10-01-1988 అవ్యక్త మురళి

10-01-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

                “మననం చేసే విధి మరియు మనన శక్తిని పెంచుకునేందుకు యుక్తులు”

ఈ రోజు రత్నాకరుడైన తండ్రి తమ అమూల్యమైన రత్నాలను కలుసుకునేందుకు వచ్చారు. ప్రతి శ్రేష్ఠ ఆత్మ ఎన్ని జ్ఞాన రత్నాలను జమ చేసుకున్నారు అనగా ఎన్ని జ్ఞాన రత్నాలను జీవితంలో ధారణ చేసారు అనేది చూస్తున్నారు. ఒక్కొక్క జ్ఞాన రత్నం పదమాల కన్నా ఎక్కువ విలువైనది. మరి ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాన రత్నాలు లభించాయో ఆలోచించండి! రత్నాకరుడైన తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరి బుద్ధి రూపీ జోలిలో లెక్కలేనన్ని రత్నాలను నింపారు. పిల్లలందరికీ ఒకేసారి ఒకే విధంగా జ్ఞాన రత్నాలను ఇచ్చారు కానీ ఈ జ్ఞాన రత్నాలను స్వయం పట్ల మరియు ఇతర ఆత్మల పట్ల ఎంతెంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతంతగా ఈ రత్నాలు పెరుగుతూ ఉంటాయి. బాప్ దాదా చూస్తున్నారు - బాబా అయితే అందరికీ సమానంగా ఇచ్చారు కానీ కొంతమంది పిల్లలు రత్నాలను పెంచుకున్నారు, కొంతమంది రత్నాలను పెంచుకోలేదు. కొందరు నిండుగా ఉన్నారు, కొందరు తరగనంత సంపన్నులుగా ఉన్నారు, కొందరు సమయమనుసారంగా కార్యంలో ఉపయోగిస్తున్నారు, కొందరు సదా కార్యంలో ఉపయోగిస్తూ ఒకటికి పదమాల రెట్లు పెంచుకుంటున్నారు, కొందరు ఎంతగా కార్యంలో ఉపయోగించాలో అంతగా ఉపయోగించలేరు, అందుకే రత్నాల విలువను ఎంతగా అర్థం చేసుకోవాలో అంతగా అర్థం చేసుకోవడం లేదు. ఎంతైతే లభించాయో, వాటిని బుద్ధిలో ధారణ అయితే చేసారు కానీ వాటిని కార్యంలో ఉపయోగించడంతో ఏదైతే సుఖం, సంతోషం, శక్తి, శాంతి మరియు నిర్విఘ్న స్థితిని ప్రాప్తి చేసుకున్న అనుభూతి పొందాలో అది పొందలేకపోతారు. దీనికి కారణమేమిటంటే, మనన శక్తి లోపించింది. ఎందుకంటే మననం చేయడమనగా జీవితంలో ఇముడ్చుకోవడం, ధారణ చేయడం, మననం చేయకపోవడం అనగా కేవలం బుద్ధి వరకు ధారణ చేయడం. మొదటి వారు జీవితంలోని ప్రతి కార్యంలో, ప్రతి కర్మలో స్వయం పట్ల గాని, ఇతర ఆత్మల పట్ల గాని ఉపయోగిస్తారు. రెండవ వారు కేవలం బుద్ధిలో గుర్తుంచుకుంటారు అనగా బుద్ధిలో ధారణ చేస్తారు.

ఉదాహరణకు ఏదైనా స్థూలమైన ఖజానాను కేవలం ఇనప్పెట్టెలో లేక లాకరులో పెట్టి సమయమనుసారంగా లేక సదా కార్యంలో ఉపయోగించకపోతే, ఆ సంతోషం ప్రాప్తించదు, కేవలం మనసులో మా వద్ద ఖజానా ఉందనే ధైర్యం ఉంటుంది. అది వృద్ధి చెందదు, దాని అనుభూతి కూడా ఉండదు. అలాగే జ్ఞాన రత్నాలను ఒకవేళ కేవలం బుద్ధిలో ధారణ చేసి, గుర్తు పెట్టుకుని, పాయింటు చాలా బాగుందని నోటి ద్వారా వర్ణిస్తే, అప్పుడు కొంత సమయానికి ఆ మంచి పాయింటు యొక్క మంచి నషా ఉంటుంది. కానీ జీవితంలోని ప్రతి కర్మలో ఆ జ్ఞాన రత్నాలను తీసుకురావాలి ఎందుకంటే జ్ఞానమంటే రత్నాలు కూడా, జ్ఞానమంటే ప్రకాశము, జ్ఞానమంటే శక్తి కూడా, అందుకే ఒకవేళ ఈ విధితో కర్మలోకి తీసుకురాలేదంటే వృద్ధి అవ్వవు మరియు అనుభూతి అవ్వదు. జ్ఞానమంటే చదువు కూడా, జ్ఞానమంటే యుద్ధంలో ఉపయోగపడే శ్రేష్ఠమైన శస్త్రం (ఆయుధం) కూడా. ఇది జ్ఞానానికి ఉన్న విలువ. విలువను తెలుసుకోవడం అంటే కార్యంలో ఉపయోగించడం మరియు ఎంతెంతగా కార్యంలో ఉపయోగిస్తారో, అంత శక్తిని అనుభవం చేస్తూ ఉంటారు. ఎలాగైతే శస్త్రాన్ని సమయమనుసారంగా ఉపయోగించకపోతే, ఆ శస్త్రం పనికిరాకుండా పోతుంది అనగా దానికి ఎంత విలువ ఉండాలో అంత ఉండదు. జ్ఞానం కూడా శస్త్రం వంటిదే. ఒకవేళ మాయాజీతులుగా అయ్యే సమయంలో శస్త్రాన్ని కార్యంలో ఉపయోగించకపోతే దాని విలువను తక్కువ చేసినట్లు ఎందుకంటే దాని లాభం తీసుకోలేదు. లాభం తీసుకోవడం అనగా విలువ ఇవ్వడం. జ్ఞాన రత్నాలు అందరి వద్ద ఉన్నాయి ఎందుకంటే మీరు అధికారులు కానీ నిండుగా ఉండడంలో నంబరువారుగా ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం - మనన శక్తి లోపించడం అని వినిపించాము.

తండ్రి ఖజానాను మన ఖజానాగా అనుభవం చేయించేందుకు ఆధారము - మనన శక్తి. ఉదాహరణకు స్థూలమైన భోజనం జీర్ణమైతే రక్తంగా మారుతుంది ఎందుకంటే భోజనం వేరుగా ఉంటుంది, దానిని ఎప్పుడైతే జీర్ణం చేసుకుంటారో అది రక్తం రూపంలో మీదిగా అవుతుంది. అలాగే మనన శక్తి ద్వారా ‘తండ్రి ఖజానాయే నా ఖజానా’ - ఇది నా అధికారం, నా ఖజానా అన్నట్లు అనుభవమవుతుంది. బాప్ దాదా ముందు నుండి వినిపిస్తూ వచ్చారు - అప్నీ ఘోట్ తో నషా చఢే (ఎంత నూరితే అంత నషా ఎక్కుతుంది) అనగా తండ్రి ఇచ్చిన ఖజానాలను మనన శక్తి ద్వారా కార్యంలో ఉపయోగించి ప్రాప్తిని అనుభవం చేస్తే నషా ఎక్కుతుంది. వినే సమయంలో నషా ఉంటుంది కానీ సదా ఎందుకు ఉండదు? దీనికి కారణమేమిటంటే సదా మనన శక్తి ద్వారా మీదిగా చేసుకోలేదు. మనన శక్తి అనగా సాగరం లోతుల్లోకి వెళ్ళి అంతర్ముఖులుగా అయి ప్రతి జ్ఞాన రత్నం యొక్క గుహ్యతలోకి వెళ్ళడం. కేవలం రిపీట్ చేయవద్దు. కానీ ప్రతి పాయింటు యొక్క రహస్యమేమిటి, ప్రతి పాయింటును ఏ సమయంలో, ఏ విధితో కార్యంలో ఉపయోగించాలి మరియు ప్రతి పాయింటును ఇతర ఆత్మల పట్ల సేవలో ఏ విధితో కార్యంలో ఉపయోగించాలి - ప్రతి పాయింటును విని ఈ నాలుగు విషయాలను మననం చేయండి. మననం చేయడంతో పాటు ప్రాక్టికల్ గా ఆ రహస్యం యొక్క మాధుర్యంలోకి వెళ్ళండి, నషా యొక్క అనుభూతిలోకి రండి. మాయ కలిగించే రకరకాల విఘ్నాల సమయంలో మరియు ప్రకృతి కలిగించే రకరకాల పరిస్థితుల సమయంలో కార్యంలో ఉపయోగించి చూడండి - ఈ పరిస్థితి లేక ఈ విఘ్నం అనుసారంగా ఏ జ్ఞాన రత్నాలనైతే - ఇవి మాయాజీతులుగా చేయగలవు లేక చేస్తాయి అని నేను మననం చేసానో అది ప్రాక్టికల్ గా జరిగిందా అనగా మాయాజీత్ గా అయ్యానా? లేదా మాయాజీతులుగా అవుతామని ఆనుకున్నారు కానీ ఆ సమయంలో శ్రమ చేయాల్సి వచ్చిందా లేక సమయం వ్యర్థంగా పోయిందా? ఇలా జిరిగితే విధి యథార్థంగా లేదు కావున సిద్ది లభించలేదని ఋజువవుతుంది. ఉపయోగించే విధానం కూడా తెలియాలి, అభ్యాసం కూడా కావాలి. సైన్సు వారు కూడా చాలా శక్తిశాలి బాంబులను తీసుకువెళ్తారు. వీటితో ఇక మేమే విజయం పొందుతామని భావిస్తారు. కానీ ఉపయోగించేవారికి ఉపయోగించే విధానం రాకపోతే, అది శక్తిశాలి బాంబు అయినా సరే, అక్కడ-ఇక్కడ పడి వ్యర్థమైపోతుంది. కారణమేమిటి? ఉపయోగించే విధానం సరిగ్గా లేదు. అలాగే ఒక్కొక్క జ్ఞాన రత్నం అతి అమూల్యమైనది. జ్ఞాన రత్నాలు లేక జ్ఞాన శక్తి ముందు పరిస్థితులు లేక విఘ్నాలు నిలబడలేవు. కానీ ఒకవేళ విజయం లభించలేదంటే, ఉపయోగించే విధానం రాదని అర్థం చేసుకోండి. రెండవ విషయము - మనన శక్తిని సదా అభ్యాసం చేయకపోతే, ఆ సమయానికి అభ్యాసం లేకుండానే అకస్మాత్తుగా కార్యంలో ఉపయోగించే ప్రయత్నం చేస్తారు, అందుకే మోసపోతారు. జ్ఞానమైతే ఎలాగూ బుద్ధిలో ఉంది, సమయానికి కార్యంలో ఉపయోగిస్తాములే అనే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, కానీ సదా యొక్క అభ్యాసము, చాలా కాలపు అభ్యాసము కావాలి. లేకుంటే ఆ సమయంలో ఆలోచించేవారికి ఏ టైటిల్ ఇస్తారు? కుంభకర్ణ. అతను ఏ నిర్లక్ష్యాన్ని చూపించాడు? రానీలే, వచ్చినప్పుడు గెలుస్తానులే అని ఆలోచించాడు. కనుక సమయానికి అయిపోతుందిలే అని ఆలోచిస్తే ఈ నిర్లక్ష్యం మోసం చేస్తుంది. అందుకే, ప్రతి రోజు మనన శక్తిని పెంచుకుంటూ వెళ్ళండి.

మనన శక్తిని పెంచుకునేందుకు, రివైజ్ కోర్సు మురళి లేక అవ్యక్త మురళి ఏదైతే ప్రతి రోజు వింటారో, దాని నుండి ప్రతి రోజు ఏదైనా ఒక విశేషమైన పాయింటును బుద్ధిలో ధారణ చేయండి మరియు ఏ నాలుగు విషయాలనైతే వినిపించామో ఆ విధితో అభ్యాసం చేయండి. నడుస్తూ-తిరుగుతూ, ప్రతి కర్మ చేస్తూ - స్థూలమైన కర్మ చేస్తున్నా, సేవా కార్యం చేస్తున్నా, మొత్తం రోజంతా మననం నడుస్తూ ఉండాలి. వ్యాపారం చేస్తున్నా, ఆఫీసు పని చేస్తున్నా, సేవాకేంద్రంలో సేవ చేస్తున్నా, ఏ సమయంలోనైనా బుద్ధి కొంచెం ఫ్రీగా ఉన్నా మీ మనన శక్తి అభ్యాసాన్ని పదేపదే పరుగెత్తించండి. చాలా పనులు ఎలా ఉంటాయంటే, ఏ కర్మనైతే చేస్తున్నారో దానితో పాటు వేరే విషయాలు కూడా ఆలోచించవచ్చు. బుద్ధి యొక్క ఫుల్ అటెన్షన్ ఇవ్వాల్సిన పనులు చాలా కొద్ది సమయమే ఉంటాయి. అలాంటి పనులు లేనప్పుడు బుద్ధి రెండు వైపులా నడుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాన్ని ఒకవేళ మీరు మీ దినచర్యలో నోట్ చేసుకుంటే, మధ్య మధ్యలో చాలా సమయం లభిస్తుంది. మనన శక్తి కోసం విశేషంగా సమయం లభిస్తే అప్పుడు అభ్యాసం చేస్తాములే అనే మాటేమీ లేదు. నడుస్తూ-తిరుగుతూ కూడా చేయవచ్చు. ఒకవేళ ఏకాంత సమయం లభిస్తే చాలా మంచిది. ఇంకా లోతుగా ప్రతి పాయింటు యొక్క స్పష్టీకరణలోకి వెళ్ళండి, ఆ పాయింటును విస్తారంలోకి తీసుకొస్తే చాలా మజా వస్తుంది. కానీ ముందు ఆ పాయింటు యొక్క నషాలో స్థితులై చెయ్యండి, అప్పుడు బోర్ అనిపించదు. లేదంటే కేవలం రిపీట్ చేసి, మననం చేయడం అయిపోయింది, ఇప్పుడేమి చేయాలి అని అంటారు.

స్వదర్శన చక్రం తిప్పడం గురించి చాలామంది నవ్విస్తారు కదా - 5 నిమిషాలలో చక్రం తిప్పడం పూర్తి అయిపోతుంది, ఇంకేమి తిప్పాలి అని అంటారు. స్థితిని అనుభవం చేయడం రాదు కనుక కేవలం రిపీట్ చేస్తారు - సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇన్ని జన్మలు, ఇంత ఆయుష్షు, ఇంత సమయం..... అంతే పూర్తి అయిపోయింది. కానీ స్వదర్శన చక్రధారులుగా అవ్వడమనగా జ్ఞాన సంపన్న, శక్తి సంపన్న స్థితిని అనుభవం చేయడం. పాయింటు యొక్క నషాలో స్థితులవ్వడం, ఆ రహస్యంలో రాజయుక్తులుగా అవ్వడం - ప్రతి పాయింటుకు ఇలాంటి అభ్యాసం చేయండి. ఇలా కేవలం స్వదర్శన చక్రం గురించి వినిపించాము, ఈ విధంగా ప్రతి జ్ఞానం పాయింటును మననం చేయండి మరియు మధ్యమధ్యలో అభ్యాసం చేయండి. కేవలం ఒక అర్ధగంట మననం చేయడమని కాదు. సమయం లభిస్తూనే బుద్ధి మననం చేసే అభ్యాసంలోకి వెళ్ళిపోవాలి. మనన శక్తితో బుద్ధి బిజీగా ఉంటే స్వతహాగా మరియు సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. బిజీగా ఉండడం చూసి మాయ దానంతటదే పక్కకు వెళ్ళిపోతుంది. మాయ రావడం, యుద్ధం చేయడం, దాన్ని తరిమేయడం, ఒక్కో సారి ఓడిపోవడం, ఒక్కో సారి గెలవడం - ఇది చీమ మార్గం యొక్క పురుషార్థం. ఇప్పుడిది తీవ్ర పురుషార్థం చేసే సమయం, ఎగిరే సమయం, అందుకే మనన శక్తితో బుద్ధిని బిజీగా పెట్టుకోండి. ఈ మనన శక్తితో స్మృతి శక్తిలో నిమగ్నమై ఉండే అనుభవం సహజమవుతుంది. మననం, మాయాజీతులుగా చేస్తుంది మరియు వ్యర్థ సంకల్పాల నుండి కూడా ముక్తులుగా చేస్తుంది. ఎక్కడైతే వ్యర్థం ఉండదో మరియు విఘ్నాలు ఉండవో, అక్కడ సమర్థ స్థితి మరియు లగనము (ప్రేమ)లో నిమగ్నమై ఉండే స్థితి స్వతహాగానే ఉంటుంది.

చాలామంది - బీజరూప స్థితి లేక శక్తిశాలి స్మృతితో కూడిన స్థితి తక్కువగా ఉంటుంది లేదా చాలా అటెన్షన్ ఇచ్చిన తర్వాత అనుభవమవుతుందని అనుకుంటారు. దీనికి కారణం క్రితం సారి కూడా వినిపించాము - లీకేజ్ ఉంది, బుద్ధి యొక్క శక్తి వ్యర్థం వైపు వెళ్ళిపోతుంది. ఒక్కో సారి వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, ఒక్కో సారి సాధారణ సంకల్పాలు నడుస్తాయి. ఏ పనైతే చేస్తున్నారో, దాని గురించిన సంకల్పాలలో బుద్ధి బిజీగా ఉండడాన్ని సాధారణ సంకల్పాలని అంటారు. స్మృతి శక్తి లేక మనన శక్తి ఏదైతే ఉండాలో, అది ఉండదు. అంతేకాక, ఈ రోజు ఏ పాప కర్మ జరగలేదు, వ్యర్థం నడవలేదు, ఎవరికీ దుఃఖమివ్వలేదు అని స్వయాన్ని సంతోషపరచుకుంటారు. కానీ సమర్థ సంకల్పాలు, సమర్థ స్థితి, శక్తిశాలి స్మృతి ఉన్నదా? ఒకవేళ ఇవి లేవంటే, వాటిని సాధారణ సంకల్పాలని అంటారు. కర్మ చేసారు కానీ కర్మ మరియు యోగం కలిపి లేవు. కర్మకర్తలుగా (కర్మ చేసేవారిగా) అయ్యారు కానీ కర్మయోగులుగా అవ్వలేదు. కర్మ చేస్తున్నప్పుడు మనన శక్తి లేక మగ్న స్థితి యొక్క శక్తి - రెండిటిలో ఏదో ఒక అనుభూతి సదా ఉండాలి. ఈ రెండు స్థితులు శక్తిశాలి సేవ చేయించేందుకు ఆధారము. మననం చేసేవారు అభ్యాసమున్న కారణంగా ఏ సమయంలో ఏ స్థితి కావాలంటే ఆ స్థితిని తయారుచేసుకోగలరు. లింకు ఉన్నందుకు లీకేజ్ సమాప్తమవుతుంది మరియు ఏ సమయంలో ఏ అనుభూతి కావాలంటే - బీజరూప స్థితి గాని, ఫరిశ్తా రూపం గాని, ఆ అనుభూతిని సహజంగా చేయగలరు ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానము స్మృతిలో ఉంటుందో, అప్పుడు జ్ఞాన స్మరణతో జ్ఞాన దాత స్వతహాగా గుర్తుంటారు. మరి మననం ఎలా చేయాలో అర్థమయిందా? మననం గురించి తర్వాత వినిపిస్తామని చెప్పాను కదా కనుక ఈ రోజు మననం చేసే విధిని వినిపించాను. మాయ విఘ్నాలపై సదా విజయులుగా అయ్యేందుకు మరియు సేవలో సదా సఫలతను అనుభవం చేసేందుకు ఆధారం - మనన శక్తి. అర్థమయిందా? అచ్ఛా.

జ్ఞాన సాగరుని జ్ఞాన యుక్త ఆత్మలైన పిల్లలందరికీ, సదా మనన శక్తి ద్వారా సహజంగా మాయాజీతులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సదా మనన శక్తి అభ్యాసాన్ని పెంచుకునేవారు, మననం ద్వారా మగ్న స్థితిని అనుభవం చేసేవారు, సదా జ్ఞాన రత్నాల విలువను తెలుసుకునేవారు, సదా ప్రతి కర్మలో జ్ఞాన శక్తిని కార్యంలో తీసుకొచ్చేవారు - ఇలాంటి సదా శ్రేష్ఠ స్థితిలో ఉండే విశేషమైన, అమూల్యమైన రత్నాలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక - స్వయాన్ని తీవ్ర పురుషార్థీ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే సమయం చాలా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తుంది. సమయం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సమయానికి గమ్యం చేరుకోవాల్సిన వారు ఏ వేగంతో వెళ్ళాల్సి ఉంటుంది? సమయం తక్కువగా ఉంది, ప్రాప్తి ఎక్కువగా చేసుకోవాలి. ఒకవేళ కొద్ది సమయంలో ఎక్కువ ప్రాప్తి చేసుకోవాలంటే వేగంగా చేయాల్సి ఉంటుంది కదా. సమయాన్ని చూస్తున్నారు మరియు మీ పురుషార్థ వేగం గురించి కూడా తెలుసు. ఒకవేళ సమయం తీక్షణంగా ఉంది కానీ మీ వేగం తీక్షణంగా లేదంటే, అప్పుడు సమయం అనగా మీ రచన, రచయితలైన మీ కన్నా తీక్షణంగా ఉన్నట్లు. రచయిత కన్నా రచన తీక్షణంగా వెళ్తే బాగుంటుందా? రచన కన్నా రచయిత ముందు ఉండాలి. ఇది సదా తీవ్ర పురుషార్థీ ఆత్మలుగా అయి ముందుకు వెళ్ళే సమయం. ఒకవేళ ముందుకు వెళ్తూ ఏవైనా సైడ్ సీన్లు (పక్క దృశ్యాలు) ను చూసి ఆగిపోతే, అలా ఆగిపోయేవారు సరైన సమయానికి చేరుకోలేరు. మాయా ఆకర్షణలే సైడ్ సీన్లు. సైడ్ సీన్లు చూస్తూ ఆగిపోయేవారు గమ్యానికి ఎలా చేరుకుంటారు? అందుకే, సదా తీవ్ర పురుషార్థులుగా అయి ముందుకు వెళ్తూ ఉండండి. సమయానికి ఎలాగూ చేరుకుంటాములే, ఇప్పుడింకా సమయం ఉందిలే అని అనుకోవద్దు. ఇలా ఆలోచించి ఒకవేళ నెమ్మదిగా వెళ్తే సమయానికి మోసపోతారు. చాలా కాలపు తీవ్ర పురుషార్థం చేసే సంస్కారం, చివర్లో కూడా తీవ్ర పురుషార్థాన్ని అనుభవం చేయిస్తుంది. కనుక సదా తీవ్ర పురుషార్థులుగా ఉండాలి. ఒకసారి తీవ్రంగా, ఒకసారి బలహీనంగా ఉండకూడదు. కొద్దిగా ఏదైనా జరిగితే బలహీనమవ్వడం కాదు. వీరిని తీవ్ర పురుషార్థులని అనరు. తీవ్ర పురుషార్థులు ఎప్పుడూ ఆగిపోరు, ఎగురుతారు. కనుక ఎగిరే పక్షులుగా అయి ఎగిరే కళను అనుభవం చేస్తూ వెళ్ళండి. ఇతరులకు కూడా సహయోగమిస్తూ తీవ్ర పురుషార్థులుగా తయారుచేస్తూ వెళ్ళండి. ఎంతగా ఇతరుల సేవ చేస్తారో, అంతగా స్వయం యొక్క ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి.

వీడ్కోలు సమయంలో - (జానకి దాది విదేశాలకు వెళ్ళేందుకు బాప్ దాదా వద్ద సెలవు తీసుకుంటున్నారు) - దేశ విదేశాలలో సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. ఎక్కడైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అక్కడ సఫలత కూడా ఉంటుంది. ముందు స్వయంలో ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలి, సంగఠన శక్తి ఉండాలి అని సదా ఈ అటెన్షన్ పెట్టుకోవాలి. స్నేహ శక్తి మరియు సహయోగ శక్తి ఉంటే, వాటి అనుసారంగానే సఫలత ఉంటుంది. ఇవి ధరణి వంటివి. ధరణి బాగుంటే ఫలాలు కూడా అలాంటివే వెలువడతాయి మరియు ఒకవేళ టెంపరరీ (తాత్కాలికం) గా భూమిని బాగు చేసి బీజాలు వేస్తే ఫలాలు కూడా కొద్ది సమయానికే లభిస్తాయి, సదాకాలానికి లభించవు. కనుక సఫలత అనే ఫలానికి ముందు సదా ధరణిని చెక్ చేయండి. ఇకపోతే, ఏదైతే చేస్తున్నారో దానికి జమ అయితే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు కూడా సంతోషం లభిస్తుంది మరియు భవిష్యత్తులో ఎలాగూ ఉంటుంది. అచ్ఛా.

Comments