21-11-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
విశ్వపరివర్తన కొరకు అందరికీ ఒకే వృత్తి ఉండటం అవసరం.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క చైతన్య చిత్రం ద్వారా లేదా ప్రతి ఒక్కరి ముఖం ద్వారా విశేషంగా రెండు విషయాలు పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు సెన్స్ మరియు ఎసెన్స్ లో ఎంత వరకు సంపన్నం అయ్యారు, అనగా జ్ఞాన సంపన్నంగా మరియు సర్వశక్తి సంపన్నంగా ఎంత వరకు అయ్యారని చూస్తున్నారు. దీనినే రూపం మరియు గుణం అని అంటారు. అనగా జ్ఞానం మరియు శక్తి రెండూ సంపన్నంగా ఉండాలి. ఈ రోజు బాప్ దాదా ఆత్మిక వ్యాయామం చేయిస్తున్నారు. సంఘటిత రూపంలో ఒక్క సెకండులో ఒకే వృత్తి ద్వారా, తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నెంబరువారీగా తమ తమ పురుషార్థాన్ని అనుసరించి మరియు మహారథీలు కూడా తమ తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు. కానీ విశ్వపరివర్తనలో సంపూర్ణ కార్యం యొక్క సమాప్తిలో సంఘటితంగా ఒకే వృత్తి మరియు తరంగాలు కావాలి. కొద్దిమంది మహాన్ ఆత్మల యొక్క లేదా తీవ్ర పురుషార్థీ, మహారథీ పిల్లల యొక్క వృత్తి లేదా తరంగాల ద్వారా అక్కడక్కడ సఫలత లభిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అంతిమంలో బ్రాహ్మణాత్మలందరి యొక్క ఒకే వృత్తి అనే వ్రేలు కావాలి. ఒకే సంకల్పం అనే వ్రేలు కావాలి. అప్పుడే బేహద్ విశ్వ పరివర్తన జరుగుతుంది. వర్తమాన సమయంలో విశేషంగా ఈ విషయం యొక్క అభ్యాసం కావాలి. సుగంధ భరిత వస్తువు సెకండులో తన సువాసనను ఏవిధంగా వెదజల్లగలదో అంటే గులాబీ సెంటు వేయటం ద్వారా సెకండులో వాయుమండలం అంతటిలో గులాబీ సువాసన వ్యాపిస్తుంది. చాలా మంచి గులాబీ సువాసన వస్తుంది అని అందరూ అనుభవం చేసుకుంటారు. ఈ సువాసన ఎక్కడి నుండి వస్తుందో అని అందరి ధ్యాస అనుకోకుండానే అటు వెళ్తుంది. అదేవిధంగా భిన్న భిన్న శక్తుల యొక్క సువాసన అనగా శాంతి, ఆనందం, ప్రేమ యొక్క సువాసనను సంఘటిత రూపంలో సెకండులో వెదజల్లండి. ఆ సువాసన యొక్క ఆకర్షణ నలువైపుల ఉన్న ఆత్మలకు రావాలి. ఈ శాంతి యొక్క సువాసన లేదా తరంగాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అనుకోవాలి. అశాంతిగా ఉన్నవారికి శాంతి లభిస్తే లేదా దప్పికగొన్న వారికి నీరు దొరికితే వారి కళ్ళు తెరుచుకుంటాయి, నిస్పృహ నుండి స్పృహలోకి వస్తారు. అదేవిధంగా ఈ శాంతి లేదా ఆనందం యొక్క సువాసన యొక్క తరంగాల ద్వారా గ్రుడ్డివారి సంతానం గ్రుడ్డివారు అయిన వారి యొక్క మూడవ నేత్రం తెరుచుకోవాలి. అజ్ఞానం అనే నిస్పృహ నుండి వారు ఎవరు? ఎవరి పిల్లలు? ఎటువంటి పరమ పూజ్య ఆత్మలో అనే స్పృహలోకి రావాలి. ఇటువంటి ఆత్మిక వ్యాయామం చేయగలరా?
ద్వాపరయుగి రజోగుణి ఋషులు, మునులు కూడా తమ తత్వ యోగశక్తి ద్వారా తమ చుట్టుప్రక్కల శాంతి తరంగాలను వెదజల్లగలుగుతున్నారు, వీరు కూడా మీ రచన. మీరు మాస్టర్ రచయితలు. వారు హద్దులోని అడవిని శాంతపరిచేవారు, కానీ రాజయోగులైన మీరు బేహద్ అడవిలో శాంతి, శక్తి, ఆనందం యొక్క తరంగాలను వెదజల్లలేరా? ఇప్పుడు ఈ అభ్యాసం గురించి దృఢ సంకల్పం, నిరంతరం చేయాలనే సంకల్పం చేయండి. ప్రతి నెల అంతర్జాతీయ యోగాభ్యాసాన్ని అయితే ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఈ అభ్యాసాన్ని ఎక్కువ పెంచండి. జ్ఞానస్వరూపం ద్వారా విహంగ మార్గం యొక్క సేవ చేస్తున్నారు. మేళాలు, కాన్ఫెరెన్సులు లేదా యోగశిబిరాలు పెడుతున్నారు. ఒకే సమయంలో సంఘటిత రూపంలో అనేకులకు సందేశం ఇస్తున్నారు. వార్తాపత్రికల ద్వారా, టి.వి లేదా రేడియోల ద్వారా ఒకే సమయంలో అనేకులకు సందేశం ఇస్తున్నారు. అదేవిధంగా యోగబలం ద్వారా, శ్రేష్ఠ సంకల్ప బలం ద్వారా ఇటువంటి విహంగ మార్గ సేవ చేయండి. దీని గురించి కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయండి. జ్ఞానం మరియు యోగం రెండింటి ద్వారా సేవ సమానంగా జరిగినప్పుడే అంతిమ సమాప్తి అవుతుంది. దీని కొరకు సంఘటిత రూపంగా అందరూ చేయవలసిన పురుషార్థం ఏమిటి? తెలుసా? ఆ పురుషార్థం గురించే భక్తిమార్గంలో వర్ణన మరియు చిత్రం కూడా చూపిస్తారు. అది ఏమిటి? పురుషార్థానికి సంబంధించిన చిత్రం లేదా మహిమ ఏది? సమాప్తి గురించి ఏ చిత్రాన్ని చూపించారు? స్థాపన యొక్క వర్ణనకు సంబంధించిన చిత్రం కూడా అదే మరియు సమాప్తి యొక్క చిత్రం కూడా అదే. బ్రహ్మ బ్రాహ్మణులతో పాటు కలిసి ఏమి చేశారు? యజ్ఞాన్ని రచించారు అంటే స్థాపన యొక్క చిత్రం కూడా ఇదే మరియు సమాప్తి కూడా యజ్ఞంలోనే. బ్రాహ్మణాత్మలందరు ఈ సంఘటిత రూపంలో స్వాహా అనే దృఢ సంకల్పం యొక్క ఆహుతి చేయటమే యజ్ఞం సమాప్తి అవ్వటం అంటే విశ్వ పరివర్తనా కార్యం సమాప్తి అవ్వటం. అయితే పురుషార్థం ఏమిటి? ఒకే మాట యొక్క పురుషార్థం, అది ఏమిటి? “స్వాహా". స్వాహా అయిపోయినప్పుడు హాహాకారాలకు బదులు ఆహా అని అంటారు. పరివర్తన అయిపోయింది కదా! ఈ మాట అంటుంటేనే మజా వస్తుంది. అయితే సర్వ విషయాలలో స్వాహా చేశానా? అని ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి. స్వాహా చేయటం వస్తుందా? ఎప్పుడైతే సంఘటిత రూపంలో పాత స్వభావ సంస్కారాలనే నువ్వులు లేదా ధాన్యాన్ని స్వాహా చేస్తారో అప్పుడే యజ్ఞం సమాప్తి అవుతుంది. నువ్వులు మరియు ధాన్యాన్ని యజ్ఞంలో వేస్తారు కదా! యజ్ఞం సమాప్తి అవుతున్నప్పుడు అన్నింటినీ కలిపి స్వాహా చేసేస్తారు. అప్పుడే యజ్ఞం సఫలమవుతుంది. ఒక్క ఆహుతి అయినా తక్కువ అయితే మంచిది కాదు అని అనుకుంటారు. అంటే పురుషార్థం ఏమిటి? సంఘటిత రూపంలో స్వాహా చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్వాహా చేయండి, సమాప్తి చేయండి అని ఎవరైనా చెప్పినా కానీ ఏమి చేస్తారు? స్వాహా చేయడానికి బదులు వాదన చేస్తారు. చర్చ జరుగుతుంది. ఆ వాదన చాలా బావుంటుంది. ఎందుకు? ఏవిధంగా? అనే విషయాల యొక్క వాదన జరుగుతుంది. ఇటువంటి వాదన లేదా మాటలు చాలా మాట్లాడుతున్నారు. వతనంలో బాప్ దాదా దగ్గర ఉన్న రేడియోలో అలాంటి విషయాలు చాలా వస్తాయి. ఒకసారి ఒక స్టేషన్ నుండి, ఇంకోసారి ఇంకో స్టేషన్ నుండి వస్తాయి. ఆ సమయంలో చిత్రం లేదా వారి నటన ఏవిధంగా ఉంటుంది? మీ ప్రపంచంలో టి.విలో మిక్కీమౌస్ ఆట వస్తుంది కదా! అదేవిధంగా ఇక్కడ కూడా ఒకొక్కసారి నయనాలు పెద్దవి అయిపోతాయి, ఒకొక్కసారి నోరు పెద్దది అయిపోతుంది, ఒకొక్కసారి చాలా వేగంగా దిగిపోయే కళ యొక్క మెట్లను టకటకా దిగిపోతారు, ఒకొక్కసారి మాయా తుఫానులో ఎగిరిపోతారు, సమానత ఉంచుకోలేరు. ఇప్పుడిప్పుడే నవ్వుతారు, ఇప్పుడిప్పుడే ఏడుస్తారు. ఇలా బాప్ దాదా కూడా అనేక ఆటలు చూస్తూ ఉంటారు. ఇది వింటుంటే ఎలాగైతే నవ్వు వస్తుందో అదేవిధంగా చేసే సమయంలో కూడా స్వయం గురించి స్వయం నవ్వు వస్తే ఈ ఆట సమాప్తం అయిపోతుంది. చెప్పాను కదా - స్వాహా చేయటం లేదు.
ఒకవేళ ఎవరిలోనైనా ఏ పాత సంస్కారం అయినా మిగిలిపోతే దానిని స్వయం స్వాహా చేయలేకపోతే సంఘటిత రూపంలో సహయోగిగా అవ్వండి. ఏవిధంగా చేసేవారు చేస్తున్నా లేదా మాట్లాడేవారు మాట్లాడుతున్నా కానీ వినేవారు లేదా చూసేవారు వినకుండా, చూడకుండా ఉంటే వారు చెప్పటం కూడా ఆపేస్తారు, చేయటం మానేస్తారు కదా! ఎవరైనా పాటలు పాడుతున్నారు లేదా నాట్యం చేస్తున్నారు. కానీ వినేవారు లేదా చూసేవారు ఎవరూ లేకపోతే వారు పాడటం లేదా చేయటం ఆపేస్తారు కదా! కనుక ఈ విధంగా సహయోగం ఇవ్వండి. దీనినే స్వాహా అని అంటారు. ఎప్పుడైతే ఇటువంటి సహయోగిగా అవుతారో అప్పుడే సంఘటిత రూపంలో విశ్వపరివర్తన చేయగలరు. జ్ఞానంతో (సెన్స్) పాటు, శక్తి (ఎసెన్స్) కూడా కావాలి. కానీ సంప్రదింపులోకి వస్తున్నప్పుడు, కార్యవ్యవహారంలోకి వస్తున్నప్పుడు, కర్మబంధన యొక్క ప్రవృత్తిలో లేదా శుద్ధ ప్రవృత్తిలోకి వస్తున్నప్పుడు జ్ఞానం యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తి యొక్క శాతం తక్కువగా ఉంటుంది. సెన్స్ అంటే జ్ఞానం యొక్క పాయింట్స్ అంటే తెలివి. ఎసెన్స్ అంటే సర్వశక్తిస్వరూపం అంటే స్మృతి మరియు సమర్థ స్వరూపం. కేవలం తెలివి ఒక్కటే ఉంటున్న కారణంగా జ్ఞానాన్ని వివాదంలోకి తీసుకువచ్చేస్తున్నారు. ఇదే జరుగుతుంది, ఇది ఇలా జరగవలసిందే అని అంటున్నారు. ఎసెన్స్ అంటే శక్తుల ఆధారంగా జ్ఞానం యొక్క విస్తారాన్ని ప్రత్యక్ష జీవితంలోకి సారరూపంగా తీసుకువస్తారు. అందువలన విస్తారం లేదా వివాదం సమాప్తం అయిపోతాయి. కొద్ది సమయంలోనే స్వాహా అయిపోయి ఓహో నేను! ఓహో నా బాబా! అని లీనం అయిపోతారు. కనుక జ్ఞానం మరియు శక్తి రెండింటి యొక్క సమానత ఉంచుకోండి. అప్పుడు ప్రతి సెకండు స్వాహా అయిపోతూ ఉంటారు. సంకల్పం కూడా సేవ కోసం స్వాహా! మాట కూడా విశ్వ కళ్యాణం కోసం స్వాహా! ప్రతి కర్మ కూడా విశ్వపరివర్తన కోసం స్వాహా! అప్పుడు నాది అనే భావన అనగా పాత భావన స్వాహా అయిపోతుంది. బాబా మరియు సేవ ఇవే మిగులుతాయి. కనుక ఏమి పురుషార్థం చేయాలో అర్థమైందా? మీ దేహ స్మృతి సహితంగా స్వాహా అయిపోవాలి. అప్పుడు ఒక్క సెకండులో తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. అర్థమైందా?
ఈవిధంగా సదా సమర్థులు, సదా సర్వులను పరివర్తన చేయటంలో సహయోగి, జ్ఞానం మరియు శక్తి యొక్క సమానత ఉంచుకునేవారికి, విశ్వపరివర్తన అనే ఒకే సంలగ్నతలో ఉండేవారికి, బాబా మరియు సేవ తప్ప మరే విషయం లేదు అనే స్థితిలో నడిచేవారికి, బాబా సమాన మహానాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment