11-11-1989 అవ్యక్త మురళి

  11-11-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

‘‘సంగమయుగ బ్రాహ్మణుల అలంకారము - దివ్యత’’.

ఈ రోజు దివ్య బుద్ధి విధాత, దివ్య దృష్టి దాత తమ దివ్య జన్మధారులైన దివ్య ఆత్మలను చూస్తున్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ దివ్య జీవితం కలవారిగా అనగా దివ్యమైన సంకల్పాలు, దివ్యమైన మాటలు, దివ్యమైన కర్మలు చేసే దివ్య మూర్తులుగా తయారుచేసారు. ‘దివ్యత’ అనేది సంగమయుగ పిల్లలైన మీ శ్రేష్ఠమైన అలంకారము. ఒకటి సాధారణత, రెండవది దివ్యత. దివ్యతకు గుర్తులేమిటో మీ అందరికీ తెలుసు. దివ్య-జీవనధారి ఆత్మ ఏ ఆత్మకైనా తన దివ్య నయనాల ద్వారా అనగా దృష్టి ద్వారా సాధారణతకు అతీతంగా దివ్య అనుభూతులను చేయిస్తుంది. వారి ఎదురుగా రావటంతోనే సాధారణ ఆత్మ తన సాధారణతను మర్చిపోతుంది ఎందుకంటే నేటి సమయమనుసారంగా వర్తమాన సాధారణ జీవితంతో మెజారిటీ ఆత్మలు సంతుష్టంగా లేరు. ఇక మున్ముందు ‘ఈ జీవితం, జీవితమే కాదు, జీవితంలో ఏదో నవీనత (కొత్తదనం) కావాలి’ అనే మాటలు వింటారు. ‘అలౌకికత మరియు దివ్యత’ - ఇవి జీవితానికి విశేషమైన ఆధారమని అనుభవం చేస్తారు. ఏదో కావాలి, ఏదో కావాలి - ఈ ‘కావాలి’ అనే దాహంతో నలువైపులా వెతుకుతారు. ఎలాగైతే స్థూలమైన నీటి కోసం దాహంతో తపించే మనుష్యులు నలువైపులా నీటి బిందువు కోసం వెతుకుతూ తపిస్తారో, అలా నలువైపులా దివ్యత కోసం దాహంతో ఉన్న ఆత్మలు దోసిలిని తీసుకునేందుకు తపిస్తూ కనిపిస్తారు. తపించేవారు ఎక్కడికి చేరుకుంటారు? మీ అందరి వద్దకు చేరుకుంటారు. ఈ విధంగా దివ్యత యొక్క ఖజానాతో నిండుగా అయ్యారా? ప్రతి సమయము దివ్యత అనుభవమవుతుందా లేక ఒక్కోసారి సాధారణత, ఒక్కోసారి దివ్యత ఉంటుందా? బాబా దివ్య దృష్టి, దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చినప్పుడు, ఆ దివ్య బుద్ధిలోకి సాధారణ విషయాలు రాలేవు. దివ్య జన్మధారి బ్రాహ్మణులు తనువుతో సాధారణ కర్మలు చేయలేరు. చూసేవారికి అవి సాధారణ కర్మలుగానే అనిపిస్తాయి. ఇతరులలాగే మీరంతా కూడా వ్యవహారం చేస్తారు, వ్యాపారం చేస్తారు లేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు, మాతలు భోజనం తయారుచేస్తారు. ఇవన్నీ చూసేందుకు సాధారణ కర్మలే కానీ ఈ సాధారణ కర్మలలో కూడా మీ కర్మలు ఇతరుల కంటే అతీతమైన ‘‘అలౌకిక’’ దివ్య కర్మలుగా ఉండాలి. ఈ గొప్ప వ్యత్యాసాన్ని ఎందుకు వినిపించామంటే, దివ్య జన్మధారి బ్రాహ్మణులు తనువు ద్వారా సాధారణ కర్మలు చేయరు, మనసు ద్వారా సాధారణ సంకల్పాలు చేయలేరు, ధనాన్ని సాధారణ రీతితో కార్యంలో ఉపయోగించలేరు. ఎందుకంటే తనువు, మనసు మరియు ధనము - మీరు ఈ మూడింటికీ ట్రస్టీలు, అందుకే యజమాని అయిన తండ్రి శ్రీమతము లేకుండా కార్యంలో ఉపయోగించలేరు. ప్రతి సమయం దివ్య కర్మలు చేసేందుకు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. అందుకే చెక్ చేసుకోండి, రోజంతటిలో మాటలు మరియు కర్మలు సాధారణంగా ఎంత సమయం ఉన్నాయి మరియు దివ్యంగా, అలౌకికంగా ఎంత సమయం ఉన్నాయి? చాలా మంది పిల్లలు అక్కడక్కడ చాలా అమాయకులుగా అవుతారు. చెక్ చేసుకుంటారు కానీ అమాయకత్వంతో చెక్ చేసుకుంటారు. మొత్తం రోజంతటిలో విశేషంగా ఏ తప్పు చేయలేదు, చెడుగా ఆలోచించలేదు, చెడుగా మాట్లాడలేదు అని భావిస్తారు. కానీ దివ్యమైన లేక అలౌకికమైన కర్మలు చేసామా అని చెక్ చేసుకున్నారా? ఎందుకంటే సాధారణ మాటలు లేక కర్మల వలన జమ అవ్వదు. అవి తొలగిపోవు, అలా అని జమ అవ్వవు. వర్తమానంలోని దివ్య సంకల్పాలు, దివ్య మాటలు మరియు దివ్య కర్మలు భవిష్యత్తు కొరకు జమ అవుతాయి. జమ ఖాతా పెరగదు కనుక జమ చేసుకునే లెక్కలో అమాయకంగా ఉంటారు. నేను వేస్ట్ (వ్యర్థం) చేయలేదు కదా అని సంతోషంగా ఉంటారు. కానీ కేవలం ఇందులోనే సంతోషంగా ఉండడం కాదు. వేస్ట్ (వ్యర్థం) చేయలేదు కానీ బెస్ట్ (సమర్థంగా) ఎంత చేసుకున్నారు? చాలా సార్లు పిల్లలు - నేను ఈ రోజు ఎవ్వరికీ దుఃఖమివ్వలేదు అని అంటారు. మరి సుఖమిచ్చారా? దుఃఖమివ్వలేదు - దీని ద్వారా మీ వర్తమానాన్ని మంచిగా చేసుకున్నారు కానీ సుఖమివ్వటం వలన జమ అవుతుంది. కావున సుఖమిచ్చారా లేక కేవలం వర్తమానంలోనే సంతోషపడ్డారా? సుఖదాత పిల్లలు సుఖమిచ్చే ఖాతాను జమ చేసుకుంటారు. కనుక కేవలం దుఃఖమివ్వలేదు కదా అని కాకుండా సుఖం ఎంత ఇచ్చాము? అని చెక్ చేసుకోండి. ఎవరు సంపర్కంలోకి వచ్చినా, వారు మాస్టర్ సుఖదాతలైన మీ ద్వారా ప్రతి అడుగులో సుఖాన్ని అనుభూతి చేయాలి. దీనినే దివ్యత లేక అలౌకికత అని అంటారు. కనుక చెకింగ్ కూడా సాధారణంగా కాకుండా లోతుగా చెక్ చేసుకోండి. ఒక్క జన్మలో 21 జన్మల ఖాతాను జమ చేసుకోవాలని ప్రతి సమయం స్మృతిలో ఉంచుకోండి. కనుక అన్ని ఖాతాలను చెక్ చేసుకోండి - తనువు ద్వారా ఎంత జమ చేసుకున్నాను? మనసా దివ్య సంకల్పాల ద్వారా ఎంత జమ చేసుకున్నాను? ధనాన్ని శ్రీమతమనుసారంగా శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించి ఎంత జమ చేసుకున్నాను? జమ ఖాతా వైపు విశేషమైన అటెన్షన్ పెట్టండి ఎందుకంటే విశేష ఆత్మలైన మీరు జమ చేసుకునేందుకు ఈ చిన్న జన్మ తప్ప పూర్తి కల్పంలో ఇంకే సమయము లేదు. ఇతర ఆత్మల లెక్క వేరే. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీకు ‘‘ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు’’. మరి ఏం చేయాలో అర్థమయిందా? ఇందులో అమాయకులుగా అవ్వకండి. పాత సంస్కారాలలో అమాయకులుగా అవ్వకండి. బాప్ దాదా రిజల్టు చూసారు. ఎన్ని విషయాల రిజల్టులో జమ ఖాతా చాలా తక్కువగా ఉంది అనేదాని విస్తారాన్ని తర్వాత వినిపిస్తాము.

స్నేహంలో అందరూ అన్నింటినీ మర్చిపోయి చేరుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లల స్నేహాన్ని చూసి ఒక ఘడియ స్నేహానికి రిటర్న్ లో అనేక ఘడియల ప్రాప్తిని ఇస్తూనే ఉంటారు. మీ అందరికీ ఇంత పెద్ద సంగఠనలోకి రావడానికి ఏమేమి పక్కా చేయించారు? మొదట పట్ రాణిగా అవ్వాలి (నేలపై పడుకోవాల్సి ఉంటుంది), నాలుగు రోజులే ఉండాలి, వచ్చి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ విని కూడా స్నేహంతో చేరుకున్నారు. ఈ మాత్రమైనా లభిస్తోంది కనుక ఇది మీ అదృష్టంగా భావించండి. జడ మూర్తుల దర్శనం కోసం వలె నిలబడి-నిలబడి రాత్రంతా గడపడం లేదు కదా. మూడు అడుగుల నేల అయితే అందరికీ లభించింది కదా. ఇక్కడ కూడా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. మున్ముందు వృద్ధి జరిగే కొద్ది స్వతహాగానే విధి కూడా పరివర్తన అవుతూ ఉంటుంది. కానీ సదా ‘ఏది లభించినా, అది చాలా బాగుంది’ అని అనుభవం చేయండి ఎందుకంటే వృద్ధి అయితే జరిగేదే ఉంది మరియు పరివర్తన కూడా తప్పకుండా జరుగుతుంది. అందరికీ ఉండడానికి, తినడానికి ప్రశాంతంగా అన్నీ లభిస్తున్నాయి కదా. తినడం మరియు నిద్రపోవటం - కావాల్సింది ఈ రెండే. మాతలకైతే చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ భోజనం రెడీగా లభిస్తుంది. అక్కడైతే వండాలి, భోగ్ పెట్టాలి, తర్వాత తినాలి. ఇక్కడ తయారైయున్న, భోగ్ పెట్టబడిన భోజనం లభిస్తుంది. కనుక మాతలకు చాలా ప్రశాంతంగా ఉంది. కుమారులకు కూడా విశ్రాంతి లభిస్తుంది ఎందుకంటే వారికున్న పెద్ద సమస్య కూడా భోజనం తయారుచేసుకోవడమే. ఇక్కడైతే రెడీగా ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తిన్నారు కదా. సదా ఇలా ఈజీగా ఉండండి. ఎవరికైతే ఈజీగా ఉండే సంస్కారముంటుందో, వారికి ప్రతి కార్యం ఈజీగా అనుభవమయ్యే కారణంగా ఈజీగా ఉంటారు. సంస్కారాలు టైట్ గా ఉంటే పరిస్థితులు కూడా టైట్ గా అయిపోతాయి, సంబంధ-సంపర్కంలోని వారు కూడా టైట్ వ్యవహారం చేస్తారు. టైట్ అనగా పెనుగులాటలో ఉండేవారు. మరి అందరు డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ హర్షితంగా ఉండేవారే కదా లేక అప్పుడప్పుడు మంచి-చెడుల ఆకర్షణలోకి వస్తున్నారా? మంచికీ, చెడుకూ - దేనికీ ఆకర్షితులవ్వకూడదు. సదా హర్షితంగా ఉండాలి. అచ్ఛా!

సదా ప్రతి అడుగులో దివ్యతను అనుభవం చేసే మరియు అనుభవం చేయించే దివ్యమూర్తులకు, సదా తమ జమ ఖాతాను పెంచుకునే జ్ఞానసంపన్న ఆత్మలకు, సదా ప్రతి సమస్యను ఈజీ స్థితి ద్వారా ఈజీగా దాటేవారికి - ఇలాంటి వివేకవంతులైన పిల్లలకు, అనేకాత్మల జీవితంలోని దాహాన్ని తీర్చే మాస్టర్ జ్ఞాన సాగరులైన శ్రేష్ఠ ఆత్మలకు జ్ఞాన సాగరుడైన బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

బొంబాయి గ్రూపు - బొంబాయి నివాసి పిల్లలు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు కదా. సదా స్వయాన్ని సంపన్న ఆత్మగా అనుభవం చేస్తారు కదా? సంపన్నత సంపూర్ణతకు గుర్తు. మీ సంపన్నత ద్వారా సంపూర్ణతను చెక్ చేసుకోగలరు ఎందుకంటే సంపూర్ణత అనగా సర్వ ఖజానాలతో నిండుగా అవ్వటము. చంద్రుడు సంపన్నంగా అయినప్పుడు సంపన్నత చంద్రుని సంపూర్ణతకు గుర్తు. అంతకన్నా ఎక్కువ పెరగటానికి ఏమీ ఉండదు. అదే సంపూర్ణత. కొద్దిగా కూడా తక్కువ ఉండదు, సంపన్నంగా ఉంటుంది. అలా మీరు కూడా జ్ఞానము, యోగము, ధారణ, సేవ - అన్నింటిలో సంపన్నులుగా ఉంటే, దానినే సంపూర్ణత అంటారు. సంపూర్ణతకు సమీపంగా ఉన్నామా లేక దూరంగా ఉన్నామా అని దీని ద్వారా తెలుసుకోగలరు! సంపన్నంగా ఉండటము అనగా సంపూర్ణతకు సమీపంగా ఉండటము. మరి అందరూ సమీపంగా ఉన్నారా? ఎంత సమీపంగా ఉన్నారు? ఎంత వరకు చేరుకున్నారు, 8 వరకా, 100 వరకా లేక 16000 వరకా? 8కి సమీపత, 100కు సమీపత, తర్వాత 16000కు సమీపత. దేనికి సమీపంగా ఉన్నారు అన్నదానిని పరిశీలించుకోవాలి. అచ్ఛా. అయినా కూడా, ప్రపంచంలోని కోట్లాది మంది కంటే మీరు చాలా చాలా భాగ్యవంతులు. వారు తపిస్తున్న వారు మరియు మీరు సంపన్న ఆత్మలు. ప్రాప్తి స్వరూప ఆత్మలు. ఈ సంతోషము ఉంది కదా. ప్రతి రోజు మీతో మీరు మాట్లాడుకోండి - మేము తప్ప ఇంకెవరు సంతోషంగా ఉండగలరు. కనుక సమీపంగా ఉన్నారు, సంపన్నంగా ఉన్నారు అన్న ఈ వరదానమును సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఇప్పుడైతే సమీపంగా కలవటము కూడా జరిగింది. ఏ విధంగా స్థూలంగా సమీపత మంచిగా అనిపిస్తుందో, అలా స్థితిలో కూడా సదా సమీపంగా అనగా సదా సంపన్నులుగా అవ్వండి. అచ్ఛా!

గుజరాత్ - పూణే గ్రూపు - అందరూ దృష్టి ద్వారా శక్తుల ప్రాప్తిని అనుభూతి చేసే అనుభవీలే కదా. వాణి ద్వారా శక్తిని అనుభూతి చేస్తారు, మురళి విన్నప్పుడు శక్తి లభించింది అని భావిస్తారు కదా, అలా దృష్టి ద్వారా శక్తుల ప్రాప్తిని అనుభూతి చేసే అభ్యాసీలుగా అయ్యారా లేక వాణి ద్వారా శక్తి అనుభవమవుతుంది కానీ దృష్టి ద్వారా శక్తి తక్కువగా అనుభవమవుతుందా? దృష్టి ద్వారా శక్తిని క్యాచ్ చేయగలరా? ఎందుకంటే ఇలా క్యాచ్ చేసే అభ్యాసీలుగా అయితే ఇతరులకు కూడా మీ దివ్య దృష్టి ద్వారా అనుభవం చేయించగలరు. ఇక మున్ముందు వాణి ద్వారా అందరికీ పరిచయాన్నిచ్చే సమయం ఉండదు. అంతేకాక పరిస్థితులు కూడా సహకరించవు, అప్పుడేమి చేస్తారు? వరదాని దృష్టి ద్వారా, మహాదాని దృష్టి ద్వారా మహాదానమును, వరదానాలను ఇస్తారు. దృష్టి ద్వారా శాంతి శక్తి, ప్రేమ శక్తి, సుఖం లేక ఆనందాల శక్తి, అన్నీ ప్రాప్తిస్తాయి. జడ మూర్తుల ఎదురుగా వెళ్ళినప్పుడు ఆ జడ మూర్తి మాట్లాడదు కదా. అయినా భక్తాత్మలకు ఏదో ఒక ప్రాప్తి కలుగుతుంది, అందుకే వెళ్తారు కదా. ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఆ మూర్తుల దివ్యతా వైబ్రేషన్ల ద్వారా మరియు దివ్య నయనాల దృష్టిని చూసి వైబ్రేషన్లను తీసుకుంటారు. ఏ దేవీ దేవతల మూర్తులైనా, విశేషమైన అటెన్షన్ తో నయనాల వైపు చూస్తారు. ముఖము వైపు అటెన్షన్ వెళ్తుంది ఎందుకంటే మస్తకం ద్వారా వైబ్రేషన్లు లభిస్తాయి, నయనాల ద్వారా దివ్యత యొక్క అనుభూతి కలుగుతుంది. అవైతే జడ మూర్తులు. కానీ ఆ జడ మూర్తులు ఎవరివి? అవి చైతన్య మూర్తులైన మీ జడ మూర్తులు. ఆ మూర్తులు మావే అనే నషా ఉందా? చైతన్యంలో ఈ సేవ చేసారు కనుక జడ మూర్తులు తయారయ్యాయి. కనుక దృష్టి ద్వారా శక్తిని తీసుకోవడం మరియు దృష్టి ద్వారా శక్తినివ్వడం, ఈ అభ్యాసం చేయండి. శాంతి శక్తి యొక్క అనుభూతి చాలా శ్రేష్ఠమైనది. వర్తమాన సమయంలో సైన్స్ శక్తి ప్రభావం ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరు అనుభవం చేస్తున్నారు కానీ సైన్స్ శక్తి దేని నుండి వెలువడింది? సైలెన్స్ శక్తి నుండే కదా! సైన్స్ శక్తి అల్పకాలికమైన ప్రాప్తిని కలిగిస్తున్నప్పుడు సైలెన్స్ శక్తి ఎంత ప్రాప్తిని కలిగిస్తుంది! కనుక బాబా యొక్క దివ్య దృష్టి ద్వారా స్వయంలో శక్తిని జమ చేసుకోండి. అప్పుడు జమ చేసుకున్న దానిని సమయానికి ఇవ్వగలరు. మీ కోసమే జమ చేసుకున్నారు, మీ కార్యంలోనే ఉపయోగించారంటే, సంపాదించారు మరియు తిన్నారని అర్థం. ఎవరైతే సంపాదించి, తినేసి సమాప్తం చేస్తారో, వారిది ఎప్పుడూ జమ అవ్వదు. ఎవరికైతే జమ ఖాతా ఉండదో, వారు సమయానికి మోసపోతారు. మోసపోతే దుఃఖం లభిస్తుంది. ఇదే విధంగా సైలెన్స్ శక్తి జమ అవ్వకపోతే, దృష్టి యొక్క మహత్వం అనుభవమవ్వకపోతే, అంతిమ సమయంలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవడంలో మోసపోతారు. తర్వాత దుఃఖం కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. కావున ఇప్పటి నుండే బాబా దృష్టి ద్వారా ప్రాప్తించిన శక్తులను అనుభవం చేస్తూ జమ చేసుకుంటూ ఉండండి. మరి జమ చేసుకోవడం వచ్చా? జమ అయిందంటే దానికి గుర్తు ఏమిటి? నషా ఉంటుంది. ఉదాహరణకు షావుకార్ల నడవడంలో, కూర్చోవడంలో, లేవడంలో నషా కనిపిస్తుంది, అంతేకాక, ఎంత నషా ఉంటుందో అంత సంతోషముంటుంది. అలాగే, ఇది ఆత్మిక నషా. ఈ నషాలో ఉండడంతో సంతోషం స్వతహాగానే ఉంటుంది. సంతోషం మీ జన్మసిద్ధ అధికారం. సదా సంతోషపు మెరుపుతో ఇతరులకు కూడా ఆత్మిక మెరుపును చూపించేవారిగా అవ్వండి - ఈ వరదానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఏం జరిగినా సంతోషపు వరదానాన్ని పోగొట్టుకోకండి. సమస్య వస్తుంది, పోతుంది కానీ సంతోషం పోకూడదు ఎందుకంటే సంతోషమనేది మన వస్తువు. సమస్య అనేది పరిస్థితి అనగా వేరే వైపు నుండి వచ్చింది. మనది అన్న వస్తువునైతే సదా తోడుగా పెట్టుకుంటారు కదా. పరాయి వస్తువైతే వస్తుంది మరియు వెళ్ళిపోతుంది కూడా. పరిస్థితి మాయది, మీది కాదు. మీ వస్తువును పోగొట్టుకోరు కనుక సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఈ శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదు. సంతోషంగా శరీరం వదిలినప్పుడు ఇంతకంటే మంచిది లభిస్తుంది. పాతది పోయి కొత్తది లభిస్తుంది. కనుక గుజరాత్ మరియు మహారాష్ట్ర వారు సదా ఈ మహానతలో ఉండండి. సంతోషంలో మహాన్ గా అవ్వండి. అచ్ఛా.

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక గ్రూపు - ఈ డ్రామాలో విశేషమైన పాత్రను అభినయించే విశేషమైన ఆత్మలము అని అనుభవం చేస్తున్నారా? ఎప్పుడైతే స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తారో, అప్పుడు అలా తయారుచేసే తండ్రి స్వతహాగా గుర్తుంటారు, స్మృతి చేయడం సహజమనిపిస్తుంది ఎందుకంటే స్మృతికి ఆధారం ‘సంబంధము’. సంబంధమున్న చోట స్మృతి చేయడం స్వతహాగానే సహజమవుతుంది. సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో ఉన్నప్పుడు ఇంకెవ్వరూ లేనే లేరు. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు - ఈ స్మృతి ద్వారా సహజయోగులుగా అయ్యారు. అప్పుడప్పుడు కష్టమనిపించడం లేదు కదా? మాయ దాడి చేసినపుడు కష్టమనిపిస్తుందా? మాయకు సదాకాలానికి వీడ్కోలు ఇచ్చేవారిగా అవ్వండి. మాయకు వీడ్కోలిచ్చినప్పుడు తండ్రి ఇచ్చే శుభాకాంక్షలు చాలా ముందుకు తీసుకువెళ్తాయి. భక్తి మార్గంలో ఎన్నోసార్లు దీవెనలివ్వండి, ఆశీర్వాదాలివ్వండి అని వేడుకున్నారు. కానీ ఇప్పుడు తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునే సహజ సాధనాన్ని తెలిపారు - మాయకు ఎంతగా వీడ్కోలు చెప్తారో, అంతగా ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తాయి. పరమాత్మ-ఆశీర్వాదాలు ఒక జన్మనే కాదు, అనేక జన్మలను శ్రేష్ఠంగా చేస్తాయి. మేము ప్రతి అడుగులో తండ్రి నుండి, బ్రాహ్మణ పరివారం నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సహజంగా ఎగురుతూ ఉండాలి అని సదా స్మృతిలో ఉంచుకోండి. మీరు డ్రామాలో విశేష ఆత్మలు, విశేషమైన కర్మలు చేసి అనేక జన్మలు విశేషమైన పాత్రను అభినయించేవారు. సాధారణ కర్మలు కాదు, విశేషమైన కర్మలు, విశేషమైన సంకల్పాలు, విశేషమైన మాటలు ఉండాలి. కనుక ఆంధ్రప్రదేశ్ వారు విశేషంగా మీ శ్రేష్ఠ కర్మల ద్వారా, మీ శ్రేష్ఠ పరివర్తన ద్వారా అనేక మంది ఆత్మలను పరివర్తన చేసే సేవ చేయండి. స్వయాన్ని దర్పణంగా చేసుకోండి, మీ దర్పణంలో తండ్రి కనిపించాలి. ఇలాంటి విశేషమైన సేవ చేయండి. నేను దివ్య దర్పణాన్ని, దర్పణమైన నా ద్వారా ఒక్క బాబాయే కనిపించాలి - అని గుర్తుంచుకోండి. అర్థమయిందా. అచ్ఛా.

Comments