16-12-1985 అవ్యక్త మురళి

16-12-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

"కుడిభుజాలు(రైట్హ్యాండ్స్)గా ఎలాఅవ్వాలి"

ఈ రోజు బాప్ దాదా తమ అనేక భుజాలను చూస్తున్నారు. 1. భుజాలు సదా ప్రత్యక్ష కర్మలను చేసేందుకు ఆధారము. ప్రతి ఆత్మ తన భుజాల ద్వారానే కర్మలు చేస్తుంది. 2. భుజాలను సహయోగానికి గుర్తుగా వర్ణిస్తారు. సహయోగీ ఆత్మను కుడి భుజం (రైట్ హ్యాండ్) అని అంటారు. 3. భుజాలను శక్తి రూపంగా కూడా చూపించడం జరుగుతుంది. అందుకే బాహుబలమని అంటారు. భుజాలకు ఎన్నో విశేషతలున్నాయి. 4. భుజాలు అనగా చేతులు, స్నేహానికి గుర్తు. కావున ఎప్పుడైనా స్నేహపూర్వకంగా కలిసినప్పుడు పరస్పరం చేతులు కలుపుతారు. భుజాల విశేష స్వరూపము - సంకల్పాలను కర్మలలో ప్రత్యక్షం చేయడమని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. మీరందరూ తండ్రికి భుజాలు. కనుక ఈ నాలుగు విశేషతలు స్వయంలో కనిపిస్తున్నాయా? ఈ నాలుగు విశేషతల ద్వారా "నేను ఎటువంటి భుజాన్ని?" అని మిమ్ములను మీరు తెలుసుకోగలరు. అందరూ భుజాలే, కానీ కుడి భుజాలా లేక ఎడమ భుజాలా అన్నది ఈ విశేషతల ద్వారా పరిశీలించుకోండి.

మొదటి విషయం - తండ్రి యొక్క ప్రతి శ్రేష్ఠ సంకల్పాన్ని, వాక్కును, కర్మలో అనగా ప్రత్యక్ష జీవితంలోకి ఎంతవరకు తీసుకొచ్చారు? అందరి కర్మ ప్రత్యక్షంగా సహజంగా కనిపిస్తుంది. కర్మలను అందరూ చూడగలరు, అంతేకాక సహజంగా తెలుసుకోగలరు లేక కర్మ ద్వారా అనుభవం చేసుకోగలరు. అందుకే అందరూ "చెప్పడమైతే అందరూ చెప్తారు కానీ చేసి చూపించండి" అని అంటారు. ప్రత్యక్షంగా కర్మలో చూసినప్పుడే వీరు చెప్పేది నిజమని నమ్ముతారు. కావున కర్మలు, సంకల్పాలతో పాటుగా మాటలను కూడా ప్రత్యక్ష ప్రమాణ రూపంలో స్పష్టం చేస్తాయి. అటువంటి రైట్ హ్యాండ్స్ లేక కుడి భుజాలు ప్రతి కర్మ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నాయా? కుడి భుజాల విశేషత ఏమిటంటే వాటి ద్వారా సదా శుభమైన, శ్రేష్ఠమైన కర్మలే జరుగుతాయి. కుడి భుజాల కర్మల వేగము ఎడమ కంటే తీవ్రంగా ఉంటుంది. కనుక ఈ విధంగా పరిశీలించుకోండి - సదా శుభమైన మరియు శ్రేష్ఠమైన కర్మలు తీవ్ర వేగంతో జరుగుతున్నాయా? మీరు శ్రేష్ఠ కర్మధారులైన కుడి భుజాలేనా? ఈ విశేషతలు లేకుంటే స్వతహాగానే ఎడమ భుజాలుగా అయిపోతారు. ఎందుకంటే ఉన్నతోన్నతులైన తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ఉన్నతోన్నతమైన కర్మలే నిమిత్తంగా అవుతాయి. ఆత్మిక దృష్టి ద్వారా లేక మీ సంతోషభరితమైన ఆత్మికత నిండిన ముఖము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ఇవి కూడా కర్మలే. మరి ఇటువంటి శ్రేష్ఠ కర్మధారులుగా అయ్యారా?

ఇదే విధంగా భుజాలు అనగా సహయోగానికి గుర్తు. కావున అన్ని వేళలా తండ్రి కర్తవ్యంలో సహయోగులుగా ఉన్నామా? అని పరిశీలించుకోండి. తనువు, మనసు, ధనము మూడింటి ద్వారా కూడా సదా సహయోగులుగా ఉన్నామా లేక అప్పుడప్పుడు మాత్రమే సహయోగులుగా ఉన్నామా? ఎలాగైతే లౌకిక కార్యంలో కూడా కొందరు ఫుల్ టైమ్ పని చేసేవారుంటారు, కొందరు కొంత సమయం కొరకే చేసేవారుంటారు. వారి మధ్య తేడా అయితే ఉంటుంది కదా! అందువలన అప్పుడప్పుడు సహయోగులుగా ఎవరైతే ఉంటారో వారు పొందే ప్రాప్తికి, సదాకాలము సహయోగులుగా ఉండేవారు పొందే ప్రాప్తికి తేడా ఉంటుంది. సమయం లభిస్తే, ఉత్సాహము కలిగితే లేక ఎప్పుడైతే మూడ్ వస్తుందో అప్పుడు సహయోగులుగా అవుతారు. లేకుంటే సహయోగులుగా అయ్యేందుకు బదులు వియోగులుగా అయిపోతారు. కనుక మూడు రూపాలతో అనగా తనువు, మనస్సు, ధనము అన్ని రూపాలలో సంపూర్ణ సహయోగులుగా అయ్యామా లేక అసంపూర్ణంగా అయ్యామా అని పరిశీలించుకోండి. దేహము, దేహ సంబంధాలు మొదలైన వాటి వైపుకు మీ తనువు, మనసు, ధనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారా? లేక తండ్రి శ్రేష్ఠ కార్యంలో వినియోగిస్తున్నారా? దేహ సంబంధాల ప్రవృత్తి ఎంతగా ఉంటుందో అంతగానే మీ దేహానికి చెందిన ప్రవృత్తి కూడా చాలా పెద్దది. చాలా మంది పిల్లలు సంబంధాల ప్రవృత్తి నుండి దూరమయ్యారు, కానీ సమయాన్ని, సంకల్పాలను, ధనమును, ఈశ్వరీయ కార్యంలో కంటే దేహ ప్రవృత్తిలో ఎక్కువగా వినియోగిస్తారు. తమ దేహ ప్రవృత్తికి చెందిన గృహస్థం కూడా పెద్ద వల వంటిది. ఈ వల నుండి అతీతంగా ఉన్నవారినే కుడి భుజాలని అంటారు. బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా పిలువబడేందుకు అధికారులుగా అయ్యారు, కేవలం దీనిని మాత్రమే సదాకాలానికి సహయోగమని అనరు. ఈ రెండు ప్రవృత్తుల నుండి అతీతంగా మరియు తండ్రి కార్యానికి ప్రియమైనవారిగా ఉండాలి. దేహ ప్రవృత్తికి చెందిన నిర్వచనం చాలా విస్తారమైనది. దానిని గురించి కూడా ఇంకెప్పుడైనా స్పష్టం చేస్తాము. కానీ ఎంతవరకు సహయోగులుగా అయ్యాము అని మిమ్ములను మీరు పరిశీలించుకోండి!

మూడవ విషయము - భుజాలు స్నేహానికి గుర్తు. స్నేహమనగా మిలనము. ఎలాగైతే దేహధారులైన ఆత్మల దైహిక మిలనము చేతిలో చేయి కలపడం ద్వారా జరుగుతుందో, అలాగే కుడి భుజాలుగా ఉన్నవారి గుర్తు - సంకల్పాలలో మిలనము, మాటలలో మిలనము మరియు సంస్కారాలలో మిలనము. తండ్రి సంకల్పాలే కుడి భుజాల సంకల్పాలుగా ఉంటాయి. తండ్రికి వ్యర్థ సంకల్పాలు ఉండవు. సదా సమర్థ సంకల్పాలు వారికి గుర్తు. తండ్రి మాటల వలె సదా సుఖవంతముగా, సదా మధురంగా, సదా మహావాక్యాలుగా ఉండాలి, సాధారణ మాటలు ఉండకూడదు. సదా అవ్యక్త భావము ఉండాలి, ఆత్మిక భావము ఉండాలి. వ్యక్త భావంతో కూడిన మాటలు ఉండకూడదు. దీనిని స్నేహము అనగా మిలనము అని అంటారు. అలాగే సంస్కార మిలనము. తండ్రి సంస్కారాలు సదా ఉదారచిత్తంగా, కళ్యాణకారిగా, నిస్వార్థంగా ఉంటాయి, ఇలా విస్తారమైతే ఎంతో ఉంది. సార రూపంలో తండ్రి సంస్కారాలేవైతే ఉన్నాయో అవి రైట్ హ్యాండ్ పిల్లల సంస్కారాలుగా ఉంటాయి. కావున ఇలా సమానంగా అవ్వడం అనగా స్నేహీగా అవ్వడం, ఇది ఎంతవరకు ఉంది? అని పరిశీలించుకోండి.

నాల్గవ విషయం - భుజాలు అనగా శక్తి. ఎంతవరకు శక్తిశాలిగా అయ్యాము? సంకల్పాలు శక్తిశాలిగా, దృష్టి, వృత్తి శక్తిశాలిగా ఎంతవరకు అయ్యాయి? వీటిని కూడా పరిశీలించుకోండి. శక్తిశాలి సంకల్పాలు, దృష్టి, వృత్తి ఉన్నదానికి గుర్తు - వారు శక్తిశాలిగా ఉన్న కారణంగా ఎవరినైనా పరివర్తన చేసేస్తారు. సంకల్పము ద్వారా శ్రేష్ఠమైన సృష్టిని రచిస్తారు. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేస్తారు. దృష్టి ద్వారా అశరీరి ఆత్మ స్వరూపాన్ని అనుభవం చేయిస్తారు. కావున మీరు ఇటువంటి శక్తిశాలి భుజాలేనా లేక బలహీనంగా ఉన్నారా? ఒకవేళ బలహీనతలు ఉన్నాయంటే ఎడమ భుజాలుగా అవుతారు. కుడి భుజాలని ఎవరిని అంటారో ఇప్పుడు అర్థం చేసుకున్నారా? నిజానికి అందరూ భుజాలే కానీ మీరు ఏ భుజాలో ఈ విశేషతల ద్వారా స్వయాన్ని తెలుసుకోండి. మీరు కుడి భుజాలు కారని ఇతరులు ఎవరైనా అంటే నిరూపించేందుకు ప్రయత్నిస్తారు, మొండిగా మాట్లాడ్తారు కూడా! కనుక మిమ్ములను మీరు ఎవరో, ఎలా ఉన్నారో, అలా తెలుసుకోండి, ఎందుకంటే ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు ఇంకా కొద్దిగా సమయం ఉంది. నిర్లక్ష్యములోకి వచ్చి నేను సరిగ్గానే ఉన్నానని నడిపించేయకండి. మనసు తింటూ కూడా ఉంటుంది. కానీ అభిమానము మరియు నిర్లక్ష్యము పరివర్తన చేయించి ముందుకు వెళ్లనివ్వవు, అందుకే వీటి నుండి ముక్తులుగా అవ్వండి. మిమ్ములను మీరు యథార్థ రీతిగా పరిశీలించుకోండి. ఇందులోనే స్వ కళ్యాణము నిండి ఉంది. అర్థమయిందా? అచ్ఛా.

సదా స్వ పరివర్తనలో, స్వ చింతనలో ఉండేవారికి, సదా స్వయంలో సర్వ విశేషతలను పరిశీలించుకొని సంపన్నులుగా అయ్యేవారికి, సదా రెండు పవృత్తుల నుండి అతీతంగా, తండ్రితో మరియు తండ్రి కార్యంతో ప్రియంగా ఉండేవారికి, అభిమానము మరియు నిర్లక్ష్యము నుండి సదా ముక్తులుగా ఉండేవారికి, ఇటువంటి తీవ్ర పురుషార్థులైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:- సదా స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా అనుభవం చేసుకుంటున్నారా? స్వదర్శన చక్రము మాయ కలిగించే అనేక రకాల వలయాలను సమాప్తం చేసేస్తుంది. మాయ చక్రాలు అనేకము ఉన్నాయి మరియు తండ్రి ఆ చక్రాల నుండి విడిపించి విజయులుగా చేసేస్తారు. స్వదర్శన చక్రము ముందు మాయ నిలువలేదు - ఇటువంటి అనుభవీలుగా ఉన్నారా? బాప్ దాదా రోజూ ఇదే టైటిల్ తో ప్రియస్మృతులు కూడా తెలియజేస్తారు. ఇదే స్మృతి ద్వారా సదా సమర్థులుగా ఉండండి. సదా స్వయాన్ని దర్శించుకుంటూ ఉంటే శక్తిశాలిగా అవుతారు. కల్ప-కల్పము యొక్క శ్రేష్ఠ ఆత్మలుగా ఉండేవారిమి మరియు ఉన్నాము అని, ఇప్పుడు స్మృతిలో ఉంటే మాయాజీతులుగా అయినట్లే. సదా జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకొని, ఆ సంతోషములో ఉండండి. సంతోషము అనేక రకాలైన దుఃఖాలను మరిపింపజేస్తుంది. ప్రపంచము దుఃఖధామములో ఉంది మరియు మీరందరూ సంగమయుగ వాసులుగా అయ్యారు. ఇది కూడా భాగ్యమే.

2. సదా పవిత్రతా శక్తి ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకొని ఇతరులకు కూడా పావనంగా అయ్యే ప్రేరణ ఇచ్చేవారు కదా? ఇంట్లో గృహస్థంలో ఉంటూ పవిత్ర ఆత్మగా అవ్వడం, ఈ విశేషతను ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయాలి. ఇటువంటి సాహసవంతులుగా అయ్యారా! మేము పావన ఆత్మలము అన్న స్మృతి ద్వారా స్వయం పరిపక్వంగా అయి ప్రపంచానికి కూడా ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తూ ముందుకు వెళ్లండి. మీరు ఎటువంటి ఆత్మలు? అసంభవాన్ని సంభవము చేసి చూపించేందుకు నిమిత్తమైన ఆత్మను, పవిత్రతా శక్తిని వ్యాపింపజేసే ఆత్మను. ఇది సదా స్మృతిలో ఉంచుకోండి.

3. కుమారులు సదా స్వయాన్ని మాయాజీత్ కుమారులుగా భావిస్తున్నారా? మాయతో ఓడిపోయేవారు కాదు, సదా మాయను ఓడించేవారు. మీరు ఇటువంటి శక్తిశాలి సాహసవంతులే కదా! ఎవరైతే సాహసం కలిగి ఉంటారో వారికి స్వయం మాయ కూడా భయపడుతుంది. సాహసవంతుల ముందు మాయ ఎప్పుడూ ధైర్యము చేయలేదు. ఏ విధమైన బలహీనతనైనా చూసినప్పుడు మాయ వస్తుంది. సాహసవంతులు అనగా సదా మాయాజీతులు. మాయ రాలేదు, ఇటువంటి ఛాలెంజ్ చేసేవారు కదా! అందరూ ముందుకు వెళ్లేవారే కదా! అందరూ స్వయాన్ని సేవకు నిమిత్తంగా అనగా సదా విశ్వకళ్యాణకారులుగా భావిస్తూ ముందుకు వెళ్లేవారు! విశ్వకళ్యాణకారులు అనంతంలో ఉంటారు, వారు హద్దులోకి రారు. హద్దులోకి రావడం అనగా సత్యమైన సేవాధారులు కారు. అనంతంలో ఉండడం అనగా తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలా ఉండడం. తండ్రిని అనుసరించే శ్రేష్ఠ కుమారులము, సదా ఈ స్మృతిలోనే ఉండండి. ఎలాగైతే తండ్రి సంపన్నులో, అనంతంలో ఉన్నారో అలా తండ్రి సమానంగా సంపన్నమైన, సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మను - ఈ స్మృతి ద్వారా వ్యర్థము సమాప్తమైపోతుంది. సమర్థులుగా అయిపోతారు. అచ్ఛా.

అవ్యక్తమురళీలనుండిఎన్నుకోబడినపశ్నోత్తరాలు

ప్రశ్న:- ఏ విశేష గుణము సంపూర్ణ స్థితిని ప్రత్యక్షం చేస్తుంది? ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణ స్థితికి చేరుకుంటుందో అప్పుడు దాని ప్రాక్టికల్ కర్మలో ఏ గాయనము జరుగుతుంది ?

జవాబు:- సమానత. నింద - స్తుతి, జయము - పరాజయము, సుఖము - దుఃఖము అన్నింటిలో సమానత ఉంటే, దానినే సంపూర్ణత యొక్క స్థితి అని అంటారు. దుఃఖంలో కూడా ముఖము లేక మస్తకము పై దుఃఖము యొక్క అలకు బదులుగా సుఖము లేక హర్షితము నిండిన అల కనిపించాలి. నిందించే వారి పట్ల కూడా ఏమాత్రమూ దృష్టిలో, వృత్తిలో తేడా రాకూడదు. సదా కళ్యాణకారి దృష్టి, శుభచింతక వృత్తి ఉండాలి. ఇదే సమానత.

ప్రశ్న:- స్వయం ఆనందంగా ఉండే మరియు బాప్ దాదా నుండి ఆనందం పొందే సాధనమేది?

జవాబు:- సదా బ్యాలెన్సు సరిగ్గా ఉన్నట్లయితే తండ్రి నుండి ఆనందం లభిస్తూ ఉంటుంది. మహిమ వింటున్నా మహిమ యొక్క నశా ఎక్కరాదు, గ్లాని వింటున్నా ద్వేష భావము ఉత్పన్నమవ్వరాదు. ఎప్పుడైతే రెండింటిలో బ్యాలెన్సు సరిగ్గా ఉంటుందో, అప్పుడు అది అద్భుతము మరియు స్వయానికి స్వయము సంతుష్టత అనుభవమవుతుంది.

ప్రశ్న:- మీది ప్రవృత్తి మార్గము, కనుక ఏ రెండు-రెండు విషయాలలో బ్యాలెన్సు ఉంచడం అవసరము?

జవాబు:- ఎలాగైతే ఆత్మ మరియు శరీరము రెండు ఉన్నాయి, తండ్రి మరియు దాదా కూడా ఇద్దరున్నారు. ఇరువురి కర్తవ్యం ద్వారా విశ్వపరివర్తన జరుగుతుంది. అలాగే రెండు-రెండు విషయాలలో బ్యాలెన్సు ఉంచినట్లయితే శ్రేష్ఠ ప్రాప్తిని చేసుకోగలరు. 1. అతీతము మరియు ప్రియము 2. మహిమ మరియు నింద 3. స్నేహము మరియు శక్తి 4. ధర్మము మరియు కర్మ 5. ఏకాంతవాసి మరియు రమణీకత 6. గంభీరత మరియు కలుపుగోలుతనము..... ఇలా అనేక రకాల బ్యాలెన్సు ఎప్పుడైతే సమానమవుతుందో అప్పుడు సంపూర్ణతకు సమీపంగా రాగలరు. ఒకటి మర్జ్ గా ఉండి రెండవది ఇమర్జ్ అవ్వడం - ఇలా ఉండరాదు, దీని ప్రభావం పడదు.

ప్రశ్న:- ఏ విషయంలో సమానత తీసుకురావాలి? ఏ విషయంలో తీసుకురాకూడదు?

జవాబు:- శ్రేష్ఠతలో సమానత తీసుకురావాలి, సాధారణతలో కాదు. ఏ విధంగా కర్మలు శ్రేష్ఠంగా ఉండాలో అదే విధంగా ధారణ కూడా శ్రేష్ఠంగా ఉండాలి. ధారణ కర్మను మర్జ్ చేయకూడదు. ధర్మము మరియు కర్మ రెండూ శ్రేష్ఠతలో సమానంగా ఉన్నప్పుడే ధర్మాత్మ అని అంటారు. అటువంటి ధర్మాత్మగా అయ్యామా? అటువంటి కర్మయోగిగా అయ్యామా? అలా ఆనందమయంగా అయ్యామా? అని తమను తాము ప్రశ్నించుకోండి.

ప్రశ్న:- బుద్ధిలో ఒకవేళ ఏదైనా అలజడి ఉన్నట్లయితే దానికి కారణమేమిటి ?

జవాబు:- దానికి కారణం సంపన్నతలో లోటు. ఏ వస్తువైనా నిండుగా ఉన్నట్లయితే దాని మధ్యలో ఎప్పుడూ అలజడి రాదు. కావున మిమ్మల్ని మీరు ఏదైనా అలజడి నుండి రక్షించుకునేందుకు సంపన్నంగా అవుతూ ఉన్నట్లయితే సంపూర్ణంగా అయిపోతారు. ఏదైనా వస్తువు సంపన్నంగా ఉంటే తనకు తానే ఆకర్షిస్తుంది. సంపూర్ణతలో ప్రభావము యొక్క శక్తి ఉంటుంది. కావున తమలో ఎంతగా సంపూర్ణత ఉంటుందో అంతగా అనేక ఆత్మలు స్వతహాగా ఆకర్షితమవుతాయి.

ప్రశ్న:- దేహీ-అభిమాని యొక్క సూక్ష్మ స్థితి ఏమిటి ?

జవాబు:- దేహీ అభిమానిగా ఎవరైతే ఉంటారో, వారికి ఏ విషయంలోనైనా సూచన లభించినట్లయితే ఆ సూచనను వర్తమానము మరియు భవిష్యత్తు రెండిటి కొరకు ఉన్నతికి సాధనంగా భావించి ఆ సూచనను ఇముడ్చుకుంటారు లేక సహిస్తారు. సూక్ష్మంగా కూడా వారి దృష్టి వృత్తిలో ఏమిటి? ఎలా? అనే అలజడి ఉత్పన్నమవ్వదు. ఏ విధంగా మహిమను వినే సమయంలో ఆ ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో, అలానే ఏదైనా శిక్షణ లేక సూచన ఇచ్చిన వారి పట్ల కూడా అదే విధంగా స్నేహము మరియు శుభచింతక భావన ఉండాలి. అచ్ఛా. ఓంశాంతి.

Comments