13-01-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
స్వదర్శన చక్రధారియే చక్రవర్తీ రాజ్యభాగ్యమునకు అధికారి.
అందరూ స్వయమును స్వదర్శన చక్రధారులుగా భావిస్తున్నారా? స్వదర్శన చక్రధారులే భవిష్యత్తులో చక్రవర్తీ రాజ్యభాగ్యమునకు అధికారులుగా అవుతారు. స్వదర్శన చక్రధారులు అనగా మొత్తం చక్రం లోపల తమ అన్నిరకాల భిన్న భిన్న పాత్రలను తెలుసుకున్నవారు. మేమందరము ఈ చక్రం లోపల హీరో పాత్రను అభినయించే విశేష ఆత్మలము అని అందరూ తెలుసుకున్నారు. ఈ అంతిమ జన్మలో వజ్రతుల్య జీవితమును తయారుచేసుకోవడం ద్వారా మొత్తం కల్పంలో హీరో పాత్రను అభినయించేవారిగా అయిపోతారు. ఆది నుండి అంతిమంవరకు ఏయే జన్మలు తీసుకున్నారు అన్నదంతా స్మృతిలో ఉందా? ఎందుకంటే ఈ సమయంలో నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. ఈ సమయంలోనే మీ అన్ని జన్మలను తెలుసుకోగలరు. కావున ఐదువేల సంవత్సరాల ఈ జన్మపత్రిని తెలుసుకున్నారు. జన్మపత్రిని తయారుచేసేవారు ఎవరైనా, ఎవరికైనా 2-4-6 జన్మలవరకే వినిపిస్తారు కాని మీ అందరికీ బాప్ దాదా అన్ని జన్మల జన్మపత్రిని తెలియజేశారు. కావున మీరందరూ మాస్టర్ జ్ఞానస్వరూపులుగా అయిపోయారు కదా! మొత్తం లెక్కనంతటినీ చిత్రాలలో కూడా చూపించేసారు. కావున తప్పకుండా మీకు తెలుసు కావుననే చిత్రాలలో చూపించారు కదా! మీ జన్మపత్రి యొక్క చిత్రాన్ని చూశారా? ఆ చిత్రాన్ని చూసి ఇది మా జన్మపత్రి యొక్క చిత్రమే అని భావిస్తున్నారా లేక జ్ఞానమును వినిపించే చిత్రము అని భావిస్తున్నారా? విశేష ఆత్మలమయిన మేము సృష్టి ఆది నుండి అంతిమం వరకు ఉన్న పాత్రను అభినయిస్తాము అన్న నషా అయితే ఉంది కదా! బ్రహ్మాబాబాతో పాటు సృష్టి ఆది పిత మరియు ఆది మాతతోపాటు మొత్తం కల్పంలో భిన్న భిన్న పాత్రలను పోషిస్తూ వచ్చారు కదా! బ్రహ్మాబాబాతో పాటు మొత్తం కల్పపు ప్రీతి యొక్క విధానమును నిర్వర్తించేవారే కదా! నిర్వాణంలోకి వెళ్ళే కోరిక కలవారైతే కాదు కదా! ఎవరైతే ఆదిని చూడలేదో వారు ఏం చూసినట్లు! మీరందరూ సృష్టి ఆది యొక్క ఆ స్వర్ణిమ దృశ్యాన్ని ఎన్నిసార్లు చూసారు! ఆ సమయము, ఆ రాజ్యము, ఆ మన స్వరూపము, ఆ సర్వ సంపన్న జీవితము మంచిగా గుర్తున్నాయా లేక గుర్తుచేయించవలసిన అవసరం ఉందా? మీ ఆది జన్మ అనగా మొదటి జన్మను మరియు ఇప్పుటి ఈ చివరి జన్మను రెండింటి మహత్వమును మంచిగా తెలుసుకున్నారు కదా! ఈ రెండింటి మహిమ అపారమైనది!
ఏ విధంగా ఆదిదేవుడైన బ్రహ్మ మరియు ఆది ఆత్మ అయిన శ్రీకృష్ణుడు ఇరువురి మధ్య తేడాను చూపిస్తారో మరియు ఇరువురిని ఏ విధంగా తోడు తోడుగా చూపిస్తారో అలాగే మీరందరూ కూడా మీ బ్రాహ్మణ స్వరూపమును మరియు దేవతా స్వరూపమును రెండింటినీ మీ ముందు ఉంచుకుంటూ ఆది నుండి అంతిమం వరకు మేము ఎంత శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నాము అని పరిశీలించుకోండి. అప్పుడిక ఎంతో నషా మరియు సంతోషం ఉంటుంది. తయారుచేసేవారు మరియు తయారయ్యేవారు ఇరువురి విశేషతా ఉంది. బాప్ దాదా పిల్లలందరి యొక్క ఈ రెండు స్వరూపాలను చూసి హర్షితులవుతారు. నెంబర్ వారీగా ఉన్నాకాని అందరూ దేవాత్మలుగా అయితే అవుతారు కదా! దేవతలను పూజ్యులుగా, శ్రేష్ఠులుగా, ఉన్నతోన్నతులుగా అందరూ అంగీకరిస్తారు. చివరి నెంబరులోని దేవ ఆత్మ అయినా కాని పూజ్య ఆత్మల లిస్టులో ఉంటారు. అర్ధకల్పం రాజ్యభాగ్యాన్ని పొందారు మరియు అర్ధకల్పం మాననీయులుగా మరియు పూజ్యనీయులుగా మరియు శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు. మీ చిత్రాల పూజను, మాన్యతను చైతన్య రూపంలో, బ్రాహ్మణ రూపంలో దేవ రూపపు స్మృతిచిహ్నాలను ఇప్పుడు కూడా చూస్తున్నారు. కావున దీని కన్నా శ్రేష్ఠంగా ఇంకేమైనా ఉండగలదా! సదా ఈ స్మృతి స్వరూపంలో స్థితులై ఉండండి. ఆ తర్వాత పదే పదే కింది స్థితి నుండి పై స్థితిలోకి వెళ్ళే శ్రమ పడవలసిన అవసరం ఉండదు.
అందరూ ఎక్కడి నుండి వచ్చినా ఈ సమయంలో మధువన నివాసులే. కావున మధువన నివాసులు అందరూ సహజంగా స్మృతి స్వరూపులుగా అయిపోయారు కదా! మధువన నివాసులుగా అవ్వడం కూడా భాగ్యవంతుల చిహ్నము. ఎందుకంటే మధువన ద్వారంలోనికి రావడం మరియు వరదానమును సదాకాలికంగా పొందడం. స్థానానికి కూడా మహత్వము ఉంది. మధువన నివాసులు వరదానీ స్వరూపంలో స్థితులై ఉన్నారు కదా! సంపన్న స్థితిని అనుభవం చేసుకుంటున్నారు కదా! సంపన్న స్వరూపంలో సదా సంతోషంలో నాట్యం చేస్తారు మరియు బాబా గుణాలను గానం చేస్తారు. మీరు ఎటువంటి సంతోషంలో నాట్యంచేస్తూ ఉండాలంటే మిమ్మల్ని చూసి ఇతరుల మనస్సు కూడా స్వతహాగానే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. ఏవిధంగా స్థూలమైన నాట్యమును చూసి ఇతరులలో కూడా నాట్యం చేసే ఉత్సాహము ఉత్పన్నమవుతుందో అలా సదా నాట్యం చేయండి మరియు గానం చేస్తూ ఉండండి. అచ్ఛా!
డబుల్ విదేశీయులైన పిల్లలకు ఈ అవకాశం కూడా విశేషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలాకాలం తర్వాత కలిసారు. ఎప్పుడైతే డబుల్ విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువగా అయిపోతుందో అప్పుడు ఇక ఏం చేస్తారు? ఏ విధంగా భారతవాసులైన పిల్లలు డబుల్ విదేశీయులకు అవకాశమునిచ్చారో అలా మీరు కూడా ఇతరులకు అవకాశమును ఇస్తారు కదా! ఇతరుల సంతోషంలో తమ సంతోషమును అనుభవం చేసుకోవడమే మహాదానులుగా అవ్వడం.
Comments
Post a Comment