21-05-1977 అవ్యక్త మురళి

21-05-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సంగమయుగీ బ్రాహ్మణ జీవితములోని విశేష గుణము మరియు కర్తవ్యము" 

మీ వర్తమాన సంగమయుగీ బ్రాహ్మణ జీవితములోని విశేషత ఏమిటో తెలుసా? మీ విశేష గుణము, కర్తవ్యము ఏమిటో తెలుసా? ఆ గుణము, ఆ కర్తవ్యము మరి ఏ ఇతర యుగములోనూ ఉండదు. ఆ విశేష గుణము ఏది? నాలెడ్జ్ ఫుల్, మాస్టర్ జ్ఞాన సాగరులు. కర్తవ్యము - విశ్వ సేవాధారి అనగా ఈశ్వరీయ సేవాధారులు. ఈ రెండు విశేషతలను నిరంతరం స్మృతిలో ఉంచుకుంటున్నారా? మేము విశ్వ సేవాధారులమని కూడా చెప్తారు కదా! విశ్వ సేవాధారికి నిర్వచనం ఏది? విశ్వ సేవాధారి అని ఎవరిని అంటారు? వారి లక్షణాలేవి? వారి లక్ష్యమేది? వారికి లభించు ప్రాప్తి ఏమిటి? విశ్వ సేవాధారుల లక్షణం - వారు సదా తమ సేవ ద్వారా విశ్వాన్ని సంపన్నంగా, సుఖవంతంగా చేస్తారు. దేనితో? ఈశ్వరీయ సుఖముతో, శాంతి మరియు జ్ఞాన ధనముతో, సర్వ శక్తులతో సర్వ ఆత్మలను భికారుల నుండి అధికారులుగా చేస్తారు. ఎందుకనగా విశ్వ సేవాధారులు అందరినీ సదా కళ్యాణ దృష్టి మరియు దయా దృష్టితో చూస్తారు. అందువలన వారికి సదా విశ్వమును పరివర్తన చేసే తీరాలి అనే లక్ష్యముంటుంది. వారికి రాత్రి పగలు ఇదే పట్టుదల(లగ్నము) ఉంటుంది.


సేవాధారులలో ఏ లక్షణాలు కనిపిస్తాయి? వారు ప్రతి సెకండును, ప్రతి సంకల్పమును, మాటను, కర్మను, సంబంధమును, సంపర్కమును అన్నిటిని సేవలోనే ఉపయోగిస్తారు. వారు సేవ కొరకు నాలుగు గంటలు, ఆరు గంటలు అని సమయాన్ని కేటాయించరు. ప్రతి అడుగులో అలసిపోకుండా సేవ చేస్తూనే ఉంటారు. వారు చూస్తున్నా, నడుస్తున్నా, తింటున్నా, త్రాగుతున్నా అన్నింటిలోనూ సేవ ఇమిడి ఉంటుంది. ముఖ్యమైన సేవా సాధనాలు - స్మృతి, వృత్తి, దృష్టి కృతి. ఈ అన్ని రకాలుగా సేవ చేయుటలో తత్పరులై ఉంటారు. 1) స్మృతి ద్వారా సర్వ ఆత్మలను సమర్థ స్వరూపులుగా చేస్తారు. 2) వృత్తి ద్వారా వాయుమండలమును పావనంగా, శక్తిశాలిగా చేస్తారు. 3) దృష్టి ద్వారా ఆత్మలకు స్వయంను మరియు తండ్రిని సాక్షాత్కారం(ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం) చేయిస్తారు. 4) కృతి ద్వారా శ్రేష్ఠ కర్మలాచరించుటకు తమను తాము నిమిత్తము చేసుకొను ధైర్యము చేయు ప్రేరణనిప్పిస్తారు.

ఇటువంటి సేవాధారులు రాత్రి పగలు తమ విశ్రాంతిని కూడా త్యాగము చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవము చేస్తారు. అలాంటి సేవాధారులుగా ఉన్నారా? అలాంటి సేవాధారుల సంబంధములోకి గాని, సంపర్కములోకి గాని వచ్చిన ఆత్మలు తమను తాము శాంతిని, శీతలతను, శక్తిని ఇచ్చు ఒక నీటి ప్రవాహము క్రింద(జలపాతము క్రింద) కూర్చున్నట్లు అనుభవము చేస్తారు లేక ఏదైనా ఒక ఆధారము, తీరము దొరికినట్లు అనుభవము చేస్తారు. ఇటువంటి సేవాధారుల సంకల్పాలు లేక శుభ భావనలు, శుభ కామనలు సూర్య కిరణాల వలె నలువైపులా వ్యాపిస్తాయి. ఎలాగైతే సేవాధారుల జడ చిత్రాలు అల్పకాలము కొరకు అల్పకాల కోరికలను పూర్తి చేస్తాయో అలా చైతన్య చరిత్రవంతులైన సేవాధారులు సదా కాలానికి సర్వ కోరికలు పూర్తి చేస్తారు. వీరికి గుర్తుగానే కామధేనువును మహిమ చేస్తారు. ఏదైనా ఒక ఖజానా నిండుగా ఉంటే దాని ద్వారా ఎంత కావాలంటే అంత సంపన్నముగా కావచ్చు. అందులో ప్రసిద్ధమైపోతుంది. అయితే హద్దు ఖజానా(గని) ద్వారా ఒక వస్తువే లభిస్తుంది. కాని ఇది విచిత్రమైన గని. ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది. ఇటువంటి సేవాధారులు కలవర పడుతున్న భ్రమిస్తున్న ఆత్మలకు సులభంగా గమ్యాన్ని అనుభవము చేయిస్తారు. 

ఇటువంటి సేవాధారులకు సదా హర్షితంగా ఉండు, సదా సంతుష్టంగా ఉండు వరదానాలు స్వతహాగా ప్రాప్తి అవుతాయి. ఎందుకంటే ప్రతి ఆత్మ పాత్ర భిన్నమైనదని వారికి తెలుసు. పాత్రధారులైన ఆత్మలు ఎలాంటి పాత్ర చేస్తున్నా అసంతుష్టము కారు. ఇటువంటి సేవాధారులు సదా మనస్ఫుర్తిగా, హర్షితంగా, సంతుష్టంగా ఉండుటకు ఏ పాట పాడ్తారు? “వాహ్ బాబా! ఓమో నా పాత్ర ! ఓహో మధురమైన డ్రామా! ఎప్పుడైతే స్వయం సదా మనసులో ఈ పాట పాడుతూ ఉంటారో అప్పుడే సర్వ ఆత్మలు ఇప్పుడే కాక కల్పమంతా వారిని వాహ్! వాహ్! అని పొగుడుతూ ఉంటారు.

ఇటువంటి సేవాధారులు సదా విజయ మాలను ధరించినవారిగా ఉంటారు. సఫలత స్వతహాగా మా అధికారము అను నిశ్చయంలో నషాలో ఉంటారు. సదా సంపన్నముగా, తండ్రికి సమీపంగా అనుభవము చేస్తూ ఉంటారు. ఇది సేవాధారులకు కలిగే ప్రాప్తి ఇటువంటి లక్ష్యమును, లక్షణాలను, ప్రాప్తిని అనుభవము చేస్తున్నారా? బ్రాహ్మణ జీవిత కర్తవ్యమే ఇది అయినపుడు మీ కర్తవ్యాన్ని యదార్థ రీతిగా నిభాయిస్తున్నారా? ఒకటి - తండ్రితో ప్రీతి నిభాయించుట, రెండవది - కర్తవ్యాన్ని నిభాయించుట. రెండూ నిభాయించేవారా లేక కేవలం చెప్పేవారేనా? కేవలం చెప్పేవారు కారు కదా? చెప్పేవారిగా కాక చేసేవారిగా కండి. సేవాధారుల 4 మహత్యమేమిటో తెలిసిందా? మంచిది.

ఇలా రాత్రి, పగలు సంపన్నమై సర్వులను సంపన్నము చేయువారు, సర్వ స్వరూపాలతో ఆల్ రౌండ్ సేవ చేయువారు, సదా సర్వుల పట్ల కళ్యాణభావన, దయాభావన ఉంచువారు - ఇటువంటి విశేషసేవాధారులకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments