేయడం, పాడడం, ఆటలు చూడడం మరియు తినడం - ఇవే ఉంటాయి కదా. మరి బ్రాహ్మణ జీవితమనే ఉత్సవంలో మొత్తం రోజంతా ఏమి చేస్తారు? సేవ చేసినా కానీ ఆటగా భావిస్తూ చేస్తారు కదా లేక భారమనిపిస్తుందా? నేటి ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మలు బుద్ధి ద్వారా కొద్దిగా పని చేసినా - ‘చాలా అలసిపోయాము, బుద్ధి పైన పని భారం చాలా ఉంది’ అని అంటారు. కానీ మీరు సేవ చేసి వచ్చినప్పుడు ఏమంటారు? సేవ యొక్క మేవాను (ఫలాన్ని) తిని వచ్చామని అంటారు ఎందుకంటే ఎంత పెద్ద సేవకు నిమిత్తమవుతారో, అంతగా ఆ సేవ యొక్క ప్రత్యక్షఫలం చాలా గొప్పగా మరియు ఎక్కువగా లభిస్తుంది. ప్రత్యక్షఫలం తినడం ద్వారా ఇంకా శక్తి వస్తుంది కదా. సంతోషం యొక్క శక్తి పెరుగుతుంది. అందుకే, శరీరంతో చేయాల్సిన ఎంత కఠినమైన కార్యమైనా లేక బుద్ధితో చేయాల్సిన ప్లాను చేసే కార్యమైనా, మీకు అలసట ఉండదు. ఇది పగలా లేక రాత్రా అనేది కూడా తెలియదు కదా! ఒకవేళ మీ వద్ద గడియారం లేకపోతే టైమ్ ఎంత అయింది అనేది మీకేమైనా తెలుస్తుందా? మీరు ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు, అందుకే సేవ ఉత్సాహాన్ని కలిగిస్తుంది మరియు ఉత్సాహాన్ని అనుభవం చేయిస్తుంది.

బ్రాహ్మణ జీవితంలో ఒకటేమో సేవ, ఇక రెండవది ఏమిటి? మాయ వస్తుంది. మాయ గురించి విని నవ్వుతారు ఎందుకంటే మాయకు మేమంటే ఎక్కువ ప్రేమ అని అనుకుంటారు. మీకు దాని పట్ల ప్రేమ లేదు కానీ దానికి మీ పట్ల ప్రేమ ఉంది. ఉత్సవంలో ఆటలు కూడా చూస్తారు. ఈ రోజుల్లో అందరికీ ఎక్కువగా ఏ ఆట ఇష్టమనిపిస్తుంది? మిక్కీ-మౌస్ ఆటలను చాలా ఆడుతారు. ప్రకటనలు కూడా మిక్కీ-మౌస్ ఆటల రూపంలో చూపిస్తారు. అయితే మ్యాచ్ ను ఇష్టపడతారు లేక మిక్కీ-మౌస్ ఆటలను ఇష్టపడతారు. మరి ఇక్కడ కూడా మాయ వస్తే మ్యాచ్ ఆడండి, గురి చూసి కొట్టండి. ఆటలో ఏమి చేస్తారు? బంతి వస్తుంది, మీరు ఆ బంతిని మళ్ళీ ఇంకొకరి వైపుకు విసురుతారు, క్యాచ్ పట్టుకుంటే విజయులుగా అవుతారు. అలాగే ఇవి మాయ యొక్క బంతులు - అప్పుడప్పుడు కామం రూపంలో వస్తుంది, అప్పుడప్పుడు క్రోధం రూపంలో వస్తుంది. ఇది మాయ ఆట అనే విషయాన్ని క్యాచ్ చేయండి. ఒకవేళ మాయ ఆటను ఆటగా భావిస్తూ ఆడినట్లయితే ఉత్సాహం పెరుగుతుంది మరియు ఒకవేళ మాయ యొక్క పరిస్థితిని శత్రువుగా భావిస్తూ చూస్తే భయపడిపోతారు. మిక్కీ-మౌస్ ఆటలో ఒక్కోసారి కోతి వస్తుంది, ఒక్కోసారి పిల్లి, ఒక్కోసారి కుక్క, ఒక్కోసారి ఎలుక వస్తుంది, కానీ మీరేమైనా భయపడతారా? చూడడంలో మజా వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా మాయ యొక్క భిన్న-భిన్న పరిస్థితుల ఆటలను ఉత్సవం రూపంలో చూడండి. ఆట చూసేటప్పుడు ఎవరైనా భయపడితే ఏమంటారు? ఆట చూస్తూ-చూస్తూ, ఎవరైనా ‘బంతి నా వద్దకే వస్తుంది, నాకే తగులుతుందేమో’ అని ఆలోచిస్తే, వారు ఆటను చూడగలరా? కనుక సంతోషంగా మరియు ఆనందంగా ఆటను చూడండి, మాయకు భయపడకండి. మనోరంజనంగా భావించండి. సింహం రూపంలో వచ్చినా కానీ భయపడకండి. బ్రాహ్మణ జీవితంలోని ప్రతి ఘడియ ఉత్సవము మరియు ఉత్సాహభరితమైనదని గుర్తుంచుకోండి. దాని మధ్యలోనే ఈ ఆటను కూడా చూస్తున్నారు, సంతోషంగా నాట్యం కూడా చేస్తున్నారు. అంతేకాక బాబా మరియు బ్రాహ్మణ పరివారం యొక్క విశేషతలు, గుణాల పాటలను కూడా పాడుతున్నారు మరియు బ్రహ్మాభోజనాన్ని కూడా ఆనందంగా తింటున్నారు.

మీకు లభించే శుద్ధమైన భోజనం, స్మృతిలో తయారుచేసే భోజనం విశ్వంలో ఎవ్వరికీ ప్రాప్తించదు! ఈ భోజనాన్నే దుఃఖాన్ని హరించే భోజనమని అంటారు. స్మృతిలో తయారుచేసే భోజనం అన్ని దుఃఖాలను దూరం చేస్తుంది ఎందుకంటే శుద్ధమైన ఆహారంతో తనువు, మనసు రెండూ శుద్ధంగా అవుతాయి. ఒకవేళ ధనం కూడా అశుద్ధమైనది వస్తే, ఆ అశుద్ధ ధనము సంతోషాన్ని మాయం చేసి, చింతను తీసుకొస్తుంది. ఎంత అశుద్ధ ధనం వస్తుందో, ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు ధనం వస్తే దానికి పదమాల రెట్ల చింత వస్తుంది. చింతను సదా చితి అని అంటారు. మరి చితిపై కూర్చొనే వారికి సంతోషమెలా ఉంటుంది! శుద్ధమైన ఆహారం మనసును శుద్ధం చేస్తుంది, అందుకే ధనం కూడా శుద్ధమవుతుంది. స్మృతిలో తయారుచేసే భోజనానికి మహత్వముంది, అందుకే బ్రహ్మాభోజనానికి మహిమ ఉంది. ఒకవేళ స్మృతిలో తయారుచేయకుండా తిన్నట్లయితే, ఆ ఆహారం స్థితిని కింద-మీద చేయగలదు. స్మృతిలో తయారుచేసి, స్మృతిలో స్వీకరించే ఆహారం ఔషధం వలె పని చేస్తుంది మరియు ఆశీర్వాదములా కూడా పని చేస్తుంది. స్మృతిలో తయారుచేసే ఆహారం ఎప్పుడూ నష్టం కలిగించదు, అందుకే ప్రతి ఘడియ ఉత్సవం జరుపుకోండి. మాయ ఏ రూపంలోనైనా రానివ్వండి. అచ్ఛా! ఒకవేళ మోహం రూపంలో వస్తే కోతి ఆట చూపించేందుకు వచ్చిందని భావించండి. ఆ ఆటను సాక్షీగా అయి చూడండి, అంతేకానీ మీరు స్వయం మాయ చక్రంలోకి రాకండి. చక్రంలోకి వస్తే భయపడతారు. ఈ రోజుల్లో చిన్న-చిన్న పిల్లలతో మనోరంజనం ఆటలను ఆడించేటప్పుడు, వారిని పైకి కూడా ఎక్కిస్తారు, కిందికి కూడా తీసుకొస్తారు. కనుక ఇది మనోరంజనము, ఆట. ఏ రూపంలో వచ్చినా మిక్కీ-మౌస్ ఆటను చూసినట్లుగా చూడండి. ఏదైతే వస్తుందో, అది వెళ్ళిపోతుంది కూడా. మాయ ఏ రూపంలో వచ్చినా సరే, ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతుంది. మీరు మాయతో పాటు మీ శ్రేష్ఠ స్థితి నుండి వెళ్ళిపోకండి, మాయను రానివ్వండి. మీరు దానితో పాటు ఎందుకు వెళ్తారు? ఆటలో కూడా కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి, కొన్ని మారతాయి. ఒకవేళ సీన్లు మారకపోతే ఆట బాగా అనిపించదు. అలాగే మాయ కూడా ఏ రూపంలో వచ్చినా, ఏ సీన్ వచ్చినా అది తప్పకుండా మారాల్సిందే. సీన్లు మారినా కానీ మీ శ్రేష్ఠ స్థితి మారకూడదు. ఏదైనా ఆటలో ఎవరైనా పాత్రను అభినయిస్తూ ఉంటే, మీరు కూడా వారితో పాటు అలా పరుగెత్తడం మొదలుపెడతారా? చూసేవారు కేవలం చూస్తూ ఉంటారు కదా. కనుక మాయ కింద పడేసేందుకు వచ్చినా లేక ఏ స్వరూపంలో వచ్చినా, మీరు దాని ఆటను చూడండి. ఏ రూపంలో కింద పడేసేందుకు వచ్చిందో, ఆ రూపాన్ని క్యాచ్ చేయండి, ఆటగా భావిస్తూ ఆ దృశ్యాన్ని సాక్షీగా చూడండి. భవిష్యత్తు కోసం మరియు స్వస్థితిని దృఢంగా చేసుకోవడం కోసం శిక్షణను తీసుకొని ముందుకు వెళ్ళండి.

కనుక శివరాత్రి ఉత్సవం అనగా ఉత్సాహాన్ని కలిగించే ఉత్సవం. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, మీ కోసం సదా ఉత్సవమే మరియు ఉత్సాహం మీతోనే ఉంటుంది. ఈ స్లోగన్ ను సదా గుర్తుంచుకోండి మరియు ఇది అనుభవం చేస్తూ ఉండండి. దీనికి విధి కేవలం రెండు పదాలు - సదా సాక్షీగా ఉంటూ చూడాలి మరియు బాబాకు సాథీగా ఉండాలి. బాబాకు సదా సాథీగా ఉన్నట్లయితే, ఎక్కడైతే బాబా ఉంటారో, అక్కడ సాక్షీగా ఉంటూ చూడడంతో సహజంగా మాయాజీతులుగా అయి అనేక జన్మలకు జగత్ జీతులుగా అవుతారు. కనుక ఏమి చేయాలో అర్థమయిందా? స్వయంగా బాబాయే ప్రతి బిడ్డకు తోడుగా ఉంటానని గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నారు, అందుకే సదా వారితోపాటు ఉండండి. డబల్ విదేశీయులైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బంధనంలో బంధించబడతారేమో అని వారు తోడుగా ఉండరు, స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఇక్కడ బాబాతో పాటు ఉంటూ కూడా స్వతంత్రులుగా ఉంటారు, బంధనం అనుభవమవ్వదు. అచ్ఛా. ఈ రోజు డబల్ ఉత్సవము. జీవితం కూడా ఉత్సవమే మరియు ఈ రోజు స్మృతిచిహ్న ఉత్సవం కూడా. బాప్ దాదా విదేశీ పిల్లలందరినీ సదా గుర్తు చేసుకుంటారు మరియు ఈ రోజు కూడా విశేషమైన రోజు యొక్క స్మృతినిప్పిస్తున్నారు, ఎందుకంటే ఎవరు ఎక్కడి నుండి వచ్చిన వారైనా, అందరూ స్మృతి పత్రాలను (ఉత్తరాలు) తీసుకొచ్చి ఉంటారు. కార్డులు, ఉత్తరాలు, టోలీలు తీసుకొచ్చారు. కనుక ఏ పిల్లలైతే హృదయపూర్వకమైన ఉత్సాహంతో కూడిన ప్రియస్మృతులను లేక వేరే ఏ రూపంలోనైనా తమ స్మృతి-గుర్తులను పంపించారో, ఆ పిల్లలందరికీ బాప్ దాదా కూడా వారి విశేషమైన స్మృతులకు రిటర్న్ లో పదమాల రెట్లు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో సేవ పట్ల మరియు మాయాజీతులుగా అవ్వడం పట్ల ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగున్నాయని బాప్ దాదా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు తమ శక్తికి మించి సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎవరైతే సత్యమైన మనసుతో తమ మనసులోని సమాచారాన్ని తండ్రి ముందు ఉంచుతారో, ఆ సత్యమైన మనసుపై బాబా సదా రాజీ అవుతారు, అందుకే వారి మనసు యొక్క సమాచారంలో ఏవైనా చిన్న-చిన్న విషయాలు వచ్చినా, అవి బాబా యొక్క విశేషమైన స్మృతి అనే వరదానంతో సమాప్తమైపోతాయి. బాబా రాజీ అవ్వడం అనగా బాబా సహయోగం ద్వారా సహజంగా మాయాజీతులుగా అవ్వడము. అందుకే, ఏదైతే బాబాకు ఇచ్చేసారో, అది సమాచార రూపంలో కావచ్చు, ఉత్తరాల రూపంలో కావచ్చు, ఆత్మిక సంభాషణ రూపంలో కావచ్చు, ఎప్పుడైతే బాబా ముందు పెట్టేసారో, వారికి ఇచ్చేసారో, ఇలా ఇచ్చేసిన వస్తువు ఇక తమదిగా ఉండదు, అది ఇతరులదిగా అవుతుంది. ఒకవేళ బలహీనత యొక్క సంకల్పాన్ని కూడా బాబా ముందు ఉంచినట్లయితే, ఇక ఆ బలహీనత మీదిగా ఉండదు. మీరు అయితే ఇచ్చేసారు, దాని నుండి ముక్తులుగా అయిపోయారు, అందుకే, ‘నేను బాబా ముందు పెట్టేసాను అనగా ఇచ్చేసాను’ అని గుర్తుంచుకోండి. ఇకపోతే, విదేశాల్లో ఉల్లాస-ఉత్సాహాల అల బాగుంది. బాప్ దాదా పిల్లల్లో నిర్విఘ్నంగా తయారయ్యే ఉల్లాసాన్ని, సేవలో బాబాను ప్రత్యక్షం చేయాలనే ఉల్లాసాన్ని చూసి హర్షిస్తారు. అచ్ఛా!

సదా అనాది మరియు ఆది రచన యొక్క ఆత్మిక నషాలో ఉండేవారు, సదా ప్రతి ఘడియను ఉత్సవ సమానంగా జరుపుకునేవారు, సదా స్మృతి మరియు సేవల ఉత్సాహంలో ఉండేవారు, సదా మాయ ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిని ఆటగా భావించి సాక్షీగా అయి చూసేవారు, సదా బాబాతోపాటు ప్రతి అడుగులో సాథీగా అయి నడిచేవారు - ఇటువంటి సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు అలౌకిక జన్మదిన శుభాకాంక్షలతోపాటు ప్రియస్మృతులు మరియు నమస్తే. అతి స్నేహీ, హృదయసింహాసనాధికారి పిల్లలందరికీ పావన శివజయంతి సందర్భంగా పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు.

Comments