21-01-1980 అవ్యక్త మురళి

21-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

తండ్రిని ప్రత్యక్షం చేసే విధి.

ఈ రోజు బాప్ దాదా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపాలు అనగా ప్రాక్టికల్ గా డబల్ రూపము గల పిల్లలను చూస్తున్నారు. మొదటి రూపం - మాయాజీత్ (మాయా ప్రూఫ్), రెండవది - శ్రేష్ఠ జీవితానికి, బ్రాహ్మణ జీవితానికి, ఉన్నతోన్నతమైన తమ అలౌకిక జీవితము ద్వారా ఈశ్వరీయ జీవితానికి ఋజువు(ప్రూఫ్) ఇచ్చే రూపం. శ్రేష్ఠ జ్ఞానానికి ఋజువు శ్రేష్ఠ జీవితం. ఇలాంటి డబల్ ప్రూఫ్ జీవితం గడిపే పిల్లలను చూస్తూ ఉన్నారు. సదా స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా లేక ప్రూఫ్(ఋజువుగా) భావించినట్లయితే సదా మాయాఫ్రూఫ్  (మాయను జయించేవారిగా) ఉంటారు. ఒకవేళ ప్రత్యక్ష ప్రమాణంలో ఏదైనా బలహీనత ఉంటే మీరు ఛాలెంజి చేసి చెప్పే పరమాత్మ జ్ఞానాన్ని ఇతరులు అంగీకరించలేరు. ఎందుకంటే ఈనాటి సైన్సు యుగంలో ప్రతి విషయాన్ని ప్రత్యక్ష ప్రమాణం లేక ఋజువు ద్వారానే అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. వినడం, వినిపించడం ద్వారా నిశ్చయం చేసుకోరు. పరమాత్మ జ్ఞానాన్ని నిశ్చయం చేసుకొనుటకు ప్రత్యక్ష ఋజువు చూడాలనుకుంటారు. మీ అందరి జీవితమే ప్రత్యక్ష ఋజువు. జీవితంలో కూడా ఎటువంటి విశేషత కనిపించాలంటే ఈ రోజు వరకు ఆ విశేషతను ఏ ఆత్మ జ్ఞానీ, మహాన్ ఆత్మలు కూడా చేయనిది, తయారు చేయలేనిదిగా ఉండాలి. ఇలాంటి అసంభవాన్ని సంభవం చేసే విషయాలు పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణాలు. అసంభవము నుండి సంభవము చేసిన అన్నిటికంటే గొప్ప విషయమేమంటే ప్రవృత్తిలో ఉంటూ కూడా పరవృత్తిలో(అతీతంగా) ఉండటం. ప్రవృత్తిలో ఉంటూ ఈ దేహం మరియు దేహ ప్రపంచ సంబంధాలతో అతీతంగా ఉండటం. పాత వృత్తితో పరంగా అనగా అతీతంగా ఉండాలి అనగా దూరంగా, న్యారాగా ఉండాలి. దీనినే పర-వృత్తి అని అంటారు. ప్రవృత్తి కాదు పర - వృత్తి. చూచేది దేహాన్నే అయినా వృత్తిలో ఆత్మ రూపం ఉండాలి. సంపర్కంలో లౌకిక సంబంధంలోకి వస్తున్నా సోదర-సోదర(భాయీ భాయీ) సంబంధంలో ఉండాలి. ఈ పాత శరీరంలోని నేత్రాలతో పాత ప్రపచంలోని వస్తువులను చూస్తున్నా చూడరాదు. ఇలాంటి ప్రవృత్తిలో ఉండేవారు అనగా సంపూర్ణ పవిత్ర జీవితాన్ని గడిపే వారినే పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ఋజువు అని అంటారు. మహాత్మలు కూడా అసంభవం అనుకునే దానిని పరమాత్మ జ్ఞానులు అతి సహజమైన విషయంగా అనుభవం చేస్తారు. వారు అసంభవమని అంటారు, మీరు సహజమని అంటారు. కేవలం చెప్పడం కాదు, ప్రపంచము ముందు తయారై చూపిస్తున్నారు. ఇప్పటి వరకు భక్తి మాలలోని మొదటి రెండు పూసలు కూడా పరమాత్మను మిలనం చేయుట చాలా కష్టమని, అనేక జన్మల తర్వాత కూడా లభిస్తుందో లేదో నిశ్చయంగా చెప్పలేమని భావిస్తారు. ఒక్క సెకండు కాలము సాక్షాత్కారమైనా దానిని మహా ప్రాప్తిగా భావిస్తారు. సాక్షాత్తు తండ్రి మనవారిగా అవ్వడం, మన వారిగా చేసుకోవడం వారు అసంభవంగా భావిస్తారు. అది సుదీర్ఘ ప్రయాణం (చాలా ఎత్తైన ఖర్జూరం చెట్టు ఎక్కడం) అని మనసును బలహీన పర్చుకుంటారు. కానీ మీరందరూ సుదీర్ఘ ప్రయాణం అనుకోకుండా ఇంట్లో కూర్చునే కల్ప-కల్పము తమ అధికారంగా అనుభవం చేస్తున్నారు. వారు కలుసుకోవడం కష్టమని భావిస్తారు కానీ మీరు కలుసుకోవడం అధికారంగా భావిస్తారు. అధికారీ జీవితమనగా తండ్రి సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న జీవితం. ఈ ప్రత్యక్ష అనుభవీ జీవితం కూడా విశేషించి పరమాత్మ జ్ఞానానికి ప్రమాణం అనగా ఋజువు. పరమాత్మ అంటే తండ్రి, తండ్రి సంబంధానికి ఫ్రూఫ్ - వారసత్వం. పరమాత్మతో జ్ఞానులు లేక మహాత్ముల సంబంధము సోదర - సోదర సంబంధం. తండ్రి సంబంధం కాదు(వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు). అందువలన వారికి వారసత్వం ఉండదు. ఆత్మ జ్ఞానీలు, మహాత్ములందరూ సోదరులే, వారికి పరమాత్మ తండ్రి కాదు. కనుక వారు అవినాశి వారసత్వం కావాలనుకున్నా దాని అనుభవం పొందలేరు. పరమాత్మ జ్ఞానానికి సహజ ఋజువు జీవితంలో వారసత్వ ప్రాప్తి. ఈ అవినాశి జ్ఞానము, ప్రాప్తుల అనుభవీ జీవితం, పరమాత్మను ప్రత్యక్షం చేయగలదు. కనుక ఇది విశేషమైన ఋజువు(ప్రూఫ్) అవుతుంది.

తండ్రిని ప్రత్యక్షం చేయాలని కొత్త సంవత్సరంలో దృఢ సంకల్పం చేశారా? అందరూ సంకల్పం చేశారు కదా. అందువలన తండ్రిని ప్రత్యక్షం చేయడానికి సాధనం డబల్ ఫ్రూగా అవ్వడం. కావున చెక్ చేసుకోండి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం - పవిత్రత మరియు ప్రాప్తి. ఈ రెండూ అవినాశిగా ఉన్నాయా? అల్ప జ్ఞానము గల ఆత్మలు అల్పకాలిక ప్రాప్తిని చేయిస్తాయి. అవినాశి తండ్రి అవినాశి ప్రాప్తి చేయిస్తారు. పరమాత్మ మిలనము లేక పరమాత్మ జ్ఞానం యొక్క విశేషతే “అవినాశి ". కనుక అవినాశిగా ఉన్నాయి కదా. మేము పురుషార్థులమని అంటారు. కాని పురుషార్థం ద్వారా ప్రత్యక్ష ప్రాలబ్ధము పొందుటే పరమాత్మ ప్రాప్తి యొక్క విశేషత. అంతేగాని సంగమ యుగమంటే పురుషార్థ జీవితమని, సత్యయుగం ప్రాలబ్ద జీవితమని అనుకోరాదు. సంగమయుగ విశేషత - ఒక్క అడుగు వేసి వేయి అడుగుల ప్రాలబ్ధాన్ని పొందడం. వేరే ఏ యుగంలోనూ ఒకటికి కోటానురెట్లుగా పెరిగి లభించే భాగ్యం లేనే లేదు. ఈ భాగ్యరేఖను స్వయం భాగ్యవిధాత తండ్రియే ఇప్పుడు బ్రహ్మాబాబా ద్వారా పొడిగిస్తారు. అందువలన బ్రహ్మను భాగ్యవిధాత అని కూడా అంటారు. అందుకే బ్రహ్మ భాగ్యాన్ని పంచుతూ ఉంటే నిద్రపోయారా అని గాయనం కూడా ఉంది. సంగమయుగ విశేషత - పురుషార్థము మరియు ప్రాలబ్ధము రెండూ జత జతలో ఉంటాయి. అంతేకాక సత్యయుగ ప్రాలబ్ధము కంటే విశేషంగా తండ్రిని ప్రాప్తి చేసుకొను ప్రాలబ్ధము ఇప్పుడు మాత్రమే ఉంటుంది. పరమాత్మతో డైరక్టుగా సర్వ సంబధాలు ఇప్పటి ప్రాలబ్ధము. భవిష్య ప్రాలబ్ధము - దేవాత్మలతో సంబంధము. ఇప్పటి ప్రాప్తికి, భవిష్య ప్రాప్తికి గల తేడాను అర్థము చేసుకుంటున్నారు కదా, ఇంతకు ముందు వినిపించాను కూడా. కావున పురుషార్థులు కాదు, శ్రేష్ఠ ప్రాలబ్ధము పొందేవారమని భావించి ప్రతి అడుగు వేస్తున్నారా? కేవలం పురుషార్థులమని అనడం అనగా నిర్లక్ష్యంగా, సోమరులుగా అవ్వడం. కనుక ప్రాలబ్ధము లేక ప్రాప్తులతో వంచితులవ్వడం అవుతుంది. ప్రాలబ్ధ రూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి ప్రాలబ్ధాన్ని చూసి సహజంగానే ఉన్నతమయ్యే కళను అనుభవం చేస్తారు. సదా సంగమ యుగ విశేషతల స్మృతి స్వరూపులుగా అయితే విశేషాత్మలుగా అవ్వనే అవుతారు.

నడుస్తూ నడుస్తూ కొంతమంది పిల్లలకు మార్గం కష్టంగా అనుభవమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సహజమని భావిస్తారు, అప్పుడప్పుడు కష్టమని భావిస్తారు. అప్పుడప్పుడు సంతోషంగా నాట్యం చేస్తారు, అప్పుడప్పుడు మనసు బలహీనంగా చేసుకొని వ్యాకులపడి కూర్చునేస్తారు. ఒకసారి తండ్రి గుణాలను గానం చేస్తారు, మరొకసారి ఏమిటి? ఎలా? ఎందుకు? అని పాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు శుద్ధ సంకల్పాల ద్వారా సర్వ ఖజానాల ప్రాప్తి మాలను స్మరణ చేస్తారు, అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల తుఫానులకు వశమై "కష్టం, కష్టం" అనే మాలను స్మరిస్తారు. కారణం ఏమిటి? కేవలం పురుషార్థులమని భావిస్తారు, ప్రాలబ్ధాన్ని మర్చిపోతారు. దేనిని వదలాలో దానిని ముందుంచుకుంటారు, తీసుకునే దానిని వెనుక ఉంచుకుంటారు. కాని వదిలే వస్తువును వెనుకకు, తీసుకునే వస్తువును ముందుకు ఉంచాలి. ఎప్పుడైనా తీసుకునే సమయంలో వెనుకకు పోరాదు. ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తీసుకోవలసిన దానిని స్మృతిలో ఉంచుకొనుట అనగా తండ్రి సన్ముఖంలో ఉండుట. వదిలేయాల్సిన గుణాలను ఎక్కువగా పాడుతున్నారు. ఇది వదిలేశాను, ఇది కూడా వదిలేయాలి లేక వదిలేయాల్సి వస్తుందని వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏమి లభిస్తూ ఉందో, ఏ ప్రాలబ్ధం తయారవుతూ ఉందో దానిని గురించి తక్కువగా ఆలోచిస్తారు. అందువలన వ్యర్థ భారం ఎక్కువైపోతుంది, శుద్ధ సంకల్పాల భారం తగ్గిపోతుంది. కావున ఉన్నతమయ్యే కళకు బదులుగా వ్యర్థ భారం స్వతహాగానే క్రిందకు తీసుకొస్తుంది. అనగా పతన(అవనత) కళ వైపుకు వెళ్లిపోతారు. “పొందవలసినదేదో పొందాము" అనే పాటను పాడటం మర్చిపోతారు. ఈ ఒక్క పాటను మర్చిపోవడం వలన అనేక రకాల బాధలు పడతారు(గుటకలు మింగుతారు). ఈ పాట పాడుతూ ఉంటే మింగుడు పడక పోవడమూ సమాప్తమపుతుంది, కునికిపాట్లు కూడా సమాప్తమవుతాయి. ఎలాగైతే స్థూల పాటలు మిమ్ములను మేల్కొల్పుతాయో అలా ఈ అవినాశి పాటను పాడుతూ ఉండండి. పొందవలసినదంతా పొందాను అని పాడుతూ ప్రాప్తుల సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. పాడుతూ, నాట్యము చేస్తూ ఉంటే గుటకలు, కునికిపాట్లు సమాప్తమైపోతాయి. ఇలాంటి డబల్ ఫ్రూఫ్ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చెయ్యగలరు. ఇది ప్రత్యక్షం చేసే విధి కావున నడుస్తూ తిరుగుతూ ప్రత్యక్ష ప్రమాణం చూపే చైతన్య మ్యూజియంగా తయారవ్వండి. అప్పుడు ప్రతి స్థానంలో ప్రదర్శినీలు, మ్యూజియంలు తయారవుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ జరుగుతుంది. స్వయం మీరే ప్రదర్శినీగా కండి, స్వయమే మార్గదర్శకులుగా కండి. ఈ రోజుల్లో నడుస్తూ, తిరుగుతూ ఉన్న లైబ్రరీలు గ్రంథాలయాలు) ప్రదర్శినీలను తయారు చేస్తున్నారు కదా! ఇంతమంది బ్రాహ్మణులు నడుస్తూ, తిరుగుతూ ఉన్న ప్రదర్శినీలు, మ్యూజియమ్లుగా అయితే ప్రత్యక్షత ఎంత సమయంలో జరుగుతుంది! అర్థమయ్యిందా! ఈ సంవత్సరం ఇంతమంది నడుస్తూ, తిరుగుతూ ఉన్న ప్రదర్శినీలు లేక ప్రొజెక్టర్లగా అయ్యి మొత్తం విశ్వం నలువైపులా వ్యాపించినట్లయితే పొదుపును గురించిన అడ్వర్టైజ్ మెంట్ (ప్రచారం) జరుగుతుంది. ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఉండదు. కానీ ఖర్చుకు ఇచ్చేవారు వచ్చేస్తారు. ఖర్చుకు బదులుగా బహుమతి లభిస్తుంది.

గుజరాతు పెద్దది కదా! సంఖ్యలో అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు రూపంలో కూడా గొప్పగా అయ్యి చూపించండి. గుజరాతు భూమి మంచిది. ఎక్కడ ధరణి బాగుంటుందో అక్కడ శక్తిశాలి బీజం వెయ్యడం జరుగుతుంది. శక్తిశాలీ బీజం అనగా వారస్ క్వాలిటీ బీజము. ఇలాంటి వారసుల బీజం వేసి ఫలం తీయండి. ఫలీభూత ధరణి అన్నిటికంటే శ్రేష్ఠమైన ప్రాలబ్ధాన్ని ఇచ్చేది. క్వాంటిటీ చాలా బాగుంది. క్వాలిటీ కూడా ఉంది కానీ ఇంకా తీయండి. ఒక్కొక్క క్వాలిటీ కల్గినవారు వారస్ గ్రూపును ఋజువుగా ఇవ్వాలి. గుజరాత్ లో సహజంగా వెలువడ్డారు కూడా. ఇప్పుడు విస్తారం ఎక్కువ అవుతూ ఉంది. అందువలన వారసులు దాక్కున్నారు. ఇప్పుడు వారిని ప్రత్యక్షం చేయండి. గుజరాత్ ఏమి చేయాలో తెలిసిందా, ఇతరులు సంపర్కంలోకి తీసుకొస్తే మీరు సంబంధంలోకి తీసుకురండి నంబరువన్ గా అయిపోతారు. ఈ సంవత్సరం ప్లాను కూడా చెప్పాను. ఇప్పుడు విస్తారంలో బిజీగా అయ్యారు. వెరైటీ వృక్షం పెరుగుతూ ఉంటే బీజం దాగబడి అంతిమంలో బీజమే బయటికొస్తుంది. విస్తారంలో ఎక్కువగా బిజీగా అయ్యారు. ఇప్పుడు మరలా బీజం అనగా వారస్ క్వాలిటీ వారిని బయటకు తీయండి. ఏదైతే ఆదిలో జరిగిందో అది అంతిమంలో చేయండి. మంచిది.

సదా సంతోషంగా నాట్యం చేసేవారికి ప్రాప్తి పాటలు పాడేవారికి ప్రత్యక్షఫలాన్ని అనుభవం చేయువారికి తమను ప్రత్యక్ష ప్రమాణంగా తయారు చేసుకొని తండ్రిని ప్రత్యక్షం చేసేవారికి ఇలాంటి డబల్ ఫ్రూఫ్ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే,

పార్టీలతో కలయిక-

1. బ్రాహ్మణ జీవిత లక్ష్యం నరుని నుండి నారాయణునిగా కావడం లేక లక్ష్మిగా కావడం. కావున సదా దివ్య గుణమూర్తులైన దేవతా స్వరూప స్మృతిలో ఉండేవారు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని మర్చిపోరు. సదా తమ ద్వి గుణధారీ స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు కదా? లక్ష్మీ స్వరూపం అనగా ధనదేవీ, నారాయణ స్వరూపం అనగా రాజ్యాధికారి. లక్ష్మిని ధనదేవీ అని అంటారు. ఆ ధన దేవి కాదు, జ్ఞాన ఖజానా ఏదైతే లభించిదో ఆ ధనదేవీలు మీరు. అందరూ ధనదేవీలుగా ఉన్నారు కదా! ఎవరైతే ధనదేవీలుగా ఉంటారో వారు సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారు. ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి జన్మ సిద్ధ అధికారంగా ఏమి లభించింది? జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా లభించింది కదా! కనుక అధికారం జతలో ఉంటుందా లేక బ్యాంక్ లో ఉంటుందా? బ్యాంక్ లో ఉంచుకుంటే సంతోషం ఉండదు. బ్యాంక్ లో పెట్టడం అనగా ఉపయోగించకుండా దూరంగా పెట్టడం. ఎంతగా ఉపయోగిస్తే అంతగా సంతోషం పెరుగుతుంది. ఈ ఖజానాను తోడుగా ఉంచుకున్నందున ఏ ప్రమాదమూ ఉండదు. మహాదానిగా, వరదానిగా అవ్వాలని అనుకున్నప్పుడు లాకర్లో ఎలా పెట్టుకుంటారు. అందువలన రోజూ తమకు లభించిన ఖజానాలను చూసుకోండి. వాటిని స్వయం కొరకే కాక ఇతరుల కొరకు కూడా ఉపయోగించండి. మహాదానులనగా సదా స్వయం కొరకు, ఇతరుల కొరకు కూడా ఉపయోగించువారు. మహాదానీ అనగా సదా అఖండ లంగర్ నడుస్తూనే ఉండాలి. ఒక్క రోజు చేసి మరలా ఒక నెల తర్వాత చేసినట్లయితే మహాదానీ అని అనరు. మహాదానీ అనగా సదా భండారా నడుస్తూ ఉండాలి. సదా సంపన్నంగా ఉండాలి. బాబా భండారము సదా నడుస్తూనే ఉంటుంది కదా. రోజూ ఇస్తూనే ఉంటారు. కావున పిల్లల పని కూడా రోజూ ఇవ్వడం. ఈ భండారాన్ని తెరచి ఉంచితే దొంగలు రారు. మూసివేస్తే దొంగలు వస్తారు. అక్కడ కూడా ఎన్ని తాళాలు తయారు చేస్తే దొంగలు అంత ఎక్కువగా అయ్యారు. మొదట తెరచి ఉంచిన ఖజానాలు ఉండేవి. అప్పుడు ఇంతమంది దొంగలు లేరు. కావున సదా భండారం తెరచే ఉంచండి. ఇంతవరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్‌స్టాప్ పెట్టండి. దీనిని తీవ్ర పురుషార్థమని అంటారు. గడచిపోయిన దానిని చింతన చేస్తూ ఉంటే సమయం, శక్తి, సంకల్పాలు అన్నీ వృథా అవుతాయి. ఇప్పుడు వృథా చేసే సమయం కాదు. సంగమ యుగంలోని రెండు క్షణాలు అనగా రెండు సెకండ్లు వృథా చేసినా అనేక సంవత్సరాలు వృథా చేసినట్లే అవుతుంది. సంగమ యుగము విలువ తెలుసు కదా! సంగమ యుగములోని ఒక్క సెకండు ఎన్ని సంవత్సరాలకు సమానము? కావున ఒకటి, రెండు సెకండ్లు పోగొట్టుకున్నారని కాదు, అనేక సంవత్సరాలు పోగొట్టుకున్నట్లవుతుంది. అందువలన ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెట్టండి. ఎవరైతే ఫుల్‌స్టాప్ పెట్టడం తెలుసుకుంటారో వారు సదా ఫుల్ గా ఉంటారు.

2. సదా తమ శుభ భావనతో వృద్ధి చేస్తూ ఉన్నారు కదా? ఎలాంటి ఆత్మలైనా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచుకోండి. శుభ భావన సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. శుభ భావనతో సేవ చేసే అనుభవం ఉందా? శుభ భావన అనగా దయా హృదయము. ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో అలాగే తమ ముందు ఎలాంటి ఆత్మ ఉన్నా మీ దయా వృత్తితో, శుభభావనతో వారిని పరివర్తన చెయ్యండి. సైన్సువారు ఇసుకలో కూడా పంటలు పండించగల్గినపుడు సైలెన్స్ వారు ధరణిని పరివర్తన చెయ్యలేరా! సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది. అందువలన సదా ధరణిని పరివర్తన చేసే శుభ భావన ఉండాలి. తమ ఉన్నతయ్యే కళ వైబ్రేషన్ల ద్వారా ధరణిని పరివర్తన చేస్తూ వెళ్లండి. స్వ పరివర్తన ద్వారా ధరణి పరివర్తనైపోతుంది. మీరు ధరణిపై నాగలి దున్నువారు కదా! అలసిపోయేవారు కాదు కదా! నాగలి దున్నేవారు మంచిగా, అలసట లేనివారిగా ఉంటారు. బీడు భూములను కూడా సస్యశ్యామలంగా చేసేస్తారు. ఇప్పుడు మనో నిర్ణయులుగా కండి. సంతోషంగా ఉంటే మీ సంతోషం అందరినీ స్వతహాగానే ఆకర్షిస్తుంది. మంచిది.

Comments