29-03-1981 అవ్యక్త మురళి

29-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్ఞాన సారము – “నేను మరియు నా బాబా.

బాప్ దాదా పిల్లలందరిని సంపన్న స్వరూపంగా తయారుచేసేందుకు ప్రతిరోజు రకరకాల పాయింట్లు చెబుతూ ఉంటారు. అన్ని పాయింట్ల సారము - “అన్ని విషయాలను సారములో ఇముడ్చుకొని బిందువుగా అయిపోండి.” ఈ అభ్యాసము నిరంతరం ఉంటుందా? “ఏ కర్మ చేస్తున్నా నేను జోతిర్టిందువును, ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మ చేయించేవాడను” అనే స్మృతి ఉంటుందా! ఈ మొదటి పాఠాన్ని స్వరూపంలోకి తెచ్చారా? ఆదిలోనూ ఇదే, అంతములోనూ ఇదే స్వరూపంలో స్థితమైపోవాలి. కావున ఇది ఒక సెకండులోని జ్ఞానము. సెకండులో జ్ఞాన స్వరూపంగా అయ్యారా? విస్తారాన్ని ఒక సెకండులో ఇముడ్చుకునే అభ్యాసముందా? విస్తారములోకి రావడము ఎంత సహజమో సార స్వరూపముగా అగుట కూడా అంత సహజంగా అనుభవమవుతుందా? సార స్వరూపములో స్థితులై విస్తారములోకి రావాలి. ఈ మాట మర్చిపోవడం లేదు కదా? సార స్వరూపములో స్థితులై విస్తారములోకి వస్తే మిమ్ములను ఏ విధమైన విస్తారమూ ఆకర్షించదు. విస్తారాన్ని చూస్తూ, వింటూ, వర్ణన చేస్తూ ఒక ఆట ఆడుతూ ఉన్నట్లు అనుభవము చేస్తారు. ఈ అభ్యాసము సదా స్థిరంగా ఉండాలి. దీనినే సహజ స్మృతి అని అంటారు.

జ్ఞానంలో గాని, అజ్ఞానంలో గాని జీవితంలో ప్రతి కర్మలో రెండు మాటలు ఉపయోగపడ్డాయి. అవి ఏవి? "నేను” మరియు “నాది” ఈ రెండు శబ్దాలలో జ్ఞాన సారం కూడా ఉంది. నేను జ్యోతిర్బిందువును లేక శ్రేష్ఠ ఆత్మను. బ్రహ్మకుమార్‌ను లేక బ్రహ్మకుమారిని. నాకు ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. 'నా బాబా' అనే దానిలో అన్నీ వచ్చేస్తాయి. నా బాబా అంటూనే, బాబా నా వారసత్వం అయిపోయినట్లే. కావున నేను, నాది అనే ఈ రెండు మాటలు పక్కాగా ఉన్నాయి కదా! 'నా బాబా' అని అన్నందున అందులో రకాల 'నాది' ఇమిడిపోతుంది. ఇప్పుడీ ఈ రెండు మాటలు స్మృతిలోకి తీసుకురావడం కష్టమా లేక సహజమా? ఇంతకు ముందు కూడా ఈ రెండు మాటలు మాట్లేడేవారు, ఇప్పుడు కూడా ఈ రెండు మాటలే మాటాడ్తారు. కానీ ఎంత తేడా ఉంది? 'నేను మరియు నాది.' ఈ మొదటి పాఠాన్నే మర్చిపోతారా? ఇది చిన్న బాలుడు కూడా గుర్తుపెట్టుకోగలడు. మీరు నాలెడ్జ్ ఫుల్ కదా! నాలెడ్జ్ ఫుల్ అయిన మీరు రెండు మాటలు గుర్తుపెట్టుకోలేక పోవడం జరుగుతుందా! ఈ రెండు మాటలతో మాయాజీతులుగా, నిర్విఘ్నంగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారవ్వగలరు. ఈ రెండు మాటలు మర్చిపోతే మాయ వేలాది రూపాలలో వస్తుంది. ఈ రోజు ఒక రూపంలో వస్తుంది, రేపు మరో రూపంలో వస్తుంది. ఎందుకంటే మాయ యొక్క నాది-నాది అనేది చాలా పెద్దగా విస్తారంగా ఉంది. “నా బాబా” అయితే ఒక్కరే. ఒక్క బాబా ముందు మాయ యొక్క వేల రూపాలు కూడా సమాప్తమైపోతాయి. ఇలాంటి మాయాజీతులుగా అయ్యారా? మాయకు విడాకులు ఇవ్వడంలో సమయం ఎందుకు పడుతుంది? ఇది ఒక సెకండు వ్యాపారమే(పనే). ఇందుకు సంవత్సరాలు ఎందుకు పడుతుంది (ఉపయోగిస్తున్నారు)! వదిలిపెడితే వదిలిపోతుంది. కేవలం “నా బాబా" తర్వాత అందులోనే మగ్నమై ఉంటారు. తండ్రి మాటిమాటికీ ఇదే పాఠం చదివించాల్సి వస్తుంది. ఇతరులను చదివిస్తారు కూడా అయినా మర్చిపోతారు. ఇతరులకు “స్మృతి చెయ్యండి, స్మృతి చెయ్యండి” అని చెప్తారు. మరి స్వయం ఎందుకు మర్చిపోతారు. మర్చిపోని వారిగా అయ్యేందుకు తేదీని ఫిక్స్ చేయండి. అందరి తేదీ ఒకటేనా లేక వేరు వేరుగా ఉంటుందా? ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారో వారందరి తేదీ ఒకటేనా? తర్వాత ఇతర విషయాలు సమాప్తమైపోతాయా! సంతోష వార్తలు భలే వినిపించండి కానీ సమస్యలు వినిపించకండి. మేళా లేక ప్రదర్శినీ చేయునపుడు ప్రారంభోత్సవం కొరకు కత్తెరతో పూల మాలను కట్ చేయిస్తారు కదా. మరి ఈ రోజు ఏమి చేస్తారు? స్వయం మీరే కత్తెరను చేతిలోకి తీసుకుంటారా! కత్తెర కూడా రెండు వైపులా కలిసినపుడే వస్తువు తెగుతుంది. కావున జ్ఞానం మరియు యోగం రెండిటి కలయికతో మాయ కలిగించే సమస్యల బంధనాలు సమాప్తమైపోయాయనే సంతోషకర వార్తను వినిపించండి. ఈరోజు సమస్యల బంధనాలను సమాప్తి చేసే (కట్ చేసే) రోజు. ఒక్క సెకండు మాటే కదా? తయారుగా ఉన్నారు కదా? బాబా ఆలోచించి ఈ బంధనాలను తెంచుతాము అనేవారు చేతులెత్తండి. అంటే డబల్ విదేశీయులందరూ తీవ్ర పురుషార్థుల లిస్ట్(జాబితా)లోకి వచ్చేస్తారు. వినే సమయంలోనే అందరి ముఖాలు మారిపోయాయి. ఇక సదాకాలం కొరకు తయారైపోతే ఏమవుతుంది! అందరూ నడుస్తూ-తిరుగుతూ ఉన్న అవ్యక్త వతన ఫరిస్తాలుగా కనిపిస్తారు. తర్వాత సంగమ యుగము, ఫరిస్తాల యుగముగా తయారైపోతుంది. ఈ ఫరిస్తాల ద్వారానే దేవతలు ప్రత్యక్షమవుతారు. ఫరిస్తాల గురించి దేవతలు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. వారు కూడా మేము వచ్చేందుకు యోగ్య స్థితి తయారయిందా అని చూస్తున్నారు. ఫరిస్తాలు మరియు దేవతలు ఇరువురి చివరి క్షణాలు కలుస్తాయి. దేవతలు, ఫరిస్తాలైన మీ అందరి కోసం వరమాల పట్టుకొని ఎదురు చూస్తున్నారు. కనుక ఫరిస్తాలను వరించేందుకు మీ దైవీ పదవి ఎదురు చూస్తూ ఉంది. దేవతల ప్రవేశము సంపన్న శరీరములోనే అవుతుంది కదా. వీరు 16 కళా సంపన్నులుగా అవ్వాలి, వరమాలను ధరించాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని కళలు తయారయ్యాయి? సూక్ష్మవతనంలో సంపన్న ఫరిస్తా స్వరూపము మరియు దేవతల మిలన దృశ్యము చాలా బాగుంటుంది. ఫరిస్తాలకు బదులు పురుషార్థ స్వరూపంగా ఉంటే దేవతలు కూడా దూరము నుండి చూస్తూ ఉంటారు. సమయ ప్రమాణంగా సమీపంగా వస్తూ వస్తూ కూడా సంపన్నంగా కాని కారణంగా అలా ఉండిపోతారు. ఈ వరమాలను ధరింపజేసే తారీఖు కూడా నిశ్చితం చెయ్యాల్సి ఉంటుంది. మరి ఇది ఏ తేదీన ఉంటుంది? తేదీ నిశ్చితం చేసుకుంటే ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు వచ్చేస్తాయి. ఆ తేదీ అయితే ఈ రోజు అయిపోయింది. ఈ తేదీ కూడా సమీపానికి వస్తుంది కదా! ఎందుకంటే 'నిర్విఘ్న భవ' స్థితి కొంచెం సమయం సదా ఉండాలి. అప్పుడే చాలా కాలం వరకు నిర్విఘ్న రాజ్యం చెయ్యగల్గుతారు. ఇప్పుడు సమస్యల గురించి, సమాధానాల గురించి జ్ఞానస్వరూపులై పోయారు. ఏ విషయాన్నైనా ఎవరినైనా ఆడుగుతున్నారంటే దాని కంటే ముందు జ్ఞానం ఆధారంతో ఇది ఇలా జరగాలి అని అర్థం చేసుకుంటారు. ఇతరుల నుండి కష్టం తీసుకునేందుకు బదులు, సమయం పోగొట్టుకోవడానికి బదులు అదే జ్ఞానం యొక్క లైట్-మైట్ ఆధారంతో సెకండ్ లో సమాప్తి చేసి ముందుకు ఎందుకు వెళ్లరు? కేవలం జరుగుతుందంటే మాయ దూరం నుండే తన నీడను వేసి బలహీనులుగా చేసేస్తుంది. మీరు ఆ క్షణంలో బాబాతో సంబంధాన్ని మంచిగా చేసుకోండి. కనెక్షన్ బాగుంటే స్వతహాగా మాస్టర్ సర్వశక్తివంతులైపోతారు. మాయ సంబంధాన్ని వదులుగా, బలహీనంగా చేస్తుంది. కేవలం దానిని సంభాళించుకోండి. కనెక్షన్ ఎక్కడో వదులయిందని అందుకే బలహీనత వచ్చిందని అర్థం చేసుకోండి. ఎందుకు అయింది, ఏమయింది? ఎందుకు, ఏమిటి అని ఆలోచించుటకు బదులు కనెక్షన్‌ను బాగు చేసుకుంటే మాయ సమాప్తమైపోతుంది. సహయోగము కొరకు భలే సమయం మంచిగా తీసుకోండి. యోగం యొక్క వాయుమండలం వైబ్రేషన్స్ తయారుచేయడానికి సహయోగం తీసుకోండి కాని వ్యర్ధమైన విషయాలు మాట్లాడటం లేక వాటి విస్తారంలోకి వెళ్ళడం వీటి కొరకు ఎవరి సాయం (తోడును) తీసుకోకండి. అది శుభచింతన అయితే రెండవది పరచింతన అవుతుంది. అన్ని సమస్యలకు మూల కారణం సంబంధం వదులవ్వడమే. ఇదే అసలు విషయం. నా డ్రామాలో లేదు, నాకు సహయోగం లభించలేదు, నాకు స్థానం లభించలేదు. ఇవన్నీ వ్యర్థమైన మాటలే. కేవలం కనెక్షన్ మంచిగా ఉంచుకుంటే అన్నీ లభిస్తాయి. సర్వశక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికీ వెళ్లే పురసత్తే ఉండదు. బాప్ దాదా ముందు వెళ్ళి కూర్చుండిపోతే సంబంధాన్ని జోడించేందుకు బాప్ దాదా మీకు సహయోగిగా అవుతారు. ఒకటి రెండు క్షణాలు అనుభవం కాకపోయినా తికమకపడకండి. కనెక్షన్ కొంచెం తెగిపోయి ఉంది. దానిని కలుపుటకు ఒక్క క్షణం లేక ఒక్క నిమిషం పట్టినా ధైర్యాన్ని విడనాడకండి. నిశ్చయం అనే పునాదిని కదిలించకండి. ఇంకా నిశ్చయాన్ని పరిపక్వం చేసుకోండి. 'బాబా నా వాడు, నేను బాబా వాడిని” ఇదే ఆధారంతో నిశ్చయం అనే పునాదిని ఇంకా పక్కా చేసుకోండి. తండ్రిని కూడా తమ నిశ్చయం అనే బంధనంలో బంధించగలరు. తండ్రి కూడా ఆ బంధనం నుండి వెళ్లలేరు. ఇంత గొప్ప అథారిటి ఈ సమయంలో పిల్లలకు లభించి ఉంది. అథారిటిని, జ్ఞానాన్ని ఉపయోగించండి. పరివార సహయోగాన్ని ఉపయోగించండి. ఫిర్యాదులను తీసుకొని వెళ్ళకండి, సహయోగాన్ని కూడా అడగకండి. ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి. బలహీనంగా అయ్యి వెళ్లకండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని భయపడుతూ వెళ్ళవద్దు కానీ సంబంధం ఆధారంతో, సహయోగం ఆధారంతో వెళ్ళండి. అర్థమయిందా! సెకండ్ లో మెట్లు దిగి, సెకండ్ లో పైకి ఎక్కే సంస్కారాన్ని పరివర్తన చేసుకోండి. డబల్ విదేశీయులు కిందకూ త్వరగా దిగుతారు, పైకీ త్వరగా ఎక్కుతారు. ఇది బాప్ దాదా చూశారు. నాట్యం కూడా చాలా చేస్తారు. కానీ భయపడే డాన్స్ కూడా బాగా చేస్తారు. ఇప్పుడిది కూడా పరివర్తన చేయండి. మాస్టర్ జ్ఞానవంతులుగా అయిన తర్వాత కూడా ఈ డాన్స్ ఎందుకు చేస్తారు?

సత్యత మరియు స్వచ్ఛతల లిఫ్ట్ కారణంగా ముందుకు కూడా వెళ్తూ ఉన్నారు. ఇది నెంబరు వన్ విశేషత. ఈ విశేషతను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం భయపడే నృత్యాన్ని వదిలి పెడితే చాలా వేగంగా ముందుకు వెళ్తారు. చాలా ముందు నెంబరు తీసుకుంటారు. లాస్టులో వచ్చిన వాళ్లు ఫాస్ట్ గా వెళ్తారు, ఫాస్ట్ గా వెళ్ళేవారే ఫస్టులోకి వెళ్తారు(లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్) అనే విషయం అందరికి దృఢంగా ఉంది కదా! భలే సంతోషంగా నృత్యము చెయ్యండి. తండ్రి చెయ్యి వదిలేస్తే వీరు ఎక్కడికి వెళుతున్నారని తండ్రికి కూడా మంచిగా అనిపించదు. తండ్రి చేతిలో చెయ్యి ఉంటే భయపడే డ్యాన్స్ జరగదు. మాయ చెయ్యి పట్టుకుంటే ఆ డ్యాన్స్ జరుగుతుంది. మీపై తండ్రికి ఎంత ప్రేమ ఉందంటే ఇతరులతో వెళ్ళడం చూడను కూడా చూడలేరు. ఎంతగానో భ్రమిస్తూ బాధలు పడిన తర్వాత తండ్రి వద్దకు చేరుకున్నారని తండ్రికి తెలుసు. కనుక సంశయములోకి వెళ్ళేటట్లుగా ఎలా చేస్తారు! సాకార రూపంలో కూడా స్థూలంగా పిల్లలు ఎక్కడికైనా వెళుతూ ఉంటే రండి పిల్లలూ, రండి పిల్లలూ...... అని అనడం చూశారు. మాయ తన రూపాన్ని చూపినప్పుడు ఈ మాట స్మృతిలో ఉంచుకోండి.

అమృతవేళ స్మృతిని శక్తివంతంగా చేసుకునేందుకు మొదట తమ స్వరుపాన్ని శక్తివంతంగా తయారు చేసుకోండి. బిందు రూపంలోనైనా కూర్చోండి, ఫరిస్తా స్వరూపములోనైనా కూర్చోండి. కారణం ఏముంటుంది - స్వయం తమ రూపాన్ని పరివర్తన చేసుకోరు. కేవలం తండ్రిని మాత్రమే ఆ స్వరూపంలో చూస్తారు. తండ్రిని బిందు రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ స్వయం అలా తయారుకానంత వరకు మిలనము చేసుకోలేరు. కేవలం తండ్రిని మాత్రమే ఆ రూపంలో చూసేందుకు ప్రయత్నం చేయడం భక్తి మార్గముతో సమానమైపోతుంది. వారు దేవతలను వారు ఆ రూపంలో చూస్తూ స్వయం ఎలా ఉన్నవారు అలాగే ఉండిపోతారు. ఆ సమయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొంత సమయం వరకు ఆ ప్రభావం ఉంటుంది కానీ ఆ అనుభూతి జరగదు. అందువలన మొదట స్వ స్వరూపాన్ని పరివర్తన చేసుకునే అభ్యాసం చేయండి. తర్వాత చాలా శక్తిశాలి స్థితి అనుభవం అవుతుంది. 

దాదీలతో :- వెరైటిని చూసి సంతోషంగా ఉంది కదా! అయినా మంచి ధైర్యం కలిగినవారు తమకు ఉన్నదంతా పరివర్తన చేసుకొని, ఇతరులను తమవారిగా చేసుకొనుట ఇది కూడా వీరి ధైర్యము. మన పరివారము వారిగా అనిపించేట్లుగా పరివర్తనైపోయారు. ఇది కూడా డ్రామాలో వీరి విశేష పాత్రగా ఉంది. మావారు అనే భావనతోనే ముందుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరిని చూసి సంతోషమవుతుంది, మొదట ఒకే భారతదేశం యొక్క అనేక కొమ్మల ఒకే వృక్షముగా ఉండేవారు. కానీ ఇప్పుడు విశ్వం నలువైపుల నుండి అనేక సంస్కారాలు, అనేక భాషలు, అనేక ఆహార పానీయాలు. ఆత్మలందరూ కలిసి ఒకే వృక్షము వారిగా అయ్యారు. ఇది కూడా అద్భుతమే కదా. అందరూ ఒకటిగానే ఉండేవారు, ఇప్పుడున్నారు తర్వాత ఉంటారు. ఇదే అద్భుతము. ఇలాగే అనుభవము చేస్తున్నారు. విశేషించి సర్వుల స్నేహము ప్రాప్తిస్తూనే ఉంటుంది. 

పాండవులతో :- అందరూ మహాదానులే కదా! ఎవరికైనా సంతోషాన్ని ఇవ్వడం - ఇది అన్నింటికంటే గొప్ప పుణ్య కార్యము, గొప్ప సేవ. పాండవులు సదా ఏకరసంగా, ఐకమత్యంతో ఉంటూ పొదుపు చేసేవారు కదా! పాండవులందరూ మహిమా యోగ్యులుగా ఉన్నారు. పూజ్యనీయులుగా కూడా ఉన్నారు. భక్తుల కొరకైతే ఇప్పుడు కూడా పూజ్యనీయులుగా ఉన్నారు. కేవలం ప్రత్యక్షం కాలేదు.(పాండవుల పూజ కేవలం గణేశుడు లేక హనుమంతుని రూపంలోనే ఉంటుంది) కాదు. ఇతర దేవతలు కూడా ఉన్నారు. గణేశుడు అనగా పొట్టలో అన్ని మాటలను దాచుకునేవారు. హనుమంతుడు తోకతో రాక్షస సంస్కారాలను కాల్చేసేవారు. తోక కూడా సేవ కొరకే ఉంది, తోక తోకకు తోక కాదు, పాండవుల విశేషత - విషయాలను జీర్ణం చేసుకుంటారు. అటూ ఇటూ చేసేవారు కాదు. అందరూ సదా సంతుష్టంగా ఉన్నారు కదా. పాండవపతి మరియు పాండవులు - ఇది సదా కొరకు కంబైండు రూపము. పాండవ పతి పాండవులు లేకుండా ఏమీ చేయలేడు. ఎలాగైతే శివశక్తులున్నారో అలా పాండవ పతిని ముందుంచారు. కనుక సదా కంబైండు రూపము గుర్తుంటుందా? ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా అనుభవం చేయడం లేదు కదా? ఎవరైనా స్నేహితుడు కావాలని అనుభవం చేయడం లేదు కదా ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విధంగా లేరు కదా! సదా కంబైండు రూపంలో ఉండేవారి ముందు బాప్ దాదా సాకారంలో అన్ని సంబంధాలతో ఎదురుగానే ఉంటారు. ఎంత శ్రద్ధ ఉంటే అంత త్వరగా తండ్రి ఎదురుగా ఉంటారు. తండ్రి నిరాకారుడు, ఆకారుడు ఎలా మాట్లాడాలి అని అనుకోకండి. పరస్పరంలో మాట్లాడుకోవడానికైనా సమయం పడుతుంది. వారిని వెతకవలసి పడ్తుంది. ఇక్కడ వెతకడానికి సమయం కూడా అవసరము లేదు. ఎక్కడకు పిలిస్తే అక్కడకు హాజరవుతారు. అందుకే హాజిర్ హజూర్ అని అంటారు. ఇలా అనుభవం అవుతూ ఉందా? ఇప్పుడింకా రోజు రోజుకీ ఎలా చూస్తారంటే - ఎలాగైతే ఈ రోజు బాప్ దాదా వచ్చారు, ఎదురుగా వచ్చి చెయ్యి పట్టుకున్నారని అనుభవం చేశారో అలా బుద్ధితో కాదు, కళ్ళతో చూస్తారు, అనుభవమవుతుంది. కానీ ఇందులో కేవలం ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అనే పాఠం పక్కా చేసుకోండి. తర్వాత ఎలాగైతే నీడ తిరుగుతూ ఉంటుందో అలా బాప్ దాదా మీ కళ్ళ ముందు నుండి తొలగిపోలేరు. హద్దు వైరాగ్యం ఎప్పుడూ రావడం లేదు కదా? బేహద్ వైరాగ్యమైతే ఉండాల్సిందే. అందరూ యజ్ఞ సేవ బాధ్యతనైతే తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మనందరమూ ఒక్కటే. మనందరి పనీ ఒక్కటే అని ప్రత్యక్షంగా కనిపించాలి. ఇప్పుడు ఒక రికార్డు తయారు చేయాలి. అది ఏమిటి? అది నోటి ద్వారా వచ్చిన మాటల రికార్డు కాదు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే రికార్డు. ఈ రికార్డ్ తరువాత నలువైపులా మ్రోగుతుంది గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవమివ్వాలి, పెద్దవారికి కూడా ఇవ్వాలి. ఈ రికార్డు ఇప్పుడు వెలువడాలి. ఇప్పుడు నలువైపులా ఈ రికార్డు అవసరం ఉంది.

స్వ ఉన్నతి మరియు విశ్వ ఉన్నతి రెండిటి ప్లాన్లు జత జతలో ఉండాలి. దైవీ గుణాల గొప్పతనాన్ని మననం చేయండి. ఒకొక్క గుణాన్ని ధారణ చేయడంలో ఏ సమస్య వస్తుందో దానిని సమాప్తి చేసి ధారణ చేస్తూ నలువైపులా అందరూ అనుభవం చేసుకునేటట్లుగా సుగంధాన్ని వ్యాపింపచేయండి. అర్థమయిందా!

Comments