* 19-10-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చైతన్య తారామండలము యొక్క సింగారము.
ఈ రోజు జ్ఞాన సూర్యుడు. జ్ఞాన చంద్రుడు తమ తారా మండలిని చూసేందుకు వచ్చారు. తారల మధ్యలోకి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు ఇరువురూ కలిసి వచ్చారు. సాకార సృష్టిలో సూర్యుడు, చంద్రుడు మరియు తారలు ఒకేసారి కలిసి ఉండవు. కాని చైతన్యమైన తారలు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి ఉంటాయి. ఇది తారల యొక్క అలౌకిక కలయిక. కావున ఈ రోజు బాప్ దాదా భిన్న భిన్న సితారలను చూస్తున్నారు. ప్రతి సితారలోనూ తమ తమ విశేషత ఉంది. చిన్న చిన్న సితారలు కూడా ఈ తారా మండలిని చాలా బాగా శోభాయమానంగా చేస్తున్నాయి. పెద్దవారు పెద్దవారే, కాని చిన్నవారి ప్రకాశము ద్వారా సమూహము యొక్క శోభ పెరుగుతోంది. బాప్ దాదా ప్రతి ఒక్క సితార ఎంత అవసరము అన్నదాన్ని చూస్తూ ఎంతో హర్షిస్తున్నారు. అతి చిన్నని సితార కూడా అతి ఆవశ్యకమే. మహత్వపూర్ణమైన కార్యమును చేసేవారే. కావున ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మహత్వమును చూస్తున్నారు. ఏవిధంగా హద్దులోని పరివారంలో మాతాపితలు పిల్లల ప్రతి ఒక్కరి గుణాలు, కర్తవ్యాలు, నడవడిక యొక్క విషయాలను గూర్చి మాట్లాడతారో అలా అనంతమైన తల్లిదండ్రులైన జ్ఞానసూర్యుడు మరియు జ్ఞాన చంద్రుడు అనంతమైన పరివారము లేక సర్వ సితారల యొక్క విశేషతలను గూర్చిన విషయాలను గూర్చి మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మా బాబా లేక జ్ఞాన చంద్రుడు ఈ రోజు నలువైపులా విశ్వము యొక్క మూల మూలలలోనూ మెరుస్తున్న తమ సితారలను చూసి ఆ సంతోషములో ఊగుతున్నారు. జ్ఞాన సూర్యుడైన బాబాకు సితారలు ప్రతి ఒక్కరి యొక్క అవసరమును మరియు విశేషతను వినిపిస్తూ చెప్పలేనంతగా హర్షితమవుతున్నారు. ఆ సమయం యొక్క చిత్రమును బుద్ధి యోగము యొక్క కెమెరాతో చూడగలరా? సాకారంలో ఎవరైతే అనుభవం చేసుకున్నారో వారు బాగా తెలుసుకోగలరు. వారి ముఖము మీ ముందుకు వచ్చేసింది కదా! మీకు ఏం కనిపిస్తోంది? ఎంతగా హర్షిస్తున్నారంటే, ఆ హర్షములో నయనాలలో ముత్యాలు మెరుస్తున్నాయి. ఈ రోజు రత్నాకరుడు ఏవిధంగా ప్రతి రత్నము యొక్క మహత్వమును వర్ణిస్తారో అలా జ్ఞాన చంద్రుడు ప్రతి రత్నము యొక్క మహిమను చేస్తున్నారు. మీ అందరి మహిమను ఏ విధంగా చేశారో మీరు అర్థం చేసుకోగలరా? మీ మహానత యొక్క మహిమను గూర్చి మీకు తెలుసా?
అందరిలోని విశేషమైన ఒక విషయం యొక్క విశేషత లేక మహానత చాలా స్పష్టంగా ఉంది. మహారథులైనా లేక కాల్బలము వారైన, చిన్న సితార అయినా లేక పెద్ద సితార అయినా తండ్రిని తెలుసుకునే విశేషత, తండ్రికి చెందినవారిగా అయ్యే విశేషత అయితే అందరిలోనూ ఉంది కదా! బాబాను పెద్ద పెద్ద శాస్త్రాల అథారిటీలు, ధర్మాల యొక్క అథారిటీలు, విజ్ఞానం యొక్క అథారిటీ గలవారు, రాజ్యము యొక్క అథారిటీ గలవారు, గొప్ప గొప్ప వినాశీ టైటిళ్ళ యొక్క అథారిటీ గలవారు తెలుసుకోలేకపోయారు. కాని, మీరందరూ తెలుసుకున్నారు. వారు ఈనాటివరకూ కూడా ఇంకా ఆహ్వానిస్తూనే ఉన్నారు. శాస్త్రవాదులైతే ఇంకా ఈనాటివరకూ కూడా లెక్కలు వేస్తూనే ఉన్నారు. వైజ్ఞానికులు తమ ఇన్వెన్షన్లలో ఎంతగా నిమగ్నమై ఉన్నారంటే, వారికి తండ్రి యొక్క విషయాలను గూర్చి వినే మరియు అర్థం చేసుకునే తీరిక కూడా లేదు. తమ కార్యములోనే మగ్నమై ఉన్నారు. రాజ్యము యొక్క అథారిటీ గలవారు తమ కుర్చీని సంభాళించుకోవడంలోనే అస్తవ్యస్తమై ఉన్నారు. వారికి అసలు ఖాళీయే లేదు. ధర్మనేతలు తమ ధర్మాన్ని సంభాళించుకోవడంలో, తమ ధర్మమును ప్రాయలోపమై పోకుండా చూసుకోవడంలోనే వ్యస్తమై ఉన్నారు. మాదీ మాదీ అనే ఈ విషయాలలోనే ఎంతగానో బిజీగా ఉన్నారు. కాని మీరందరూ ఆహ్వానించేందుకు బదులుగా మిలనాన్ని జరుపుకునేవారిగా ఉన్నారు. ఈ విశేషత లేక మహానత మీ అందరిలోనూ ఉంది. మాలో ఏం విశేషత ఉంది? అని లేక మాలో ఏ గుణమూ లేదు అనైతే భావించడం లేదు కదా! మాలో ఏ గుణమూ లేదు అనే మాట భక్తులకు సంబంధించినది. గుణసాగరుడైన బాబాకు పిల్లలుగా అవ్వడము అనగా గుణవంతులుగా అవ్వడము. కావున ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గుణము యొక్క విశేషత ఉంది మరియు బాబా అదే విశేషతను చూస్తారు. ఏ విధంగా రాజ్య పరివారములోని ప్రతి వ్యక్తిలోనూ వారు బికారులుగా అయిపోనంతటి సంపన్నత అయితే తప్పకుండా ఉంటుందో అలాగే గుణసాగరుడైన బాబా యొక్క పిల్లలు ఏ గుణము లేక విశేషత లేకుండా పిల్లలుగా పిలువబడజాలరు. కావున మీరందరూ గుణవంతులే, గొప్పవారే. మీరు విశేష ఆత్మలే. మీరు చైతన్య తారా మండలి యొక్క సింగారము. కావున మీరందరూ ఎవరో అర్థం చేసుకున్నారా? మీరు నిర్బలురు కారు, శక్తివంతుల. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. ఇటువంటి అతిక నషా సదా ఉంటుందా? ఆత్మికతలో అభిమానమన్నది ఉండదు. స్వమానము ఉంటుంది. స్వమానము అనగా స్వ ఆత్మ యొక్క గౌరవము. స్వమానము మరియు అభిమానము రెండింటిలోనూ తేడా ఉంది. కావున సదా స్వమానము అనే సీటుపై స్థితులై ఉండండి, అభిమానమనే సీటును వదిలివేయండి. అభిమానమనే సీటు పైపైన చాలా అలంకరింపబడి ఉంటుంది. చూసేందుకు సుఖముగా, మనస్సుకు నచ్చేదిగా ఉంటుంది. కాని లోపల అది ముళ్ళ ఆసనం వంటిది. ఒక నానుడి ఉంది - దానిని తిన్నవాడూ పశ్చాత్తాపపడతాడు. తిననివాడూ పశ్చాత్తాపపడతాడు అని అంటారు. ఈ అభిమానం యొక్క సీటు కూడా అటువంటిదే. ఒకరినొకరు చూసి తామూ రుచి చూడాలనుకుంటారు. ఫలానా ఫలానావారు అనుభవం చేసుకున్నారు మరి నేను కూడా ఎందుకు చేసుకోకూడదు అని భావిస్తారు. దానిని వదలనూ లేరు మరియు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు ముళ్ళు తప్పకుండా గుచ్చుకొని తీరుతాయి. కేవలం బాహ్యమైన అట్టహాసముతో మోసగించే అభిమానం యొక్క సీటుపై కూర్చునేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. స్వమానం యొక్క సీటుపై సదా సుఖంగా, సదా శ్రేష్ఠంగా, సదా సర్వప్రాప్తి స్వరూపమును అనుభవం చేసుకోండి. తండ్రిని తెలుసుకొని మరియు మిలనమును జరుపుకొనే మీ యొక్క ఇదే విశేషతను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితముగా ఉండండి. జ్ఞాన చంద్రుడు సితారలను చూసి ఏ విధంగా హర్షిస్తున్నారో అలా మీరూ అనుసరించండి. అచ్ఛా
ఇలా సదా స్వమానము యొక్క సీటుపై స్థితులయ్యేవారికి, సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తూ విశేషత ద్వారా ఇతరులను కూడా విశేష ఆత్మలుగా తయారుచేసేవారికి, చంద్రుడిని మరియు జ్ఞాన సూర్యుడిని సదా అనుసరించేవారికి ఇటువంటి విశ్వాసపాత్రులకు, ఆజ్ఞాకారులకు, సుపుత్రులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో మిలనము:- ప్రతి ఒక్కరికీ తమ శ్రేష్ఠ భాగ్యమును గూర్చి తెలుసు కదా! శ్రేష్ఠ కర్మల ద్వారా ఎంతటి శ్రేష్ఠ బాగ్యాన్ని తయారుచేసుకుంటున్నారు! ఎంతగా శ్రేష్ఠ కర్మలు ఉంటాయో అంతగా తమ భాగ్యము యొక్క రేఖ పొడుగ్గా మరియు స్పష్టంగా ఉంటుంది. చేతుల ద్వారా భాగ్యాన్ని పరిశీలించేటప్పుడు ఏం చూస్తారు? రేఖ పొడుగ్గా ఉందా, మధ్య మధ్యలో ఖండితమవ్వడం లేదు కదా అని పరిశీలిస్తారు. ఇక్కడ కూడా అలాగే. సదా శ్రేష్ఠ కర్మలు చేసేవారున్నట్లయితే భాగ్యము యొక్క రేఖ కూడా పొడుగ్గా ఉంటుంది మరియు సదాకాలికంగా స్పష్టముగా మరియు శ్రేష్ఠముగా ఉంటుంది. అప్పుడప్పుడూ శ్రేష్ఠముగా, అప్పుడప్పుడూ సాధారణంగా ఉన్నట్లయితే భాగ్యరేఖ కూడా మధ్య మధ్యలో ఖండితమవుతూ ఉంటుంది. అవినాశిగా ఉండదు. కాసేపు ఆగుతారు, కాసేపు ముందుకు వెళతారు. కావున సదా శ్రేష్ఠ కర్మధారులుగా అవ్వండి. భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు బాబా శ్రేష్ఠ కర్మలు అనే సాధనాన్ని ఇచ్చేశారు. భాగ్యాన్ని తయారుచేసుకోవడం ఎంత సహజము! శ్రేష్ఠ కర్మలు చేయండి మరియు పదమా పదమ భాగ్యశాలుల యొక్క భాగ్యాన్ని ప్రాప్తించుకోండి. శ్రేష్ఠ కర్మల యొక్క ఆధారము శ్రేష్ఠ వృత్తి. శ్రేష్ఠాతి శ్రేష్ఠుడైన బాబా యొక్క స్మృతిలో ఉండడము అనగా శ్రేష్ఠ కర్మలు జరగడము. మీరు అటువంటి భాగ్యశాలురే కదా! అందరూ భాగ్యవంతులే కాని శ్రేష్ఠముగా ఉండడం లేక సాధారణంగా ఉండడంలోనే నెంబరు లభిస్తుంది. కావున సదాకాలికముగా భాగ్యము యొక్క రేఖను దిద్దుకున్నారా లేక చిన్న చిన్న రేఖలు దిద్దుకున్నారా? అది పొడుగ్గా ఉంది కదా, అవినాశిగా ఉంది కదా, మధ్య మధ్యలో అంతమయ్యేదిగా కాక సదాకాలికంగా నడిచేదిగా ఉండాలి. అటువంటి భాగ్యవంతులుగా అవ్వండి. ఇప్పుడూ భాగ్యవంతులుగా మరియు అనేక జన్మలు కూడా భాగ్యవంతులుగా అవ్వండి.
మధువన నివాసులతో - మధువన నివాసులు ఎవరు? మధువన నివాసులకు ఏ టైటిల్ ను ఇద్దాము? క్రొత్త టైటిల్ ఏదైనా చెప్పండి. ఈ సమయంలో మధువనములో క్రొత్తగా ఏం ప్రవేశపెట్టారు? ఫొటోస్టాట్ మిషీన్ తెచ్చారు కదా! కావున మధువన నివాసులు ఫొటోస్టాట్ కాపీ వంటివారు. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. ఆ మిషన్లో కాపీలు ఖచ్చితముగా అదేవిధంగా ఉంటాయి కదా! ఆ మిషన్ యొక్క విశేషత ఏమిటంటే అందులో కొద్దిగ కూడా తేడా ఉండదు. కావున మధువన నివాసులు ఫొటోస్టాట్ కాపీ వంటివారు. మధువనము మిషను వంటిది మరియు మధువన నివాసులు ఫొటోలు. కావున మీ ప్రతి కర్మ విధాత యొక్క కర్మ రేఖలను చూపించాలి. కర్మల ద్వారానే భాగ్యము యొక్క రేఖను దిద్దుకుంటారు. మీ అందరి యొక్క ప్రతి కర్మ శ్రేష్ఠ భాగ్యము యొక్క కర్మ రేఖలను దిద్దింపజేసేలా ఉండాలి. ఏ విధంగా బాప్ దాదా యొక్క ప్రతి కర్మ స్వయం కొరకు మరియు అనేకుల కొరకు భాగ్యము యొక్క రేఖను దిద్దించేదిగా ఉందో అలాగే బాబా సమానంగా అవ్వండి. మధువనములో ఇన్ని సాధనాలు, ఇంతటి సహయోగము, ఇంతటి శ్రేష్ఠ సాంగత్యము ప్రాప్తమై ఉంది. మధువనము యొక్క బండారములో అప్రాప్తి అనే వస్తువే లేదు. మరి సర్వ ప్రాప్తివంతులు ఏమవుతారు? సంపూర్ణులైపోయినట్లే కదా! ఏ విషయం యొక్క లోపం ఉంది? ఏదైనా లోపం ఉంటే అది స్వయం యొక్క ధారణలోనే. మధువన నివాసులలో సదా ఒక సంస్కారము ఎమర్ట్ రూపంలో ఉండాలి. అది ఏమిటి? కర్మలో సఫలతను పొందేందుకు బ్రహ్మా బాబా యొక్క నిజ సంస్కారము ఏమిటి? అదే సంస్కారం మీ అందరిలో కూడా ఉండాలి. హాజీ అని అనడంతో పాటు 'మొదట మీరు' అన్న సంస్కారం. మొదట నేను అని కాదు. మొదట మీరు అని అనాలి. బ్రహ్మాబాబా మొదట జగదాంబను ఉంచారు కదా! ఏ స్థానంలో నైనా మొదట పిల్లలు. అన్ని విషయాలలోనూ పిల్లలను తమ కన్నా ముందు ఉంచారు. జగదాంబను తమ కన్నా ముందు ఉంచారు. 'మొదట మీరు' అని అనేవారే హాజీ అని అనగలరు. కావున ముఖ్యమైన విషయం 'మొదట మీరు' అని అనడం. కాని అది కూడా శుభభావనతోనే. కేవలం నామమాత్రంగా కాదు. శుభచింతక భావనతో అలా అనాలి. శుభభావన మరియు శ్రేష్ఠ కామన యొక్క ఆధారముపై మొదట మీరు' అని అనేవారు తాము స్వయమే ముందు ఉంటారు. మొదట మీరు అని అనడమే మొదటి నెంబర్లోకి వెళ్ళడము. బాబా జగదాంబను ముందు ఉంచారు. పిల్లలను ముందు ఉంచారు అయినా తామే నెంబర్ వన్‌గా వెళ్ళారు కదా! ఇందులో ఎటువంటి స్వార్థమునూ ఉంచలేదు. నిస్వార్థముగా 'మొదట మీరు' అని అన్నారు. చేసి చూపించారు. అలాగే మొదట మీరు అనే పాఠము పక్కాగా ఉండాలి. వారు చేశారు అంటే నేను చేసినట్లే. వీరు ఎందుకు చేశారు, నేనే చేయాలి. నేను ఎందుకు చేయకూడదు. నేను చేయలేనా! అన్న భావన కాదు. వారు చేసినా బాబా యొక్క సేవయే. నేను చేసినా బాబా యొక్క సేవయే. ఇక్కడ ఎవరికీ తమ తమ వ్యాపారాలేవీ లేవు కదా! అంతా ఒక్క బాబా యొక్క వ్యాపారమే. ఈశ్వరీయ సేవలో ఉన్నారు. గాడ్లి సర్వీస్ అని వ్రాస్తారే కాని నా సేవ అని అనైతే రాయరు కదా! ఏ విధంగా బాబా ఒక్కరే ఉన్నారో అలాగే సేవ కూడా ఒక్కటే. అలాగే వారు చేసినా, నేను చేసినా ఒక్కటే. ఎవరు ఎంతగా చేస్తే అంతగా వారిని ఇంకా ముందుకు పంపండి. నేను ముందు కూర్చోవాలి అని భావించకండి. ఇతరులను ముందుకు పంపి మీరూ ముందుకు వెళ్ళండి. అందర్నీ తీసుకొని వెళ్ళాలి కదా! బాబాతోపాటు అందరూ వెళతారు అనగా పరస్పరం అందరూ తోడుగానే ఉంటారు కదా! ఎప్పుడైతే ఇదే భావన ప్రతి ఒక్కరిలోకి వచ్చేస్తుందో అప్పుడు ఫొటోస్టాట్ కాపీలా అయిపోతారు.
మధువన నివాసులను చూడడము అంటే బ్రహ్మాబాబాను చూసినట్లే. ఎందుకంటే మీరు వారి కాపీయే కదా! అప్పుడు ఇంక ఎవరూ మేము బ్రహ్మాబాబాను చూడనే లేదు అని అనరు. మీ కర్మలు, మీ స్థితి బ్రహ్మా బాబాను స్పష్టంగా చూపించాలి. ఇది మధువన నివాసుల యొక్క విశేషత. ఎందుకంటే మధువన నివాసులను అందరూ అనుసరిస్తారు. కావున మధువన నివాసులు ఒక్కొక్కరూ మాస్టర్ బ్రహ్మల వంటివారు. బ్రహ్మాబాబా యొక్క ఫోటోను ఎవరికి ఇచ్చినా వారు దానిని ఎంతో ప్రేమగా సంభాళించుకుంటారు. అన్నిటికన్నా పెద్ద కానుకగా దానినే భావిస్తారు. కావున మీరందరూ కూడా బ్రహ్మాబాబా యొక్క పోటోలా అయిపోండి. బ్రహ్మాబాబా సమానంగా అయినట్లయితే మీరు కూడా అమూల్యమైన కానుకలా అయిపోతారు.
బ్రహ్మా బాబా ముఖముపై ఏ విశేషతను చూశారు? గంభీరత యొక్క చిహ్నాలూ ఉన్నాయి మరియు మందహాసమూ ఉంది. గంభీరత అనగా అంతర్ముఖత మరియు దానితో పాటు రమణీయత కూడా ఉంది. అంతర్ముఖతకు గుర్తుగా సదా సాగరం యొక్క లోతులలో మైమరచిపోయి ఉన్న గంభీరత. మనన చింతన చేసే ముఖము, రమణీకమైన అనగా మందహాసము చేస్తున్న ముఖము. కావున ఈ రెండు లక్షణాలను వారి ముఖముపై చూశారు కదా! అలాగే మీ ముఖము కూడా బ్రహ్మా బాబా యొక్క కాపి స్వరూపంగా ఉండాలి. ముఖము మరియు రూపురేఖల ద్వారా బ్రహ్మా బాబాయే కన్పించాలి. ఎందుకంటే బ్రహ్మా బాబా యొక్క సేవాస్థానము, కర్మభూమి మధువనమే కదా! కావున ఈ భూమిలో ఉండేవారి ద్వారా అవే కర్మలు, సేవ ప్రత్యక్షమవ్వాలి. ఇవే ఆశాదీపాలను సదా వెలిగించండి. బ్రహ్మా బాబాకు పిల్లలైన మీపైన ఇదే అశ ఉంది. ఇప్పుడు ఇటువంటి దీపావళిని జరపండి. బాప్ దాదా యొక్క ఈ ఒక్క ఆశాదీపాన్ని వెలిగించండి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగిస్తారో అప్పుడు దీపావళి జరిగితీరుతుంది కదా! దీపమాలలో కూడా చూడండి, మధ్యలో ఏవైనా ఒకటి, రెండు దీపాలు ఆరిపోయి ఉంటే బాగుంటాయా? మధ్య మధ్యలో ఒకటి, రెండు దీపాలు వెలుగుతూ ఆరిపోతూ ఉంటే బాగోదు. కావున అన్నీ వెలిగి ఉన్న దీపాల యొక్క మాల ఉండాలి.
మధువన నివాసులు అందరూ జస్టిస్టుగా ఉండాలి. సెల్ఫ్ జస్టిస్టుగా ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు స్వయమే జడ్జి చేయండి. అప్పుడు స్వయం యొక్క సమయమూ వ్యర్థమవ్వదు మరియు ఇతరుల యొక్క సమయమూ వ్యర్థమవ్వదు. మధువనము పీస్ ప్యాలెస్ వంటిది. మనస్సు యొక్క శాంతీ ఉండాలి, ముఖము యొక్క శాంతి ఉండాలి. అప్పుడు పీస్ ప్యాలెస్ అయిన మధువనం నుండి శాంతి కిరణాలు వ్యాపిస్తాయి. పీస్ ప్యాలెస్ నివాసులైన మీ అందరి నుండి అందరూ శాంతి యొక్క బిక్షను కోరుకుంటారు. ఎందుకంటే వారు స్వయమే స్వయముతో విసుగు చెందుతున్నారు, వినాశకారుల వద్దకు ఇప్పటివరకూ మీ శాంతి కిరణాలు చేరుకోవడం లేదు. కావుననే గొడవలలో ఉన్నారు. కాసేపు శాంతి, కాసేపు అశాంతి. కావున వారిని శాంతింపజేసేందుకు పీస్ ప్యాలెస్ నుండి శాంతి యొక్క కిరణాలు వెళ్ళాలి. అప్పుడు వారి బుద్ధిలో ఒకే ఫైనల్ నిర్ణయము జరుగుతుంది. అంతం చేసేస్తారు మరియు శాంతి చెంది శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. కావున ఇటువంటి బికారులకు ఇప్పుడు మహాదానులుగా అయి మహాదానమును లేక వరదానమును ఇచ్చేవారిగా అవ్వండి. మధువనం వారు విశ్వాన్ని బాప్ దాదా సమీపమునకు తీసుకువచ్చే సమీప రత్నాలు అని బాప్ దాదా సదా భావిస్తారు. కావున ఇప్పుడు అటువంటి ప్రమాణాన్ని చూపించండి. ఎప్పుడైతే బ్రహ్మా బాబా సమానంగా అందరూ కాపీలుగా తయారైపోతారో అప్పుడు విశాలమైన బాణాసంచాను తగులబెడతారు. బాణాసంచాను వదులుతారు మరియు పట్టాభిషేకం జరుగుతుంది. కావున ఇప్పుడు ఆ తారీఖును నిర్ణయించండి. ఎప్పుడైతే మీరందరూ బ్రహ్మా బాబా యొక్క పూర్తి ఫొటో కాపీలుగా అవుతారో అప్పుడే ఆ తారీఖు వస్తుంది. మధువన నివాసులు ఏది కావాలనుకుంటే అది చేయవచ్చు. అచ్చా. ఇప్పుడు అందరూ ఏమి ఆలోచిస్తున్నారు.
బాప్ దాదా వద్ద మనస్సు యొక్క సంకల్పాల కెమెరా ఉండడమే కాదు. ప్రతి ఒక్క మనస్సులో ఏమి చింతన జరుగుతోందో కూడా బాప్ దాదా స్పష్టంగా చూడగలరు. సైన్స్ వారు ఇప్పటివరకూ ఇంకా అలాంటి కెమేరాను. లోపలి సంకల్పాల యొక్క రేఖలను తెలుపగల కెమేరాను కనుగొనేందుకు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. పాపం వారు చాలా కష్టపడుతున్నారు. వారంతా ఇన్వెన్షన్లను చేస్తూ చేస్తూ ఉండిపోతారు మరియు మీరు తయారై ఉన్న సాధనాలను కార్యములోకి తీసుకువస్తారు. అచ్చా!
Comments
Post a Comment