26-11-1979 అవ్యక్త మురళి

26-11-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రీతి యొక్క రీతి.

             బాప్ దాదా ఈ రోజు పిల్లల యొక్క స్మృతి మరియు ప్రేమకి బదులు ఇవ్వటానికి పిల్లల సమానంగా సాకార రూపంలోకి వస్తున్నారు. ఎందుకంటే స్నేహానికి బదులు (రిటర్న్) సమానంగా అవ్వటం. బాబా పిల్లలకు సదా స్నేహీ మరియు సదా ఆజ్ఞాకారీ. పిల్లలు పిలుస్తారు. బాబా వచ్చేస్తారు, సమానంగా అయిపోతారు. బాబా పరకాయ ప్రవేశం చేసి మరీ పిల్లలపై ఉన్న ప్రీతి యొక్క రీతిని నిలుపుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఏమి చేయాలి? మామూలుగా అయితే పిల్లలందరూ స్నేహిలే. మధువన నివాసీగా అవ్వటమే స్నేహానికి బదులు. దూరదూరాల నుండి పరుగెత్తి రావటం కూడా స్నేహమే. కానీ సంపూర్ణ స్నేహానికి బదులు ఏమిటి? అందరూ స్నేహీలే మరియు బాబాకి కూడా స్నేహం ఉంది. బాబాకి సదా ఒకే సంకల్పం ఉంటుంది - పిల్లలందరూ బాబా సమానంగా అయిపోవాలని. ఎలాగైతే బాబా మీపై స్నేహం కారణంగా, మీ అందరి సమానంగా సాకారవతనవాసిగా, సాకారరూపధారిగా అయిపోతున్నారో అలాగే మీరందరు కూడా బాబా సమానంగా ఆకారీ అవ్యక్త వతనవాసీగా అవ్వండి లేదా నిరాకారీ బాబా యొక్క గుణాలతో సమానంగా సర్వ గుణాలలో మాస్టర్ అయిపోండి. దీనినే సంపూర్ణ స్నేహం యొక్క బదులు అని అంటారు. ఇలా ఫలితం ఇచ్చేవారిగా అయ్యారా లేక అవ్వాలా? అందరూ అయ్యారు కానీ నెంబర్ వారీగా.
              ఈరోజు బాప్ దాదా సర్వ స్నేహీ పిల్లల యొక్క ఆటను చూస్తున్నారు. ఏమి ఆట చూసి ఉంటారు? ఆట చూడటం మీకు కూడా ఇష్టమనిపిస్తుంది. ఏమి చూశారు? అమృతవేళ సమయం యొక్క ఆట. ప్రతీ ఆత్మ పక్షి సమానంగా ఎగిరేవారు లేదా రాకెట్ యొక్క వేగంకంటే కూడా తీవ్ర వేగంతో ఎగిరేవారు, ధ్వని వేగం కంటే కూడా వేగంగా వెళ్ళేవారు, అందరూ తమ తమ సాకార స్థానాలలో విమానాలు విమానాశ్రయానికి వచ్చినట్లు అందరు ఆత్మిక విమానాశ్రయానికి చేరుకున్నారు. లక్ష్యం మరియు ఆజ్ఞ ఒక్కటే. లక్ష్యం ఏమిటంటే ఎగిరిపోయి బాబా సమానంగా అవ్వాలని మరియు ఆజ్ఞ ఏమిటంటే ఒక్క సెకనులో ఎగిరిపోవాలని. కానీ ఏమైంది? విజ్ఞాన సాధనం అయిన విమానం ఎగరబోయే ముందు అన్నీ పరిశీలిస్తారు, తర్వాత సామానులు నింపుతారు, దానికి కావలసిన పెట్రోలు లేదా గాలి, ఆహారం ఏది కావాలో అవన్నీ పెట్టుకున్నారు, ఆ తర్వాత భూమిని వదిలేస్తుంది, ఎగురుతుంది. అలాగే బ్రాహ్మణాత్మ అనే విమానం కూడా తన స్థానానికి వచ్చింది. కానీ ఒక్క సెకనులో ఎగరాలి అనే ఆజ్ఞ ఏదైతే ఉందో దానిలో కొందరు పరిశీలన చేసుకోవటంలో ఉండిపోయారు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు - ఈ పరిశీలనలో ఉండిపోయారు. మరికొందరు జ్ఞానం యొక్క మననం ద్వారా స్వయాన్ని శక్తులతో సంపన్నంగా తయారు చేసుకోవటంలో ఉండిపోయారు. నేను మాస్టర్ జ్ఞాన స్వరూపాన్ని, నేను మాస్టర్ సర్వ శక్తివంతుడిని ... ఇలా శుద్ధ సంకల్పం వరకు ఉన్నారు కానీ స్వరూపంగా అవ్వలేకపోయాం. రెండవ స్థితికి చేరుకోవటంలో కొంతమంది ఉండిపోయారు. మరికొంతమంది నింపుకొవటంలో నిమగ్నమైపోయిన కారణంగా ఎగరకుండా ఆగిపోయారు. ఎందుకంటే శుద్ధ సంకల్పాలు అయితే చేస్తున్నారు కానీ దేహరూపీ భూమిని వదలలేకపోతున్నారు. అశరీరి స్థితిలో స్థితులు కాలేకపోతున్నారు. చాలా కొద్దిమంది మాత్రం బాబా యొక్క ఆఙ్ఞానుసారం సెకనులో ఎగిరి సూక్ష్మవతనం లేదా మూలవతనం చేరుకున్నారు. ఎలాగైతే బాబా ప్రవేశిస్తారు మరలా వెళ్ళిపోతారో; బాబా ఎలాగైతే ప్రవేశించటానికి యోగ్యులో అలాగే మరజీవా జన్మ తీసుకున్న బ్రాహ్మణాత్మలు అనగా మహాన్ ఆత్మలు కూడా ప్రవేశానికి యోగ్యులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మయోగిగా అవ్వండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పరంధామ నివాసీ యోగిగా అవ్వండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సూక్ష్మ వతనవాసీ యోగీగా అవ్వండి. స్వతంత్రులు మీరు. ముల్లోకాలకు యజమానులు. ఈ సమయంలో మీరు త్రిలోకనాథులు. నాధుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన స్థానానికి వెళ్ళవచ్చు కదా?

ఒక్క సెకనులో ఎగిరిపోవటానికి సహజ విధానం:
              కొంతమంది పిల్లల యొక్క ఒక సంకల్పం బాబాకి చేరుతుంది. బాబా అయితే నిర్బంధనుడు. కానీ మాకు దేహ బంధన, కర్మ బంధన ఉంది అని. కానీ బాప్ దాదా ఒక ప్రశ్న అడుగుతున్నారు - ఇప్పటి వరకు కూడా దేహ సహితంగా త్యాగం చేయలేదా? మొట్ట మొదటి ప్రతిజ్ఞ - తనువు, మనసు, ధనాలు అన్నీ నీవే, నావి కావు అని. అన్నీ నీవే, నావి కాదు అన్నప్పుడు మరలా బంధన ఎక్కడిది? ఇవి బాబా మీకు అద్దెకిచ్చారు. మీరు నిమిత్తులు కానీ యజమానులు కాదు. మరజీవగా అయిపోయినప్పుడు, 83 జన్మల లెక్క సమాప్తం అయిపోయింది. ఇది క్రొత్త 84వ జన్మ. ఈ జన్మను మరే జన్మతోను పోల్చలేము. ఈ దివ్య జన్మలో బంధన అనేది లేదు, సంబంధమే ఉంది. ఇది కర్మబంధన యొక్క జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణాత్మలు స్వతంత్రులు, పరతంత్రులు కాదు. నీది అనే దానిని నాది అంటున్నారు, అందువలనే పరతంత్రులు అయిపోతున్నారు. నా పాత లెక్కాచారం, నా పాత సంస్కారం ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినవి? ఇది అద్దెకు తీసుకున్న శరీరం అనుకుంటే, ఇలా స్వతంత్రంగా ఉంటే సెకనులో ఎగిరిపోగలరు. ఈ ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా - ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాం, ఏది చెప్తే అది చేస్తాం అంటున్నారు. అంటే బాబాకి బంధీ అయ్యారా లేక కర్మకి బంధీ అయ్యారా? కర్మ చేయండి అనే ఆజ్ఞ బాబాయే ఇచ్చారు. కనుక మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారు, మీరు నడుస్తున్నారు. మీ జగదాంబ సరస్వతి మాత యొక్క విశేష ధారణ - "యజమాని ఆజ్ఞ" నడిపిస్తుంది. అందువలనే మొదటి నెంబర్ తీసుకున్నారు. అలాగే తల్లి తండ్రిని అనుసరించండి.

మాయ యొక్క రాయల్ రూపం మరియు దానిపై విజయం పొందే విధి :
               కర్మభోగం ఉంది, కర్మ బంధన ఉంది, సంస్కారాల బంధన ఉంది, సంఘటన యొక్క బంధన ఉంది - ఈ వ్యర్థ సంకల్పాల రూపీ జాలాన్ని స్వయమే పరుచుకుంటున్నారు మరియు మీ జాలంలో మీరే చిక్కుకుపోతున్నారు. మిమ్మల్ని విడిపించండి అని మరలా పిలుస్తున్నారు, బాబా చెప్తున్నారు - మీరు విడిపించబడే ఉన్నారు. మీరు వదిలేస్తే అవి వదలిపోతాయి. ఇప్పుడు నిర్బంధనులా లేక బంధీలా? శరీరాన్ని మొదటే వదిలేశారు, మరజీవ అయిపోయారు. విశ్వసేప కోసం మాత్రమే ఈ శరీరం మిగిలి ఉంది. పాత శరీరాలలో బాబా శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాధ్యత బాబాది, మరలా మీరు ఎందుకు తీసేసుకుంటున్నారు? బాధ్యత నిర్వర్తించలేరు మరలా వదిలి పెట్టలేరు. బాధ్యతను వదిలేయటం అంటే "నాది" అనే దానిని వదిలేయటం. నా పురుషార్థం ఆవిష్కరణ, నా సేవ, నా ప్రేరణ, నా గుణాలు చాలా మంచివి, నా సంభాళనా శక్తి చాలా మంచిది, నా నిర్ణయ శక్తి చాలా మంచిది, నా తెలివే యథార్థమైనది మిగతా అందరు అపార్థాలలో ఉన్నారు అంటున్నారు. ఇలా నాది, నాది అనే భావన ఎక్కడ నుండి వచ్చింది? ఇది రాయల్ (సూక్ష్మ) మాయ. దీని నుండి కూడా మాయాజీతులుగా అవ్వండి. అప్పుడు సెకనులో ప్రకృతిజీత్ అయిపోతారు. ప్రకృతిని ఆధారంగా తీసుకుంటారు కానీ ఆధీనమవ్వరు. ప్రకృతిజీతులే విశ్వజీతులు లేదా జగత్ జీతులు . అప్పుడు ఒక్క సెకనులో అశరీరిగా అవ్వండి అనే ఆజ్ఞను సహజంగా మరియు స్వతహాగానే పాటించగలరు. ఏమి ఆట చూసారు? నీది అనే దానిని నాదిగా చేసుకోవటంలో చాలా తెలివైనవారిగా ఉన్నారు. ఎలాగైతే గారడీ మంత్రానికి ప్రభావితం అయ్యి ఏదైనా కార్యం చేస్తే వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు, అదేవిధంగా ఈ రాయల్ మాయ కూడా గారడీ మంత్రం వేసేస్తుంది, దాని వలన ఏమి చేస్తున్నారో మీకే తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏమి చేస్తారు? ఇప్పుడు కర్మబంధన ఉంది అనుకోవటానికి బదులు కర్మయోగిగా భావించండి. అనేక బంధనాల నుండి ముక్తి అయ్యి ఒకే బాబా యొక్క సంబంధంలో ఉంటే సదా తయారుగా ఉండగలరు. సంకల్పం చేయగానే అశరీరిగా అయిపోవాలి, ఈ అభ్యాసం చేయండి. సేవలో ఎంత బిజీగా ఉన్నా కానీ, నలువైపులా కార్యం మిమ్మల్ని లాగుతూ ఉన్నా కానీ, బుద్ధి సేవకార్యంలో అతి బిజీగా ఉన్నా కానీ ... అలాంటి సమయాల్లో కూడా అశరీరిగా అయ్యే అభ్యాసం చేసి చూడండి. యధార్థ సేవలో ఎప్పుడూ బంధన ఉండదు. ఎందుకంటే యోగయుక్త, యుక్తియుక్త సేవాధారులు సదా సేవ చేస్తూ కూడా అతీతంగా ఉంటారు. సేవ చాలా ఉంది కదా, అందువలన అశరీరిగా కాలేకపోతున్నాం అని అనకూడదు. కానీ గుర్తుంచుకోండి - నా సేవ కాదు. బాబా ఇచ్చారు అని అనుకుంటే నిర్బంధనులుగా ఉంటారు. నేను నిమిత్తుడను, బంధన ముక్తుడను అనే అభ్యాసం చేయండి. అతి సమయంలో అంతిమ స్థితిని, కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. అప్పుడే నీది అనేది నాది అనే దానిలోకి తీసుకురానట్లు. తాకట్టుని తమదిగా భావించలేనట్లు. అర్థమైందా! ఇప్పుడు ఏమి అభ్యాసం చేయాలో? ఎలాగైతే మధ్యమధ్యలో సంకల్పాల ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారో అలాగే అతి సమయంలో అంతిమ స్థితి యొక్క అనుభవం చేసుకోండి. అప్పుడే అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ అవ్వగలరు.
               ఈవిధంగా సదా బంధన్ముక్తులకు, బాబా సమానంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రకృతిజీతులుగా అయ్యేవారికి, సంకల్పం మరియు సంస్కారాలలో కూడా నిమిత్తంగా భావించేవారికి, సదా దేహ స్మృతి నుండి కూడా అతీతంగా ఉండేవారికి, విశ్వ ఉపకారీ, విశ్వ కళ్యాణకారీ పిల్లలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments