28-11-1979 అవ్యక్త మురళి

28-11-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రవృత్తిలో ఉంటున్నా నివృత్తిలో(అతీతంగా) ఎలా ఉండాలి?

ఈ రోజు బాప్ దాదా తన కల్పక్రితపు అల్లారు ముద్దు పిల్లలను, కోటాను కోట్లలో కొద్ది మందిని, తండ్రిని తెలుసుకొని వారసత్వం పొందే విశేష గ్రూపును చూస్తున్నారు. ఆ గ్రూప్ ఏదై ఉండవచ్చు? ఈ రోజు విశేషంగా ప్రవృత్తిలో ఉండే పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న వారి ప్రవృత్తి స్థానాలను కూడా చూశారు. వారి వ్యవహార స్థానాలను కూడా చూశారు. వారి పరివారాలను కూడా చూశారు. అంతేకాక ఈ రోజు ఉన్న తమోగుణీ ప్రకృతి మరియు పరిస్థితుల ప్రభావం వారిపై ఎలా పడిందో, రాజ్య ప్రభావం ఏమేమి పడిందో, వారి ప్రస్తుత స్థితి గతులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. చూస్తూ చూస్తూ చాలా మంది పిల్లల అద్భుతాన్ని కూడా చూశారు. వారు కుటుంబంలో ప్రవృత్తిలో ఉంటూ కూడా అతీతంగా ఎలా ఉన్నారో ప్రవృత్తి మరియు వృత్తి రెండిటి బాలెన్స్ ఉంచుకొని చాలా మంచి శ్రేష్ఠమైన పాత్రను అద్భుతంగా ఎలా అభినయిస్తున్నారో చూశారు. సదా తండ్రికి సాథి(తోడు)గా, సాక్షిగా ఉంటూ చాలా మంచి పాత్రను అభినయిస్తూ విశ్వం ముందు ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నారు. సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ లోపల ఉంటూ మాయ చేయు అనేక దాడులు మరియు అనేక మాయావి ఆకర్షణల నుండి సదా సురక్షితంగా ఉన్నారు.

ఈ విధంగా విశ్వానికి అతీతంగా ఉన్న అపురూపమైన పిల్లలను చూసి తండ్రి కూడా వారి గుణగానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పిల్లలను చాలా మందిని చూశారు. ప్రవృత్తి స్థానంలో ఉంటున్నా సత్యమైన పిల్లలుగా ఉన్నందున పరమాత్మ సదా వారిపై ప్రసన్నం(రాజీ)గా ఉంటారు. న్యారా-ప్యారాగా ఉండు రహస్యము తెలిసినందున సదా స్వయంతో కూడా రాజీగా ఉంటారు. ప్రవృత్తిని కూడా సంతోషపెడ్తారు. అంతేకాక బాప్ దాదా కూడా సదా వారిపై రాజీగా ఉంటారు. ఇలా స్వయాన్ని మరియు సర్వులను సంతోషపెట్టే రాజయుక్త పిల్లలు ఎప్పుడూ తమ పట్ల గాని, ఇతరుల పట్ల గాని ఎవ్వరినీ జడ్జిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వారికి ఎలాంటి కేసులూ ఉండవు. "భార్య-భర్త రాజీగా ఉంటే కాజీ(జడ్జి) ఏం చేస్తాడు?" అని చాలాసార్లు విన్నారు కదా, తమ సంస్కారాలనే కేసులే తమ వద్ద చాలా ఉంటాయి. వీటిని గురించే లోపల వాదము నడుస్తూ ఉంటుంది. రైటా లేక రాంగా, కావాలా లేక వద్దా, ఎంతవరకు జరగాలి అని ఈ తర్కము నడుస్తూనే ఉంటుంది. తమకు తాము నిర్ణయించుకోలేనప్పుడు ఇతరులను జడ్జి(కాజీ)గా చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి విషయం చిన్నదిగా, కొంతమందికి పెద్దదిగా ఉంటుంది. మీరు, తండ్రి ఇరువురూ కలిసి నిర్ణయం తీసుకుంటే సెకండ్ లో సమాప్తమవుతుంది. ఇంకెవ్వరినీ జడ్జిగా లేక లాయరుగా లేక కాజీగా చేసుకోవాల్సిన అవసరమే ఉండదు.

ప్రవృత్తిలో ఒక నియమం ఉంది. "ఒకవేళ కుటుంబములో ఏదైనా ఒక విషయం జరిగితే తల్లిదండ్రులు దానిని పిల్లల వరకు వెళ్లనివ్వరు. అక్కడే స్పష్టం చేసుకొని ఇముడ్చుకుంటారు. అనగా సమాప్తి చేసేస్తారు." మూడవవారి వద్దకు విషయం వెళ్లిందంటే అది తప్పకుండా వ్యాపిస్తుంది. ఏ విషయమైనా ఎంత వ్యాపిస్తుందో అంత పెరుగుతుంది. స్థూలమైన అగ్ని ఎంత వ్యాపిస్తుందో అంత నష్టం చేస్తుంది కదా! ఈ చిన్న-పెద్ద మాటలు కూడా అనేక ప్రకారాల వికారాల అగ్నిలాంటివి. నిప్పును అక్కడనే ఆపేస్తారు, వ్యాపింపజేయరు. కుటుంబంలో తండ్రి మరియు మీకు తప్ప మీకు దగ్గరగా ఉన్న మూడవ ఆత్మ అనగా కుటుంబంలో ఉన్న ఆత్మలలో ఎవ్వరికీ విషయం వ్యాపించరాదు. భార్య-భర్తలు రాజీ అయిపోండి, నారాజ్ అయినారంటే రహస్యాన్ని తెలుసుకోలేదని అర్థము. ఏదో ఒక జ్ఞాన రహస్యాన్ని మర్చిపోతున్నారు. అందుకే నారాజ్ అవుతారు(కోపపడ్డారు). స్వయంతో కావచ్చు లేక ఇతరులతో కావచ్చు. వాదం చేసుకుంటే ఆ చిన్న విషయమే పెద్ద కేసుగా అవుతుంది. అందువలన మూడవ వ్యక్తికి వినిపించడం అంటే ఇంటి విషయాన్ని బయటికి పంపించడమవుతుంది. ఈ రోజుల్లో పెద్ద కేసులు వార్తాపత్రికల వరకు వ్యాపిస్తాయి. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ పరివారం అనే వార్తాపత్రికలో పడిపోతుంది. కనుక పరస్పరంలో ఎందుకు నిర్ణయం తీసుకోరాదు? తండ్రికి తెలియాలి, మీకు తెలియాలి, మూడవ వ్యక్తికి తెలియరాదు. కొంతమంది పిల్లల సంకల్పం చేరుతుంది. భార్య-భర్తలు బాగానే ఉన్నారు కానీ భర్త నిరాకారుడు, భార్య సాకారము కనుక కలవడం తక్కువైపోతుంది. అందువలన అప్పుడప్పుడు మిలనం జరుగుతుంది. అప్పుడప్పుడు జరగడం లేదు. అప్పుడప్పుడు ఆత్మిక సంభాషణ చేరుతుంది, అప్పుడప్పుడు చేరుకోవటం లేదు. అనగా సమాధానం లభించడం లేదు. అందువలన న్యాయాధ్యక్షత(కాజీ) చేయాల్సి ఉంటుంది. కానీ మీకు లభించిన భర్త బహురూపిగా ఉన్నారు. మీరు ఏ రూపం కావాలంటే ఒక్క సెకండ్ లో ప్రత్యక్షమై జీహుజూర్ అని హాజరైపోతారు. కానీ మీరు కూడా తండ్రి సమానంగా బహురూపిగా అవ్వండి. 

తండ్రి ఏమో ఒక్క సెకండులో మిమ్మల్ని విహరింపచేసి వతనానికి తీసుకెళ్తారు. తండ్రి వతనం నుండి ఆకార రూపంలోకి వస్తారు. మీరు సాకారం నుండి ఆకార రూపంలోకి రండి, కలుసుకునే స్థానానికి చేరుకోండి. స్థానం కూడా అలాగే గొప్పదే కావాలి కదా! సూక్ష్మవతనము లేక ఆకారీ వతనము కలుసుకునే స్థానము. సమయం కూడా నిశ్చితము. అప్పాయింట్మెంట్ (కలిసేందుకు నిర్ణీతమైన సమయం) కూడా ఉంది. స్థానం కూడా నిశ్చితము, అయినా ఎందుకు మిలనం జరగడం లేదు? కేవలం ఏ పొరపాటు చేస్తున్నారంటే మట్టితో పాటు అక్కడకు రావాలని అనుకుంటున్నారు. ఈ దేహము మట్టి, మట్టి పని చేసేటప్పుడు చెయ్యండి. కానీ కలుసుకునే సమయంలో ఈ దేహ భ్రాంతిని వదిలి పెట్టాల్సి ఉంటుంది. తండ్రి డ్రెస్(వస్త్రం/DRESS) ఏదైతే ఉందో అదే మీ డ్రెస్ గా కూడా ఉండాలి, సమానంగా ఉండాలి కదా! ఎలాగైతే తండ్రి నిరాకారం నుండి ఆకారీ వస్త్రాన్ని ధారణ చేసి ఆకారీ మరియు నిరాకారీ బాప్ దాదాగా అవుతారో అలా మీరు కూడా ఆకారీ ఫరిస్తా డ్రెస్ ధరించి రండి. మెరిసే డ్రెస్ ధరించి రండి. అప్పుడే మిలనం జరుగుతుంది. డ్రస్సు ధరించడం రావడం లేదా? డ్రెస్ ధరించి చేరుకోండి. ఇది మాయ అనే నీటి నుండి, అగ్ని నుండి రక్షించే డ్రెస్. ఈ పాత ప్రపంచం యొక్క వృత్తి మరియు వైబ్రేషన్లు అంటని డ్రెస్. ఇంత గొప్ప డ్రెస్ నేను మీకిచ్చాను. అయినా కలుసుకునే అప్పాయింట్మెంట్ సమయంలో ధరించరు. పాత డ్రెస్ పైననే ఎక్కువ ప్రేమ ఉందా? ఎప్పుడైతే ఇద్దరూ మెరిసే బట్టలతో సమానంగా ఉంటారో, మెరిసే వతనంలో ఉంటారో అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒకరు పాత బట్టలు, ఇంకొకరు మేరిసే బట్టలు ధరించి ఉంటే జంట కలవదు. అందువలన అనుభవం కాదు. పాత వైబ్రేషన్లు జోక్యం చేసుకుంటాయి. అందువలన పరస్పర ఆత్మిక సంభాషణకు రెస్పాన్స్ లభించదు. స్పష్టంగా అర్థం కాదు. అందువలన ఇతరుల అల్పకాలిక తోడు తీసుకోవాల్సి ఉంటుంది.

భార్య-భర్తల సంబంధం స్నేహంగా, సమీపంగా ఉంటుంది. సైగలతోనే అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. సైగలతోనే సూక్ష్మ సంకల్పంతోనే అర్థం చేసుకోవాలి. ఇది ఇలాంటి ప్రేమ సంబంధం. మరలా మధ్యలో మూడవ వారిని ఎందుకు ఉంచుకుంటారు? మూడవ వారిని ఉంచుకోవడం అనగా తమ శక్తిని, సమయాన్ని వృధా చెయ్యడమవుతుంది. నాకు మిలనం ఎలా జరిగింది, నా ఆత్మిక సంభాషణ ఏమి జరిగింది అని మీరే ఆత్మిక సంభాషణ చేసుకోండి. మీరందరూ కలిసి సహయోగిగా అయ్యి ఆత్మిక సంభాషణ చేసుకోండి.  కనుక కాజీ(జడ్డి)ని వదిలేయండి, సంతుష్టంగా ఉండండి. మీరు ఎప్పుడైతే ఇష్టపడ్డారో మధ్యలో వేరేవారిని ఎందుకు కలుపుకుంటారు? మధ్యలో మరొకరిని కలుపుకుంటే సుడిగుండంలోకి వచ్చేస్తారు. రక్షించే పని బాబానే(మియా) చెయ్యవలసి ఉంటుంది. అందువలన విశ్వకళ్యాణ కార్యం ఉండిపోతుంది. వినాశనం ఎప్పుడవుతుంది అని మరలా అడుగుతారు? ఇప్పుడు భార్యలు (పత్ని స్వరూప ఆత్మలు) తయారు కాకపోతే ఏమి చెయ్యాలి. వినాశనం ఎందుకు కావడం లేదో అర్థమయిందా? డ్రెస్ మార్చుకోవడమే రాకపోతే విశ్వాన్ని పరివర్తన ఎలా చేస్తారు? మంచిది, ప్రవృత్తిలో ఉన్నవారి పరిస్థితిని తర్వాత వినిపిస్తాను. ఈ రోజు తమ ప్రవృత్తి యొక్క పరిస్థితిని వినిపించాను.

సదా రహస్య యుక్తులు, యుక్తి యుక్తులు సదా సమీప సంబంధములో ఉండేవారు, సదా సంతుష్టంగా ఉండేవారు, సర్వులను సంతుష్టంగా ఉంచేవారు, సదా మిలనం జరుపుకునేవారు, సదా తండ్రికి తోడుగా, సాక్షీగా ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. 

టీచర్ల పట్ల అవ్యక్త మహావాక్యాలు :- టీచర్లు అనగా తండ్రి సమానంగా ఉన్న సర్వ శ్రేష్ఠ ఆత్మలు. టీచర్లు ప్రతి సంవత్సరం క్రొత్త ప్లాన్ తయారు చేయాలి. సేవ కొరకు విద్యార్థులు కూడా ప్లాన్లు తయారు చేస్తారు. కానీ టీచర్లు విశేషించి ఏమి చెయ్యాలి? ఇప్పుడు ఇలాంటి సంగఠనను తయారు చెయ్యండి - అందరి నోటి నుండి వీరు అనేకులైనప్పటికీ ఒక్కటిగా ఉన్నారు అనేది రావాలి. ఇక్కడ దీదీ-దాది ఇద్దరు కాని ఇద్దరూ ఒక్కటే అని అంటారు కదా. ఈ ప్రభావం పడ్తుంది. ఇద్దరు అయినప్పటికీ కూడా ఒకే విధంగా ఒకరు ఇంకొకరికి గౌరవాన్ని ఇస్తారు. ఇద్దరు అయినప్పటికీ ఒక్కటిగా కనిపిస్తారు. మీరు అనేకులుగా ఉన్నా ఒక్కరిని ఉదాహరణగా ఇవ్వగల్గుతారు. అందరి మాట ఒక్కటే ఉంటుంది అంటారు. ఒకరు ఏది మాట్లాడితే అదే అందరూ మాట్లాడుతారు. డ్రెస్ కూడా ఒక్కటే. మాటలు కూడా అందరినీ ఒకే జ్ఞానం మాటలే ఉంటాయి. వినిపించే పద్ధతి వేరుగా ఉండవచ్చు. సారం ఒక్కటే ఉంటుంది. అలాంటి గ్రూపును తయారు చెయ్యండి. అందరూ వీళ్ళు అనేకంగా లేరు, ఒక్కటే అని అనాలి. ఇదే కదా విశేషత! ఎవరైనా ఉదాహరణానికి నిమిత్తంగా అయితే వారిని అందరూ అనుసరిస్తారు. ఇందులో చేసేవారే అర్జునులు. ఎవరు అర్జునుడిగా అవుతారు? ఎవరైతే అర్జునునిగా అవుతారో వారికే మొదటి బహుమతి లభిస్తుంది. కేవలం ఒక్క విషయం పై గమనమివ్వాల్సి ఉంటుంది. ఏ విషయం? ఏమి చెయ్యాల్సి ఉంటుంది? కేవలం ఒకరు ఇంకొకరికి సహయోగాన్ని ఇవ్వండి, విశేషతలను చూడండి. బలహీనతలను చూడకండి, వినకండి. ఈ అభ్యాసం దృఢంగా చేయండి. బలహీనతలను చూస్తున్నా ఇముడ్చుకొని సహయోగాన్ని ఇస్తూ ఉండండి, తిరస్కరించకండి, దయాభావన పెట్టుకోండి. దుఃఖితులైన వారిపై దయాహృదయులుగా అవుతారు. అలాగే బలహీనుల పైన దయాహృదయులుగా కండి. ఇలాంటి దయాహృదయులుగా అయితే ఏమవుతుంది? అనేకులుగా ఉన్నప్పటికీ ఒక్కటిగా అవుతారు. అలాగే లౌకికంలో కూడా చూడండి. తెలివి గల కుటుంబాలు, స్నేహీ కుటుంబాల వారు ఏమి చేస్తారు? ఒకరు ఇంకొకరి బలహీన విషయాలను ఇముడ్చుకొని ఒకరు ఇంకొకరికి సహయోగిగా అయ్యి బయట వారి పేరును ప్రసిద్ధి చేస్తారు. ఒకవేళ ఎవరైనా పరివారంలో పేదవారు ఉంటే వారికి సహాయాన్ని ఇచ్చి సంపన్నంగా చేస్తారు. ఇది కూడా పరివారము. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశమైతే ఏం చెయ్యాలి? సహయోగాన్ని ఇచ్చి ధైర్యాన్ని పెంచి ఉత్సాహంలోకి తీసుకొస్తూ వారిని తమ తోడుగా తయారు చేసుకోవాలి. తర్వాత చూడండి. అనేకులుగా ఉన్నా ఒక్కటిగా అవుతారు. ఇది చెయ్యడం కష్టమా? వరదానీ మూర్తులుగా అయినప్పుడు వరదానులు ఎప్పుడూ ఎవరి బలహీనతలను చూడరు. ఏం చేస్తారు? ఏదైనా ఇలాంటి ఆత్మిక బాంబును పెట్టి చూపించండి. ఇదే టీచర్ల కర్తవ్యము. తండ్రి పిల్లల బలహీనతలను మనసులో ఉంచుకోరు. మనోభిరామునిగా అయ్యి మనస్సుకు విశ్రాంతిని ఇస్తున్నారు. టీచర్లు అనగా తండ్రి సమానమైనవారు. ఎవరి బలహీనతలను చూడనే చూడకండి. మనసులో ధారణ చెయ్యకండి. కానీ ప్రతి ఒక్కరి మనస్సుకు మనోభిరాముని వలె విశ్రాంతినివ్వండి. అందరూ తమను గుణగానం చేస్తారు. తోటివారు గాని, ప్రజలు గాని ప్రతి ఒక్క ఆత్మ నోటి ద్వారా దీవెనలు రావాలి. వీరు సదా స్నేహీ సహయోగీ ఆత్మలు, బాప్ సమానంగా దయాహృదయులు, మనోభిరాముని బిడ్డ మనోభిరాముడే అని మీకు ఆశీర్వాదాలు రావాలి. అప్పుడు యోగ్యులైన టీచర్లని అంటారు. ఒకవేళ టీచరు లోపాలను చూసినట్లయితే విద్యార్థికి, టీచరుకు తేడా ఏముంది? టీచర్ తండ్రి సింహాసనానికి అధికారులు. తోడుగా తండ్రి సింహాసనంపై విరాజమానమై ఉన్నారు కదా! అందరికంటే దగ్గరగా, తోడుగా ఉన్నవారే కూర్చుంటారు కదా. టీచర్ అనగా తండ్రి సింహాసనాధికారులు. కావున ఇలాంటి అద్భుతం చేసి చూపించండి. టీచర్ ఎవరిని అంటారో అర్థమయిందా? ఇందులో ఎవరైనా ప్రైజ్ తీసుకోవచ్చు. టీచర్ నోటి నుండి ఎప్పుడూ ఎవరి బలహీనతల వర్ణన జరగరాదు, విశేషతల వర్ణన చేయాలి. టీచర్ అనగా తండ్రి సమానముగా ధైర్య హీనులకు ఊతకర్రలుగా అగువారు. టీచర్ అని ఎవరిని అంటారో అర్థమయ్యిందా? విస్తారం మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు సంఘటన యొక్క సారం తయారు చెయ్యాలి.

పార్టీలతో :- బాప్ దాదా సదా పిల్లల ఏ స్వరూపాన్ని చూస్తారు? తండ్రి పిల్లలను సదా సంపన్నంగా, సంపూర్ణ స్వరూపాన్నే చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కొంచెం అలజడిలో ఉన్నా అచలంగా కావాల్సిందేనని తండ్రికి తెలుసు. ఒకప్పుడు అలా ఉండినారు. ఇప్పుడు అదే పాత్రను అభినయించి సంపన్నంగా కావాల్సిందే. ఇది మధ్యలో అలజడి ఒకప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండదు. ఇది మధ్య కాలంలోని విషయము. అందువలన తండ్రి సదా ప్రతి పుత్రుని శ్రేష్ఠ రూపంలో చూస్తారు. కావున పిల్లలు ఏమి చెయ్యాలి? పిల్లలకు కూడా సదా తమ శ్రేష్ఠ రూపం కనిపించాలి. అలా కనిపిస్తూ ఉంటే ఎప్పుడూ క్రిందకు రానే రారు. క్రింద ఎన్ని జన్మలు ఉన్నారు? 63 జన్మలు దిగే అనుభవమే చేశారు. ఇప్పుడు దిగుతూ దిగుతూ అలసిపోయారు కదా లేక ఇప్పుడు కూడా ఇంకా రుచి చూడాలని ఉందా. ఇప్పుడు ఎక్కనే ఎక్కాలి. దిగడం సమాప్తమయ్యింది. కేవలం సంగమ యుగమొక్కటే ఉన్నతి చెందే యుగము. తర్వాత మరలా దిగడం మొదలవుతుంది. ఒకవేళ ఇంత కొద్ది సమయంలో కూడా దిగడం, ఎక్కడం ఉన్నట్లయితే మరలా ఎప్పుడు ఎక్కుతారు? ఇతరులకు "ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు " అని చెప్తారు కదా. అలాగే తమకు కూడా ఇదే స్మృతిని ఇప్పించుకోండి. ఇప్పుడు ఎక్కకపోతే దిగడం మొదలవుతుంది. కావున సదా ఉన్నతయ్యే కళ ఉండాలి. ఇందులో చాలా మజా ఉంటుంది. ఈ జీవితంలో ప్రాప్తించని వస్తువు ఏదీ కనిపించదు. భవిష్య జీవితంలో అప్రాప్తి మరియు ప్రాప్తి జీవితం గురించి తెలియను కూడా తెలియదు. ఇప్పుడు రెండింటి గురించి తెలిసింది కనుక ఇప్పుడు సంతోషం ఉంటుంది కదా! బ్రాహ్మణులుగా కావడం అనగా కావాలి-కావాలి అనేది సమాప్తం. తండ్రి సర్వ ఖజానాలు ఇచ్చేశారు, తాళం చెవి కూడా ఇచ్చేశారు మరలా ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా దాచుకున్నారా? కావాలి అని ఎందుకు అంటున్నారు? బాబా అడగకుండానే అన్నీ ఇచ్చేశారు. మీ అడుక్కునే రూపం కూడా తండ్రికి నచ్చదు(బాగుండదు). విశ్వానికి యజమానులైన బాలకులము అడుక్కుంటూ ఉంటే బాగుంటుందా! మీకు ఏది అవశ్యకత ఉన్నదో, దానిని ఇచ్చేశారు. కనుక ఇప్పుడు ఏం చేస్తారు. మేము విశ్వానికి యజమానులైన తండ్రికి బాలకులమనే నశాలో ఉండండి. అడగడం సమాప్తమైపోతుంది.

ఇప్పుడు మాయాజీత్ ల జండా నలువైపులా ప్రసిద్ధి చెయ్యండి. ఈ జండా ప్రసిద్ధి అయినప్పుడు అన్ని జండాలు క్రిందకు దిగుతాయి. ఇప్పుడు త్రాడు లాగుతున్నారు. జండా పైకి ఎక్కినప్పుడు ప్రత్యక్షత అనే పూల వర్షం కురుస్తుంది.

ఒకరు ఇంకకొకరిని సహయోగిగా చేసుకొని మాయాజీత్ వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఇప్పుడు ఇలాంటి కోటను దృఢంగా చెయ్యండి. కోట దృఢంగా అయినప్పుడు మాయకు ధైర్యం ఉండదు. ఒకవేళ ఎవరిలోనైనా మాయ వస్తే దానిని దూరంగా పారద్రోలండి.

Comments