18-03-1981 అవ్యక్త మురళి

18-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కష్టాన్ని సహజంగా చేసుకునే యుక్తి- సదా తండ్రిని చూడండి.               

ఈ రోజు విశేషించి లండన్ నివాసులతో కలియుటకు వచ్చాను. కలుసుకోవడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఎప్పటి నుండి తండ్రిని కలుసుకుంటున్నారు? అని బాప్ దాదా మీకు ఏ సూచననిచ్చారు? పిల్లలూ, మీరందరూ శ్రేష్ఠమైన ఆత్మలు. తండ్రి సమానంగా సర్వ గుణాలలో, సర్వ ప్రాప్తులలో మాస్టర్లు. తండ్రి కంటే శ్రేష్ఠమైనవారు, తండ్రికే శిరోకిరీటాలు. మొట్టమొదట లభించిన సూచన ప్రమాణంగా తండ్రి సమానంగా మాస్టర్ సర్వ శక్తివంతులుగా, మాస్టర్ సర్వ గుణసంపన్నులుగా అయ్యారా? ఇప్పుడు తండ్రి సమానంగా అయితేనే భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారి దేవతలుగా కాగలరు. తండ్రి సమానంగా ఎంతవరకు అయ్యారో చెక్ చేసుకుంటూ ఉన్నారా? ఒక్కొక్క గుణాన్ని, ఒక్కొక్క శక్తిని ఎదురుగా ఉంచుకొని ఎంత శాతం గుణాలు లేక శక్తి స్వరూపంగా అయ్యాము? అని స్వయం చెక్ చేసుకోండి. ఇలా ఫాలో చేయడం సులభమే కదా. బాప్ దాదా ఉదాహరణ మూర్తిగా ఎదురుగా ఉన్నారు. నిరాకార రూపంలో మరియు సాకార రూపంలో - రెండు రూపాలలో తండ్రిని చూస్తూ, అనుసరిస్తూ (ఫాలో చేస్తూ) పోండి. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు అనే సామెత కూడా ఉంది అంతేకాక కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు(సన్ షోస్ ఫాదర్/Son Shows Father) అని మహిమ కూడా ఉంది. తండ్రి మరియు పిల్లల సంబంధమంటేనే ఫాలో చేసే సంబంధము. కష్టమేమీ లేదు. కానీ కష్టంగా చేసుకుంటారు. ఒకవేళ కష్టమైతే అది సదా కష్టంగానే అనిపించాలి. కొందరికి సులభమనిపిస్తుంది, కొందరికి కష్టమనిపిస్తుంది. ఇలా ఎందుకు? అప్పుడప్పుడు వారికే సహజమనిపిస్తుంది, అప్పుడప్పుడు కష్టమనిపిస్తుంది. ఇలా ఎందుకు? దీని వలన ఏమి ఋజువు అవుతుంది? నడిచేవారికి ఏదో బలహీనత ఉంది అందుకే కష్టమనిపిస్తుంది.

ఇప్పటికీ తండ్రి మహిమను భక్తులు గాయనం చేస్తూ ఉన్నారు. తండ్రితో పాటు మహాన్ ఆత్మలు, పూజ్య ఆత్మలైన మీకు కూడా మహిమ ఉంది. ఆ మహిమ ఏదో జ్ఞాపకం ఉందా? ఆత్మలకు ఏదైనా కష్టము వచ్చినప్పుడు ఎవరి వద్దకు వెళ్తారు? తండ్రి వద్దకు లేక దేవాత్మలైన మీ వద్దకు వస్తారు. ఇతరుల కష్టాలను సహజంగా చేసేవారు స్వయం కష్టాన్ని ఎలా అనుభవం చేయగలరు. కష్టం అనుభవం చేసే సమయంలో విశేషించి ఏ విషయం బుద్ధిలోకి రావడం వలన అది కష్టంగా అనిపిస్తుంది? చాలా అనుభవజ్ఞులు కదా. మీరు తండ్రిని చూచుటకు బదులుగా విషయాలను చూచుటలో లగ్నమైపోతారు. మాటలలోకి వెళ్లినందున అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. తండ్రిని చూసినట్లయితే తండ్రి బిందువు కనుక ప్రతి మాటకు బిందువు పెట్టగలరు. మాటలు అంటే వృక్షము, తండ్రి అనగా బీజము. మీరు విస్తారముగా ఉన్న వృక్షాన్ని చేతిలోకి తీసుకోవాలి అనుకుంటారు. అందువలన తండ్రీ మీ చేతిలోకి రారు, వృక్షమూ మీ చేతిలోకి రాదు. తండ్రిని దూరం చేసుకుంటారు, వృక్ష విస్తారాన్ని కూడా బుద్ధిలో ఇముడ్చుకోలేరు. కనుక ఏదైతే కోరిక పెట్టుకుంటారో అది పూర్తి కాని కారణంగా వ్యాకులపడతారు, దు:ఖిస్తూ ఉంటారు. అందుకు ముఖ్యమైన గుర్తు మాటి మాటికి ఏదో ఒక పరిస్థితి గురించి లేక వ్యక్తిని గురించి ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. ఎంతగా ఫిర్యాదులు చేస్తారో అంత స్వయం చిక్కుకుపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ విస్తారము ఒక వలలాగా తయారవుతుంది. దాని నుండి బయటికి రావాలని ఎంతగా ప్రయత్నిస్తే అంతగా చిక్కుకుపోతారు. ఉంటే మాటలైనా ఉంటాయి లేక తండ్రి అయినా ఉంటారు. విషయాలు వినడం, వినిపించడం అర్ధకల్పం నుండి చేస్తూ వచ్చారు. భక్తి మార్గంలోని భాగవతం లేక రామాయణం ఏమిటి? ఎంత సుదీర్ఘమైన మాటలు. మాటలు ఉన్నప్పుడు తండ్రి లేరు. ఇప్పుడు కూడా మాటలలోకి వెళ్లినట్లయితే తండ్రిని కోల్పోతారు. అప్పుడు ఏ ఆట ఆడ్తారు? (దాగుడు మూతలాట) మూడవ నేత్రానికి గంతలు కట్టుకొని వెతుకుతూ ఉంటారు. తండ్రి పిలుస్తూ ఉంటారు, మీరు వెతుకుతూ ఉంటారు. చివరికి ఏం జరుగుతుంది? తండ్రే స్వయంగా వచ్చి తోడు ఇస్తారు. ఇలాంటి ఆట ఎందుకు ఆడుతున్నారు? ఎందుకుంటే మాటల విస్తారంలో రంగు రంగుల విషయాలు ఉంటాయి, అవి తమవైపు ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి నుండి దూరమైతే సదా సహజయోగులుగా అయిపోతారు. లండన్ నివాసులు కష్టంగా అనుభవం చేసుకోవడం లేదు కదా?

తమను తాము బిజీగా ఉంచుకునే పద్ధతిని నేర్చుకోండి. అప్పుడు సమయమూ ఉండదు, విస్తారములోకి వెళ్లరు. ఎలాగైతే ఏదైనా విశాలమైన ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు చాలా బిజీగా ఉంటారు. ఆ సమయంలో ఏం జరిగినా వాటి నుండి మీరు దూరంగా ఉంటారు. సేవ యొక్క ధ్యాసలోనే నిమగ్నమై ఉంటారు. తినాలి లేక నిద్రపోవాలనే ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి విశ్వ కళ్యాణకారి ఆత్మలు సదా విశాల కార్యం చేసేందుకు ప్లాన్‌ను ఎమర్జ్ చేయండి. తమ బుద్ధికి ఎంత విశాలమైన కార్యమివ్వాలంటే దానికి ఖాళీయే ఉండరాదు. తమ బుద్ధిని బిజీగా ఉంచుకునే డైరీ ప్రతిరోజూ తయారు చేసుకోండి. తద్వారా సదా సహజయోగాన్ని స్వతహాగానే అనుభవం చేస్తారు. సహజ రాజయోగము అని వర్ణన చేస్తారు కదా. అప్పుడప్పుడు సహజ యోగం, అప్పుడప్పుడు కష్టమైన యోగము అని అనరు కదా. పేరు ఎలా ఉంటే అదే స్వరూపంలో పిల్లలందరినీ బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. మాస్టర్ సర్వ శక్తివంతులుగా అయిన తర్వాత కూడా కష్టాన్ని అనుభవం చేస్తూ ఉంటే సహజంగా ఎప్పుడు అనుభవం చేస్తారు? ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. అందుకొరకు పరస్పరం ప్రోగ్రామ్ తయారు చేయండి. 

లండన్ పార్టీ:- ఒక్కొక్క రత్నము అతిప్రియమైనది మరియు అమూల్యమైనది. ఎందుకంటే ప్రతీ రత్నానికి తమ-తమ విశేషతలున్నాయి. సర్వుల విశేషతల ద్వారానే విశ్వకళ్యాణ కార్యం సంపన్నమతుంది. ఉదాహరణానికి ఏదైనా స్థూలమైన వస్తువును తయారు చేసినప్పుడు దానిలో అన్ని పదార్థాలు వెయ్యకపోతే సాధారణ ఉప్పు లేక తీపి వెయ్యకపోతే ఎంత మంచి వస్తువును తయారు చేసినా అది తినడానికి యోగ్యముగా ఉండదో విశ్వ పరివర్తన అనే ఇంత గొప్ప శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతీ రత్నము యొక్క అవసరముంది. అందరి వ్రేళ్లు కావాలి. చిత్రంలో కూడా అందరి వ్రేళ్లు చూపిస్తారు కదా. కేవలం మహారథులదే కాదు. అందరి వ్రేళ్ల సహకారంతోనే విశ్వ పరివర్తన కార్యం సంపన్నంగా అవుతుంది. అందరూ తమ తమ రీతిలో తమ తమ సేవలో మహారథులే.  బాప్ దాదా కూడా ఒంటరిగా ఏదీ చేయలేరు. బాప్ దాదా పిల్లలను ముందుంచుతారు. నిమిత్తమైన ఆత్మలు కూడా అందరినీ ముందుంచుతారు. కావున అందరూ చాలా చాలా అవసరమైన శ్రేష్ఠ రత్నాలు. బాప్ దాదా స్వీకరించిన రత్నాలు. భగవంతుని దృష్టి రాతిపై పడినా రాయి కూడా బంగారంగా అవుతుందని స్మృతిచిహ్నంగా చూపిస్తారు. మీరు ఈశ్వరుడు స్వీకరించిన శ్రేష్ఠ రత్నాలు. తమ కార్యం యొక్క శ్రేష్ఠతను, విలువను తెలుసుకోండి. శక్తులకు మరియు పాండవులకు ఎవరి మహిమ వారికుంది. కనుక మీరందరూ మహాన్ ఆత్మలు. మహాన్ ఆత్మల గుర్తులు ఏమిటి? ఎవరు ఎంత మహాన్ గా ఉంటారో, అంత నిరహంకారిగా ఉంటారు. మహాన్ ఆత్మలు సదా తమను వినమ్రమైన సేవాధారులుగానే అనుభవం చేస్తారు. మీది ఇలాంటి గ్రూపే కదా! శక్తి భవనము యొక్క శక్తులకు తమ శక్తి స్వరూపం స్వతహాగానే జ్ఞాపకం ఉంటుందా? స్థానం ద్వారా స్థితి కూడా జ్ఞాపకం వస్తుంది. శక్తుల విశేషత మాయాజీతులుగా అగుట, శక్తుల ముందుకు ఏ విధమైన మాయ రాజాలదు. ఎందుకంటే శక్తి మాయపై సవారీ చేస్తుంది. శక్తుల చేతిలో సదా త్రిశూలం చూపిస్తారు. ఇది దేనికి గుర్తు? త్రిశూలము స్థితికి గుర్తు. సంగమ యుగం యొక్క టైటిల్స్ - మాస్టర్ త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకీనాథులు. ఈ స్థితులన్నిటికి గుర్తుగా త్రిశూలాన్ని చూపిస్తారు. కావున ఈ స్థితి మీకు స్మృతిలో ఉంటుందా? నిరంతరం అనే దానిని అండర్‌లైన్ చేయండి. విశ్వం యొక్క వాయుమండలం నుండి దూరంగా ఉంటూ చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లల భాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు.

2) సదా తమను పూజ్య ఆత్మలుగా భావించి నడుస్తున్నారా? పూజ్య ఆత్మలు అనగా మహాన్ ఆత్మలు. తయారయ్యే విశేషత అనగా సదా స్వయాన్ని అతిథిగా( మెహమాన్‌గా) భావించి నడుచుకొనుట. ఎవరైతే అతిథిగా భావించి నడుస్తారో వారే మహన్ పూజనీయులుగా అవుతారు. ఎందుకు? ఎందుకంటే త్యాగానికి భాగ్యం తయారవుతుంది. అతిథిగా భావిస్తే తమ దేహమనే ఇంటితో కూడా నిర్మోహులైపోతారు. అతిథికి తనదంటూ ఏదీ ఉండదు. అన్నీ ఉంటాయి కూడా కానీ నాది అనేది ఉండదు. కార్యంలో అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అనే భావన ఉండదు. అందువలన అతీతంగా కూడా ఉంటారు మరియు అన్ని వస్తువులను కార్యంలోకి తీసుకువచ్చే ప్రియంగా కూడా ఉంటారు. ఇలా అతిథిగా భావించేవారు ప్రవృత్తిలో ఉంటూ సేవా సాధనాలను తమవిగా చేసుకొని సదా అతీతంగా, తండ్రికి ప్రియంగా ఉంటారు. ఇలాంటి మహాత్మలుగా ఉన్నారు కదా? అతిథిగా భావిస్తున్నారా? ఈ రోజు ఇక్కడున్నారు, రేపు మీ ఇంటికి వెళ్తారు. మరలా మీ రాజ్యంలోకి వస్తారు ఇదే ధ్యాస ఉంది కదా. అందువలన సదా దేహంతో అతీతంగా ఉంటారు. దేహంతో అతీతంగా అయినప్పుడు దేహ సంబంధాలతో, వైభవాలతో అతీతమయ్యే ఉంటారు. ఈ అతీత స్థితి ఎంత ప్రియమైనది! ఇప్పుడిప్పుడే కార్యంలోకి వస్తారు, ఇప్పుడిప్పుడే అతీతంగా ఉంటారు ఇటువంటి అనుభవం ఉంది కదా. తమ జడ చిత్రాలను పూజ్య రూపంలో, మందిరాలలో పెడతారు. కానీ భక్తిలో కూడా సంగమ యుగపు అతీత స్థితి(ఉపరాం స్థితి) పరంపరగా నడుస్తూ వస్తుంది. మందిరం లక్ష్మీనారాయణులది కానీ లక్ష్మీనారాయణులు మందిరాన్ని తమదిగా భావిస్తారా? అతీతంగా ఉంటారు కదా. పూజ్యనీయంగా అయ్యే జడ చిత్రాలలో కూడా నాది అనేది లేదు. కనుక చైతన్య పూజ్య ఆత్మలలో కూడా సదా అతిథిని అనే వృత్తి ఉండాలి. ఎంత అతిథి భావము ఉంటుందో, అంత ప్రవృత్తి శ్రేష్ఠంగా వురియు స్థితి ఉన్నతంగా ఉంటుంది. లండన్ నివాసులని పేరుకు మాత్రమే పిలుస్తారు. కానీ అందరూ అతిథులే. ఈ రోజు ఇక్కడున్నారు, రేపు అక్కడుంటారు. ఈ రోజు, రేపు అనే ఈ రెండు శబ్దాలలో మొత్తం చక్రమంతా స్మృతిలోకి వచ్చేస్తుంది. ఇలాంటి మహాన్ ఆత్మలుగా, పూజ్యులుగా ఉన్నారు కదా. లండన్ నివాసుల నిశ్చయము మరియు ఉత్సాహము చాలా మంచిగా ఉన్నాయి. బలహీన ఆత్మలు కాదు. విఘ్నాలు వచ్చాయంటే వాటిని దాటేస్తారు. మేకలుగా కాదు అందరూ సింహాలుగా ఉన్నారు. మేకతనము అనగా నేను - నేను (మై - మై) అనేది సమాప్తమైపోతుంది. శక్తి సైన్యం యొక్క జెండా చాలా ప్రసిద్ధి చెందింది. ఒక్కొక్క శక్తి సర్వ శక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసేది. శక్తి సైన్యం మైదానంలోకి వచ్చినప్పుడు జయ జయ కారాలు మ్రోగుతాయి. మొదట జై జై అనే నినాదం ఎక్కడ మ్రోగుతుంది? లండన్లోనా లేక అమెరికాలోనా? బాప్ దాదా సదా స్నేహీ పిల్లలకు అమృతవేళ శుభాకాంక్షలు తెలుపుతారు. "ఓహో నా పిల్లలు ఓహో” అని పాట పాడతారు. పాట వినిపిస్తూ ఉందా? 

టీచర్లతో :- వీరు లండన్ సేవకు శృంగారము. లండన్ మ్యూజియంలో రాణి అలంకారాలు ఉంచారు కదా. అలాగే బాప్ దాదా మ్యూజియమ్ లో కూడా బాప్ దాదా సేవకు అలంకారాలైన మీరున్నారు. సదా మహాన్ మరియు సదా నిరహంకారులు. ఈ విశేషత స్వయాన్ని కూడా మహాన్‌గా తయారు చేస్తుంది మరియు సేవను కూడా మహాన్ గా తయారుచేస్తుంది. సంస్కారాలను కలుపుకోవడంలో తెలివిగలవారిగా ఉన్నారు కదా? స్థూలంగా ఎవరైనా కాళ్ళు, చేతులు కదిలించలేకపోతే వారి పక్కనున్నవారు ఏం చేస్తారు? చేతిలోకి చెయ్యి తీసుకొని తోడును ఇచ్చి వారికి నేర్పిస్తారు. మరి మీరు కూడా ఏం చేస్తారు? ముందుకు వెళ్తూ సహయోగిగా అయ్యి సహయోగమనే చేతినిచ్చి సంస్కారాల మిలనమనే డ్యాన్స్ నేర్పిస్తారు కదా. ఇందులో నంబర్ వన్‌గా ఉన్నారు కదా. ఈ విశేషత ఆధారంతో అందరికంటే ఎక్కువగా సంస్కారాలను కలుపుకునే డ్యాన్స్ చేస్తారు. తండ్రికి సహయోగిగా అవుతారు. వారే మొదటి జన్మలో శ్రీ కృష్ణుడితో పాటు చేతులు కలిపి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేయాలి కదా? సంస్కారాల రాసను కలుపుకోవడానికి అన్నింటికంటే సహజమైన పద్ధతి - స్వయం నమ్రచిత్తులై ఇతరులకు శ్రేష్ఠమైన సీటును ఇవ్వండి. వారిని సీటు పైన కూర్చోపెడితే వారు స్వతహాగానే దిగి మిమ్ములను కూర్చోబెడతారు కానీ మీరే కూర్చోవాలని ప్రయత్నిస్తే వారు కూర్చోనివ్వరు. కానీ మీరు వారిని కూర్చోబెడితే వారు తమంతట తామే దిగి మిమ్ములను కూర్చోబెడతారు. కావున కూర్చోబెట్టడమే కూర్చోవడం అవుతుంది. "మొదట మీరు" అనే పాఠం పక్కా చేసుకోండి తర్వాత సంస్కారాలు సహజంగానే కలుస్తాయి. సీటు కూడా లభిస్తుంది. రాస్ కూడా జరుగుతుంది అంతేకాక భవిష్యత్తులో రాస్ చేసే ఛాన్స్ లభిస్తుంది. కనుక ఎంత సహజమైన విషయము!

ఇది లండన్ వారి సత్యమైన సేవాధారి గ్రూప్. సేవాధారీ అను శబ్దమే చాలా మధురమైనది. టీచర్ అనే శబ్ధం మంచిగా అనిపిస్తుందా లేక సేవాధారి అనే శబ్దం మంచిగా అనిపిస్తుందా? తండ్రి కూడా స్వయాన్ని విధేయత గల సేవాధారిని అని అంటారు. సేవాధారి అన్నట్లయితే స్వతహాగానే కిరీటధారిగా అవుతారు. నేర్పరిగా కావడానికి ఇదొక పద్ధతి. కష్టం లేదు, ప్రాప్తి ఎక్కువ. చతురుడైన తండ్రికి చతురులైన పిల్లలుగా కండి.

ఫ్రాన్స్ :- స్మృతియాత్రలో సదా నడుస్తూ ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన జమా చేసుకుంటున్నారా? ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన జమ చేసుకునేవారు ఎంత సంపన్నంగా ఉంటారు! ఇలాంటి సంపన్న ఆత్మలుగా తమను అనుభవం చేసుకుంటున్నారా? తరగని ఖజానా లభించిందా? ఖజానాకు తాళం చెవి లభించింది కదా? తాళం చెవి పెట్టడం వస్తుందా? అప్పుడప్పుడు తాళం చెవి పెడుతూ అందులోనే ఇరుక్కుపోవడం లేదు కదా? చాలా సహజమైన తాళంచెవి - "నేను అధికారిని". అధికారిననే స్మృతియే ఖజానాకు తాళం చెవి. ఈ తాళంచెవి పెట్టడం వస్తుందా? ఈ తాళం చెవితో ఏ ఖజానా, ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. సుఖం కావాలన్నా, శాంతి కావాలన్నా, ప్రేమ కావాలన్నా అన్నీ లభిస్తాయి. 

ప్రశ్న:- ఎలాంటి భారం తక్కువ చేసుకుంటే ఆత్మ శక్తిశాలిగా తయారవుతుంది? 
సమా:- ఆత్మపై వ్యర్థమనే భారం ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్ధ కర్మలు వీటితో ఆత్మ భారంగా అవుతుంది. ఇప్పుడీ భారాన్ని సమాప్తము చెయ్యండి. ఈ భారాన్ని సమాప్తము చేయుటకు సదా సేవలో బిజీగా ఉండండి. మనన శక్తిని పెంచండి. మనన శక్తితో ఆత్మ శక్తిశాలిగా అవుతంది. ఎలాగైతే భోజనం జీర్ణము చేసుకుంటే రక్తంగా తయారై అది మరలా శక్తిగా పని చేస్తుందో అలా మననం చేయుట వలన ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. 

ప్రశ్న :- ఏ మంత్రము భక్తిలో చాలా ప్రసిద్ధి చెందింది? అది స్మృతిలో ఉంటే సంతోషం అనే ఊయలలో ఊగుతుంటారు? 
సమా:- భక్తిలో హమ్ సో, సో హమ్ అనే మంత్రం చాలా ప్రసిద్ధమైనది. పిల్లలైన మీరిప్పుడు హమ్ సో యొక్క రహస్యాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేస్తున్నారు. ఈ మంత్రం మనలను గురించే ఉంది. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. దేవతలుగా ఉండే మనమే బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది ఇప్పుడే తెలుసుకున్నాము. ఇప్పుడు దేవతల చిత్రాలను చూసి ఇవి మన చిత్రాలే అని బుద్ధిలోకి వస్తుంది. ఇదే అద్భుతం. ఇది స్మృతిలో ఉంటే సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. 

Comments