25-03-1981 అవ్యక్త మురళి

25-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మహానతకు ఆధారం సంకల్పం, మాట, కర్మల చెకింగ్.

ఈ రోజు బాప్ దాదా తన చరిత్ర భూమి, కర్మ భూమి, వరదానీ భూమి, మహోన్నత తీర్థ భూమి, మహోన్నత యజ్ఞ భూమి యొక్క సహయోగులందరితో మిలనం చేయడానికి వచ్చారు. మధుబన్ నివాసులనగా మహా పావన ధరిత్రిపై నివసించువారు. ఈ భూమి పైకి వచ్చే వారి పాత్ర కూడా శ్రేష్ఠమైనదంటే, ఇక్కడే నివసించేవారి పాత్ర ఎంత శ్రేష్ఠమైనదో ఆలోచించండి. శ్రేష్ఠ ఆత్మల నివాస స్థానము కూడా శ్రేష్ఠమైనదిగా మహిమ చేయబడుంది. ఇక్కడకు వచ్చేవారే స్వయాన్ని భాగ్యశాలురుగా అనుభవం చేస్తారు. అనేక అనుభవాలను స్వయంలో అనుభూతి చేస్తారంటే, ఇక్కడే ఉన్నవారి అనుభవం ఇంకెలా ఉంటుంది. జ్ఞానసాగరంలోనే ఉండే ఆత్మలు ఎంత శ్రేష్ఠమైనవారు! మధుబన్ నివాసులందరూ స్వయాన్ని ఇంత శ్రేష్ఠంగా అనుభవం చేస్తున్నారా? స్థానం ఉన్నతంగా ఉన్నట్లే స్థితి కూడా ఉన్నతంగా ఉంటుందా? క్రిందికి రారు కదా? మధుబన్ నివాసులకు ఎన్ని రకాల లిఫ్ట్ బహుమతులుగా లభించాయో తెలుసు కదా? ఎప్పుడైనా వాటిని లెక్కించారా? లేక లెక్కించలేనన్ని ఉన్నాయా? మధుబన్ ను మహిమ చేసే పాటను అందరూ పాడ్తారు. మరి మధుబన్ నివాసులు ఆ పాటను పాడుతున్నారా? దూరంగా ఉండేవారు కూడా మధుబన్ నివాసుల చిత్రాలను తమ హృదయంలో ఎంత శ్రేష్ఠంగా గీస్తారో తెలుసా? అలాంటి మీ చిత్రాన్ని చైతన్యంగా తయారు చేసుకున్నారా? ఎలాగైతే స్థూలమైన పర్వతం ఉన్నతంగా ఉంటుందో అలా ఉన్నత స్థితి అనే పర్వతంపై ఉంటున్నారా? అలాంటి ఉన్నతమైన స్థితిలో పాత ప్రపంచ వాతావరణ ప్రభావమేదియూ పడదు. ఇలాంటి స్థితిలో ఉంటున్నారా లేక క్రిందికి వచ్చేస్తున్నారా? క్రిందికి రావలసిన అవసరముందా? మధువన్ నివాసులకు రెండు రేఖలున్నాయి. ఒకటేమో మధువన్ అనే రేఖ లోపల ఉన్నారు, రెండవది సదా శ్రీమతమనే రేఖ లోపల ఉన్నారు. కావున మీరు రెండు రేఖల లోపల ఉన్నారు. డబల్ రేఖల లోపల ఉన్నవారి స్థితి ఎంత శ్రేష్టంగా ఉంటుంది! ఈ రోజు బాప్ దాదా తమ భూమిలో నివసించు వారిని కలుసుకునేందుకు వచ్చారు. తండ్రి చరిత్ర భూమి కదా. కనుక ఈ భూమి నివాసులపై విశేష స్నేహం ఉంటుంది కదా.

పాపం ఈ రోజు భక్తులు భూమి యొక్క మట్టిని మస్తకములో దిద్దుకునేందుకు తపిస్తున్నారు. కానీ మీరు సదా అక్కడే నివసిస్తున్నారంటే ఎంత అదృష్టవంతులు! అందరూ హృదయ సింహాసనాధికారులే. కానీ మధువన్ నివాసులు ఇంట్లోనూ ఉన్నారు, హృదయంలోనూ ఉన్నారు. డబల్ అయ్యింది కదా. అందరి కంటే తాజా సరుకు మధువన్ నివాసులకు లభిస్తుంది. అందరికంటే మంచి అనుభవాల పిక్నిక్ మధువన్ నివాసులే చేస్తారు. అందరికంటే ఎక్కువ మిలనాలను మధువన్ వాళ్లే చేస్తారు. అందరికంటే ఎక్కువగా నలువైపులా జరిగే సమాచార జ్ఞాతలు కూడా మధువన్ నివాసులే. మధువన్ నివాసులతో మిలనం చేయడానికి అందరూ రావలసి వస్తుంది. కావున ఇంత శ్రేష్ఠ భాగ్యమును ఎవరు వర్ణన చేస్తారు? తండ్రి, పిల్లల భాగ్యాన్ని వర్ణిస్తున్నారు. మధువన్ నివాసులది ఎంత శ్రేష్ఠ భాగ్యము! ఈ ఒక్క విషయాన్ని సదా గుర్తుంచుకున్నా ఎప్పుడూ కిందికి రారు. బాబా ఎంతగా మధువన్ నివాసుల అదృష్టాన్ని వర్ణించారో అంత శ్రేష్ఠ ఆత్మలమని భావిస్తూ నడుస్తున్నారా? మధువన్ మహిమను విని విదేశీయులు కూడా ఎంత సంతోషిస్తున్నారో చూడండి. వీరందరి మనసులో మేము కూడా మధువన్ నివాసులుగా అవ్వాలని ఉమంగం వస్తూ ఉంది. ఈ రోజు విదేశీయుల గ్యాలరీలో కూర్చొని ఉన్నట్లు ఉన్నారు. గ్యాలరీలో కూర్చొని చూడటంలో మజా వస్తుంది. ఒకసారి మధువన్ వాసులు చూస్తే, ఇంకోసారి విదేశీయులు చూస్తారు. మధువన్ నివాసులు కేవలం ఒక్క విషయాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థంగా అవ్వాలి. అది ఏది? ఆ ఒక్క మాటలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి.

ఏ సంకల్పం చేసినా, మాట మాట్లాడినా, కర్మ చేసినా, సంబంధ-సంపర్కంలోకి వచ్చినా కేవలం ఒక్క చెకింగ్ చేసుకోండి - ఇవన్నీ తండ్రి సమానంగా ఉన్నాయా? నా సంకల్పం తండ్రి సంకల్పంగా ఉందా? నా మాటలు తండ్రి మాటల వలె ఉన్నాయా? ఎందుకంటే అందరూ తండ్రి నుండి విన్నదే వినిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తండ్రి విన్పించిందే వింటాము, తండ్రి ఏది ఆలోచించమని చెప్తారో, అదే ఆలోచిస్తాము....... అందరి ప్రతిజ్ఞ ఇదే కదా. ఈ ప్రతిజ్ఞను చేసినట్లైతే కేవలం వీటిని చెక్ చేసుకోండి. ఈ చెకింగ్ చేసుకోవడం కష్టం కాదు కదా. ముందు బాబాతో పోల్చుకోండి. తర్వాత కార్యక్షేత్రంలోకి తీసుకురండి. ప్రతి సంకల్పం తండ్రి సమానంగా ఉందా అని ముందు చెక్ చేయండి. ఇంతకు ముందు కూడా వినిపించాము - ద్వాపర యుగంలోని రాజులు, రాజ్య వంశంలో ఉండేవారు ఏ వస్తువునైనా స్వీకారం చేయాలంటే ముందు చెకింగ్ జరుగుతుంది ఆ తర్వాతనే స్వీకరిస్తారు. మరి ద్వాపరయుగంలోని రాజులు మీ ముందు ఎవరు? మీరైతే ఇంకా మంచి రాజులుగానే అయ్యి ఉంటారు. పతనమైన రాజులకే ఇంత గౌరవముంది. మరి మీ అందరి సంకల్పాలే బుద్ధికి భోజనము. మాటలు కూడా నోటికి భోజనమే. కర్మలు చేతులకు, కాళ్లకు భోజనము. కావున అన్నీ చెక్ చేయాలి కదా. ముందు చేసి ఆ తర్వాత ఆలోచిస్తే దీనిని ఏమంటారు? డబల్ తెలివివంతులు.

కేవలం ఈ ఒక్క విషయాన్ని తమ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. ఎలాగైతే స్థూలంగా కూడా కొంతమంది ఆత్మలకు అలాంటి, ఇలాంటి వస్తువులను తినే అలవాటు ఉండదు. ముందు పరిశీలిస్తారు, తర్వాత స్వీకరిస్తారు. మీరందరూ మహోన్నతమైన పవిత్ర ఆత్మలు, సర్వ శ్రేష్ఠ ఆత్మలు. కనుక అలాంటి ఆత్మలు చెకింగ్ చేయకుండా సంకల్పాలను స్వీకరిస్తే, నోటితో మాట్లడితే, కర్మలు చేసేస్తే ........... అది మాహానతగా అనిపించదు. కావున మధువన్ నివాసులకు కేవలం ఒక మాట ఉంది. చెకింగ్ చేసుకునే యంత్రం అయితే ఉంది కదా. అభ్యాసమే పరిశీలించే యంత్రము.

మధువన్ వారి గొప్పతనాన్ని కూడా చాలా మహిమ చేస్తారు. అలసిపోరు అను సుగంధం చాలాకాలం నుండి వస్తూ ఉంది. అలసిపోరు అనే సుగంధపు సర్టిఫికెట్ అయితే లభించింది. దీనితో పాటు ఇంకా దేనిని జతపరుస్తారు? ఏ విధంగా అలసిపోరో, అలాగే సదా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడు రిజల్టు చూసినా అందరి రిజల్టు ఏకరస స్థితిలో మొదటి నంబరులో ఉండాలి. రెండవ, మూడవ నంబరు కూడా ఉండరాదు. ఎందుకనగా మధువనం వారు కదా. వారు అందరికీ లైట్-మైట్ ఇచ్చేవారు. ఒకవేళ లైట్‌హౌస్-మైట్ హౌసే కదులుతూ ఉంటే ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుంది? మధుబన్ నివాసుల వాయుమండలం చాలా త్వరగా నలువైపులా వ్యాపిస్తుంది. ఇక్కడి చిన్న మాట కూడా బయటికి పెద్ద రూపంలో చేరుతుంది. ఎందుకనగా మీరు పెద్ద వ్యక్తులు కదా. నిరంతరం ఛత్రఛాయలో ఉండేవారు. స్వర్గంలో అయితే ప్రాలబ్దము లభిస్తుంది. కానీ ఇక్కడ కూడా చాలా ప్రాలబ్దము ఉంది. మధుబన్ నివాసులకు అన్నీ తయారైనవే లభిస్తాయి. ఒక్క డ్యూటీని నిర్వహించారంటే మిగిలిన అన్ని స్వతహాగా హాజరవుతాయి. ఎక్కడి నుండి వస్తాయి, ఎంత వస్తుంది అనే సంకల్పం అవసరమే లేదు. కేవలం సేవ చేయండి, ప్రాప్తిని పొందండి. 36 రకాల భోజనం కూడా మధుబన్ వారికి పదే పదే లభిస్తుంది. మరి 36 గుణాలను కూడా ధారణ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క మధుబన్ నివాసి పవిత్రత యొక్క ప్రకాశ కిరీటధారిగా అవ్వాల్సిందే. అయితే డబల్ కిరీటధారులుగా అవ్వాలి. ఒకటి గుణాల కిరీటం, రెండవది పవిత్రతా కిరీటం. ఆ కిరీటంలో తక్కువలో తక్కువ 36 వజ్రాలు ఉండనే ఉండాలి.

ఈ రోజు బాప్ దాదా ముఖ్యంగా మధుబన్ నివాసులకు మరియు అందరికీ కలిపి మకుట మహోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరిని చూసినా కిరీటధారిగానే చూడాలి. ప్రతి ఒక్క గుణరూపీ రత్నము మెరుస్తూ ఇతరులను కూడా మెరిపింపజేయాలి(బాప్ దాదా డ్రిల్లు చేయించారు). అందరూ లవలీన స్థితిలో స్థితులై ఉన్నారు కదా. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, ఈ అనుభూతిలో ఎంత అతీంద్రియ సుఖముంది! సర్వ గుణ సంపన్న శ్రేష్ఠ స్థితి బాగుంటుంది కదా. ఈ స్థితిలో రాత్రి పగలు గడిచిపోయినా మళ్లీ ఆ స్థితిలోనే ఉండాలనే సంకల్పం ఉంటుంది. సదా ఇదే స్మృతిలో సమర్థ ఆత్మలుగా ఉండండి.

బాప్ దాదా ఎల్లప్పుడూ మిలనము చేస్తూ ఉంటారు, కలుస్తూనే ఉంటారు. అనేకమంది పిల్లలున్నా ప్రతీ పుత్రునితో తండ్రి కలుస్తూనే ఉంటారు. ఎందుకనగా శారీరిక బంధనం నుండి ముక్తి అయిన తండ్రి మరియు దాదా (బ్రహ్మ) ఇరువురూ ఒక్క సెకండులోనే అనేకమందికి అనుభూతి కల్గించగలరు. 

దాదీలతో - రాయల్ ఫ్యామిలీ తయారయిందా లేక ఇంకా తయారవుతూ ఉందా? రాజ్య వ్యవహారాలను నడిపేవారు వచ్చారా లేక వస్తారా? ఒకరేమో రాజ్య వ్యవహారాలను నడిపేవారు, ఒకరు రాజ్య వ్యవహారాల్లో వచ్చేవారు. సింహాసనాధికారులనగా రాజ్యాన్ని నడిపించేవారు. సంబంధంలోకి వచ్చేవారనగా రాజ్య వ్యవహారాల్లోకి వచ్చేవారు. ఇప్పుడు రాజ్య వ్యవహారాలను నడిపించేవారు కూడా ఇంకా తయారవుతున్నారు కదా. రాజ్య వ్యవహారాలను నడిపించేవారి విశేషత ఏముంటుంది? సింహాసనంపై అయితే అందరూ కూర్చోరు. సింహాసనాధికారుల సంబంధీకులుగా అయితే అవుతారు. కానీ సింహాసనంపై కూర్చునేవారు పరిమితం కదా. రాయల్ ఫ్యామిలీలో వచ్చేవారు, రాజ్య సింహాసనంపై కూర్చునేవారు అని వారిలో కూడా తేడా ఉంటుంది. నెంబరు వన్, టూ, త్రీ విశ్వ మహారాజు యొక్క రాయల్ ఫ్యామిలీ అని అనబడతారు. కాని తేడా ఏముంటుంది? సింహాసనాధికారులుగా ఎవరవుతారు? అందుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా. దీనిపై ఆలోచించండి.

సంగమయుగంలో బాబా అందరినీ సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. భవిష్యత్తులో రాజులు, మహారాజులుగా ఏమో అవుతారు.
కానీ మొదటి నంబరు సింహాసనాధికారులుగా అయ్యే లక్ష్మి నారాయణుల సింహాసనానికి అధికారులుగా ఎవరు కాగలరు? చిన్న చిన్న సింహాసనాలు మరియు రాజ్య దర్భారేమో కొలువుదీరుతుంది. కానీ విశ్వ మహారాజు సింహాసనానికి విశేష ఆధారం - ప్రతి మాటలో, ప్రతి సబ్జక్టులో తండ్రిని పూర్తిగా ఫాలో చేయుట. ఒకవేళ ఒక్క సబ్జక్టులో అనుసరించుటలో లోపం ఉన్నా మొదటి సింహాసనాధికారిగా కాలేరు. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మి పదవిని పొందుకుంటారు కానీ మొదటి నంబరు కిరీటం, సింహాసనం కొరకు బాప్ దాదా ఇరువురినీ ప్రతి విషయంలో ఫాలో చేయాల్సి ఉంటుంది. అప్పుడు సింహాసనం కూడా ఫాలో అవుతుంది. ప్రతి మాటలో, ప్రతి సంస్కారంలో, ప్రతి సంకల్పంలోనూ ఫాలో ఫాదర్ చెయ్యాలి. దీని ఆధారంగానే నంబరు కూడా తయారవుతుంది. అదే సింహాసనం లభిస్తుంది. కానీ అందులో కూడా నంబరు ఉంటుంది. రెండవ లక్ష్మి నారాయణులకు, ఎనిమిదవ లక్ష్మినారాయణులకు తేడా అయితే ఉంటుంది కదా. ఇది ఫాలో చేయుటలో గల తేడాయే. ఇందులో కూడా గుహ్యమైన రహస్యం ఉంది. బాప్ దాదా కూడా రాజధానిని చూస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ ఏ రాజ్యానికి అధికారిగా అవుతారు, ఏ రేఖల ఆధారంగా తయారవుతారన్నది కూడా ఒక రహస్యమే.

తండ్రిని ఫాలో చేయుటలో కూడా చాలా గుహ్య గతి ఉంది. జన్మించుటలో ఫాలో ఫాదర్ కావడం, బాల్య జీవితంలో ఫాలో ఫాదర్ గా కావడం, యవ్వన జీవితంలో ఫాలో ఫాదర్ గా, సేవా జీవితంలో ఫాలోఫాదర్, అంతిమ జీవితంలో ఫాలో ఫాదర్ గా కావడం, స్థాపనా కార్యంలో పాటు సహయోగములో ఎంత సమయం, ఎంత శాతం అనుసరించారు. తమ తమ విఘ్నాలను వినాశం చేయు కార్యంలో ఎంతవరకు అనుసరించారు. ఈ మార్కులన్నీ కలిపితే మొత్తం అవుతుంది. మొత్తం మార్కులతో ఫైనల్ నంబరు లభిస్తుంది.

మీరందరూ జంప్ చేయగలరా, కోటిలో కొంతమందే ఇలాంటి అద్భుతాన్ని చూపించగలరు. ఇప్పుడా కోటిలో కొంతమంది ఎవరు? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆలస్యంగా వచ్చాము కనుక జంప్ చేయలేమని అనుకోకండి. జంప్ చేయగలరు. ఇంత పెద్ద జంప్ చేయాల్సి వస్తుంది. ఎగరండి. బాప్ దాదా అదనపు సహాయము కూడా ఇస్తారు. 

పర్సనల్ - ఎలాగైతే తండ్రికి పిల్లల శ్రేష్ఠత తెలుసో అలా అందరికీ మీ శ్రేష్ఠత తెలుసా? అంత నషా ఉంటుందా లేక ఒకసారి ఉండి, ఇంకోసారి ఉండటం లేదని అనుకుంటున్నారా? మాటలను చూస్తారా లేక తండ్రిని చూస్తారా? ఎవరిని చూస్తారు? ఎందుకనగా సంఘటన ఎంత పెద్దదిగా ఉంటుందో మాటలు కూడా అంత ఎక్కువగానే ఉంటాయి కదా. మాటలు రావడం సంఘటనలో జరిగేదే. మాటల సమయంలో తండ్రి స్మృతి ఉంటుందా? మా మాటలు సమాప్తమైతే తండ్రి స్మృతి వస్తుందని అనుకోకండి. కానీ మాటలను సమాప్తి చేయుట కొరకే తండ్రి స్మృతి అవసరం. మనం ముందుకు నడిచినప్పుడే మాటలు సమాప్తమౌతాయి. ఈ మాటలు సమాప్తి అవుతే మేము ముందుకు వెళ్తాము అని అనుకోరాదు. మేము ముందుకు వెళ్తే మాటలు వెనుకబడి పోతాయి. మార్గం ఎప్పుడూ ముందుకు కదలదు, దానిపై నడిచేవారు ముందుకు వెళ్తారు. దారి ఎప్పుడైనా ముందుకు కదుల్తుందా ? మార్గంలో ప్రయాణించే వ్యక్తి మార్గం ముందుకు వెళ్తే నేను ముందుకు వెళ్తాను అని ఆలోచిస్తాడా? మార్గం(దారి) ఉన్న చోటనే ఉంటుంది. అందులో ప్రయాణించే వ్యక్తి ముందుకు సాగుతాడు. సైడ్ సీన్లు కూడా ముందుకు కదలవు. వాటిని చూసే వ్యక్తి ముందుకు సాగుతాడు. మరి ఇలాంటి శక్తి ఉందా? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే ఈ పాఠం మనసా, వాచా, కర్మణా నిరంతరం గుర్తుంటుందా? వేరే ఏ వ్యక్తి ఉండకూడదు, ఇది కూడా ఒక సబ్జక్టే. ఇందులో ఏవైనా వైభవాలున్నాయా? ఏవైనా విఘ్నాలున్నాయా? ఏవైనా వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయా? ఒకటి తండ్రి, రెండవది వ్యర్థ సంకల్పాలున్నాయంటే ఇద్దరవుతారు కదా. సంకల్పాలలో కూడా వ్యర్థముండరాదు. మాటల్లో కూడా ఇంకేమీ ఉండరాదు. ఆత్మలతో మాట్లాడుతున్నా (సంపర్కము నిభాయిస్తున్నా) స్మృతిలో మాత్రం బాబాయే ఉండాలి. వ్యక్తి లేక సంస్కారాల విస్తారం ఉండరాదు. అలా ఉందా? ఈ రోజు శరీరంపై, రేపు మనసుపై, ఆ మరుసటి రోజు వస్తువులపై, ఒకసారి వ్యక్తిపై ఇలా సమయం వృథా కావడం లేదు కదా? వ్యక్తి దూరమైతే వైభవాలు, వైభవాలు దూరమైతే వ్యక్తి వస్తూ ఉంటాయి. ఇలా వరుసగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మాయకు బాగా తెలుసు. రావడానికి చిన్న అవకాశం లభించినా అది బహురూపంలో వచ్చేస్తుంది. ఒకే రూపంలో రాదు. ఇక్కడి నుండి, అక్కడి నుండి, మూల నుండి, పై నుండి బహురూపంలో అనేక వైపుల నుండి వచ్చేస్తుంది. కాని పరిశీలించే వ్యక్తి 'ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు ' అనే పాఠం ఆధారంతో మాయతో దూరం నుండే నమస్కారం చేయిస్తాడు. నమస్కారం చేయడు, చేయిస్తాడు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అన్న వాతావరణం నలువైపులా ఉండాలి. ఎందుకనగా మొత్తం జ్ఞానమంతా లభించింది. ఎన్ని పాయింట్లున్నాయి. పాయింట్లలో ఉంటూ పాయింట్ (బిందు) రూపంలో ఉండాలి. ఇది ఎవరో క్రిందికి లాగుతూ ఉన్నపుడు, ఆ సమయంలో చూపాల్సిన అద్భుతము. ఒక్కోసారి మాటలు క్రిందికి లాగుతాయి, ఒకసారి ఎవరో ఒక వ్యక్తి, ఇంకోసారి వాతావరణం, మరోసారి ఏదైనా వస్తువు ఇలా క్రిందికి లాగుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండనే ఉండదు. కానీ మీరు ఇందులో ఏకరసంగా ఉండండి. దీని కొరకు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి. కొత్త ఆవిష్కరణను కనుక్కోండి. అందరూ 'వాహ్ వాహ్' అనే విధంగా ఏదైనా కొత్త విధానాన్ని కనుక్కోండి. అది విని అందరూ మంచి యుక్తిని వినిపించారని మెచ్చుకోవాలి.

Comments