16-06-1977 అవ్యక్త మురళి

* 16-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"ఒకే చదువు ద్వారా నెంబర్ వారీగా పూజ్య పదవిని పొందడంలోని గుహ్య రహస్యము."

ఈరోజు బాప్ దాదా ప్రతి ఆత్మ యొక్క పురుషార్ధము యొక్క కర్మల గతిని మరియు పురుషార్ధానుసారముగా పొందే రాజ్య పదవి లేక పూజ్య పదవి యొక్క గతులు ఏవైతే రమణీయముగా మరియు గుహ్యముగా ఉన్నాయో వాటిని చూస్తున్నారు. ఏ విధంగా పురుషార్ధంలో నెంబర్ వారీగా ఉన్నారో అలాగే పదవి మరియు పూజ్య పదవిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరైతే నెంబర్ వన్ శ్రేష్ఠ పురుషార్థులుగా ఉన్నారో వారి యొక్క రాజ్య పదవి మరియు పూజ్యపదవి అతి శ్రేష్ఠముగా మరియు గుహ్యమైన రహస్యములతో నిండినవిగా ఉన్నాయి. పూజ్యులుగా అందరూ అవుతారు. ఈ సృష్టి అంతటికీ పురుషార్థీ ఆత్మలందరూ పరమపూజ్యులే. అష్టరత్నాలైనా, 108 యొక్క మాల అయినా లేక 16 వేల మాల అయినా లేక 9 లక్షల ప్రజాపదవిని పొందే ఆత్మలైనా గానీ అందరూ ఏదో ఒక రూపంలో తప్పకుండా పూజ్యులుగా అవుతారు. ఇప్పటివరకు కూడా అనేకమైన, లెక్కలేనన్ని శాలిగ్రామాలను తయారుచేసి పూజిస్తూ ఉంటారు కానీ అనేక శాలిగ్రామాల రూపంలోని పూజకు మరియు విశేషమైన ఇష్టదేవతల యొక్క మందిర రూపంలోని పూజకు ఎంత తేడా ఉంటుంది! దానిని గూర్చి మీకు తెలుసు కదా! శాలిగ్రామ రూపంలో అనేకుల యొక్క పూజ జరుగుతుంది మరియు అష్టదేవతల యొక్క రూపంలో ఎంతో ప్రసిద్ధమైన కొందరు ఆత్మల యొక్క పూజ జరుగుతుంది. 16 వేల యొక్క మాలను కూడా అప్పుడప్పుడూ స్మరిస్తూ ఉంటారు. 108 యొక్క మాలను అనేకమార్లు స్మరిస్తూ ఉంటారు మరియు అష్టరత్నాలను లేక అష్టదేవతలను బాబా సమానముగా సదా తమ హృదయంలో గుర్తుంచుకుంటారు. ఇంత తేడా ఎందుకు ఉంది? బాప్ దాదా పిల్లలందరికీ ఒకే చదువును, ఒకే లక్ష్యమును మనుష్యుల నుండి దేవతలుగా లేక విజయీ రత్నాలుగా అవ్వాలి అని ఇస్తారు. అయినా కానీ పూజలో ఇంత తేడా ఎందుకు ఉంది? కొందరికి డబల్ పూజ అనగా శాలిగ్రామ రూపంలోనూ మరియు దేవీ దేవతల యొక్క రూపంలోనూ కూడా జరుగుతుంది. కొందరికి కేవలం శాలిగ్రామ రూపంలో మాలలోని మణుల యొక్క రూపంలో పూజ జరుగుతుంది. దీనికి కూడా రహస్యమేమిటి? ఆత్మాభిమానులుగా అయ్యే లక్ష్యముతో ఆత్మిక స్వరూపములో స్థితులయ్యేందుకు ప్రతి బ్రాహ్మణ ఆత్మ పురుషార్ధం చేస్తుంది. ఆత్మాభిమానిగా తయారయ్యే పురుషార్ధమును చేయని బ్రాహ్మణ ఆత్మ ఎవరూ ఉండరు కానీ నిరంతర ఆత్మాభిమానులుగా, కర్మేంద్రియాలపై విజయమును పొందే విధముగా ప్రతి కర్మేంద్రియము సతో ప్రధానముగా, స్వచ్చముగా అయిపోయే విధముగా చేయవలసిన పురుషార్ధము యొక్క సబ్జెక్టులో అనగా దేహము యొక్క పురాతన సంస్కారాలు మరియు సంబంధముల నుండి సంపూర్ణ మరజీవాలుగా అయ్యే పురుషార్దములో నెంబర్‌వారీగా అవుతారు. కొందరు పురుషార్థులకు కర్మేంద్రియాలపై విజయం లభిస్తుంది. అనగా ఇంద్రియజీతులుగా అయిపోతారు మరియు కొందరు కనుల యొక్క మోసంలో, నోటి ద్వారా అనేక రసాలను ఆస్వాదించే మోసములో, ఇదే విధముగా ఏదో ఒక కర్మేంద్రియము యొక్క మోసములోకి వచ్చేస్తారు. అనగా సంపూర్ణ నిర్వికారులుగా సర్వేంద్రియ జీతులుగా అవ్వలేకపోతారు. ఈ కారణముగానే ఈ విధముగా కర్మేంద్రియాలతో ఓడిపోయే బలహీన పురుషార్థులకు, ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలుగా అయిన కారణముగా, ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క సాంగత్యము కారణముగా, చదువు మరియు పాలన యొక్క కారణముగా విశ్వములో శ్రేష్ఠ ఆత్మలై ఉన్న కారణముగా ఆత్మ యొక్క రూపములో అనగా శాలిగ్రామ రూపంలో పూజ జరుగుతుంది కానీ సర్వ కర్మేంద్రియజీతులుగా అవ్వని కారణముగా సాకార రూపములో దేవీ దేవతా స్వరూపములో పూజింపబడరు. సంపూర్ణ పవిత్రముగా అవ్వని కారణముగా సంపూర్ణ నిర్వికారీ, మహిమా యోగ్య దేవీ దేవత యొక్క రూపములో పూజ జరుగదు. సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా అవ్వని కారణముగా లేక సదా హృదయంలో హృదయాన్ని తీసుకునే ఒక్క బాబా యొక్క స్మృతి లేక సదా మనోభిరాముని యొక్క స్మృతి ఉండనికారణముగా భక్తి ఆత్మలు కూడా అష్టదేవతల యొక్క రూపంలో హృదయంలో ఇముడ్చుకోరు. నిరంతర స్మృతి లేకపోతే సదా కాలికమైన మందిర రూపములో స్మృతి చిహ్నము కూడా ఉండదు. కావున తేడా ఏర్పడింది కదా! సింగిల్ పూజకు మరియు డబుల్ పూజకు ఎంత తేడా ఉంది! అది ప్రజల యొక్క పూజ్య రూపము, ఇది రాజ్య పదవిని పొందేవారి పూజ యొక్క రూపము. ఇందులో కూడా తేడా ఉంది.

విశేష దేవతల యొక్క ప్రతి కర్మకు పూజ జరుగుతుంది మరియు కొందరు దేవతలకు రోజూ పూజ జరుగుతుంది కానీ ప్రతి కర్మకు జరగదు. కొందరికి ఎప్పుడో విశేషంగా నిశ్చితమై ఉన్న రోజులలో పూజ జరుగుతుంది. దీనికి కూడా రహస్యముంది. నేను ఎటువంటి పూజ్యునిగా అవుతాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏదైనా సబ్జెక్టులో విజయులుగా అవ్వకపోతే ఖండితమూర్తికి ఏ విధంగా పూజ జరగదో, పూజ్య స్వరూపము నుండి సాధారణ రాయిగా అయిపోతాయో, వాటికి ఏ విలువా ఉండదో అలాగే ఏ సబ్జెక్టులోనైనా సంపూర్ణ విజయులుగా అవ్వకపోతే పరమపూజ్యులుగా అవ్వలేరు, కేవలం పూజ్యులుగా మరియు గాయన యోగ్యులుగా అవుతారు. గాయన యోగ్యులుగా ఎందుకు అవుతారు? ఎందుకంటే తండ్రికి పిల్లలుగా అయిన కారణంగా, బాబాతో పాటుగా పాత్రను అభినయించిన కారణంగా, బాబా మహిమ యొక్క గుణగానము చేసిన కారణంగా, యధాశక్తి త్యాగము చేసిన కారణంగా లేక యధాశక్తి స్మృతిలో ఉన్న కారణంగా గాయనము జరుగుతుంది.

అలాగే పూజకు కూడా రహస్యముంది. ఒకటేమో, పవిత్రత యొక్క కారణంగా పూజ జరుగుతుంది, రెండవది, శ్రేష్ఠ ఆత్మగా అయి సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ శక్తులనైతే ధారణ చేశారో ఆ శక్తులకు కూడా భిన్న భిన్న రూపాలలో స్మృతిచిహ్న రూపములో పూజ జరుగుతుంది. ఏ ఆత్మలైతే విద్యను అనగా జ్ఞానమును ధారణ చేసే శక్తిని సంపూర్ణ రూపంలో ధారణ చేశారో వారికి జ్ఞానము అనగా నాలెడ్జ్ యొక్క శక్తికి స్మృతి చిహ్నముగా సరస్వతి యొక్క రూపంలో పూజ జరుగుతుంది. సంహారము చేసే శక్తికి స్మృతి చిహ్నముగా దుర్గ యొక్క రూపంలో, జ్ఞాన ధనమును ఇచ్చే మహాదానిని, సర్వ ఖజానాల యొక్క ధనమును ఇచ్చే లక్ష్మి యొక్క రూపంలో పూజిస్తారు. ప్రతి విఘ్నము పైన విజయాన్ని పొందినదానికి గుర్తుగా విఘ్న వినాశక రూపంలో పూజ జరుగుతుంది. మాయాజీతులు అనగా మాయ యొక్క వికరాళ రూపమును కూడా సహజముగా మరియు సరళముగా తయారుచేసే శక్తి యొక్క పూజ మహావీరుని యొక్క రూపంలో జరుగుతుంది. కావున శ్రేష్ఠ ఆత్మల యొక్క ప్రతి శక్తికి మరియు శ్రేష్ఠ కర్మలకు కూడా పూజ జరుగుతుంది. శక్తుల యొక్క పూజ, ప్రతీ దేవీ దేవతల యొక్క పూజ రూపంలో చూపించడం జరిగింది. కావున ఇటువంటి ఏ పూజ్యుల యొక్క శ్రేష్ఠ కర్మల యొక్క మరియు శక్తుల యొక్క పూజ జరుగుతుందో వారిని పరమపూజ్యులు అని అంటారు. కావున ఇప్పుడు స్వయాన్ని సంపూర్ణ మూర్తులుగా తయారుచేసుకోండి. నేను ఖండితమూర్తినా లేక పూజనీయ మూర్తినా అని పరిశీలించుకోండి. సంపూర్ణ నిర్వికారీ లేక 16 కళా సంపూర్ణులు అన్న గాయనముంది. కేవలం నిర్వికారులుగా అయ్యారా లేక సంపూర్ణ నిర్వికారులుగా అయ్యారా? అఖండ యోగము ఉందా లేక యోగము ఖండితమవుతుందా? అచలముగా ఉన్నారా లేక అలజడి జరుగుతోందా? బాబా ఏమి కోరుతున్నారు? ప్రతి ఆత్మా బాబా సమానంగా సంపూర్ణమవ్వాలని కోరుతున్నారు. అలాగే పిల్లలందరూ కూడా కోరుతున్నారు కానీ ఏ కొందరో చేస్తున్నారు. కావుననే నెంబరు ఏర్పడుతోంది. అచ్చా! వినడమైతే ఎంతో వింటున్నారు. ఇక ఇప్పుడు వినడం మరియు చేయడం, వీటిని సమానం చేయండి. ఏం చేయాలో అర్థమైందా?

ఇటువంటి పరమపూజ్యులకు, సదా ఒక్క బాబాను తోడుగా ఉంచుకొనేవారికి, ప్రతి అడుగును శ్రేష్ఠ మతము యొక్క ఆధారముపై వేసేవారికి, ఇటువంటి సృష్టి యొక్క ఆధారమూర్తులకు, విశ్వపరివర్తక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా: - సదా స్వయాన్ని నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఫరిస్తాలు అనగా దేహము లేక దేహము యొక్క ప్రపంచముతో లేక దేహము యొక్క పదార్ధాల ఆకర్షణతో ఏ సంబంధమూ లేనివారు, సదా బాబా యొక్క స్మృతి మరియు సేవలలోనే ఉండేవారు. మరి సదా బాబా మరియు సేవ అన్న లగ్నమే ఉంటుందా? ట్రస్టీలకు కేవలం ఒకే పని ఉంటుంది, స్మృతి మరియు సేవ. కర్మలు చేసినా కూడా అవి సేవ యొక్క నిమిత్తముగానే చేస్తున్నారు. గృహస్తులు స్వార్ధము కొరకు చేస్తారు మరియు ట్రస్టీలు సేవ కొరకు చేస్తారు. అన్ని సబ్జెక్టులలోనూ సంపన్నముగా అయ్యే పురుషార్థము స్వతహాగానే నడుస్తోందా? ఎంతెంతగా సమయానికి మరియు సంపూర్ణతకు సమీపంగా వస్తూ ఉంటారో అంతంతగా పురుషార్థము చేసే స్వరూపము కూడా మారుతూ ఉంటుంది. ప్రారంభంలోని పురుషార్థానికి, మధ్య కాలంలోని పురుషార్థానికి మరియు అంత్య కాలంలోని పురుషార్థానికి తేడా అయితే ఉంది కదా! ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా ఉండే, పురుషార్థమేమిటి? ఏదైనా తనంతట తానే నడిచే వస్తువును ఒకసారి ప్రారంభిస్తే ఇక అది నడుస్తూనే ఉంటుంది. ఇక దానిని పదే పదే నడపవలసిన అవసరముండదు. అదే విధంగా ఒకసారి లక్ష్యం లభించాక ఇక దానంతటది ప్రతి అడుగు, ప్రతి సంకల్పము సమయము యొక్క వృద్ధికళ అనుసారంగా నడుస్తూ ఉండాలి. ఈ విధంగా అనుభవమవుతుంది. పురుషార్థము యొక్క సమర్థ స్వరూపానికి గుర్తు ఏమిటి? (సమయానికి ముందే చేరుకుంటారు) సమయానికి ముందే చేరుకొనేవారి యొక్క గుర్తు ఏమిటి? వారు అన్ని సబ్జెక్టుల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారా లేక ఏదో ఒక సబ్జెక్టు యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారా? (అన్ని సబ్జెక్టుల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారు) కావున అన్ని సబ్జెక్టులలోనూ సమానమైన మార్కులు ఉన్నాయా? అడ్వాన్స్ గా వెళ్ళడం మంచిదే కానీ అన్ని సబ్జెక్టులలోనూ అడ్వాంటేజ్ తీసుకోవడం కూడా అవసరమే. లక్ష్యము మంచిదే మరియు లక్ష్యములో పరివర్తన కూడా ఉంది.

సదా స్వయాన్ని బాబా యొక్క కార్యములో లేక స్వకార్యములో సహయోగముగా చేసుకొనే సహయోగి, సమీప ఆత్మలుగా భావిస్తున్నారా? బాబా యొక్క కార్యములో ఎవరు ఎంతగా సహయోగులుగా ఉంటారో అంతగా ఆ సహయోగులే యోగులుగా అవ్వగల్గుతారు. సహయోగులుగా లేకపోతే యోగులుగా కూడా ఉండరు. సహయోగమును ఇవ్వడము అనగా బాబా యొక్క మరియు బాబా యొక్క కార్యము యొక్క స్మృతిలో ఉండడం. లౌకికములో కూడా ఎవరికైనా సహయోగమును ఇస్తే వారి స్మృతి ఉంటుంది. కావున యోగి అనగా సహయోగి. సహయోగులుగా అవ్వడంతో స్వతహాగానే యోగులుగా అయిపోతారు మరియు ఇంకొకటి సహయోగులుగా అవ్వడంతో పదమ రెట్లుగా జమా చేసుకుంటారు. సహయోగమునేమిస్తున్నారు. పురాతన తనువును లేక తమోగుణమైన మనస్సును ఇస్తున్నారు, వారి స్మృతితో సతో ప్రధానముగా చేసి సేవలో వినియోగిస్తారు లేక బియ్యపు రవ్వంత ధనమును ఇస్తారు ఇంకేమి వినియోగిస్తారు? తనువు, మనస్సు, ధనము - మూడింటి ద్వారా సహయోగులుగా అవ్వడము అనగా యోగులుగా అవ్వడము. ఎటువైపుకైతే తనువు వెళుతుందో ధనమును కూడా అటువైపే వినియోగిస్తారు అని గీతమును పాడుతారు కదా! కావున ఇది నిరంతర యోగులుగా అయ్యేందుకు సహజ సాధనము. ఎందుకంటే సహయోగులుగా అవ్వడము ద్వారా, సహయోగము యొక్క ప్రతిఫలము లభించడము ద్వారా యోగము సహజముగా జరుగుతుంది. కావున ప్రతి సంకల్పము లేక కర్మతో బాబా యొక్క సహయోగులుగా అవ్వండి. ప్రతి సేవలో, కార్యములో సహయోగులుగా అవ్వడము ద్వారా వ్యర్థము సమాప్తమైపోతుంది. ఎందుకంటే బాబా యొక్క కార్యము సమర్థమైనది. ఇటువంటి సహయోగులు తీవ్ర పురుషార్థులుగా తమంతటతామే అవుతారు.

సదా స్వయాన్ని నిశ్చయ బుద్ది నిశ్చింత ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే నిశ్చయ బుద్ధులుగా ఉంటారో వారు నిశ్చింతగా ఉంటారు. వారి వద్ద ఎటువంటి చింతన లేక చింత ఉండదు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా జరగకపోతే బాగుండేది... ఇది వ్యర్థ చింతన. నిశ్చయబుద్ధి కలవారు నిశ్చింతగా ఉంటారు. వారు వ్యర్థ చింతన చేయరు. సదా స్వచింతనలో ఉండేవారు స్వస్థితిలో ఉండడం ద్వారా పరిస్థితిపై విజయాన్ని పొందుతారు. ఇంకొకవైపు నుండి వచ్చే పరిస్థితులను అసలు మీరు ఎందుకు స్వీకరిస్తారు? పరిస్థితి నుండి అతీతముగా ఉంటే స్వచింతనలో ఉంటారు మరియు ఎవరైతే స్వచింతనలో స్థితులై ఉంటారో వారు సదా సుఖము యొక్క సాగరములో ఇమిడి ఉంటారు. మరి మీరు సుఖము యొక్క సాగరములో ఇమిడి ఉన్నారా? తండ్రి సుఖ సాగరుడైనప్పుడు మరి పిల్లలు మాస్టర్ సుఖ సాగరులే కదా! దుఃఖము యొక్క అల సంకల్పమాత్రమైనా వస్తోందా లేక సదా సుఖముగా ఉంటున్నారా? మాస్టర్ సుఖసాగరులలో దుఃఖము అస్సలు ఉండజాలదు. దుఃఖము వచ్చినట్లయితే మాస్టర్ దుఃఖ సాగరులైనట్లే. వారి వద్దకు రావణుడు కనుల నుండి వస్తాడు, చెవుల నుండి వస్తాడు, నోటి నుండి వస్తాడు. కానీ సర్వశక్తివంతుని ముందుకు రావణుడు రాజాలడు. బాబా యొక్క స్మృతి అన్నింటికన్నా పెద్ద సురక్షత. 

ఎవరైతే మాయ నుండి లేక విఘ్నాల నుండి ఎప్పుడూ మోసపోరో వారు సదా ఈ ప్రపంచము నుండి అతీతముగా మరియు ప్రియముగా ఉన్నట్లుగా ఉంటారు. కావున కమల పుష్ప సమానంగా ఉంటున్నారా లేక బురద యొక్క చుక్కలు పడుతున్నాయా? శ్రీమతముపై ప్రతి అడుగునూ వేసినట్లయితే సదా కమల పుష్పముగా ఉంటారు. మన్మతమును కలపడం ద్వారా సదా కమలము వలే ఉండలేరు. ఈ ప్రపంచ సాగరము యొక్క ఏ అల యొక్క ప్రభావము పడినా ఆ నీటి యొక్క చుక్కలు పడినట్లే.

సంగమ యుగము యొక్క శ్రేష్ఠ ఖజానా అతీంద్రియ సుఖము. ఈ ఖజానా యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటున్నారా? అతీంద్రియ సుఖము యొక్క ఖజానా మీకు ప్రాప్తించిందా? లభించిన ఖజానాను ఎందుకు పోగొట్టుకుంటున్నారు? దానికి పహారా ఏమిటి? అటెన్షన్. అటెన్షన్ తక్కువగా ఉండడం అనగా మీకు లభించిన ఖజానాను పోగొట్టుకోవడం. మొత్తం కల్పమంతటిలో ఈ ఖజానా మళ్ళీ లభించగలదా? కావున ఇటువంటి అమూల్యమైన వస్తువును ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్థూలములో కూడా మంచి వస్తువును సంభాళించుకొని ఉంచుకుంటారు. అక్కడ కూడా, పహారాదారులు నిర్లక్ష్యంతో ఉంటే ఎంతో నష్టపరుస్తారు. అలాగే ఇక్కడ కూడా నిర్లక్ష్యము వచ్చిందంటే ఖజానాను పోగొట్టుకుంటారు. పదే పదే అటెన్షన్ ఉండాలి. అమృతవేళలో స్మృతిలో కూర్చున్నాము, ధ్యానమునిచ్చాము, మళ్ళీ నడుస్తూ, తిరుగుతూ అది పోయింది అని అనడం కాదు. అమృతవేళ ధ్యానమును ఉంచుతారు మరియు అన్నీ చేసేసాము అని భావిస్తారు. కానీ, నడుస్తూ తిరుగుతూ కూడా ధ్యానమును ఉంచాలి. అతీంద్రియ సుఖమును ఇప్పుడు అనుభవం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చేసుకోలేరు. 5,000 సంవత్సరాల లెక్కతో చూసినట్లయితే ఇది ఎంత శ్రేష్ఠ సమయం! ఇంతటి శ్రేష్ఠ ప్రాప్తి కొరకు కొద్ది సమయం కూడా అటెన్షన్ ను ఉంచకపోతే ఇంకేం చేస్తారు. కర్మ మరియు యోగము రెండూ తోడుగా ఉండాలి. యోగము అంటేనే స్మృతి యొక్క అటెన్షను ఉంచడం. ఏ విధంగా కర్మను వదలరో అలాగే స్మృతిని కూడా వదలకూడదు. వారినే కర్మ యోగులు అని అంటారు.

పాండవుల యొక్క విశేషతనేదైతే గానము చేశారో దానిని గూర్చి మీకు తెలుసా? పాండవుల విజయము యొక్క ముఖ్య ఆధారము, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేకుండా ఉండడమే. పాండవుల ప్రపంచము ఒక్క తండ్రియే. ఇది ఎవరి స్మృతి చిహ్నము? మీ యొక్క స్మృతి చిహ్నము ప్రతి కల్పము గాయనము చేయబడుతుంది. ఈవిధంగా అనుభవమవుతుందా? బాబాయే ప్రపంచము. ఎక్కడ చూసినా అక్కడ తండ్రియే కనిపిస్తున్నారా? ప్రపంచంలో సంబంధాలు మరియు సంపద ఉంటాయి, కావున సంబంధమూ తండ్రితోనే ఉంది మరియు సంపద కూడా తండ్రిలోనే ఉంది. మరి ఇక మిగిలిందేమిటి? ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారే పాండవులు. ఇటువంటి పాండవులు ప్రతి కార్యములోనూ విజయులుగా ఉంటారు. అవుతామా, అవ్వమా అన్న ప్రశ్నయే ఉత్పన్నమవ్వదు. కర్మ చేసే ముందే, అవుతుందా - అవ్వదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందా లేక ఇది ముందే అయి ఉంది అన్న నిశ్చయముందా? మా విజయము నిశ్చితము అని పాండవులకు ముందే నిశ్చయముందా? ఎందుకంటే సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నారు. పాండవులు అనగా సదా విజయీ రత్నాలు. విజయీ రత్నాలే బాబాకు ప్రియమనిపిస్తారు.

Comments