28-01-1980 అవ్యక్త మురళి

28-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల సంపూర్ణ స్వరూపంలో తేడాకు కారణం మరియు నివారణ.

ఈ రోజు ప్రతీ పుత్రుని డబల్ స్వరూపం చూస్తున్నారు. ఏ డబల్ రూపం? ఒకటి వర్తమాన పురషార్థ స్వరూపం, రెండవది వర్తమాన జన్మలోని అంతిమ సంపూర్ణ ఫరిస్తా స్వరూపం. ఈ సమయంలో "హమ్ సో, సో హమ్" మంత్రంలో మొదట మనమే ఫరిస్తా స్వరూపాలము తర్వాత భవిష్యత్తులో మనమే దేవతలుగా అవుతాము (ఈ సమయంలో అందరి యొక్క లక్ష్యము మొదట ఫరిస్తా స్వరూపము తర్వాత దేవతా స్వరూపము). ఈ రోజు వతనంలో పిల్లలందరి నెంబర్ వార్ పురుషార్ధానుసారము ఏ అంతిమ ఫరిస్తా స్వరూపంగా కావాలో ఆ స్వరూపాన్ని ఎమర్జ్ చేశారు. ఎలాగైతే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ ఇరువురి తేడాను చూస్తూ పురుషార్థీ మరియు సంపూర్ణత్వంలో తేడా ఉందని అనుభవం చేస్తూ ఉండినారో అలా ఈ రోజు పిల్లలలో గల తేడాను చూస్తూ ఉన్నారు. దృశ్యం చాలా బాగుంది. క్రింద తపస్వీ పురుషార్థ రూపం, పైన నిల్చొన్న ఫరిస్తా రూపము. తమ తమ రూపాలను ఎమర్జ్ చేసుకోగలరా? తమ సంపూర్ణ రూపం కనిపిస్తున్నదా? సంపూర్ణ బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రాహ్మణులు. బ్రహ్మకు మరియు మన సంపూర్ణ రూపానికి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు కదా! నెంబర్‌ వారీగా అయితే ఉన్నారు కదా. అక్కడ ఏం జరిగింది! నెంబరువారీగా ఫరిస్తాలు చాలా పెద్ద వలయంలో రాజ్య దర్బారు రూపంలో ఎమర్జ్ అయ్యి ఉండినారు. వారి ప్రకాశంలో తేడా ఉంది. కొందరికి విశేషించి మెరుస్తూ ఉన్న రూపం ఉంది, కొందరిది మధ్యమ ప్రకాశ రూపంగా ఉంది, కానీ విశేషంగా మస్తకం మధ్యలో మెరుస్తూ ఉన్న మణి రూపంలోని ఆత్మలో తేడా ఉంది. కొందరి మెరుపు మరియు లైట్ యొక్క విస్తారం అనగా లైట్ ఎక్కువగా వ్యాపించి ఉంది. కొందరి లైట్ మెరుస్తూ ఉంది కానీ వ్యాపించలేదు. కొందరి ప్రకాశమే (లైట్) తక్కువగా ఉంది. బాప్ దాదా పిల్లలందరి తేడాను (అంతరాన్ని) పరిశీలించి చూశారు. యంత్రం యొక్క వేగం తీవ్రంగా ఉంది. పురుషార్థీ మరియు సంపూర్ణత ఈ రెండింటి సమానతలో తేడా కూడా ఎక్కువగా కనిపించింది. ఏ విధంగా సైన్సు యంత్రపు వేగం తీవ్రంగా ఉందో అలా సమానత యొక్క పురుషార్థ వేగం దాని కంటే తక్కువగా ఉంది.

ఈ రిజల్ట్ పై అనగా ఇంత తేడా ఎందుకుందనే అంశంపై బాప్ దాదాల మధ్య ఈ విధంగా ఆత్మిక సంభాషణ జరిగింది. బ్రహ్మబాబా శివబాబాతో - నా పిల్లలందరూ జ్ఞాన స్వరూపులని అన్నారు. అందుకు శివబాబా బ్రహ్మబాబాతో - జ్ఞాన స్వరూపులతో పాటు త్రికాలదర్శులుగా కూడా ఉన్నారు. అర్థం చేసుకొని, అర్థము చేయించుటలో చాలా తెలివిగల వారిగా ఉన్నారు. తండ్రిని అనుసరించుటలో కూడా చురుకుగానే ఉన్నారు. కొత్త పద్ధతులను కనుగొని ఇన్వెంటర్లుగా (పరిశోధన చేసి కొత్తవి కనుగొనేవారు) కూడా అయ్యారు క్రియేటర్లుగా(సృష్టికర్తలుగా) కూడా అయ్యారు. అయితే వ్యత్యాసము ఎక్కువగా ఉండుటకు ఇంకా ఏమి మిగిలింది? అందుకు కారణమేమి? కారణం అయితే “చిన్నదే " అని అన్నారు. అప్పుడు బ్రహ్మబాబా - పిల్లల గ్రహించే శక్తి చాలా తీవ్రంగా ఉంది. అందువలన జ్ఞానము, గుణాలు, శక్తులను గ్రహించుటతో పాటు ఇతరుల బలహీనతలను గ్రహించే శక్తి కూడా తీవ్రంగా ఉంది. గ్రహించే శక్తికి ముందు “గుణ” అనే శబ్దాన్ని ఉంచడం అనగా గుణగ్రాహకశక్తి" అనే పదాన్ని మర్చిపోతున్నారు. అందువలన మంచితో పాటు బలహీనతలను కూడా గ్రహిస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు? అక్కడ వతనంలో ఒక ఆట ఎమర్జ్ అయ్యింది. ఇక్కడ మీ ప్రదర్శినీలో ఆ ఆట గురించి ఒక చిత్రము కూడా ఉంది. ఇక్కడ మీ చిత్రము వేరే లక్ష్యంతో ఉంచబడింది కానీ ఆ ఆట రూపురేఖలేమో అవే. అదేదంటే శాంతి దాత ఎవరు? అనే చిత్రము. (వరుసగా 10 మంది కూర్చుని ఉంటారు, ఎవరో వచ్చి ఒకటవ నంబరు చెవిలో శాంతిదాత శివబాబా అని చెప్తారు. ఒకటవ నంబరు 2వ నంబరు చెవిలో అలా ఒకరి చెవిలో ఒకరు చెప్తూ పోతారు. చివరి నంబరు వచ్చేసరికి కృష్ణుడు అని చెప్తాడు). ఇలాంటి రూపురేఖలతో కొంతమంది పిల్లలు వతనంలో ఎమర్జ్ అయ్యారు. తర్వాత ఏమయ్యింది? ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక బలహీనత గురించి మొదటి నంబరులో నిల్చొని ఉన్న పుత్రునికి వినిపించి, ఈ బలహీనత తీవ్ర పురుషార్థులకు మంచిది కాదని చెప్తాడు. అప్పుడేమయ్యింది? ఆ మొదటి నంబరు, ఈ బలహీనత నాది కాదు, ఇతనిది అని రెండవ నంబరు వైపు సూచిస్తాడు. మూడవ నంబరు ఆ పని చేసినందున నేను అలా చేశానని రెండవ నంబరు చెప్తాడు. ఇక నాల్గవ నంబరు ఇది మహారథులు కూడా చేస్తున్నారని అంటాడు. అంత సంపూర్ణంగా ఎవరయ్యారని అయిదవ నెంబరంటాడు. ఇక ఆరవ నెంబరయితే ఇది మామూలుగా జరిగేదే అని అన్నాడు. అలా ఖచ్చితంగా ఉంటే సంపూర్ణమై సూక్షవతనంలోకి వెళ్లిపోతామని ఏడవ నెంబరంటాడు. ఇక ఎనిమిదవ నెంబరు - బాప్ దాదా ఏమో సూచననిస్తూనే ఉన్నారు, చెయ్యాల్సిందే కానీ సంఘటనలో ఉన్నాము, వద్దనుకున్నా ఏదో ఒకటి చేసేస్తాము అని అన్నాడు. ఇలా పురుషార్థము విషయంలో ఒకరునొకరు చూసుకుంటూ, ఒకరిపై ఒకరు మోపుకుంటూ అసలు విషయమే మారిపోయింది. ఇలా ఈ రోజులలో ప్రాక్టికల్ గా ఇలాంటి ఆటలు చాలా నడుస్తున్నాయి. ఈ ఆటలలో లక్ష్యానికి, లక్షణాలకు చాలా వ్యత్యాసము వచ్చేస్తూ ఉంది. 

కనుక కారణమేమి? ఈ సంస్కారము వలన సంపూర్ణ సంస్కారము ఇంకా ఎమర్జ్ కాలేకున్నది. కావున బాప్ దాదా చెప్తున్నారు - ఈ ఆట కారణంగా పురుషార్థము మరియు సంపూర్ణతలలో సమానత కలవడం లేదు. ముఖ్యమైన కారణం - గ్రహించే శక్తి ఉంది కాని గుణగ్రాహకులుగా అయ్యే శక్తి తక్కువగా ఉంది. రెండవ విషయము - ఈ ఆట ద్వారా ఏమి అర్ధమయ్యిందంటే తమ పొరపాటును ఇతరులపై వేయడం వస్తుంది కాని స్వంత పొరపాటును అనుభవం చేసుకొని స్వయంపై వేసుకోవడం రావటం లేదు. అందుకే బాప్ దాదా చెప్తున్నారు - జ్ఞానవంతులుగా ఉన్నారు, విడిపించుకోవడంలో తెలివిగా ఉన్నారు కాని స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో లోపం ఉంది. ఇంకొక కారణం కూడా బయటపడింది. అది ఏమిటి! ఈ కారణం వలన ప్రత్యక్షత జరగడంలో కొంత ఆలస్యం అవుతూ ఉంది.

ఆ కారణం - స్వ చింతన. స్వయం పట్ల స్వచింతకులుగా మరియు ఇతరుల పట్ల శుభ చింతకులుగా ఉండాలి. స్వచింతన అనగా మనన శక్తి శభచింతకులు అనగా సేవా శక్తి వాచా సేవ కంటే ముందు శుభ చింతక భావనతో ఎప్పటి వరకైతే ధరణిని తయారు చేయలేదో అప్పటి వరకు వాచా సేవకు కూడా ఫలం లభించదు. అందువలన మొదట సేవకు ఆధారం - శుభ చింతకులుగా అవ్వడం. ఈ భావన ఆత్మల గ్రహణ శక్తిని పెంచుతుంది. జిజ్ఞాసను పెంచుతుంది. అందువలన వాచా సేవ సహజం మరియు సఫలం అవుతుంది. కావున స్వయం పట్ల స్వచింతన కల్గినవారు సదా మాయా ప్రూఫ్ గా (మాయతో సురక్షితంగా) ఎవరి బహీనతలనూ గ్రహించకుండా స్వయాన్ని రక్షించుకుంటారు. వ్యక్తి లేక వైభవాల ఆకర్షణ నుండి రక్షించుకుంటారు. అందువలన ఇంకొక కారణాన్ని నివారణ రూపంలో వినిపించాను “శుభచింతకులుగా మరియు స్వచింతకులుగా కండి.” ఇతరులను చూడకండి. స్వయం చెయ్యండి. మీ అందరి పురుషార్థుల స్లోగన్ "నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు.” “ఇతరులను చూసి నేను చేస్తాను” అని కాదు. కావున ఏ ఆత్మిక సంభాషణ నడిచిందో విన్నారు కదా!

ఈ రోజులలో బాప్ దాదా ఏ పని చేస్తున్నారు! ఫైనల్ మాల తయారు చెయ్యడానికి ముందు మణుల సెలక్షన్(Selection) యొక్క సెక్షన్(Section) తయారు చేస్తున్నారు. అప్పుడే కదా తొందర తొందరగా కూర్చుతూ పోతారు. కావున ప్రతి ఒక్కరూ నేను ఏ సెక్షన్లో ఉన్నానని చూసుకోండి. నెంబర్ వన్ అష్టరత్నాలు, రెండవది 100, మూడవది 16000. నెంబర్ వన్ వారి గుర్తులేమిటి? నెంబర్ వన్లోకి రావడానికి సహజ సాధనం - నెంబర్‌ వన్‌గా బ్రహ్మబాబా ఉన్నారు కనుక వారినే చూడండి. చూడటంలో తెలివిగల వారిగా ఉన్నారు కదా! అనేక మందిని చూచుటకు బదులు ఒక్కరినే చూడండి. ఇది సహజమా లేక కష్టమా? సహజమే కదా! అలా ఉంటే అష్టరత్నాలలోకి వచ్చేస్తారు. సెకండ్ మరియు మూడవ దానిని గురించి మీకు తెలుసు కదా!

ఎలాగైతే భాగ్యంలో స్వయాన్ని ముందుంచుకుంటారో అలా త్యాగంలో “మొదట నేను” అని అనండి. త్యాగంలో ప్రతి బ్రాహ్మణ ఆత్మ “మొదట నేను” అని అంటే భాగ్య మాల అందరి మెడలో పడిపోతుంది. మీ సంపూర్ణ స్వరూపం, సఫలత యొక్క మాలను తీసుకొని పురుషార్థులైన మీ మెడలో వెయ్యడానికి మీ వద్దకు వస్తున్నది. తేడాను(అంతరాన్ని) సమాప్తం చెయ్యండి. మనమే ఫరిస్తాలము అనే మంత్రాన్ని పక్కా చేసుకుంటే సైన్సు యంత్రం తమ పనిని మొదలుపెడ్తుంది. మనం ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యి క్రొత్త ప్రపంచంలో అవతరిస్తాము. ఇలా సాకార తండ్రిని ఫాలో చెయ్యండి. సాకారమును ఫాలో చెయ్యడం సహజం కదా! కావున సంపూర్ణ ఫరిస్తా అనగా సాకార తండ్రిని ఫాలో చెయ్యడం.

ఈ రోజు కర్ణాటక జోన్ వారిది. కర్ణాటక విశేషత చాలా బాగుంది. కర్ణాటక వారు జ్యోతిపై దీపపు పురుగులుగా అయ్యి ఆహుతి కావడంలో తెలివిగలవారు. అక్కడ దీపపు పురుగులు చాలా మంది ఉన్నారు. ఆహుతి కావడంలో నెంబర్ వన్‌గా ఉన్నారు. ఆహుతి అయిన తర్వాత నడవాలి. కావున ఆహుతి కావడంలో చాలా తెలివిగలవారుగా ఉన్నారు. నడవడంలో కొంచెం ఏమి చేస్తారు! నడుస్తూ-నడుస్తూ ప్రక్కదారులు చాలా చూస్తారు. నెంబర్ వన్ భావనా మూర్తులుగా ఉన్నారు. స్నేహీ మరియు సహయోగీ మూర్తులుగా కూడా ఉన్నారు. కర్ణాటక నివాసుల విశేషత - రచయితగా కావడంలో తెలవిగలవారిగా ఉన్నారు. విష్ణువుగా కావడం తక్కువగా వస్తుంది. బ్రహ్మగా కావడం మంచిగా వస్తుంది. శంకరునిగా, విష్ణువుగా అవ్వడం తక్కువగా వస్తుంది. బ్రహ్మగా అగుట బాగా వస్తుంది. శంకర రూపం అనగా విఘ్న వినాశకులు. దీని పురుషార్థం కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా చెయ్యాలి. అయినా బాప్ దాదా కర్ణాటక నివాసులకు అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు ఎందుకు తెలుపుతున్నారు? ఎందుకంటే ప్రేమ స్వరూపులుగా లగ్నములో నిమగ్నం కావడంలో మంచి పురుషార్థులుగా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక వారు ఇక ముందు ఏం చెయ్యాలి. కర్ణాటక ధరణి ఫలదాయకమైనది. వి.ఐ.పి ఫలాలను ఇవ్వడానికి యోగ్యముగా ఉంది. సహజంగా సంబంధములోకి వస్తారు. సిల్వర్ జూబ్లీలో ప్రత్యక్షఫలం ఇవ్వలేదు. వి.ఐ.పి గ్రూపును ఎక్కడ తీసుకొచ్చారు? ధరణి ఎలా సహజమో అలా భారతదేశంలో ధ్వనిని వ్యాపింప చెయ్యడానికి నిమిత్తంగా అయిన ఆత్మలు అక్కడ నుండే వెలువడ్డారు. భారతదేశ చరిత్రలో ప్రసిద్ధమైన ఆత్మలు కర్ణాటకలో చాలా మంది ఉన్నారు. ఒక్కరి ద్వారా చాలామంది కళ్యాణం సహజంగా జరుగుతుంది. సిల్వర్ జూబ్లీకి ఏ కానుక తీసుకొచ్చారు? కర్ణాటక ఇప్పుడు అద్భుతం చూపించాలి.

ఇలాంటి సదా స్వ చింతకులకు, శుభ చింతకులకు సదా ఫాలో ఫాదర్ చేసేవారికి, స్వ పరివర్తనతో విశ్వ పరివర్తన చేసేవారికి, విశ్వ కళ్యాణకారులకు సర్వాత్మల ద్వారా గౌరవింపబడేవారికి, సదా త్యాగంలో ముందు నేను అని అనేవారికి, శ్రేష్ఠ భాగ్యశాలురకు, మాస్టర్ సర్వ శక్తివాన్ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే, 

సేవల కొరకు బాప్ దాదా ఇచ్చిన విశేష ప్రేరణలు - ఇప్పుడు సేవకు మంచి అవకాశాలు వస్తున్నాయి. సాకారము, నిరాకరము ఇరువురినీ ప్రత్యక్షము చేసే సమయము సమీపానికి వస్తున్నది. ఇందులో ఏ నవీనత చేస్తారు? ప్రతి ఫంక్షన్లో ఏదో ఒక నవీనత చేస్తారు కదా. కనుక ఈ శివరాత్రికి విశేషంగా ఏమి చేస్తారు? 1. గత శివరాత్రికి "లైట్ అండ్ సౌండ్" సంకల్పాన్ని చేశారు. ప్రతి ఒక్కరు తమ తమ స్థానాలలో యథా శక్తి ఈ ప్రోగ్రాము చేశారు. శివరాత్రికి గీతా భగవంతుని సిద్ధము చేయు లక్ష్యాన్ని ఉంచుతారు. కాని వ్యంగ్యము చేసినందున జనులకు అర్థము కాదు. అందువలన ఈసారి శివరాత్రి రోజున విశేషంగా రెండు చిత్రాలను మాత్రమే అలకరించండి - ఒకటేమో నిరాకార శివుని చిత్రము, రెండవది శ్రీకృష్ణుని చిత్రము. రెండు చిత్రాలను కిరణాల చిత్రాన్ని తయారు చేసినట్లు అలంకరించండి. శివుని కిరణాల చిత్రాన్ని అలంకరించండి శ్రీకృష్ణుని చిత్రాన్ని కూడా కిరణాలతో అలంకరించండి. విశేషంగా ఈ రెండు చిత్రాలు ఆకర్షణీయంగా ఉండాలి. కృష్ణుని చిత్ర మహిమ వేరే, శివుని చిత్ర మహిమ వేరే. వ్యంగ్యముగా చూపకండి, వివరించకండి. కాని ఇరువురికి గల తేడాను సిద్ధము చేయండి (ఋజువు చేయండి). స్టేజిపై ఈ రెండు చిత్రాలే చాలా ఆకర్షణీయంగా కనిపించాలి. ఎలాగైతే ఏదైనా కాన్ఫరెన్సులు జరిపినపుడు ఆ కాన్ఫరెన్స్ సింబల్ (గుర్తును) బాగా అలంకరించి దానిని అనావరణము(ఓపన్) చేయిస్తారో అలా శివరాత్రి పర్వదినాన ఎవరైనా వి.ఐ.పి ద్వారా ఈ రెండు చిత్రాలను అనావరణం చేయించండి. అంతకు ముందు వారికి క్లుప్తంగా ఇరువురి తేడాను స్పష్టం చేసి వినిపించండి. తర్వాత సభలో ఇదే విషయంపై ఎప్పుడైతే శివుని మహిమ గురించి ఉపన్యసిస్తారో అప్పుడు ఉపన్యాసముతో పాటు చిత్రాన్ని కూడా చూపండి. ఉపన్యసించేవారు జతలో చిత్రాన్ని కూడా చూపిస్తూ ఉండాలి. ఇది వీరు - ఇది వీరు అని వివరించాలి. అప్పుడు అందరి గమనము చిత్రము వైపు ఆకర్షింపబడుంది. మొదట తేడా వినిపించి తర్వాత వారితో - ఇప్పుడు రచయిత ఎవరో, రచన ఎవరో మీరే నిర్ణయించమని చెప్పండి. కనుక గీతా జ్ఞానమునిచ్చినవారు రచయితనా? లేక రచన ఇచ్చాడా? అని అడగండి. కనుక ఈ శివరాత్రి నాడు ఈ రెండు విశేష చిత్రాలకు మహత్వమివ్వండి. 

2. ఎలాగైతే గతసారి లైట్ అండ్ సౌండ్ ల కామెంట్రీ టేపులో నింపి ఉండినారు. ఈసారి అలా చేయకండి. ప్రోగ్రాము మధ్యలో అలంకరింపబడిన శివబాబా చిత్రాన్ని సభ ముందుంచి మిగిలిన అన్ని లైట్లు ఆర్చేయండి. ఆ చిత్రము లైట్లు మాత్రమే వెలుగుతుండాలి. ఆ సమయంలో నెమ్మదిగా తండ్రిని మహిమ చేస్తూ పోండి. మహిమ చేస్తూ వారిని కూడా మహిమలోకి తీసుకెళ్తూ పోండి. మహిమ వినిపిస్తూ అనుభవం చేయించండి. శాంతిసాగరుడని అంటూనే శాంతి అలలు వ్యాపించాలి. ఏ గుణాన్ని వర్ణిస్తారో దాని అలలు వ్యాపిస్తూ ఉండాలి. ఆ సమయంలో అన్ని లైట్లు ఆర్పివేయబడి ఉండాలి. కేవలం ఆ ఒక్క చిత్రము వైపే అందరి అటెన్షన్ ఉండాలి. మెల్ల మెల్లగా అటువంటి అనుభవీ ముర్తులై మహిమ చేయండి. జతలో తీసుకెళ్లినట్లుండాలి. శాంతిసాగరుడని అంటూనే అందరూ ఆ సాగరంలో స్నానము చేసినట్లు అనుభవం చెయ్యాలి. యోగ కామెంట్రీ ఎలా చేస్తారో అలా వారికి లక్ష్యమిచ్చి అదే రీతిగా కూర్చోబెడితే వారికి అటెన్షన్ వస్తుంది. రెండవది - తేడా తెలిసిపోతుంది. కట్ చేసే అవసరముండదు. స్వతహాగా సిద్ధమైపోతుంది. 

3. ప్రతి ఫంక్షన్లో యోగశిబిర ప్రోగ్రాముంటుందని అనౌన్స్ చేయండి. ఫంక్షన్ ఒక రోజు చేసినా యోగ శిబిరం ఫారాన్ని తప్పక నింపించండి యోగ ఫారం నింపించుటకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ను కేటాయించండి. ఆ ఫారంలో వారికి దగ్గరగా ఉన్న సేవా కేంద్రమేదో నింపమని చెప్పండి. తర్వాత వారు యోగశిబిరానికి వచ్చినప్పుడు సంపర్కములోకి వచ్చేస్తారు. యోగశిబిర ఫారాన్ని నింపించి తర్వాత కూడా వారితో సంపర్కములో ఉండండి. ఏ ప్రోగ్రాము చేసినా అందులో యోగశిబిరానికి మహత్వమివ్వండి. 

4. అవకాశము లభించినప్పుడంతా సంపర్కములోకి వచ్చినవారిని లేక ఎవరైనా విఘ్నాల కారణంగా రాకుండా నిల్చిపోయి ఉండినా, వెళ్లిపోయి ఉండినా వారందరిని ఇటువంటి విశేష సమయాలలో ఆహ్వానించండి. ఎవరైతే తమ బలహీనతల వలన వెనుక ఉండిపోయారో వారిని స్నేహముతో ముందుకు తీసుకెళ్లాలి. ఇటువంటి ప్రోగ్రాముల ద్వారా వారిలో కూడా జాగృతి వస్తుంది. ఉత్సాహములోకి వచ్చేస్తారు. 

Comments