26-01-1983 అవ్యక్త మురళి

26-01-1983                   ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము  

దాత పిల్లలుగా అయి సర్వులకు సహయోగమును ఇవ్వండి.

  ఈరోజు బాప్దాదా తమ సేవాధారీ సహచరులను కలుసుకునేందుకు వచ్చారు. ఏ విధంగా బాప్దాదా ఉన్నతోన్నతమైన స్థితిలో స్థితులై బేహద్ సేవకొరకు నిమిత్తులై ఉన్నారో అలాగే మీరందరూ కూడా ఉన్నతోన్నతమైన సాకార స్థానంలో స్థితులై బేహద్ సేవకొరకు నిమిత్తులుగా ఉన్నారు. ఆ స్థానం వైపు అనేక ఆత్మల దృష్టి ఉంది. ఏ విధంగా తండ్రి యొక్క యధార్థ స్థానము తెలియకపోయినా అందరి దృష్టి పైకి వెళుతుందో అలాగే సాకారంలో సర్వాత్మల దృష్టి ఈ మహాన్ స్థానం వైపుకే వెళుతోంది మరియు వెళుతూ ఉంటుంది. 'వీరెక్కడ ఉన్నారు' ఇప్పటివరకు కూడా ఇదే అన్వేషణలో ఉన్నారు. ఏదో శ్రేష్ఠమైన ఆధారం లభించాలని భావిస్తారు. కాని ఇదే ఆ స్థానము అన్నది గుర్తించేందుకు, నలువైపులా పరిచయమును ఇచ్చేందుకు అందరూ సేవ చేస్తున్నారు. ఈ బేహద్ విశేష కార్యమే ఎవరినైతే కలవాలో లేక ఎవరినైతే పొందాలో వారిని ఇక్కడినుండే పొందుతాము అన్న సేవను ప్రసిద్ధం చేస్తుంది. ఇదే మన శ్రేష్ఠ ఆధారము. విశ్వంలోని ఈ శ్రేష్ఠమైన మూల నుండే సదాకాలికముగా ప్రాణదానము లభిస్తుంది. ఈ బేహద్ కార్యము ద్వారా ఈ అడ్వర్టైజ్మ్ంట్ విశేష రూపంగా జరుగనున్నది. ఏ విధంగా భూగర్భంలో దాగి ఉన్న లేక కూరుకుపోయిన వస్తువులు అకస్మాత్తుగా లభిస్తే అన్నివైపుల సంతోషంగా ప్రచారం చేస్తారో అలాగే ఈ ఆధ్యాత్మిక ఖజానాల ప్రాప్తి స్థానమేదైతే గుప్తముగా ఉందో దాన్ని అనుభవ నేత్రం ద్వారా చూసి పోగొట్టుకున్న లేక తప్పటిపోయిన గుప్త ఖజానాల స్థానము మళ్ళీ లభించింది అని భావిస్తారు. మెల్లమెల్లగా అందరి మనస్సు నుండి, ఒక మూలలో ఇటువంటి శ్రేష్ఠ ప్రాప్తిని పొందే స్థానము ఒకటి ఉంది అన్న ఒకే ఒక్క మాట వెలువడుతుంది. దీన్ని ఎంతగానో ప్రఖ్యాతము చేయండి, అప్పుడు విచిత్రుడైన తండ్రి, విచిత్ర లీల, విచిత్ర స్థానము దీనినే చూస్తూ చూస్తూ ఎంతో హర్షితులవుతారు. తండ్రి అద్భుతమైనవారు, కార్యము అద్భుతమైనది అనే అందరి నోటి నుండి వింటూ ఉంటారు. ఇటువంటి సదాకాలికమైన అనుభూతిని కలిగించేందుకు ఏమేమి ఏర్పాట్లు చేశారు?

హాలునైతే తయారుచేస్తున్నారు, కాని ఈ హాలుతోపాటు మీ స్థితి కూడా బాగుందా? హాలుతోపాటు చాలు (నడవడిక)ను కూడా చూస్తారు కదా! కావున మీ స్థితి మరియు నడవడిక రెండూ విశాలంగా మరియు బేహద్గా ఉన్నాయి కదా! కూలి పనులు చేసుకునేవారి నుండి ఇంజనీర్లవరకు వీరిరువురి సహయోగము మరియు సంగఠన ద్వారా హాలు యొక్క సుందర రూపురేఖలు తయారయ్యాయి. పనివారు లేకపోతే ఇంజనీర్లు కూడా ఏం చేయగలరు? వారు కాగితంపై పట్లాను తయారుచేయగలరు కాని ప్రాక్టికల్ స్వరూపమైతే పనివారు లేకుండా జరుగజాలదు. కావున ఏ విధంగా స్థూల సహయోగము ఆధారంపై సర్వుల వేలు సహయోగమును అందించడం ద్వారా తయారైపోయిందో అలాగే హాలుతోపాటు అద్భుతమైన నడవడికను చూపించేందుకు ఇటువంటి విశేష స్వరూపమును ప్రత్యక్ష రూపములో చూపించండి. కేవలం బుద్ధిలో సంకల్పం చేసాము అని కాదు. ఏ విధంగా ఇంజనీర్ల బుద్ధి సహాయము మరియు కూలివారి కర్మ సహాయంతో కార్యం సంపన్నమైందో అదేవిధంగా మనస్సు యొక్క శ్రేష్ఠ సంకల్పాలతోపాటు ప్రతి కర్మ ద్వారా ఇప్పుడు విచిత్రమైన నడవడిక అనుభవమవ్వాలి. ప్రత్యక్ష స్వరూపము ప్రతి కర్మ ద్వారానే కనిపిస్తుంది. కావున ఈ విధంగా నడుచుకునే మరియు చేసే సంకల్పము, వాణి లేక కాళ్ళు, చేతుల ద్వారా సంగఠిత రూపంలో విచిత్ర స్వరూపంతో చూపించే దృఢ సంకల్పం చేసారా? ఇటువంటి నడవడిక యొక్క పట్లానును తయారుచేశారా? కేవలం 3000 మంది యొక్క సభ కాదు, కాని 3,000 మందిలో సదా త్రిమూర్తి కనిపించాలి. వీరందరూ బ్రహ్మాబాబా సమానంగా కర్మయోగులుగా, విష్ణు సమానంగా ప్రేమ మరియు శక్తితో సదా పాలన ఇచ్చేవారు, శంకరుని సమానంగా తపస్వీ వాయుమండలమును తయారుచేసేవారు.... ఇటువంటి అనుభవమును ప్రతిఒక్కరి ద్వారా కలగాలి. ఈ విధంగా స్వయములో సర్వశక్తుల స్టాకును జమ చేసుకున్నారా? భాండాగారమును నిండుగా చేసుకున్నారా? ఈ స్టాకును చెక్ చేశారా లేక అందరూ ఎంత బిజీగా అయిపోయారంటే స్టాకును చెక్ చేసే తీరిక కూడా లేదా?

సేవ యొక్క అవినాశీ సఫలతకొరకు స్వయం యొక్క ఏదో ఒక విశేష పరివర్తనతో కూడిన ఆహుతిని వేస్తారా? ఈ విధంగా మీలో మీరు పట్లానును తయారుచేశారా? అన్నింకన్నా పెద్ద వరదానము- దాత పిల్లలుగా అయి సర్వులకు సహయోగమును ఇవ్వడము. పాడైపోయిన కార్యమును, పాడైపోయిన సంస్కారాలను, పాడైపోయిన మూడ్ను శుభభావనతో సరిచేయడంలో సదా సర్వుల సహయోగిగా అవ్వడం ఇది అన్నింకన్నా పెద్ద విశేషమైన దానము. వీరు ఇది చేసారు, ఇది అన్నారు అన్నది చూస్తూ, వింటూ, అర్థం చేసుకుంటూ కూడా తమ సహయోగం యొక్క స్టాకు ద్వారా పరివర్తన చేసెయ్యడము, ఆల్ రౌండ్ సేవాధారులు ఏదైనా నిండుగా లేకపోతే, ఆ స్థానమును సమయ ప్రమాణంగా నింపివేస్తారు కదా! అలాగే ఎవరిద్వారానైనా ఏదైనా శక్తిలో లోటు అనుభవమైనా కాని మీ సహయోగము ద్వారా ఆ స్థానమును నింపేయండి. తద్వారా ఇతరుల లోపం కూడా మరెవ్వరికీ అనుభవమవ్వకూడదు. దీనినే దాత పిల్లలుగా అయి వారికి సమయానుసారంగా సహయోగమురూపీ దానమునివ్వడము అని అంటారు. వీరు ఇది చేసారు, ఇలా చేసారు అని ఆలోచించకూడదు. ఏదైతే జరగాలో అది చేస్తూ ఉండండి. ఎవరి లోపాలనూ చూడకండి కాని ముందుకువెళుతూ ఉండండి. శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా ఏమిచేయవచ్చు, అది కూడా కేవలం ఆలోచించడం కాదు, చెయ్యాలి. దీనినే విచిత్ర నడవడిక యొక్క ప్రత్యక్ష స్వరూపము అని అంటారు. సదా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా జరుగుతోంది మరియు సదా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా చేస్తూ ఉండాలి. ఈ సమర్థ సంకల్పమునే సదా తోడుగా ఉంచుకోవాలి. కేవలం వర్ణన చేయడం కాదు, నివారణ చేస్తూ నవనిర్మాణ కర్తవ్యపు సఫలతను ప్రత్యక్ష రూపంలో చూస్తూ మరియు చూపిస్తూ ఉండాలి. ఇటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కదా! ఎందుకంటే అందరి బాధ్యత ఉన్నా కూడా విశేషంగా మధువన నివాసుల బాధ్యత ఉంది. డబల్ బాధ్యత తీసుకున్నారు కదా! ఏ విధంగా హాలు యొక్క ఫౌండేషన్ వేసారో అలాగే నడవడిక యొక్క పౌండేషన్ను కూడా వేసారా? ఆ రిహార్సల్ కూడా జరిగిందా లేదా? రెండింటి యొక్క కలయిక జరుగుతుంది, అప్పుడే సఫలత యొక్క ఢంకా నలువైపులా చేరుకుంటుంది. ఎంత ఉన్నతమైన స్థానము ఉంటుందో అంతగా ప్రకాశము నలువైపులా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇదైతే అన్నింకన్నా ఉన్నతమైన స్థానం. ఇక్కడినుండి వెలువడిన శబ్దము నలువైపులకీ చేరుకోవాలి. అందుకొరకు లైట్హౌస్గా, మ్ైహౌస్గా అవ్వాలి. అచ్ఛా!

సదా స్వయమును ప్రతి గుణము, ప్రతి శక్తి సంపన్నంగా సాక్షాత్ బాబా స్వరూపంగా అయి సర్వులకు సాక్షాత్కారమును చేయించేవారికి, సదా విచిత్ర స్థితిలో స్థితులై సాకార చిత్రము ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేవారికి, ఉన్నతోన్నత స్థితి ద్వారా ఉన్నతోన్నతమైన స్థానమును, ఉన్నతోన్నతమైన ప్రాప్తుల బండారమును ప్రత్యక్షం చేసేవారికి, అందరి మనస్సుల నుండి లభించేసింది, పొందేసాము అన్న గీతమును వెలువడేంతగా శుభభావన శుభకామనను ఉంచేవారికి ఇటువంటి సర్వశ్రేష్ఠులైన బేహద్ సేవాధారులకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

మధువన నివాసులతో:- వరదాన భూమిపై ఉండేవారికి సదా సంతుష్టంగా ఉండే వరదానము లభించింది కదా! ఎవరు ఎంతగా స్వయమును సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటారో అంతగా వారు సదా సంతుష్టంగా ఉంటారు. కొద్దిగా లోటు అనుభవమైనా ఎక్కడైతే లోటు ఉంటుందో అక్కడ అసంతుష్టత ఉంటుంది. కావున మీకు సర్వప్రాప్తులు ఉన్నాయి కదా! సంకల్పసిద్ధి అయితే జరుగుతూనే ఉంది కదా! కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే మన రాజ్యమైతే లేదు. ఎంతగా ఇతరుల ముందుకు సమస్యలు వస్తాయో అంతగా ఇక్కడ రావు. ఇక్కడ సమస్య అనేది ఒక ఆటగా అయిపోతుంది. అయినా సమయానికి ఎంతో సహయోగం లభిస్తూ ఉంది. ఎందుకంటే ధైర్యమును ఉంచారు. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో అక్కడ సహయోగము తప్పక లభిస్తుంది. తమ మనస్సులో ఎటువంటి అలజడి కలుగకూడదు. మనసు ఎల్లప్పుడు తేలికగా ఉండడం ద్వారా సర్వులలో కూడా మీకొరకు తేలికతనమే ఉంటుంది. ఎంతో కొంత లెక్కాచారాలైతే ఉంటూనే ఉంటాయి. కాని ఆ లెక్కాచారాలను కూడా అవి ఏమంత పెద్ద విషయాలు కానట్లుగా దాటివేయండి. చిన్న విషయాలు పెద్దగా చేసెయ్యకండి. చిన్నగా చేయడం లేక పెద్దగా చేయడం అది మీ బుద్ధి పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇది బేహద్ సేవ యొక్క సమయం. కావున మీ బుద్ధిని కూడా బేహద్గా ఉంచుకోండి. వాతావరణమును శక్తిశాలిగా తయారుచేయాలి, ఈ విషయంలో ప్రతి ఆత్మ స్వయమును బాధ్యులుగా భావించాలి. అందరి స్వభావ సంస్కారాలను పరస్పరం తెలుసుకున్నారు. కావున జ్ఞానస్వరూపులు ఎప్పుడు ఎవరి స్వభావ సంస్కారాలలో ఘర్షణపడరు. ఇక్కడ గుంత ఉంది లేక పర్వతము ఉంది అని తెలిసినవారు ఎప్పుడూ దానికి తట్టుకొని పడరు, పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు. కావున స్వయమును సదా సురక్షితంగా ఉంచుకోవాలి. ఒకరు తట్టుకోకుండా ఉంటే, ఇతరులు స్వయమే సురక్షితులైపోతారు. పక్కకు తప్పుకోండి అనగా స్వయమును సురక్షితంగా ఉంచుకోండి మరియు వాయుమండలమును సురక్షితంగా ఉంచండి. పని నుండి తప్పుకోవడం కాదు, మీ సురక్షతా శక్తితో ఇతరులను కూడా సురక్షితంగా ఉంచాలి, ఇదే తప్పుకోవడము. ఇటువంటి శక్తి అయితే వచ్చేసింది కదా!

సాకార రూపంలో ఫాలో చేసేందుకు అందరికీ మధువనమే కనిపిస్తుంది ఎందుకంటే అది ఉన్నతమైన స్థానము. మధువనంవారైతే సదా ఊయలలలో ఊగుతూ ఉంటారు. ఇక్కడ ఎన్నో ఊయలలు ఉన్నాయి. స్థూలప్రాప్తులు కూడా ఎన్నో ఉన్నాయి, సూక్ష్మప్రాప్తులు కూడా ఎన్నో ఉన్నాయి. సదా ఊయలలో ఉన్నట్లయితే ఇప్పుడు ఇక పొరపాట్లు జరగవు. ప్రాప్తుల ఊయల నుండి దిగినట్లయితే స్వయం యొక్క పొరపాట్లు మరియు ఇతరుల యొక్క పొరపాట్లు కూడా కనిపిస్తాయి. ఊయలలో కూర్చున్నప్పుడు నేలను వదలవలసి ఉంటుంది. కావున మధువనంవారు సర్వ ప్రాప్తులరూపీ ఊయలలో సదా ఊగుతూ ఉంటారు. జీవితం కేవలం ప్రాప్తుల ఆధారంపై ఉండకూడదు. ప్రాప్తులు మీముందుకు వచ్చినా కాని మీరు ఆ ప్రాప్తులను స్వీకరించకండి. కోరిక ఉన్నట్లయితే సర్వప్రాప్తులు లభిస్తున్నా కూడా లోటు అనుభవమవుతుంది, సదా స్వయమును ఖాళీగా భావిస్తారు. కావున ఎటువంటి కష్టము లేకుండా ప్రాప్తి స్వయమే లభించేవిధంగా అటువంటి భాగ్యము లభించింది! కావున ఈ భాగ్యమును సదా స్మృతిలో ఉంచుకోండి. ఎంతగా స్వయం నిష్కాములుగా అవుతారో అంతగా ప్రాప్తి మీముందుకు స్వతహాగానే వస్తుంది. అచ్ఛా!

సేవాధారులతో:- సేవాధారులు అంటేనే ప్రత్యక్ష ఫలమును తినేవారు. సేవ యొక్క మరియు సంతోషము యొక్క అనుభూతిని పొందారు, అనగా ప్రత్యక్ష ఫలమును తిన్నట్లే కదా! ఇది ఉన్నతోన్నతమైన భాగ్యానికి గుర్తు. జన్మజన్మలకు స్వయమును రాజ్యాధికారిగా తయారుచేసుకునే సహజ సాధనమిది. కావున సేవ చేయడము అనగా భాగ్యసితార మెరవడము. కావున ఈ విధంగా భావిస్తూ సేవ చేస్తున్నారు కదా! అది సేవగా అనిపిస్తోందా లేక ప్రాప్తిగా అనిపిస్తోందా? పేరుకు ఇది సేవయే కాని ఇది సేవ చేయడం కాదు లభించడము. ఎంతగా లభిస్తుంది? నిజానికి ఏమీ చేయడం లేదు కాని అంతా లభిస్తుంది. చేయడంలో అన్ని సుఖసాధనాలు లభిస్తాయి. కష్టమేమీ చేయవలసిన అవసరం రాదు. ఎంత కష్టమైన పని అయినా కాని పరిష్కారం కూడా తోడు తోడుగా లభిస్తుంది. అప్పుడది కష్టమైన పనిగా అనిపించదు, ఆటలా అనిపిస్తుంది. కావున సేవాధారులుగా అవ్వడము అనగా ప్రాప్తులకు యజమానులుగా అవ్వడము. రోజంతిలో ఎన్ని ప్రాప్తులను పొందుతారు? ఒక్కొక్క రోజు యొక్క, ఒక్కొక్క గంట యొక్క ప్రాప్తిని లెక్కవేసినట్లయితే ఎన్ని లెక్కలేనన్ని ప్రాప్తులున్నాయి! కావున సేవాధారులుగా అవ్వడము అనగా భాగ్యానికి గుర్తు. సేవ యొక్క అవకాశం లభించింది అనగా ప్రాప్తుల బండాగారము నిండిపోయింది. స్థూలప్రాప్తి కూడా ఉంది మరియు సూక్ష్మప్రాప్తి కూడా ఉంది. ఎక్కడ ఏ సేవ చేసినా మధువనంలో లభించినంతగా స్థూల సాధనాలు ఇంకెక్కడా లభించవు. ఇక్కడ సేవతోపాటు మొదట తమ ఆత్మ యొక్క, శరీరం యొక్క ఈ రెండింటి డబల్ పాలన జరుగుతుంది. కావున సేవ చేస్తూ సంతోషం కలుగుతుందా లేక అలసట కలుగుతుందా? కావున సేవ చేస్తూ నేను డబల్ సేవ చేస్తున్నానా అని సదా చెక్ చేసుకోండి. మనసు ద్వారా వాయుమండలమును శ్రేష్ఠముగా తయారుచేసే మరియు కర్మ ద్వారా స్థూలసేవ చేసే అవకాశము ఉంది... కావున ఒక్క సేవ చేయకూడదు. ఒకే సమయంలో డబల్ సేవాధారులుగా అయి మీ డబల్ సంపాదన యొక్క అవకాశమును తీసుకోవాలి.

అందరూ సంతుష్టంగా ఉన్నారా? అందరూ తమ తమ కార్యాలలో మంచిగా, నిర్విఘ్నంగా ఉన్నారా? ఏ కార్యంలోను ఎటువంటి ఘర్షణ లేదు కదా! ఎప్పుడూ పరస్పరంలో ఘర్షణ లేదు కదా! ఎప్పుడూ నీది, నాది, నేను చేసాను, నువ్వు చేసావు ఈ భావనలైతే రావడం లేదు కదా! ఎందుకంటే చేసిన తరువాత నేను చేసాను అన్న సంకల్పము వచ్చినా మీరేదైతే చేసారో అదంతా అంతమైపోతుంది. నాది అనేది రావడం అనగా మొత్తం చేసిన కార్యమంతిపైనా నీరు పోసెయ్యడము, ఇలాగైతే చేయడం లేదు కదా! సేవాధారులు అనగా చేయించేవారైన తండ్రి నిమిత్తంగా అయి చేయిస్తున్నారు. చేయించేవారిని మర్చిపోకండి. ఎక్కడైతే నేను అనేది వస్తుందో అక్కడ మాయ కూడా వస్తుంది. నేను నిమిత్తంగా, నిర్మాణంగా ఉన్నాను అని భావించినట్లయితే మాయ రాజాలదు. సంకల్పంలో లేక స్వప్నంలో అయినా మాయ వచ్చినట్లయితే ఎక్కడో నేను, నాది అనే ద్వారము తెరుచుకున్నట్లు అర్థం. నేను అన్న ద్వారము మూసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ రాజాలదు. అచ్ఛా!

Comments