12-12-1983 అవ్యక్త మురళి

12-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

'' ఏకాగ్రత ద్వారా సర్వశక్తుల ప్రాప్తి ''

ఈ రోజు అందరూ మిలనము జరుపుకోవాలి(బాబాను కలవాలి) అన్న ఒకే శుద్ధ సంకల్పంలో స్థితులై ఉన్నారు కదా! ఒకే సమయంలో ఒకే సంకల్పం - ఈ ఏకాగ్రతా శక్తి అతి శ్రేష్ఠమైనది. సంఘటనలో(సమూహంలో) ఒకే సంకల్పం యొక్క ఏకాగ్రతా శక్తి ఏది కావాలంటే, అది చేయగలదు. ఎక్కడైతే ఏకాగ్రతా శక్తి ఉంటుందో, అక్కడ సర్వశక్తులు తోడుగా(జతలో) ఉంటాయి. కావున ఏకాగ్రతయే సహజ సఫలతకు తాళం చెవి. ఒక శ్రేష్ఠ ఆత్మ యొక్క ఏకాగ్రతా శక్తి కూడా అద్భుతాన్ని చేసి చూపగలిగినప్పుడు మరి ఎక్కడైతే అనేక శ్రేష్ఠ ఆత్మల ఏకాగ్రతా శక్తి సంఘటిత రూపంలో ఉందో అది ఏమి చేయలేదు! ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో, అక్కడ శ్రేష్ఠత మరియు స్పష్టత స్వతహాగానే ఉంటాయి. ఏదైనా కొత్త పరిశోధన కోసం కూడా ఏకాగ్రత అవసరం. లౌకిక ప్రపంచానికి చెందిన పరిశోధన అయినా, ఆధ్యాత్మిక పరిశోధన అయినా ఏకాగ్రత అవసరము. ఏకాగ్రత అనగా ఒకే సంకల్పంలో స్థితులవ్వడం. ఒకే లగ్నంలో మగ్నమైపోవడం. ఏకాగ్రత అనేక వైపులకు భ్రమించడం నుండి సహజంగా విడిపిస్తుంది. ఎంత సమయం ఏకాగ్రతా స్థితిలో స్థితులై ఉంటారో అంత సమయం దేహం మరియు దైహిక ప్రపంచాన్ని సహజంగా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎందులోనైతే నిమగ్నమై(లీనమై) ఉంటారో, అదే ప్రపంచంగా ఉంటుంది. అటువంటి ఏకాగ్రతా శక్తిని అనుభవం చేశారా? ఏకాగ్రతా శక్తి ద్వారా ఏ ఆత్మకు చెందిన సందేశాన్నైనా ఆ ఆత్మ వరకు చేర్చగలరు. ఏ ఆత్మనైనా ఆహ్వానించగలరు. ఏ ఆత్మ యొక్క పిలుపునైనా గ్రహించగలరు. ఏ ఆత్మకైనా దూరంగా ఉంటూ సహయోగాన్ని ఇవ్వగలరు. ఆ ఏకాగ్రత గురించి తెలుసు కదా! ఒక్క తండ్రి తప్ప ఇంకే సంకల్పమూ ఉండరాదు. ఒక్క తండ్రిలోనే మొత్తం ప్రపంచములోని సర్వ ప్రాప్తుల అనుభూతి కలగాలి. ఒకే ఒక్కరు ఉండాలి. పురుషార్థం ద్వారా ఏకాగ్రులుగా అవ్వడం అది వేరే స్టేజ్(స్థితి). కాని ఏకాగ్రతలో స్థితులైపోవడమనే ఆ స్థితి ఎంతో శక్తివంతమైనది. అటువంటి శ్రేష్ఠ స్థితిలో చేసిన ఒక్క సంకల్పమైనా తండ్రి సమానంగా అయినట్లు చాలా అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మిక శక్తిని ప్రయోగం చేసి చూడండి. ఇందులో ఏకాంతములో ఉండి చేయు సాధన అవసరం. అభ్యాసమైపోతే అంతిమంలో నలువైపులా గొడవలు జరుగుతున్నా మీరందరూ ఒక్కరి అంతములో లీనమైపోయి ఆ గొడవల మధ్యలో కూడా ఏకాంతాన్ని అనుభవం చేస్తారు. కాని అటువంటి అభ్యాసము చాలా సమయం నుండి ఉండాలి. అప్పుడే నలువైపులా అనేక గొడవలు జరుగుతున్నా మిమ్ములను మీరు ఏకాంతవాసులుగా అనుభవం చేస్తారు. వర్తమాన సమయంలో ఇలా గుప్త శక్తుల ద్వారా అనుభవీ మూర్తులుగా అవ్వవలసిన అవసరం చాలా ఉంది. మీరందరూ ఇప్పుడు కూడా స్వయాన్ని చాలా బిజీగా భావించుకుంటున్నారు. కాని ఇప్పుడు చాలా ఫ్రీగా(తీరికగా) ఉంటున్నారు. ముందు ముందు ఇంకా బిజీగా అయిపోతారు. అందువలన ఇటువంటి భిన్న భిన్న రకాల స్వ అభ్యాసం, స్వ సాధన ఇప్పుడు(మాత్రమే) చేయగలుగుతారు. నడుస్తూ - తిరుగుతూ స్వయానికి ఎంత సమయం లభిస్తే అంత సమయం ఈ అభ్యాసంలో సఫలం చేసుకుంటూ ఉండండి. రోజురోజుకు వాతావరణం అనుసారం ఎమర్జన్సీ కేసులు చాలా వస్తాయి. ఇప్పుడైతే విశ్రాంతిగా వైద్యం చేస్తున్నారు. కాని ఎమర్జన్సీ కేసులలో సమయం మరియు శక్తులతో కొద్ది సమయంలోనే ఎక్కువ కేసులను చేయవలసి ఉంటుంది. అవినాశీ నిరోగులుగా అయ్యేందుకు ఒకే విశ్వ హాస్పిటల్ అని ఛాలెంజ్ చేసినప్పుడు నలువైపులా ఉన్న రోగులు ఎక్కడకు వెళ్తారు? ఎమర్జన్సీ కేసులు కూడా లైను కడ్తాయి(వరుసగా ఉంటారు). ఆ సమయంలో చేస్తారు? అమర భవ అనే వరదానమునైతే ఇస్తారు కదా! స్వ- అభ్యాసమనే ఆక్సిజన్ద్ ద్వారా, సాహసమనే శ్వాస ఇవ్వవలసి ఉంటుంది. హోప్ లెస్ కేసు అనగా నలువైపుల నుండి నిరుత్సాహంతో(వ్యాకులతతో) ఉన్న కేసులు ఎక్కువగా వస్తాయి. అటువంటి హోప్ లెస్ ఆత్మలకు సాహసమిప్పించడమే శ్వాస నింపడం. అప్పుడు వెంట వెంటనే ఆక్సిజన్ ఇవ్వవలసి ఉంటుంది. స్వ - అభ్యాసం ఆధారంగా అటువంటి ఆత్మలను శక్తిశాలిగా తయారు చేయగలరా? అందువలన తీరిక లేదని ఇప్పుడు చెప్పకండి. తీరిక ఉంటే ఇప్పుడే ఉంది. ఇక ముందు తీరిక అస్సలు ఉండదు. ఏ విధంగా తీరిక లభించదు కాని తీరిక చేసుకోవాలి, సమయం లభించదు కాని సమయాన్ని తీయవలసి ఉంటుంది అని ఇతరులకు చెప్తారు కదా! కనుక స్వ అభ్యాసం కోసం కూడా సమయం లభిస్తే చేస్తామని కాదు, సమయాన్ని తీసుకోవలసి ఉంటుంది. స్థాపన యొక్క ఆదికాలము నుండి ఒక విశేషమైన విధి నడుస్తూ వస్తోంది. అదేమిటి? బిందువు - బిందువుతో చెరువు అవుతుంది (నిండుతుంది). అలాగే సమయం కొరకు కూడా ఇదే విధి. ఎంత సమయం లభిస్తే అంత అభ్యాసం చేస్తూ చేస్తూ సర్వ అభ్యాస స్వరూపులు, సాగరంగా అయిపోతారు. ఒక్క సెకండు లభించినా దానిని కూడా అభ్యాసం కోసం జమ చేసుకుంటూ వెళ్లండి. సెకండు సెకండు అలా చేస్తూ పోతే ఎంత సమయం అయిపోతుంది. అలా ప్రోగు చేసినట్లయితే అర్ధగంట కూడా అయిపోతుంది. నడుస్తూ - తిరుగుతూ అభ్యాసీలుగా అవ్వండి. ఎలాగైతే ఛాత్రక పక్షి ఒక్కొక్క బిందువు కోసం దప్పికతో ఉంటుందో అలాగే స్వ - అభ్యాసీ ఛాత్రకులు ఒక్కొక్క సెకండు అభ్యాసంలో ఉపయోగిస్తే అభ్యాస స్వరూపులుగా అవ్వనే అవుతారు.

స్వ అభ్యాసంలో నిర్లక్ష్యంగా అవ్వకండి. ఎందుకంటే అంతిమంలో విశేష శక్తుల అభ్యాసం యొక్క అవసరం ఎక్కువగా కావాలి. ఆ ప్రాక్టికల్ పేపర్(పరీక్షల) ద్వారానే నంబరు లభించనుంది. అందువలన ఫస్ట్ డివిజన్ తీసుకునేందుకు స్వ అభ్యాసాన్ని తీవ్రతరం చేయండి. అందులో కూడా ఏకాగ్రతా శక్తిని విశేషంగా అభ్యాసం చేస్తూ ఉండండి. గొడవలు జరుగుతున్నా, మీరు ఏకాగ్రంగా ఉండాలి. స్థానము మరియు పరిస్థితులు సైలెన్స్గా(శాంతిగా) ఉన్నప్పుడు ఏకాగ్రమవ్వడమైతే సాధారణ విషయమే. కాని నలువైపులా అలజడి మధ్యలో ఒక్కరి అంతిమంలో లీనమైపోండి అనగా ఏకాంతవాసులుగా అయిపోండి. ఏకాంతవాసులుగా అయ్యి ఏకాగ్ర స్థితిలో స్థితులైపోండి. ఇదే మహారథుల మహాన్ పురుషార్థం. కొత్త కొత్త పిల్లల కోసమైతే చాలా సహజ సాధనము - ఒకే విషయాన్ని స్మృతి చేయండి, ఒకే విషయాన్ని అందరికీ వినిపించండి. కావున ఒకే విషయాన్ని గుర్తు చేసుకోవడం లేక వినిపించడం కష్టమైతే కాదు కదా! అనేక విషయాలనైతే మర్చిపోతారు. కాని ఒకే విషయాన్నైతే మర్చిపోరు కదా. ఒక్కరినే మహిమ చేస్తూ ఉండండి. ఒక్కరి పాటనే పాడుతూ ఉండండి, ఒక్కరి పరిచయాన్నే ఇస్తూ ఉండండి. ఇదైతే సహజం కదా! లేక ఇది కూడా కష్టమా! ఎక్కడైతే ఒక్కరే ఉంటారో, అక్కడ ఏకరస స్థితి స్వతహాగా తయారవుతుంది. ఇంకేం కావాలి? ఏకరస స్థితియే కదా కావాలి! కావున ఈ '' ఏక '' అనే ఒక్క శబ్ధాన్నే గుర్తుంచుకోండి. ఒక్కరి గీతమే పాడాలి, ఒక్కరినే స్మృతి చేయాలి. ఎంత సహజమైనది! కొత్త కొత్త పిల్లల కోసం సహజమైన షార్ట్ కట్(దగ్గర) మార్గాన్ని తెలియజేస్తున్నారు. కావున త్వరగా చేరుకుంటారు. ఇదే కోరుకుంటున్నారు కదా! వెనక వచ్చారు కాని ముందుకు వెళ్లాలి. కావున ఇదే షార్ట్ కట్ మార్గము. దీని ద్వారా(ఇలా) నడిచినట్లయితే త్వరగా(ముందుగా) చేరుకుంటారు. మాతలకైతే అన్ని విషయాలలో సహజతరమైనది కావాలి కదా! ఎందుకంటే జన్మ-జన్మలుగా చాలా అలసిపోయి ఉన్నారు. కావున సహజమైనది కావాలి. ఎంతగా భ్రమించారు! 63 జన్మలలో ఎంతగా భ్రమించారు! కావున భ్రమించిన ఆత్మలకు సహజ మార్గం కావాలి. సహజ మార్గాన్ని తమదిగా చేసుకోవడం వలన గమ్యానికి తప్పకుండా చేరుకుంటారు. అర్థమయ్యిందా! మంచిది.

కొత్తవారు కూడా కూర్చున్నారు, మహారథులు కూడా కూర్చున్నారు. ఇరువురూ ఎదురుగా ఉన్నారు. అందరికంటే ఎక్కువ సమీపంగా ఉండేది గుజరాత్ కదా! సమీపంగా ఉండటంతో పాటు సహయోగిగా కూడా గుజరాత్ వారున్నారు. సహయోగంలో గుజరాత్ నంబరు రాజస్థాన్ కంటే ముందు ఉంది. ఆబూ రాజస్థాన్లో ఉంది. కనుక రాజస్థాన్ సమీపంగా ఉంది కదా. రాజస్థాన్లోని రాజులు కూడా మేలుకుంటే అద్భుతం చేస్తారు. ఇప్పుడు గుప్తంగా ఉన్నారు. తర్వాత ప్రత్యక్షమైపోతారు. గుజరాత్ వారి జన్మ ఎలా జరిగిందో తెలుసా? గుజరాత్ కు మొదట సహయోగమివ్వబడింది. సహయోగ జలంతో బీజం పడింది. కావున ఫలము కూడా సహయోగముదే వెలువడ్తుంది కదా! గుజరాత్ కు డైరెక్ట్ బాప్దాదా సంకల్పం యొక్క సహయోగమనే నీరు లభించింది. కావున ఫలము కూడా సహయోగముదే వెలువడ్తుంది. అర్థమయ్యిందా! గుజరాత్ వారు ఎంతటి భాగ్యశాలురు! గుజరాత్ లో బాప్దాదా సెంటరు తెరిచారు. గుజరాత్ వారు తెరవలేదు. అందువలన కోరుకోకపోయినా సహజంగానే సహయోగ ఫలం వెలువడ్తూనే ఉంటుంది. మీరు శ్రమ చేయనవసరం లేదు. ఏ కార్యంలోనూ మీరు శ్రమ చేయనవసరం లేదు. ధరణి సహయోగ ఫలాలను ఇచ్చేది. మంచిది.

స్వ - అభ్యాసం యొక్క ఛాత్రకులందరికీ, సదా ఏకాంతవాసీ, ఏకాగ్రత కలిగిన శక్తిశాలీ ఆత్మలకు, సదా స్వ అభ్యాసం యొక్క శక్తుల ద్వారా సర్వులను నిరుత్సాహం నుండి సదా ఉల్లాసవంతులుగా(దిల్ఖుష్) చేసేవారికి, సదా సర్వ శక్తులను ప్రాక్టికల్గా ఉపయోగించే వారికి, అలాంటి శ్రేష్ఠ స్వ అభ్యాసులుకు, స్వరాజ్య అధికారీ శ్రేష్ఠ ఆత్మలకు, మహావీరులకు మరియు కొత్త కొత్త పిల్లలకు అందరికీ బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఒకరు మేళాకు వస్తారు, మరొకరు వెళ్తారు. ఇది వచ్చే, వెళ్లే మేళా. బాప్దాదా అయితే పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు. కొత్తవారైనా, పాతవారైనా, భాషను తెలిసినవారైనా లేక తెలియని వారైనా, మురళిని అర్థం చేసుకున్నా లేక అర్థం చేసుకోకపోయినా తండ్రికి చెందినవారే. ఎంతైనా ప్రేమతో వచ్చి చేరుకుంటారు. తండ్రికి ఏ విషయం యొక్క ఆకలి ఉంది? ప్రేమ యొక్క ఆకలి. తెలివి యొక్క ఆకలి కాదు. తండ్రి ప్రేమను చూస్తారు. హృదయపూర్వకమైన ప్రేమను చూస్తారు. ఎంత అమాయకులుగా ఉంటారో, అంతగా సత్యమైన ప్రేమ ఉంటుంది. చతురతతో కూడిన ప్రేమ కాదు. కావున అమాయకమైన పిల్లలు అందరికంటే ప్రియమైనవారు. ఎలాగైతే నాలెడ్జ్ ఫుల్ అన్న టైటిల్ ఉందో, అలాగే భోలానాథుడు అన్న టైటిల్ కూడా ఉంది. రెండిటి స్మృతిచిహ్నాలు ఉన్నాయి. కొత్త కొత్త పిల్లలు భావన కలిగిన మంచి పిల్లలు. మంచిది.

పార్టీలతో అవ్యక్త బాప్దాదాల వ్యక్తిగత కలయిక - 1. సదా స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాలుగా భావిస్తున్నారా? ఫరిస్తా అనగా డబల్ లైట్. ఎంతెంత తేలికదనం ఉంటుందో, అంతగా స్వయాన్ని ఫరిస్తాగా అనుభవం చేస్తారు. ఫరిస్తాలు సదా మెరుస్తూ ఉంటారు. మెరుస్తున్న కారణంగా సర్వులను స్వతహాగానే తమ వైపుకు ఆకర్షిస్తారు. అలాంటి ఫరిస్తాలకు దేహము మరియు దైహిక ప్రపంచంతో ఎటువంటి సంబంధమూ ఉండదు. శరీరంలో సేవ కొరకే ఉంటారు, సంబంధం ఆధారంగా ఉండరు. దేహ సంబంధాల ఆధారంగా ఉండరు. సేవా సంబంధం లెక్కతో ఉంటారు. ప్రవృత్తిలోని సంబంధంగా భావిస్తూ ఉండరాదు. సేవగా భావిస్తూ ఉండాలి. ఇల్లూ అదే, పరివారమూ అదే కాని సేవా సంబంధం ఉంది. కర్మ బంధనాలకు వశీభూతులుగా ఉండరు. సేవా సంబంధంలో ఎందుకు? ఏమిటి? అనేవి ఉండవు. ఎటువంటి ఆత్మలైనా సేవా సంబంధం ప్రియమైనది. ఎక్కడ దేహం ఉంటుందో, అక్కడ వికారాలు ఉంటాయి. దేహ సంబంధంతో వికారాలు వస్తాయి. దేహ సంబంధం లేకపోతే వికారాలు ఉండవు. ఏ ఆత్మనైనా సేవా సంబంధంలో చూసినట్లైతే వికారాల ఉత్పత్తి జరగదు. అటువంటి ఫరిస్తాగా అయ్యి ఉండండి కాని బంధువులుగా కాదు. ఎక్కడైతే సేవా భావముంటుందో అక్కడ సదా శుభ భావన ఉంటుంది. ఇంకే భావమూ ఉండదు. దీనినే చాలా అతీతమైన మరియు అతిప్రియమైన, కమలపుష్ప సమానమైన స్థితి అని అంటారు. సర్వ పురుషులలో(ఆత్మలలో) ఉత్తమ ఫరిస్తాలుగా అవ్వండి. అప్పుడే దేవతలుగా అవుతారు.

2. అందరూ దు:ఖరహిత పురానికి చక్రవర్తులుగా, దు:ఖాల నుండి అతీతంగా సుఖ సాగరుని సుఖాన్ని అనుభవం చేసే అనుభవజ్ఞులుగా భావిస్తూ నడుస్తున్నారా? మొదట దు:ఖ ప్రపంచం యొక్క అనుభవజ్ఞులుగా ఉండేవారు, ఇప్పుడు దు:ఖ ప్రపంచం నుండి బయట పడి సుఖ ప్రపంచం యొక్క అనుభవజ్ఞులుగా అయిపోయారు. ఇప్పుడు సుఖమునిచ్చే ఒక్క మంత్రం లభించడంతో దు:ఖం సమప్తమైపోయింది. మీరు సుఖదాతకు చెందిన సుఖ స్వరూపులైన ఆత్మలు. 'సుఖ సాగరుడైన తండ్రికి పిల్లలు' అన్న మంత్రం లభించింది. మనసు తండ్రి వైపు లగ్నమైపోయాక దు:ఖం ఎక్కడి నుండి వస్తుంది! మనసును తండ్రి వైపు తప్ప ఇంకెక్కడైనా లగ్నం చేసినప్పుడే మనసుకు దు:ఖం కలుగుతుంది. 'మన్మనాభవ' గా ఉన్నట్లయితే దు:ఖం ఉండజాలదు. కావున మనసు తండ్రి వైపు ఉందా? లేక ఇంకెక్కడైనా ఉందా? తప్పుడు మార్గంలో వెళ్లినప్పుడు దు:ఖం కలుగుతుంది. నేరుగా (తిన్నని) మార్గం ఉన్నప్పుడు తప్పుడు మార్గంలో ఎందుకు వెళ్తారు? ఏ మార్గంలలో వెళ్లేందుకు నిషేధమో, ఆ మార్గంలో ఎవరైనా వెళ్లినట్లయితే ప్రభుత్వం కూడా శిక్ష విధిస్తుంది కదా! దారి మూసేసినప్పుడు ఎందుకు వెళ్తారు? తనువు కూడా నీదే, మనసు కూడా నీదే, ధనం కూడా నీదే, నాదంటూ ఏమీ లేనప్పుడు దు:ఖం ఎక్కడి నుండి వస్తుంది? నీది అన్నప్పుడు దు:ఖం లేదు. 'నాది' అనేది ఉంటే దు:ఖం ఉంటుంది. ''నీది నీది(తేరా, తేరా)'' అని అంటూ తేరాగా(నీ దాన్నిగా) అయిపోయాను.

3. సదా ఒకే బలం, ఒకే విశ్వాసం - ఇదే స్థితిలో ఉంటున్నారా? ఒక్కరిలో విశ్వాసం అనగా శక్తి యొక్క ప్రాప్తి. ఇలా అనుభవం చేస్తున్నారా? నిశ్చయబుద్ధి గలవారు విజయులు. దీనినే మరో మాటలో 'ఒకే బలం, ఒకే విశ్వాసం' అని అంటారు. నిశ్చయబుద్ధి గలవారు విజయులుగా అవ్వక పోవడమనేది ఉండదు. తమలోనే ఇది అవుతుందా, అవ్వదా అని కొద్దిగా సంకల్ప మాత్రంగా అయినా సంశయమొస్తే విజయులుగా అవ్వరు. తమ పైన, తండ్రి పైన మరియు డ్రామా పైన పూర్తి నిశ్చయముంటే విజయం లభించకపోవడమనేది ఎప్పుడూ జరగదు. ఒకవేళ విజయం కలగకపోతే తప్పకుండా ఏదో ఒక పాయింట్లో నిశ్చయం యొక్క లోపముంది. తండ్రి పైన నిశ్చయముంటే స్వయంలో కూడా నిశ్చయం ఉంటుంది. మీరు మాస్టర్లు కదా! మాస్టర్సర్వశక్తివంతులుగా ఉన్నప్పుడు డ్రామాలో ప్రతి విషయాన్ని నిశ్చయబుద్ధి గలవారై చూస్తారు. అటువంటి నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలలో సదా నాకు విజయం లభించే ఉంది అన్న ఉత్సాహం ఉంటుంది. అటువంటి విజయులే విజయమాలలోని మణులుగా అవుతారు. విజయం వారి వారసత్వం. జన్మ సిద్ధ అధికారంగా ఈ అధికారం ప్రాప్తిస్తుంది.

మాతలతో కలయిక - బాప్దాదా కూడా మాతలకు సదా నమస్కరిస్తారు. ఎందుకంటే మాతలు సదా సేవలో అడుగు ముందుకు వేస్తారు. బాప్దాదా మాతల గుణగానం చేస్తారు. మాతలు ఎంత శ్రేష్ఠంగా అయిపోయారో, వారిని చూసి బాప్దాదా కూడా హర్షితమవుతారు. సదా మీ ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సంతోషంగా ఉండండి. మనసులో సంతోష గీతాలు సదా మ్రోగుతూ ఉండాలి. మాతలకు ఇంకేం పని ఉంది! బ్రాహ్మణులుగా అయ్యాక మీ పని సదా పాడడం, నాట్యం చేయడమే కదా. మనసుతో నాట్యం చేయండి. మనసుతో పాటలను పాడండి. ఒక్కొక్క జగన్మాత ఒక్కొక్క దీపాన్ని వెలిగించినట్లయితే ఎన్ని దీపాలు వెలుగుతాయి. జగత్తు యొక్క మాతలూ! జగత్తులోని దీపాలను వెలిగిస్తున్నారు కదా! దీపాలు వెలుగుతూ వెలుగుతూ దీపమాలగా అయిపోతారు. మంచిది.

ప్రశ్న - సేవకు సహజ సాధనం, సర్వులను ఆకర్షించే సహజ సాధనం లేక పురుషార్థమేది ?

సమా - హర్షితంగా ఉండే ముఖం. ఎవరైతే సదా హర్షితంగా ఉంటారో, వారు స్వతహాగానే అందరినీ ఆకర్షిస్తారు. అంతేకాక సహజంగా సేవకు నిమిత్తంగా కూడా అయిపోతారు. హర్షితముఖత సంతోషానికి గుర్తు. సంతోషంగా ఉండే ముఖాన్ని చూసి స్వతహాగానే ఏం పొందారు? ఏం లభించింది? అని అడుగుతారు. కావున ఎలా ఉన్న నేను ఎలా అయ్యాను? అని సంతోషంగా ఉండండి.

ప్రశ్న - తిలకం అంటే అర్థమేమిటి? ఏ తిలకాన్ని ధారణ చేస్తే సదా నషాలో, సంతోషంలో ఉంటారు?

సమా - తిలకమనగా స్మృతి స్వరూపమని అర్థం. కావున సదా మేము సింహాసనాధికారులము అన్న స్మృతిలో ఉండాలి. మేము ఆ ప్రభువు సింహాసనానికి అధికారులైన అపురూపమైన ఆత్మలము - ఈ తిలకాన్ని ధారణ చేయడం వలన సదా నషాలో, సంతోషంలో ఉంటారు. సింహాసనం మరియు అదృష్టం అని అంటారు. సింహాసనాధికారిగా అయ్యే భాగ్యం లభించింది. కావున సదా శ్రేష్ఠ సింహాసనం మరియు అదృష్టవంతులైన ఆత్మలమనే నషాలో మరియు సంతోషంలో ఉండాలి.

Comments