15-11-1989 అవ్యక్త మురళి

  15-11-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“సత్యమైన మనసుపై సాహెబ్ (స్వామి) రాజీ అవుతారు”

ఈ రోజు విశ్వంలోని సర్వాత్మలకు ఉపకారం చేసే బాప్ దాదా తమ శ్రేష్ఠ పరోపకారి పిల్లలను చూస్తున్నారు. వర్తమాన సమయంలో అనేక ఆత్మలు ఉపకారం కావాలని కోరుకుంటున్నారు. స్వ-ఉపకారం చేసుకోవాలనే కోరిక ఉంది కానీ ధైర్యము మరియు శక్తి లేదు. ఇటువంటి నిర్బల ఆత్మలకు ఉపకారం చేసేందుకు పరోపకారి పిల్లలైన మీరే నిమిత్తులు. పరోపకారి పిల్లలైన మీకు ఆత్మల పిలుపులు వినిపిస్తున్నాయా లేక స్వ-ఉపకారంలోనే బిజీగా ఉన్నారా? స్వ-ఉపకారం మాత్రమే చేసుకునేవారు విశ్వ రాజ్యాధికారులుగా అవ్వరు. పరోపకారి ఆత్మలే రాజ్య అధికారులుగా అవ్వగలరు. సత్యమైన మనసుతోనే ఉపకారం జరుగుతుంది. జ్ఞానాన్ని (మనస్ఫూర్తిగా కాకుండా) నోటి ద్వారా కూడా వినిపించడం జరుగుతుంది. జ్ఞానం వినిపించడమనేది - విశాల బుద్ధికి సంబంధించిన విషయము మరియు వర్ణన చేసే అభ్యాసానికి సంబంధించిన విషయము. కనుక దిల్ మరియు దిమాగ్ (మనసు మరియు బుద్ధి) రెండింటిలో తేడా ఉంది. ఎవరైనా ఎవరి నుండైనా స్నేహాన్ని కోరుకుంటున్నారంటే, వారు హృదయపూర్వక స్నేహాన్నే కోరుకుంటున్నారని అర్థము. బాప్ దాదాకు - దిల్ వాలా (మనసున్నవారు), దిలారామ్ (హృదయాభిరాముడు) అనే టైటిల్స్ ఉన్నాయి. మనసుతో పోలిస్తే బుద్ధి స్థూలమైనది, మనసు సూక్ష్మమైనది. మాట్లాడేటప్పుడు కూడా - ‘మేము సత్యమైన మనసుతో చెప్తున్నాము - సత్యమైన మనసుతో తండ్రిని స్మృతి చేయండి’ అని సదా అంటారు. సత్యమైన బుద్ధితో స్మృతి చేయమని చెప్పరు. సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అవుతారని కూడా అంటారు. విశాల బుద్ధిపై రాజీ అవుతారని అనరు. విశాల బుద్ధి అనేది తప్పకుండా ఒక విశేషతనే. ఈ విశేషత ద్వారా జ్ఞాన పాయింట్లను మంచి రీతిలో ధారణ చేయవచ్చు. కానీ మనస్ఫూర్తిగా స్మృతి చేసేవారు, పాయింటు అనగా బిందురూపంగా అవ్వగలరు. బుద్ధితో స్మృతి చేసేవారు ఆ పాయింటును రిపీట్ చేయగలరు కానీ పాయింటు (బిందురూపం) గా అవ్వడంలో సెకండ్ నంబరుగా అవుతారు. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు శ్రమతో బిందురూపంలో స్థితులవ్వగలరు. కానీ సత్యమైన హృదయం కలవారు సెకండులో బిందువుగా అయి, బిందు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు. సత్యమైన మనసున్నవారు సత్యమైన సాహెబ్ ను రాజీ చేసుకున్న కారణంగా, తండ్రి యొక్క విశేషమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకున్న కారణంగా, స్థూల రూపంలో - వారి బుద్ధి అనేకమందితో పోలిస్తే అంత విశాలంగా లేకపోయినా సరే, సత్యత శక్తి కారణంగా, సమయానుసారంగా వారి బుద్ధి యుక్తియుక్తంగా, స్వతహాగానే యదార్థంగా పని చేస్తుంది. ఎందుకంటే యదార్థ కర్మలు, మాటలు మరియు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆశీర్వాదాల కారణంగా, డ్రామానుసారంగా, సమయానికి వారి బుద్ధికి అదే టచింగ్ (ప్రేరణ) వస్తుంది. ఎందుకంటే బుద్ధివంతులకే బుద్ధి అయిన తండ్రిని రాజీ చేసుకున్నారు. ఎవరైతే భగవంతుడిని రాజీ చేసుకున్నారో వారు స్వతహాగానే రహస్య యుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటారు.

కనుక - నేను విశాల బుద్ధి కారణంగా స్మృతి మరియు సేవలో ముందుకు వెళ్తున్నానా లేక సత్యమైన మనసు మరియు యదార్థ బుద్ధి ద్వారా ముందుకు వెళ్తున్నానా అని చెక్ చేసుకోండి. బుద్ధితో సేవ చేసేవారి బాణం ఇతరులకు కూడా బుద్ధి వరకు తగులుతుందని ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది. మనస్ఫూర్తిగా సేవ చేసేవారి బాణం మనసుకు తగులుతుంది. ఎలాగైతే స్థాపన యొక్క ప్రారంభంలో సేవకు సంబంధించి చూసారు కదా - మొదటి గ్రూపు వారి విశేషత ఏముండేది? భాషలో కానీ, భాషణలో కానీ ఏ విశేషత ఉండేది కాదు. ఈ రోజుల్లో అయితే చాలా బాగా భాషణ చేస్తారు, కథలు మరియు వృత్తాంతాలను కూడా చాలా బాగా వినిపిస్తారు. మొదటి గ్రూపు వారి భాష ఇలా ఉండేది కాదు. కానీ వారి వద్ద ఏముండేది? సత్యమైన మనసు యొక్క శబ్దం ఉండేది. అందుకే మనస్ఫూర్తిగా చేసిన శబ్దం అనేకులను దిలారామ్ కు (హృదయాభిరామునికి) చెందినవారిగా చేసేందుకు నిమిత్తంగా అయింది. భాషలో మిక్స్చర్ ఉండేది, కానీ నయనాల భాష ఆత్మికంగా ఉండేది. అందుకే భాష ఎలా ఉన్నప్పటికీ ముళ్ళ నుండి గులాబీలుగా అయితే అయ్యారు. మొదటి గ్రూపు వారి సేవలో సఫలత మరియు వర్తమాన సమయంలో జరిగే వృద్ధి - రెండింటినీ చెక్ చేసుకున్నట్లయితే తేడా కనిపిస్తుంది కదా. ఇది మెజారిటీకి సంబంధించిన విషయము. రెండవ, మూడవ గ్రూపులలో కూడా కొంతమంది మనసున్నవారు ఉన్నారు, కానీ మైనారిటీ (కొంతమంది) ఉన్నారు. మొదటి పొడుపు కథ ఇంతవరకు నడుస్తూనే ఉంది. ఏ పొడుపు కథ? నేను ఎవరు? ఇప్పుడు కూడా బాప్ దాదా - తమను తాము ‘నేను ఎవరు’ అని ప్రశ్నించుకోండి అని అంటారు. ఈ పొడుపు కథను విప్పడం తెలుసు కదా లేక ఇతరులు చెప్తే అప్పుడు విప్పగలరా. ఇతరులు చెప్పినా కానీ - అది ఇలా కాదు అలా అని విషయాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు... అందుకే తమను తామే చూసుకోండి.

చాలామంది పిల్లలు తమను తాము చెక్ చేసుకుంటారు, కానీ పరిశీలించుకునే దృష్టి రెండు రకాలుగా ఉంటుంది. అందులో కూడా కొంతమంది కేవలం విశాల బుద్ధి అనే దృష్టితో చెక్ చేసుకుంటారు. వారికి నిర్లక్ష్యమనే కళ్ళద్దాలు ఉంటాయి. ప్రతి విషయంలో వారికి ఏం కనిపిస్తుందంటే - త్యాగం చేసాను, సేవ చేసాను, పరివర్తన చేసుకున్నాను, చెసినదానిలో ఇదే ఎక్కువ, ఫలానా-ఫలానా ఆత్మల కన్నా నేను చాలా బాగున్నాను. ఇంత చేయడం కూడా సహజమేమీ కాదు, ఏవో కొన్ని లోపాలైతే ప్రసిద్ధి చెందినవారిలో కూడా ఉన్నాయి. ఈ లెక్కన నేను బాగున్నాను. ఇవే నిర్లక్ష్యమనే కళ్ళద్దాలు. రెండవది - స్వ ఉన్నతి కోసం యదార్థమైన కళ్ళద్దాలు. ఇది సత్యమైన హృదయం కలవారిది. వారు ఏం చూస్తారు? దిల్ వాలా (మనసున్న) తండ్రికి సదా ఏదైతే ఇష్టమో, ఆ సంకల్పాలు, ఆ మాటలు, ఆ కర్మలే చేయాలని చూస్తారు. యదార్థ కళ్ళద్దాలు ఉన్నవారు కేవలం తండ్రిని మరియు స్వయాన్ని చూసుకుంటారు. రెండవ వారు, మూడవ వారు ఏం చేస్తారు అనేది చూడరు. ‘మారాల్సింది నేనే’ అనే తపనలో సదా ఉంటారు. అంతేకానీ - ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోరు. లేదా 80 శాతం నేను మారుతాను, 20 శాతం వారు మారాలి అని కూడా వారు చూడరు. నేను పరివర్తన అయి ఇతరులు సహజంగా మారేందుకు నేను ఉదాహరణగా అవ్వాలి అని భావిస్తారు. అందుకే - ‘ఎవరైతే ముందు వచ్చి సేవ బాధ్యతను తీసుకుంటారో, వారే అర్జునుడు’ అనే సామెత ఉంది. అర్జునుడు అనగా అలౌకిక జన్మ. దీనిని యదార్థ కళ్ళద్దాలు లేక యదార్థ దృష్టి అని అంటారు. మాములుగా ప్రపంచంలోని మనుష్యుల జీవితం కోసం ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి - మనసు మరియు బుద్ధి. రెండు బాగుండాలి. అలాగే బ్రాహ్మణ జీవితంలో విశాల బుద్ధి కూడా కావాలి మరియు సత్యమైన మనసు కూడా కావాలి. సత్యమైన మనసున్నవారికి బుద్ధి యొక్క లిఫ్ట్ లభిస్తుంది. అందుకే - సత్యమైన మనసుతో సాహెబ్ ను రాజీ చేసుకున్నామా (సంతోషపరిచామా), కేవలం మీ మనసును లేక కొంతమంది ఆత్మలను మాత్రమే రాజీ చేయలేదు కదా అని సదా చెక్ చేసుకోండి. సత్యమైన సాహెబ్ రాజీ అయ్యారు అన్నదానికి చాలా గుర్తులున్నాయి. దీని గురించి మననం చేసి ఆత్మిక సంభాషణ చేయండి. తర్వాత బాప్ దాదా కూడా వినిపిస్తారు. అచ్ఛా.

ఈరోజు టీచర్లు కూర్చొని ఉన్నారు. టీచర్లు కూడా కంట్రాక్టర్లే. కాంట్రాక్టు తీసుకున్నారు కదా. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయాల్సిందే. ఈ అతి పెద్ద కాంట్రాక్టును తీసుకున్నారు కదా. ఎలాగైతే ప్రపంచంలోని వారు - మీరు మరణిస్తే ప్రపంచం మరణిస్తుంది, మీరు మరణించకపోతే ప్రపంచం కూడా మరణించదు అని అంటారో, అలా స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. స్వయం పరివర్తన అవ్వకుండా ఏ ఆత్మ కోసమైనా, ఎంత శ్రమ చేసినా సరే, పరివర్తన జరగదు. ఈ సమయంలో కేవలం విన్నంత మాత్రాన మారరు, కానీ చూస్తే మారుతారు. మధుబన్ భూమిలో ఎలాంటి ఆత్మ అయినా ఎందుకు పరివర్తనవుతుంది. మీరు సెంటర్లో కూడా వినిపిస్తారు, కానీ ఇక్కడకు రావడంతో వారు స్వయంగా చూస్తారు, స్వయంగా చూసిన కారణంగా మారుతారు. చాలామంది బంధనంలో ఉన్న మాతల యుగల్స్ కూడా వారి జీవితంలోని పరివర్తనను చూసి మారుతారు. జ్ఞానం వినిపించేందుకు ప్రయత్నించినా వారు వినరు. కానీ చూసిన కారణంగా ఏర్పడిన ప్రభావం వారిని కూడా పరివర్తన చేస్తుంది. అందుకే నేటి ప్రపంచం, మార్పును చూడాలనుకుంటుంది అని వినిపించాము. కనుక టీచర్ల విశేష కర్తవ్యం ఇదే - చేసి చూపించాలి అనగా పరివర్తనై చూపించాలి. అర్థమయిందా.

సదా సర్వాత్మల పట్ల పరోపకారులు, సదా సత్యమైన హృదయం మనసుతో సత్యమైన సాహెబ్ ను రాజీ చేసుకునేవారు, విశాల బుద్ధి మరియు సత్యమైన మనసుల మధ్య బ్యాలెన్స్ ను పెట్టుకునేవారు, సదా స్వయాన్ని విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా చేసుకునేవారు, స్వపరివర్తన చేసుకునే శ్రేష్ఠ ఆత్మలు, స్వయాన్ని శ్రేష్ఠ సేవాధారులుగా భావించి ముందుకు వెళ్ళేవారు - ఇలా నలువైపులా ఉన్న విశేషమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఢిల్లీ గ్రూపుతో ప్రాణప్రియమైన అవ్యక్త బాప్ దాదా మిలనము

అందరి మనసులో తండ్రి స్నేహం ఇమిడి ఉంది. స్నేహమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. హృదయపూర్వక స్నేహము హృదయాభిరాముని వద్దకు తీసుకొచ్చింది. హృదయంలో తండ్రి తప్ప ఇంకేమీ ఉండకూడదు. తండ్రియే ప్రపంచమైనప్పుడు తండ్రి హృదయంలోనే ఉండాలి, అనగా తండ్రిలో ప్రపంచం ఇమిడి ఉంది కనుక ఏక మతం, ఒకే బలం, ఒకే విశ్వాసము ఉంటుంది. ఎక్కడైతే ఒక్కరు ఉంటారో, అక్కడే ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా దాటడం సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? ఒకవేళ ఇంకొకరిని చూసినా, ఇంకొకరిని గుర్తు చేసుకున్నా, ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా లభించరు, అందుకే కష్టమైపోతుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారీ పిల్లలకు తండ్రి ఆశీర్వాదాలు లభిస్తాయి, దీని ద్వారా అన్నీ సహజమైపోతాయి. ఒకవేళ తండ్రి ఆజ్ఞను పాలన చేయకపోతే, తండ్రి యొక్క సహాయము లేక ఆశీర్వాదాలు లభించవు. అందుకే కష్టమైపోతుంది. మీరు సదా ఆజ్ఞాకారులుగా ఉన్నారు కదా? లౌకిక సంబంధంలో కూడా ఆజ్ఞాకారీ పిల్లల పట్ల ఎంత స్నేహముంటుంది. అది అల్పకాలిక స్నేహం, ఇది అవినాశీ స్నేహము. ఈ ఒక్క జన్మలోని ఆశీర్వాదాలు అనేక జన్మలు తోడుగా ఉంటాయి. కనుక మీరు అవినాశీ ఆశీర్వాదాలకు పాత్రులుగా అయ్యారు. మీ ఈ జీవితం మధురంగా అనిపిస్తుంది కదా. ఎంత శ్రేష్ఠమైన, ఎంత ప్రియమైన జీవితము. బ్రాహ్మణ జీవితం కనుక ప్రియంగా అనిపిస్తుంది, బ్రాహ్మణ జీవితం కాకపోతే ప్రియంగా అనిపించదు. చింతలతో కూడిన జీవితంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీది ప్రియమైన జీవితమా లేక అలసిపోతున్నారా? సంగమయుగం ఎంతవరకు ఉంటుందని ఆలోచిస్తున్నారా? శరీరం సహకరించడం లేదు, సేవ చేయలేకపోతున్నాను... దీని వలన ఆందోళన చెందడం లేదు కదా? ఈ సంగమయుగ జీవితం మిగిలిన అన్ని జన్మల కంటే శ్రేష్ఠమైనది. ప్రాప్తిని పొందే జీవితం ఇది, తర్వాత ప్రారబ్ధాన్ని అనుభవించే జీవితము, ఆ ప్రాప్తి తగ్గేటువంటి జీవితము. ఇప్పుడు నింపుకోవాలి. 16 కళల సంపూర్ణులుగా ఇప్పుడే తయారవుతారు. 16 కళలు అనగా ఫుల్. ఈ జీవితం అతి ప్రియమైనది - అని అనుభవమవుతుంది కదా, లేక ఎప్పుడైనా జీవితంతో విసిగిపోతున్నారా? విసిగిపోయి, ఇక వెళ్ళిపోవాలని అయితే అనుకోవడం లేదు కదా. తండ్రి సేవ కోసం తీసుకువెళ్తే అది వేరే విషయము. కానీ విసిగిపోయి వెళ్ళకూడదు. అడ్వాన్స్ పార్టీలో సేవ చేసే పాత్ర ఉండి, డ్రామా అనుసారంగా వెళ్తే విసుగు చెందరు, గౌరవపూర్వకంగా వెళ్తారు. సేవార్థం వెళ్తున్నారు. కనుక ఎప్పుడూ పిల్లలతో కానీ, మీతో మీరు కానీ విసుగు చెందకూడదు. మాతలు, ఎప్పుడూ పిల్లలతో విసిగిపోవడం లేదు కదా? తమోగుణీ తత్వాలతో జన్మించిన పిల్లలు కనుక వారు సతోప్రధానతను ఏమైనా చూపిస్తారా? వారు కూడా పరవశమై ఉన్నారు. మీరు కూడా తండ్రి ఆజ్ఞలను అప్పుడప్పుడు మర్చిపోతున్నారు కదా! కనుక మీరు తప్పులు చేస్తున్నప్పుడు, పిల్లలు తప్పు చేస్తే ఏమయింది? వారి పేరు ‘పిల్లలు’ అని అంటున్నప్పుడు, పిల్లలు అంటేనే అర్థమేమిటి? వారు పెద్దవారైనా సరే, ఆ సమయంలో వారు కూడా పిల్లలుగా అయిపోతారు, అనగా తెలివిహీనులుగా అయిపోతారు. అందుకే ఎప్పుడూ కూడా ఇతరులు ఆందోళన చెందడాన్ని చూసి స్వయం ఆందోళన పడకండి. వారు ఎంత ఆందోళనపర్చినా, మీరు మీ నషా నుండి కిందకు ఎందుకు దిగుతారు? లోపం మీదా లేక పిల్లలదా? మిమ్మల్ని మీ నషా నుండి కిందకు దించి, మీరు ఆందోళన చెందే విధంగా చేస్తున్నారంటే, వారు వీరులుగా అయ్యారని అర్థము. కనుక ఎప్పుడూ స్వప్నంలో కూడా ఆందోళన పడకండి - అనగా శ్రేష్ఠమైన నషా నుండి దూరమవ్వకండి. మీకు మీ నషా అనే కుర్చీలో కూర్చోవడం రాదా! కనుక ఈ రోజు నుండి అనారోగ్యం కారణంగానైనా, పిల్లల కారణంగానైనా, మీ సంస్కారాల కారణంగానైనా, ఇతరుల వలనైనా కానీ ఆందోళన పడకండి. ఇతరుల కారణంగా కూడా ఆందోళన చెందుతారు కదా. అందరూ బాగున్నారు కానీ వీరొక్కరి కారణంగా మేము ఆందోళన చెందుతున్నామని చాలామంది అంటారు. కనుక ఆందోళన కలిగించేవారు వీరులుగా అవ్వకూడదు, మీరు వీరులుగా అవ్వండి. మిమ్మల్ని విసిగించేవారు ఒక్కరు ఉన్నా, పది మంది ఉన్నా - ‘నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, బలహీనుడను కాదు’ అని గుర్తుంచుకోవాలి. కనుక ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోవాలి - మేము సదా మా శ్రేష్ఠమైన నషా ఉండేవారము, ఆందోళన చెందేవారము కాదు, ఇతరుల దుఃఖాన్ని కూడా తొలగించేవారము, సదా నషా అనే సింహాసనానికి అధికారులము అని. చూడండి, ఈ రోజుల్లో కుర్చీ ఉంది, కానీ మీకైతే సింహాసనముంది. వారు కుర్చీ కోసం మరణిస్తారు, మీకైతే సింహాసనం లభించింది. కనుక - ‘అకాల సింహాసనాధికారిని’ అనే శ్రేష్ఠమైన నషాలో ఉండండి, ‘తండ్రి హృదయ సింహాసనాధికారి ఆత్మను’ అనే నషాలో ఉండండి. సదా సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి. అచ్ఛా. ఢిల్లీ సేవకు పునాది. పునాది కచ్చాగా ఉంటే, అందరూ కచ్చాగానే అవుతారు. అందుకే సదా పక్కాగా (దృఢంగా) ఉండండి.

వరంగల్ గ్రూపు:- స్వయాన్ని సదా డబల్ లైట్ గా అనుభవం చేస్తున్నారా? ఎవరైతే డబల్ లైట్ గా ఉంటారో, వారిలో మైట్ అనగా తండ్రి శక్తులు తోడుగా ఉంటాయి. కనుక మీరు డబల్ లైట్ మరియు మైట్ (శక్తి) కూడా ఉంది. సమయానికి శక్తులను ఉపయోగించగలరా లేక సమయం గడిచిపోయిన తర్వాత గుర్తొస్తుందా? ఎందుకంటే మీ వద్ద ఎన్ని వస్తువులున్నప్పటికీ సమయానికి ఉపయోగించకపోతే ఏమంటారు? ఏ సమయంలో, ఏ శక్తి అవసరముంటే, ఆ శక్తిని ఆ సమయంలో ఉపయోగించగలిగే అభ్యాసం అవసరము. చాలామంది పిల్లలు - మాయ వచ్చేసింది అని అంటారు. ఎందుకొచ్చింది? పరిశీలనా శక్తిని ఉపయోగించలేదు, అందుకే వచ్చింది కదా! ఒకవేళ దూరం నుండే మాయ వస్తుందని పరిశీలిస్తే, దానిని దూరం నుండే పంపించేస్తారు కదా! మాయ వచ్చేసింది - అని అంటారు, అది వచ్చేందుకు అవకాశమిచ్చారు కనుకనే వచ్చింది. దూరం నుండే పంపించి ఉంటే, అది వచ్చేది కాదు. ఒకవేళ మాయ పదే-పదే వస్తే, దానితో యుద్ధం చేసి మీరు పంపిస్తే, మీకు యుద్ధం చేసే సంస్కారం వచ్చేస్తుంది. చాలాకాలం బట్టి యుద్ధం చేసే సంస్కారముంటే, చంద్రవంశీయులుగా అవ్వాల్సి ఉంటుంది. సూర్యవంశీయులు అనగా బహుకాలపు విజయులు. చంద్రవంశీయులనగా యుద్ధం చేస్తూ-చేస్తూ ఒకసారి విజయులుగా అవుతారు, ఒకసారి యుద్ధంలో శ్రమ చేస్తారు. కనుక, మీరంతా సూర్యవంశీయులే కదా! చంద్రునికి కూడా ప్రకాశాన్నిచ్చేది సూర్యుడు. కనుక నంబరువన్ అని సూర్యుడినే అంటారు కదా! చంద్రవంశీయులకు రెండు కళలు తక్కువగా ఉంటాయి. 16 కళలు అనగా ఫుల్ పాస్. మనసులో కానీ, వాణిలో కానీ లేక సంబంధ-సంపర్కంలో కానీ, సంస్కారాలలో కానీ ఎప్పుడూ కూడా ఫెయిల్ అయ్యేవారు కాదు - వారినే సూర్యవంశీయులని అంటారు. మీరు ఇటువంటి సూర్యవంశీయులే కదా? అచ్ఛా. అందరూ తమ పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నారా? అన్ని సబ్జెక్టులలో ఫుల్ పాస్ అయ్యారంటే, స్వయం పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నారని అర్థము. ఈ విధి ద్వారా తమను తాము చెక్ చేసుకోండి. నేను ఎగిరేకళలో వెళ్ళే ఎగిరే పక్షిని, కింద చిక్కుకునే ఆత్మను కాదు - అని స్మృతిలో ఉంచుకోండి. ఇదే మీ వరదానము. అచ్ఛా.

Comments