12-03-1988 అవ్యక్త మురళి

 12-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

మూడు రకాల స్నేహం మరియు హృదయపూర్వక స్నేహీ పిల్లల విశేషతలు.

ఈ రోజు బాప్ దాదా తమ స్నేహీ, సహయోగి మరియు శక్తిశాలి - ఈ మూడు విశేషతలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. ఎవరిలోనైతే ఈ మూడు విశేషతలు సమానంగా ఉన్నాయో, వారే విశేష ఆత్మలలో ‘నంబర్ వన్’ ఆత్మ. స్నేహీలుగా కూడా ఉండాలి, సదా ప్రతి కార్యంలో సహయోగులుగా కూడా ఉండాలి మరియు శక్తిశాలిగా కూడా ఉండాలి. స్నేహీలుగానైతే అందరూ ఉన్నారు కానీ స్నేహంలో ఒకటి - హృదయపూర్వకమైన స్నేహం, రెండవది - సమయం అనుసారంగా అవసరార్థం స్నేహం, మూడవది - నిస్సహాయ సమయంలో స్నేహం. హృదయపూర్వక స్నేహీల విశేషతలు ఏమిటంటే - వారు సర్వ సంబంధాలను, సర్వ ప్రాప్తులను సదా, సహజంగా, స్వతహాగా అనుభవం చేస్తారు. ఏ ఒక్క సంబంధాన్ని అనుభవం చేయడంలోనూ లోపముండదు. ఎలాంటి సమయమో, అలాంటి సంబంధం యొక్క స్నేహంతో రకరకాల అనుభవాలు చేస్తారు. వారు సమయాన్ని తెలుసుకునేవారిగా మరియు సమయం అనుసారంగా సంబంధాన్ని కూడా తెలుసుకునేవారిగా ఉంటారు.

ఒకవేళ బాబా శిక్షకుని రూపంలో శ్రేష్ఠమైన చదువును చదివిస్తుంటే, ఆ సమయంలో ‘శిక్షకుని’ సంబంధాన్ని అనుభవం చేయకుండా ‘సఖుని’ రూపంలో అనుభవం చేస్తూ, మిలనం జరుపుకోవడంలో లేక ఆత్మిక సంభాషణ చేయడంలో నిమగ్నమై ఉంటే, చదువు పట్ల అటెన్షన్ ఉండదు. చదువుకునే సమయంలో ఒకవేళ ఎవరైనా, నేను శబ్దానికి అతీతమైన స్థితిలో చాలా శక్తిశాలి అనుభవాన్ని చేస్తున్నాను అని అంటే, చదువుకునే సమయంలో ఇలా చేయడం రైటేనా? ఎందుకంటే బాబా శిక్షకుని రూపంలో చదువు ద్వారా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేయించేందుకు వచ్చినప్పుడు, ఆ సమయంలో టీచరు ఎదురుగా ఈశ్వరీయ విద్యార్థి జీవితమే యథార్థమైనది. దీనినే సమయాన్ని గుర్తించి, దాని అనుసారంగా సంబంధాన్ని గుర్తించి, ఆ సంబంధం అనుసారంగా స్నేహ ప్రాప్తిని అనుభవం చేయడమని అంటారు. బుద్ధికి ఈ ఎక్సర్ సైజ్ (వ్యాయామం) చేయించండి - ఎలా కావాలంటే అలా, ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఆ స్వరూపము మరియు స్థితిలో స్థితులవ్వగలగాలి.

ఎవరైనా శరీరపరంగా భారీగా ఉంటే, బరువుగా ఉంటే, వారు తమ శరీరాన్ని సహజంగా ఎలా కావాలంటే అలా మలచుకోలేరు. అలాగే మందబుద్ధి ఉంటే అనగా ఏదైనా వ్యర్థమైన బరువు లేక వ్యర్థమైన చెత్త బుద్ధిలో నిండి ఉంటే, ఏదైనా అశుద్ధత ఉంటే, ఇలాంటి బుద్ధి కలిగిన వారు ఏ సమయంలో ఎలా కావాలంటే అలా బుద్ధిని మలచుకోలేరు, అందుకే చాలా స్వచ్ఛమైన, లోతైన అనగా అత్యంత సూక్ష్మ బుద్ధి, దివ్య బుద్ధి, అనంతమైన బుద్ధి, విశాలమైన బుద్ధి ఉండాలి. ఇలాంటి బుద్ధి కలిగిన వారే సర్వ సంబంధాల అనుభవాన్ని, ఏ సమయంలో ఏ సంబంధమో, అలా స్వయం యొక్క స్వరూపాన్ని అనుభవం చేయగలరు. కనుక అందరూ స్నేహీలే కానీ సమయం అనుసారంగా సర్వ సంబంధాల స్నేహాన్ని అనుభవం చేసేవారు సదా ఈ అనుభవాలలోనే చాలా బిజీగా ఉంటారు. వారు ప్రతి సంబంధం ద్వారా లభించే భిన్న-భిన్న ప్రాప్తులలో ఎంత లవలీనంగా, నిమగ్నమై ఉంటారంటే, ఏ రకమైన విఘ్నము వారిని తన వైపుకు లోబరుచుకోలేదు. కనుక స్వతహాగానే సహజయోగి స్థితిని అనుభవం చేస్తారు. వీరినే నంబర్ వన్ యథార్థ స్నేహీ ఆత్మలని అంటారు. స్నేహం కారణంగా ఇలాంటి ఆత్మలకు సమయానికి బాబా ద్వారా ప్రతి కార్యంలో స్వతహాగానే సహయోగం ప్రాప్తిస్తూ ఉంటుంది. దీని వలన ‘స్నేహం’ అఖండంగా, స్థిరంగా, అచంచలంగా, అవినాశీగా అనుభవమవుతుంది. అర్థమయిందా? ఇవి నంబర్ వన్ స్నేహీల విశేషతలు. రెండవ, మూడవ నంబరు వారిని వర్ణించే అవసరమైతే లేనే లేదు ఎందుకంటే వారి గురించి అందరికీ బాగా తెలుసు. కనుక బాప్ దాదా ఇలాంటి స్నేహీ పిల్లలను చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు స్నేహం ఏకరసంగా ఉందా లేక సమయం అనుసారంగా, సమస్య అనుసారంగా మరియు బ్రాహ్మణాత్మల సంపర్కం అనుసారంగా మారుతూ ఉందా - ఇందులో కూడా తేడా వచ్చేస్తుంది కదా.

ఈ రోజు స్నేహం గురించి వినిపించాము, తర్వాత సహయోగము మరియు శక్తిశాలి - మూడు విశేషతల గల ఆత్మల మహత్వాన్ని వినిపిస్తాము. మూడు విశేషతలు అవసరమే. మీరందరూ ఇలాంటి స్నేహీలే కదా? అభ్యాసం ఉంది కదా? బుద్ధిని ఎప్పుడు ఎక్కడ స్థితి చేయాలనుకుంటే, అలా స్థితి చేయగలరు కదా? కంట్రోలింగ్ పవర్ (నియంత్రించే శక్తి) ఉంది కదా? ముందు కంట్రోలింగ్ పవర్ ఉంటేనే రూలింగ్ పవర్ (పాలన చేసే శక్తి) వస్తుంది. ఎవరైతే స్వయాన్నే కంట్రోల్ చేసుకోలేరో, వారు రాజ్యాన్ని ఏం కంట్రోల్ చేస్తారు? అందుకే స్వయాన్ని కంట్రోల్ లో నడిపించే శక్తి యొక్క అభ్యాసం ఇప్పటి నుండే కావాలి. అప్పుడే రాజ్యాధికారులుగా అవుతారు. అర్థమయిందా?

ఈ రోజు కలుసుకునేవారి కోటాను పూర్తి చేయాలి. చూడండి, సంగమయుగంలో సంఖ్యను ఎంతగా బంధనంలో బంధించినా, బంధించగలరా? ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువగా వచ్చేస్తారు. అందుకే సమయాన్ని, సంఖ్యను మరియు ఆధారంగా తీసుకున్న శరీరాన్ని చూసి, ఆ విధితో నడవాల్సి వస్తుంది. వతనంలోనైతే ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సూక్ష్మ శరీరం యొక్క వేగం స్థూల శరీరం కంటే చాలా తీవ్రమైనది. ఒకవైపు సాకార శరీరధారి, మరోవైపు ఫరిశ్తా స్వరూపం - ఇరువురి నడకలో ఎంత వ్యత్యాసముంటుంది! ఫరిశ్తా ఎంత సమయంలో చేరుకుంటుంది, సాకార శరీరధారి ఎంత సమయంలో చేరుకుంటారు? చాలా తేడా ఉంటుంది. బ్రహ్మాబాబా కూడా సూక్ష్మ శరీరధారిగా అయి ఎంత తీవ్ర గతితో నలువైపులా సేవ చేస్తున్నారు! ఈ బ్రహ్మానే సాకార శరీరధారిగా ఉండేవారు, ఇప్పుడు సూక్ష్మ శరీరధారిగా అయి ఎంత తీవ్ర గతితో ముందుకు వెళ్తూ, ఇతరులను ముందుకు తీసుకెళ్తున్నారు, ఇది అనుభవం చేస్తున్నారు కదా!

సూక్ష్మ శరీరం యొక్క వేగం ఈ ప్రపంచంలో తీవ్ర గతితో వెళ్ళే సాధనాలన్నిటి కంటే తీవ్రమైనది. ఒక్క సెకండులో అదే సమయంలో అనేక మందికి అనుభవం చేయించగలరు. మేము ఈ సమయంలో బాబాను చూసాము లేక బాబాను కలిసాము అని అందరూ అంటారు. ప్రతి ఒక్కరు - నేను బాబాతో ఆత్మిక సంభాషణ చేసాను, నేను మిలనం జరుపుకున్నాను, నాకు సహాయం లభించింది అని భావిస్తారు, ఎందుకంటే తీవ్ర గతి కారణంగా ఒకే సమయంలో ప్రతి ఒక్కరికి - నేను అనుభవం చేసాను అన్నట్లు అనిపిస్తుంది. కనుక ఫరిశ్తా జీవితం, బంధనముక్త జీవితం. సేవా బంధనం ఉంది కానీ వేగం ఎంత తీవ్రంగా ఉందంటే, ఎవరెంత సేవ చేసినా అంత చేస్తూ కూడా సదా ఫ్రీగా ఉంటారు. ఎంత ప్రియమో, అంతే అతీతము. బాబా అందరి ద్వారా చేయిస్తారు కానీ చేయిస్తూ కూడా అశరీరి ఫరిశ్తాగా ఉన్న కారణంగా సదా స్వతంత్ర స్థితి అనుభవమవుతుంది ఎందుకంటే శరీరం మరియు కర్మకు ఆధీనంగా లేరు. మీకు కూడా ఈ అనుభవముంది - ఫరిశ్తా స్థితిలో ఏదైనా కార్యం చేసినప్పుడు బంధనముక్తులుగా ఉన్నట్లు అనగా తేలికదనాన్ని అనుభవం చేస్తారు కదా. మరియు ఎవరైతే నిజంగా ఫరిశ్తాగా ఉన్నారో, లోకము కూడా అదే, శరీరం కూడా అదే ఉన్నప్పుడు ఏం అనుభవం అవుతుందో తెలుసుకోగలరు కదా. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ హృదయపూర్వక స్నేహీ పిల్లలకు, సదా దివ్యమైన, విశాలమైన, అనంతమైన బుద్ధివంతులైన పిల్లలకు, సదా బ్రహ్మాబాబా సమానంగా ఫరిశ్తా స్థితిని అనుభవం చేసి తీవ్ర గతితో సేవలో, స్వఉన్నతిలో సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, సదా సహయోగులుగా అయి బాబా సహయోగం యొక్క అధికారాన్ని అనుభవం చేసేవారు - ఇలాంటి విశేష ఆత్మలకు, సమానంగా అయ్యే మహాన్ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత కలయిక

1. మీరు సదా నిశ్చింత చక్రవర్తులు కదా! బాబాకు బాధ్యత ఇచ్చేసినప్పుడు చింత దేనికి? మీపై బాధ్యతను పెట్టుకుంటే ఏమవుతుంది, ఎలా అవుతుంది... అనే చింత ఉంటుంది. బాబాకు సమర్పించినప్పుడు చింత ఎవరికి ఉండాలి, బాబాకా లేక మీకా? బాబా అయితే సాగరుడు, వారికి చింత ఉండనే ఉండదు. కనుక బాబా కూడా నిశ్చింతగా, పిల్లలు కూడా నిశ్చింతగా అయిపోయారు. ఏ కర్మ చేస్తున్నా, కర్మ చేసే ముందు ‘నేను ట్రస్టీని’ అని భావించండి. ట్రస్టీగా ఉన్నవారు చాలా ప్రేమగా పని చేస్తారు కాని భారము ఉండదు. ట్రస్టీ అంటేనే ‘బాబా అంతా నీదే’ అని అర్థము. కనుక ‘నీది’ అని అన్నప్పుడు ప్రాప్తి కూడా ఎక్కువ ఉంటుంది మరియు తేలికగా కూడా ఉంటారు, పని కూడా బాగా జరుగుతుంది ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి ఉంటుంది. ‘నీది’ అనగా తండ్రి స్మృతి. వీరు ఎవరో మామూలు మహాన్ ఆత్మ కాదు, వీరు మన తండ్రి! కనుక ‘నీది’ అని అన్నారంటే పని కూడా బాగా జరుగుతుంది మరియు స్థితి కూడా సదా నిశ్చింతగా ఉంటుంది. బాబా వచ్చి ‘చింత నాకు ఇచ్చేయండి’ అని ఆఫర్ చేస్తున్నప్పుడు, ఆ ఆఫర్ ను స్వీకరించకపోతే ఏమంటారు? ‘భారాన్ని వదిలేయండి’ అని బాబా ఆఫర్ ఇస్తున్నారు. కనుక సదా నిశ్చింతగా ఉండాలి మరియు ఇతరులను నిశ్చింతులుగా చేసేందుకు మీ అనుభవపూర్వకమైన విధిని చెప్పాలి. అప్పుడు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి! ఎవరి భారాన్ని అయినా లేక చింతను అయినా తీసుకుంటే, వారు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తారు. కనుక మీరు స్వయం కూడా నిశ్చింత చక్రవర్తులు మరియు ఇతరుల శుభ భావనల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కనుక మీరు చక్రవర్తులు, అవినాశీ ధనానికి చక్రవర్తులు! చక్రవర్తికి చింతేముంటుంది! వినాశీ చక్రవర్తులకైతే చింత ఉంటుంది కానీ మీరు అవినాశీ చక్రవర్తులు. అచ్ఛా!

2. అవినాశీ సుఖం మరియు అల్పకాల సుఖం - రెండిటి అనుభవీలు కదా? అల్పకాల సుఖం అనగా స్థూలమైన సాధనాల సుఖం మరియు అవినాశీ సుఖం అనగా ఈశ్వరీయ సుఖం. మరి అన్నిటికంటే మంచి సుఖం ఏది? ఈశ్వరీయ సుఖం లభించినప్పుడు వినాశీ సుఖం దానంతటదే వెనుక-వెనుకే వస్తుంది. ఉదాహరణకు ఎవరైనా ఎండలో నడిచేటప్పుడు వారి వెనుక నీడ దానంతటదే వస్తుంది కానీ ఒకవేళ ఎవరైనా నీడ వెనుక వెళ్తే వారికి ఏమీ లభించదు. కనుక ఎవరైతే ఈశ్వరీయ సుఖం వైపు వెళ్తారో వారి వెనుక అల్పకాల సుఖం స్వతహాగానే నీడ వలె వస్తూ ఉంటుంది, శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే పరమార్థం ఉంటుందో, అక్కడ వ్యవహారం స్వతహాగా సిద్ధి అవుతుంది - అని అంటారు కదా. అలా ఈశ్వరీయ సుఖం అనగా ‘పరమార్థం’, వినాశీ సుఖం అనగా ‘వ్యవహారం’. కనుక పరమార్థం ఎదురుగా వ్యవహారం దానంతటదే వస్తుంది. కనుక ఈ రెండు సుఖాలు లభించే అనుభవంలోనే సదా ఉండాలి. లేదంటే ఒక్క వినాశీ సుఖం మాత్రమే లభిస్తుంది. అది కూడా ఒక్కోసారి లభిస్తుంది, ఒక్కోసారి లభించదు ఎందుకంటే వస్తువే వినాశీ అయినప్పుడు దాని నుండి ఏం లభిస్తుంది? ఈశ్వరీయ సుఖం లభించినప్పుడు సదా సుఖీగా అవుతారు, దుఃఖపు నామ రూపాలు ఉండవు. ఈశ్వరీయ సుఖం లభించిందంటే అన్ని సుఖాలు లభించినట్లు, ఏ అప్రాప్తి ఉండదు. అవినాశీ సుఖంలో ఉండేవారు వినాశీ వస్తువులను అతీతంగా ఉంటూ ఉపయోగిస్తారు, వాటిలో చిక్కుకోరు. అచ్ఛా!

3. సదా స్వయాన్ని కల్పక్రితపు విజయీ పాండవులుగా భావిస్తున్నారా? ఎప్పుడైనా పాండవుల స్మృతిచిహ్న చిత్రాలను చూసినప్పుడు, ఇవి మా స్మృతిచిహ్నాలే అని అనిపిస్తుందా? పాండవులు అనగా సదా దృఢంగా ఉండేవారు, అందుకే పాండవుల శరీరాలను విశాలమైనవిగా, పెద్దవిగా చూపిస్తారు, ఎప్పుడూ బలహీనంగా చూపించరు. వాస్తవానికి ఆత్మ ధైర్యశాలిగా, శక్తిశాలిగా ఉంది, దీనికి బదులుగా శరీరాన్ని శక్తిశాలిగా చూపించారు. పాండవుల విజయము ప్రసిద్ధమైనది. కౌరవులు అక్షౌహిణి సంఖ్యలో ఉన్నా ఓడిపోయారు, పాండవులు 5 మంది ఉన్నా విజయులుగా అయ్యారు. విజయులుగా ఎందుకయ్యారు? ఎందుకంటే పాండవులతో పాటు తండ్రి ఉన్నారు. పాండవులు శక్తిశాలురు, వారిలో ఆధ్యాత్మిక శక్తి ఉంది, అందుకే అక్షౌహిణి కౌరవుల శక్తి వారి ముందు ఏమీ కాదు! ఇటువంటి వారే కదా? ఎవరు ఎదురుగా వచ్చినా సరే, మాయ ఏ రూపంలో వచ్చినా సరే, అది ఓడిపోయి వెళ్ళిపోవాలి, గెలవకూడదు. ఇటువంటి వారినే విజయీ పాండవులని అంటారు. మాతలు కూడా పాండవ సేనలో ఉన్నారు కదా లేక ఇంట్లో ఉండేవారా? బలహీనంగా ఉండేవారు ఇంట్లో దాక్కుంటారు, ధైర్యవంతులు మైదానంలోకి వస్తారు. మరి మీరు ఎక్కడ ఉంటారు, మైదానంలోనా లేక ఇంట్లోనా? కనుక సదా - మేము పాండవ సేనలోని విజయీ పాండవులము అనే నషాలో ముందుకు వెళ్తూ ఉండండి.

4. స్వయాన్ని అనంతమైన నిమిత్త సేవాధారులుగా భావిస్తున్నారా? అనంతమైన సేవాధారి అనగా ఎలాంటి ‘నేను, నాది’ అనే హద్దులోకి వచ్చేవారు కాదు. అనంతంలో ‘నేను, నాది’ అనేవి ఉండవు. అన్నీ బాబావి, నేను కూడా బాబా వాడిని, సేవ కూడా బాబాది. దీనిని అనంతమైన సేవ అని అంటారు. ఇలాంటి అనంతమైన సేవాధారులేనా లేక హద్దులోకి వచ్చేస్తారా? అనంతమైన సేవాధారులు అనంతమైన రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సదా అనంతమైన తండ్రి, అనంతమైన సేవ, అనంతమైన రాజ్య భాగ్యం - ఈ స్మృతిలో ఉంటే అనంతమైన సంతోషముంటుంది. హద్దులో సంతోషం మాయమైపోతుంది, అనంతంలో సదా సంతోషం ఉంటుంది. అచ్ఛా!

వీడ్కోలు సమయంలో - ఇప్పుడు సేవా ప్లాన్లు చాలా బాగా తయారుచేసారు. వాస్తవానికి సేవ కూడా ఉన్నతికి సాధనము. ఒకవేళ సేవను, సేవలా చేస్తే, ఆ సేవ ముందుకు వెళ్ళేందుకు లిఫ్టుగా అవుతుంది. కేవలం ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయి ప్లాన్లు తయారుచేయండి, కొంచెం కూడా ఇక్కడిది, అక్కడిది మిక్స్ అవ్వకూడదు. ఏదైనా మంచి వస్తువును తయారుచేసి పెట్టినప్పుడు, గాలి ద్వారా ఇక్కడి, అక్కడి చెత్త పడితే ఏమవుతుంది? అలా పడకుండా జాగ్రత్తగా పెడతారు కదా. కనుక కొంచెం కూడా ఇక్కడిది, అక్కడిది మిక్స్ అవ్వకూడదు. ఈ విధంగా సేవా ప్లాన్లు బాగా తయారుచేస్తారు. సేవలో చేసే శ్రమ, శ్రమగా అనిపించదు, సంతోషమనిపిస్తుంది. ఎందుకంటే తపనతో చేస్తారు, ఉల్లాస-ఉత్సాహాలు కూడా బాగా ఉంచుకుంటారు. సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలను చూసి బాప్ దాదా సంతోషిస్తారు కూడా. కేవలం మిక్సింగ్ లేకుండా ఉంటే, ఎంత సమయంలో సేవ జరిగిందో, దానికి 4 రెట్లు ఎక్కువ సేవ జరుగుతుంది. ప్లెయిన్ బుద్ధి తీవ్ర గతి సేవను ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఇప్పుడైతే ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇదైతే జరగదు కదా, అదైతే జరగదు కదా అని ఆలోచించాల్సి వస్తుంది కదా? కాని అందరిదీ ఒకే బుద్ధిగా అయిపోవాలి. ఎవరు చేసారో అది మంచిది, ఏం చేసారో అది మంచిది - ఈ పాఠం పక్కా అయితే తీవ్ర గతి సేవ ప్రారంభమవుతుంది. నిజానికి ఇప్పుడు ముందుకంటే సేవ తీవ్ర గతితో జరుగుతోంది, పెరుగుతోంది, సఫలత కూడా లభిస్తోంది కానీ ఇప్పటి లెక్కతో, విశ్వాత్మలందరికీ సందేశాన్నిచ్చే లెక్కతో చూస్తే ఇప్పుడు కేవలం ఒక మూల వరకే చేరుకున్నారు. 550 కోట్లమంది ఆత్మలెక్కడ, సందేశం చేరిన ఒకటి, రెండు కోట్లమంది ఆత్మలెక్కడ! ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు? రాజధానికి సమీపంగా ఉండేవారు చేరుకున్నారు కానీ అందరూ కావాలి కదా. వారసత్వమైతే అందరికీ ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి కానీ ఇవ్వడమైతే అందరికీ ఇవ్వాలి. ఒక్క బాబా బిడ్డ కూడా వంచితులవ్వకూడదు. ఏ విధితో సందేశాన్ని విన్నా గాని, ఎలాగైనా సరే బాబా వారసత్వానికి అధికారులుగా అయితే అవ్వాల్సిందే. దీని కొరకు ‘తీవ్ర గతి’ కావాలి. ఈ సమయం కూడా రాబోతోంది, అవుతూ ఉంటుంది.

ఇప్పుడు నెమ్మది-నెమ్మదిగా అన్ని ధర్మాల వారు తమ విషయాలలో మోల్డ్ అవుతున్నారు. ముందు కఠినంగా ఉండేవారు, ఇప్పుడు మోల్డ్ అవుతున్నారు. క్రిస్టియన్లు అయినా, ముస్లింలు అయినా, భారతదేశ ఫిలాసఫీకి లోపల నుండి గౌరవమిస్తారు. ఎందుకంటే భారతదేశ ఫిలాసఫీలో అన్ని రకాల రమణీకత ఉంది. వేరే ధర్మాలలో ఇలా లేదు. భారతదేశ ఫిలాసఫీలో కథల ద్వారా, డ్రామాల ద్వారా ఏ రకమైన వర్ణన చేసారో, అలా వేరే ఏ ధర్మాలలోనూ ఎక్కడా చేయలేదు. అందుకే, ఎవరైతే బాగా కఠినంగా ఉండేవారో, వారు కూడా - భారతదేశ ఫిలాసఫీ, అందులోనూ ఆది సనాతన ఫిలాసఫీ తక్కువైనది కాదని లోలోపల భావిస్తున్నారు. ఒకవేళ ఫిలాసఫీ అనేది ఉంటే, అది ఆది సనాతన ధర్మానిదే అని అందరు అనే ఆ రోజు కూడా వస్తుంది. హిందూ అనే పదము వింటే డిస్టర్బ్ అవుతారు కానీ ఆది సనాతన ధర్మానికి గౌరవమిస్తారు. భగవంతుడు ఒక్కరే అయినప్పుడు ధర్మం కూడా ఒక్కటే, మనందరి ధర్మం కూడా ఒక్కటే - ఇలా అందరూ నెమ్మది-నెమ్మదిగా ఆత్మ ధర్మం వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. అచ్ఛా!

Comments