15-03-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' శ్రమ నుండి విడుదల అయ్యేందుకు సహజ సాధనము నిరాకార స్వరూప స్థితి ''
బాప్దాదా పిల్లల పై ఉన్న స్నేహం కారణంగా వాచాకు అతీతంగా ఉన్న నిర్వాణ స్థితి నుండి వాచాలోకి వస్తారు. ఎందుకు? పిల్లలను తన సమానంగా నిర్వాణ స్థితిని అనుభవం చేయించేందుకు, నిశ్శబ్ధమైన, మధురమైన ఇంటికి తీసుకెళ్లేందుకు. నిర్వాణ స్థితి అనగా నిర్వికల్ప స్థితి. నిర్వాణ స్థితి అనగా నిర్వికార స్థితి. నిర్వాణ స్థితి నుండి నిరాకారి, నిరాకారి నుండి సాకార స్వరూపధారిగా అయ్యి వాచాలోకి వస్తారు. సాకారంలోకి వచ్చినా నిరాకారి స్వరూప స్మృతి వారి స్మృతిలో ఉంటుంది. నేను నిరాకారుడను, సాకార(శరీరం) ఆధారంతో మాట్లాడ్తున్నానని స్మృతి ఉంటుంది. సాకారంలో కూడా నిరాకార స్థితి స్మృతి ఉన్నప్పుడు దానిని నిరాకారము సాకారము ద్వారా వాచాలోకి, కర్మలోకి రావడం అని అంటారు. అసలు స్వరూపం నిరాకారము. సాకారము ఆధారంగా ఉంటుంది. ఈ డబల్స్మృతి నిరాకారము నుండి సాకార శక్తిశాలి స్థితిగా ఉంటుంది. సాకారాన్ని ఆధారంగా తీసుకుంటూ నిరాకార స్వరూపాన్ని మర్చిపోకండి. మర్చిపోతున్నారు అందువలన స్మృతి చేసే శ్రమ చెయ్యవలసి వస్తుంది. ఎలాగైతే లౌకిక జీవితంలో నేను ఫలానా లేక ఈ సమయంలో ఫలానా కార్యము చేస్తున్నానని తమ శారీరిక స్వరూపం స్వతహాగానే సదా గుర్తుంటుంది. ఎలాగైతే కార్యము మారుతుంది కాని నేను ఫలానా అనేది మారదో, మర్చిపోరో అలా నేను నిరాకార ఆత్మను అని అసలు స్వరూపము ఏ కార్యము చేస్తున్నా స్వతహాగా, సదా గుర్తుండాలి. నేను నిరాకార ఆత్మను అని ఒకసారి స్మృతిలోకి వచ్చింది, పరిచయము కూడా లభించింది. పరిచయం అనగా జ్ఞానం. కావున జ్ఞాన శక్తి ద్వారా స్వరూపాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఎలా మర్చిపోగలరు? జ్ఞాన శక్తి వలన శరీర భ్రాంతి మరిపించినా మర్చిపోలేరు. కనుక ఈ ఆత్మిక స్వరూపాన్ని ఎలా మర్చిపోగలరు? కావున స్వయంతో స్వయం ప్రశ్నించుకోండి, అభ్యాసం చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూ నిరాకారము నుండి సాకారం ఆధారంతో ఈ పని చేస్తున్నానా అని పరిశీలించుకోండి. అప్పుడు స్వతహాగానే నిర్వికల్ప స్థితి, నిరాకార స్థితి, నిర్విఘ్న స్థితి సహజంగా ఉంటుంది. శ్రమ నుండి విడుదల అవుతారు. మాటి మాటికి మర్చిపోతే శ్రమ అనిపిస్తుంది. తర్వాత స్మృతి చేసే శమ చేస్తారు. అసలు ఎందుకు మర్చిపోతారు, మర్చిపోవాలా? మీరు ఎవరు అని బాప్దాదా అడుగుతారు. సాకారులా, నిరాకారులా? నిరాకారులే కదా? నిరాకారులు. అయినా ఎందుకు మర్చిపోతారు? అసలు స్వరూపము మర్చిపోవుటకు ఆధారం గుర్తుంటుందా? ఏం చేస్తున్నాను అని స్వయం పైనే నవ్వు రావడం లేదా? ఇప్పుడు నవ్వు వస్తుంది కదా? అసలు స్వరూపాన్ని మర్చిపోయి నకిలీ వస్తువు జ్ఞాపకం వస్తుంది. బాప్దాదాకు అప్పుడప్పుడు పిల్లలను చూసి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. స్వయాన్ని మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? స్వయాన్ని మరచి బాధపడ్తారు(కలవరపడ్తారు). తండ్రిని స్నేహంతో నిరాకారం నుండి సాకారంలోకి ఆహ్వానం చేసి తీసుకొస్తారు. కావున ఎవరితో స్నేహం ఉందో వారిలా నిరాకారులగుట కష్టమా? మాస్టర్సర్వశక్తివంతులు సర్వ శక్తులకు యజమానులుగా ఉంటారు. ఏ శక్తిని ఏ సమయంలో శుభ సంకల్పంతో ఆహ్వానించినా ఆ శక్తి యజమానులైన మీ ముందు ప్రత్యక్షంగా ఉంటుంది. ఇలాంటి యజమానులు ఎవరికైతే సర్వ శక్తులు సేవాధారులుగా ఉన్నాయో వారు శ్రమ చేస్తారా? లేక శుభ సంకల్పంతో ఆర్డర్చేస్తారా? ఏం చేస్తారు? రాజులుగా ఉన్నారా లేక ప్రజలుగా ఉన్నారా? అక్కడ కూడా యోగ్యులైన పిల్లలను ఏమంటారు? రాజా పిల్లలని అంటారు కదా! కావున మీరు ఎవరు? రాజులుగా అయ్యే పిల్లలా లేక అధీనులుగా అయ్యే పిల్లలా? అధికారి ఆత్మలుగా ఉన్నారు కదా! ఈ శక్తులు, ఈ గుణాలు అన్నీ మీకు సేవాధారులు. ఆహ్వానించండి, అవి ప్రత్యక్షమవుతాయి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శక్తిశాలి శస్త్రము ఉన్నప్పటికి బలహీనత కారణంగా ఓడిపోతారు. మీరు బలహీనమైనవారా? మహావీర్పిల్లలుగా ఉన్నారు కదా! సర్వశక్తివంతుని పిల్లలు బలహీనంగా ఉంటే అందరూ ఏమంటారు? బాగుంటుందా? కాబట్టి ఆహ్వానించండి. ఆర్డర్చెయ్యడం నేర్చుకోండి. కాని సేవాధారి ఎవరి ఆజ్ఞను అంగీకరిస్తారు? ఎవరైతే యజమానులుగా ఉంటారో వారి ఆజ్ఞను అంగీకరిస్తారు. యజమాని స్వయం సేవాధారిగా అయ్యారు. ఎందుకంటే శ్రమ చేసేవారు సేవాధారులే కదా! మానసిక శ్రమ నుండి ఇప్పుడు విడుదల అయ్యారు. యజ్ఞ సేవ కొరకు చేసే శారీరిక శ్రమ వేరు. వారు కూడా యజ్ఞ సేవకు గల మహత్వాన్ని తెలుసుకుంటే కష్టమనిపించదు. మధువనంలో సంపర్కంలో ఉన్న ఆత్మలు వచ్చి, ఇంతమంది సంఖ్యలో ఆత్మల భోజనం ఎలా తయారవుతుందో, అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో చూసినప్పుడు ఇంత కష్టమైన పని ఎలా చేస్తున్నారో అని చూసి చూసి అర్థం చేసుకుంటారు. ఇంత పెద్ద కార్యము ఎలా జరుగుతూ ఉందని వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాని చేసేవారు ఇంత పెద్ద కార్యాన్ని కూడా ఏమని భావిస్తారు? సేవకు మహత్వమున్న కారణంగా వారికి ఒక ఆటగా అనిపిస్తుంది, కష్టమనిపించదు. ఇలాంటి మహత్వం కారణంగా, తండ్రితో ప్రేమ ఉన్న కారణంగా శ్రమ రూపము మారిపోతుంది. ఈ విధంగా మానసిక శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సమయం వచ్చింది. ద్వాపరయుగం నుండి వెతికే, పరితపించే, పిలిచే మానసిక శ్రమ చేస్తూ వచ్చారు. మానసిక శ్రమ కారణంగా ధనం సంపాదించేందుకు కూడా శ్రమ పెరుగుతూ వచ్చింది. ఈ రోజు ఎవరిని అడిగినా ఏమంటారు? ధనం సంపాదించడం పిన్నమ్మ ఇల్లు కాదని అంటారు. మానసిక శ్రమ వలన ధన సంపాదనకు కూడా శ్రమ పెరిగింది. తనువైతే రోగిగా అయిపోయింది. అందువలన శారీరిక కార్యంలో కూడా శ్రమ(కష్టము), మనసుకు కూడా కష్టము, ధనానికి కూడా కష్టము కలుగుతూ ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ రోజు కుటుంబాలలో ప్రేమ నిభాయించడంలో కూడా కష్టముంది. ఒకసారి ఒకరు అలుగుతారు, ఇంకొకసారి ఇంకొకరు..... తర్వాత వారిని ఓదార్చే కష్టంలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు నీ వారిగా ఉంటారు, రేపు నీ వారిగా ఉండరు. విబేధం వస్తుంది. కావున అన్ని రకాల శ్రమ చేసి అలిసిపోయారు కదా! తనువుతో, మనసుతో, ధనంతో, సంబంధంతో అన్నిటితో అలిసిపోయారు.
బాప్దాదా మొదట మానసిక శ్రమను సమాప్తి చేసేస్తారు, ఎందుకంటే మనసు బీజము కదా. మానసిక శ్రమ, తనువు ధనాల శ్రమను అనుభవం చేయిస్తుంది. మనసు సరిగ్గా లేనప్పుడు ఏ కార్యము చేయాలన్నా, ఈ రోజు ఇది జరగదని అంటారు. రోగం ఉండదు కాని నాకు 103 జ్వరము ఉందని అంటారు. కావున మానసిక శ్రమ శారీరిక శ్రమను అనుభవం చేయిస్తుంది. ధనంలో కూడా ఇలాగే ఉంటుంది. మనసు కొంచెం బాగలేకపోయినా చాలా పని చెయ్యవలసి వస్తుందని అంటారు. సంపాదించడం చాలా కష్టము, వాయుమండలం చెడిపోయిందని అంటారు మరియు మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఇది ఏమంత పెద్ద విషయము కాదని అంటారు. పని అదే ఉంటుంది కాని మానసిక శ్రమ ధనమును గురించిన శ్రమను కూడా అనుభవం చేయిస్తుంది. మానసిక బహీనత వాయుమండల బలహీనతలోకి తీసుకొస్తుంది. బాప్దాదా పిల్లల మానసిక శ్రమను చూడలేరు. 63 జన్మలు కష్టపడ్డారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ సంతోషాల జన్మ. ప్రేమను అనుభవించే జన్మ, ప్రాప్తులు పొందే జన్మ, వరదానాల జన్మ, సహాయం తీసుకునే, సహాయం లభించే జన్మ. అయినా ఈ జన్మలో కూడా కష్టమెందుకు చేస్తారు? ఇప్పుడు కష్టాన్ని ప్రేమలోకి పరివర్తన చెయ్యండి. మహత్వంతో శ్రమను సమాప్తి చెయ్యండి.
ఈ రోజు బాప్దాదా పరస్పరం పిల్లల శ్రమ పై చాలా సంభాషిస్తున్నారు. ఏం చేస్తారు? బాప్దాదా నవ్వుతూ ఉన్నారు. మానసిక శ్రమకు కారణం ఏమవుతుంది, ఏం చేస్తారు? వంకర టింకర పిల్లలకు జన్మనిస్తారు. వారికి ఒకప్పుడు ముఖము ఉండదు, ఒకప్పుడు కాళ్లు ఉండవు, ఒకప్పుడు చేతులు ఉండవు. ఇలా వ్యర్థ వంశావళికి చాలా జన్మనిస్తారు. అంతేకాక దేనినైతే రచించారో దానినేం చేస్తారు? దానిని పాలించిన కారణంగా కష్టము చెయ్యవలసి వస్తుంది. ఇలాంటి రచన రచించిన కారణంగా ఎక్కువ శ్రమ చేసి అలసిపోతారు. అంతేకాక వ్యాకులపడ్తారు కూడా. చాలా కష్టమనిపిస్తుంది. మంచిదే కాని చాలా కష్టమని అంటారు. విడిచిపెట్టాలని కూడా ఉండదు, ఎగరాలని కూడా ఉండదు. కావున ఏం చెయ్యవలసి వస్తుంది? నడవాల్సి వస్తుంది. నడిచేందుకు తప్పకుండా శ్రమ కలుగుతుంది కదా. అందువలన ఇప్పుడు బలహీన రచనను సమాప్తి చేసినట్లయితే మానసిక శ్రమ నుండి విడుదల అవుతారు. తర్వాత నవ్వు వచ్చే విషయం ఏం చెప్తారు? ఇలాంటి రచన ఎందుకు చేస్తారని తండ్రి అంటారు. ఈ రోజులలో మనుష్యులు కూడా ఏం చెయ్యాలి, అన్నీ ఈశ్వరుడే ఇస్తాడని అంటారు కదా. మొత్తం దోషమంతా ఈశ్వరుని పై వేస్తారు. ఇలాంటి ఈ వ్యర్థ రచనను గురించి ఏం చెప్తారు? మేము కోరుకోవడం లేదు కాని మాయ వచ్చేస్తుంది. మేము కోరుకోవడం లేదు కాని జరిగిపోతుందని అంటారు. అందువలన సర్వశక్తివంతుడైన తండ్రికి పిల్లలైన మీరు యజమానులుగా అవ్వండి. రాజులుగా అవ్వండి. బలహీనత అనగా అధీనమైన ప్రజలు. యజమాని అనగా శక్తిశాలి రాజు. కావున యజమానిగా అయ్యి ఆహ్వానించండి. స్వ స్థితి అనే శ్రేష్ఠ సింహాసనం పై కూర్చోండి. సింహాసనం పై కూర్చొని శక్తులనే సేవాధారులను ఆహ్వానించండి, ఆజ్ఞాపించండి. మీ సేవాధారులు మీ ఆజ్ఞ పై నడవకుండా ఉండడం జరగదు. తర్వాత ఏం చెయ్యాలి? అని అనరు కదా. సహన శక్తి లేని కారణంగా శ్రమ చెయ్యవలసి వస్తుంది. ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉన్నందున ఇలా జరిగింది. మీ సేవాధారులు సమయానికి కార్యంలోకి రాకపోతే వారు సేవాధారులెలా అవుతారు? కార్యం పూర్తి అయిన తర్వాత సేవాధారులు వస్తే ఏమవుతుంది? ఎవరికైతే సమయం కొరకు మహత్వం ఉంటుందో వారి సేవాధారులు కూడా సమయ మహత్వం తెలుసుకొని హాజరవువుతారు. ఏ శక్తి లేక గుణము అయినా సమయానికి ప్రత్యక్షమవ్వకపోతే యజమానికి సమయ మహత్వం లేదని ఋజువవుతుంది. ఏం చెయ్యాలి? సింహాసనం పై కూర్చోవడం మంచిదా లేక శ్రమ చేయడం మంచిదా? ఇప్పుడు ఇంత సమయమిచ్చే అవసరం లేదు. శ్రమ చేయడం మంచిదా లేక యజమానిగా అవ్వడం మంచిదనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? వినిపించాను కదా! దీని కొరకు కేవలం ఈ ఒక్క అభ్యాసము సదా చేస్తూ ఉండండి. ''నిరాకారము నుండి సాకార శరీరం ఆధారముతో ఈ పని చేస్తున్నాను.'' మీరు చేసేవారిగా అయ్యి మీ కర్మేంద్రియాలతో చేయించండి. తమ నిరాకార వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే వాస్తవిక స్వరూపం యొక్క గుణాలు, శక్తులు స్వతహాగానే ఉత్పన్నమౌతాయి. ఎలాంటి స్వరూపం ఉంటే అలాంటి గుణాలు, శక్తులు స్వతహాగానే కర్మలోకి వచ్చేస్తాయి. కన్య తల్గిగా అయినప్పుడు తల్లి స్వరూపంలో సేవా భావము, త్యాగము, స్నేహము, అలసట లేని సేవ మొదలైన గుణాలు, శక్తులు స్వతహాగానే ప్రత్యక్షం అవుతాయి కదా! కావున అనాది, అవినాశి స్వరూపం స్మృతిలో ఉన్నందున స్వతహాగానే ఈ గుణాలు మరియు శక్తులు ఎమర్జ్అవుతాయి. స్వరూపం యొక్క స్మృతి స్థితిని స్వత:గానే తయారు చేస్తుంది. ఏం చెయ్యాలో అర్థమయిందా! కష్టము లేక శ్రమ అనే మాటను జీవితంలో సమాప్తి చేయండి. శ్రమ కారణంగా కష్టమనిపిస్తుంది. శ్రమ సమాప్తమైతే కష్టము అనే శబ్ధము కూడా స్వతహాగానే సమాప్తమవుతుంది. మంచిది.
సదా కష్టాన్ని సహజంగా చేసుకునేవారు, శమ్రను పేమ్రలోకి మార్చుకునేవారు, సదా స్వ స్వరూప స్మృతి ద్వారా శేష్ఠ్ర శక్తులు మరియు గుణాలను అనుభవం చేసేవారు, సదా తండి స్నేహానికి బదులు ఇచ్చేవారు, తండి సమానంగా తయారయ్యేవారు, సదా శేష్ఠ్ర స్మృతి అనే శేష్ఠ్ర ఆసనం పై స్థితులై యజమానిగా అయ్యి సేవాధారుల ద్వారా కార్యము చేయించే రాజా పిల్లలు, యజమానులుగా అయ్యే పిల్లలు - ఇటువంటి వారికి బాప్దాదా పియ్ర స్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత కలయిక (విదేశీ సోదర-సోదరీలతో) :- 1. సేవ తండ్రి తోడును అనుభవం చేయిస్తుంది. సేవకు వెళ్లడమంటే సదా తండ్రి జతలో ఉండటం. సాకార రూపంలో ఉండవచ్చు, ఆకార రూపంలో ఉండవచ్చు కానీ సేవాధారి పిల్లల జతలో తండ్రి సదా తోడుగానే ఉంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు. అయితే స్వయం ఏం చేస్తున్నారు? నిమిత్తంగా అయ్యి ఆట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే అనుభవం అవుతూ ఉంది కదా? ఇలాంటి సేవాధారులు సఫలతకు అధికారులుగా అవుతారు. సఫలత జన్మ సిద్ధ అధికారము. సఫలత సదా మహాన్పుణ్యాత్మగా అయ్యే అనుభవం చేయిస్తుంది. మహాన్పుణ్యాత్మలుగా అయ్యేవారికి అనేకమంది ఆత్మల ఆశీర్వాదాల లిఫ్ట్లభిస్తుంది. మంచిది.
ఇప్పుడైతే అందరి నోటి నుండి ''ఒక్కరే, ఒక్కటే'' అనే పాట వెలువడే రోజు కూడా రానున్నది. డ్రామాలో ఇదే పాత్ర మిగిలి ఉంది. ఇది జరుగుతూనే సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత్రను సమీపానికి తీసుకురావాలి. దీని కొరకు అనుభవం చేయించడమే విశేష ఆకర్షణకు సాధనము. జ్ఞానం వినిపిస్తూ ఉండండి, అనుభవం చేయిస్తూ ఉండండి. జ్ఞానం కేవలం విన్నందున సంతుష్టంగా అవ్వరు కాని జ్ఞానం వినిపిస్తూ అనుభవం కూడా చేయిస్తూ ఉంటే జ్ఞానానికి కూడా మహత్వం ఉంటుంది అంతేకాక ప్రాప్తి కారణంగా పోను పోను ఉత్సాహంలోకి కూడా వచ్చేస్తారు. వారందరి ఉపన్యాసాలు కేవలం జ్ఞానవంతంగా ఉంటాయి. మీ ఉపన్యాసాలు కేవలం జ్ఞానవంతమే కాదు, అనుభవం చేయించే అథారిటీ గలవిగా ఉండాలి. అనుభవాల అథారిటీతో మాట్లాడ్తూ అనుభవం చేయిస్తూ ఉండండి. కొంతమంది మంచి ఉపన్యాసకులు ఉంటారు. వారు మాట్లాడుతూ ఏడిపిస్తారు, నవ్విస్తారు కూడా. శాంతిలోకి, సైలెన్సులోకి కూడా తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వాతావరణాన్ని హాలులో తయారు చేస్తారు. అదంతా తాత్కాలికము. వారు చెయ్యగలిగినప్పుడు మాస్టర్సర్వశక్తివంతులైన మీరు చేయలేనిదేముంది? ఎవరైనా శాంతి అని మాట్లాడితే శాంతి వాతావరణం ఉండాలి. ఆనందం గురించి మాట్లాడితే ఆనందం కలిగించే వాతావరణం ఉండాలి. ఇలాంటి అనుభూతి చేయించే ఉపన్యాసాలు ప్రత్యక్షతా జెండాను ఎగిరేస్తాయి. ఏదో ఒక విశేషత చూస్తారు కదా! మంచిది - సమయం స్వతహాగానే శక్తులు నింపుతూ ఉంది. అంతా అయ్యే ఉంది, కేవలం రిపీట్చెయ్యాలి.
వీడ్కోలు తీసుకునే సమయంలో దాది జానకిగారితో బాప్దాదా కలయిక :-
చూసి చూసి సంతోషిస్తూ ఉంటావు! అందరికంటే ఎక్కువ సంతోషం అనన్య పిల్లలకు ఉంటుంది కదా! వారు సదా సంతోషాల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. సుఖసాగరంలో సర్వ ప్రాప్తుల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. వారు ఇతరులను కూడా అదే సాగరంలో ఓలలాడేలా చేస్తారు. రోజంతా ఏం చేస్తారు? ఎవరికైనా సాగరంలో స్నానం చేయడం రాకపోతే ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని స్నానం చేయిస్తారు కదా! ఈ పనే చేస్తున్నారు. సుఖంలో ఓలలాడించండి, సంతోషంలో ఓలలాడించండి..... ఇలా చేస్తూ ఉన్నారు కదా! బిజీగా ఉండే మంచి పని లభించింది. ఎంత బిజీగా ఉంటున్నారు! సమయం ఉందా? ఇందులోనే సదా బిజీగా ఉన్నారు. కనుక ఇతరులు కూడా మిమ్ములను చూసి అనుసరిస్తారు. స్మృతి మరియు సేవ తప్ప ఇంకేమీ కనిపించదు. స్వత:గానే బుద్ధి స్మృతి మరియు సేవలోకి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్లజాలదు. నడిపించాల్సిన అవసరం ఉండదు. నడుస్తూనే ఉంటుంది. దీనినే నేర్చుకొని, నేర్పిస్తున్నారని అంటారు. మంచి పని ఇచ్చారు కదా! తండ్రి తెలివిగలవారిగా తయారు చేసి వెళ్లారు కదా! బలహీనంగా తెలివి తక్కువగా వదిలిపెట్టి వెళ్లలేదు కదా! తెలివిగలవారిగా చేసి స్థానం ఇచ్చి వెళ్లారు కదా! తోడుగా అయితే ఉండమే ఉన్నారు కానీ నిమిత్తంగా అయితే చేశారు కదా. తెలిగలవారిగా చేసి సీటు ఇచ్చారు. సీటు ఇచ్చే ఆచారం ఇక్కడ నుండే మొదలయింది. సేవ చేసే సింహాసనం లేక సేవకు సీటు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు సాక్షిగా అయ్యి పిల్లలు ఎలా మున్ముందుకు వెళ్తున్నారో చూస్తున్నారు. తోడుకు తోడుగా కూడా ఉన్నారు, సాక్షికి సాక్షిగా కూడా ఉన్నారు. రెండు పాత్రలూ అభినయిస్తున్నారు. సాకార రూపంలో సాక్షి అని అంటారు. అవ్యక్త రూపంలో జతగా(తోడుగా) ఉన్నారని అంటారు. రెండు పాత్రలూ అభినయిస్తున్నారు. మంచిది.
Comments
Post a Comment