15-03-1988 అవ్యక్త మురళి

15-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

 కొత్త ప్రపంచ చిత్రానికి ఆధారము - వర్తమాన శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితము.

ఈ రోజు విశ్వ రచయిత, విశ్వం యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేసే బాప్ దాదా తమ శ్రేష్ఠ భాగ్యశాలి చిత్ర-స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరందరూ విశ్వపు శ్రేష్ఠ భాగ్యం యొక్క చిత్రాలు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రం ద్వారా భవిష్య శ్రేష్ఠ భాగ్యం స్పష్టంగా కనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితంలోని ప్రతి శ్రేష్ఠ కర్మ భవిష్య శ్రేష్ఠ ఫలాన్ని అనుభవం చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితంలోని శ్రేష్ఠ సంకల్పం భవిష్య శ్రేష్ఠ సంస్కారాన్ని స్పష్టం చేస్తుంది. కనుక వర్తమాన బ్రాహ్మణ జీవితం భవిష్యత్తులోని భాగ్యశాలి ప్రపంచం యొక్క చిత్రము వంటిది. బాప్ దాదా ఇలాంటి భవిష్య చిత్రాలైన పిల్లలను చూసి హర్షితులవుతారు. చిత్రము కూడా మీరే, భవిష్య భాగ్యానికి ఆధారమూర్తులు కూడా మీరే. మీరు శ్రేష్ఠంగా అయినప్పుడే ప్రపంచం కూడా శ్రేష్ఠంగా అవుతుంది. మీరు ఎగిరే కళ స్థితిలో ఉంటే విశ్వం కూడా ఎగిరే కళలో ఉంటుంది. బ్రాహ్మణాత్మలైన మీరు సమయ ప్రతి సమయం ఎలాంటి స్థితులను పాస్ చేస్తారో (దాటుతారో), అలా విశ్వంలోని స్థితులు కూడా పరివర్తన అవుతూ ఉంటాయి. మీ స్థితి సతోప్రధానంగా ఉన్నప్పుడు విశ్వం కూడా సతోప్రధానంగా, బంగారు యుగంగా ఉంటుంది. మీరు మారితే ప్రపంచం కూడా మారిపోతుంది. మీరు ఇంతటి ఆధారమూర్తులు!

వర్తమాన సమయంలో బాబాతో పాటు ఎంత శ్రేష్ఠమైన పాత్రను అభినయిస్తున్నారు! పూర్తి కల్పమంతటిలో అన్నింటికంటే గొప్ప విశేషమైన పాత్రను ఈ సమయంలో అభినయిస్తున్నారు! బాబాతో పాటు సహయోగులుగా అయి విశ్వంలోని ప్రతి ఆత్మకు గల అనేక జన్మల కోరికలను పూర్తి చేస్తున్నారు. బాబా ద్వారా ప్రతి ఆత్మకు ముక్తి-జీవన్ముక్తుల అధికారాన్ని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా అయ్యారు. మీరు సర్వుల కోరికలను పూర్తి చేసే బాబా సమానమైన ‘కామధేనువులు’ అనగా కామనలను పూర్తి చేసేవారు. ఇలా ప్రతి ఆత్మకు ఇచ్ఛా మాత్రం అవిద్య (కోరిక అంటే ఏమిటో తెలియని) స్థితిని అనుభవం చేయిస్తారు. దీని ద్వారా అర్ధకల్పం, అనేక జన్మలకు భక్త ఆత్మలకు గాని, జీవన్ముక్త అవస్థలోని ఆత్మలకు గాని ఎలాంటి కోరిక ఉండదు. మీరు కేవలం ఒక్క జన్మ కోరికలను పూర్తి చేయించేవారు కాదు, అనేక జన్మల కోసం ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితిని అనుభవం చేయించేవారు. ఎలాగైతే బాబా వద్ద సర్వ భాండాగారాలు, సర్వ ఖజానాలు సదా నిండుగా ఉంటాయో, అప్రాప్తి యొక్క నామ రూపాలు కూడా లేవో, అలా బాబా సమానంగా సదా మరియు సర్వ ఖజానాలు నిండుగా ఉంటాయి.

బ్రాహ్మణాత్మ అనగా ప్రాప్తి స్వరూప ఆత్మ, సంపన్న ఆత్మ. ఎలాగైతే బాబా సదా లైట్ హౌస్, మైట్ హౌస్ గా ఉన్నారో, అలా బ్రాహ్మణాత్మలు కూడా బాబా సమానంగా ఉన్నారు, లైట్ హౌస్ గా ఉన్నారు కనుక ప్రతి ఆత్మను తన గమ్యానికి చేర్చేందుకు నిమిత్తంగా ఉన్నారు. ఎలాగైతే బాబా ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ ద్వారా ప్రతి సమయం దాతగా, వరదాతగా ఉన్నారో, అలా బ్రాహ్మణాత్మలైన మీరు కూడా దాతలు, మాస్టర్ వరదాతలు. ఇలాంటి బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రంగా ఉన్నారా? ఏదైనా చిత్రాన్ని తయారు చేసినప్పుడు, అందులో అన్ని విశేషతలను చూపిస్తారు కదా. అలా వర్తమాన సమయంలోని బ్రాహ్మణ జీవితపు చిత్రం యొక్క విశేషతలను మీలో నింపుకున్నారా? మీరు అత్యంత గొప్ప చిత్రకారులు, మీరు మీ చిత్రాన్ని కూడా తయారు చేసుకుంటున్నారు. మీ చిత్రం తయారవుతూనే విశ్వం యొక్క చిత్రం తయారవుతూ ఉంటుంది. ఇలా అనుభవం చేస్తున్నారు కదా.

కొత్త ప్రపంచంలో ఏముంటుందని చాలా మంది అడుగుతారు కదా. కొత్త ప్రపంచం యొక్క చిత్రమే మీరు. మీ జీవితం ద్వారా భవిష్యత్తు స్పష్టమవుతుంది. ఈ సమయంలో కూడా మీ చిత్రాన్ని ఎవరైనా చూస్తే, వారు సదా కాలానికి ప్రసన్నచిత్తులుగా అయ్యే విధంగా నా చిత్రం తయారయిందా అని మీ చిత్రాన్ని చూసుకోండి. ఎవరైనా కొద్దిగా అశాంతి అల కలిగిన వారైనా మీ చిత్రాన్ని చూసి అశాంతిని మర్చిపోవాలి, శాంతి అలలలో తేలియాడం మొదలుపెట్టాలి. అప్రాప్తి స్వరూపులు స్వతహాగానే ప్రాప్తిని అనుభూతి చేయాలి. బికారులుగా వచ్చి, నిండుగా అయి వెళ్ళాలి. చిరునవ్వుతో ఉన్న మీ మూర్తిని చూసి మనసు ద్వారా లేక నేత్రాల ద్వారా ఏడ్వడం మర్చిపోవాలి, నవ్వడం నేర్చుకోవాలి. మీరు కూడా బాబాతో ‘మీరు మాకు నవ్వడం నేర్పించారు’ అని అంటారు కదా. కనుక మీ పనే ఏడ్వడం నుండి విడిపించడం మరియు నవ్వడాన్ని నేర్పించడం. ఇలాంటి చిత్రమే బ్రాహ్మణ జీవితము. మేము ఇలాంటి ఆధారమూర్తులము, పునాది వంటి వారము అని సదా స్మృతిలో ఉంచుకోండి. కల్పవృక్షం చిత్రంలో బ్రాహ్మణులు ఎక్కడ కూర్చుని ఉన్నారో చూశారా? పునాదిలో కూర్చుని ఉన్నారు కదా. బ్రాహ్మణ పునాది దృఢంగా ఉంది కనుక అర్ధకల్పం చలించకుండా-స్థిరంగా ఉంటారు. మీరు సాధారణమైన ఆత్మలు కాదు. మీరు ఆధారమూర్తులు, పునాది వంటి వారు.

ఈ సమయంలోని మీ సంపూర్ణ స్థితి, సత్యయుగంలోని 16 కళల సంపూర్ణ స్థితికి ఆధారము. ఇప్పటి ఏక మతము అక్కడి ఏక రాజ్యానికి ఆధారము. ఇక్కడి సర్వ ఖజానాలు అనగా జ్ఞానం, గుణాలు, శక్తులు, సర్వ ఖజానాల సంపన్నత అక్కడి సంపన్నతకు ఆధారము. ఇక్కడి దేహ ఆకర్షణ నుండి అతీతమైన స్థితి అక్కడి శరీర ఆరోగ్య ప్రాప్తికి ఆధారము. ఇక్కడి అశరీరి స్థితి అక్కడి నిరోగి స్థితి మరియు దీర్ఘాయువుకు ఆధార స్వరూపము. ఇక్కడి నిశ్చింత చక్రవర్తి జీవితం అక్కడి ప్రతి ఘడియ మానసిక ఆనందాలతో కూడిన జీవన ప్రాప్తికి ఆధారమవుతుంది. ఇక్కడి ‘ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు’ అనే అఖండమైన, స్థిరమైన సాధన అక్కడి అఖండమైన, స్థిరమైన, తరగని, నిర్విఘ్న సాధనాల ప్రాప్తికి ఆధారమవుతుంది. ఇక్కడి బాప్ దాదా లేక మాత-పిత మరియు సోదర-సోదరీల చిన్న ప్రపంచం అక్కడి చిన్న ప్రపంచానికి ఆధారమవుతుంది. ఇక్కడ ఒకే మాత-పితలతో సంబంధమున్న సంస్కారం వలన అక్కడ కూడా ఒకే విశ్వం యొక్క విశ్వమహారాజు మరియు మహారాణులను మాత-పితల రూపంలో అనుభవం చేస్తారు. ఇక్కడ స్నేహభరితమైన పరివార సంబంధమున్న కారణంగా అక్కడ కూడా రాజులైనా లేక ప్రజలైనా కానీ, ప్రజలు కూడా తమను పరివారంగా భావిస్తారు. పరివారంలో స్నేహపూర్వక సమీపత ఉంటుంది. పదవులు ఉంటాయి కానీ స్నేహంతో కూడిన పదవులు ఉంటాయి, సంకోచం మరియు భయంతో కూడినవి కాదు. కనుక మీరు భవిష్య చిత్రము కదా. ఈ విషయాలన్నింటినీ మీ చిత్రములో చెక్ చేసుకోండి - ఎంతవరకు శ్రేష్ఠ చిత్రం తయారయింది లేక ఇంకా ఇప్పటివరకు రేఖలు గీస్తున్నారా? తెలివైన ఆర్టిస్టులు కదా.

ప్రతి ఒక్కరు చిత్రాన్ని ఎంతవరకు తయారుచేశారు అనే విషయాన్నే బాప్ దాదా చూస్తూ ఉంటారు. ఫలానావారు ఇది సరిగ్గా చేయలేదు, అందుకే ఇలా జరిగింది అని ఇతరులపై ఫిర్యాదు చేయలేరు. మీ చిత్రాన్ని మీరే తయారు చేసుకోవాలి. మిగతా వస్తువులన్నీ బాప్ దాదా ద్వారా లభిస్తూనే ఉన్నాయి, అందులోనైతే లోపం లేదు కదా. ఇక్కడ కూడా మీరు ఒక ఆట నేర్పిస్తారు కదా, అందులో ముందు వస్తువులను కొని తర్వాత ఏలా కావాలంటే అలా తయారుచేస్తారు. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, అది తయారుచేసే వారిపై ఆధారపడి ఉంటుంది. తీసుకునేవారు తీసుకోగలగాలి. ఇకపోతే, ఇది తెరిచి ఉన్న బజారు, రెండు తీసుకోవాలి లేక నాలుగు తీసుకోవాలి అనే లెక్కను బాప్ దాదా పెట్టరు. అందరికంటే మంచి చిత్రాన్ని తయారుచేశారు కదా. సదా స్వయాన్ని ‘మేమే భవిష్య భాగ్యం యొక్క చిత్రము’ అని భావిస్తూ ప్రతి అడుగు వేయండి. స్నేహీలుగా అయిన కారణంగా సహయోగులుగా కూడా ఉన్నారు. సహయోగులుగా అయిన కారణంగా బాబా సహయోగము ప్రతి ఆత్మకు ఉంది. అయితే, కొంతమంది ఆత్మలకు ఎక్కువ సహయోగం ఉంది, కొంతమందికి తక్కువ ఉందని కాదు. అలా ఉండదు. బాబా సహయోగం ప్రతి ఆత్మకు ఒకటికి పదమాల రెట్లు ఉండనే ఉంటుంది. సహయోగీ ఆత్మలందరికీ బాబా సహయోగం సదా ప్రాప్తిస్తుంది మరియు ఎంతవరకైతే బాబా ఉంటారో, అంతవరకు ప్రాప్తిస్తూనే ఉంటుంది. బాబా సహయోగమున్నప్పుడు ప్రతి కార్యము జరిగే ఉంది. ఇలాంటి అనుభవం చేస్తున్నారు కూడా మరియు ఇంకా చేస్తూ ఉండండి. కష్టమేమీ లేదు ఎందుకంటే భాగ్యవిధాత ద్వారా భాగ్యం ప్రాప్తించడానికి ఆధారముంది. ఎక్కడైతే భాగ్యం ఉంటుందో, వరదానం ఉంటుందో, అక్కడ కష్టమనేది ఉండనే ఉండదు.

ఎవరి చిత్రం చాలా బాగుంటుందో, వారు తప్పకుండా ఫస్ట్ నంబరులో వస్తారు. మరి అందరూ ఫస్ట్ డివిజన్ లోకి వచ్చేవారే కదా. ఫస్ట్ నంబరు ఒక్కరికే వస్తుంది కానీ ఫస్ట్ డివిజన్ అనేది ఉంది కదా. మరి ఎందులో రావాలి? ఫస్ట్ డివిజన్ అయితే అందరి కోసం ఉంది. కావున ఎంతోకొంత చేసుకోవడం మంచిది. బాప్ దాదా అయితే, భారతవాసులకు కావచ్చు లేక డబల్ విదేశీయులకు కావచ్చు, అందరికీ అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడింకా రిజల్టును ప్రకటించలేదు. అప్పుడప్పుడు మంచి-మంచి వారు ఫలితం ప్రకటించక ముందే వెళ్ళిపోతారు కనుక ఆ స్థానం లభిస్తుంది కదా. కావున ఏ స్థానం తీసుకోవాలన్నా సరే, ఇప్పుడింకా అవకాశముంది. తర్వాత, ఇప్పుడిక ఖాళీ లేదు అనే బోర్డు పెట్టేస్తారు కదా. ఈ సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి, అందుకే ఇందులో బాగా ఎగరండి. పరుగెత్తకండి, ఎగరండి. పరుగెత్తే వారు కిందనే ఉండిపోతారు, ఎగిరేవారు ఎగిరిపోతారు, ఎగురుతూ ఉండండి మరియు ఇతరులను ఎగిరేలా చేస్తూ ఉండండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ భాగ్యం యొక్క శ్రేష్ఠ చిత్ర స్వరూపులైన మహాన్ ఆత్మలకు, సదా స్వయాన్ని విశ్వానికి ఆధారమూర్తులుగా అనుభవం చేసే ఆత్మలకు, సదా తమ ప్రాప్తి స్వరూప అనుభూతుల ద్వారా ఇతరులకు కూడా ప్రాప్తి స్వరూప అనుభవాన్ని చేయించే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా స్నేహము మరియు సహయోగముల పదమాల రెట్ల అధికారాన్ని ప్రాప్తి చేసుకునే పూజ్య బ్రాహ్మణుల నుండి దేవాత్మలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వ్యక్తిగత కలయిక -

బాబా చేయి సదా మస్తకంపై ఉండనే ఉంది అని అనుభవం చేస్తున్నారా? శ్రేష్ఠ మతమే శ్రేష్ఠమైన చేయి. కనుక ఎక్కడైతే ప్రతి అడుగులోనూ బాబా చేయి అనగా శ్రేష్ఠ మతం ఉందో, అక్కడ శ్రేష్ఠ మతం ద్వారా శ్రేష్ఠమైన కార్యం స్వతహాగానే జరుగుతుంది. సదా చేయి (శ్రీమతం) యొక్క స్మృతి ద్వారా సమర్థులుగా అయి ముందుకు వెళ్తూ ఉండండి. బాబా చేయి సదా ముందుకు తీసుకువెళ్ళే అనుభవాన్ని సహజంగా చేయిస్తుంది కనుక ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రతి కార్యంలోనూ స్మృతిలో ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. సదా శ్రీమతమనే చేయి ఉంటే సదా విజయం ఉంటుంది.

ప్రశ్న:- సదా సహజయోగులుగా ఉండాలంటే దానికి సహజమైన విధి ఏమిటి?

జవాబు:- బాబాయే ప్రపంచము - ఈ స్మృతిలో ఉంటే సహజయోగులుగా అవుతారు ఎందుకంటే మొత్తం రోజంతటిలో బుద్ధి ప్రపంచంలోకే వెళ్తూ ఉంటుంది. బాబాయే ప్రపంచమైనప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచంలోకే వెళ్తుంది కదా, అడవిలోకైతే వెళ్ళదు. కనుక బాబాయే ప్రపంచంగా అయినప్పుడు సహజయోగులుగా అవుతారు. లేదంటే శ్రమించాల్సి వస్తుంది. ఇక్కడి నుండి బుద్ధిని తొలగించి అక్కడ జోడించండి. సదా బాబా స్నేహంలో ఇమిడిపోయి ఉంటే ఇక వారిని మర్చిపోలేరు. అచ్ఛా!

అవ్యక్త బాప్ దాదాతో డబల్ విదేశీ సోదరీ-సోదరుల కలయిక -

డబల్ విదేశీయులలో సేవ చేయాలనే ఉత్సాహం బాగుంది కనుక వృద్ధిని కూడా బాగా చేస్తున్నారు. విదేశీ-సేవలో 14 సంవత్సరాలలో బాగా వృద్ధి చేశారు. లౌకికము మరియు అలౌకికము, డబల్ కార్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. డబల్ కార్యంలో సమయాన్ని కూడా పెడుతున్నారు మరియు బుద్ధి శక్తిని, శారీరిక శక్తిని కూడా పెడుతున్నారు. ఇది కూడా బుద్ధి యొక్క అద్భుతము. లౌకిక కార్యం చేస్తూ సేవలో ముందుకు వెళ్ళడం కూడా ధైర్యంతో కూడిన పని. ఇలాంటి ధైర్యం గల పిల్లలకు బాప్ దాదా సదా ప్రతి కార్యంలో సహాయకులుగా ఉన్నారు. ఎంత ధైర్యమో, అంతగా పదమాల రెట్లు బాబా సహాయకులుగా ఉండనే ఉంటారు. కానీ రెండు పాత్రలను అభినయిస్తూ ఉన్నతిని ప్రాప్తి చేసుకుంటున్నారు - ఇది చూసి బాప్ దాదా సదా పిల్లల విషయంలో హర్షితులవుతారు. మాయ నుండి అయితే ముక్తులుగా ఉన్నారు కదా? యోగయుక్తులుగా ఉంటే మాయ నుండి స్వతహాగానే ముక్తులుగా ఉంటారు. యోగయుక్తులుగా లేకపోతే మాయ నుండి కూడా ముక్తులుగా ఉండరు. మాయకు కూడా బ్రాహ్మణాత్మలు ప్రియంగా అనిపిస్తారు. ఎవరైతే పహిల్వానులుగా ఉంటారో, వారికి పహిల్వానులతోనే మజా వస్తుంది. మాయ కూడా శక్తిశాలి అయినది, మీరు కూడా సర్వశక్తివంతులు కనుక మాయకు సర్వశక్తివంతులతో ఆడుకోవడం బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాయ కొత్త రూపాలలో వస్తుందని ఇప్పుడు మాయను గురించి బాగా తెలుసుకున్నారు కదా. నాలెడ్జ్ ఫుల్ అనగా బాబాను కూడా తెలుసుకోవడం, రచనను కూడా తెలుసుకోవడం మరియు మాయను కూడా తెలుసుకోవడం. ఒకవేళ రచయిత మరియు రచనను తెలుసుకొని, మాయను తెలుసుకోలేదంటే నాలెడ్జ్ ఫుల్ గా లేరని అర్థము.

ఎప్పుడూ ఏ విషయంలోనూ, శరీరం బలహీనంగా ఉన్నా లేక పని భారం ఎక్కువగా ఉన్నా, మనసుతో ఎప్పుడూ అలసిపోకండి. శారీరిక అలసట మనసు యొక్క సంతోషంతో సమాప్తమైపోతుంది. కానీ మానసిక అలసట, శారీరిక అలసటను కూడా పెంచుతుంది. మనసు ఎప్పుడూ అలసిపోకూడదు. అలసిపోయినప్పుడు, సెకండులో బాబా వతనంలోకి వచ్చేయండి. ఒకవేళ మనసును అలసిపోయేలా చేసుకునే అలవాటు ఉంటే, బ్రాహ్మణ జీవితంలో ఏవైతే ఉల్లాస-ఉత్సాహాలు అనుభవమవ్వాలో, అవి అనుభవమవ్వవు. నడుస్తున్నారు కానీ నడిపించేవారు నడిపిస్తున్నారు అనే అనుభవం అవ్వదు. శ్రమతో నడుస్తున్నప్పుడు, శ్రమ అనుభవమైతే అలసట కూడా కలుగుతుంది. కనుక సదా ‘చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు’ అని భావించండి. సమయం, శక్తి - రెండిటి అనుసారంగా సేవ చేస్తూ ఉండండి. సేవ ఎప్పుడూ ఆగదు, ఈ రోజు కాకుంటే రేపు జరగాల్సిందే. ఒకవేళ సత్యమైన హృదయంతో, హృదయపూర్వక స్నేహంతో, ఎంత సేవ చేయగలరో అంత చేస్తే, బాప్ దాదా ఎప్పుడూ ‘ఇంత పని చేశారు, ఇంత చేయలేదు’ అని ఫిర్యాదు చేయరు. శభాష్ అని మెచ్చుకుంటారు. సమయ ప్రమాణంగా, శక్తి ప్రమాణంగా సత్యమైన హృదయంతో సేవ చేస్తే, సత్యమైన హృదయంపై సాహెబ్ (బాబా) రాజీ అవుతారు (సంతోషిస్తారు). అప్పుడు మీ కార్యం కొంత మిగిలిపోయినా సరే, బాబా ఎక్కడో ఒక చోట నుండి పూర్తి చేయిస్తారు. ఏ సేవ ఏ సమయంలో జరగాలో, అది జరిగే తీరుతుంది, ఆగిపోదు. ఏదో ఒక ఆత్మకు టచింగ్ ఇచ్చి బాప్ దాదా తన పిల్లలకు సహయోగిగా చేస్తారు. యోగీ పిల్లలకు అన్ని రకాల సహయోగం సమయానికి తప్పకుండా లభిస్తుంది. కానీ ఎవరికి లభిస్తుంది? సత్యమైన హృదయం కలవారికి, సత్యమైన సేవాధారులకు లభిస్తుంది. కనుక అందరూ సత్యమైన సేవాధారి పిల్లలేనా? సాహెబ్ (బాబా) మాపై రాజీగా ఉన్నారని అనుభవం చేస్తున్నారు కదా. అచ్ఛా!

Comments