18-06-1977 అవ్యక్త మురళి

* 18-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"యోగము యొక్క శక్తిశాలి స్థితి ఎలా తయారవుతుంది?"

ఆత్మికమిలనము జరుపుకొనేందుకు వరదానీ భూమి వద్దకు వచ్చారు. ఆత్మిక మిలనము వాణి నుండి అతీతంగా ఉండే స్థితిలో స్థితులవ్వడం ద్వారా జరుగుతుందా లేక వాణి ద్వారా జరుగుతుందా? మీకు వాణి నుండి అతీతంగా ఉండే స్థితి ప్రియమనిపిస్తుందా లేక వాణిలోకి వచ్చే స్థితి ప్రియమనిపిస్తుందా? వాణి నుండి అతీతంగా ఉండే స్థితి శక్తివంతముగా మరియు సర్యులసేవకు నిమిత్తమవుతున్నట్లుగా అనుభవమవుతుందా? లేక వాణి ద్వారా సర్వుల సేవ యొక్క స్థితి శక్తిశాలిగా అనుభవమవుతుందా? అనంతమైన సేవ వాణి నుండి అతీతంగా ఉండే స్థితి ద్వారా జరుగుతుందా లేక వాణి ద్వారా జరుగుతుందా? అంతిమ సంపూర్ణ స్థితిలో సర్వశక్తులతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ యొక్క స్థితి ప్రత్యక్ష రూపంలో జరుగుతుంది. మరి అటువంటి స్థితి వాణి నుండి అతీతంగా ఉండడం ద్వారా కలుగుతుందా లేక వాణిలోకి రావడం ద్వారా కలుగుతుందా? సర్వ ఆత్మలపై విశ్వకళ్యాణకారులుగా, మహాదానులుగా, వరదానులుగా సర్వుల యొక్క సర్వకామనలను పూర్తిచేసే స్థితి వాణి నుండి అతీతంగా ఉండే స్థితి ద్వారా కలుగుతుందా లేక వాణిలోకి రావడం ద్వారా కలుగుతుందా? ఈ రెండు స్థితులను గూర్చి మీకు తెలుసు కదా! రెండింటిలోనూ ఎక్కువ సమయం ఎందులో స్థితులవ్వగల్గుతున్నారు? ఏ స్థితి సహజంగా అనుభవమవుతోంది? ఏ క్షణంలో ఏ స్థితిలో స్థితులవ్వమని డైరెక్షన్ లభిస్తే అదే సమయంలో స్వయాన్ని అని స్థితిలో స్థిరం చేసుకోగల్గుతున్నారా లేక అందులో స్థితులవ్వడంలోనే సమయమైపోతోందా? సంపన్నంగా అయ్యే సమయం ఎంతెంతగా సమీపంగా వస్తోందో అంతగా సమయానికి ముందే స్వయంలో ఈ విశేషతను అనుభవం చేసుకుంటున్నారా? అంతిమ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టేందుకు సర్వ శ్రేష్ఠ సాధనము ఇదే - ఏ డైరెక్షన్ లభిస్తే దాని అనుసారంగా అదే ఘడియలో, అదే స్థితిలో స్థితులైపోవడం, ఈ సాధనను, అభ్యాసమును అనుభవంలోకి తీసుకువస్తున్నారా? దీని అభ్యాసముందా? బాబా ఈ అభ్యాసమును ఎంతో కాలంగా నేర్పిస్తూ వచ్చారు, ఇంకా నేర్పిస్తూనే ఉన్నారు. కానీ, ఈ అభ్యాసంలో స్వయాన్ని ఎంత సంపన్నంగా భావిస్తున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరాంతం వరకు స్వయాన్ని ఈవిధంగా ఎవర్రెడీగా చేసుకోగల్గుతారా? తయారుగా ఉన్నారా లేక సమయాన్ని చూస్తూ స్వయం అభ్యాసం చేయడంలో ఇంకా నిర్లక్ష్యులుగా అయిపోయారా? వినాశనం ఎప్పుడు జరుగుతుందో తెలియదు అన్న ఈ విషయమును ఆలోచిస్తూ పురుషార్థంలో సంపన్నంగా అయ్యేందుకు బదులుగా వ్యర్థ చింతన లేక వ్యర్థ సంకల్పాల యొక్క బలహీనతలో నిర్లక్ష్యులుగా అయితే అవ్వడం లేదు కదా!

ఈ రోజులలోని పిల్లల పురుషార్థం యొక్క వేగమును చూస్తూ బాప్ దాదా మందహాసం చేస్తున్నారు. సర్వ ఆత్మలకు పదే పదే యోగులుగా అవ్వండి, జ్ఞానులుగా అవ్వండి అన్న సందేశమునే ఇస్తున్నారు, మరి ఈ సందేశమును ఇచ్చేవారు స్వయానికి కూడా ఈ సందేశమును ఇస్తున్నారా? మెజార్టీ ఆత్మలు విశేష సబ్జెక్టయిన స్మృతి యాత్రలో లేక యోగులుగా అయ్యే స్థితిలో బలహీనంగా కనిపిస్తున్నారు. పదే పదే ఒకే ఫిర్యాదును బాప్ దాదా ముందు లేక నిమిత్తంగా అయిన ఆత్మల ముందు చేస్తున్నారు. యోగము ఎందుకు కుదరడంలేదు లేక నిరంతమూ యోగము ఎందుకు నిలవడం లేదు, యోగము యొక్క శక్తిశాలీ స్థితి ఎలా తయారవుతుంది అని అంటున్నారు. అనేకసార్లు అనేకరకాలైన యుక్తులు లభించినా కానీ, పదే పదే ఇవే ఫిర్యాదులు బాప్ దాదాకు లభిస్తున్నాయి. దీన్ని ఏమనుకోవాలి? సర్వశక్తివంతుని పిల్లలుగా అయి శక్తిహీన ఆత్మలుగా ఉండడమును ఏమనుకోవాలి? ఎవరైతే స్వయాన్నే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వారు విశ్వరాజ్యాన్ని ఏవిధంగా కంట్రోల్ చేయగలుతారు? దానికి కారణమేమిటి? యోగమును నేర్చుకున్నారు యోగయుక్తులుగా ఉండేందుకు ఏర్పరచిన యుక్తులను ప్రయోగించడం రావడం లేదు. యోగము, యోగము అని అంటున్నారు కానీ, దానిని ప్రయోగములోకి తీసుకురావాలి అన్న ధ్యానమును ఉంచడం లేదు.

వర్తమాన సమయంలో విశేషంగా ఒక అల కనిపిస్తోంది. ఏదైనా విషయం ముందుకు వస్తే బాబా ద్వారా లభించిన ఎదుర్కొనే శక్తిని స్వయం ప్రయోగించడం లేదు కానీ, బాబాను ముందుకు పెట్టి, మీరు మమ్మల్ని తోడుగా తీసుకువెళ్ళాలి, మాకు శక్తిని ఇవ్వండి, సహాయం చేయడం మీ పని, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, కొద్దిగా ఆశీర్వదించండి, మీరు సాగరులు కదా, మాకు కాస్త అంచలిని ఇవ్వండి అని అనడం మొదలుపెడతారు. స్వయం ఎదుర్కోవడంలో ధైర్యమును వదిలివేస్తారు మరియు ధైర్యహీనులుగా అయిన కారణంగా సహాయం నుంచి కూడా వంచితులుగా అయిపోతారు. బ్రాహ్మణ జీవితము యొక్క విశేష ఆధారము ధైర్యము. ఏ విధంగా శ్వాస లేకపోతే జీవితం లేదో అలాగే ధైర్యము లేకపోతే బ్రాహ్మణులు కానట్లే. బాబా కూడా, “పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయం చేస్తారు” అని వాగ్దానం చేశారు. కేవలం బాబా సహాయం చేయాలి అని అనడం కాదు. ఈ రోజుల్లో అంతా బాబాపై వదిలివేస్తారు మరియు స్వయం నిర్లక్ష్యులుగా ఉంటారు. కానీ చేయవల్సింది ఏమిటి? ప్రతి శక్తిని గూర్చి లేక జ్ఞానము యొక్క ప్రతి యుక్తిని గూర్చి వింటూ అవి లభించినా కానీ వాటిని స్వయం కొరకు ఉపయోగించడం లేదు, అనగా అభ్యాసములోకి తీసుకురావడం లేదు. ఇదే విశేష బలహీనతగా ఉంది. కేవలం వర్ణన చేయడం వరకు తీసుకువస్తున్నారు కానీ, అంతర్ముఖులుగా అయి ప్రతి శక్తి యొక్క, ధారణ యొక్క అభ్యాసములోకి వెళ్ళండి. ఏదైనా కొత్త విషయాన్ని ఆవిష్కరించే వ్యక్తి రాత్రింబవళ్ళు అదే ఆవిష్కారము యొక్క లగ్నములో నిమగ్నమై ఉంటారు, అలాగే ప్రతి శక్తి యొక్క అభ్యాసంలో నిమగ్నమై ఉంటారు. సహనశక్తి అని, ఎదుర్కొ నే శక్తి అని దేనిని అంటారు? సహనశక్తి ద్వారా లభించే ప్రాప్తి ఏమిటి? సహనశక్తిని ఏ సమయంలో ఉపయోగించడం జరుగుతుంది? సహనశక్తి లేని కారణంగా ఎటువంటి విఘ్నాలకు వశీభూతులవుతారు? మాయ యొక్క రూపమేదైనా క్రోధము యొక్క రూపంలో ఎదుర్కొనేందుకు వచ్చినట్లయితే ఏ విధంగా విజయులుగా అవ్వగల్గుతారు? ఏయే పరిస్థితుల రూపంలో మాయ సహనశక్తి యొక్క పరీక్షను తీసుకోగలదు అన్న ఈ విషయాలను ముందుగానే విస్తారంగా బుద్ధి ద్వారా మీ ముందుకు తీసుకురండి. ఫైనల్ పరీక్ష హాల్ లోకి వెళ్ళేందుకు ముందుగానే స్వయం యొక్క మాస్టర్ గా అయి స్వయం యొక్క పరీక్షను తీసుకోండి. అప్పుడు రానున్న పరీక్షలో ఎప్పుడూ ఫెయిలవ్వరు. ఈ విధంగా ఒకొక్క పరీక్ష యొక్క విస్తారములోకి మరియు అభ్యాసములోకి వెళ్ళండి. అభ్యాసము తక్కువగా చేస్తున్నారు. వ్యాసులుగా అందరూ అయిపోయారు కానీ, అభ్యాసము చేయడం లేదు. ఇదేవిధంగా స్వయాన్ని బిజీగా ఉంచుకోవడం కూడా రావడం లేదు. కావుననే మాయ మిమ్మల్ని బిజీ చేసేస్తుంది. సదా అభ్యాసములో బిజీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లయింట్ కూడా సమాప్తమైపోతుంది. దానితో పాటు మీ అభ్యాసములో ఉండే ప్రభావము మీ ముఖము ద్వారా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అంతర్ముఖులు సదా హర్షితముఖులుగా కనిపిస్తారు, ఎందుకంటే మాయ ఎదుర్కోవడం సమాప్తమైపోతుంది. ఈ విధంగా అనుభవాలను పెంచుతూ ఉన్నట్లయితే పదే పదే ఒకే ఫిర్యాదును చేయడము నుండి మీరు విముక్తులవుతారు. ఏ విధంగా సర్వశక్తుల యొక్క అభ్యాసమును గూర్చి వినిపించారో అలాగే స్వయాన్ని యోగీ ఆత్మగా స్వయంలో ఉందా? పిలిపించుకుంటున్నారు కానీ, యోగము యొక్క పరిభాషనేదైతే ఇతరులకు వినిపిస్తున్నారో ఆ అభ్యాసము స్వయంలో ఉందా?

యోగము యొక్క ముఖ్య విశేషతలు:- సహజయోగము, కర్మయోగము, రాజయోగము, నిరంతర యోగము, పరమాత్మ యోగము అని చెబుతారు. ఏవేతే వర్ణన చేస్తారో అవన్నీ స్వయం యొక్క అభ్యాసములొకి తీసుకువచ్చారా? సహజ యోగము అని ఎందుకు అంటారు? దీని స్పష్టీకరణను గూర్చి మీకు బాగా తెలుసా లేక అభ్యాసములోకి కూడా తీసుకువచ్చారా? మీరు జ్ఞానస్వరూపముగా కూడా ఉన్నారు కానీ, ఇక ఇప్పుడు అభ్యాసము లోకి తీసుకురండి మరియు సర్వవిశేషతల యొక్క అభ్యాసమూ కావాలి, అప్పుడే సంపూర్ణ యోగులుగా అవ్వగల్గుతారు. సహజ యోగము యొక్క అభ్యాసము ఉండి రాజయోగము లేకపోతే ఫుల్ పాస్ అవ్వలేరు. కావున ప్రతి యోగము యొక్క విశేషతను, ప్రతి శక్తి మరియు ప్రతి జ్ఞానము యొక్క ముఖ్య పాయింటు యొక్క అభ్యాసమును చేయండి. ఇది తక్కువగా ఉన్న కారణంగానే మెజార్టీ బలహీనంగా అయిపోతారు. అటువంటి అభ్యాసము యొక్క లోపము ఉన్న కారణంగానే బలహీన ఆత్మలుగా అయిపోతారు. అభ్యాసీ ఆత్మ, లగ్నములో మగ్నమై ఉండే ఆత్మ ముందుకు ఎటువంటి విఘ్నము రాదు. లగ్నము యొక్క అగ్నితో విఘ్నము దూరము నుండే భస్మమైపోతుంది. మీరు శక్తి స్వరూపము యొక్క మోడల్ ను చూపిస్తారు కదా! శక్తి ద్వారా అసురులు లేక పంచ వికారాలు భస్మమైనట్లుగా లేక పారిపోతున్నట్లుగా చూపిస్తారు కదా! మీరు తయారుచేసే ఆ మోడల్ ఎవరిది? మరిప్పుడు ఏం చేస్తారు? ప్రతి విషయమును ప్రయోగము చేయడంలోని విధిలో నిమగ్నమవ్వండి. అభ్యాసము యొక్క ప్రయోగశాలలో కూర్చున్నట్లయితే ఒక్క బాబా యొక్క సహాయమును మరియు మాయ యొక్క అనేకరకాలైన విఘ్నాల నుండి అతీతంగా అయ్యే అనుభవమును పొందుతారు. ఇప్పుడు జ్ఞానసాగరుని, గుణాల యొక్క సాగరుని, శక్తిసాగరుని అలలలో పైపైన తేలుతున్నారు, కావుననే అల్పకాలికంగా రిఫ్రెష్ మెంట్ ను అనుభవం చేసుకుంటున్నారు. కానీ, ఇప్పుడిక సాగరుని యొక్క లోతులలోకి వెళ్ళండి, అప్పుడు అనేకరకాలైన విచిత్ర అనుభవాలను పొంది రత్నాలను పొందగల్గుతారు. స్వయమూ సమర్థులుగా అవ్వండి. ఇప్పుడిక ఆ ఫిర్యాదులను తేకండి, బాబాకు నవ్వు వస్తుంది. చిన్న చిన్న మాటలను మళ్ళీ మళ్ళీ అవే మాటలను వ్రాస్తున్నారు. వినాశీ డాక్టర్ యొక్క కార్యమును కూడా బాబా పైనే ఉంచుతున్నారు. రచన మీది, కర్మబంధన కూడా మీచే తయారుచేయబడ్డదే. కానీ, మళ్ళీ దానిని తొలగించే డ్యూటీ బాబా పైన వేస్తున్నారు. బాబా యొక్క పని యుక్తిని చెప్పడమా లేక తానే అది చేయడమా? బాబా తెలియజేయడానికి నిమిత్తులుగా ఉన్నారా లేక అది చేసేందుకు కూడా నిమిత్తులుగా ఉన్నారా? అల్లరివారిగా అయిపోతారు కదా! అల్లరిపిల్లలు అంతా తండ్రి పైనే వదిలివేస్తారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, మీరు వారిని సరిదిద్దండి అని అంటారు. బాబా సరిదిద్దేందుకు విధానమును చెబుతున్నారు. కానీ, అది చేయవల్సింది మీరు. బాబాను విశ్వసేవకునిగా భావిస్తూ అన్నింటినీ బాబా పైనే వదలాలనుకుంటున్నారు. కానీ, ఏ డైరెక్షన్లైతే లభిస్తున్నాయో వాటిపై ధ్యానమును ఉంచి ప్రత్యక్షతలోకి తీసుకువచ్చినట్లయితే అన్ని విఘ్నాల నుండి విముక్తులైపోతారు. అర్థమైందా?

అచ్చా- సదా బాబా యొక్క ప్రతి ఆజ్ఞాను పాలన చేసే ఆజ్ఞాకారులకు, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న పాఠమును పాలన చేసే విశ్వాసపాత్రులకు, సదా స్వయాన్ని అభ్యాసములో బిజీగా ఉంచుకొనేవారికి, సంపూర్ణ జ్ఞానము మరియు యోగము యొక్క ప్రతి విశేషతను జీవితములోకి తీసుకువచ్చేవారికి ఇటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.. 

వీడ్కోలు సమయంలో దాదీలతో బాప్ దాదా: -మహారథుల యొక్క స్పీడు అందరి కన్నా వేగంగా అనగా తీవ్రంగా ఉంది. కానీ, దానితో పాటు బ్రేకు కూడా అంతే శక్తిశాలిగా ఉండాలి. ప్రతి క్షణంలో సంకల్పం ద్వారా మొత్తం విశ్వమే కాక మూడు లోకాల చక్రమును కూడా ముందుకు తీసుకువస్తూ మూడు లోకాలు తిరగాలి మరియు స్టాప్ అనగానే పూర్తిగా బుద్ధి బిందు రూప స్థితిలో క్షణంలో స్థిరమవ్వాలి. ఇటువంటి అభ్యాసముందా? అతి విస్తారము మరియు వెంటనే స్టాప్. బ్రేకు అంత శక్తిశాలిగా ఉండాలి. స్టాప్ చేయడంలో సమయం పట్టకూడదు. స్థూలమైన మిలట్రీ వారిని వారు ఫుల్ ఫోర్స్ తో పరిగెడుతున్నప్పుడు మార్షల్ స్టాప్ అని ఆర్డర్ చేసినట్లయితే అదే క్షణంలో ఆగిపోవలసి ఉంటుంది. ఎవరైనా ఒక్క క్షణం ఆలస్యం చేసినా షూట్ చేసేస్తారు. ఏ విధంగా ఆ శారీరక అభ్యాసము ఉందో అలాగే ఇది సూక్ష్మమైన అభ్యాసము. మహారథుల పురుషార్థము యొక్క గతి తీవ్రంగా ఉండాలి మరియు బ్రేకు కూడా శక్తిశాలిగా ఉండాలి, అప్పుడే అంతిమంలో పాస్ విత్ హానర్‌గా అవుతారు. ఎందుకంటే ఆ సమయం యొక్క పరిస్థితులు బుద్దిలో సంకల్పాలను తీసుకువచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో అన్ని సంకలాల నుండి అతీతంగా ఒకే సంకల్పంలో సితులయ్యే అభ్యాసము కావాలి. పరిస్థితులు తమ వైపుకు లాగుతాయి. కానీ, అటువంటి సమయంలో బ్రేకులు శక్తిశాలిగా లేకపోతే పాసవ్వలేరు. కావున మహారథుల యొక్క అభ్యాసము విస్తారములో వ్యాపించి ఉన్న బుద్ధిని ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో స్టాప్ చేయగలిగేదిగా ఉండాలి. కావున ఆ విధంగా అభ్యాసము చేయండి. డ్రైవరు వేగంగా మోటర్‌ను నడిపే అభ్యాసము చేయించేటప్పుడు, కావాలని, ఎటువంటి దారిని తయారుచేస్తారంటే దాని ద్వారా అతడు ఎంతవరకు యాక్సిడెంటల్ నుండి దూరంగా ఉండగలడు అన్నది పరీక్షిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అటువంటి అభ్యాసము ముందే కావాలి. స్టాప్ అనగానే ఆగిపోవాలి, ఇదే అష్టరత్నాల యొక్క కానుక. ఒక్క క్షణము కూడా అటూ ఇటూ అవ్వకూడదు. కావుననే 8 మంది వెలువడతారు. అంతటి అభ్యాసము ఉందా? పూర్తిగా ఎటువంటి అనుభవజ్ఞులుగా ఉండాలంటే ఏ విధంగా స్థూలమైన చేతులు మొదలైనవి కంట్రోల్ లో ఉన్నాయో అలాగే సూక్ష్మ శక్తులైన సంకల్పాలు కంట్రోల్లో ఉండాలి. నిజానికి ఇది విస్తారమైన సంకల్పాలను కంట్రోల్ చేసే విషయం. దానినే వారు శ్వాసను కంట్రోల్ చేసే సాధనంగా తయారుచేసారు. ఇక్కడ విస్తారానికి బదులుగా ఒక్క సంకల్పంలో స్థితులవ్వవలసి ఉంటుంది కానీ వారు దానికి బదులుగా శ్వాసను కంట్రోల్ చేసే అభ్యాసమును చేస్తున్నారు. ఇప్పుడు మహారథుల స్మృతి యాత్ర యొక్క ఇటువంటి అభ్యాసము కావాలి. ఇటువంటి ఒక్క సంకల్పమును ధారణ చేసేవారు ఎక్కడ ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని స్థిరపర్చే వారిగా అవ్వాలి. 

Comments