09-01-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' శ్రేష్ఠ భాగ్యశాలీ ఆత్మల ఆత్మిక వ్యక్తిత్వము ''
ఈ రోజు భాగ్యవిధాత తండ్రి తన శ్రేష్ఠ భాగ్యశాలురైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని భాగ్యరేఖ ఎంత శ్రేష్ఠంగా, అవినాశిగా ఉందో చూస్తున్నారు. పిల్లలందరూ భాగ్యశాలురే ఎందుకంటే భాగ్యవిధాతకు చెందినవారిగా అయ్యారు. అందువలన భాగ్యమైతే జన్మ సిద్ధ అధికారము. జన్మ సిద్ధ అధికార రూపములో అందరికి స్వతహాగానే అధికారం ప్రాప్తించింది. అధికారం అయితే అందరికి ఉంది కానీ ఆ అధికారాన్ని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల జీవితంలో అనుభవం చేసి చేయించడంలో తేడా(అంతరం) ఉంది. ఈ భాగ్యం యొక్క అధికారానికి అధికారిగా అయ్యి సంతోషంగా, నశాలో ఉండాలి. అంతేకాక ఇతరులనకు కూడా భాగ్యవిధాత ద్వారా భాగ్యవంతులుగా తయారు చేయాలి - ఇదే అధికారం యొక్క నశాలో ఉండడం. ఎలాగైతే స్థూల సంపదలు ఉన్నవారి నడవడిక మరియు ముఖం ద్వారా సంపద కలిగించే అల్పకాలిక నశా కనిపిస్తుందో, అలా భాగ్యవిధాత ద్వారా లభించిన శ్రేష్ఠ భాగ్య సంపద వలన కలిగే నశా నడవడిక ద్వారా, ముఖం ద్వారా స్వతహాగా కనిపిస్తుంది. శ్రేష్ఠ భాగ్య సంపద కలిగించే ప్రాప్తి స్వరూపము అలౌకికమైనది మరియు ఆత్మికమైనది. శ్రేష్ఠ భాగ్యం యొక్క మెరుపు మరియు ఆత్మిక నశా విశ్వంలో సర్వాత్మల(నశా) కంటే శ్రేష్ఠమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు సదా సంపన్నంగా నశాలో ఉండేవారిగా అనుభవం చేస్తారు. దూరం నుండే శ్రేష్ఠమైన భాగ్య సూర్యుని కిరణాలు మెరుస్తూ అనుభవం అవుతాయి. భాగ్యశాలుర భాగ్యమనే ఆస్తి యొక్క పర్సనాలిటి దూరం నుండే అనుభవం అవుతుంది. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ దృష్టి ద్వారా సదా సర్వులకు ఆత్మిక రాయల్టీ అనుభవం అవుతుంది. విశ్వంలో ఎంత పెద్ద పెద్ద రాయల్టీ లేక పర్సనాలిటీ గలవారిగానైనా ఉండవచ్చు కానీ శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ ముందు వినాశి పర్సనాలిటి గలవారు ఈ ఆత్మిక పర్సనాలిటి(వ్యక్తిత్వం) అత్యంత శ్రేష్ఠమైనది, సాటిలేనిదని స్వయం అనుభవం చేస్తారు. ఈ శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు అతీతమైన, అలౌకిక ప్రపంచానికి చెందినవారని, అత్యంత అతీతమైనవారని అనుభవం చేస్తారు. వీరినే అల్లా మనుష్యులు అని అంటారు. ఎలాగైతే ఏదైనా వస్తువు కొత్తదిగా ఉన్నప్పుడు చాలా ప్రీతిగా చూస్తూనే ఉండిపోతారో అలా శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలను చూసి చూసి చాలా సంతోషిస్తారు. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మల శ్రేష్ఠ వృత్తి ద్వారా ఇతరులు కూడా ఏదో ప్రాప్తి అవుతున్నట్లు అనగా ప్రాప్తి కలిగించే వాతావరణాన్ని, వాయుమండలాన్ని అనుభవం చేస్తారు. కొంత పొందుతున్నాము, కొంత లభిస్తోంది అనే అనుభూతిలో నిమగ్నమవుతారు. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను చూసి, ఇతరులు దప్పికగొని ఉన్నవారి ముందుకు బావి నడిచి వచ్చినట్లుగా అనుభవం చేస్తారు. అప్రాప్తి ఆత్మ తన ఆశలన్నీ ప్రాప్తించాయని అనుభవం చేస్తుంది. నలువైపులా నిరాశల అంధకారం మధ్యలో శుభమైన ఆశల దీపము వెలుగుతున్నట్లుగా అనుభవం చేస్తారు. నిరాశ చెందిన ఆత్మలకు హృదయ పూర్వక సంతోషం అనుభవం అవుతుంది. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలురుగా అయ్యారా? తమ ఈ ఆత్మిక విశేషతలు తెలుసా? అంగీకరిస్తున్నారా? అనుభవం చేస్తున్నారా? లేక కేవలం ఆలోచిస్తూ వింటున్నారా? నడుస్తూ తిరుగుతూ ఈ సాధారణ రూపంలో దాగి ఉన్న అమూల్య వజ్రమైన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను ఎప్పుడూ స్వయం కూడా మర్చిపోవడం లేదు కదా, స్వయాన్ని సాధారణ ఆత్మగా భావించడం లేదు కదా? శరీరం పాతది, సాధారణమైనది కానీ ఆత్మ మ¬న్నతమైనది మరియు విశేషమైనది. మొత్తం విశ్వంలోని భాగ్యశాలుర జాతకాలు చూడండి, మీలాంటి శ్రేష్ఠ భాగ్యరేఖ ఎవ్వరికీ ఉండదు. ధనంతో ఎంత సంపన్నంగా ఉన్న ఆత్మలు కావచ్చు, శాస్త్రాలలోని ఆత్మ జ్ఞానం యొక్క ఖజానాతో సంపన్నంగా ఉన్న ఆత్మలు కావచ్చు, విజ్ఞానం యొక్క జ్ఞాన శక్తితో సంపన్నంగా ఉన్న ఆత్మలు కావచ్చు, కానీ మీ అందరి సంపన్న భాగ్యం ముందు అవన్నీ ఏమనిపిస్తాయి? వారు స్వయం కూడా మేము బయట నుండి సంపన్నంగా ఉన్నాము కానీ లోపల ఖాళీగా ఉన్నాము, మీరు లోపల సంపన్నంగా ఉన్నారు బయటకి సాధారణంగా ఉన్నారు అని అనుభవం చెయ్యడం ప్రారంభించారు. అందువలన తమ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ సమర్థత యొక్క ఆత్మిక నశాలో ఉండండి. బయటికి భలే సాధారణంగా కనిపించండి కాని సాధారణతలో మహానత కనిపించాలి. కనుక ప్రతి కర్మలో సాధారణతలో మహానత అనుభవం అవుతోందా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఎప్పుడైతే స్వయం స్వయాన్ని ఇలా అనుభవం చేస్తారో అప్పుడు ఇతరులకు కూడా అనుభవం చేయిస్తారు. ఎలాగైతే ఇతరులు పని చేస్తారో అలాగే మీరు కూడా లౌకిక కార్య వ్యవహారాలే చేస్తారా లేక అలౌకిక అల్లా పిల్లలుగా అయ్యి కార్యము చేస్తారా? నడుస్తూ తిరుగుతూ అందరి సంపర్కంలోకి వస్తూ వీరి దృష్టిలో, ముఖంలో అతీతత్వం ఉందని తప్పకుండా అనుభవం చేయించండి. చూసేవారికి స్పష్టంగా అర్థం అవ్వకపోయినా, ఇదేమిటి? వీరు ఎవరు? అనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవ్వాలి. ఈ ప్రశ్నలనే బాణాలు తండ్రికి సమీపంగా తప్పకుండా తీసుకొస్తాయి. అర్థమయ్యిందా! ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలుగా ఉన్నారా? బాప్దాదా అప్పుడప్పుడు పిల్లల అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటారు. భగవంతుని వారిగా అయ్యారు కానీ తమ భాగ్యాన్ని కూడా మర్చిపోయేంత అమాయకులుగా అయ్యారు. ఏ విషయాన్నైతే ఎవ్వరూ మర్చిపోరో ఆ విషయాన్ని అమాయక పిల్లలు మర్చిపోతారు. స్వయాన్ని ఎవరైనా మర్చిపోతారా? తండ్రిని ఎవరైనా మర్చిపోతారా? కనుక ఎంత అమాయకులుగా అయ్యారు! 63 జన్మల ఉల్టా పాఠాన్ని భగవంతుడు కూడా మర్చిపోండి అని చెప్పినా, మర్చిపోనంత పక్కాగా చేసుకున్నారు. శ్రేష్ఠమైన విషయాన్ని మర్చిపోతారు. ఎంత అమాయకులుగా ఉన్నారు! తండ్రి కూడా డ్రామాలో ఈ అమాయకులతోనే నా పాత్ర ఉందని అంటారు. చాలా సమయం అమాయకులుగా అయ్యారు, ఇప్పుడు తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా, మాస్టర్ శక్తివంతులుగా అవ్వండి అర్థమయ్యిందా! మంచిది.
సదా శ్రేష్ఠ భాగ్యశాలురకు, సర్వులకు తమ శ్రేష్ఠ భాగ్యం ద్వారా భాగ్యశాలురుగా తయారయ్యే శక్తిని ఇచ్చేవారు, సాధారణతలో మహానతను అనుభవం చేయించేవారు, అమాయకుల నుండి భాగ్యశాలురుగా తయారయ్యేవారు, సదా భాగ్యం యొక్క అధికారపు నశాలో సంతోషంలో ఉండువారు, విశ్వంలో భాగ్య నక్షత్రాలుగా అయ్యి మెరిసేవారు - ఇటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు భాగ్యవిధాత బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధువన నివాసులైన సోదరీ సోదరులతో :- మధువన నివాసులు అనగా సదా తమ మధురతతో సర్వులను మధురంగా చేసేవారు అంతేకాక సదా తమ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా బేహద్ వైరాగ్యాన్ని ఇప్పించేవారు. ఇదే మధువన నివాసుల విశేషత. మధురత కూడా ఎక్కువ మరియు వైరాగ్య వృత్తి కూడా ఎక్కువే. ఇలాంటి బ్యాలెన్సు పెట్టుకునేవారు సదా సహజంగా మరియు స్వతహాగా ముందుకు వెళ్లే అనుభవం చేస్తారు. మధువనం యొక్క ఈ రెండు విశేషతల ప్రభావం విశ్వం పై పడ్తుంది. అజ్ఞానీ ఆత్మలు కూడా కావచ్చు కానీ మధువనం లైట్హౌస్ - మైట్హౌస్ కనుక లైట్ హౌస్ ప్రకాశము కోరుకున్నా, కోరుకోకపోయినా అందరి పైన పడ్తుంది. ఇక్కడి ఈ వైబ్రేషన్లు ఎంతగా ఉంటాయో అంతగా అక్కడ వీరు కొంత అతీతంగా ఉన్నారని భావిస్తారు. సమస్యల కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, అప్రాప్తి కారణంగా కావచ్చు కానీ అల్పకాలిక వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం తప్పకుండా పడ్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు శక్తిశాలిగా అవుతారో అప్పుడు అక్కడ కూడా ఏదో ఒక శక్తిశాలి విశేషమైన విషయం జరుగుతుంది. ఇక్కడ మీ అల(ప్రభావము) బ్రాహ్మణులతో పాటు ప్రపంచం వారి పైన కూడా పడ్తుంది. ఒకవేళ విశేషంగా నిమిత్తమైనవారు కొంచెం ఉత్సాహంలోకి వస్తూ మళ్లీ సాధారణతలోకి వచ్చినట్లయితే అక్కడ కూడా ఉత్సాహంలోకి వస్తారు, మళ్లీ సాధారణంగా అయిపోతారు. కావున మధువనం ఒక విశేషమైన స్టేజి. ఉదాహరణానికి ఆ స్టేజి పైన ఎవరైనా ఉపన్యసించేవారు గాని, స్టేజి సెక్రటరీ గాని అటెన్షన్ ఏమో స్టేజి పై ఉంచుతారు కదా లేక ఇది ఉపన్యసించే వారి కొరకని భావిస్తారా. ఎవరైనా చిన్న పాట పాడేవారైనా లేక పుష్పగుచ్ఛం ఇచ్చేవారైనా కావచ్చు ఎవరు ఏ సమయంలో స్టేజి పైకి వచ్చినా అదే విశేషతతో అటెన్షన్తో వస్తారు కదా! కావున మధువనంలో ఏ డ్యూటీలో ఉన్నా స్వయాన్ని చిన్నగా లేక పెద్దగా భావించినా, మధువన విశేషమైన స్టేజి పై ఉన్నారు. మధువనం అనగా మహాన్ స్టేజ్. కావున మహాన్ స్టేజి పై పాత్రను అభినయించేవారు మహాన్గా అయ్యారు కదా! అందరూ తమను ఉన్నతమైన దృష్టితో చుస్తారు కదా! ఎందుకంటే మధువనం మహిమ అనగా మధువన నివాసుల మహిమ.
కనుక మధువనం వారి ప్రతి మాట ముత్యము. మాటలు కాదు ముత్యాలు. ముత్యాల వర్షం కరుస్తోందని అనిపిస్తుంది. మాట్లాడటం లేదు, ముత్యాల వర్షం కురుస్తోందని అనిపిస్తుంది. దీనినే మధురత అని అంటారు. ఎలాంటి మాటలు మాట్లాడాలంటే, వినేవారు మేము కూడా ఇలా మాట్లాడాలి అని అనుకోవాలి. అందరూ విని నేర్చుకోవాలి అని ప్రేరణ కలగాలి. ఫాలో చేసే ప్రేరణ లభించాలి. ఏ మాటలు మాట్లాడినా వాటిని టేప్ చేసి మళ్లీ రిపీట్ చేసుకొని వినునట్లుగా ఉండాలి. మంచి మాటలుగా అనిపిస్తాయి. అందుకే పదే పదే వినేందుకు టేప్ చేసుకుంటారు. కావున ఇలాంటి మధురమైన మాటలుగా ఉండాలి. ఇలాంటి మధురమైన మాటల వైబ్రేషన్లు విశ్వములో స్వతహాగా వ్యాపిస్తాయి. ఈ వాయుమండలం, ఈ వైబ్రేషన్లు స్వతహాగానే ఆకర్షిస్తాయి. కావున మీ ప్రతి మాట మహాన్గా ఉండాలి. ప్రతి మానసిక సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. రెండవ విషయము - మధువనంలో భండారాలు ఎంత సంపన్నంగా ఉన్నాయో మధువన వాసులు అంత బేహద్ వైరాగులుగా ఉంటారు. అధిక ప్రాప్తితో పాటు వైరాగ్య వృత్తి కూడా అంత ఎక్కువగా ఉంటే అప్పుడు బేహద్ వైరాగ్య వృత్తి ఉందని అంటారు. ప్రాప్తి లేనేలేకుంటే వైరాగ్య వృత్తి ఉందని ఎలా అంటారు. ప్రాప్తి ఉండాలి, ప్రాప్తి ఉన్నప్పటికీ వైరాగ్య వృత్తి ఉండాలి. వీరినే బేహద్ వైరాగులని అంటారు. ఎవరు ఎంత చేస్తారో అంత వర్తమానంలో కూడా ఫలం పొందుతారు, భవిష్యత్తులో అయితే లభించనే లభిస్తుంది. వర్తమానంలో సత్యమైన స్నేహం మరియు అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఈ ప్రాప్తి స్వర్గ రాజ్య భాగ్యం కంటే అధికమైనది. అందరి స్నేహం మరియు ఆశీర్వాదాలు మనసును ఎంత ముందుకు తీసుకెళ్తాయో ఇప్పుడే తెలుస్తుంది. అందరి హృదయపూర్వక ఆశీర్వాదాల సంతోషం మరియు సుఖానుభూతి విచిత్రమైనది. ఎవరో సహజంగా చేతుల పై ఎగిరింపజేస్తూ తీసుకెళ్తున్నట్లు అనుభవం చేస్తారు. సర్వుల స్నేహం మరియు సర్వుల ఆశీర్వాదాలు ఇంత అనుభవం చేయించేవిగా ఉంటాయి. మంచిది.
ఈ నూతన సంవత్సరంలో అందరూ నూతన ఉమంగ-ఉత్సాహాలు నిండిన నూతన సంకల్పం చేశారు కదా. అందులో దృఢత ఉంది కదా. ఆ సంకల్పాన్ని ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉండండి. ఏదైనా ఒక వస్తువును పక్కాగా చేస్తూ ఉంటే పక్కాగా అయిపోతుంది. అలా ఏ సంకల్పము చేశారో దానిని వదిలేయకండి. ప్రతిరోజు ఆ సంకల్పాన్ని రివైజ్ చేసి దృఢ పరచండి. అలా చేస్తే ఈ దృఢత సదా పనికొస్తుంది. అప్పుడప్పుడు ఏ సంకల్పము చేశాను? అని ఆలోచించినా లేక నడుస్తూ నడుస్తూ ఏ సంకల్పము చేశారో కూడా మర్చిపోతే బలహీనత వచ్చేస్తుంది. ప్రతిరోజు రివైజ్ చేయండి. ప్రతిరోజు తండ్రి ముందు ఆ సంకల్పాన్ని రిపీట్ చేస్తే పక్కా అవుతూ ఉంటుంది. అంతేకాక సఫలత కూడా సహజంగా లభిస్తుంది. అందరూ ఏ స్నేహముతో మధువనంలోని ఒక్కొక్క ఆత్మను చూస్తారో అది తండ్రికి తెలుసు. మధువన నివాసులైన ఆత్మల విశేషతలకు తక్కువ మహత్వం లేదు. ఒకవేళ ఎవరైనా ఒక చిన్న విశేష కార్యము చేసినా, ఒక స్థానములో ఆ కార్యము జరుగుతుంది కాని అందరికి ప్రేరణ లభిస్తుంది. కనుక ఆ మొత్తం విశేషతల లాభములో భాగము ఆ ఆత్మకు లభిస్తుంది. కనుక మధువనం వారు ఏ శ్రేష్ఠమైన సంకల్పం చేసినా, ప్లాను తయారు చేసినా, కర్మ చేసినా అది అందరికి నేర్చుకోవాలన్న ఉత్సాహం కలుగుతుంది కనుక అందరి ఉత్సాహాన్ని పెంచే ఆత్మలకు ఎంత లాభముంటుంది! మీ అందరికి ఇంత మహత్వముంది. ఒక మూలలో చేస్తారు కానీ అన్ని జాగాలకు విస్తరిస్తుంది. అచ్ఛా.
ఈ నూతన సంవత్సరం కొరకు క్రొత్త ప్లాన్ :- ఈ సంవత్సరం ఎలాంటి గ్రూప్ను తయారు చేయాలంటే, ఈ గ్రూప్ విశేషతలను ప్రత్యక్షంగా చూసి ఇతరులకు ప్రేరణ లభించాలి మరియు వైబ్రేషన్లు వ్యాపించాలి. గవర్నమెంట్ కూడా - మీరు ఏదైనా స్థానం తీసుకొని, ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని(ఎన్నుకొని) ఎలాంటి ఉదాహరణగా చేసి చూపించాలంటే దీనితో మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారని అర్థమవ్వాలి, అప్పుడు దాని ప్రభావం వ్యాపిస్తుంది అని చెప్తుంది. ఇలా ఏ గ్రూప్ అయినా తయారైతే దానితో ఇతరులకు ప్రేరణ లభించాలి. ఎవరైనా గుణం ఎలా ఉంటుంది, శక్తి ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, స్మృతి ఎలా ఉంటుంది అని చూడాలనుకునేవారికి ప్రాక్టికల్ స్వరూపం కనిపించాలి. ఇలా చిన్న చిన్న గ్రూపులు ప్రత్యక్ష ప్రమాణంగా అయితే ఆ శ్రేష్ఠమైన వైబ్రేషన్లు వాతావరణంలో స్వతహాగానే వ్యాపిస్తాయి. ఈ రోజులలో అందరూ ప్రాక్టికల్గా చూడాలని కోరుకుంటున్నారు. వినాలని కోరుకోవడం లేదు. ప్రాక్టికల్ ప్రభావం చాలా త్వరగా చేరుకుంటుంది. కావున ఇలాంటి తీవ్ర ఉత్సాహం కలిగిన ప్రాక్టికల్ రూపం గల గ్రూప్ ఉన్నట్లయితే వారిని చూసి సహజంగా అందరూ ప్రేరణ తీసుకోవాలి అంతేకాక ఈ ప్రేరణ నలువైపులా చేరుకోవాలి. ఒకరి నుండి ఇద్దరికి, ఇద్దరి నుండి ముగ్గురికి అలా వ్యాపిస్తూ ఉంటుంది. అందువలన ఇలాంటి ఏ విశేషత అయినా చేసి చూపించండి. ఎలాగైతే విశేషంగా నిమిత్తంగా అయిన ఆత్మల పట్ల, వీరు ఉదాహరణంగా ఉన్నారని అందరూ భావిస్తారో, అంతేకాక ప్రేరణ లభిస్తుందో, అలా ఇంకా ఋజువులను తయారు చెయ్యండి, వీరిని చూసి అందరూ ''అవును ప్రాక్టికల్గా జ్ఞాన స్వరూపం అనుభవం అవుతోంది'' అని అనాలి. ఈ శుభప్రదమైన శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ సంకల్పాల వృత్తితో వాయుమండలాన్ని తయారుచెయ్యండి. ఇలా ఏదైనా చేసి చూపించండి. ఈ రోజులలో మానసిక ప్రభావం ఎంతగా పడ్తుందో అంతగా వాచా ప్రభావం పడదు. ఒక్క మాట మాట్లాడండి, వైబ్రేషన్లు 100 మాటలవి వ్యాపింప చెయ్యండి, అప్పుడు ప్రభావం పడ్తుంది. మాటలైతే సాధారణమయ్యాయి కదా! కానీ మాటలతో పాటు ఏ వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉన్నాయో అవి ఎక్కడో లేవు, ఇక్కడనే ఉన్నాయి అని అనుభవం చేయాలి. ఈ విశేషతను చేసి చూపించండి. కాన్ఫరెన్సులైతే చేస్తున్నారు, యూత్ ప్రోగ్రాం చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇవి జరగాల్సిందే. వీటితో కూడా ఉత్సాహ-ఉల్లాసాలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఆత్మిక శక్తి అవసరం. ఈ వృత్తితో వైబ్రేషన్లు వ్యాపింపచెయ్యండి. అవి శక్తిశాలిగా ఉంటాయి. మంచిది.
Comments
Post a Comment