21-04-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమయుగీ మర్యాదలపై నడవడమే పురుషోత్తములుగా అవ్వటం.
ఈరోజు బాప్దాదా సర్వ మర్యాద పురుషోత్తములైన పిల్లలను చూస్తున్నారు. సంగమయుగ మర్యాదలే పురుషోత్తములుగా తయారుచేస్తాయి. కావుననే మర్యాదా పురుషోత్తములు అని అనడం జరుగుతుంది. ఈ తమోగుణ మనుష్య ఆత్మలు మరియు తమోగుణ ప్రకృతి యొక్క వాయుమండలము, వైబ్రేషన్ల నుండి రక్షించుకునేందుకు సహజ సాధనము ఈ మర్యాదలే. మర్యాదల లోపల ఉండేవారు సదా శ్రమ నుండి సురక్షితులుగా ఉంటారు. ఎప్పుడైతే మర్యాదల రేఖల నుండి సంకల్పాలు, మాటలు లేక కర్మల నుండి బయటకు వస్తారో అప్పుడే కష్టపడవలసి వస్తుంది. బాప్దాదా ద్వారా ప్రతి అడుగు కొరకు మర్యాదలు లభించాయి. దాని అనుసారంగానే అడుగులు వేయడం ద్వారా స్వతహాగానే మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు. అమృతవేళ నుండి రాత్రివరకు మర్యాదపూర్వకమైన జీవితమును గూర్చి మీకు బాగా తెలుసు, దాని అనుసారంగా నడుచుకోవడమే పురుషోత్తములుగా అవ్వడము. పేరే పురుషోత్తములు అని ఉన్నప్పుడు మరి దాని అర్థము సాధారణ పురుషులందరిలోకి ఉత్తములు అనే కదా! కావున శ్రేష్ఠ ఆత్మనైన నా మొదటి ముఖ్యమైన విషయమగు స్మృతి ఉత్తమంగా ఉందా అని పరిశీలించుకోండి. స్మృతి ఉత్తమంగా ఉన్నట్లయితే వృత్తి, దృష్టి, స్థితి స్వతహాగానే శ్రేష్ఠంగా ఉంటాయి. స్మృతి యొక్క మర్యాద రేఖను గూర్చి మీకు తెలుసా? నేను కూడా శ్రేష్ఠ ఆత్మను మరియు సర్వులు ఒక శ్రేష్ఠమైన తండ్రి యొక్క ఆత్మలే. వెరౖటీె ఆత్మలు వెరౖటీె పాత్రను అభినయిస్తాయి. ఈ మొదటి పాఠము సహజ రూపంలో స్మృతి స్వరూపంలో ఉండాలి. దేహమును చూస్తూ కూడా ఆత్మను చూడాలి. ఈ సమర్థ స్మృతి ప్రతిక్షణము స్వరూపంలోకి రావాలి, స్మృతి స్వరూపంగా అయిపోవాలి. నేను కూడా ఆత్మనే, వీరు కూడా ఆత్మయే అని కేవలం స్మరణలో ఉండడం కాదు. నేను ఉన్నదే ఆత్మగా, వారు ఉన్నది కూడా ఆత్మగానే. ఈ మొదటి స్మృతి యొక్క మర్యాద స్వయమును సదా నిర్విఘ్నముగా తయారుచేస్తుంది మరియు ఇతరులకు కూడా ఈ శ్రేష్ఠ స్మృతి యొక్క సమర్ధత యొక్క వైబ్రేషన్లను వ్యాపింపజేసేందుకు నిమిత్తులుగా అయిపోతారు తద్వారా ఇతరులు కూడా నిర్విఘ్నంగా అయిపోతారు.
పాండవ సేన మిలనము జరుపుకునేందుకైతే వచ్చారు కాని ఆ మిలనముతోపాటు మొదటి మర్యాద రేఖ అయిన పునాది అగు స్మృతి భవ అన్న వరదానమును కూడా సదా తోడుగా తీసుకువెళ్ళండి. స్మృతి భవ అన్న వరదానమే సమర్ధ భవగా తయారుచేస్తుంది. మీరు ఏదైతే విన్నారో దాని ఏ సారమును తీసుకువెళతారు? సారము-స్మృతి భవ. ఇదే వరదానమును సదా అమృతవేళలో రివైజ్ చేయండి. ఏ కార్యమునైనా చేసేందుకు ముందు ఈ వరదానం యొక్క సమర్ధ స్థితిరూపీ ఆసనంపై కూర్చొని ఇది వ్యర్ధమా లేక సమర్ధమా అని నిర్ణయం తీసుకొని ఆ తరువాత కర్మలోకి రండి. కర్మ చేసిన తరువాత ఈ కర్మ యొక్క ఆదికాలము నుండి అంత్యకాలంవరకు ఇది సమర్ధంగా ఉందా అని పరిశీలించుకోండి లేకపోతే కొంతమంది పిల్లలు కర్మ యొక్క ఆదికాలంలో సమర్ధ స్వరూపంతో ప్రారంభిస్తారు కాని మధ్యలో సమర్ధము నుండి వ్యర్ధంలోకి లేక సాధారణ కర్మలోకి ఎలా మారిపోయిందో, సమర్ధ రేఖకు బదులుగా వ్యర్ధ రేఖ లోపలికి ఎలా వచ్చిందో లేక ఏ సమయంలో వచ్చిందో తెలియను కూడా తెలియదు. మళ్ళీ అంతిమంలో ఎలా చేయాలో అలా చేయలేకపోయాము అని ఆలోచిస్తారు. కాని, రిజల్టు ఏమౌతుంది? చేసిన తరువాత ఆలోచించడము త్రికాలదర్శి ఆత్మల లక్షణము కాదు. కావున మూడు కాలాలలోను స్మృతి భవ లేక సమర్ధ భవ. మరి ఏం తీసుకువెళ్ళాలో అర్థమైందా? సమర్ధ స్థితి యొక్క ఆసనమును ఎప్పుడూ వదలకండి. ఈ ఆసనమే హంస ఆసనము. హంస యొక్క విశేషత నిర్ణయ శక్తి యొక్క విశేషత. నిర్ణయ శక్తి ద్వారా సదా మర్యాదా పురుషోత్తమ స్థితిలో ముందుకువెళుతూ ఉంటారు. ఈ ఆసనము అన్న వరదానము మరియు మర్యాదా పురుషోత్తములు అన్న ఈశ్వరీయ టైటిల్ సదా తోడుగా ఉండాలి. అచ్ఛా- ఈరోజు కేవలం అభినందనలు అందించే రోజు. మీరు సేవలో వెళుతున్నారు కావున ఇది అభినందనతో కూడిన రోజు కదా! మీరు లౌకిక ఇంటికి కాదు సేవాస్థానానికి వెళుతున్నారు. కొంగల మధ్యకు కూడా వెళుతున్నారు కాని సేవార్ధము వెళుతున్నారు. దీన్ని కర ్మసంబంధంగా భావించి వెళ్ళకండి సేవా సంబంధంగా భావించి వెళ్ళండి. కర్మ సంబంధాలను తీర్చుకునేందుకు కూర్చోలేదు, సేవా సంబంధమును నిర్వర్తించేందుకు కూర్చున్నారు. ఇది కర్మబంధన కాదు, సేవా బంధన. అచ్ఛా!
సదా వ్యర్ధమును సమాప్తం చేసి సమర్ధ స్థితి యొక్క హంస ఆసనంపై స్థితులై ఉండేవారికి, ప్రతి కర్మను త్రికాలదర్శి శక్తితో మూడు కాలాలను సమర్ధంగా చేసుకునేవారికి సదా స్వతహాగా ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే ఇటువంటి మర్యాదా పురుషోత్తములైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్దాదాల మిలనము:-
1. సదా స్వయమును శ్రేష్ఠ భాగ్యవంతులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరికైతే స్వయంగా తండ్రియే భాగ్యవిధాతగా ఉన్నారో వారు ఎంత భాగ్యవంతులుగా ఉంటారు! తండ్రి భాగ్యవిధాత అయినప్పుడు మరి వారు వారసత్వంలో ఏమిస్తారు? తప్పకుండా శ్రేష్ఠ భాగ్యమునే ఇస్తారు కదా! సదా భాగ్యవిధాత అయిన తండ్రి మరియు భాగ్యము రెండూ స్మృతిలో ఉండాలి. ఎప్పుడైతే మీ శ్రేష్ఠ భాగ్యము మీ స్మృతిలో ఉంటుందో అప్పుడే ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారుచేసే ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి ఎందుకంటే మీరు దాత యొక్క పిల్లలు. భాగ్యవిధాత అయిన తండ్రి బ్రహ్మా ద్వారా భాగ్యమును పంచారు కావున బ్రాహ్మణులైన మీరు కూడా ఏం చేస్తారు? బ్రహ్మ యొక్క పని ఏదైతే ఉందో అదే బ్రాహ్మణుల పని కూడా. కావున మీరు ఇటువంటి భాగ్యమును పంచేవారు. వారు వస్త్రాలను పంచుతారు, ధాన్యమును పంచుతారు, నీటిని పంచుతారు కాని శ్రేష్ఠ భాగ్యమును భాగ్యవిధాత యొక్క పిల్లలే పంచగలరు. కావున మీరు భాగ్యమును పంచే శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలు. ఎవరికైతే భాగ్యము ప్రాప్తించిందో వారికి సర్వము ప్రాపించింది. ఎవరికైనా నేడు వస్త్రాలను ఇచ్చినట్లయితే మళ్ళీ వారికి రేపు ధాన్యంలో లోటు వస్తుంది, రేపు ధాన్యము ఇస్తే మళ్ళీ నీటి విషయంలో లోటు ఏర్పడుతుంది, ఇలా ఒక్కొక్క వస్తువును ఎంతవరకు పంచుతూ ఉండగలరు? దానిద్వారా సంతృప్తిని పొందలేరు. కాని, భాగ్యమును పంచినట్లయితే ఎక్కడైతే భాగ్యము ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ప్రాప్తించినప్పుడు ఓహో నా భాగ్యము అని అంటారు. ఎక్కడైతే భాగ్యము ఉంటుందో అక్కడ అన్నీ ప్రాప్తమవుతాయి. కావున మీరందరూ శ్రేష్ఠ భాగ్యమును దానం చేసే ఆత్మలు. ఇటువంటి శ్రేష్ఠ మహాదానులు, శ్రేష్ఠ భాగ్యవంతులు. ఇదే స్మృతి సదా ఎగిరేకళలోకి తీసుకువెళుతుంది. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యపు స్మృతి ఉంటుందో అక్కడ సర్వ ప్రాప్తుల స్మృతి ఉంటుంది. ఈ భాగ్యమును పంచడంలో విశాలహృదయులుగా అవ్వండి, ఇవి తరగనివి. ఎప్పుడైతే చాలా తక్కువగా ఉంటుందో అందులో పిసినారి భావన వచ్చే అవకాశం ఉంటుంది. కాని, ఇక్కడ తరగనివిగా ఉన్నాయి. కావున పంచుతూ వెళ్ళండి, సదా ఇస్తూ ఉండండి. ఒక్కరోజు కూడా దానమివ్వకుండా ఉండకూడదు. సదా దానులు అన్నివేళలా తమ ఖజానాలన్నింటినీ తెరిచి ఉంచుతారు. ఒక్క గంట కూడా దానమును ఆపు చేయరు. బ్రాహ్మణుల పనే విద్యను తీసుకోవడము మరియు విద్యాదానం చేయడము. కావున ఇదే కార్యంలో సదా తత్పరులై ఉండండి.
2. సదా స్వయమును సంగమ యుగపు వజ్రతుల్యమైన ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? మీరందరూ సత్యమైన వజ్రాలే కదా! వజ్రాలకు ఎంతో విలువ ఉంటుంది. మీ బ్రాహ్మణ జీవితానికి ఎంత విలువ ఉంది! కావుననే బ్రాహ్మణులను సదా శిఖ స్థానంలో చూపిస్తారు. శిఖ అనగా ఉన్నతమైన స్థానము. దేవతలు ఉన్నతమైనవారు కాని బ్రాహ్మణులైన మీరు దేవతలకన్నా ఉన్నతమైనవారు. ఇటువంటి నషా ఉందా? నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నా వారు, ఇదే జ్ఞానము కదా! ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. సదా మనస్సులో- పొందవలసినదేదో పొందేసాము అన్న గీతమే వినిపిస్తూ ఉండాలి. నోటితో పాడే గీతమును ఒక్క గంట పాడినా అలిసిపోతారు. కాని ఈ గీతమును పాడడంలో అలసట ఉండదు. బాబాకు చెందినవారిగా అవ్వడం ద్వారా అన్నిరకాలుగాను అయిపోతారు. నాట్యం చేసేవారిగా అవుతారు, గీతమును గానం చేసేవారిగా అవుతారు, చిత్రకారులుగాను అవుతారు. ప్రత్యక్షంగా మీ ఫరిశ్తా చిత్రమును తయారుచేసుకుంటున్నారు. బుద్ధి యోగం ద్వారా ఎంత మంచి చిత్రమును తయారుచేసుకుంటారు! ఏదంటే అది, అన్నీ ఉన్నాయి. మీరు చాలా పెద్ద బిజినెస్మ్యాన్ కూడా. మిల్లులకు యజమానులు కూడా. కావున సదా మీ అన్ని వృత్తులను స్మృతిలో ఉంచుకోండి. కాసేపు గనులకు యజమానులుగా అయిపోండి, మరికాసేపు కళాకారులుగా అయిపోండి, కాసేపు నాట్యం చేసేవారిగా అయిపోండి. ఇది చాలా రమణీకమైన జ్ఞానము, పొడి పొడి జ్ఞానము కాదు. రోజూ అదే ఆత్మ, పరమాత్మల జ్ఞానమును వింటూ ఉండాలా అని కొందరు అంటారు. కాని, ఇది ఆత్మ, పరమాత్మల పొడి పొడి జ్ఞానము కాదు, చాలా రమణీకమైన జ్ఞానము. కేవలం రోజూ మీ యొక్క క్రొత్త క్రొత్త టైటిళ్ళను గుర్తుంచుకోండి. నేను ఆత్మనే కాని ఎటువంటి ఆత్మను? కాసేపు కళాకార ఆత్మను, కాసేపు వ్యాపారి ఆత్మను... ఇలా రమణీకతతో ముందుకు వెళుతూ ఉండండి. బాబా కూడా రమణీకమైనవారే కదా! చూడండి, వారు కాసేపు బట్టలు ఉతికేవారిగా అయిపోతే మరోసారి విశ్వ రచయితగా, ఇంకోసారి వినమ్రుడైన సేవకుడిగా అయిపోతారు. కావున బాబా ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇలా ఈ రమణీకమైన జ్ఞానమును స్మరిస్తూ హర్షితులుగా అవ్వండి.
వర్తమాన సమయానుసారంగా స్వయం మరియు సేవ రెండింటి వేగంలోను బ్యాలెన్స్ కావాలి. మేము ఎంత సేవనైతే తీసుకున్నామో అంతగా ప్రతిఫలమును ఇస్తున్నామా అని ప్రతిఒక్కరూ పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఇది సేవ చేసే సమయం. ఎంతగా ముందుకువెళతారో సమయము అంతగా సేవాయోగ్యంగా అయిపోతుంది. కాని, ఆ సమయంలో పరిస్థితులు కూడా అనేకంగా ఉంటాయి. ఆ పరిస్థితులలో సేవ చేసేందుకు ఇప్పటి నుండే సేవ యొక్క అభ్యాసం కావాలి. ఆ సమయంలో రావడము, పోవడము కూడా కష్టమౌతుంది. మనస్సు ద్వారానే ముందుకు తీసుకువెళ్ళే సేవను చేయవలసి ఉంటుంది. అది ఇచ్చే సమయమే కాని స్వయములో నింపుకునే సమయము కాదు. కావున మొదటి నుండే సర్వశక్తుల యొక్క స్టాకును నింపుకున్నానా అని పరిశీలించుకుంటూ ఉండండి. సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ జ్ఞాన ఖజానాలు స్మృతి యొక్క శక్తితో సదా నిండుగా ఉండాలి. ఏ వస్తువు యొక్క లోటు ఉండకూడదు.
28వ తేదీన అమృతవేళలో బాప్దాదా సద్గురువారపు అభినందనలు తెలియజేసారు. వృక్షపతివారము సందర్భంగా అభినందనలు. వృక్షపతివారమునాడు సదాకాలికంగా బృహస్పతి దశ నిలిచి ఉండాలి. ఇదే సదా స్మృతి స్వరూపులుగా ఉండడం. ఇప్పుడైతే అందరూ పక్కా ప్రతిజ్ఞ చేసారు కదా! కుమార్ గ్రూప్ తయారయిందంటే శబ్దము బాగా వ్యాపిస్తుంది, గవర్నమ్ంట్వరకు చేరుకుంటుంది. కాని అవినాశిగా ఉంటే అలా అవుతుంది. గడబిడ చేయకండి. ఉల్లాస ఉత్సాహాలు, ధైర్యము బాగున్నాయి. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో అక్కడ సహాయం ఉంటుంది. శక్తులు ఏమి ఆలోచిస్తున్నారు? శక్తులు లేకుండా శివుడు కూడా లేరు. శివుడు లేకపోతే శక్తులు కూడా లేరు.
బాబా కూడా భుజాలు లేకుండా ఏమిచేయగలరు? కావున మొదటి భుజాలు ఎవరు? ఓహో నేను! అచ్ఛా!
పరమాత్మ ప్రేమలో సదా లవలీనులై ఉండండి (వ్యక్తిగత అవ్యక్త మహావాక్యాలు)
పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అయినట్లయితే ఇదే అనుభవంతో సహజయోగులుగా అయి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరేందుకు సాధనము. ఎగిరేవారు ఎప్పుడూ ధరణి యొక్క ఆకర్షణలోకి రాజాలదు. మాయ యొక్క ఆకర్షణారూపము ఎంతగా ఉన్నా కాని ఆ ఆకర్షణ ఎగిరేకళగల వారివద్దకు చేరుకోజాలదు. ఈ పరమాత్మ ప్రేమ యొక్క దారము దూరదూరాల నుండి ఆకర్షించి తీసుకువస్తుంది. ఇది ఎంత సుఖవంతమైన ప్రేమ అంటే ఎవరైతే ఈ ప్రేమలో ఒక్క క్షణమైనా మైమరిచిపోతారో వారి అనేక దు:ఖాలు మాయమైపోతాయి మరియు సదాకాలము సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. జీవితంలో ఏదైతే కావాలో దానిని ఎవరైనా ఇచ్చేస్తే అదే ప్రేమకు గుర్తుగా ఉంటుంది. కావున బాబాకు పిల్లలైన మీపై ఎంత ప్రేమ ఉందంటే జీవితపు సుఖశాంతుల కామనలనన్నింటినీ పూర్తిచేసేస్తారు. బాబా సుఖమునే ఇవ్వరు, ఆ సుఖపు భాండాగారానికి యజమానులుగా చేసేస్తారు, దానితోపాటు శ్రేష్ఠ భాగ్యరేఖను దిద్దుకునే కలమును కూడా ఇస్తారు. ఎంత కావాలనుకుంటే అంత మీ భాగ్యమును తయారుచేసుకోగలరు, ఇదే పరమాత్మ ప్రేమ. ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లవలీనులై ఉంటారో, మైమరిచిపోయి ఉంటారో వారి ప్రకాశము మరియు నషా మరియు అనుభూతి యొక్క కిరణాలు ఎంతగా శక్తిశాలిగా ఉంటాయంటే ఇక ఏ సమస్య అయినా సమీపంగా రావడం అటుంచి అసలు కళ్ళు తెరిచి కూడా చూడలేదు. వారికి ఎప్పుడూ ఏ విధమైన శ్రమ కలుగజాలదు. బాబాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే వారు అమృతవేళ నుండే పిల్లల యొక్క పాలనను చేస్తూ ఉంటారు. రోజు ప్రారంభమే ఎంత శ్రేష్ఠంగా జరుగుతుంది! స్వయంగా భగవంతుడే మిలనము జరిపేందుకు పిలుస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు మరియు శక్తులను నింపుతారు. బాబా యొక్క ప్రేమ గీతాలు మిమ్మల్ని మేల్కొల్పుతాయి. ఎంత స్నేహంగా పిలుస్తారు, మేల్కొల్పుతారు. మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ, రండి... కావున ఈ ప్రేమ పాలన యొక్క ప్రాక్టికల్ స్వరూపము సహజయోగి జీవితము. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారికి ఏది నచ్చుతుందో అదే చేయడం జరుగుతుంది. కావున బాబాకు పిల్లలు అప్సెట్ అవ్వడం మంచిగా అనిపించదు. కావున ఏం చేయాలి, విషయమే అలా ఉంది కావుననే అప్సెట్ అయిపోయాము అని ఎప్పుడూ అనకండి. అప్సెట్ చేసే విషయం వచ్చినా కాని మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి. బాప్దాదాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే పిల్లలు ప్రతిఒక్కరూ నాకన్నా ముందుకువెళ్ళాలి అని కోరుకుంటారు. ప్రపంచంలో కూడా ఎవరిపైనైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తమకన్నా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇదే ప్రేమకు గుర్తు. కావున నా పిల్లలలో ఇప్పుడు ఎటువంటి లోపము ఉండకూడదు అని బాప్దాదా కూడా అంటారు. అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలి.
పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల వంటిది. ఈ సుఖవంతమైన ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే ఎప్పుడూ ఎటువంటి పరిస్థితి లేక మాయ యొక్క అలజడి రాజాలదు. పరమాత్మ ప్రేమ తరగనిది, చలించనిది. అది ఎంత అపారంగా ఉంటుందంటే అది సర్వులకు ప్రాప్తించగలదు. కాని పరమాత్మ ప్రేమను ప్రాప్తించుకునే విధి అతీతంగా అవ్వడము. ఎవరు ఎంత అతీతంగా ఉంటారో అంతగా వారు పరమాత్మ ప్రేమకు అధికారులు. పరమాత్మ ప్రేమలో ఇమిడి ఉన్న ఆత్మలు ఎప్పుడూ హద్దులోని ప్రభావాలలోకి రాజాలరు, సదా బేహద్ ప్రాప్తులలో మగ్నమై ఉంటారు, వారి నుండి ఎల్లప్పుడు ఆత్మికత యొక్క సుగంధము వెలువడుతూ ఉంటుంది. ప్రేమకు గుర్తు- ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిపై అన్నింటినీ బలిహారం చేసేస్తారు. బాబాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే రోజూ ఆ ప్రేమకు జవాబును ఇచ్చేందుకు ఇంత పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు, ప్రియస్మృతులు అందిస్తారు మరియు సహచరునిగా అయి సదా తోడును నిర్వర్తిస్తారు. కావున ఈ ప్రేమలో మీ బలహీనతలనన్నింటినీ బలిహారం చేసెయ్యండి. పిల్లలపై బాబాకు ప్రేమ ఉంది, కావుననే సదా- పిల్లలూ మీరు ఎలా ఉన్నారో అలా నావారు అని అంటారు. ఈ విధంగా మీరు కూడా సదా ప్రేమలో లవలీనులై ఉండండి. బాబా, మాకు ఉన్నది మీరే, మా సర్వస్వము మీరే అని హృదయపూర్వకంగా అనండి. ఎప్పుడూ అసత్య రాజ్యపు ప్రభావంలోకి రాకండి. ఎవరైతే ప్రియముగా ఉంటారో వారిని తలుచుకోవడం జరుగుతుంది, వారి స్మృతి స్వతహాగా కలుగుతుంది. కేవలం ప్రేమ హృదయపూర్వకంగా ఉండాలి, సత్యముగా మరియు నిస్వార్ధంగా ఉండాలి. నా బాబా, ప్రియమైన బాబా అని అన్నప్పుడు ప్రియమైనవారిని ఎప్పుడూ మర్చిపోజాలరు మరియు నిస్వార్ధమైన ప్రేమ బాబా నుండి తప్ప మరి ఇంకే ఆత్మ నుండి లభించజాలదు. కావున ఎప్పుడూ ఏదో ఒక కోరికతో స్మృతి చేయకండి, నిస్వార్ధ ప్రేమలో లవలీనులై ఉండండి.
ఆదికాలమైన అమృతవేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేసుకోండి. హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానము పూర్తిగా ఉన్నప్పుడు మరి ఎప్పుడూ ఇంక ఎటువైపుకు ఆకర్షణ కాని, స్నేహం కాని వెళ్ళజాలదు. ఈ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తమవుతుంది. 83 జన్మలు దేవ ఆత్మలు లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. పరమాత్మ ప్రేమ ఇప్పుడే లభిస్తుంది. ఆ ఆత్మల ప్రేమ రాజ్యభాగ్యాన్ని పోగొడుతుంది మరియు పరమాత్మ ప్రేమ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. కావున ఈ ప్రేమ యొక్క అనుభూతులలో ఇమిడిపోయి ఉండండి. బాబాతో సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమకు గుర్తుగా- సమానంగా, కర్మాతీతంగా అవ్వండి. చేయించువారిగా కర్మలను ఆచరించండి మరియు చేయండి. కర్మేంద్రియాలు మీతో చేయించకూడదు మీరు కర్మేంద్రియాలతో చేయించాలి. ఎప్పుడూ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశమై ఏ కర్మలూ చేయకండి.
Comments
Post a Comment