03-12-1987 అవ్యక్త మురళి

03-12-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

క్రొత్త సంవత్సరం - బాబా సమానంగా అయ్యే సంవత్సరం.
 
సదా దిల్‌కుష్ మిఠాయి (మనస్సుని సంతోషం చేసే మిఠాయి) తినిపించే బాప్ దాదా ఫరిస్తాగా అయ్యే పురుషార్ధం చేసే పిల్లలతో మాట్లాడుతున్నారు-- 

ఈ రోజు త్రిమూర్తి తండ్రి మూడు సంగమాలను చూస్తున్నారు. 1. బాబా మరియు పిల్లల యొక్క సంగమం 2. ఈ యుగమే సంగమయుగం. 3. ఈ సంవత్సరం యొక్క సంగమం. మూడు సంగమాలకు విశేషత ఉంది. ప్రతి సంగమం పరివర్తనకు ప్రేరణ ఇచ్చేది. సంగమయుగం విశ్వ పరివర్తనకు ప్రేరణ ఇస్తుంది. బాబా మరియు పిల్లల యొక్క సంగమం సర్వ శ్రేష్ట భాగ్యాన్ని మరియు సర్వశ్రేష్ఠ ప్రాప్తులను అనుభూతి చేయించేది. అలాగే సంవత్సరం యొక్క సంగమం నవీనతకు ప్రేరణ ఇచ్చేది. మూడు సంగమాలు చాలా గొప్పవి. ఈ రోజు దేశ విదేశీ పిల్లలందరూ విశేషంగా పాతప్రపంచం యొక్క క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా సాకారరూపధారి మరియు ఆకారీరూపధారి అయ్యి బుద్ధి యొక్క విమానం ద్వారా చేరుకున్న పిల్లలను చూస్తున్నారు, మరియు క్రొత్త సంవత్సరం జరుపుకునే వజ్రతుల్యమైన శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. డబల్ హీరోలు అయ్యారు కదా! 1. బాబా యొక్క అమూల్య రత్నాలు, వజ్రతుల్యమైన హీరోలు. 2. హీరో పాత్ర అభినయించే హీరోలు. అందువలననే బాప్ దాదా ప్రతి సెకను, ప్రతి సంకల్పం, ప్రతి జన్మ యొక్క అవినాశి శుభాకాంక్షలు ఇస్తున్నారు. శ్రేష్టాత్మలైన మీకు కేవలం ఈరోజే శుభాకాంక్షలు ఇచ్చుకునే రోజు కాదు కానీ ప్రతీ సమయం శ్రేష్ట భాగ్యం, శ్రేష్ట ప్రాప్తి లభిస్తున్న కారణంగా ప్రతి సమయం మీరు బాబాకి శుభా కాంక్షలు చెప్తున్నారు మరియు బాబా పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తూ ఎగిరే కళలోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రొత్త సంవత్సరంలో ఇదే విశేష నవీనత జీవితంలో అనుభవం చేసుకుంటూ ఉండండి-ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో బాబాకి శుభాకాంక్షలు ఇస్తున్నారు, కానీ పరస్పరం సంబంధ,సంపర్కంలోకి బ్రాహ్మణ ఆత్మ వచ్చినా లేదా ఆజ్ఞానీ ఆత్మ వచ్చినా కానీ బాబా సమానంగా ప్రతీ సమయం ప్రతీ ఆత్మ పట్ల మనస్సు ద్వారా సంతోషం యొక్క శుభాకాంక్షలు లేదా అభినందనలు రావాలి. ఎవరు ఏవిధంగా ఉన్నా కాని మీ సంతోషం యొక్క శుభాకాంక్షలు వారికి కూడా సంతోషం యొక్క ప్రాప్తిని అనుభవం చేయించాలి. అభినందనలు ఇవ్వడమే సంతోషాన్ని ఇచ్చి, పుచ్చుకోవటం. ఎవరికైనా ఎవరైనా సంతోష సమయంలోనే శుభాకాంక్షలు ఇస్తారు, దు:ఖ సమయంలో శుభాకాంక్షలు ఇవ్వరు. ప్రతి ఆత్మను చూసి సంతోషించడం లేదా సంతోషం ఇవ్వడం ఇవే మనస్సు యొక్క శుభాకాంక్షలు లేదా అభినందనలు. భలే ఇతరాత్మ ఏవిధంగా వ్యవహరించినా కానీ బాప్ దాదా నుండి ప్రతి సమయం శుభాకాంక్షలు తీసుకునే మీరు సదా ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వండి. వారు ముళ్ళు ఇచ్చినా కానీ మీరు ఆత్మిక గులాబి ఇవ్వండి. వారు దు:ఖం ఇచ్చినా కానీ సుఖదాత పిల్లలైన మీరు సుఖాన్ని ఇవ్వండి. ఆజ్ఞానికి అజ్ఞాని అవ్వకండి. సంస్కార, స్వభావాలకు వశమైన ఆత్మలకు మీరు వశీభూతులు కావద్దు. 

శ్రేష్ట ఆత్మలైన మీ యొక్క ప్రతీ సంకల్పంలో సర్వులకళ్యాణం యొక్క శ్రేష్ట పరివర్తన యొక్క వశీభూతుల నుండి స్వతంత్రంగా తయారు చేసే మనస్సు యొక్క ఆశీర్వాదాలు, లేదా సంతోషం యొక్క శుభాకాంక్షలు సదా స్వతహాగా కనిపించాలి. ఎందుకంటే మీరందరూ దాత అంటూ దేవత అంటే ఇచ్చేవారు. కనుక ఈ క్రొత్త సంవత్సరంలో విశేషంగా సంతోషం యొక్క శుభాకాంక్షలు ఇస్తూ ఉండండి, కేవలం ఈ రోజు లేక రేపు నడుస్తూ , తిరుగుతూ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు అని చెప్పుకొని క్రొత్త సంవత్సరం ప్రారంభించటం కాదు. భలే, చెప్పుకోవాలి కానీ మనస్సుతో చెప్పాలి. కానీ సంవత్సరమంతా చెప్పాలి, కేవలం ఈ రెండు రోజులు కాదు. ఒకవేళ ఏ ఆత్మకైనా మనస్సుతో శుభాకాంక్షలు చెప్తే ఆ ఆత్మ మనస్సు యొక్క శుభాకాంక్షలు తీసుకుని సంతోషం అయిపోవాలి. ప్రతి సమయం దిల్‌ కుష్ మిఠాయి పంచిపెడుతూ ఉండాలి. కేవలం ఒక రోజు మిఠాయి తినటం లేదా తినిపించటం కాదు. ఈరోజు నోటితో తినే మిఠాయిలు ఎన్ని కావాలంటే అన్ని తినండి, అందరికీ పెట్టండి కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికీ మనస్సుతో దిల్‌కుష్ మిఠాయి తినిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది! ఆ స్థూల మిఠాయిలు తినడానికి బయపడతారు. కానీ ఈ దిల్‌ కుష్ మిఠాయిలు ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు మరియు తినిపించవచ్చు. వీటి ద్వారా ఎటువంటి అనారోగ్యం రాదు.ఎందుకంటే బాప్ దాదా పిల్లలను సమానంగా తయారుచేస్తున్నారు. కనుక విశేషంగా ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే విశేషత విశ్వం ముందు మరియు బ్రాహ్మణ పరివారం ముందు చూపించండి. ప్రతి ఒక్క ఆత్మ " బాబా ” అంటూ మధురత మరియు సంతోషాన్ని అనుభవం చేసుకుంటుంది. " ఓహో బాబా ” అనగానే నోరు మధురంగా అవుతుంది. ఎందుకంటే ప్రాప్తి లభిస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ మరొక బ్రాహ్మణాత్మ పేరు వినగానే సంతోషం అయిపోవాలి. ఎందుకంటే బాబా సమానంగా మీరందరూ కూడా బాబా ద్వారా లభించిన విశేషతల ద్వారా పరస్పరం ఇచ్చి, పుచ్చుకోవటం చేస్తున్నారు, పరస్పరం ఒకరికొకరు సహయోగిగా, తోడుగా అయ్యి ఉన్నతిని పొందుతున్నారు. భలే ఎవరినైనా కార్యానికి తోడుగా చేసుకోండి కానీ జీవితానికి తోడుగా మాత్రం చేసుకోకండి. ప్రతి ఒక్క ఆత్మ తమ విశేషతల ద్వారా పరస్పరం సంతోషం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు మరియు ఇక ముందు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. ఎలా అయితే బాబాని స్మృతి చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ మరొక బ్రాహ్మణాత్మను జ్ఞాపకం చేసినప్పుడు ఆత్మిక సంతోషాన్ని అనుభవం చేసుకోవాలి, హద్దు యొక్క సంతోషం కాదు. బాబా యొక్క సర్వప్రాప్తులకు సాకారనిమిత్త రూపంగా అనుభవం చేసుకోవాలి. దీనినే ప్రతి సంకల్పంలో మరియు ప్రతి సమయం ఒకరికొకరు శుభాకాంక్షలు ఇచ్చుకోవటం అంటారు. అందరి లక్ష్యం ఒక్కటే, బాబా సమానంగా అవ్వాలి అని. ఎందుకంటే సమానంగా అవ్వకుండా బాబా వెంట స్వీట్ హోమ్ కి (మధురమైన ఇంటికి) వెళ్ళలేరు మరియు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యంలోకి రాలేరు. ఎవరైతే బాప్ దాదా వెంట ఇంటికి వెళ్తారో వారే బ్రహ్మాబాబాతో పాటు రాజ్యంలోకి వస్తారు. పై నుండి క్రిందకి వస్తారు కదా! కేవలం వెంట వెళ్ళడమే కాదు, వెంట వస్తారు కూడా. బ్రహ్మాబాబాతోనే పూజ్యులుగా కూడా అవుతారు మరియు పూజారులుగా కూడా బ్రహ్మాబాబాతోనే అవుతారు. అంటే చాలా జన్మలు తోడుగా ఉంటారు కానీ దానికి ఆధారం ఈ సమయంలో సమానంగా అయ్యి వెంట వెళ్ళాలి. 

ఈ సంవత్సరం యొక్క విశేషత చూడండి - నెంబర్ కూడా 88. 8కి ఎంత మహిమ ఉంది! ఒకవేళ మీ పూజ్యరూపాన్ని చూసినా కానీ అష్టభుజధారి, అష్టశక్తులు వీటికే స్మృతిచిహ్నాలు ఉన్నాయి. అష్టరత్నాలు, అష్టరాజధానులు ఇలా 8కి రకరకాల రూపాల ద్వారా మహిమ ఉంది. అందువలన ఈ సంవత్సరాన్ని విశేషంగా బాబా సమానంగా అయ్యే దృఢసంకల్పం యొక్క సంవత్సరంగా జరుపుకోండి. ఏ కర్మ చేసినా బాబా సమానంగా చేయండి. ఏ సంకల్పం చేసినా, మాటలు మాట్లాడినా, సంబంధ, సంపర్కంలోకి వచ్చినా కానీ బాబా సమానంగా ఉండండి. బ్రహ్మాబాబా సమానంగా అవ్వటం అయితే సహజం కదా! ఎందుకంటే సాకారంగా ఉన్నారు. బ్రహ్మాబాబా 84 జన్మలు తీసుకున్న ఆత్మ. పూజ్యులుగా అవ్వటంలో మరియు పూజారీగా అవ్వటంలో అన్నింటిలో అనుభవీ ఆత్మ. బ్రహ్మాబాబా పాత ప్రపంచం యొక్క పాత సంస్కారాల యొక్క పాత కర్మలఖాతా యొక్క సంఘటనలో నడవటం మరియు నడిపించటం - అన్ని విషయాలలో అనుభవి. అనుభవీని అనుసరించడం కష్టం అనిపించదు. మరియు బాబా కూడా చెప్తున్నారు - బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేయండి అని. క్రొత్త మార్గమేమీ కనిపెట్టకండి. ప్రతి అడుగుపై అడుగు వేయాలి. బ్రహ్మాబాబాని కాపీ చేయండి. ఈ తెలివైతే ఉంది కదా! ఎందుకంటే బాబా మరియు దాదా ఇద్దరూ మిమ్మల్ని వెంట తీసుకువెళ్ళడానికి ఆగారు. నిరాకారి బాబా పరంధామనివాసియే కానీ సంగమయుగంలో సాకారపాత్ర అభినయించాల్సి వస్తుంది కదా! అందువలనే ఈ కల్పంలో మీ పాత్ర పూర్తి అయిపోయిన తర్వాత బాప్ దాదాల ఇద్దరి పాత్ర కూడా పూర్తయిపోతుంది. మరలా కల్పం పునరావృత్తం అవుతుంది. అందువలనే నిరాకారి బాబా కూడా పిల్లలైన మీ పాత్రతో బంధీ అయ్యి ఉన్నారు. ఇది శుద్ద బంధన కానీ పాత్ర యొక్క బంధన అయితే ఉంది కదా! కానీ ఇది స్నేహబంధన, సేవాబంధన ... కానీ మధురమైన బంధన. కర్మభోగంతో కూడిన బంధన కాదు. 

ఈ క్రొత్త సంవత్సరం సదా శుభాకాంక్షల సంవత్సరం, సదా బాబా సమానంగా అయ్యే సంవత్సరం, బ్రహ్మాబాబాని అనుసరించే సంవత్సరం, బాబాతో పాటు శాంతిధామంలో మరియు రాజధానిలో వెంట ఉండే వరదానం పొందే సంవత్సరం. ఎందుకంటే ఇప్పటి నుండి సదా వెంట ఉంటున్నారు. ఇప్పుడు తోడుగా ఉండటం అంటే సదా వెంట ఉండే వరదానం పొందటం. లేకపోతే పెళ్ళికొడుకు యొక్క సమీప సంబధీకులకు బదులు దూర సంబంధీకులుగా అవుతారు. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు కలుసుకునే వారు కాదు కదా? మొదటి జన్మలో మొదటి రాజ్యసుఖం మరియు మొదటి నెంబర్ యొక్క రాజ్యాధికారి, విశ్వమహారాజు, విశ్వమహారాణి యొక్క ఉన్నతమైన కుటంబీకుల మెరుపు అతీతంగా ఉంటుంది. రెండవ నెంబర్ విశ్వ మహారాజు, మహారాణీ యొక్క ఉన్నతమైన కుటుంబంలోకి వచ్చినా కానీ మొదటి స్థితికి మరియు రెండవస్థితికి చాలా తేడా ఉంటుంది. ఒక జన్మకి కూడా తేడా ఉంటుంది. దీనిని కూడా తోడు అనరు. ఏదైనా వస్తువుని ఒకసారి ఉపయోగించినా కానీ వాడిన వస్తువు అనే అంటారు కదా! క్రొత్తది అని అయితే అనరు కదా! వెంట వెళ్ళాలి, వెంట రావాలి, వెనువెంట మొదటి జన్మ యొక్క రాజ్యభాగ్యం యొక్క ఉన్నతకుటుంబీకులుగా అవ్వాలి. దీనినే సమానంగా అవ్వటం అంటారు. కనుక ఏమి చేయాలి? సమానంగా అవ్వాలా లేదా పెళ్ళికొడుకు యొక్క సంబంధీకులుగా అవ్వాలా? బాప్ దాదా అజ్ఞాని మరియు జ్ఞానీ ఆత్మలలో ఒక తేడాను చూస్తున్నారు. అది కూడా ఒక దృశ్యం రూపంలో చూస్తున్నారు. బాబా పిల్లలు ఎలా ఉన్నారు మరియు అజ్ఞానీ ఆత్మలు ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో వికారీ ఆత్మలు ఏవిధంగా అయిపోయారు? ఈరోజుల్లో ఫ్యాకల్టీలలో లేదా ఎక్కడైనా మంట మండుతూ ఉంటే ఆ పొగ పోవడానికి పొగ గొట్టం తయారు చేస్తారు కదా! దాని ద్వారా పొగ బయటికి వచ్చేస్తూ ఉంటుంది మరియు సదా ఖాళీ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజుల్లో మానవులు వికారీ అయిపోయారు. కనుక, ఏదోక వికారానికి వశమై సంకల్పం ద్వారా, మాట ద్వారా ఈర్ష్య, అసూయ లేదా ఏదోక వికారీగుణం యొక్క పొగను వదులుతున్నారు. కళ్ళ నుండి కూడా వికారాల యొక్క పొగ వస్తూ ఉంటుంది మరియు జ్ఞానీ పిల్లల యొక్క ప్రతి మాట ద్వారా లేదా సంకల్పం ద్వారా, ఫరిస్తాస్థితి ద్వారా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. వారిది వికారాల అగ్ని యొక్క పొగ మరియు జ్ఞానీ ఆత్మల ఫరిస్తారూపం ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడూ కూడా సంకల్పంలో అయినా వికారానికి వశం అయ్యి, వికారాల పొగను వ్యాపింపచేయకూడదు. సదా ఆశీర్వాదాలు రావాలి. కనుక పరిశీలించుకోండి, ఆశీర్వాదాలకి బదులు పొగ రావటం లేదు కదా? అని. ఫరిస్తాయే ఆశీర్వాదాల స్వరూపం. ఎప్పుడైనా ఆవిధమైన సంకల్పం లేదా మాట వస్తే ఈ దృశ్యం ఎదురుగా తెచ్చుకోండి - నేను ఏవిధంగా అయిపోయాను, ఫరిస్తా స్వరూపం నుండి మారిపోలేదు కదా? వ్యర్దసంకల్పాలు కూడా పొగ, వికారలనేవి మండుతున్న అగ్ని యొక్క పొగలు. వ్యర్ధసంకల్పాలనేవి సగం మండుతున్న అగ్ని యొక్క పొగలు. పూర్తి మంట లేకపోయినా కానీ పొగ వస్తుంది కదా! ఫరిస్తా రూపం ద్వారా సదా ఆశీర్వాదాలు వస్తూ ఉండాలి. వీరినే మాస్టర్ దయాసాగరుడు, మాస్టర్ కృపాసాగరులు అంటారు. ఇప్పుడు ఈ పాత్ర అభినయించండి. మీపై మీరు దయ చూపించుకోండి మరియు ఇతరులపై దయ చూపించండి. ఏది చూసినా, ఏది విన్నా - వర్ణన చేయకండి, ఆలోచించకండి. వ్యర్ధం చూడకుండా, ఆలోచించకుండా ఉండటమే మీపై మీరు దయ చూపించుకోవటం. మరియు ఎవరైతే వ్యర్ధం చేసారో మరియు చెప్పారో వారిపైన కూడా దయ పెట్టుకోండి, కృప పెట్టుకోండి అంటే వ్యర్ధం విన్నారు. లేదా చూసారో వారిపై కూడా శుభ భావన, శుభకామన యొక్క దయ చూపించండి. చేతితో వరదానం ఇవ్వక్కర్లేదు కానీ వాటిని మనస్సులో ఉంచుకోకూడదు, ఇదే ఆ ఆత్మ పట్ల దయ చూపించటం. ఒకవేళ ఏవైనా వ్యర్థవిషయాలు చూస్తున్నారు, వింటున్నారు లేదా వర్ణన చేస్తున్నారు అంటే వ్యర్ధబీజం యొక్క వృక్షాన్ని పెంచుతున్నారు. వాయుమండలంలో వ్యాపింపచేస్తున్నారు ఇదే వృక్షంగా అవుతుంది. ఎందుకంటే ఏదైనా చెడు విషయాలు వింటే, చూస్తే అది వారి ఒక్కరి మనస్సులోనే పెట్టుకోరు ఇతరులకి తప్పకుండా వినిపిస్తారు, వర్ణన చేస్తారు. ఒకరి నుండి ఒకరికి చేరటం ద్వారా ఏమౌతుంది? ఒకరి ద్వారా అనేకమందికి వ్యాపిస్తుంది. మరియు ఎప్పుడైతే ఇలా ఒకరి నుండి మరొకరికి, ఇలా వ్యాపించడం ద్వారా మాల తయారవుతుంది మరియు ఎవరైతే చేసారో వారు ఆ వ్యర్థాన్ని స్పష్టం చేయడానికి మొండితనంలోకి వచ్చేస్తారు. అంటే ఇలా చేయటం ఆ్వరా వాతావరణంలో ఏమి వ్యాపింపచేస్తారు? వ్యర్థం అనే పొగ వ్యాపింపచేసారు కదా! ఇవి ఆశీర్వాదాలు అయ్యాయా లేక పొగ అయ్యిందా? అందువలన వ్యర్థం చూస్తూ, వింటూ స్నేహం ద్వారా శుభభావన ద్వారా మార్చుకోండి. విస్తారం చేయకండి. దీనినే ఇతరులపై దయ చూపించడం, కృప చూపించడం, అంటే ఆశీర్వాదాలు ఇవ్వడం అంటారు. సమానంగా అయ్యి వెంట వెళ్ళేటందుకు మరియు వెంట ఉండడానికి తయారవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఉండటమే మంచిది అని అనుకోవటంలేదు కదా? వెంట వెళ్ళడానికి ఇప్పుడింకా తయారుకాలేదు, కనుక కొద్దిగా ఆగుదాం అనుకోవటం లేదు కదా? ఆగుదామనుకుంటున్నారా? ఒకవేళ ఆగాలనుకుంటే బాబా సమానంగా అయ్యి ఆగండి. మీరు ఎవరెడీ కదా? సేవ గురించి ఆగటం లేదా డ్రామా ఆపటం అనేది వేరే విషయం కానీ మేము తయారవ్వలేదు కనుక ఆగాలి అని అనుకోకండి. కర్మబంధనకి వశం అయ్యి ఆగిపోకండి. కర్మలఖాతా యొక్క పుస్తకం స్వచ్ఛంగా, మరియు స్పష్టంగా ఉండాలి. 

నలువైపుల ఉన్న పిల్లలందరికీ కొత్త సంవత్సరం యొక్క మహానత ద్వారా మహాన్ గా అయ్యే శుభాకాంక్షలు సదా వెంట ఉండాలి. ధైర్యంతో ఉండే పిల్లలకు, బ్రహ్మాబాబాని అనుసరించే పిల్లలకు, సదా ఒకరికొకరు దిల్‌కుష్ మిఠాయి తినిపించుకునేవారికి, సదా ఫరిస్తాగా అయ్యి ఆశీర్వాదాలు ఇచ్చేవారికి, ఈవిధంగా బాబా సమానమైన దయాసాగరులు, కృపాసాగరులైన పిల్లలకు సమానంగా అయ్యే శుభాకాంక్షలతో పాటు ప్రియస్మృతులు మరియు సమస్తే. 

Comments