26-12-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
రాజయోగి అనగా మూడు స్మృతుల స్వరూపము.
ఈ రోజు బాప్ దాదా తన తిలకధారీ పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంపై రాజయోగి అనగా "స్మృతి భవ " అనే తిలకంతో పాటు విశ్వ రాజ్యాధికారి రాజ్య తిలకం కూడా ఉంది. రాజయోగీ తిలకం మరియు రాజ్య తిలకం రెండు తిలకాలనూ చూస్తున్నారు. మీరందరూ కూడా తమ రెండు తిలకాలను సదా చూసుకుంటున్నారా? బాప్ దాదా అందరి మస్తకంపై విశేషించి రాజయోగీ తిలకం యొక్క విశేషతను చూస్తున్నారు. విశేషతలో అంతరం(తేడా) ఏమి చూశారు? కొంతమంది రాజయోగుల మస్తకంపై మూడు బిందువుల తిలకం ఉంది. కొంతమంది మస్తకం పై రెండు బిందువుల తిలకం ఉన్నది. మరి కొంతమంది మస్తకంపై ఒక్క బిందువు తిలకం మాత్రమే ఉంది. వాస్తవానికి జ్ఞానసాగరుడైన తండ్రి విశేషించి మూడు స్మృతులను మూడు బిందువుల రూపంలో తిలకాన్ని ఇచ్చారు. ఆ మూడు స్మృతులను త్రిశూల రూపంలో స్మృతి చిహ్నంగా తయారు చేశారు.
ఈ మూడు స్మృతులలో ఒకటి స్వ స్మృతి, రెండవది తండ్రి స్మృతి, మూడవది డ్రామా జ్ఞానం యొక్క స్మృతి, విశేషించి ఈ మూడు స్మృతులలోనే జ్ఞాన విస్తారమంతా ఇమిడి ఉంది. ఇవి జ్ఞాన వృక్షానికి మూడు స్మృతులు. వృక్షానికి మొదట బీజం ఉంటుంది. ఆ బీజం ద్వారా మొదట రెండు ఆకులు వస్తాయి. తర్వాత వృక్షం విస్తారమవుతుంది. ముఖ్యంగా బీజం అనగా తండ్రి స్మృతి. తర్వాత రెండు ఆకులు అనగా విశేషమైన స్మృతులు - ఆత్మను గురించిన సంపూర్ణ జ్ఞానం మరియు డ్రామాను గురించిన స్పష్టమైన జ్ఞానం. ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు "స్మృతి భవ" అను వరదానిగా అవుతారు. ఈ మూడు స్మృతుల ఆధారంతో మాయాజీత్, జగత్ జీత్ గా అవుతారు. ఈ మూడు స్మృతులే సంగమయుగంలోని విశేషత. అందువలన రాజయోగికి తిలకం ఈ మూడు స్మృతులు అనగా మూడు బిందువుల రూపంలో ప్రతీ ఒక్కరి మస్తకంపై మెరుస్తాయి. త్రిశూలానికి ఒక భాగం లేకపోతే యథార్థ శస్త్రం అని అనరు.
సంపూర్ణ విజయులకు గుర్తు - మూడు బిందువులు అనగా త్రి స్మృతి స్వరూపం. కానీ ఏమవుతుంది? ఒకే సమయంలో మూడు స్మృతులు ఉంటూ అవి స్పష్టంగా ఉండటంలో తేడా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఒక్క స్మృతి మాత్రమే ఉంటుంది, అప్పుడప్పుడు రెండు స్మృతులు, అప్పుడప్పుడు మూడు స్మృతులు ఉంటున్నాయి. అందుకే కొందరిని రెండు బిందువుల తిలకధారులుగా, మరి కొందరిని ఒక్క బిందువు తిలకధారిగా చూశామని వినిపించాను. మంచి మంచి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వీరు నిరంతరం మూడు స్మృతులు కలిగిన తిలకధారులుగా, తిలకము ఎప్పుడూ చెరిగిపోని వారిగా కూడా ఉన్నారు. అనగా ఈ తిలకాన్ని ఎవ్వరూ చెరపలేరు. ఎప్పుడైతే స్మృతి స్వరూపులుగా అవుతారో అప్పుడు ఎప్పుడూ చెరగని తిలకధారిగా అవుతారు. లేకపోతే మాటి మాటికి తిలకం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే చెరిగిపోతుంది. ఇప్పుడిప్పుడే అంటుకుంటుంది. కానీ సంగమయుగ రాజయోగులు నిరంతర అవినాశి తిలకధారిగా ఉండాలి. అవినాశిగా ఉన్న తిలకాన్ని మాయ వినాశిగా చెయ్యకూడదు. ప్రతి రోజు అమృతవేళ ఈ మూడు స్మృతుల అవినాశి తిలకాన్ని చెక్ చేసుకుంటే మాయ మొత్తం రోజంతా దానిని చెరిపేందుకు ధైర్యం చెయ్యలేదు. మూడు స్మృతుల స్వరూపం అనగా సర్వ సమర్థ స్వరూపం. ఇది సమర్థ తిలకం. సమర్థత ముందు మాయ వ్యర్ధ రూపాలన్నీ సమాప్తమైపోతాయి. మాయ 5 రూపాలు 5 దాసీలుగా అవుతాయి. పరివర్తనా రూపం కనిపిస్తుంది.
కామ వికారం శుభకామన రూపంలో మీ పురుషార్థంలో సహయోగీ రూపంగా అవుతుంది. కామ రూపంలో యుద్ధం చేసే వికారము శుభకామన రూపంలో విశ్వసేవాధారీ రూపంగా అయిపోతుంది. శత్రువుకు బదులు స్నేహితునిగా అవుతుంది. క్రోధాగ్ని రూపంలో ఏదైతే ఈశ్వరీయ సంపదను కాల్చేస్తూ ఉందో, ఆవేశ రూపంలో అందరినీ స్పృహ కోల్పోయే విధంగా చేస్తూ ఉందో అదే క్రోధ వికారం పరివర్తనై ఆత్మిక ఆవేశం లేక నశా రూపంలో స్పృహలేని వారికి స్పృహ ఇప్పించేదిగా అవుతుంది. క్రోధ వికారం సహన శక్తి రూపంలో పరివర్తనైపోయి మీకు ఒక ఆయుధంగా తయారవుతుంది. క్రోధం ఎప్పుడైతే సహన శక్తికి ఆయుధంగా అయిపోతుందో శస్త్రం ఎల్లప్పుడూ శస్త్రధారికి సేవార్థంగా ఉపయోగపడ్తుంది. అదే క్రోధాగ్ని యోగాగ్ని రూపంలో పరివర్తనైపోతుంది. అది మిమ్ములను కాల్చదు కానీ పాపాలను కాల్చేస్తుంది. అదేవిధంగా లోభ వికారం ట్రస్టీ రూపంతో అనాసక్త వృత్తి స్వరూపంలోకి, ఉపరామ స్థితి రూపంలోకి, బేహద్ వైరాగ్య వృత్తి రూపంలోకి పరివర్తనైపోతుంది. లోభం సమాప్తమైపోతుంది, సదా "కావాలి కావాలి" అనుటకు బదులు కోరిక అంటే ఏమిటో తెలియని స్వరూపంగా (ఇచ్ఛా మాత్రమే అవిద్యగా) అయిపోతుంది. లోభాన్ని కావాలి అని అనరు "వెళ్లిపో" అని అంటారు. తీసుకోవాలి తీసుకోవాలి అని కాక ఇవ్వాలి ఇవ్వాలి అని పరివర్తనవుతుంది. ఇదే లోభం అనాసక్త వృత్తిగా లేక ఇచ్చే దాతా స్వరూప స్మృతి స్వరూపంగా పరివర్తనై పోతుంది. అదే విధంగా మోహ వికారం యద్ధం చెయ్యడానికి బదులు స్నేహ స్వరూపంలోకి పరివర్తనై తండ్రి స్మృతి మరియు సేవలో విశేషమైన తోడుగా అవుతుంది. ఈ స్నేహం "స్మృతి మరియు సేవ" లో సఫలతకు విశేష సాధనంగా అవుతుంది. అలాగే అహంకారం అనే వికారం దేహాభిమానం నుండి పరివర్తనైపోయి స్వాభిమానిగా అయిపోతుంది. స్వ అభిమానం ఉన్నతయ్యే కళకు సాధనం. దేహాభిమానం అవనతి అయ్యే (పడిపోయే) కళకు సాధనం. దేహాభిమానం పరివర్తనై స్వ - అభిమానం రూపంలో స్మృతి స్వరూపంగా అగుటలో సాధనంగా అవుతుంది. ఈ విధంగా ఈ వికారాలు అనగా ఈ భయంకర రూపధారులు తమకు సేవలో సహయోగులుగా, మీ శ్రేష్ఠ శక్తుల స్వరూపంలోకి పరివర్తనైపోతాయి. ఇలాంటి పరివర్తనా శక్తిని అనుభవం చేస్తున్నారా? ఈ మూడు స్మృతుల ఆధారంతో ఈ అయిందిటిని పరివర్తన చెయ్యగలరు. కామం రూపంలో వచ్చినట్లయితే శుభ భావనా రూపంగా మారినప్పుడు మాయాజీత్ - జగత్ జీత్ అనే టైటిల్ లభిస్తుంది. విజయులుగా ఉన్నవారు శత్రువు రూపాన్ని తప్పకుండా పరివర్తన చేసుకుంటారు. ఏ రాజులైనా సాధారణ ప్రజలుగా అయినప్పుడే విజయులని పిలిపించుకుంటారు. మంత్రులు కూడా సాధారణ వ్యక్తులుగా ఉన్నప్పుడు విజయులని పిలిపించుకుంటారు. లౌకికంలో కూడా ఈ నియమము ఉంది కదా! ఎవరి పైన విజయాన్ని పొందుతారో వారిని బందీగా చేసి ఉంచుతారు అనగా బానిసగా చేసి ఉంచుతారు. అలాగే మీరు కూడా ఈ 5 వికారాలపై విజయులుగా అవుతారు. అయితే మీరు వీటిని బంధీగా చెయ్యకండి. బంధించినట్లయితే మరలా లోపల గెంతులేస్తాయి. కనుక మీరు వీటిని పరివర్తన చేసి సహయోగీ స్వరూపంగా చేసుకోండి. అప్పుడవి సదా మీకు నమస్కారం చేస్తూ ఉంటాయి. విశ్వ పరివర్తనకు ముందు స్వ పరివర్తన చేసుకోండి. స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన సహజంగా జరుగుతుంది. సదా పరివర్తన చేసుకునే శక్తిని మీ తోడుగా ఉంచుకోండి. పరివర్తనా శక్తి మహత్యం చాలా గొప్పది. అమృతవేళ నుండి రాత్రి వరకు పరివర్తనా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తర్వాత వినిపిస్తాను.
ఇలాంటి రాజయోగులకు, తిలకధారులకు, భవిష్యరాజ్య తిలకధారులకు, సదా మస్తకంపై మూడు స్మృతుల స్వరూపంలో సమర్థంగా ఉండేవారికి, మాయను కూడా శ్రేష్ఠ శక్తి స్వరూపంలో సహయోగిగా తయారు చేసుకునేవారికి, మాయాజీత్, జగత్ జీత్ అని పిలిపించుకునే వారికి, సర్వ శక్తులను ఆయుధంగా చేసుకునే వారికి, సదా శస్త్రధారిగా ఉన్న శ్రేష్ఠ అత్యలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే,
ఒకే సమయంలో మనసు, మాట, కర్మలతో సేవ చేయువారే బేహద్ సేవాధారులు
టీచర్లతో అవ్యక్త బాప్ దాదా - టీచర్లనగా తండ్రి సమానంగా ఉండు నిరంతర సేవాధారులు. ప్రతి సంకల్పము ద్వారా, మాట ద్వారా అనేక ఆత్మల సేవకు నిమిత్తులు. ఒకే సమయంలో మూడు రకాలు కలిపి చేసే సేవ విశేష సేవ అవుతుంది. వాచా సేవతో పాటు మనసా సేవ కూడా తోడుగా ఉండాలి మరియు కర్మణా అనగా సంపర్కం, స్నేహం చేస్తూ స్నేహం ఆధారంతో కూడా రంగు అంటించే సేవ, మాటల ద్వారా కూడా సేవ అంతేకాక సంకల్పం ద్వారా సేవ చేయవచ్చు. అయితే ప్రస్తుత సమయం ఒక్కొక్క సేవ వేరు వేరుగా చేసే సమయం కాదు. బేహద్ సేవ వేగంగా జరగాలంటే ఒకే సమయంలో మూడు రకాల సేవ కలిసి ఉండాలి. దీనినే తీవ్ర వేగంతో బేహద్ వేగంగా చేసే సేవ అని అంటారు. తీవ్ర వేగంతో బేహద్ సేవాధారిగా కండి. కేవలం మీ హద్దు స్థానం కాదు. ఎలాగైతే తండ్రి ఒకే స్థానములో ఉంటున్నా బేహద్ సేవ చేస్తున్నారో అలా నిమిత్త మాత్రం మీకు ఒక స్థానమే ఉంటుంది. కానీ మిమ్మల్ను మీరు బేహద్ సేవకు నిమిత్తంగా భావించాలి. మీ ముందు విశ్వాత్మలు సదా ఎమర్జ్ రూపంలో ఉండాలి. అప్పుడే విశ్వ కళ్యాణకారులని పిలిపించుకుంటారు. లేకపోతే దేశ కళ్యాణకారులు లేక సెంటర్ కళ్యాణకారులుగా అయిపోతారు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఇంత గొప్ప బేహద్ విశ్వ కళ్యాణకారులుగా అవుతారో అప్పుడు విశ్వాత్మలు తమ అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. లేకుంటే కొద్ది సమయంలోనే అందరూ ఎలా చేరుకోగలరు? ఇద్దరు - నలుగురు కాదు మొత్తం విశ్వమంతా ఉంది. కనుక నిమిత్తంగా అయిన ఆత్మలు సంఘటన రూపంలో బేహద్ సేవా రూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఏ విధంగా మీ స్థానం గురించి ఆలోచన ఉంటుందో, ప్లాన్లు తయారుచేసి ప్రాక్టికల్ లోకి తెస్తారో, దాని ఉన్నతికి ఆలోచనలు నడుస్తాయో అలా బేహద్ లో సర్వాత్మల పట్ల సదా ఉన్నతి చేసే సంకలాలు ఎమర్జ్ రూపంలో ఉండాలి. అప్పుడీ పరివర్తన జరుగుతుంది.
విశ్వ కళ్యాణకారులు ఎంత పని చేయాలి! స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండరాదు. స్వప్నంలో కూడా సేవనే కనిపించాలి. దీనినే ఫుల్ బిజీ అని అంటారు. ఎందుకంటే రోజంతటికి ఆధారం స్వప్నమే. ఎవరైతే రాత్రి - పగలు సేవలో బిజీగా ఉంటారో వారి స్వప్నాలు కూడా సేవార్థమే ఉంటాయి. స్వప్నంలో కూడా చాలా క్రొత్త క్రొత్త విషయాలు, సేవకు ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తాయి. మరి ఇంత బిజీగా ఉంటున్నారా? వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా ఉన్నారు కదా, ఎంత బిజీగా ఉంటే అంతగా తమ పురుషార్థంలో వ్యర్థం నుండి ముక్తులై ఇతరులను కూడా వ్యర్థం నుండి రక్షించగలరు. ప్రతి సమయం సమర్థంగా ఉందా లేక వ్యర్థంగా ఉందా అని చెకింగ్ ఉండాలి. ఒకవేళ ఏ కొంచెం వ్యర్థం అనుభవం అయినా దానిని అదే సమయంలో పరివర్తన చేసుకోండి. నిమిత్తమైన వారిని చూసి ఇతరులలో కూడా స్వతహాగా సమర్థ సంకల్పాలు నిండుతూ పోతాయి. అర్థమయిందా?
బేహద్ విశ్వంలోని ఆత్మలందరూ సదా ఎమర్జ్ గా ఉండాలి. మీరు ఇప్పుడు వారిని ఎమర్జ్ చేసుకుంటే ఆ ఆత్మలకు మేము కూడా మా భవిష్యత్ ను తయారుచేసుకోవాలనే సంకల్పం ఉత్పన్నమవుతుంది. విశ్వ కళ్యాణకారుల అర్థం విశ్వానికి ఆధారమూర్తులు. మీలో కొంచెం నిర్లక్ష్యమున్నా అది విశ్వాన్ని నిర్లక్ష్యంగా తయారు చేస్తుంది. ఇంత అటెన్షన్ ఉండాలి.
ఢిల్లీవారు కూడా ఏవైనా కొత్తవి చేయండి. కాస్ట్ఫరెన్స్ ను చాలా పాతబడిపోయాయి. ఇప్పుడు క్రొత్త పద్ధతులు కనుక్కోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ జరగాలి. ఖర్చు కూడా తక్కువ కావాలి. ఫలితం మంచిగా రావాలి. ఇప్పుడు యు.పీ వారు ఇలాంటి క్రొత్త పద్ధతిని కనుక్కుంటారా లేక ఢిల్లీవారు కనుగొంటారా చూస్తాము. ఒకవేళ ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువైతే వచ్చే విద్యార్థులు మనసు కష్టపెట్టుకుంటారు. ఇప్పుడు వారిని కూడా ఉత్సాహంలోకి తీసుకొచ్చేందుకు తక్కువ ఖర్చుతో మంచి ఫలితం వచ్చేటట్లు చెయ్యండి. అందులో అందరూ బిజీగా ఉండాలి. ఖర్చు కూడా తక్కువ కావాలి. తనువు, మనసు రెండూ బిజీగా అయిపోవాలి. ధనం తక్కువగా ఖర్చవ్వాలి.
పార్టీలతో-
1)స్వస్థితితో పరిస్థితులన్నిటిపై విజయం - అందరూ సదా స్వ స్థితి ద్వారా పరిస్థితులపై విజయులుగా ఉంటున్నారా? సంగమ యుగంలో అందరూ విజయీ రత్నాలుగా ఉన్నారా? కావున విజయం ప్రాప్తించుకోవడానికి సాధనం - స్వ స్థితి ద్వారా పరిస్థితిపై విజయం. మీరు ఈ దేహం కూడా కాదు, స్వయానిది కాదు. దేహ భ్రాంతిలోకి రావడం ఇది కూడా స్వస్థితి కాదు. కనుక మొత్తం రోజులో స్వస్థితి ఎంత సమయముందో చెక్ చేసుకోండి. ఎందుకంటే స్వస్థితి లేక స్వధర్మం సదా సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. ప్రకృతి ధర్మము అనగా పరధర్మము లేక దేహ స్మృతి ఏదో ఒక దుఃఖాన్ని తప్పకుండా అనుభవం చేయిస్తుంది. ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. సదా సుఖము అనుభవం అవుతూ ఉందా లేక దు:ఖపుటలలు వస్తున్నాయా? సంకల్పంలో కూడా దు:ఖపుటల వచ్చిందంటే స్వస్థితి నుండి స్వ ధర్మం నుండి క్రిందకు వచ్చేశారని ఋజువవుతుంది. క్రొత్త జన్మ జరిగినప్పుడు సుఖదాత పిల్లలుగా అయినప్పుడు సుఖసాగరుని పిల్లలు సదా సుఖంలో సంపన్నంగా ఉంటారు. మీరందరూ మాస్టర్ సాగరులు. కనుక సంపన్న స్థితి అనుభవం అవుతూ ఉందా? స్వ పురుషార్థం సమయ ప్రమాణంగా ఉండాలి. సమయం వేగంగా పరిగెడుతూ ఉందా లేక మీరే హైజంప్ చేస్తున్నారా? సమయం వేగం అనుసారంగా ఇప్పుడు హైజంప్ చెయ్యకపోతే చేరుకోలేరు. ఇప్పుడు పరుగెత్తే సమయం పోయింది. హైజంప్ చెయ్యండి. పురుషార్థంలో "తీవ్రత" అనే శబ్దాన్ని కలపండి. స్మృతిలో ఉండడం పెద్ద విషయమేమీ కాదు. కాని స్మృతితో పాటు సహజయోగి, నిరంతర యోగిగా ఉండాలి. ఒకవేళ అలా లేకుంటే స్మృతి అసంపూర్ణంగానే ఉంటుంది.విశ్వ సేవ, స్వ సేవ రెండూ బ్యాలెన్స్ లో ఉంచుకుంటే సఫలత లభిస్తుంది. స్వ సేవను వదిలి విశ్వసేవలో నిమగ్నమైనా లేక విశ్వ సేవను మరచి స్వ సేవనే చేస్తున్నా సఫలత లభించజాలదు. రెండు సేవలూ జత జతలో జరగాలి. మనసా మరియు వాచా రెండు సేవలు కలిసి ఉన్నట్లయితే కష్టం నుండి రక్షింపబడతారు. ఎప్పుడు సేవార్థం వెళ్లినా మొదట స్వ స్థితిలో స్థితమై వెళ్తున్నామా, అలజడిలోకి రావట్లేదు కదా! అని చెకింగ్ చేసుకోండి. స్వయం అలజడిలోకి వచ్చినట్లయితే వినేవారు కూడా ఏకాగ్రం కాలేరు, అనుభవం చేసుకోలేరు.
2)జ్ఞాన రహస్యాలన్నీ తెలుసుకున్న వారు ఎప్పుడూ క్రోధంలోకి రారు. మీరు జ్ఞాన రహస్యాలన్నీ తెలుసుకున్న రహస్యయుక్త ఆత్మలే కదా? తమ పురుషార్థం అనుసారంగా తండ్రి ద్వారా అనేక జ్ఞాన రహస్యాలను తెలుసుకుంటూ అందులోనే రమిస్తూ ముందుకు వెళ్లండి. సదా రహస్య యుక్తులుగా, సదా యోగయుక్తులుగా, సదా స్నేహ యుక్తులుగా ఉన్నారా? జ్ఞాన ఖజానాలన్నిటినీ తెలుసుకున్నవారు స్వయం సంతుష్టంగా ఉండుటే కాక ఇతరులను కూడా సంతుష్టంగా చేసే అభ్యాసిగా ఉంటారు. కావున సదా రహస్యయుక్తులు అనగా సంతుష్టపరచేవారు, వారెప్పుడూ క్రోధంలోకి రాలేరు. ఇలాంటి రహస్యాలన్నీ తెలుసుకున్నవారు తండ్రికి ప్రియంగా ఉంటారు, సమీపంగా ఉంటారు.
3)సద్గురువు కృపతో సంపన్న స్థితి - భక్తి మార్గంలో గురువు కృప గాయనం చేయబడింది. అలా జ్ఞాన మార్గములో సద్గురువు కృప - చదువుకు గాయనముంది. ఈ కృపతో సద్గురువు సంపన్నంగా చేస్తారు. ఎవరిపై సద్గురువు కృప కలుగుతుందో వారు సదా ముక్తులుగా, జీవన్ముక్తులుగా అయిపోతారు.
Comments
Post a Comment