14-12-1983 అవ్యక్త మురళి

14-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

''ప్రభు పరివారము సర్వ శ్రేష్ఠ పరివారము ''

ఈ రోజు బాప్ దాదా తన శ్రేష్ఠమైన బ్రాహ్మణ పరివారాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణ పరివారము ఎంత ఉన్నతోన్నతమైన పరివారమో అందరూ బాగా తెలుసుకున్నారా? బాప్ దాదా అన్నింటికంటే ముందు పరివారమనే ప్రియమైన సంబంధములోకి తీసుకొచ్చారు. కేవలం శ్రేష్ఠ ఆత్మవు అనే జ్ఞానం ఇవ్వలేదు కానీ దానితో పాటు నా పిల్లలని అన్నారు. కనుక తండ్రి మరియు పిల్లల సంబంధంలోకి తీసుకొచ్చారు. ఈ సంబంధంలోకి రావడం వలన పరస్పరంలో కూడా సోదరీ-సోదరుల పవిత్ర సంబంధం జోడింపబడింది. బాప్ దాదా సోదరీ - సోదరుల సంబంధం జోడించిన తర్వాత ఏమయింది? ప్రభు పరివారంగా అయ్యారు. సాకార రూపంలో డైరెక్టుగా ప్రభు పరివారములో వారసులుగా అయ్యి వారసత్వానికి అధికారులుగా అవుతామని ఎప్పుడైనా మీ భాగ్యం గురించి స్వప్నంలో అయినా అనుకున్నారా? తండ్రికి వారసులుగా అవ్వడం అన్నింటికంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన భాగ్యము. స్వయం తండ్రి పిల్లలైన మన కొరకు మన వలె సాకార రూపం ధరించి తండ్రి మరియు పిల్లలుగా లేక సర్వ సంబంధాల అనుభవం చేయిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? సాకార రూపంలో ప్రభుపాలన తీసుకుంటామని సంకల్పంలో ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు అనుభవం చేస్తున్నారు కదా. ప్రభు పరివారంగా అయిన తర్వాతనే ఇవన్నీ అనుభవం చేసుకునే భాగ్యం ప్రాప్తించింది. కావున ఎంత ఉన్నతమైన పరివారానికి అధికారీ పిల్లలుగా అయ్యారు, ఎంత గొప్ప పవిత్ర పాలనలో పాలింపబడుతున్నారు! ఎలాంటి అలౌకిక ప్రాప్తుల ఊయలలో ఊగుతున్నారు! ఇవన్నీ అనుభవం చేస్తున్నారు కదా! పరివారం మారిపోయింది, యుగం మారిపోయింది, ధర్మం, కర్మ అన్నీ మారిపోయాయి. యుగ పరివర్తన అవ్వడం వలన దు:ఖ ప్రపంచం నుండి సుఖాల ప్రపంచంలోకి వచ్చేశారు. సాధారణ ఆత్మ నుండి పురుషోత్తములుగా అయ్యారు. 63 జన్మలు బురదలో ఉన్నారు, కాని ఇప్పుడు బురదలో కమలంగా అయ్యారు. ప్రభు పరివారంలోకి రావడం అనగా జన్నజన్మాంతరాల కొరకు భాగ్య రేఖలు శ్రేష్ఠంగా తయారవ్వడం. ప్రభు పరివారము, పరివారము అనగా యుద్ధానికి అతీతంగా అయ్యారు. ఎప్పుడూ ప్రభువు పిల్లల పైన యుద్ధము (మాయ) జరగజాలదు. ప్రభు పరివారంగా అయ్యారు, సదా కాలము కొరకు సర్వ ప్రాప్తుల భండారము సంపన్నంగా అయింది. ప్రకృతి కూడా ప్రభు పిల్లలైన మీకు దాసిగా అయ్యి సేవ చేయునట్లు మాస్టర్సర్వ శక్తివంతులుగా అయ్యారు. ప్రకృతి ప్రభు పరివారం అయిన మిమ్ములను శ్రేష్ఠంగా భావించి మీపైన జన్మజన్మాంతరాల కొరకు వింజామరము ఊపుతూ ఉంటుంది (విసనకఱ్ఱలాగా విసురుతూ ఉండేది). శ్రేష్ఠ ఆత్మలను స్వాగతం చేయునప్పుడు గౌరవంగా వింజామరము ఊపుతారు కదా! ప్రకృతి సదాకాలం కొరకు గౌరవం ఇస్తూ ఉంటుంది. ప్రభు పరివారంతో ఇప్పుటికీ సర్వ ఆత్మలకు స్నేహముంది. ఆ స్నేహము ఆధారంతోనే ఇప్పటి వరకు మహిమ చేస్తూ, పూజలు చేస్తూ ఉంటారు. ప్రభు పరివారము యొక్క చరిత్రలను ఇప్పటికీ ఎంతో గొప్ప స్మృతి చిహ్న శాస్త్రమైన భాగవతాన్ని ప్రేమతో వింటూ మరియు వినిపిస్తూ ఉంటారు. ప్రభు పరివారం యొక్క శిక్షకులు (టీచరు) మరియు ఈశ్వరీయ విద్యార్థి జీవితం గురించి, చదువు యొక్క స్మృతి చిహ్న శాస్త్రమైన గీతను ఎంతో పవిత్రతతో విధి పూర్వకంగా వింటూ, వినిపిస్తూ ఉంటారు. ప్రభు పరివారం యొక్క స్మృతి చిహ్నము ఆకాశంలో కూడా సూర్యుడు, చంద్రుడు మరియు అదృష్ట నక్షత్రాల రూపంలో జరుపుకుంటూ, పూజిస్తూ ఉంటారు. ప్రభు పరివారము తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. ఇలాంటి సింహాసనం ప్రభు పరివారానికి తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించ జాలదు. ఇదే ప్రభు పరివారము యొక్క విశేషత. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరూ సింహాసనాధికారులుగా అవుతారు. ఏ ఇతర రాజ్య పరివారంలో కూడా పిల్లలందరూ సింహాసనాధికారులుగా అవ్వరు. కానీ ప్రభువు పిల్లలందరూ అధికారులుగానే ఉంటారు. అందరూ ఇమిడిపోగల ఇంత శ్రేష్ఠమైన, పెద్ద సింహాసనాన్ని మొత్తం కల్పంలో ఎప్పుడైనా చూశారా? ప్రభు పరివారము ఎటువంటి పరివారమంటే ఇందులో అందరూ స్వరాజ్యాధికారులుగా ఉంటారు. అందరినీ రాజులుగా తయారు చేస్తారు. జన్మ తీసుకుంటూనే స్వరాజ్య తిలకము బాప్ దాదా పిల్లలందరికీ ఇస్తారు. ప్రజలుగా అయ్యే తిలకమునివ్వరు. రాజ్య తిలకమునిస్తారు. మహిమ కూడా రాజ్య తిలకానికే ఉంది కదా! రాజ్య తిలక మహోత్సవ దినము విశేషంగా జరపబడ్తుంది. మీరందరూ తమ రాజ్య తిలక మహోత్సవ దినాన్ని జరుపుకున్నారా లేక ఇప్పుడు జరుపుకోవాలా? జరుపుకున్నారు కదా! సంతోషానికి గుర్తు, భాగ్యానికి గుర్తు, సంకటాలు దూరమైనందుకు గుర్తుగా తిలకం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఏ కార్యము చేసేందుకు వెళ్ళినా కార్యం సఫలమయ్యేందుకు వారి కుటుంబంవారు వారికి తిలకం దిద్ది (పెట్టి) పంపిస్తారు. మీ అందరికీ తిలకం పెట్టబడే ఉంది కదా! తిలకధారీ, సింహాసనధారీ విశ్వకళ్యాణ కిరీటధారిగా అయిపోయారు కదా! భవిష్యత్కిరీటం మరియు తిలకం ఈ జన్మ ప్రాప్తి యొక్క ప్రాలబ్ధమే. విశేష ప్రాప్తిని చేసుకునే సమయము లేక ప్రాప్తుల గని ప్రాప్తి అయ్యే సమయము ఇదే. ఇప్పుడు లేకపోతే భవిష్య ప్రాలబ్ధం కూడా ఉండదు. దాత పిల్లలకు, వరదాత పిల్లలకు ఏ వస్తువు కూడా అప్రాప్తిగా లేదనే గాయనము ఈ జీవితానిదే. అయినా భవిష్యత్తులో (సత్యయుగంలో) ఒక్క అప్రాప్తి అయితే ఉంటుంది కదా. అదేమంటే తండ్రితో మిలనము ఉండదు కదా! కావున సర్వ ప్రాప్తుల జీవితమే ఈశ్వరీయ పరివారము. ఇలాంటి పరివారములోకి చేరుకున్నారు కదా! ఇంత ఉన్నతమైన పరివారానికి చెందినవారమని భావిస్తున్నారు కదా! ఈశ్వరీయ పరివారం గురించి మహిమ చేసినట్లయితే అనేక రాత్రులు - పగళ్లు గడిచిపోతాయి. భక్తులకు కీర్తనలు పాడుతూ-పాడుతూ ఎన్నో రాత్రులు మరియు పగళ్లు గడిచిపోతాయో చూడండి. ఇప్పటి వరకు ఇంకా పాడుతూనే ఉన్నారు. ఇలాంటి నశా మరియు సంతోషం సదా ఉంటుందా? 'నేను ఎవరు?' ఈ ప్రశ్న సదా జ్ఞాపకం ఉంటుందా? విస్మృతి మరియు స్మృతుల చక్రంలోకి అయితే రావడం లేదు కదా! చక్రం నుండి అయితే విడుదల అయ్యారు కదా! స్వదర్శన చక్రధారిగా కావడం అనగా అనేక హద్దు చక్రాల నుండి విముక్తి కావడము. ఇలా అయ్యారు కదా! అందరూ స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు కదా! మాస్టర్లుగా ఉన్నారు కదా! మాస్టర్గా ఉన్నవారికి అన్నీ తెలుసు. రోజూ అమృతవేళ 'నేను ఎవరు' అని స్మృతిలో ఉంచుకుంటే సదా సమర్థంగా ఉంటారు. మంచిది.

బాప్ దాదా బేహద్ పరివారాన్ని చూస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన పరివారానికి అనంతమైన ప్రియస్మృతులు తెలుపుతున్నారు. సదా శ్రేష్ఠ పరివారము యొక్క నశాలో ఉండేవారు, ప్రభు పరివార మహత్వాన్ని తెలుసుకొని మహాన్ గా అయ్యేవారికి, సర్వ ప్రాప్తుల భండారాన్ని శ్రేష్ఠ రాజ్య భాగ్యాన్ని ప్రప్తి చేసుకునే ప్రభు రత్నాలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

(గయానా నుండి వచ్చిన అంకుల్ మరియు ఆంటీతో) :- సేవాధారులైన పిల్లలను బాప్ దాదా కలుసుకోవడంతో పాటుగా స్వాగతం చేస్తున్నారు. క్షణక్షణం ఎంతగా జ్ఞాపకం చేస్తూ వచ్చారో దానికి బదులుగా బాప్ దాదా నయనాల రెప్పలలో ఇముడ్చుకున్న పిల్లలకు స్వాగతిస్తున్నారు. ఒక్క తండ్రి గుణాలను పాడే పిల్లలను చూసి బాప్ దాదా కూడా పిల్లల విశేషతల గుణాలను గానం చేస్తారు, పాడుతూ ఉంటారు. ప్రతిరోజూ, ప్రతిక్షణం పాటలు పాడుకుంటూనే ఉంటారు కదా! పిల్లలు పాడుతున్నప్పుడు తండ్రి ఏమి చేస్తారు? ఎవరైనా మంచి పాటలు పాడుతూ ఉంటే వినేవాళ్ళు ఏం చేస్తారు? కోరుకోకపోయినా నాట్యం చేయడం మొదలు పెడ్తారు. నాట్యం చెయ్యడం వచ్చినా, రాకున్నా కూర్చుంటూ కూర్చుంటూనే నాట్యం చెయ్యడం ప్రారంభిస్తారు. కనుక పిల్లలు స్నేహంతో పాటలు పాడుతూ ఉంటే బాప్ దాదా కూడా సంతోషంతో నాట్యం చేస్తారు కదా! అందువలన శంకరుని డాన్స్చాలా ప్రసిద్ధి చెందింది. సేవ కూడా నాట్యం చేయడం లాంటిదే కదా! ఏ సమయంలో సేవ చేస్తారో ఆ సమయంలో మనసు ఏమి చేస్తుంది? నాట్యం చేస్తుంది కదా! కావున సేవ చేయడం కూడా నాట్యం చెయ్యడమే అవుతుంది. మంచిది.

బాప్ దాదా సదా పిల్లలలోని విశేషమైన విశేషతలను చూస్తారు. జన్మ తీసుకుంటూనే విశేషమైన మూడు తిలకాలు బాప్ దాదా ద్వారా లభించాయి. అవి ఏవి? కిరీటం, సింహాసనం అయితే ఉండనే ఉన్నాయి. కానీ మూడు తిలకాలు విశేషమైనవి. ఒకటి, స్వరాజ్య తిలకం. ఇది లభించే ఉంది. రెండవది, జన్మిస్తూనే సేవాధారిగా అయ్యే తిలకం లభించింది. మూడవది, జన్మిస్తూనే సర్వ పరివారానికి, బాప్ దాదాకు స్నేహం మరియు సహయోగం ఇచ్చే తిలకం లభించింది. ఈ మూడు తిలకాలు జన్మిస్తూనే లభించాయి కదా! కనుక త్రిమూర్తి తిలకధారులుగా అయ్యారు. స్వయాన్ని సదా ఇలాంటి విశేష సేవాధారులుగా భావిస్తున్నారా? అనేకమంది ఆత్మలకు ఉత్సాహ - ఉల్లాసాలు ఇప్పించేందుకు నిమిత్తంగా అయ్యే సేవ డ్రామాలో లభించి ఉంది. మంచిది. పిల్లలు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, తండ్రి కూడా పిల్లలను అంతగా స్మృతి చేస్తారు. అన్నింటికంటే ఎక్కువగా అఖండ అవినాశీ తండ్రి స్మృతిలో ఉన్నారా? పిల్లలు ఇతర కార్యాలలో కూడా బిజీగా అవుతారు కానీ తండ్రికైతే ఇదే పని ఉంటుంది. అమృతవేళ నుండి అందరినీ మేల్కొలిపే పని ప్రారంభిస్తారు. ఎంతమంది పిల్లలను మేల్కొల్పవలసి వస్తుందో చూడండి. అంతేకాక దేశ విదేశాలలో ఒక స్థానంలో కూడా కాదు, అయినా రోజంతా ఏం చేస్తుంటారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు.

పిల్లల తర్వాత భక్తులను మేల్కొల్పుతాను, తర్వాత సైన్సు వాళ్ళకు ప్రేరణనిస్తాను. పిల్లలందరి పాలన పోషణ చూడవలసి వస్తుంది. జ్ఞానులు కావచ్చు అజ్ఞానులు కావచ్చు కాని అనేక రకాల సహయోగులు ఉన్నారు కదా! ఎన్ని రకాల పిల్లల సేవ ఉంది! అందరికంటే ఎక్కువ బిజీగా ఎవరు ఉన్నారు? కేవలం శరీర బంధనం లేదు అనే తేడా ఒక్కటే ఉంది. ఇప్పుడు కొంచెం సమయంలో మీరందరూ తండ్రి సమానంగా తప్పకుండా తయారవుతారు. మూలవతనంలో ఉంటారు. అందరి ఈ ఆశ కూడా పూర్తి అవుతుంది. మంచిది.

మధువన నివాసులతో :- మధువన నివాసుల మహిమ అయితే తెలుసు కదా! మధువనం యొక్క మహిమయే మధువన నివాసుల మహిమ. ప్రతిక్షణం సమీపంగా సాకారంలో ఉండటం, దీనికంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? గడప దగ్గర కూర్చున్నారు, ఇంట్లో కూర్చొన్నారు, హృదయంలో కూర్చున్నారు. మధువన నివాసులు కష్టపడవలసిన అవసరంలేదు. యోగం చెయ్యవలసిన అవసరమేమైనా ఉందా? యోగం జోడింపబడే ఉంటుంది. యోగం కుదిరిన వారికి యోగం జోడించే అవసరం లేదు. స్వత: యోగిగా, నిరంతర యోగిగా ఉంటారు. ఎలాగైతే రైలులో ఇంజన్తగిలించబడే ఉండి, అన్ని డబ్బాలు పట్టాల పైననే ఉన్నట్లయితే స్వత:గానే నడుస్తూ ఉంటాయో, నడిపించాల్సిన అవసరం ఉండదో అలాగే మీరు కూడా మధువన పట్టాలపై ఉన్నారు. ఇంజన్ తగిలించబడే ఉంది కనుక స్వత:గానే నడుస్తూ ఉంటారు. మధువన నివాసులు అనగా మాయాజీత్లు. మాయ వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరైతే తండ్రి ఆకర్షణలో ఉంటారో వారు సదా మాయాజీత్లుగా ఉంటారు. మాయ చేసే ప్రయత్నం దూరం నుండే సమాప్తమైపోతుంది. సేవ అయితే అందరూ చాలా బాగా చేస్తారు. సేవ కొరకు ఒక ఉదాహరణ మూర్తిగా ఉండాలి. ఎవరు ఎక్కడైనా నలువైపులా సేవలలో కొంచెం క్రిిందకు-పైకి అవుతున్నట్లయితే మధువనం వారి ఉదాహరణనే ఇస్తారు. మధువనంలో అలసటలేని సేవను ఎంతో ప్రేమతో తమ ఇల్లు అని భావించి చేస్తారు. ఇది అందరూ అంగీకరిస్తారు. సేవలో అందరూ నెంబర్ వన్ గా ఎలా ఉన్నారో 100 మార్కులు తీసుకున్నారో అలాగే అన్ని సబ్జెక్ట్లలోను 100 మార్కులు కావాలి. మీరు బోర్డుపైన హెల్త్(ఆరోగ్యం), వెల్త్(సంపద), హాపీనెస్(సంతోషము) మూడు లభిస్తాయని వ్రాస్తారు కదా! కావున ఇక్కడ కూడా అన్ని సబ్జెక్టులలో మార్కులు రావాలి. అందరికంటే ఎక్కువగా మధువనం వారే వింటారు. మొట్టమొదటి తాజా సరుకు మధువనం వారే తింటారు. ఇతరులు ఒక టర్న్లో ఒక్కసారి మాత్రమే విశేషంగా బ్రహ్మభోజనం తింటారు. మీరు అయితే రోజూ తింటారు. సూక్ష్మ భోజనం, స్థూల భోజనం అన్నీ మీకు వేడిగా తాజాగా లభిస్తాయి. మంచిది.

కొత్త తయారీలు (ఏర్పాట్లు) ఏమి చేస్తున్నారు? ఇంటిని మంచిగా ప్రేమతో అలంకరిస్తున్నారు. మధువనం వారి విశేషత ఏమంటే ప్రతిసారీ ఏదో ఒక క్రొత్త ఎడిషన్(కలపడం) జరుగుతుంది. ఎలాగైతే స్థూలంగా నవీనతను చూస్తారో అలా చైతన్యంలో కూడా ప్రతిసారీ నవీనతను చూసి ఈ సారి మధువనంలో విశేషంగా ఈ ప్రాప్తి కలిగించే అలను చూశాము అని వర్ణన చెయ్యాలి. భిన్న భిన్న అలలు (అనుభవాలు) ఉన్నాయి కదా! ఒకప్పుడు విశేషమైన ఆనందం కలిగించే అలగా ఉండాలి, ఒకసారి ప్రేమ, ఒకసారి జ్ఞాన విశేషతల అలలు..... ఇలా ప్రతి ఒక్కరికీ ఇదే అల కనిపించాలి. ఉదాహరణానికి సముద్రం అలలలోకి ఎవరైనా వెళ్తే అలలలో తేలియాడాల్సే ఉంటుంది, లేకపోతే మునిగిపోతారు. కావున ఈ అలలు స్పష్టంగా కనిపించాలి. ఈ కాన్ఫరెన్సులో విశేషంగా ఏం చేస్తారు? వి.ఐ.పి.లు వస్తారు, పేపర్ వాళ్ళు వస్తారు, వర్క్షాపులు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి కాని మీరందరూ విశేషంగా ఏం చేస్తారు? ఎలాగైతే స్థూల దిల్వాడా ఉంది కదా. దాని విశేషత ఏమిటి? ప్రతి ఒక్క గది యొక్క డిజైన్ వేరు వేరుగా ఉంది. ప్రతి గదికి తనదైన విశేషత ఉంది. ఈ మందిరము అన్ని మందిరాల కంటే భిన్నమైనది. విగ్రహాలైతే వేరే మందిరాలలో కూడా ఉంటాయి. కాని ఈ మందిరములో ఎక్కడికెెళ్ళినా అక్కడ విశేషమైన శిల్ప నైపుణ్యము కనిపిస్తుంది. అలా చైతన్య దిల్వాడా మందిరములో కూడా ప్రతి మూర్తిలో తమ తమ విశేషత కనిపించాలి. ఎవరిని చూసినా వారిలో ఒకరి విశేషత కంటే మరొకరి విశేషమైన విశేషత కనిపించాలి. ఎలాగైతే అక్కడ చేసినవారు అద్భుతంగా తయారు చేశారని అంటారో అలా ఇక్కడ ఒక్కొక్కరి అద్భుతమైన విశేషతను వర్ణించాలి. మీరు ఈ విషయం గురించి మీటింగ్(సమావేశము) జరపండి. ఇదేమంత పెద్ద విషయము కాదు, చేయగలరు. ఉదాహరణానికి సత్యయుగములో దేవతలు కేవలం నిమిత్త మాత్రంగా టీచరు ద్వారా కొద్దిగా వింటారు కాని వారి స్మృతి (జ్ఞాపకశక్తి) చాలా తీక్షణంగా ఉంటుంది. కంఠస్థం చేసే కష్టం చెయ్యాల్సిన అవసరముండదు. విన్నదే కేవలం తాజాగా అవుతున్నట్లు ఉంటుంది. మధువనం వారు ఇదంతా చేసే ఉన్నారు. ఇది కేవలం కొద్దిగా దృఢ సంకల్పం చేయమని సూచించేందుకు మాత్రమే. సంకల్పాలు కూడా చాలా మంచి మంచివే చేస్తారు కాని అందులో దృఢతను పదేపదే అండర్ లైన్ చేయండి. అచ్ఛా.

Comments