* 26-11-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సహయోగులే సహజయోగులు.
ఈ రోజు బాప్ దాదా తమ స్వరాజ్యాధికారులైన రాజర్షులను మరియు భవిష్యత్తులో రాజ్యవంశీయులుగా అయ్యే పిల్లలను చూస్తున్నారు. మీరందరూ సహజయోగులు అనగా రాజర్షులు, బాప్ దాదా పిల్లలందరికీ వర్తమాన వరదానీ సమయంలో విశేషంగా ఏ వరదానమును ఇస్తారు? సహజయోగీ భవ! ఈ వరదానాన్ని అనుభవం చేసుకుంటున్నారా? యోగులుగా అయితే ఎందరో అవుతారు కానీ సహజయోగులుగా కేవలం సంగమయుగ వాసులైన శ్రేష్ఠ ఆత్మలు మీరే అవుతారు. ఎందుకంటే వరదాత అయిన తండ్రి యొక్క వరదానము ఉంది. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే ఈ వరదానము యొక్క వరదానులుగా అయ్యారు. అన్నింటికన్నా ముందు జన్మ యొక్క వరదానము ఈ సహజయోగీ భవ అన్న వరదానమే కావున మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వరదాత అయిన తండ్రి, వరదాత అయిన సమయము మరియు మీరు కూడా వరదానాలు తీసుకునే శ్రేష్ఠ ఆత్మలే. ఈ వరదానమును బుద్ధిలో సదా గుర్తుంచుకోవడమే వరదానమును జీవితములోకి తీసుకురావడం. కావున స్వయాన్ని ఈ విధంగా సదా వరదానాన్ని ప్రాప్తించుకున్న ఆత్మగా, ప్రాప్తి స్వరూప ఆత్మగా భావిస్తున్నారా? లేకపోతే కష్టపడవలసి వస్తోందా? సదా వరదానీ ఆత్మలుగా ఉన్నారా? ఈ వరదానమును సదా స్థిరంగా ఉంచుకునేందుకు విధి మీకు తెలుసా? అన్నింటికన్నా సహజమైన విధి ఏమిటి? అది మీకు తెలుసు కదా? సదా సర్వులతో మరియు సేవలో సహయోగులుగా అవ్వండి. కావున సహయోగులే సహజయోగులు. చాలామంది బ్రాహ్మణ ఆత్మలు సహజయోగము యొక్క అనుభవాన్ని సదా పొందలేకపోతున్నారు. యోగమును ఎలా జోడించాలి? ఎక్కడ జోడించాలి? అన్న ఈ ప్రశ్నలోనే ఇంకా ఇప్పటివరకూ కూడా ఉన్నారు. సహజయోగములో ప్రశ్న అనేది ఉండదు మరియు సహజమైనది సదా స్వతహాగానే ఉంటుంది అనగా సహజయోగులైన వరదానీ ఆత్మలు స్వతహాగానే నిరంతరమూ యోగులుగా ఉంటారు. అలా లేకపోవడానికి కారణము ఏమిటి? ప్రాప్తించిన వరదానమును లేక బ్రాహ్మణ జన్మ యొక్క ఈ అలౌకిక కానుకను సంభాళించడం రాకపోవడమే. స్మృతి ద్వారా సమర్థముగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యులుగా అయిపోతారు. లేకపోతే బ్రాహ్మణులు సహజయోగులుగా లేకపోతే బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత ఏముంది? వరదానులుగా అయి ఉంటూ కూడా సహజయోగులుగా అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతారు? ఇది మా జన్మ సిద్ధ వరదానము అన్న నషాను మరియు నిశ్చయాన్ని సదా గుర్తుంచుకోండి. ఇదే వరదానమును సర్వాత్మల ప్రతి సేవలో వినియోగించండి. సేవలో సహయోగులుగా అవ్వడమే సహజయోగులుగా అయ్యేందుకు విధి.
అమృతవేళ నుండి సహయోగులుగా అవ్వండి. మొత్తం రోజంతటి యొక్క మూల లక్ష్యముగా ఒక్క శబ్దాన్ని గుర్తుంచుకోండి - సహయోగాన్ని ఇవ్వాలి. సహయోగిగా అవ్వాలి. అమృతవేళ బాబాతో మిలనము జరుపుకొని బాబా సమానముగా మాస్టర్ బీజస్వరూపముగా అయి, మాస్టర్ విశ్వకళ్యాణకారిగా అయి సర్వాత్మలకు మీకు ప్రాప్తించిన శక్తుల ద్వారా వారి వృత్తులను మరియు వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సహయోగులుగా అవ్వండి. బీజము ద్వారా మొత్తం వృక్షమంతటికీ ఆత్మిక జలాన్ని ఇచ్చే సహయోగులుగా అవ్వండి, తద్వారా సర్వ ఆత్మల రూపీ ఆకులకు ప్రాప్తి అనే నీరు లభించడం అనుభవమవుతుంది. ఈ విధంగా అమృతవేళ నుండి రోజంతటిలో ఏ కార్యము చేసినా ప్రతి కార్యములోనూ సహయోగమును ఇవ్వాలి అన్న లక్ష్యము ఉండాలి. వ్యవహారికమైన కార్యములోకి వెళ్ళినా, ప్రవృత్తిని నడిపే కార్యములో ఉన్నా సదా లౌకిక వ్యవహారములో కూడా స్వయం ప్రతి లేక తోటివారి ప్రతి శుభభావన మరియు కామనతో ఆత్మిక వాయుమండలమును తయారుచేసే సహయోగమును ఇచ్చానా లేక సాధారణ రీతిగా నా డ్యూటీని నిర్వర్తించి వచ్చేసానా? అని పరిశీలించుకోండి. ఎవరి వృత్తి ఎలా ఉంటుందో ఆ వృత్తి అనుసారముగా వారు ఎక్కడకు వెళ్ళినా తాము తమ వృత్తితో కూడుకున్న కార్యమును తప్పకుండా చేస్తారు. సహయోగులుగా అవ్వడమే మీ అందరి యొక్క విశేషమైన కర్తవ్యము, మరి దానిని ఎలా మర్చిపోగలరు? కావున ప్రతి కార్యములోనూ సహయోగులుగా అయితే, తద్వారా స్వతహాగానే సహజయోగులుగా అయిపోతారు. సహయోగులుగా అవ్వకుండా ఒక్క క్షణము కూడా ఉండకూడదు. మనస్సు ద్వారా అయినా సహయోగులుగా అవ్వండి లేక వాక్కు ద్వారా అయినా సహయోగులుగా అవ్వండి లేక సంబంధ, సంపర్కాల ద్వారా అయినా సహయోగులుగా అవ్వండి లేక స్థూల కర్మ ద్వారా అయినా సహయోగులుగా అవ్వండి కానీ సహయోగులుగా తప్పకుండా అవ్వాలి. ఎందుకంటే మీరందరూ దాత యొక్క పిల్లలు. దాత యొక్క పిల్లలు సదా ఇస్తూనే ఉంటారు. మరి ఏమివ్వాలి? సహయోగము.
స్వపరివర్తనకు కూడా స్వయం యొక్క సహయోగులుగా అవ్వండి. ఎలా? సాక్షిగా అయి స్వయం ప్రతి కూడా సదా శుభచింతన యొక్క వృత్తి మరియు అత్మిక వాయుమండలమును తయారుచేయడంలో స్వయం కొరకు కూడా సహయోగులుగా అవ్వండి. ప్రకృతి తన వాయుమండలము యొక్క ప్రభావములో అందరికీ ఆ అనుభవమును కలిగిస్తోంది కదా! చలి, వేడి మొదలగు విధాలుగా ప్రకృతి తన ప్రభావమును వాయుమండలముపై చూపుతుంది. అలాగే ప్రకృతీజీతులు సదా సహయోగులు, సహజయోగీ ఆత్మలు తమ ఆత్మిక వాయుమండలము యొక్క ప్రభావమును అనుభవం చేయించలేరా? సదా స్వయం ప్రతి మరియు సర్వుల ప్రతి సహయోగము యొక్క శుభభావనను ఉంచుతూ సహయోగీ ఆత్మలుగా అవ్వండి. వారు ఇలా ఉన్నారు. వారు ఇలా చేస్తున్నారు అని ఆలోచించకండి. ఎటువంటి వాయుమండలము ఉన్నా వ్యక్తి ఉన్నా నేను సహయోగమును ఇవ్వాలి అన్నది గుర్తుంచుకోండి.
ఈ విధంగా బ్రాహ్మణ ఆత్మలందరూ సదా సహయోగులుగా అయిపోతే ఏమవుతుంది? అందరూ స్వతహాగా సహాయోగులుగా అయిపోతారు. ఎందుకంటే సర్వాత్మలకూ సహయోగము లభించడం ద్వారా బలహీనులు కూడా శక్తిశాలిగా అయిపోతారు. బలహీనత సమాప్తం అయిపోవడం ద్వారా, సహయోగులుగా కూడా అయిపోతారు కదా! ఎటువంటి బలహీనత ఉన్నా అది శ్రమను, కష్టమును
అనుభవం చేయిస్తుంది. శక్తిశాలిగా ఉంటే అంతా సహజమే. మరి ఏమి చేయవలసి ఉంటుంది? సదా తనువు ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, ధనము ద్వారా కానీ, వాటి ద్వారా కానీ లేక కర్మ ద్వారా కానీ సహయోగులుగా అవ్వాలి. ఎవరైనా మనసు ద్వారా అవ్వలేకపోతే తనువు ద్వారా మరియు ధనము ద్వారా సహయోగులుగా అవ్వండి. మనస్సు ద్వారా, వాణి ద్వారా అవ్వలేకపోతే కర్మ ద్వారా సహయోగులుగా అవ్వండి. సంబంధాన్ని జోడింపజేసే లేక సంపర్కాన్ని ఏర్పరిచే సహయోగులుగా అవ్వండి. కేవలం సందేశమును ఇచ్చే సహాయోగులుగా అవ్వకండి. మీ పరివర్తన ద్వారా సహయోగులుగా అవ్వండి. మీ సర్వప్రాప్తుల యొక్క అనుభవాన్ని వినిపించే సహయోగులుగా అవ్వండి, మీ సదా హర్షితముగా ఉండే ముఖము ద్వారా సహయోగులుగా అవ్వండి. కొందరికి గుణాలను దానం ఇవ్వడం ద్వారా సహయోగులుగా అవ్వండి. కొందరికి ఉల్లాస, ఉత్సాహాలను పెంపొందింపజేయడంలో సహయోగులుగా అవ్వండి. ఏ విషయంలో సహయోగులుగా అవ్వగలిగితే అందులో సదా సహయోగులుగా అవుతూ ఉండండి. ఇదే సహజయోగము. ఏమి చేయాలో అర్ధమయ్యిందా? ఇదైతే సహజమే కదా! ఏది ఉంటే అది ఇవ్వాలి. ఏది చేయగలిగితే అది చేయండి. అన్నీ చేయలేకపోతే కనీసం ఒకటి, రెండు అయినా, చేయగలరు కదా! ఏ ఒక్క విశేషత ఉన్నా అదే విశేషతను కార్యములో వినియోగించండి. అనగా సహయోగులుగా అవ్వండి. ఇదైతే చేయగలరు కదా! నాలో ఏ విశేషతా లేదు, ఏ గుణమూ లేదు అని ఆలోచించకండి. అది జరుగజాలదు. బ్రాహ్మణులుగా అవ్వడమే చాలా పెద్ద విశేషత. తండ్రిని తెలుసుకోవడం పెద్ద విశేషత, కావున మీ విశేషత ద్వారా సదా సహయోగులుగా అవ్వండి, అచ్చా!
ఈ విధంగా సదా సహయోగులుగా అనగా సహజయోగులుగా, సదా తమ శ్రేష్ఠ వృత్తి ద్వారా వాయుమండలమును తయారుచేసే సహయోగీ ఆత్మలకు, బలహీన ఆత్మలకు ఉత్సాహమును కలిగించే సహయోగి ఆత్మలకు, ఈ విధంగా అమృతవేళ నుండి అన్ని వేళలలోనూ సహయోగులుగా అయ్యే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో - 1. సైలెన్స్ యొక్క శక్తి ద్వారా దైవీ స్వరాజ్యము యొక్క స్థాపన, సైలెన్స్ యొక్క శక్తి ద్వారా మొత్తం విశ్వముపై దైవీ స్వరాజ్యము యొక్క పునాదిని స్థాపిస్తున్నారు కదా! వారు పరస్పరం పోట్లాడుకుంటారు మరియు మీరు దైవీ రాజ్యస్థాపనను తయారుచేసుకుంటున్నారు. మీరు ఎలా అవుతారు అన్నది వారికేమి తెలుసు? వారు తమ, తమ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీడ్రామాలో ఏముందో మీకే తెలుసు. కావున పిల్లలందరూ సైలెన్స్ యొక్క శక్తి ద్వారా దైవీ స్వరాజ్యాన్ని తయారుచేస్తున్నారు కదా! వారిది ముఖము యొక్క శక్తి లేక బాహుబలము, శాస్త్రాల యొక్క శక్తి మరియు మీది సైలెన్స్ యొక్క శక్తి. ఇదే శక్తి ద్వారా దైవీ రాజ్యస్థాపన జరిగి తీరుతుంది అన్న స్థిరమైన నిశ్చయం ఉంది కదా! వర్తమాన సమయంలో కార్యము చేసేందుకు ఈశ్వరీయ శక్తి కావాలి అని వారు కూడా భావిస్తారు, కానీ గుప్తముగా ఉన్న కారణముగా వారు తెలుసుకోలేకపోతున్నారు. మీకు తెలుసు మరియు మీరు చేస్తున్నారు కూడా, పంజాబ్ లో వృద్ధి జరుగుతోంది కదా! పంజాబీ కూడా సేవ యొక్క అది స్థానమే, కావున ఆది స్థానములో ఏదైనా విశేషమైన కార్యము ఉండాలి కదా! అలాగే తండ్రి యొక్క పిల్లలుగా ఉన్న కారణముగా ఆత్మిక సేవను చేయడం పిల్లల ప్రతి ఒక్కరి యొక్క కార్యము, తండ్రి యొక్క కార్యము ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క కార్యము. ఆత్మిక తండ్రి యొక్క కర్తవ్యము సేవ చేయడమైతే మరి పిల్లలు కూడా అదే కార్యములో తత్పరులై ఉండాలి. ఈ అత్మిక సేవ ప్రతి అడుగులోనూ ప్రత్యక్షఫలమును ప్రాప్తింపజేస్తుంది. అందుకు ప్రత్యక్షఫలము సంతోషము. ఎంతగా సేవ చేస్తారో అంతగా సంతోషము యొక్క ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఒకటికి వేల రెట్లుగా లభిస్తుంది, అలా భావిస్తున్నారా?ఆత్మిక సేవాధారులుగా అవ్వడమే మీ వృత్తి. లౌకికములో ఎటువంటి స్థానములో ఉన్నా కానీ అలౌకికములో ఆత్మిక సేవాధారులే. ఎవరైనా డాక్టర్ గా ఉంటే ఆత్మికముగా మరియు దైహికముగా డబుల్ డాక్టర్లుగా అవ్వండి. ఆ కర్తవ్యమును చేస్తూ కూడా ముఖ్యమైన కర్తవ్యము ఆత్మిక డాక్టర్‌గా అవ్వడం. రోగులు పదే పదే రావడం కన్నా రోగమే శాశ్వతముగా అంతమైపోవాలి. కావున ఈ మందు ఇవ్వాలి కదా! సదా ఆరోగ్యము పొందేందుకే రోగి వస్తాడు. ఆత్మిక సేవ ద్వారానే సదాకాలికముగా ఆరోగ్యము లభిస్తుంది. అచ్చా!
సేవాదారులతో: - సేవాధారులైన మీరు ఏ స్థానము యొక్క సేవాధారులు? మేము మహాయజ్ఞము యొక్క సేవాధారులము అన్నది మీకు బాగా తెలుసు కదా! ఎవరైతే మహాయజ్ఞము యొక్క సేవాధారులుగా ఉన్నారో వారికి యజ్ఞము ద్వారా ప్రసాదము లభిస్తుంది. యజ్ఞము యొక్క ప్రసాదానికి ఎంతో మహత్వము ఉంటుంది కదా! లౌకికములో కూడా ప్రసాదం లభించినవారిని మహాన్ ఆత్మలుగా, భాగ్యశాలీ ఆత్మలుగా భావిస్తారు. అందరికీ ప్రసాదం లభించదు. భాగ్యవంతులకే లభిస్తుంది. కావున ఇది మహాయజ్ఞము యొక్క మహా ప్రసాదము. మహా ప్రసాదము ఏమిటి? సదా సంపాదన జమా అవ్వడము, సర్వ ఖజానాలూ ప్రాప్తించడము ఇదే మహా ప్రసాదము. ఎందుకంటే, ఈ యజ్ఞసేవను చేయడం ద్వారా అన్నింటికన్నా శ్రేష్ఠమైన శక్తుల యొక్క ఖజానా, సుఖము యొక్క శాంతి యొక్క ఖజానా మొదలగు అన్ని ఖజానాల యొక్క అనుభూతి కలుగుతుంది కదా! కావున ఇదే యజ్ఞ ప్రసాదము. ఈ ప్రసాదము ద్వారా సదా ప్రసన్నముగానూ ఉంటారు మరియు ముందు ముందు కూడా సదా ప్రసన్నముగా ఉంటారు. కావున అన్నింటికన్నా పెద్ద ఖజానా లేక ప్రసాదము - ప్రసన్నత యొక్క ప్రాప్తి. ఇక్కడ ఉంటూ సదా ప్రసన్నముగా ఉంటున్నారు కదా? ఎటువంటి వాతావరణములోనైనా ప్రసన్నముగా ఉండే అభ్యాసులుగా అయిపోయారు. వాతావరణం మిమ్మల్ని తన వైపుకు ఆకర్షించకూడదు. అందుకు బదులుగా మీరు వాతావరణాన్ని పరివర్తన చేసేయండి. ఇదే మహావీరుల యొక్క గుర్తు. మరి మీరు మహాప్రసాదం లభించింది అని భావిస్తున్నారా? మీరు మహా ప్రసాదాన్ని తీసుకునే మహాన్ భాగ్యశాలులు. ఎందరి ఆత్మల యొక్క సేవనైతే చేసారో ఆ ఆత్మలందరి యొక్క శుభభావన మీ ప్రతి ఆశీర్వాదము యొక్క రూపముగా అయిపోయింది. కావున ఎందరి ఆత్మల యొక్క ఆశీర్వాదము లభించి ఉంటుంది? సర్వ శ్రేష్ఠ ఆత్మల యొక్క ఆశీర్వాదము అనేక జన్మల కొరకు సదా సంపన్నముగా చేసేస్తుంది. మరి అందరి ఆశీర్వాదాన్ని తీసుకున్నారా? సదా రహస్యాన్ని తెలిసినవారిగా అనగా రాజీగా ఉండండి. ఎప్పుడూ సేవలో అలగడం లేదు కదా! సదా రాజ్ గా ఉండండి. ఎవరైనా అసంతుష్టులుగా చేసినా ఎప్పుడూ అలగకూడదు, ఎందుకంటే ఇది వెరైటీ వృక్షము అన్న రహస్యము మీకు తెలిసింది. కావున ఈ రహస్యాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడూ అసంతుష్టులుగా అవ్వరు. అసంతుష్టులుగా అవ్వడం అనగా ఈ రహస్యాన్ని తెలుసుకోకపోవడం. కావున అందరూ రహస్యాన్ని తెలుసుకున్నవారే కదా? సేవ యొక్క అవకాశము లభించడం అనగా లాటరీ యొక్క లక్కీ నెంబర్ తెరుచుకోవడం. సేవాధారులు అనగా లక్కీ నెంబర్ తీసుకున్నవారు. లక్కీ నెంబర్ ఉంది కదా! లక్కీ నెంబర్ చాలా కొద్దిమందిదే వెలువడుతుంది మరియు లక్కీ నెంబర్ లో సర్వ శ్రేష్ఠ ప్రాప్తి ఉంటుంది. లక్కీ నెంబర్ అనగా స్వయం లక్కీగా అయిపోయారు. అచ్ఛా!
మాతలు జన్మజన్మల యొక్క ఖాతాను జమా చేసుకున్నారు. ఒక్క జన్మలో అనేక జన్మల యొక్క ప్రారబ్దాన్ని జమా చేసుకోవడం. ఇది చవకైన బేరమే కదా! కాస్త సమయం శ్రమ మరియు జన్మ జన్మల యొక్క ఫలము కావున అందరూ చౌకగా వ్యాపారం చేసి మీ సంపాదనను జమా చేసుకున్నారా? మాతలు సదా సహయోగులుగా ఉన్నారు. ఇందుకు అభినందనలు. ఏ విధంగా ఇక్కడ సేవ యొక్క భాగ్యాన్ని తయారుచేసుకున్నారో అలాగే ఈ భాగ్యమును సదా మీ తోడుగా ఉంచుకోండి. సదా భాగ్యము యొక్క దీపము వెలుగుతూ ఉంచుకునేందుకు సదా ధ్యానమును ఉంచండి. మీ భాగ్యమును మీ తోడుగా ఉంచుకోవడం అనగా భాగ్య విధాతను తోడుగా ఉంచుకోవడం. మీ భాగ్యము యొక్క సితారను మెరుస్తూ ఉండడం చూసి ఇతరుల యొక్క భాగ్యము కూడా తెరుచుకుంటుంది, అచ్ఛా!
కుమారీలు ఏ అద్భుతాన్ని చేసి చూపించాలి? అన్నింటికన్నా అద్భుతమైనది బాబా చెప్పడంతోనే పిల్లలు చేయడం. ఏ విధంగా ఛాత్రకపక్షులు పైనుండి బిందువు పడడంతోనే వాటిని ధారణ చేస్తాయో అలాగే అన్నింటికన్నా అద్భుతమైనది బాబా యొక్క ప్రతి మాటను చేసి చూపించడం, కర్మ ద్వారా తండ్రి యొక్క మాటలను ప్రత్యక్షము చేయడం. ఇది కుమారీల యొక్క కమాల్, కావున స్మృతిచిహ్నములో కూడా కుమారీలు తండ్రిని ప్రత్యక్షము చేసినట్లుగా చూపిస్తారు. విజయాన్ని పొందారు కదా! తాను ఏ కుమారి? అది నేనేనని ప్రతి ఒక్కరూ భావించాలి. ఇందులో ప్రతి ఒక్కరూ స్వయాన్ని ముందు ఉంచుకోండి. ఇందులో మొదట నేను. దీనినే కుమారీల యొక్క అద్భుతము అని అంటారు. ప్రతి ఒక్కరూ తండ్రిని ప్రత్యక్షము చేసే నిమిత్త ఆత్మలుగా అయిపోయినట్లయితే అందరూ అమూల్యరత్నాలుగా అయిపోతారు. అచ్చా!.
Comments
Post a Comment