30-01-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
స్నేహము, సహయోగము మరియు శక్తి స్వరూపాల పేపర్ల చెకింగ్ మరియు వాటి ఫలితము(రిజల్ట్).
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న శ్రేష్ఠమైన పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఒకే స్నేహము మరియు ఒకే సృతి సంకల్పముంది. మంచి మంచి సేవాధారి, సహయోగి పిల్లలు సదా బాప్ దాదా జతలోనే ఉంటారు. దూరంగా ఉంటున్నా స్నేహం ఆధారంగా అతి సమీపంగా ఉంటారు. ఈ రోజు బాప్ దాదా ప్రతీ పుత్రుని స్నేహము, సహయోగము మరియు శక్తి స్వరూపాల శ్రేష్ఠ మూర్తిని చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు మూడు విశేషతలలో విశేషంగా ఎన్ని మార్కులున్నాయో చూస్తున్నారు. స్నేహములో ఈ మూడు విశేషతలను చూశారు.
1. ఎడతెగని స్నేహము :- పరిస్థితులు లేక వ్యక్తులు స్నేహ దారాలను తుంచుటకు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మరియు వ్యక్తులు అనే ఎత్తైన గోడలను దాటి సదా స్నేహమనే దారాలు తెగిపోకుండా ఉంటాయి. కారణాలు లేక బలహీనతల వలన ముడి పదే పదే వేయరు. ఇలాంటి స్నేహమును తెగిపోని స్నేహమని అంటారు.
2. సదా సర్వ సంబంధాలతో ప్రీతిని నిభాయించే రీతిని ప్రాక్టికల్ గా నిభాయిస్తారు. ఒక్క సంబంధపు ప్రీతి నిభాయించడంలో కూడా లోపముండదు.
3. స్నేహానికి ప్రత్యక్ష రిటర్న్ :- తమ స్నేహీమూర్తి ద్వారా ఎందరిని తండ్రి స్నేహీలుగా చేశారు? కేవలము జ్ఞానపు స్నేహీ కాదు, పవిత్రతా స్నేహీలు లేక పిల్లల జీవన పరివర్తన వలన స్నేహీలు కాదు, శ్రేష్ఠ ఆత్మల స్నేహీలు కాదు కానీ నేరుగా తండ్రికి స్నేహీలు. మీరు మంచివారు, జ్ఞానము మంచిది, జీవితము మంచిది - ఇంతవరకే కాదు, తండ్రి అత్యంత మంచివారని అనాలి. దీనినే తండ్రికి స్నేహీలుగా అవ్వడమని అంటారు. కనుక స్నేహములో ఈ మూడు విషయాలలో విశేషతను చూశారు.
సహయోగములో ముఖ్యమైన విషయాలు:- 1. నిష్కామ సహయోగులుగా ఉన్నారా? 2. సహయోగంలో మనసా, వాచా, కర్మణా, సంబంధము మరియు సంపర్కము - ఈ అన్ని రూపాలలో సహయోగులుగా సదా ఉన్నారా? 3. ఇంతటి యోగ్యమైన సత్యమైన సహయోగులుగా, ఎంతమందిని తయారు చేశారు.
శక్తి స్వరూపము:-1. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా లేక శక్తివంతులుగా అయ్యారా? 2. సమయానుసారంగా శక్తులనే అస్త్రాల లాభం తీసుకోగలుగుతున్నారా లేక అస్త్రాలు లాకర్లో పడి ఉన్నాయా? 3. 'స్వ' శక్తుల ప్రాప్తుల ద్వారా ఇతరులను మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎంతవరకు చేశారు? ఈ మూడు మాటల విశేషతలను పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో పేపర్ల చెకింగ్ జరుగుతూ ఉందని వినిపించాము కదా. కనుక ఈ రోజు ఈ పేపర్ల చెకింగ్ జరిగింది. రిజల్ట్ ఎలా ఉంది? మూడింటిలో మొత్తం మార్కుల్లో ఫుల్ పాస్, పాస్ మరియు దయ చూపుట వలన పాస్ అయినవారు - మూడు రకాలు నెంబరు వారుగా ఉన్నారు. ఫుల్ పాస్ అయినవారు సగము కంటే కూడా తక్కువమంది ఉన్నారు. పాస్ అయిన వారు 70%, దయతో పాస్ అయ్యే వారి జాబితా చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడిక ముందు ఏమి చేయాలి? ఇది తండ్రి స్వరూపము ఉన్నప్పటి రిజల్టు. కానీ అంతిమ రిజల్ట్ తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉంటాడు. ఆ చివరి రిజల్ట్ కొరకు ఇప్పుడు కేవలం ఒక మార్జిన్(చిన్న అవకాశం) ఉంది. ఇది చివరి అవకాశము. అది ఏమిటి?
1. ఒకటేమో హృదయపూర్వక అవినాశి వైరాగ్యము ద్వారా గడిచిపోయిన విషయాలను, పాత సంస్కారాల బీజాన్ని కాల్చేయండి. కాల్చే యజ్ఞాన్ని రచించాలి.
2. ఇలా కాల్చుటతో పాటు అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలను, మర్యాదలను సదా పాటించే వ్రతాన్ని తీసుకోవాలి.
3. నిరంతరం మాహాదానులుగా, పుణ్యాత్మలుగా అయ్యి ప్రజలకు దానము చేయాలి. బ్రాహ్మణులకు సదా సహయోగమునిచ్చే పుణ్యము చేయాలి. అవినాశి దాన-పుణ్యాలు చేసే కార్యము నడుస్తూ ఉండాలి. మనసా ద్వారా కాని, వాచా ద్వారా కాని లేక సంబంధ - సంస్కార్కాల ద్వారా కాని జరుగుతూ ఉండాలి. ఇలాంటి హైజంప్ చేసి డబుల్ లైట్ గా అయ్యే శ్రేష్ఠ పురుషార్థము ద్వారా ఎగిరే పక్షిగా అయ్యేవారు, రిజల్ట్ వరకు చేరుకోగలరు. కనుక అంతిమ రిజల్ట్ వరకు ఇలాంటి పురుషార్థము చేయు అవకాశముంది, అర్థమయిందా. అందుకే పరిశీలన జరుగుతున్నది. బాగా విని అర్థము చేసుకొని చివరి అవకాశము తీసుకోండి.
బ్రహ్మబాబా అన్నారు - సాకార రూపము ద్వారా పాలన జరిగింది, అవ్యక్త రూపము ద్వారా పాలన జరుగుతూ ఉంది. ఎలాగైతే సాకార పాలన పొందిన వారికి సమయ ప్రతి సమయంలో చాలా అవకాశాలు లభించాయో అలా ఇప్పుడు అవ్యక్త పాలన పొందే వారికి కూడా ఈ చివరి అవకాశపు విశేష హక్కు లభించాలి. అందుకే అవ్యక్త పాలన పొందు వారికి మరియు సాకార, ఆకార రెండింటి పాలన పొందిన వారికి, ఇద్దరికీ పరిశీలనలో మార్కులివ్వడంలో కొంచెము తేడా చూపబడింది. ప్రారంభపు వారి పేపర్ మరియు అవ్యక్త పాలన వారి పేపర్ పరిశీలించడంలో వెనక వారికి 25% ఎక్స్ ట్రా మార్కులు లభిస్తాయి. అందుకే చివరి అవకాశము ఎవరు కావాలో వారు తీసుకోవచ్చు. ఇప్పుడింకా సీట్లు అయిపోయాయని విజిల్ మ్రోగలేదు. అందుకే అవకాశము తీసుకోండి, సీటు తీసుకోండి.
కర్ణాటక వారు సీట్ తీసుకోవడంలో ఎలాగైనా తెలివైనవారుగా ఉన్నారు. ఇక్కడ ఎలాగైతే దగ్గరి సీట్ తీసుకోవాలనుకుంటారో, అలా అంతిమంలో కూడా దగ్గరి సీట్ తీసుకోండి. కర్ణాటక వారు సులభంగా రాజీ అవుతారు(సంతోషిస్తారు) కదా. సదా జ్ఞాన రహస్యాల్లో నడుచుకుంటారు, కోపగించుకోరు కూడా.
ఇలా సదా రాజయుక్త, యోగయుక్త, యుక్తియుక్త కర్మ చేయువారు - ఇటువంటి సదా శ్రేష్ఠ ఆత్మలకు, సదా సర్వశక్తివంతులైన తండ్రి సాంగత్య రంగులో ఉండువారు - ఇలాంటి ఆత్మలకు, మహాదానీ, మహాపుణ్యాత్మ పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
విదేశీ సేవలో సఫలతా మూర్తులగుటకు బాప్ దాదా సూచనలు:-
విదేశీ సేవలో విశేషంగా శాంతి(సైలెన్స్) శక్తి అధిక సఫలతనిస్తుంది. ఎందుకంటే అక్కడి ఆత్మలు ఒక్క సెకండు శాంతి కావాలన్నా అన్ని చోట్లా వెతుకుతారు. ఇలా వెతికే ఆత్మలకు ఒకటి శాంతి, రెండవది ఆత్మిక స్నేహమును ఇవ్వండి. స్నేహముతో శాంతిని అనుభవం చేయించండి. ప్రేమ లోటూ ఉంది, శాంతి లోటు కూడా ఉంది. అందుకే ఏ ప్రోగ్రామ్ చేసినా అందులో ముందు తండ్రి స్నేహ సంబంధాన్ని మహిమ చేయండి తర్వాత ఆ ప్రేమతో ఆత్మల సంబంధాన్ని జోడించిన తర్వాత శాంతిని అనుభవం చేయించండి. భలే డ్రామా చేయండి లేక మాట్లాడండి కాని మీ ఉపన్యాసము కూడా ప్రేమ స్వరూపము, శాంతి స్వరూపముల బ్యాలన్స్ తోనే ఉండాలి. ఇదే ముఖ్యమైన విషయంగా ఉండాలి. మిగిలినవి వేరు వేరు రూపాలతో ఉండాలి. ఉపన్యాసంలో కూడా అదే అనుభవం చేయించండి, డ్రామాలో కూడా అదే అనుభవం చేయించండి. రకరకాలుగా ఒకే అనుభవం చేయిస్తే దాని ముద్ర పడతుంది. భలే చిన్న చిన్న ప్రోగ్రామ్ లు చేయండి లేక పెద్దవి కూడా చేయండి. కాని పెద్ద ప్రోగ్రామ్ చేయుటకు ముందు సమీప సంపర్కములో ఉండే వెరైటీ ఆత్మలను తయారు చేయాలి. అప్పుడేం జరుగుతుంది? వెరైటీ ఆత్మల సేవ చేస్తే అన్ని రకాల ఆత్మలు అందులో పాల్గొంటారు. సహయోగులుగా అవుతారు. ప్రోగ్రామ్ శోభిస్తుంది. మామూలుగా కూడా వెరైటీ బాగుంటుంది కదా. కనుక వివిధ వర్గాలవారి సంపర్క సంబంధాలను మొదటి నుంచే ఉంచుకుంటే ఏ కార్యమైనా సఫలమైపోతుంది. పోతే ఎవరైతే విదేశీ సేవకు నిమిత్తమైనారో వారికి బాప్ దాదా, వారి విశేష సేవ మరియు స్నేహానికి రిటర్న్ గా పదమాల రెట్ల ప్రియస్మృతులు ఇస్తున్నారు.
2) జ్ఞానరూపి తాళం చెవి ద్వారా భాగ్యమనే ఖజానా ప్రాప్తి అవుతుంది. ఈ సంగమ యుగములో భాగ్యము తయారు చేసుకొనే జ్ఞానరూపి తాళం చెవి లభిస్తుంది. తాళం చెవిని ఉపయోగించండి. ఎంత భాగ్యము తయారు చేసుకోవాలంటే అంత భాగ్య ఖజానా తీసుకోండి. అందరూ తాళం చెవి ఉపయోగించడంలో తెలివైనవారే కదా. తాళంచెవి లభించింది, సంపన్నులైపోయారు. ఎంత సంపన్నంగా అవుతూ పోతారో స్వతహాగా అంత ఖుషీ ఉంటుంది. ఎలాగైతే సెలయేరు నుండి నీరు వస్తూ ఉంటుందో అలా సంతోషపు సెలయేరు సదా ప్రవహిస్తూనే ఉండాలి, తరగకుండా, అవినాశిగా ఉండాలి. బాప్ దాదా కూడా సదా అందరి భాగ్య నక్షత్రాలను చూసి హర్షితమవుతున్నారు.
ఇంజనీర్ల గ్రూపుతో అవ్యక్త బాప్ దాదా కలయిక- ఇంజనీర్లనగా ప్లానింగ్ బుద్ధి గలవారు. ఇంజనీర్లు సదా ప్లాన్ తయారు చేసినా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. కనుక ఇంజనీర్ల గ్రూపు అనగా ఆత్మిక ప్లానింగ్ బుద్ధి గలవారి గ్రూపు, అలా ఉన్నారా? ఈ ఆత్మిక సేవలో కూడా ప్లానింగ్ బుద్ధితో సేవకు ప్లాన్ తయారు చేస్తారా? కొత్త ప్లాను తయారు చేస్తారా లేక తయారు చేసిన ప్లాను అమలులోకి తెస్తారా? ప్లానింగ్ బుద్ధి గలవారైతే ప్లాను తయారు చేయకుండా ఉండలేరు. ఎవరు ఏ పని చేయుటకు అలవాటు పడ్డారో వారు వద్దనుకున్నా ఆ పనిలో సదా బిజీగా ఉంటారు. కనుక సదా ఎలాగైతే ఆ డిపార్టుమెంటును గురించి - ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా సఫలంగా తయారుచేయాలి, ఏ విధానము ద్వారా వృద్ధి చేయాలి అని గమనముంచుటే ఇంజనీర్ల పనిగా ఉంటుందో అలా ఆత్మిక ఇంజనీర్లు ఈశ్వరీయ సేవను విధి పూర్వకంగా ఎలా వృద్ధి చేయాలని ప్లాన్లు తయారు చేయాల్సి పడ్తుంది. ఒకవేళ ఇంతమంది అందరూ నూతన ప్లాన్లు తయారుచేస్తే ఇన్ని ప్లాన్ల ద్వారా నూతన ప్రపంచం త్వరగానే వచ్చేస్తుంది. ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ సఫలత లభించే ప్లాన్లు తయారుచేయండి. ఎలాగైతే ఒక్క స్యాక్రిన్ చుక్క చాలా తీపినిస్తుందో అలా ప్లాను శక్తివంతముగా ఉండాలి, అయితే అది పొదుపు చేసేదిగా ఉండాలి. ఇప్పటి సమయానుసారము పొదుపుగానూ ఉండాలి, శక్తిశాలిగానూ ఉండాలి. ఆత్మిక ప్రభుత్వములోని ఇంజనీర్లు ఇటువంటి ప్లాన్లు తయారుచేయండి. ఎలాగైతే ఒక పరిశ్రమ ద్వారా అనేకమందికి పని కల్పించాలని అనుకుంటారో అలా ఇక్కడ కూడా ప్లాను పొదుపయ్యేదిగా, అనేక మందికి సందేశము అందించేదిగా ఉండాలి. అక్కడ ఎలాగైతే అనేకమందికి జీవనాధారము లభించాలని అనుకుంటారో అలా ఇక్కడ కూడా అనేకమందికి సందేశము లభించాలి. ఇక్కడ చాలామంది ఇంజనీర్లు కావాలి. ఎందుకంటే సత్యయుగములో ఇంజనీర్లు తక్కువ సమయములో అందమైన వస్తువులను తయారుచేస్తారు. అయితే ఆ సంస్కారము ఇక్కడ నుండే ఉండాలి కదా. అప్పుడే కదా ఇలాంటి ప్లాన్లు తయారు చేయగల్గేది. మీరు రాజులుగా అయినా తయారు చేసేందుకు ఐడియాలిస్తారు. కనుక నూతన ప్రపంచ ప్లాను తయారు చేయుటకు, సేవలో సఫలత పొందేందుకు కూడా ఇంజనీర్లు కావాలి. కనుక మీకు చాలా గొప్ప మహత్వముంది. మాకు ఇంత గొప్పతనముంది అని భావించి నడుస్తున్నారా? ప్రతి ఒక్కరు "నేను సఫలతకు ఋజువునివ్వాలి" అని భావించాలి. కొత్త కొత్త ప్లాన్లు తయారుచేసి మొదట తమ తమ జోన్లలో ప్రాక్టికల్ లోకి తీసుకురండి. తర్వాత మొత్తం విశ్వమంతా కాపీ చేస్తుంది. పాస్ కానందుకు కారణం ఆ ప్లాను పొదుపైనదిగా ఉండదు. పొదుపు మరియు సఫలత రెండూ ఉండే ప్లాన్లను అందరూ పాస్ చేస్తారు. కనుక 60 మంది ఇంజనీర్లు 60 ప్లాన్లు తయారుచేస్తే ఈ సంవత్సరం(1980)లోనే సమాప్తమైపోతుంది. ఒక సెకండులోనే సమాప్తం కాదు. మెల మెల్లగా పరివర్తనవుతుంది. కానీ ప్రారంభమై అందరి హృదయాల నుండి ఇప్పుడు నూతన ప్రపంచము రాబోతుంది అనే శబ్ధము రావాలి. ఎలాగైతే సైన్సువారు చంద్రుని పైకి వెళ్లి కొద్దిగా మెరుపు చూపుతూనే అందరూ చంద్రమండలంలో ప్లాటు కొనుక్కునేందుకు ఏర్పాట్లు ప్రారంభించారో అలా సైలెన్సు శక్తి వారు కనీసము నూతన ప్రపంచములో ప్లాటు కొనుక్కునేందుకు ఏర్పాట్లయినా చేయించండి. బుక్కింగ్ చేసుకోనివ్వండి. ఎలాగైతే సైన్సువారు ఏదైనా ఒక ఆవిష్కారాన్ని ప్రయోగశాలలో చేసిన తర్వాత అందరికీ చెప్తారో అలా మీరు కూడా ముందు మీ ఏరియా అనే ప్రయోగశాలలో ప్లానును ప్రయోగించండి. తర్వాత దానిని అందరూ అంగీకరిస్తారు. ముందు ప్లానుకు ప్రాక్టికల్ సఫలత వెలువడాలి. ఎవరైతే ప్రదర్శినీలను, మేళాలను చూచారో వారికిప్పుడు కొత్త ప్లాను కావాలి, కొత్త ఆకర్షణలు కావాలి. కనుక ప్లానింగ్ బుద్ది గలవారై ప్లాన్లు తయారు చేయండి. డ్రామానుసారము మీకు ఏ విశేషత లభించిందో ఆ విశేషతను కార్యములో (సేవలో) ఉపయోగించుట అనగా విశేషమైన లాటరీ లభించుట. కొత్త కొత్త సాధనాలను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి. కాగితముపై కాదు, ప్రాక్టికల్ గా చెయ్యండి. అక్కడైతే కాగితము వరకే పరిమితమౌతాయి. కాని ఇక్కడ ప్రాక్టికల్ ప్లానుగా ఉండాలి. అచ్ఛా, ఓంశాంతి.
జడ్జీలు, వకీళ్ల గ్రూపుతో అవ్యక్త బాప్ దాదా మిలనము - అందరూ సదా స్వయాన్ని స్వతంత్రము చేసుకొని అనేక ఆత్మలను అనేక బంధనాల నుండి స్వతంత్రము చేసే సేవలో సదా బిజీగా ఉంటున్నారా? అందరికీ ఎలాగైతే ఎక్కడైనా చిక్కుకొని ఉన్నవారిని విడిపించే లౌకిక కార్యముందో అలా ఈ గ్రూపంతా ఎవరినైనా విడిపించేవారిగా ఉన్నారా? వారైతే ఆ ప్రభుత్వము లెక్కలో చిక్కుకున్న వారిని విడిపిస్తారు లేక ఎవరైనా ఒక వ్యక్తి వికారాలకు వశమై చెడ్డ పని చేస్తే వారిని విడిపిస్తారు లేక చిక్కుకునేట్లు చేస్తారు. అప్పుడప్పుడు సత్యము, అప్పుడప్పుడు అసత్యము చెప్తారు. అలాగే ఇక్కడ మీరు ఆత్మిక కార్యములో సదా ప్రతీ ఆత్మను స్వతంత్రులుగా చేసేవారు, ఎంతమందిని స్వతంత్రులుగా చేశారు? ఈరోజు రిజల్టు తీసుకునే రోజు. కనుక ఎంతమందిని స్వతంత్రులుగా చేశారు? ఆ సేవను నిమిత్తమాత్రం ఈశ్వరీయ సేవ కొరకు చేస్తారు. లేకుంటే పాండవులు వారి సేవ చేయుటకు సమయాన్ని ఎందుకివ్వాలి? ఈ సేవ ద్వారా లాభము పొందేందుకు గుప్త సేవాధారులై ఆ సేవలో ఉంటారు. పాండవులు గుప్త రూపంలో వెళ్లారని గాయనముంది. వారు నీరు నింపుటకో లేక పాదాలు వత్తుటకో వెళ్లలేదు. కాని గుప్త వేషంలో రాజ్యాన్ని పరివర్తన చేయుటకు సేవాధారులై వెళ్లారు. అలాగే మీరు కూడా గుప్త వేషములో విశ్వ రాజ్యాన్ని పరివర్తన చేసేందుకు వెళ్లారు. కనుక సదా ఈ కార్యములోనే ఉన్నారా? లౌకిక సేవ అనగా సంపర్కము పెంచుకునే సేవ. ఇటువంటి లక్ష్యాన్ని ఉంచుకొని అవే లక్షణాలతో సదా సేవలో ఉంటున్నారా? ఇప్పుడు ప్రతీ వర్గము వారు తమ తోటివారి సంఖ్యను పెంచాలి. ఎందుకంటే ప్రతీ వర్గము వారు తమ వర్గము వారిపై కనీసము జతలో ఉన్న మాకైనా తెలపాలి కదా అని తప్పక ఫిర్యాదు చేస్తారు.
డబల్ సేవకు అవకాశము తీసుకుంటూ ఉండండి. మీ సంపర్కములోకి ఏ ఆత్మలు వచ్చినా వారిని తండ్రి సంపర్కములోకి తీసుకురండి. లౌకిక సేవ ద్వారా కూడా సహయోగమివ్వండి. ఈశ్వరీయ సేవ ద్వారా సుఖ-శాంతులకు మార్గము తెలపండి. అలా చేస్తే అందరూ మిమ్ములను మహాపుణ్యాత్మలనే దృష్టితో చూస్తారు. అచ్ఛా
Comments
Post a Comment