28-12-1979 అవ్యక్త మురళి

28-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు విధి - ఏకాగ్రత.

బాప్ దాదా తీవ్ర పురుషార్జీ పిల్లలందరినీ చూస్తున్నారు. తీవ్ర పురుషార్థం చేయుటకు సహజ విధి ఏది? దాని ద్వారా సహజంగానే సిద్ధి ప్రాప్తించాలి అనగా సదా సిద్ధి స్వరూపులుగా అవ్వాలి. సంకల్పం, మాట లేక కర్మ ఫలించాలి. దీనితో విశ్వం ముందు ప్రసిద్ధమవుతారు. అటువంటి సహజ పద్ధతి ఏది? ఆ విధి ఒకే ఒక శబ్ధంలో ఉంది. ఈ ఒక్క శబ్దాన్ని తమదిగా చేసుకుంటే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. ఆ శబ్ధంతో సంకల్పం, మాట మరియు కర్మ మూడింటికీ సంబంధం ఉంది. ఆ ఒక్క శబ్దం“ఏకాగ్రత", సంకల్పంలో సిద్ధి లేకపోవడానికి కారణం కూడా ఏకాగ్రత లోపించడమే. ఏకాగ్రత తక్కువైన కారణంగా అలజడి కలుగుతుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటే అక్కడ సంకల్పం, మాట మరియు కర్మలో వ్యర్థం సమాప్తమైపోతుంది. అంతేకాక సమర్థత వచ్చేస్తుంది. సమర్థంగా ఉన్న కారణంగా అన్నింటిలో సిద్ధి లభిస్తుంది. ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్ఠ సంకల్పంలో సదా స్థితులై ఉండుట. ఈ ఒక్క బీజరూపీ సంకల్పంలో మొత్తం వృక్ష విస్తారమంతా ఇమిడి ఉంది. ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని రకాల అలజడులు సమాప్తమైపోతాయి. ఏకాగ్రత తనవైపు ఆకర్షిస్తుంది. ఏ వస్తువైనా స్వయం అలజడిలో ఉంటే ఇతరులను కూడా అలజడిలోకి తీసుకొస్తుంది. ఏ విధంగా ఇక్కడ లైటు అలజడిలోకి వస్తూ ఉంటే (మధ్య మధ్యలో కరెంట్ పోతూ ఉంది) కొంచెం సేపు వెలిగి కొంచెం సమయం ఆరిపోతూ ఉంటే అందరి సంకల్పాలలో ఇలా ఎందుకు జరిగింది అని అలజడి వస్తున్నది కదా? ఏకాగ్రంగా ఉండే వస్తువు ఇతరులకు కూడా ఏకాగ్రతను అనుభవం చేయిస్తుంది. ఏకాగ్రత ఆధారంతోనే ఏ వస్తువు ఎలా ఉంటే అలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఏకాగ్ర స్థితిలో స్థితులయ్యేవారు స్వయం నేను ఎవరు, ఎలా ఉన్నాను అని స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ కారణంగా ఎలా అవుతుంది? ఏమవుతుంది? అనే అలజడి సమాప్తమైపోతుంది. ఏ వస్తువైనా స్పష్టంగా కనిపిస్తే ఇది ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడూ రాదు. ప్రశ్న సమాప్తమై ఇది ఇలాంటిది అని స్పష్టంగా అనుభవం అవుతుంది. ఇలాగే స్వ స్వరూపము, తండ్రి స్వరూపము ఏకాగ్రత ఆధారముపై సదా స్పష్టంగా ఉంటుంది. ఆత్మిక రూపంలో ఎలా స్థితులవ్వాలి? ఆత్మ స్వరూపం ఇలా ఉంటుందా లేక అలా ఉంటుందా? అనే అలజడి అనగా ప్రశ్నలు సమాప్తమైపోతాయి. ప్రశ్నలు సమాప్తమైతే అలజడి సమాప్తమవుతుంది. కనుక ప్రతి సంకల్పం కూడా స్పష్టమైపోతుంది. ప్రతి సంకల్పం, మాట, కర్మల ఆది-మధ్య -అంతం మూడు కాలాలు వర్తమాన కాలము ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా కనిపిస్తాయి. సంకల్పం అనే బీజం శక్తిశాలిగా ఉంటే అది ఫలదాయకంగా ఉంటుంది.

ఏకాగ్రతతో సర్వ శక్తులు సిద్ధి స్వరూపంలో ప్రాప్తిస్తాయి. ఎందుకంటే స్వరూపం స్పష్టమైతే ఆ స్వరూపం యొక్క శక్తులు కూడా అలాగే స్పష్టంగా అనుభవమవుతాయి. ఏకాగ్రత మహిమ ఏమిటో అర్థమయ్యిందా? ఈనాటి ప్రపంచంలో మానవులు అలజడితో విసిగిపోయారు. రాజకీయాల అలజడి కావచ్చు, వస్తువుల ధరల వలన అలజడి కావచ్చు, కరెన్సీ వలన అలజడి, కర్మ భోగం ద్వారా అలజడి, ధర్మాల మధ్య అలజడి కావచ్చు, ఇలా ఎన్నో రకాల అలజడులతో విసిగిపోయారు. సైన్సు సాధనాలు ఉన్నా అవి ఇంతకు ముందు సుఖం కలిగించే సాధనాలుగా అనుభవమయ్యేవి. ఈ రోజు ఆ సాధనాలు కూడా అలజడిని అనుభవం చేయించేవిగా అయ్యాయి. ఇక్కడ కూడా బ్రాహ్మణాత్మలు సంకల్పంలో, సంపర్కంలో అలజడితోనే అలసిపోతున్నారు. అందుకు సహజ విధి - ఏకాగ్రతను తమదిగా చేసుకోండి. దీని కొరకు సదా ఏకాంతవాసులుగా కండి. ఏకాంతస వాసీగా అగుట ద్వారా సహజంగా ఏకాగ్రమవుతారు.

ఢిల్లీ నివాసులు స్థాపనా కార్యంలో ఆదిరత్నాలుగా అయ్యి నిమిత్తంగా అయ్యారు. కావున ఇప్పుడు సంపూర్ణ సమాప్తి కార్యంలో కూడా నిమిత్తులుగా కండి. ఏ విషయం సంపూర్ణతలోనైనా ఆదిరత్నాలు నిమిత్తులుగా కండి. సంపూర్ణతయే సమాప్తిని తీసుకొస్తుంది. ఢిల్లీ పునాది సమయంలో శక్తులందరి సహయోగం అనే చెయ్యి పడింది. కనుక సర్వ శక్తుల సహయోగమనే చెయ్యి తగిలిన ధరణి ఏ అద్భుతం చూపిస్తుంది? బ్రహ్మాబాబా పాలన, బ్రహ్మ భుజాల పాలన తీసుకున్న ధరణి ఢిల్లీ, ఏ అద్భుతం చేసి చూపిస్తుంది? ఏ విధి ద్వారా సంపూర్ణతను తెస్తుంది? కుంభకర్ణులను ఎలా మేల్కొల్పుతుంది? ఏ క్రొత్త కానుకను తయారుచేస్తుంది?

ఢిల్లీ వారు బాప్ దాదాకు ఏ కానుకనిస్తారు? ఫారెన్ ఏమి ఇస్తుంది? గుజరాత్ ఏమి ఇస్తుంది? అన్నీ జోన్ల నుండి కానుకలు రావాలి. స్థాపన ఆదిలో మొదట ఢిల్లీ వచ్చింది కనుక కానుక ఇవ్వడంలో కూడా ఢిల్లీ నంబర్ వన్‌గా ఉండాలి. పిల్లలు తండ్రికి కానుక ఇవ్వాలి. తండ్రి కోరికను ఇప్పటి వరకు తెలుసుకోలేదా? ప్రతి ఒక్కరూ ఏ కానుక ఇవ్వాలో ఆలోచించండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త దానిని కనుగొనాలి. ఆ నవీనత స్వయంలోనూ, సేవలోనూ, నవీనతను తీసుకురావాలి. అందుకు ప్లాన్ ఏమిటి ? ప్రాక్టికల్(ఆచరించుటకు యోగ్యమైన) ప్లాన్ చెప్పండి. ఏమైనా చెయ్యండి అది కానుక రూపంలో తప్పకుండా తీసుకురావాలి. ప్రతి జోను నుండి నంబర్ వన్ కానుక ఎవరిదో తర్వాత చూస్తాను. ఢిల్లీలో మహారథులకైతే లోపం లేదు. ఇంతమంది మహారథులున్నారు. కనుక మహోన్నతమైన కానుకను తయారు చేస్తారు కదా? ప్లాన్ మరియు పురుషార్థం రెండూ చెయ్యాలి. రేస్ అయితే చెయ్యాలి కదా? అందరి విచార సాగర మథనమైతే నడుస్తుంది. అమృతవేళలో సమీపంగా వచ్చి కూర్చుంటే వాటంతకవే అన్నీ టచింగ్ అవుతాయి.

రాజకీయాల అలజడి ఢిల్లీలో ఎంతగా ఉందో అంతగా సత్ ధర్మం గురించి అలజడి జరగాలి. ఇప్పుడు రాజకీయాల అలజడి ఎక్కువగా ఉంది. సత్ ధర్మం గురించిన అలజడి తక్కువగా ఉంది. అది కూడా గుప్తంగా ఉంది. మొదట ఢిల్లీ కదులుతుంది. అప్పుడు అన్ని సింహాసనాలు కదులుతాయి. అందరి దృష్టి పడేటట్లు ఏదైనా లైట్ హౌస్ ను తయారు చెయ్యండి. ఎలాగైతే లైట్‌హౌస్ వైపు అందరి అటెన్షన్ వెళ్తుందో అలా ఏదైనా ఉన్నతమైన లైట్‌ హౌసు ప్లాను తయారు చెయ్యండి. ఇదే మాకు ఆధారమని అందరికీ అనుభవం కావాలి. అలజడి సమయంలో అందరూ ఆధారాన్ని వెతుకుతారు. అలాగే ఏదైనా శక్తిశాలీ ప్లాన్ తయారు చేయండి. అది వారికి లైట్ హౌస్ వలె ఆధారంగా లభించాలి. అర్థమయిందా? ఇప్పుడు ఆలోచించండి - పాత పెద్ద పెద్ద టీచర్లందరూ ఢిల్లీలో ఉన్నారు. అనుభవీ టీచర్లు ఉన్నారు. అనుభవీ టీచర్ల ద్వారా ప్లాన్లు కూడా తప్పక అలాంటివే వస్తాయి. ఢిల్లీ నుండి ఏ ధ్వని వస్తుందో అది చిన్న చిన్న స్థానాల వరకు దానంతకదే చేరుతుంది. మొదట ఢిల్లీని శక్తిశాలిగా తయారు చెయ్యండి. ఫారిన్ నుండి ధ్వని వచ్చినట్లయితే అది ఎక్కడకు చేరుతుంది? ఆ ధ్వనిని ఢిల్లీనే రిసీవ్ చేసుకుంటుంది. ఢిల్లీకి చాలా కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ శక్తులు కొంచెం మైదానంలోకి వస్తే ధ్వని సహజంగానే వెలువడ్తుంది.

విదేశీ సోదరీ - సోదరులతో - అవ్యక్త బాప్ దాదా కలయిక

లెస్టర్ పార్టీ - సదా సేవాధారీ రత్నాలుగా ఉన్నారా? సేవాధారులనగా ప్రతి సెకండ్ మనసా, వాచా, కర్మణా ద్వారా లేక సాంగత్యం, సంబంధం, సంపర్కం ద్వారా సేవ చేసేవారు. సేవాధారులనగా ఆల్ రౌండ్ సేవాధారులు. సేవాధారులు సేవకు సమయం లభించడం లేదని అవకాశం లభించడం లేదని ఎప్పుడూ అనుకోరు. ఇతర ఏ సమయం లభించకపోయినా నిద్ర సమయంలో కూడా సేవ చెయ్యవచ్చు. ఆల్ రౌండ్ సేవాధారులనగా సదా సేవాధారులు. సదా సేవ చేయాలనే ఉత్సాహం కలిగి వృద్ధి చేస్తూ ఉంటారు కదా? రోజంతటి చార్జులో అన్ని రకాల సేవలలో మార్కులు తీసుకున్నానా లేక కేవలం వాచా సేవ, కర్మణా సేవ చేశానా అని చెక్ చేసుకోండి. అన్ని రకాల సేవల ఆహారాన్ని నింపుకోవాలి. ఇలా మీ చార్టును ప్రతిరోజు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడి ఆల్ రౌండ్ సేవాధారులు అక్కడ ఆల్ రౌండ్ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ సేవలో ఎంత లోపం ఉంటే అక్కడ కూడా బేహద్ మరియు హద్దు రాష్ట్రంలో కూడా అంత తేడా వస్తుంది. విశ్వమహారాజులనగా ఆల్ రౌండ్ సేవాధారులు. వాస్తవానికి లెస్టర్ నివాసుల మహిమ సేవలో మంచిగా ఉంది. ఒకరు అనేక మందిని మేల్కొల్పే సేవ చేస్తారు. విదేశీల సేవలో లెస్టర్ సహయోగం విశేషంగా ఉంది. విదేశాల సేవ బీజంలో లెస్టర్ నివాసుల నీరు బాగా పడింది. బాప్ దాదా కూడా ఇలాంటి సహయోగి ఆత్మలను చూసి సంతోషిస్తారు. ఈ సెంటర్‌లో మొత్తం అలంకారమంతా ఉంది. కుమారులు కూడా ఉన్నారు, కుమారీలు కూడా ఉన్నారు, ప్రవృత్తి వారు కూడా ఉన్నారు....... ఇదే సెంటరు శృంగారము. ఏ వెరైటీలో కూడా లోపం లేదు. ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేయండి. ఏదైనా ఇలాంటి పరమాత్మ బాంబ్ ను తయారు చేశారా? - ఎటువంటిదంటే ఒక బాంబ్ వేస్తూనే సహజంగానే ప్రపంచం లెక్కతో అందరి గతి జరిగిపోతుంది. అనగా వినాశన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఆ వినాశనం జరిగిపోతుంది. కనుక అందరికీ గతి - సద్గతి జరిగే విధంగా పరమాత్మ బాంబును తయారు చేశారా! అందరూ అల్లారు ముద్దు పిల్లలే, అపురూపమైన పిల్లలే. ఎందుకంటే మీరు దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లినా, ఎంత దూరం వెళ్లినా తండ్రి మిమ్ములను తమవారిగా చేసుకున్నారు. భారతదేశం నుండి దూరమైపోయారు. అయినా దూరంగా ఉన్న మిమ్ములను వెతికి తమవారిగా చేసుకున్నారు. తండ్రి విదేశాల వరకు వచ్చి వెతాకాల్సి వచ్చింది కదా. కావున మీరు విశేషించి అపురూప పిల్లలుగా అయ్యారు.

యుగల్స్ తో - యుగల్ మూర్తులు అనగా సేవ కొరకు ఉదాహరణ రూపం ప్రవృత్తిలో కూడా సేవ కొరకు ఒక ఉదాహరణగా అవ్వాలని విశ్వం ముందు మిమ్ములను ఉంచారు. కావున ప్రవృత్తిలో ఉంటూనే విశ్వమనే ఫోకేసులో విశేషమైన షో పీసుగా(షో బొమ్మగా) అయ్యి నడుస్తున్నారా? ఒక్క షో బొమ్మ అనేక మందిని వ్యాపారం చేయించడానికి నిమిత్తంగా అవుతుంది. కనుక ప్రవృత్తిలో ఉన్నవారు తమను విశేషంగా షో పీసుగా భావిస్తే ఎక్కువ సేవ చేయుటకు నిమిత్తమవుతారు. మీరు ఇంట్లో ఉండటం లేదు. షోకేసులో ఉంటున్నారు. షోకేస్లో ఉన్నట్లు భావిస్తే ఎల్లప్పుడూ అలంకరించబడి ఉన్నట్లుగా ఉంటారు. షో కేస్లో మురికి వస్తువును పెట్టరు కదా!

ఇప్పుడు కొద్ది సమయం గడిచిన తర్వాత ప్రవృత్తిలో ఉంటూ నివృతిలో ఉండేవారి పేరు మొత్తం విశ్వంలో ప్రసిద్ధి అవుతుంది. మిమ్ములను దర్శించుకోవడానికి తపిస్తూ వస్తారు. "వీరు ఎలాంటి మహావీర ఆత్మలు! మేము ఏదైతే చెయ్యలేకపోయామో దానిని వారు చేసి చూపిస్తున్నారు" అని అంటారు. యుగల్స్ కు అపారమైన మహిమ ఉంటుంది. తండ్రి కార్యాన్ని ప్రత్యక్షం చెయ్యడానికి నిమిత్తంగా అవుతారు. మీరు సాధారణమైనవారు కాదు. మీరు విశేషమైన ఆత్మలు.

కుమారులతో- అందరూ అవినాశి కుమారులు. కుమార్ కుమారీలకు అదనపు మార్కులు ఏ విషయానికి ఎందుకు లభిస్తాయి? కుమారులు, కుమారీలు తమ ఈ జీవితంలో అన్నీ చూస్తున్నా, తెలిసినా దృఢ సంకల్పం చేసి దృఢమైన త్యాగిగా అవుతారు. ఆ త్యాగానికి భాగ్యం లభిస్తుంది. ప్రవృత్తిలో ఉన్నవారు అల్పకాలిక సుఖాన్ని అనుభవించి తర్వాత త్యాగం చేస్తారు. కుమార్, కుమారీలు వినాశి  అల్పకాలిక సుఖాలను మొదటే దృఢ సంకల్పంతో త్యాగం చేస్తారు. అందువలన వారికి హైజంప్ చెయ్యడానికి అవకాశం లభిస్తుంది. కుమార్ మరియు కుమారీల జీవితం లౌకికం మరియు అలౌకికం రెండు జీవితాలలో బంధనాలు లేని కారణంగా ఎంత ముందుకు వెళ్లాలన్నా వెళ్లగలరు. కనుక అందరూ హైజంప్ చేసేవారే కదా? సెకండ్ లో ఆలోచించారు మరియు చేసేశారు. హైజంప్ చెయ్యడమంటే ఇదే. ఆలోచించడం మరియు చెయ్యడం జత జతలో ఉండాలి. కుమారులు, కుమారీలను చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తారు. ఎందుకంటే క్రిందపడటం నుండి రక్షించబడ్డారు. దుఃఖం కలిగించే మెట్లు ఎక్కనేలేదు. కావున రక్షించబడిన వారిని చూసి సంతోషమవుతుంది.

అమెరికా పార్టీ- సదా తండ్రితో సర్వ సంబంధాలను, సర్వ ఖజానాలను అనుభవం చేస్తున్నారా? తండ్రిలో ఉన్న గుణాలన్నీ అనుభవం అవుతున్నాయా? సర్వ ఖజానాలు సర్వ సంబంధాలలో ఒక్క సంబంధం అనుభవం తక్కువైనా ఆ సంబంధం తన వైపు ఆకర్షించి తండ్రి నుండి దూరం చేసేస్తుంది. అందువలన సర్వ సంబంధాలను అనుభవం చేశామా? అని చెక్ చేసుకోండి. అన్ని ఖజానాలకు మీరు యజమానులు మరియు బాలకులు. కర్మలు చేయుటకు, సేవ చేయుటకు డైరెక్షన్ పై నడిచే బాలకులు, తమ ఉన్నత స్థితిలో స్థితులయ్యే సమయంలో యజమానులు. బాలకులు మరియు మాలికులు రెండు స్థితుల అనుభవం ఉందా? ఎవరైతే ఇప్పుడు తండ్రి ద్వారా లభించిన సర్వ ఖజానాలకు యజమానులుగా అవుతారో అదే యజమానితనపు సంస్కారమే భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా తయారు చేస్తుంది. సదా అనుభవాల నిధితో సంపన్న స్థితిని అనుభవం చెయ్యండి. అనుభవం జీవితాన్ని పరివర్తన చెయ్యడంలో సహజ సాధనంగా అవుతుంది. ఈ రోజుల్లో తమ దేశంలో మెజారిటీ జనులు ఒక్క సెకండ్ అయినా శాంతిని అనుభవం చెయ్యాలని కోరుచున్నారు. ఇలాంటి తపిస్తున్న ఆత్మలకు ఒక్క సెకండులో శాంతిని అనుభవం చేయించుటకు సదా తమ స్థితి శాంతి స్వరూపంగా ఉండాలి. అప్పుడు ఇతరులకు అనుభవం చేయించగలరు. ఇప్పుడు ఆత్మలపై దయ కలుగుతూ ఉందా? చాలా భికారులుగా అయ్యి మీ వద్దకు వస్తారు. ఇంత సంపన్నులుగా అయితే అనేకమంది భికారులను తృప్తి పరచగలరు.

అమెరికా వారు హైజంప్ చేసేవారిగా ఉన్నారా లేక ఎగిరే వారిగా ఉన్నారా? ఒక్క సెకండ్ లో ఈ పాత ప్రపంచం నుండి ఎగిరి మీ స్వీట్ సైలెన్స్ హెమ్ లోకి చేరుకోవాలి. ఇలా ఎగిరేవారిగా ఉన్నారు కదా? పక్షి అనగా సదా డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉండేవారు. ఇలాంటి ఎగిరే పక్షులై ఎగురుతూ ఉండండి. అంతేకాక అనేక మందిని ఎగిరిస్తూ ఉండండి.

ఎవరైతే సుఖ - శాంతులకు భికారులుగా ఉన్నారో వారికి సుఖ - శాంతులనిచ్చి సంపన్నంగా తయారు చేస్తే శాంతి స్థాపకులుగా అవుతారు. అందరూ మనసారా తమకు ధన్యవాదాలను పాడ్తారు. అమెరికాలో సెంటర్ తెరవబడుటలో కూడా రహస్యముంది. విశేష కార్యం జరగాల్సి ఉంది. వినాశనం మరియు స్థాపన రెండింటి సాక్షాత్కారం జత జతలో జరుగుతాయి. అటువైపు వినాశకారులు, ఇటువైపు శాంతి స్థాపకులు. సైన్సు మరియు సైలెన్స్ రెండు శక్తుల బలాన్ని చూస్తారు. నలువైపుల నుండి అమెరికాను పరివర్తన చెయ్యడానికి చుట్టుముట్టండి. మహావీరుని(హనుమంతుని) మొత్తం పర్వతమే తీసుకొచ్చినట్లుగా చూపిస్తారు కదా! మీరు అమెరికాను పరివర్తన చేసి సైలెన్స్ శక్తి పేరును ప్రసిద్ధము చెయ్యండి. మేము శాంతి సాగరుని పిల్లలము, శాంతిదేవతలము అని సదా గుర్తుంచుకోండి. ఎవరు ఎదురుగా వచ్చినా
శాంతి ఇచ్చేవారిగా అయ్యి శాంతిని దానం చెయ్యండి.

Comments