16-11-1981 అవ్యక్త మురళి

* 16-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విజయమాలలో నెంబర్ యొక్క ఆధారము.

ఈ రోజు బాప్ దాదా తమ చాలాకాలం తర్వాత కలిసిన శ్రేష్ఠ ఆత్మలను మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇదే సమయంలో, ఇదే రూపంలో ఎన్నిసార్లు కలుసుకున్నారో మీకు గుర్తుస్తోందా? అనేకసార్లు జరిగిన మిలనము యొక్క స్మృతి స్పష్టరూపంలో అనుభవంలోకి వస్తోందా? జ్ఞానం యొక్క ఆధారంపై, చక్రం యొక్క ఆధారంపై అర్థం చేసుకుంటున్నారా లేక అనుభవం చేసుకుంటున్నారా? ఎంత స్పష్టంగా అనుభవమవుతుందో అంతే శ్రేష్ఠంగా, సమీప ఆత్మగా ఉంటారు, వర్తమాన సర్వప్రాప్తులకు మరియు భవిష్య శ్రేష్ఠ ప్రారబ్దానికి అధికారీ ఆత్మలుగా అవుతారు. ఇదే అనుభవం యొక్క ఆధారంపై ఆత్మనైన నాకు విజయమాలలో ఏ నెంబర్ ఉంది అని మీకు మీరుగా తెలుసుకోగల్గుతారు. వర్తమాన సమయంలో బాప్ దాదా కూడా పిల్లల యొక్క పురుషార్థము మరియు ప్రాప్తి యొక్క ఆధారంపై నెంబర్ వారీగా స్మృతి చేస్తారు. మాల మరియు స్మృతిచిహ్న రూపమైన వైజయంతి మాల ఈ రెండు మాలలలోనూ నా నెంబర్ ఏమిటి అన్నది తెలుసుకోగలరా? మీ నెంబర్‌ను స్వయమే తెలుసుకోగలరా లేక బాప్ దాదా వినిపించాలి అని అంటారా? బాప్ దాదాకైతే అది తెలుసు, కాని మీకు కూడా అది తప్పకుండా తెలుసు. బయటనుండి వర్ణన చేసినా, చేయకపోయినా లోపలి నుండి అయితే మీకు తెలుసు కదా! అవునంటారా లేక కాదంటారా? బాప్ దాదా ఇప్పుడు మాలను తయారుచేస్తే మీరు మీ నెంబర్ ను ఇవ్వలేరా? సంకోచానికి వశమై వినిపించకపోవడమనేది వేరే విషయం, తెలియకపోతే ఏమంటారు? నిశ్చయము మరియు నషాతో మాకు మా 84 జన్మల యొక్క జీవన గాథను గూర్చి తెలుసు అని ఇతరులతో ఛాలెంజ్ చేస్తారు. అందరూ ఇలా అంటారు కదా! మరి 84 జన్మలలో ఈ వర్తమాన జన్మ అయితే అన్నిటికన్నా శ్రేష్ఠమైనది కదా! మీరు దీనిని తెలుసుకోలేరా? నేను ఎవరు? అనే ఈ చిక్కు ప్రశ్ననైతే బాగా తెలుసుకున్నారు కదా! మరి ఇది కూడా ఏమిటి? నేను ఎవరు అనే చిక్కు ప్రశ్న. దీన్ని తెలుసుకునే లెక్క చాలా సహజము.

1. స్మృతి యొక్క మాల - ఎంత స్నేహముతో మరియు ఎంత సమయము మీరు తండ్రిని స్మృతి చేస్తారో అదే స్నేహముతో బాబా కూడా స్మృతి చేస్తారు. మరి మీరు మీ నెంబర్‌ను తీయగలరా? స్మృతి సగమే ఉంటూ మరియు స్నేహము కూడా 50 శాతము లేక 75 శాతమే ఉన్నట్లయితే అదే ఆధారంతో ఆలోచిస్తే 50 శాతము స్నేహము మరియు సగం సమయం స్మృతి ఉన్నట్లయితే మాలలో కూడా సగం మాల సమాప్తమైన తర్వాత వస్తారు. స్మృతి నిరంతరంగా మరియు స్నేహం సంపూర్ణంగా ఉన్నట్లయితే బాబా తప్ప ఇంకెవరూ గుర్తుకు రారు. గుర్తుకు రాకుండా ఉంటే, సదా బాబా మరియు మీరు కంబైండ్ గా ఉన్నట్లయితే మాలలో కూడా కంబైండ్ మణులతో పాటు మీరు కూడా కంబైండ్ గా ఉంటారు. అనగా కలిసి ఉంటారు. సదా అన్ని విషయాలలోనూ నెంబర్ వన్‌గా ఉంటారు. అలాగే మాలలో కూడా నెంబర్ వన్‌గా ఉంటారు. ఏ విధంగా లౌకిక చదువులో ఫస్ట్ డివిజన్, సెకండ్, థర్డ్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మహారథులు, గుర్రపు స్వారి మరియు కాల్బలం వారు అంటూ మూడు డివిజన్లు ఉంటాయి.

ఫస్ట్ డివిజన్ వారు సదా ఫాస్ట్ గా అనగా పైకి ఎక్కే కళ గలవారిగా ఉంటారు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలోనూ బాబా తోడు యొక్క, సహయోగము యొక్క, స్నేహం యొక్క అనుభవమును కలిగి ఉంటారు. సదా బాబా తోడు మరియు చేతిలో చేయి యొక్క అనుభూతిని పొందుతారు. సహయోగం ఇవ్వండి అని అనరు. సదా స్వయమును సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. 

సెకండ్ డివిజన్ వారు పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటారు కాని ఎగిరే కళను అనుభవం చేసుకోరు. పైకి ఎక్కే కళలో వచ్చే విఘ్నాలను దాటడంలో కాసేపు ఎక్కువ, కాసేపు తక్కువ సమయం పడుతుంది. కాని ఎగిరే కళలోనివారు వాటిని సహజంగా పై నుండి దాటి వెళ్ళిపోయిన కారణంగా ఎటువంటి విఘ్నము రానట్లుగానే అనుభవం చేసుకుంటారు. విఘ్నమును విఘ్నముగా కాక సైడ్ సీన్ గా, దారిలోని పక్క దృశ్యాలుగా భావిస్తారు. కాని కేవలం ఎక్కే కళలో ఉన్నవారు మధ్యలో ఆగుతారు, ఇది విఘ్నము అని అనుభవం చేసుకుంటారు. కావుననే కాస్తంత అంతమాత్రంగా అప్పుడప్పుడూ దాటి వెళ్ళడంలో అలసట లేక నిరుత్సాహపడడము అనుభవం చేసుకుంటారు.

మూడవ డివిజన్ - దీని గూర్చి అయితే మీరు తెలుసుకునే ఉంటారు. ఆగడము, నడవడము మరియు అరవడము. కాసేపు నడుస్తారు, కాసేపు అరుస్తారు. స్మృతి చేయడంలో కష్టపడతారు. ఎందుకంటే సదా కంబైండ్ గా ఉండరు. సర్వ సంబంధాలను నిర్వర్తించే ప్రయత్నంలో ఉంటారు. పురుషార్థంలోనే సదా నిమగ్నమై ఉంటారు. వీరు ప్రయత్నంలో ఉంటారు మరియు వారు ప్రాప్తిలో ఉంటారు.

కావున దీని ద్వారా నా నెంబర్ ఏమిటి అన్నది అర్థం చేసుకోండి. మాల యొక్క ఆదిలో ఉన్నట్లయితే ఫస్ట్ డివిజన్లో ఉన్నట్లు, మాల మధ్యలో ఉన్నట్లయితే సెకండ్ డివిజన్లో ఉన్నట్లు, మాలలో అంతిమంలో అనగా థర్డ్ డివిజన్లో ఉన్నట్లు. ఎందులో ఉన్నారు? కావున స్మృతి మరియు విజయం రెండింటి యొక్క ఆధారంపై మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. కావున తెలుసుకోవడం సహజమా లేక కష్టమా? మరి ప్రతి ఒక్కరూ ఏ నెంబర్ వారు? ఇవి చూడగలరు కదా?

బాప్ దాదా సదా అమృతవేళ నుండే పిల్లల యొక్క మాలను స్మరణ చేయడం ప్రారంభిస్తారు. ప్రతి రత్నము యొక్క లేక మణి యొక్క విశేషతను వారు చూస్తారు. కావున అమృతవేళ సహజంగానే మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోవచ్చు. స్మృతి యొక్క శక్తితో, సంబంధం యొక్క శక్తితో బాప్ దాదా నన్ను ఏ నెంబర్ లో స్మరిస్తున్నారు అని స్పష్టంగా చూడగలరు. అందుకోసం విశేషమైన విషయం - బుద్ధి యొక్క లైను చాలా క్లియర్‌గా ఉండాలి. లేకపోతే స్పష్టంగా చూడలేరు, అచ్ఛా, మరి నేను ఎవరు అన్నది అర్థం చేసుకున్నారా?

ఇప్పుడు సమయం యొక్క సామీప్యత కారణంగా స్వయాన్ని బాబా సమానంగా చేసుకోండి, అనగా సమానత ద్వారా సామీప్యతలోకి తీసుకురండి. సంకల్పాలలో, మాటలలో, కర్మలలో సంస్కారాలు మరియు సేవలలో అన్నింటిలోనూ బాబా సమానంగా అవ్వడము అనగా సమీపంగా రావడము. వెనుకవచ్చేవారైనా లేక మొదటవచ్చేవారైనా సమానత ద్వారా సమీపంగా రాగల్గుతారు. ఇప్పుడు అందరికీ అవకాశముంది. ఇప్పుడు సీట్ ఫిక్స్ అవ్వడమనే ఈల వేయబడలేదు. కావున మీరు ఏమవ్వాలనుకుంటే అది అవ్వవచ్చు. 'టూ లేట్' యొక్క బోర్డ్ ఇంకా పెట్టబడలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మహారాష్ట్ర మరియు మధ్య ప్రదేశ్ ఇరువురూ ఉన్నారు కదా! మహారాష్ట్ర పేరులోనే మహాన్ అని ఉంది, కావున మహాన్ గానే అయ్యింది కదా! మధ్య ప్రదేశ్ యొక్క విశేషత ఏమిటో మీకు తెలుసా? సేవ యొక్క ఆదిలో బాప్ దాదా యొక్క మొదటి దృష్టి మధ్య ప్రదేశ్ వైపుకు వెళ్ళింది. పిల్లలను కూడా పంపించారు. మరి సేవ యొక్క క్షేత్రంలో మొదటి దృష్టి మధ్యప్రదేశ్ వైపుకు వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ యొక్క సేవలో మరియు సేవ యొక్క ప్రత్యక్ష ఫలమును పొందడంలో మొదటి నెంబరే అవుతుంది కదా! ఎందుకంటే దానిపై బాప్ దాదా యొక్క విశేష దృష్టి ఉంది. ఎవరిపైనైతే దృష్టి పడిందో వారు నెంబర్ వన్‌గా, దృష్టితో అతీతంగా అయిపోయారు కదా! కావున ఇరువురూ మహానులే.

మహారాష్ట్రలో బాప్ దాదా యొక్క సాకార చరణాలు పడ్డాయి. చరిత్ర భూమిగా కూడా మహారాష్ట్రను తయారుచేశారు. మరి మహారాష్ట్ర ఏం చేస్తుంది? మహారాష్ట్ర అయితే డబల్ ఫలమును ఇవ్వవలసి ఉంటుంది. ఏ డబల్ ఫలమును ఇస్తారు? చూడండి. ఏ ఫలమును ఇవ్వాలో ముందు టచ్ అవుతుందా? టచ్ అవ్వకపోతే మహారాష్ట్ర కన్నా మధ్య ప్రదేశ్ నెంబర్ వన్ అయిపోతుంది.

ఒకరేమో - వారసులు, ఇంకొకరు - వి.ఐ.పి.లు. కావున వారసులనూ వెలికి తీయాలి మరియు వి.ఐ.పి.లనూ తీయాలి. ఇది డబల్ ఫలము. కొన్నిచోట్ల వి. ఐ.పి.లను వెలికితీస్తారు. కొన్నిచోట్ల వారసులను తీసారు కాని మీరు ఇరువురినీ తయారుచేయాలి. వారసులూ ప్రసిద్ధమైనవారై ఉండాలి. అలాగే వి.ఐ.పి.లు కూడా ప్రసిద్ధమైనవారై ఉండాలి. మరి ఇందులో ఎవరు నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుంటారు? ఫారిన్ వారు తీసుకుంటారా, మహారాష్ట్రవారు తీసుకుంటారా లేక మధ్యప్రదేశ్ వారు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? వేరే వారు కూడా తీసుకోవచ్చు. కాని ఈ రోజు వీరు ముందు కూర్చున్నారు. అచ్చా మరేం విన్నారు? ఎవరు లేస్తే వారే అర్జునులవుతారు అన్న గాయనముంది కదా! ఇందులో ఎవరు కావాలనుకుంటే వారు ముందుకు వెళ్ళవచ్చు. అప్పుడే నెంబర్ ఇంకా అవుట్ అవ్వలేదు, కావున ఎవరెవరు నిమిత్తంగా అయి నెంబర్ వన్గా రావాలనుకుంటే వారు రావచ్చు. ఏం చేయాలో అర్ధమైందా? దాని సాధనము కూడా వినిపించారు - ఎగిరే కళ. ఎక్కే కళ కాదు, ఎగిరే కళ. అందుకొరకు సదా డబల్ లైట్ గా ఉండండి. ఇదైతే మీకు తెలుసు కదా! మీకైతే అన్నీ తెలుసు, కాని ఇప్పుడు ఇక స్వరూపంలోకి, అనుభవంలోకి తీసుకురండి, అచ్చా!

ఈ విధంగా సదా బాబా తోడుగా, ప్రతి సంకల్పము, వాక్కు మరియు కర్మలో బాబా సమానంగా అనగా బాబాకు సమీప రత్నాలుగా ఉండేవారికి, సదా స్వరూపులకు మరియు సఫలతా స్వరూపులకు, విజయమాలలోని సమీప రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:-

1. మహావీరులైన పిల్లల యొక్క వాహనము - శ్రేష్ఠస్థితి, మరియు అలంకారము - సర్వశక్తులు.

అందరూ స్వయాన్ని మహావీరులుగా భావిస్తున్నారు కదా? మహావీరులు అనగా సదా శస్త్రధారులు. శక్తులను లేక పాండవులను సదా వాహనంపై చూపిస్తారు మరియు వారితో శస్త్రాలను కూడా చూపిస్తారు. శస్త్రాలు అనగా అలంకారాలు. కావున మీరు వాహనదారులు మరియు అలంకారధారులు కూడా, శ్రేష్ఠస్థితియే వాహనము మరియు సర్వశక్తులు అలంకారాలు. ఇటువంటి వాహనదారులు మరియు అలంకారధారులే సాక్షాత్కారమూర్తులుగా అవ్వగల్గుతారు. కావున సాక్షాత్తుగా అయి అందరికీ బాబా యొక్క సాక్షాత్కారమును కలిగించడమే మహావీరులైన పిల్లల యొక్క కర్తవ్యము.

మహావీరులు అనగా సదా ఎగిరేవారు. కావున అందరూ ఎగిరేవారు అనగా ఎగిరే కళలో ఉండేవారే కదా! ఇప్పుడిక ఎక్కే కళ కూడా సమాప్తమైపోయింది, జంప్ చేయడం కూడా సమాప్తమైపోయింది. ఇప్పుడిక ఎగరాలి. ఎగరాలి మరియు చేరుకోవాలి. ఎగిరే కళలోకి వెళ్ళడం ద్వారా మిగిలిన విషయాలన్నీ క్రిందే ఉండిపోతాయి. క్రింద ఉండిపోయే వస్తువులను, పరిస్థితులను, వ్యక్తులను దాటవలసిన అవసరముండదు. ఎగిరిపోతూ ఉంటే నదులు, కాలువలు, పర్వతాలు, వృక్షాలు అన్నింటినీ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పర్వతం కూడా ఒక బంతిలా కనిపిస్తుంది. ఎగిరే కళలోనివారికి పరిస్థితులు కూడా బొమ్మలవంటివి. పైకి వెళ్ళినట్లయితే ఇంత పెద్ద పెద్ద దేశాలు, ఊర్లు అన్నీ ఎలా కనిపిస్తాయి? బొమ్మల్లా కనిపిస్తాయి కదా! మోడల్స్ లాగా కనిపిస్తాయి. కావున ఇక్కడ కూడా ఎగిరే కళలో ఉండేవారికి ఎటువంటి పరిస్థితి అయినా లేక విఘ్నమైనా ఆటలా లేక బొమ్మలా చీమ సమానంగా ఉంటుంది. ఆ చీమ కూడా చచ్చిన చీమే, ప్రాణమున్నది కాదు. అప్పుడప్పుడూ బ్రతికున్న చీమలు కూడా మహావీరులను సైతం పడేస్తాయి, కావున ఆ చీమ కూడా చచ్చిన చీమే. పర్వతాలు కూడా ఇసుక రేణువుల్లా కాక దూది సమానంగా ఉంటాయి. మరి మీరు అటువంటి మహావీరులే కదా!

2. మాయాజీతులుగా అవ్వడంతో పాటు ప్రకృతిజీతులుగా కూడా అవ్వండి, ఏమంటారు? సదా మాయాజీతులుగా మరియు ప్రకృతీజీతులుగా ఉన్నారా? మాయాజీతులుగా అయితే అవుతున్నారు కాని ప్రకృతీజీతులుగా కూడా అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి యొక్క అలజడి ఎంతగానో జరగనున్నది కదా! అలజడిలో కూడా అచలంగా ఉండండి. అలా అచలంగా అయ్యారా? కాసేపు సముద్ర జలము తన ప్రభావాన్ని చూపితే, కాసేపు ధరణి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రకృతిజీతులుగా ఉన్నట్లయితే ప్రకృతి యొక్క ఏ అలజడి మిమ్మల్ని కదిలించజాలదు. సదా సాక్షిగా అయి అన్ని ఆటలనూ చూస్తూ ఉంటారు. ఫరిస్తాలను సదా ఉన్నతమైన పర్వతాలపై చూపిస్తారు. అలా ఫరిస్తాలైన మీరు సదా ఉన్నతమైన స్థితిలో అనగా పర్వతంపై ఉండేవారు. ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారా? ఎంతగా ఉన్నతంగా ఉంటారో అంతగా అలజడి నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్వతాల పైకి వచ్చినప్పుడు క్రింద ఉన్న అలజడి నుండి స్వతహాగానే అతీతంగా ఉన్నారు కదా! నగరాలలో ఎంతటి అలజడి మరియు ఇక్కడ ఎంతటి శాంతి! స్థూలమైన స్థానములోను తేడా ఉన్నప్పుడు మరి ఉన్నతమైన స్థితి మరియు సాధారణమైన స్థితిలో కూడా ఎంతగా రాత్రికీ, పగలుకీ ఉన్నంత తేడా ఉంటుంది!

Comments