17-04-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
కర్మాతీత స్థితిని పొందేటందుకు సర్దుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి అవసరం.
శబ్దం నుండి అతీతంగా మీ శ్రేష్ఠ స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? ఆ శ్రేష్ఠ స్థితి సర్వ వ్యక్త ఆకర్షణల నుండి అతీతంగా శక్తిశాలిగా, అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి. ఒక్క క్షణమైనా ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితులైతే దాని ప్రభావంతో రోజంతా కర్మ చేస్తూ కూడా స్వయములో విశేషంగా శాంతి శక్తిని అనుభవం చేసుకుంటారు. ఇదే స్థితిని కర్మాతీత స్థితి అని, బాబా సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు. ఈ స్థితి ద్వారానే ప్రతి కార్యంలోను సఫలతను అనుభవం చేసుకోగలుగుతారు. ఇటువంటి శక్తిశాలీ స్థితిని అనుభవం చేసుకున్నారా? కర్మాతీత స్థితిని పొందడం బ్రాహ్మణ జీవిత లక్ష్యము. కావున ఆ లక్ష్యమును పొందేందుకు ఇప్పటినుండే ఇదే అభ్యాసంలో ఉన్నట్లయితేనే ఆ లక్ష్యమును పొందగలుగుతారు. ఆ లక్ష్యమును పొందేందుకు విశేషంగా స్వయములో సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి అవసరము. ఎందుకంటే వికారీ జీవితము లేక భక్తి యొక్క జీవితము రెండింటిలోను జన్మజన్మాంతరాల నుండి బుద్ధికి విస్తారంలో భ్రమించే సంస్కారము ఎంతో పక్కా అయిపోయింది. కావున ఈ విధంగా విస్తారంలో భ్రమించే బుద్ధిని సారరూపంలో స్థిరం చేసేందుకు ఈ రెండు శక్తుల అవసరము ఉంది. ప్రారంభం నుండి చూడండి, మీ దేహభానపు వెరౖటీ రకాల విస్తారము ఎంతగా ఉంది! ఇదైతే మీకు తెలుసు కదా! నేను పిల్లవాడిని, నేను యువకుడిని, నేను వృద్ధుడిని, నేను ఫలానా, ఫలానా వృత్తిలో ఉన్నాను... ఇలా అనేకరకాలైన దేహస్మృతుల విస్తారము ఎంతగా ఉంది! మళ్ళీ సంబంధాలలోకి రండి, ఎంత విస్తారము ఉంది! ఒకరికి కొడుకైతే మరొకరికి తండ్రి, ఎన్ని విస్తారపు సంబంధాలు ఉన్నాయి! వాటిని వర్ణించవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు వాటిని గూర్చి తెలుసు. అదేవిధంగా దేహ పదార్థాల విస్తారం కూడా ఎంతగా ఉంది! భక్తిలో అనేకమంది దేవతలను సంతుష్టపరిచే విస్తారము ఎంతగా ఉంది! ఒక్కరిని పొందే లక్ష్యము ఉంది, కాని భ్రమించే సాధనాలు అనేకం ఉన్నాయి. ఈ అనేకరకాలైన విస్తారాలను సారరూపంలోకి తీసుకువచ్చేందుకు ఇముడ్చుకునే లేక సదురుకునే శక్తి కావాలి. విస్తారమంతటినీ ఒక్క పదములో ఇమిడ్చివేస్తారు, అది ఏమిటి? బిందువు. నేను కూడా బిందువే, బాబా కూడా బిందువే. ఒక్క బిందువైన బాబాలో మొత్తం ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఇదైతే మీకు మంచి అనుభవం ఉంది కదా! ప్రపంచంలో ఒకటేమో సంబంధము, రెండవది- సంపద. ఈ రెండు విశేషతలు బిందువైన బాబాలో ఇమిడి ఉన్నాయి. సర్వ సంబంధాలను ఒక్కరి ద్వారా అనుభవం చేసుకున్నారా! సర్వ సంపదల ప్రాప్తి అయిన సుఖశాంతులు, సంతోషము వీటిని అనుభవం చేసుకున్నారా లేక ఇప్పుడు ఇంకా చేసుకోవాలా? మరి ఏమైంది- విస్తారము సారంలో ఇమిడిపోయింది కదా! అనేకవైపుల విస్తారంలో భ్రమించే బుద్ధి సర్దుకునే శక్తి యొక్క ఆధారంపై ఒక్కరిలో ఏకాగ్రమైపోయిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అది ఇప్పుడు కూడా ఎక్కడైనా విస్తారంలో భ్రమిస్తోందా? సర్దుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తులను ప్రయోగించారా లేక కేవలం వాటి జ్ఞానం ఉందా? ఈ రెండు శక్తులను ప్రయోగించడం వస్తే దానికి గుర్తుగా క్షణంలో బుద్ధి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అదే స్థితిలో స్థిరమైపోతుంది. ఏ విధంగా స్థూలమైన యాత్రలో పవర్ఫుల్ బ్రేక్ ఉన్నప్పుడు అదే క్షణంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆపగలుగుతారు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ బండిని అదే దిశవైపుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఈ విధంగా స్వయం ఈ శక్తిని అనుభవం చేసుకుంటున్నారా లేక ఏకాగ్రులుగా అవ్వడంలో సమయం పడుతుందా? వ్యర్థం నుండి సమర్థం వైపుకు వెళ్ళడంలో కష్టపడవలసి వచ్చినప్పుడు ఈ రెండు శక్తులలో లోపం ఉంది అని అర్థం చేసుకోండి. సంగమ యుగపు బ్రాహ్మణ జీవిత విశేషత- సారరూపంలో స్థితులై సదా సుఖశాంతుల యొక్క, సంతోషం యొక్క, జ్ఞానం యొక్క, ఆనందం యొక్క ఊయలలో ఊగుతూ ఉండడం. సర్వ ప్రాప్తుల సంపన్న స్వరూపం యొక్క అవినాశీ నషాలో స్థితులై ఉండండి. సదా మీ ముఖముపై ప్రాప్తియే ప్రాప్తి ఉంది అని ఆ సంపన్న స్థితి యొక్క ప్రకాశము మరియు నషా కనిపించాలి. ఎప్పుడైతే కేవలం స్థూల ధనంతో సంపన్నమైన వినాశీ రాజ్యమును ప్రాప్తించుకునే రాజుల ముఖంపై కూడా ద్వాపరయుగం తర్వాత ఆ ప్రకాశము ఉన్నప్పుడు మరి ఇదైతే అవినాశీ ప్రాప్తి కదా! కావున మీ ముఖం నుండి ఎంత ఆత్మికమైన ప్రకాశము మరియు నషా కనిపించాలి! మరి ఇలా అనుభవం చేసుకుంటున్నారా లేక కేవలం అనుభవాన్ని విని సంతోషిస్తూ ఉంటారా? పాండవ సేన విశేషమైనది కదా! పాండవ సైన్యాన్ని చూసి తప్పకుండా హర్షితులవుతారు. పాండవుల విశేషత ఏమిటంటే వారిని ఎప్పుడూ సాహసవంతులుగా చూపిస్తారే కాని బలహీనులుగా కాదు. మీ స్మృతిచిహ్న చిత్రాలనైతే చూసారు కదా! చిత్రాలలో కూడా వారిని మహావీరులుగా చూపిస్తారు కదా! కావున బాప్దాదా కూడా పాండవులందరినీ విశేష రూపంగా సదా విజయులుగా, సదా బాబా తోడుగా అనగా పాండవపతి యొక్క తోడుగా, బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో సదా ఉండే విధంగా ఇదే విశేష స్మృతి యొక్క వరదానమును ఇస్తున్నారు. క్రొత్తవారు కూడా వచ్చారు కాని వారు కూడా కల్పపూర్వపు అధికారీ ఆత్మలు. కావున సదా మీ సంపూర్ణ అధికారమును పొంది తీరాలి అన్న ఈ నషా మరియు నిశ్చయములో సదా ఉండాలి. అర్థమైందా? అచ్ఛా!
సదా క్షణంలో బుద్ధిని ఏకాగ్రం చేసుకొని, సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకొని సదా సర్వశక్తులను సమయానుసారంగా ప్రయోగంలోకి తీసుకువస్తూ సదా ఒక్క బాబాలో మొత్తం ప్రపంచమంతటినీ అనుభవం చేసుకునే ఇటువంటి సంపన్నమైన మరియు సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో:-
1. అదర్ కుమారులతో:- ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మీకు లభిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యము తమకు ప్రాప్తించగలదని ఎప్పుడూ ఆశ కూడా లేదు. కాని, నిరాశలో ఉన్న ఆత్మలను బాబా ఆశావాదులుగా చేసేసారు. నిరాశ యొక్క సమయం ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇప్పుడు ప్రతి అడుగులోను మాకు సఫలత లభించి తీరుతుంది అన్న ఆశ ఉంది. ఇది జరుగుతుందో, జరగదో అన్న సంకల్పమైతే రావడం లేదు కదా! ఏ కార్యంలోనైనా అది స్వయం యొక్క పురుషార్థంలోనైనా లేక సేవలోనైనా రెండింటిలోను నిరాశతో కూడిన సంస్కారాలు సమాప్తమైపోవాలి. ఏ సంస్కారమునైనా అది కామముదైనా, లోభముదైనా, అహంకారముదైనా వాటిని మార్చడంలో నిరాశ అనేది రాకూడదు. నేను మారనే మారలేను, వీరు మారడం చాలా కష్టం అని భావించకూడదు. ఇటువంటి సంకల్పాలు కూడా కలుగకూడదు, ఎందుకంటే వాటిని మీరు ఇప్పుడు సమాప్తం చేయకపోతే మరి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇది దసరా కదా! సత్యయుగంలో దీపావళిగా అయిపోతుంది. రావణుడిని అంతం చేసే దసరా ఇప్పుడే. ఇందులో సదా విజయపు ఉల్లాస ఉత్సాహాలు ఉండాలే కాని నిరుత్సాహపు సంస్కారాలు కాదు. ఏ కష్టమైన కార్యమైనా చేయడము ఎంత సహజంగా అనుభవమవ్వాలంటే, అదేమంత పెద్ద విషయం కాదు, అనేకసార్లు ఆ కార్యమును చేసేసాము, క్రొత్త విషయమేమీ చేయడం లేదు అని అనుభవమవ్వాలి. అనేకసార్లు చేసినదానిని మళ్ళీ రిప్టీ చేస్తున్నారు, కావున సదా ఆశావాదులుగా ఉండాలి, నిరాశ యొక్క నామరూపాలు ఉండకూడదు. ఈ పరివర్తన జరుగుతుందో లేదో తెలియదు అని తమ సంకల్పాలు ఏ స్వభావ సంస్కారాలను గూర్చి కలుగకూడదు. మీరు సదాకాలిక విజయులు, అప్పుడప్పుడు విజయమును పొందేవారు కాదు. స్వప్నంలోనైనా లోపము ఉన్నట్లయితే దానిని సదాకాలికంగా సమాప్తం చేసెయ్యండి. నిరాశను సదాకాలికంగా ఆశలోకి మార్చివేయండి. నిశ్చయము అఖండంగా ఉన్నట్లయితే విజయము కూడా సదా ఉంటుంది. నిశ్చయంలో ఎప్పుడైనా ఎందుకు, ఏమి అనేది వచ్చినట్లయితే విజయము అనగా ప్రాప్తిలో కూడా ఎంతో కొంత లోపము వచ్చేస్తుంది. కావున సదా ఆశావాదులుగా, సదా విజయులుగా ఉండండి. నిరాశను సదాకాలికంగా ఆశలోకి మార్చేవారిగా అవ్వండి.
2. సదా స్వయమును సంగమ యుగపు శ్రేష్ఠ ఆత్మలుగా, పురుషోత్తమ ఆత్మలుగా, పిలక స్థానంలో ఉన్న బ్రాహ్మణులుగా, మహాన్ ఆత్మలుగా భావిస్తున్నారా? మరి ఇప్పటినుండే పురుషోత్తములుగా అయిపోయారు కదా! ప్రపంచంలో వేరే పురుషులు కూడా ఉన్నారు కాని వారి నుండి అతీతంగా బాబాకు ప్రియమైనవారిగా అయిపోయారు కావుననే పురుషోత్తములుగా అయిపోయారు. ఇతరుల మధ్య స్వయమును అలౌకికంగా భావిస్తారు కదా! సంపర్కంలో లౌకిక ఆత్మల మధ్యకు వస్తారు కాని అనేకుల మధ్య ఉంటూ కూడా నేను అలౌకికమైన మరియు అతీతమైన ఆత్మను అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు కదా! ఎందుకంటే మీరు హంసలుగా అయిపోయారు. జ్ఞానముత్యాలను గ్రోలే హోలీ హంసలు. వారు అశుద్ధమును తినే కొంగలు, వారు అశుద్ధమునే తింటారు, అశుద్ధమునే మాట్లాడుతారు. కావున కొంగల మధ్య ఉంటూ మీ హోలీ హంస జీవితమును మర్చిపోవడం లేదు కదా! ఎప్పుడూ దాని ప్రభావం పడడం లేదు కదా! నిజానికి మీ ప్రభావం వారిపై పడాలి, అంతేకాని వారి ప్రభావం మీపై కాదు. కావున సదా స్వయాన్ని హోలీ హంసలుగా భావిస్తున్నారా? హోలీ హంసలు ఎప్పుడూ బుద్ధి ద్వారా జ్ఞానముత్యాలను తప్ప ఇంకేమీ స్వీకరించజాలరు. ఉన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు, శిఖ స్థానంలో ఉన్నవారు ఎప్పుడూ క్రింద విషయాలను స్వీకరించజాలరు. కొంగలుగా ఉన్నవారు హోలీ హంసలుగా అయిపోయారు. కావున హోలీ హంసలు సదా స్వచ్ఛముగా, సదా పవిత్రంగా ఉంటారు. పవిత్రతయే స్వచ్ఛత. హంసలు సదా స్వచ్ఛంగా ఉంటాయి, సదా తెల్ల తెల్లగా ఉంటాయి. ఈ తెలుపు కూడా స్వచ్ఛత లేక పవిత్రతకు చిహ్నము. మీ వస్త్రాలు కూడా తెల్లనివే, ఇది పవిత్రతకు గుర్తు. ఏవిధమైన అపవిత్రత ఉన్నా హోలీహంసలుగా లేనట్లే, హోలీహంసలు అశుద్ధ సంకల్పాలను కూడా చేయజాలరు. సంకల్పాలే బద్ధి యొక్క భోజనము. అశుద్ధమైన లేక వ్యర్ధమైన భోజనమును తిన్నట్లయితే సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు. వ్యర్ధమైన వస్తువులను పడేయడం జరుగుతుంది, వాటిని పోగుచేసుకోవడం జరుగదు. కావున వ్యర్ధ సంకల్పాలను కూడా సమాప్తం చేయండి అటువంటివారినే హోలీ హంసలు అని అంటారు.
పాండవులతో:- పాండవులు అనగా సంకల్పము మరియు స్వప్నంలో కూడా ఓటమిని చవిచూడనివారు. పాండవులు అనగా సదా విజయులు అన్న ఈ స్లోగన్ను సదా గుర్తుంచుకోండి. స్వప్నాలు కూడా విజయంతో కూడినవే రావాలి, ఇంతగా పరివర్తన చేయాలి. ఇక్కడ కూర్చున్న మీరంతా విజయీ పాండవులు. అక్కడకు వెళ్ళి ఓడిపోయాము అనైతే ఉత్తరం వ్రాయరు కదా! మాయ రాదు, మీరే స్వయంగా దానిని పిలుస్తారు. బలహీనులుగా అవ్వడము అనగా మాయను పిలువడము. కావున ఏ విధమైన బలహీనత అయినా అది మాయను పిలుస్తుంది. కావున పాండవులు ఏమని ప్రతిజ్ఞ చేసారు? సదా విజయులుగా ఉంటాము. ఓటమి పొంది దాగి ఉండడం కాదు, సదా విజయులుగా ఉండాలి. ఇటువంటి ప్రతిజ్ఞను చేసేవారికి సదా బాప్దాదాల అభినందనలు లభిస్తూ ఉంటాయి. బాబా ఇటువంటి పిల్లల కోసం ఓహో, ఓహో అనే గీతమును గానం చేస్తూ ఉంటారు. కావున అందరూ ఓహో, ఓహో అనే గీతమును వింటారు కదా! ఓటమి చవిచూసారంటే ఆర్తనాదాలు చేస్తారు. విజయులుగా అయినట్లయితే ఓహో, ఓహో అని అంటారు. అందరూ విజయులే. మొత్తం గ్రూపులో ఓటమి చవిచూసేవారు ఒక్కరు కూడా లేరు. అచ్ఛా! ఓం శాంతి.
Comments
Post a Comment