22-03-1982 అవ్యక్త మురళి

22-03-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

రాజ్యసత్తా మరియు ధర్మసత్తా కలిగిన అధికారీ పిల్లలతో బాప్దాదా కలయిక.
          
  బాప్దాదా తమ సర్వ అధికారీ పిల్లలను చూస్తున్నారు. రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా, ఈ రెండు సత్తాలు(శక్తులు) ఒక్కరి చేతిలో ఉంటాయి అని శ్రేష్ఠ ఆత్మలైన మీకొరకే గాయనము ఉంది. ఈ మహిమ మీ భవిష్య ప్రాలబ్ధరూపముయొక్క గాయనము. కానీ భవిష్య ప్రాలబ్ధమునకు ఆధారము వర్తమాన శ్రేష్ఠ జీవితము. రాజ్య సత్తా మరియు ధర్మ సత్తాలను ఎంతవరకు ప్రాప్తి చేసుకున్నారు అని బాప్దాదా నలువైపుల కల పిల్లలను చూస్తున్నారు. ఈ సమయములోనే సంస్కారాలన్నీ ఆత్మలో నిండుతాయి. ఇప్పటి రాజే భవిష్యత్తులో రాజ్య అధికారిగా అవ్వగలడు. ఇప్పటి ధారణా స్వరూప ఆత్మలే ధర్మ సత్తాను ప్రాప్తి చేసుకోగలరు. మరి ఈ రెండు సత్తాలను ప్రతి ఒక్కరూ ఎంతవరకు తమలో ధారణ చేసుకున్నారు?

రాజ్య సత్తా అనగా అధికారి, అథారిటీ స్వరూపము. రాజ్యసత్తా కలిగిన ఆత్మ తన అధికారముద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా తన స్థూల మరియు సూక్ష్మ శక్తులను నడిపించగలదు. ఈ అథారిటీ రాజ్య సత్తాకు గుర్తు. రెండవ గుర్తు - రాజ్య సత్తా కలిగినవారు ప్రతి కార్యమును లా అండ్ ఆర్డర్ద్వారా నడిపించగలరు. రాజ్య సత్తా అనగా తల్లి, తండ్రి స్వరూపములో తన ప్రజలను పరిపాలించే శక్తి కలిగినవారు. రాజ్య సత్తా అనగా స్వయము కూడా సదా అన్నింటిలో సంపన్నము మరియు ఇతరులను కూడా సంపన్నముగా ఉంచేవారు. రాజ్య సత్తా అనగా విశేషమైన సర్వ ప్రాప్తులూ ఉంటాయి - సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ సర్వ గుణాల ఖజానాలలో నిండుతనము. స్వయము కూడా మరియు సర్వులు కూడా ఖజానాలతో నిండుగా ఉంటారు. రాజ్య సత్తా కలిగినవారుగా అనగా అధికారీ ఆత్మలుగా అయ్యారా? మతాపితల సమానంగా పాలనయొక్క విశేషతను అనుభవము చేస్తున్నారా? సంబంధ-సంపర్కములోకి ఏ ఆత్మలు వచ్చినా, ఈ శ్రేష్ఠ ఆత్మలే మా పూర్వజులు అన్న అనుభవమును చెయ్యాలి. ఈ ఆత్మలద్వారా జీవితములో సత్యమైన ప్రేమ మరియు జీవిత ఉన్నతికి సాధనము ప్రాప్తి కాగలదు ఎందుకంటే పాలన ద్వారానే ప్రేమ మరియు జీవన ఉన్నతి ప్రాప్తిస్తుంది. పాలనద్వారా ఆత్మ యోగ్యముగా అవుతుంది. చిన్న పిల్లవాడుకూడా పాలనద్వారా తన జీవిత గమ్యమును చేరుకునేందుకు ధైర్యశాలిగా అవుతాడు. ఇటువంటి ఆత్మిక పాలనద్వారా ఆత్మ నిర్బలమునుండి శక్తి స్వరూపముగా అవుతుంది. తన గమ్యము వైపుకు తీవ్రగతితో వెళ్ళేందుకు ధైర్యశాలిగా అవుతుంది. పాలనలో ఆత్మ సదా ప్రేమ సాగరుడైన బాబాద్వారా సత్యమైన, లెక్కలేనంత ప్రేమయొక్క అనుభూతిని చేస్తుంది. రాజ్య సత్తాకు చెందిన ఇటువంటి లక్షణాలను మీలో అనుభవము చేస్తున్నారా? అధీనత సంస్కారము పరివర్తన అయ్యి అధికారీతనపు సంస్కారమును అనుభవము చేస్తున్నారా? రాజ్య సత్తా సంస్కారము నిండిపోయిందా? లక్షణాలు ఇక్కడ కనిపించాలా లేక భవిష్యత్తులోనా? రాజ్య సత్తాకు చెందిన మరొక విశేషత కూడా ఉంది, తెలుసా? సదా స్థిరమైన, అఖండమైన రాజ్యము. మీ రాజ్యమునకు చెందిన ఈ మహిమను చేస్తారు కదా! రాజ్య సత్తాకు చెందిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి స్థిరంగా, అఖండంగా ఉన్నాయా అన్న ఈ లక్షణాన్నికూడా పరిశీలించుకోండి. సత్తా ఖండితమైతే కావటం లేదు కదా! ఇప్పుడిప్పుడే అధికారులుగా, ఇప్పుడిప్పుడే అధీనులుగా అయినట్లయితే దానిని అఖండము అని అంటారా? నా ప్రాలబ్ధము ఏంటి - రాజ్య అధికారినా లేక రాజ్యములో ఉండేవాడినా అన్నదానిని దీనిద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకొనగలరు.

ఇదేవిధంగా ధర్మ సత్తా అనగా ప్రతి ధారణకు చెందిన శక్తిని స్వయములో అనుభవము చేసే ఆత్మ. పవిత్రతయొక్క ధారణా శక్తిని అనుభవము చేసేవారిలా. పవిత్రతా శక్తిద్వారా సదా పరమపూజ్యులుగా అవుతారు. పవిత్రతా శక్తిద్వారా ఈ పతిత ప్రపంచమును పరివర్తన చేసేస్తారు. పవిత్రతా శక్తి వికారాలనే అగ్నిలో మండిపోతున్న ఆత్మలను శీతలంగా చేస్తుంది. పవిత్రతా శక్తి అనేక జన్మల వికర్మల బంధనమునుండి విడిపింపచేస్తుంది. పవిత్రతా శక్తి నేత్రహీనులకు మూడవ నేత్రమును ఇస్తుంది. పవిత్రతా శక్తిద్వారా ఈ మొత్తము సృష్టిరూపీ ఇంటిని పడిపోవటమునుండి ఆపగలరు. పవిత్రత స్తంభాలవంటిది, దీని ఆధారముతోనే ద్వాపరమునుండి ఈ సృష్టి కాస్త అలా ఆగి ఉంది. పవిత్రత ప్రకాశ కిరీటము. ఇటువంటి పవిత్రతా ధారణ - ఇదే ధర్మ సత్తా. ఇదేవిధంగా ప్రతి గుణమునకు చెందిన ధారణ, ప్రతి గుణమునకు చెందిన విశేషత ఆత్మలో ఇమడిపోయి ఉండాలి, దీనినే ధర్మ సత్తా అని అంటారు. ధర్మ సత్తా అనగా ధారణా సత్తా. అటువంటి ధర్మ సత్తా కలిగిన ఆత్మలుగా అయ్యారా? ధర్మములో రెండు విశేషతలు ఉంటాయి. ధర్మ సత్తా స్వయమును మరియు సర్వులను సహజముగా పరివర్తన చేస్తుంది. పరివర్తనా శక్తి స్పష్టమవుతుంది. మొత్తము చక్రములో చూడండి, ధర్మ సత్తా కలిగిన ఆత్మలు ఎవరు వచ్చినా వారి విశేషత ఇదే - మనుష్య ఆత్మలను పరివర్తన చెయ్యటము. సాధారణ మనుష్యులనుండి పరివర్తన అయ్యి కొందరు బౌద్ధులుగా, కొందరు క్రిస్టియన్లుగా అయ్యారు, కొందరు మఠాలు, ధార్మిక సిద్ధాంతాలు కలిగినవారుగా అయ్యారు. కానీ పరివర్తన అయితే జరిగింది కదా! కనుక ధర్మ సత్తా అనగా పరివర్తన చేసే సత్తా. మొదట స్వయమును, తరువాత ఇతరులను. అత్యాచారాలు జరిగినా, నిందింపబడినా, అపోజిషన్ ఉన్నాగానీ ధారణలో పరిపక్వులుగా ఉన్నారు. ధర్మ సత్తాయొక్క విశేషతలు ఇవి. ధర్మ సత్తా కలిగినవారు ప్రతి కర్మలో నిర్మాణులుగా ఉంటారు. గుణాల ధారణ ఎంత సంపన్నంగా ఉంటుందో అనగా ఎంతగా గుణాలరూపీ ఫల స్వరూపులుగా ఉంటారో అంతగా ఫల సంపన్నులుగా ఉన్నాకూడా నిర్మాణులుగా ఉంటారు. తమ నిర్మాణస్థితిద్వారానే ప్రతి గుణాన్ని ప్రత్యక్షము చెయ్యగలరు. బ్రాహ్మణ కులానికి చెందిన ధారణలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ధారణల శక్తి ఉండటము అనగా ధర్మ సత్తాధారిగా అవ్వటము. మరి రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా, రెండు సంస్కారాలు ప్రతి ఆత్మలో నిండిపోయాయా! రెండింటి బ్యాలెన్స్ ఉందా?

ఎంతవరకు ధర్మ సత్తా మరియు రాజ్య సత్తాలో అధికారులుగా అయ్యారు అన్నదానిని ఈరోజు బాప్దాదా పిల్లలందరి ఈ చార్టునే చూసారు. నంబర్వారీగా ఉంటారా లేక అందరూ ఒకేవిధంగా ఉంటారా? నా నంబర్ ఏది, అన్నదానిని తెలుసుకోగలరా? ఇక్కడ అందరూ రాజులు కూర్చుని ఉన్నారు కదా! ప్రజలను తయారుచేసుకునేవారు కదా! స్వయమైతే ప్రజలు కారు కదా! మరి అందరూ స్వయమును అటువంటి రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా కలిగిన అధికారులుగా తయారుచేసుకోండి. రాజ్య వంశపు లక్షణాలు ఏమిటి అన్నది అర్థమైందా?

ఢిల్లీ మరియు మహారాష్ట్ర జోన్వారు కూర్చుని ఉన్నారు కదా! రాజధానిలోని వారు కూడా రాజ్య అధికారులుగా అయ్యారు కదా! మహారాష్ట్రవారు మహానులుగా అవుతారు. మహాన్ అనగా రాజ్య అధికారి. మరి రెండు స్థానాలకు చెందిన మహాన్ శ్రేష్ఠ ఆత్మలు వచ్చి ఉన్నారు. విదేశీయులు ఎలా అవుతారు? రాజ్యము చేసేవారుగా అవుతారా లేక రాజ్యమును చూసేవారుగా అవుతారా? అందరికంటే ముందు వెళ్తారు కదా! అచ్ఛా -

ఇటువంటి రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా అధికారులకు, సదా సంపన్నంగా అయ్యి ఇతరులనుకూడా సంపన్నంగా చేసేవారు, పరివర్తన శక్తిద్వారా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసే శ్రేష్ఠ ఆత్మలకు, మొత్తము కల్పములో మహిమ మరియు పూజలు జరిగే పవిత్ర ఆత్మలకు, సదా తమ పవిత్రతా గుణముద్వారా సర్వులను గుణవంతులుగా తయారుచేసే గుణమూర్త ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో -

సమయము ప్రమాణంగా స్వయమును పరివర్తన చేసుకోండి.

ఇప్పుడు సమయ ప్రమాణంగా పరివర్తన యొక్క గతి తీవ్రమైనదిగా ఉండాలి. సమయము తీవ్రగతిలో వెళ్తున్నప్పుడు పరివర్తన చేసేవారు తీవ్రగతిలో లేనట్లయితే సమయము మారిపోతుంది మరియు స్వయము బలహీనత కలిగినవారుగా మిగిలిపోతారు. బలహీనత కలిగిన ఆత్మల గుర్తు ఏం కనిపిస్తుంది? విల్లు. మరి విల్లు కలిగినవారుగా అవ్వాలా లేక ఛత్రధారిగా అవ్వాలా? సూర్యవంశీయులుగా అవ్వాలా, వద్దా? మరి సూర్యుడు ఎల్లప్పుడు వేడిగా ఉంటాడు మరియు తీవ్రగతితో కార్యము చేస్తాడు. సూర్యుడు కంటే భిన్నంగా చంద్రుడు శీతలంగా ఉంటాడని గాయనము ఉంది. పురుషార్థములో శీతలంగా అవ్వకూడదు. పురుషార్థములో శీతలంగా అయినట్లయితే చంద్రవంశీయులుగా అయిపోతారు. సూర్యవంశీయుల లక్షణము - తీవ్ర పురుషార్థము. ఆలోచించారు మరియు చేసేసారు, ఒక సంవత్సరము ముందు ఆలోచించారు, ఇంకో సంవత్సరములో చేసారు.... ఇలా ఉండకూడదు. తీవ్ర పురుషార్థము అనగా ఎగిరే కళ కలిగినవారు. ఇప్పుడు ఎక్కే కళ కలిగినవారి సమయము కూడా వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేందుకు ఇప్పుడు చాలా సహజ సాధనము లభించింది, కేవలము ఒక్క మాటయొక్క గిఫ్ట్ - అది ఏది? ''మేరా బాబా''. ఈ ఒక్క మాటయే ఎటువంటి లిఫ్ట్ అవుతుందంటే ఒక్క క్షణకాలములో కిందనుండి పైకి వెళ్ళిపోగలరు. మరి ఈ లిఫ్ట్ను ఉపయోగించటము రాదా? ఇది లిఫ్ట్ కాలము, మళ్ళీ మెట్లెందుకు ఎక్కుతారు! లిఫ్ట్లో వెళ్ళినట్లయితే ఎటువంటి అలసట ఉండదు. ఆలోచించారు మరియు చేరుకున్నారు. మరి మీరు ఎవరు? ఒకే మాట కలిగిన లిఫ్ట్, ఎక్కువగా ఆలోచించే అవసరమే లేదు, ఒకటే మాట ఒకటో నంబరుకు చేరుస్తుంది. ''మేరా బాబా'' అని అన్నట్లయితే నేను అనేది అందులో ఇమిడిపోయింది. ఇంత సహజమైన లిఫ్ట్ను ఉపయోగించండి. ఉపయోగించేవారు చేరుకుంటారు మరియు చూసేవారు, ఆలోచించేవారు మిగిలిపోతారు. మరి ఇప్పుడు ఒక్క మాటయొక్క స్మృతి స్వరూపులుగా అయ్యి సదా సమర్థ ఆత్మగా అవ్వండి. ప్రతి అడుగును ముందుకు వేస్తూ ఇతురులను కూడా ముందుకు పోనిస్తూ ఉండండి. స్వయం ఎంత సంపన్నులుగా ఉంటారో అంతగా ఇతరులను కూడా సంపన్నంగా తయారుచెయ్యగలరు.

Comments