14-10-1987 అవ్యక్త మురళి

14-10-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘‘బ్రాహ్మణ జీవితము - బాబా నుండి సర్వ సంబంధాలను అనుభవము చేసుకునే జీవితము’’

ఈ రోజు బాప్ దాదా అనేకసార్లు మిలనమును చేసుకునే, అనేక కల్పాల నుండి మిలనము చేసుకునే తమ పిల్లలతో మళ్ళీ మిలనము జరుపుకునేందుకు వచ్చారు. ఈ అలౌకిక, అవ్యక్త మిలనము భవిష్య స్వర్ణిమ యుగములో కూడా ఉండజాలదు. తండ్రి మరియు పిల్లల కలుసుకునేందుకు కేవలము ఈ సమయములో ఈ విశేష యుగమునకు వరదానము ఉంది, అందుకే ఈ యుగము యొక్క పేరే సంగమయుగము అనగా మిలనమును జరుపుకునే యుగము. ఇటువంటి యుగములో ఇటువంటి శ్రేష్ఠ మిలనమును జరుపుకునే విశేష పాత్రధారీ ఆత్మలు మీరు. బాప్ దాదా కూడా ఇటువంటి కోట్లలో కొద్దిమంది అయిన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలను చూసి హర్షితులవుతారు మరియు స్మృతిని కలిగిస్తారు. ఆది నుండి అంతిమము వరకు ఎన్ని స్మృతులను కలిగించారు? గుర్తు చేసుకున్నట్లయితే పెద్ద లిస్ట్ తయారవుతుంది. ఎన్ని స్మృతులను కలిగించారంటే వాటితో మీరందరూ స్మృతి స్వరూపులుగా అయిపోయారు. భక్తిలో స్మృతి స్వరూప ఆత్మలైన మీ స్మృతిచిహ్న రూపంలో భక్తులు కూడా ప్రతి సమయము స్మరణ చేస్తూ ఉంటారు. స్మృతి స్వరూప ఆత్మలైన మీ ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేసుకుంటూ ఉంటారు. భక్తి విశేషతయే స్మరణ చేయటం అనగా కీర్తించటము. స్మరణ చేస్తూ-చేస్తూ అమితానందములో ఎంతగా మగ్నమైపోతారు! అల్పకాలము కొరకు వారికి కూడా వేరే స్పృహ, ఉనికి ఏదీ లేనట్లు ఉంటుంది. స్మరణ చేసుకుంటూ-చేసుకుంటూ అందులో మునిగిపోతారు అనగా లవలీనులైపోతారు. అల్పకాలికమైన ఈ అనుభవము ఆ ఆత్మలకు ఎంత ప్రియంగా మరియు అతీతంగా ఉంటుంది! ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వారు ఏ ఆత్మలనైతే స్మరణ చేస్తున్నారో, ఆ ఆత్మలు స్వయము కూడా బాబా స్నేహములో సదా లవలీనులై ఉన్నారు, బాబా యొక్క సర్వ ప్రాప్తులలో సదా మునిగిపోయి ఉన్నారు కనుక, ఇటువంటి ఆత్మలను స్మరించినా కూడా ఆ భక్తులకు అల్పకాలము కొరకు వరదానీ ఆత్మలైన మీ ద్వారా అంచలి రూపములో అనుభూతి ప్రాప్తిస్తుంది. మరి ఆలోచించండి, స్మరణ చేసే భక్త ఆత్మలకు కూడా ఇంతటి అలౌకిక అనుభవము కలిగినప్పుడు, స్మృతి స్వరూపులు, వరదాత, విధాత ఆత్మలైన మీకు ప్రాక్టికల్ జీవితములో ఎంతటి అనుభవం ప్రాప్తిస్తుంది! ఈ అనుభూతులతో సదా ముందుకు వెళ్తూ ఉండండి.

ప్రతి అడుగులోనూ రకరకాల స్మృతి స్వరూపాలను అనుభవం చేస్తూ వెళ్ళండి. ఎటువంటి సమయమో, ఎటువంటి కర్మనో, అటువంటి స్వరూపపు స్మృతిని ఇమర్జ్ (ప్రత్యక్ష) రూపంలో అనుభవము చెయ్యండి. ఏ విధంగా అమృతవేళ ఆ రోజు యొక్క ప్రారంభములో బాబాతో మిలనము జరుపుకుంటారో, అప్పుడు మాస్టర్ వరదాతలుగా అయ్యి వరదాత నుండి వరదానాలను తీసుకునే శ్రేష్ఠ ఆత్మను, డైరెక్ట్ భాగ్య విధాత ద్వారా భాగ్యమును ప్రాప్తి చేసుకునే పదమాపదమ భాగ్యవాన్ ఆత్మను అని ఈ శ్రేష్ఠ స్వరూపమును స్మృతిలోకి తీసుకురండి. అది వరదానీ సమయము, వరదాత, విధాత తోడుగా ఉన్నారు. మాస్టర్ వరదానీలుగా అయ్యి స్వయము కూడా సంపన్నంగా అవుతున్నారు మరియు ఇతర ఆత్మలకు కూడా వరదానాలను ఇప్పించే వరదానీ ఆత్మలు - ఈ స్మృతి స్వరూపాన్ని ఇమర్జ్ చెయ్యండి. ఇలా అయితే ఉండనే ఉన్నాను అని ఇలా అనుకోకూడదు. కానీ రకరకాల స్మృతి స్వరూపాలను సమయానుసారంగా అనుభవము చేసినట్లయితే చాలా విచిత్రమైన సంతోషము, విచిత్ర ప్రాప్తుల భాండాగారంగా అయిపోతారు మరియు సదా మనస్ఫూర్తిగా ప్రాప్తి యొక్క పాటలు స్వతహాగానే ప్రణవనాదం రూపంలో వెలువడుతూ ఉంటాయి - ‘‘పొందాల్సినదేదో పొందేసాను.....’’. ఈ విధంగా రకరకాల సమయము మరియు కర్మల అనుసారంగా స్మృతి స్వరూపపు అనుభవమును చేస్తూ వెళ్ళండి. మురళీని వింటున్నప్పుడు గాడ్లీ స్టూడెంట్ లైఫ్ (ఈశ్వరీయ విద్యార్థి జీవితము) అనగా నేను భగవంతుని విద్యార్థిని, స్వయంగా భగవంతుడు నా కోసం పరంధామం నుండి చదివించేందుకు వచ్చారు అన్న స్మృతి ఉండాలి. స్వయంగా భగవంతుడు వస్తారు అన్నదే విశేషమైన ప్రాప్తి. ఎప్పుడైతే ఈ స్మృతి స్వరూపముతో మురళీ వింటారో, అప్పుడు ఎంత నషా ఉంటుంది! ఒకవేళ సాధారణ రీతిలో నియమ ప్రమాణంగా వినిపించేవారు వినిపిస్తున్నారు మరియు వినేవారు వింటున్నారు అన్నట్లుంటే ఇంతటి నషా అనుభవమవ్వదు. కానీ మేము భగవంతుని విద్యార్ధులము అనే ఈ స్మృతిని స్వరూపములోకి తీసుకువచ్చి వినండి, అప్పుడు అలౌకిక నషా అనుభవమవుతుంది. అర్థమైందా?

భిన్న-భిన్న సమయాలలో భిన్న-భిన్న స్మృతి స్వరూపపు అనుభవాలలో ఎంతటి నషా ఉంటుంది! ఈ విధంగా మొత్తము రోజంతటిలో ప్రతి కర్మలో బాబాతో పాటు స్మృతి స్వరూపులుగా అవుతూ వెళ్ళండి - ఒక్కోసారి భగవంతుని మిత్రుడు లేక సహచరుని రూపమును, ఒక్కోసారి జీవిత భాగస్వామి రూపమును, ఒక్కోసారి భగవంతుడు నా అతి ప్రియమైన సంతానము అనగా మొట్టమొదటి హక్కుదారుడు, మొదటి వారసుడు. ఎవరికైనా ఇటువంటి చాలా సుందరమైన మరియు చాలా అర్హుడైన కొడుకు ఉన్నట్లయితే నా కొడుకు కుల దీపకుడు మరియు కులము యొక్క పేరును ప్రసిద్ధము చేసేవాడు అని తల్లిదండ్రులకు ఎంతటి నషా ఉంటుంది! ఎవరికైతే భగవంతుడే కొడుకు అవుతారో, వారి పేరు ఎంతగా ప్రసిద్ధమవుతుంది! వారి కులం యొక్క కళ్యాణము ఎంతగా జరుగుతుంది! కనుక ఎప్పుడైనా ప్రపంచ వాతావరణము కారణంగానైనా లేక రకరకాల సమస్యల కారణంగానైనా స్వయాన్ని కాస్త ఒంటరిగా లేక ఉదాసీనంగా అనుభవము చేసినప్పుడు ఇటువంటి సుందరమైన కొడుకు రూపములో ఆడుకోండి, మిత్రుని రూపంలో ఆడుకోండి. ఎప్పుడైనా అలసిపోతే తల్లి రూపంలో బాబాను ఊహించుకుని ఒడిలో నిద్రపోండి, ఇమిడిపోండి. ఎప్పుడైనా దుఃఖితులైనట్లయితే సర్వశక్తివంతుని స్వరూపములో మాస్టర్ సర్వశక్తివంతుని స్మృతి స్వరూపమును అనుభవము చేసినట్లయితే నిరాశ కలవారి నుండి సంతోషం కలవారిగా అయిపోతారు. భిన్న-భిన్న సమయాలలో భిన్న-భిన్న సంబంధాలతో, తమ భిన్న-భిన్న స్వరూపాల స్మృతిని ఇమర్జ్ రూపంలో అనుభవం చేసినట్లయితే బాబా యొక్క తోడును ఎల్లప్పుడూ స్వతహాగానే అనుభవము చేస్తారు మరియు ఈ సంగమయుగం యొక్క బ్రాహ్మణ జీవితము ఎల్లప్పుడూ అమూల్యంగా అనుభవమవుతూ ఉంటుంది.

మరొక విషయము - ఇంతగా సర్వ సంబంధాలను నిర్వర్తించటంలో ఎంత బిజీగా ఉంటారంటే, ఇక మాయ వచ్చేందుకు కూడా తీరిక దొరకదు. ఏ విధంగానైతే లౌకికంలో ప్రవృత్తిలో ఉండే పెద్దవారు సదా ఏమంటారంటే - మేము ప్రవృత్తిని సంభాళించటంలో ఎంత బిజీగా ఉంటామంటే ఇక వేరే ఏ విషయాలూ గుర్తుకే ఉండవు ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రవృత్తి. మరి ప్రభువుతో ప్రీతిని నిర్వర్తించే బ్రాహ్మణ ఆత్మలైన మీ ప్రభువు ప్రవృత్తి ఎంత పెద్దది! ప్రభు ప్రీతి అనే మీ ప్రవృత్తి నిద్రిస్తున్నప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది! ఒకవేళ యోగనిద్రలో ఉన్నట్లయితే, అది నిద్ర కాదు కానీ యోగనిద్ర అవుతుంది. నిద్రలో కూడా ప్రభు మిలనాన్ని జరుపుకోగలరు. యోగము యొక్క అర్థమే మిలనము. యోగనిద్ర అనగా అశరీరితనపు స్థితి యొక్క అనుభూతి. మరి ఇది కూడా ప్రభు ప్రీతి కదా. కనుక మీకున్నటువంటి అతి పెద్ద ప్రవృత్తి వేరే ఎవ్వరికీ ఉండదు. ఒక్క క్షణము కూడా మీకు తీరిక ఉండదు ఎందుకంటే భక్తిలో మీరు భక్తుల రూపములో కూడా ప్రభూ, మీరు చాలాకాలం తర్వాత కలిసారు అని ఈ పాటనే పాడేవారు, కనుక మీరు బాగా లెక్క పెట్టి పూర్తి లెక్కను తీసుకుంటారు. అంటే మీరు ప్రతి ఒక్క క్షణం యొక్క లెక్కను తీసుకునేవారు. మొత్తము కల్పములో మిలనము జరుపుకునే లెక్కను ఈ ఒక్క చిన్న జన్మలో పూర్తి చేస్తారు. 5000 సంవత్సరాల లెక్కలో ఈ చిన్నపాటి జన్మ కొన్ని రోజుల లెక్కలోకి వస్తుంది కదా. కనుక కొద్ది రోజులలోనే ఇంత దీర్ఘకాల సమయము యొక్క లెక్కను పూర్తి చెయ్యాలి, కనుకనే శ్వాస-శ్వాసలోనూ స్మరించండి అని అంటారు. భక్తులు స్మరిస్తారు, మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు కనుక మీకు క్షణమైనా తీరిక ఉంటుందా? ఇది ఎంత పెద్ద ప్రవృత్తి! ఈ ప్రవృత్తి ముందు ఆ చిన్న ప్రవృత్తి ఆకర్షించదు మరియు సహజంగానే, స్వతహాగానే దేహ సహితంగా దేహపు సంబంధాలు మరియు దేహపు పదార్థాలు లేక ప్రాప్తుల నుండి నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అయిపోతారు. ఈ చివరి పరీక్షయే మాలలో నంబర్ వార్ మణులుగా తయారుచేస్తుంది.

అమృతవేళ నుండి యోగనిద్ర వరకు రకరకాల స్మృతి స్వరూపాల అనుభవీలుగా అయినట్లయితే, ఆ బహుకాలపు స్మృతి స్వరూపపు అనుభవము అంతిమములో స్మృతి స్వరూపపు ప్రశ్నలో పాస్ విత్ ఆనర్లుగా తయారుచేస్తుంది. చాలా రమణీకమైన జీవితాన్ని అనుభవం చేస్తారు ఎందుకంటే జీవితంలో ప్రతి మనుష్యాత్మకు - ‘వెరైటీ ఉండాలి’ అనేది ఇష్టము, ఇదే కోరుకుంటారు. కనుక మొత్తం రోజంతటిలో రకరకాల సంబంధాలు, రకరకాల స్వరూపాల వెరైటీని అనుభవము చెయ్యండి. ప్రపంచములో కూడా ఇలా అంటారు కదా - తండ్రి అయితే ఎలాగైనా కావాలి కానీ తండ్రితోపాటు ఒకవేళ జీవిత భాగస్వామి యొక్క అనుభవము లేనట్లయితే జీవితమును అసంపూర్ణముగా భావిస్తారు, పిల్లలు లేకపోయినా కూడా అసంపూర్ణ జీవితముగా భావిస్తారు. ప్రతి సంబంధము ఉండటాన్నే సంపన్న జీవితంగా భావిస్తారు. మరి ఈ బ్రాహ్మణ జీవితము భగవంతునితో సర్వ సంబంధాలను అనుభవము చేసే సంపన్న జీవితము! ఒక్క సంబంధము విషయములో కూడా లోటు చెయ్యవద్దు. ఒక్క సంబంధమైనా కూడా భగవంతుని నుండి లోటు ఉన్నట్లయితే ఎవరో ఒకరు ఆ సంబంధముతో తమ వైపుకు లాగేస్తారు. చాలామంది పిల్లలు అప్పుడప్పుడు ఇలా అంటారు - తండ్రి రూపంలో అయితే ఎలాగా ఉన్నారు కానీ సహచరుడు మరియు మిత్రుడు అనేవి అయితే చిన్నపాటి రూపాలు కదా, వాటి కొరకైతే ఆత్మలు కావాలి కదా ఎందుకంటే తండ్రి అయితే పెద్దవారు కదా. కానీ పరమాత్మునితో ఉన్న సంబంధం మధ్యలో ఎటువంటి చిన్నపాటి లేక తేలికపాటి ఆత్మ సంబంధమైనా మిక్స్ అయితే ‘సర్వ’ అన్న పదము సమాప్తమైపోతుంది మరియు యథాశక్తి అన్న లైను లోకి వచ్చేస్తారు. బ్రాహ్మణుల భాషలో ప్రతి విషయంలో ‘సర్వ’ అన్న మాట వస్తుంది. ఎక్కడైతే ‘సర్వ’ అన్నది ఉంటుందో, అక్కడే సంపన్నత ఉంటుంది. ఒకవేళ రెండు కళలు తక్కువైనా కానీ రెండవ మాలలోని మణులుగా అయిపోతారు కనుక, సర్వ సంబంధాల సర్వ స్మృతి స్వరూపులుగా అవ్వండి. అర్థమైందా? స్వయంగా భగవంతుడే సర్వ సంబంధాల అనుభవమును చేయించేందుకు ఆఫర్ చేస్తున్నప్పుడు, ఆ ఆఫరీన్ (అవకాశము) ను తీసుకోవాలి కదా! ఇటువంటి గోల్డెన్ ఆఫర్ ను భగవంతుడు తప్ప, అది కూడా ఈ సమయంలో తప్ప ఇక ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరైనా తండ్రిగా కూడా మరియు కొడుకుగా కూడా అవ్వటమనేది జరుగుతుందా? ఇది కేవలం ఒక్కరి మహిమయే, ఒక్కరి మహానతయే కనుక సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ఇందులో మజా ఉంది కదా? బ్రాహ్మణ జీవితము దేని కోసం ఉంది? మజాలో లేక మౌజ్ (చాలా సంతోషం) లో ఉండేందుకు. కనుక ఈ అలౌకిక అమితానందాన్ని జరుపుకోండి. ఆనందకరమైన జీవితాన్ని అనుభవము చెయ్యండి. అచ్ఛా!

ఈ రోజు ఢిల్లీ దర్బారు వారు ఉన్నారు. రాజ్య దర్బారు కలవారా లేక కేవలము దర్బారులో చూసేవారా? దర్బారులో రాజ్యము చేసేవారు మరియు చూసేవారు - ఇరువురూ కూర్చుంటారు. మీరందరూ ఎవరు? ఢిల్లీకి రెండు విశేషతలు ఉన్నాయి. ఒకటి - ఢిల్లీ దిలారాముని దిల్ (హృదయాభిరాముని హృదయము), మరొకటి - సింహాసన స్థానము. దిల్ (హృదయము) ఉన్నట్లయితే దిల్ లో ఎవరు ఉంటారు? వారు దిలారామ్ (హృదయాభిరాముడు) కనుక ఢిల్లీ నివాసి అనగా హృదయములో సదా హృదయాభిరాముడిని ఉంచుకునేవారు. ఇటువంటి అనుభవీ ఆత్మలు మరియు ఇప్పటి స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులు. హృదయంలో హృదయాభిరాముడు ఉన్నట్లయితే ఇప్పుడు కూడా రాజ్య అధికారులు మరియు సదా రాజ్య అధికారులుగా ఉంటారు. కనుక ఈ రెండు విశేషతలు ఉన్నాయా అని మీ జీవితంలో సదా చూసుకోండి. హృదయంలో హృదయాభిరాముడు మరియు అధికారి కూడా. ఇటువంటి గొల్డెన్ ఛాన్స్, గొల్డెన్ కంటే కూడా డైమండ్ ఛాన్స్ ను తీసుకునేవారు ఎంతటి భాగ్యవంతులు! అచ్ఛా!

దేశములోనైనా, విదేశములోనైనా ఇప్పుడైతే అనంతమైన సేవకు చాలా మంచి సాధనము దొరికింది. పేరుకు తగ్గట్లు కార్యము కూడా సుందరమైనది! పేరు వినటంతోనే అందరికీ ఉల్లాసము కలుగుతుంది - ‘‘సర్వుల స్నేహము, సహయోగము ద్వారా సుఖమయ ప్రపంచము!’’ ఇది చాలా సమయము తీసుకునే కార్యము, ఒక సంవత్సరము కంటే ఎక్కువ సమయము తీసుకుంటుంది. కనుక ఏ విధంగానైతే కార్యము యొక్క పేరు వినటంతోనే అందరికీ ఉల్లాసము కలుగుతుందో, అలాగే కార్యమును కూడా ఉల్లాసముతో చేస్తారు. ఏ విధంగా సుందరమైన పేరును విని సంతోషపడుతున్నారో, అలా కార్యమును చేస్తూ సదా సంతోషపడతారు. ప్రత్యక్షతా పరదా కదిలేందుకు మరియు పరదా తెరిచేందుకు ఆధారము తయారైంది మరియు తయారవుతూ ఉంటుంది అని కూడా వినిపించాము కదా. ‘‘సర్వుల సహయోగి’’ - కార్యము యొక్క పేరు ఎలా అయితే ఉందో, అలాగే స్వరూపులుగా అయ్యి సహజంగా కార్యమును చేసినట్లయితే శ్రమ నిమిత్తమాత్రముగా మరియు సఫలత పదమాల గుణాలుగా ఉన్నట్లు అనుభవము చేస్తూ ఉంటారు. చేయించేవారు నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు అన్నట్లుగా అనుభవము చేస్తారు. నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. దీనితో సహయోగులుగా అవ్వరు. చేయించేవారు చేయిస్తున్నారు. నడిపించేవారు కార్యాన్ని నడిపిస్తున్నారు. హుక్మీ హుకుమ్ చలా రహా హై (ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవాడు ఆజ్ఞాపిస్తున్నాడు) అన్న జగదంబ స్లోగన్ మీ అందరికీ గుర్తుంది కదా. ఈ స్లోగన్ ను సదా స్మృతి స్వరూపములోకి తీసుకువస్తూ సఫలతను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే నలువైపులా ఉల్లాస-ఉత్సాహాలు బాగా ఉన్నాయి. ఎక్కడైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అక్కడ స్వయంగా సఫలతయే సమీపంగా వచ్చి మెడలోని హారంగా అవుతుంది. ఈ విశాల కార్యము అనేక ఆత్మలను సహయోగులుగా చేసి సమీపంగా తీసుకువస్తుంది ఎందుకంటే ప్రత్యక్షతా పరదా తెరిచిన తరువాత ఈ విశాలమైన స్టేజ్ పైకి ప్రతి వర్గము వారు పాత్రధారులై స్టేజ్ పై ప్రత్యక్షమవ్వాలి. ప్రతి వర్గము అన్నదాని అర్థమే - విశ్వములోని సర్వాత్మల వెరైటీ వృక్షము యొక్క సంగఠన రూపము. మాకైతే సందేశము లభించలేదు అనే ఫిర్యాదు చేసే వర్గమేదీ మిగిలిపోకూడదు. అందుకే నేతల నుండి గుడిసెల వరకు వర్గాలు ఉన్నాయి. చదువుకుని అందరికన్నా టాప్ లో ఉన్న వైజ్ఞానికుల నుండి చదువుకోనివారు ఎవరైతే ఉన్నారో, వారికి కూడా ఈ జ్ఞానము యొక్క నాలెడ్జ్ ను ఇవ్వటము, ఇది కూడా సేవ. కనుక అన్ని వర్గాలకు అనగా విశ్వములోని ప్రతి ఆత్మకు సందేశమును చేర్చాలి. ఇది ఎంత పెద్ద కార్యము! మాకైతే సేవ అవకాశము లభించదు అని ఎవ్వరూ అనలేరు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, రోగులు రోగుల సేవను చెయ్యండి, చదువుకోనివారు చదువుకోనివారి సేవను చెయ్యండి. ఏది చేయాలనుకున్నా అందుకు అవకాశము ఉంది. అచ్ఛా, మాట్లాడలేకపోతే మనసా వాయుమండలము ద్వారా సుఖ వృత్తి, సుఖమయ స్థితి ద్వారా సుఖమయ ప్రపంచాన్ని తయారుచెయ్యండి. నేను చెయ్యలేను, సమయము లేదు అని ఎవ్వరూ సాకులు చెప్పలేరు. లేస్తూ కూర్చుంటూ 10-10 నిమిషాలు సేవ చెయ్యండి. చేతి వేలునైతే అందిస్తారు కదా? ఎక్కడికీ వెళ్ళలేకపోయినా, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంట్లో కూర్చునే చెయ్యండి, కానీ సహయోగులుగా అవ్వటము తప్పనిసరి, అప్పుడు సర్వుల సహయోగము లభిస్తుంది. అచ్ఛా!

ఉల్లాస-ఉత్సాహాలను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ప్రత్యక్షతా పరదాను తెరిచి చూపిస్తాము అని అందరి మనసుల్లో లగనము ఉంది. ఆరంభమైతే అయ్యింది కదా, ఇక మున్ముందు సహజమవుతూ ఉంటుంది. విదేశీ పిల్లల ప్లాన్లు కూడా బాప్ దాదా వరకు చేరుకుంటూ ఉంటాయి. వారు స్వయము కూడా ఉల్లాసములో ఉన్నారు మరియు సర్వుల సహయోగము కూడా ఉల్లాస-ఉత్సాహాలతో లభిస్తూ ఉంటుంది. ఉల్లాసానికి ఉల్లాసము, ఉత్సాహానికి ఉత్సాహము లభిస్తాయి. ఈ మిలనము కూడా జరుగుతుంది. కనుక చాలా ఘనంగా ఈ కార్యమును ముందుకు తీసుకువెళ్ళండి. ఎవరైతే ఉల్లాస-ఉత్సాహాలతో తయారుచేసారో, వారు ఇంకా కూడా బాబా మరియు బ్రాహ్మణులందరి సహయోగము ద్వారా, శుభ కామనలు, శుభ భావనల ద్వారా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అచ్ఛా!

నలువైపులా కల సదా స్మృతి మరియు సేవల ఉల్లాస-ఉత్సాహాలు కల శ్రేష్ఠమైన పిల్లలు, సదా ప్రతి కర్మలో స్మృతి స్వరూపపు అనుభూతిని చేసే అనుభవీ ఆత్మలు, సదా ప్రతి కర్మలో బాబాతో సర్వ సంబంధాల అనుభవాన్ని చేసే శ్రేష్ఠ ఆత్మలు, సదా బ్రాహ్మణ జీవితములో మజాతో కూడిన జీవితాన్ని గడిపే మహాన్ ఆత్మలు, బాప్ దాదాల నుండి అతి స్నేహ సంపన్న ప్రియ స్మృతులను స్వీకరించండి.

Comments