14-10-1981 అవ్యక్త మురళి

* 14-10-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సర్వ ఖజానాలకు తాళంచెవి - 'బాబా' అన్న ఒక్క పదమే.'

ఈరోజు భాగ్య విధాత అయిన బాబా తమ భాగ్యశాలులైన పిల్లలను చూస్తున్నారు. భాగ్యశాలులుగా అయితే అందరూ అయ్యారు కానీ భాగ్యశాలి అన్న పదము ముందు ఉండే సౌభాగ్యశాలి అన్న పదము ఎక్కడ, పదమా పదమ భాగ్యశాలి అన్న పదము ఎక్కడ! భాగ్యశాలి అన్న పదమునైతే రెండింటికీ వాడతారు కానీ సౌభాగ్యశాలులు ఎక్కడ, పదమా పదమ భాగ్యశాలులు ఎక్కడ! తేడా అయితే ఉంది కదా. భాగ్య విధాత ఒక్కరే, అలాగే విధాత యొక్క విధి కూడా ఒక్కటే. సమయము మరియు వేళ కూడా ఒక్కటే. అయినా కానీ నెంబర్ వారీగా ఉన్నారు. విధాత యొక్క విధి ఎంత శ్రేష్ఠమైనది మరియు సహజమైనది! లౌకిక రీతిలో కూడా ఈరోజుల్లో ఎవరిపైననైనా గ్రహచారము యొక్క కారణముగా వారి భాగ్యము మారిపోతే ఆ గ్రహచారాన్ని తప్పించి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేసేందుకు ఎన్నిరకాల విధులను ప్రయోగిస్తూ ఉంటారు! ఎంత సమయాన్ని ఎంత శక్తిని మరియు సంపదను ఖర్చుచేస్తూ ఉంటారు! అయినా కానీ అల్పకాలికమైన భాగ్యమే తయారవుతుంది. ఒక్క జన్మ యొక్క గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే వారు విధాత ద్వారా తమ భాగ్యాన్ని మార్చుకోరు. అల్పజ్ఞులు, అల్పమైన సిద్ధులు ప్రాప్తించిన వ్యక్తుల ద్వారా అల్పకాలికమైన ప్రాప్తిని పొందుతారు. వారు అల్పజ్ఞులైన వ్యక్తులు మరియు ఇక్కడ ఉన్నది విధాత. విధాత ద్వారా అవినాశీ భాగ్యము యొక్క రేఖను దిద్దుకోవచ్చు. ఎందుకంటే భాగ్య విధాతలైన ఇరువురు తండ్రులూ ఈ సమయంలో పిల్లల కొరకు హాజరై ఉన్నారు. ఎంతగా భాగ్య విధాత నుండి భాగ్యాన్ని తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. ఈ సమయంలోనే భాగ్య విధాత భాగ్యాన్ని పంచేందుకు వచ్చారు. ఈ సమయానికి డ్రామానుసారముగా వరదానము ఉంది. భాగ్యము యొక్క భండారము నిండుగా తెరువబడి ఉంది. ఎటువంటి కాపలాదారూ లేడు అయినా కానీ తీసుకోవడంలో చూడండి, నెంబర్ వారీగా అయిపోతారు. భాగ్య విధాత నెంబర్ వారీగా ఇవ్వరు. ఇక్కడ భాగ్యమును తీసుకునేందుకు క్యూ అయితే లేదు కదా! అమృతవేళ చూడండి! దేశ, విదేశాలలోని పిల్లలందరూ ఒకే సమయంలో భాగ్య విధాతను కలుసుకునేందుకు వస్తారు. తద్వారా కలుసుకోవడమైతే జరుగుతుంది. మిలనమును జరపడమే కలుసుకోవడమవుతుంది. అడగరు కానీ ఉన్నతోన్నతుడైన తండ్రిని కలుసుకోవడం అనగా భాగ్యము ప్రాప్తమవ్వడమే. ఒకటేమో తండ్రీ, పిల్లలు కలుసుకోవడం. ఇంకొకటి ఏదైనా లభించడం కావున మిలనము జరుగుతుంది మరియు భాగ్యము లభించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు ఎవరినీ ఖాళీగా పంపించలేరు. కావున బాబా విధాత, వరదాత, నిండుగా ఉన్న భండారము కలవారు. వారు ఖాళీగా ఎలా పంపగలరు? అయినా భాగ్యశాలులుగా, సౌభాగ్యశాలులుగా, పదమ భాగ్యశాలులుగా, పదమా పదమ భాగ్యశాలులుగా... ఇలా ఎందుకు అవుతారు? ఇచ్చేవారూ ఉన్నారు మరియు భాగ్యము యొక్క ఖజానా కూడా నిండుగా ఉంది. సమయం యొక్క వరదానము కూడా ఉంది. ఈ విషయాలన్నింటి యొక్క జ్ఞానము అనగా వివేచన కూడా ఉంది. తెలియకపోవడం అంటూ కూడా లేదు. అయినా కానీ తేడా ఎందుకు ఉంది? (డ్రామానుసారముగా) డ్రామాకే ఇప్పుడు వరదానము ఉంది కావున డ్రామానుసారముగా అని అనజాలరు.

విధి కూడా చూడండి ఎంత సరళమైనదో! ఎటువంటి కష్టమును కూడా వారు ఇవ్వరు, ఎటువంటి ఎదురుదెబ్బలు తినిపించరు. ఖర్చు పెట్టించరు, విధి కూడా ఒకే పదములో ఉంది. ఆ పదమేమిటి? ఆ ఒక్క పదమును గూర్చి మీకు తెలుసా? ఆ ఒక్క పదమే సర్వ ఖజానాలకు లేక శ్రేష్ఠ భాగ్యానికి తాళం చెవి. అదే తాళం చెవి మరియు అదే విధి, అది ఏమిటి? ఈ 'బాబా' అన్న పదమే తాళం చెవి మరియు విధి. మరి తాళం చెవి అయితే అందరి వద్దా ఉంది కదా! కానీ తేడా ఎందుకు ఉంది? తాళం చెవి ఎందుకు చిక్కుకొనిపోతుంది? రైట్ వైపుకు బదులుగా లెఫ్ట్ వైపుకు తిప్పేస్తారు. స్వచింతనకు బదులుగా పరచింతన చేస్తారు. తాళంచెవిని ఇలా తప్పు వైపుకు తిప్పేస్తారు. స్వదర్శనానికి బదులుగా పరదర్శన, మారేందుకు బదులుగా శతృత్వాన్ని తీర్చుకునే భావన, స్వపరివర్తనకు బదులుగా పరపరివర్తన యొక్క కోరికను ఉంచడం, నేను పని చేయాలి, బాబాకు పేరు రావాలి అని భావించేందుకు బదులుగా నేను పేరు పొందాలి. బాబా పని చేయాలి అని భావిస్తూ ఈ విధంగా తాళంచెవిని తప్ప వైపుకు తిప్పేస్తారు. కావున ఖజానాలు ఉంటూ కూడా భాగ్యహీనులు ఖజానాలను పొందలేరు. భాగ్య విధాత యొక్క పిల్లలయ్యుండి కూడా ఎలా అయిపోతారో చూడండి! ఏదో కాస్త తీసుకొనే వారిగా అయిపోతారు. ఇంకొకటి ఏమి చేస్తారు?

ఈనాటి ప్రపంచంలో అమూల్యమైన ఖజానాలను లాకర్లలో లేక అల్మారీలలో ఉంచుతారు. వాటిని తెరిచేందుకు డబల్ తాళం చెవులను వాడతారు లేక వాటిని రెండుసార్లు తెరువవలసి ఉంటుంది. ఆ విధి ద్వారా చేయకపోతే ఖజానాలు తెరుచుకోవు. లాకర్లలో చూసే ఉంటారు. ఒక తాళంచెవితో, మీరు తాళం వేస్తే ఇంకొకదానితో బ్యాంకు వారు వేస్తారు. మరి అప్పుడు డబల్ తాళం ఉనట్లే కదా! కేవలం మీరు మీ తాళం చెవితో తెరవాలనుకుంటే తెరవలేరు. అలాగే ఇక్కడ కూడా మీరు మరియు బాబా ఇరువురి స్మృతి యొక్క తాళం చెవి కావాలి. కొంతమంది పిల్లలు తమ నషాలోకి వచ్చేసి నేను అన్నీ తెలుసుకున్నాను. నేను ఏది కావాలనుకుంటే అది చేయగలను లేక చేయించగలను. బాబా మమ్మల్ని అధిపతులుగా చేసేశారు అని అంటూ ఉంటారు. ఇటువంటి నేనూ అనే తప్పుడు నషాలో బాబాతో ఉన్న సంబంధాన్ని మరచి స్వయమనే సర్వస్వమూ అని భావించడం మొదలుపెడతారు మరియు ఒకే తాళంచెవితో ఖజానాలను తెరవాలనుకుంటారు, అనగా ఖజానాలను అనుభవం చేసుకోవాలనుకుంటారు. కాని, బాబా యొక్క సహయోగము లేక తోడు లేకుండా ఖజానాలు లభించజాలవు. కావున డబల్ తాళంచెవి కావాలి. చాలామంది పిల్లలు బాప్ దాదాలు అనగా ఇరువురు తండ్రులకు బదులుగా ఒకే తండ్రి ద్వారా ఖజానాలను అధిపతులుగా అయ్యే విధిని ఉపయోగిస్తారు. దానివలన కూడా ప్రాప్తి నుండి వంచితులైపోతారు. మాకు నిరాకారునితో నేరుగా సంబంధము ఉంది, సాకారుడు కూడా నిరాకారుడి ద్వారానే పొందారు కదా, అలాగే మేము కూడా నిరాకారుని ద్వారానే అన్నీ పొందుతాము, సాకారుని అవసరమేముంది అని అంటారు. కాని, అటువంటి తాళంచెవి ఖండిత తాళం చెవే అయిపోతుంది, కావున సఫలత లభించజాలదు. నవ్వు పుట్టించే విషయమేమిటంటే స్వయాన్ని బ్రహ్మాకుమార్, కుమారీ అని పిలుచుకుంటారు మరియు సంబంధాన్ని శివునితో ఉంచుతామంటారు. మరి అలాంటప్పుడు మరి శివకుమార్, కుమారీ అని పిలిపించుకోండి! బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారీ అని ఎందుకు అంటారు? మీ ఇంటి పేరే శివ వంశీ బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీ. కావున ఇరువురు తండ్రుల యొక్క సంబంధము ఉంది కదా!

ఇంకొక విషయము - శివబాబా కూడా బ్రహ్మా ద్వారానే స్వయాన్ని ప్రత్యక్షం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా బ్రహ్మాండాన్ని ఎడాప్ట్ చేసుకున్నారు. ఒంటరిగా చేయలేదు. తల్లి అయిన బ్రహ్మ తండ్రి యొక్క పరిచయాన్ని ఇప్పించారు. బ్రహ్మ తల్లిగా పాలన చేసి తండ్రి వారసత్వం యొక్క భాగ్యాన్ని తయారుచేశారు. మూడో విషయము - రాజ్య భాగ్యం యొక్క ప్రారబ్దంలో మీరు ఎవరితో వస్తారు? నిరాకారుడు. నిరాకారలోక వాసిగానే ఉంటారు. సాకార బ్రహ్మా బాబాతో కలిసి రాజ్య భాగ్యం యొక్క ప్రారబ్దాన్ని అనుభవిస్తారు. సాకారంలో హీరో పాత్రను అభినయించే సంబంధము సాకార బ్రహ్మా బాబాతో ఉందా లేక నిరాకారునితో ఉందా? కావున సాకారుడు లేకుండా సర్వభాగ్యముల యొక్క బాంఢాగారాలకు అధిపతులుగా ఎలా అవ్వగల్గుతారు? కావున ఖండిత తాళంచెవిని వాడకండి. భాగ్యవిదాత బ్రహ్మా ద్వారానే భాగ్యాన్ని పంచారు. బ్రహ్మాకుమారీ, కుమారులుగా అవ్వకుండా భాగ్యము తయారవ్వజాలదు. 

మీ స్మృతిచిహ్నములో కూడా, బ్రహ్మ భాగ్యాన్ని పంచినప్పుడు మీరు నిద్రిస్తున్నారా? నిదురించారా లేక ఎక్కడైనా మైమరచిపోయి ఉన్నారా అనే అంటారు. కావున తప్పుడు తాళంచెవిని వాడకండి, డబల్ తాళంచెవినే వాడండి. ఇద్దరు తండ్రులు, అలాగే మీరూ మరియు బాబా ఇరువురూ కలిసి ఉండే ఈ సహజమైన విధి ద్వారా సదా భాగ్యం యొక్క ఖజానాలతో పదమాపదమ భాగ్యశాలులుగా అవ్వగల్గుతారు. కారణమును నివారణ చేయండి, అప్పుడు సదా సంపన్నముగా అయిపోతారు. అర్థమైందా! అచ్ఛా!

ఈ విధంగా భాగ్యవిదాతనే తమవారిగా చేసుకునేవారికి, సదా సర్వభాగ్యము యొక్క ఖజానాలతో ఆడుకునేవారికి, 'బాబా-బాబా' అని నామమాత్రంగా అనడం కాక, బాబాను తమవారిగా చేసుకొని ఖజానాలను పొందాలి. అటువంటి అధికారి పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో వ్యక్తిగత మిలనము: -

ఎంతో విన్నారు. ఇక వినడం తర్వాత మరి స్వరూపంగా అయ్యారా? వినడము అనగా స్వరూపముగా అవ్వడము. దీనినే మనోరసము అని అంటారు. కేవలం వినడం మాత్రమే చేస్తే అది కర్ణరసమే అవుతుంది. కాని, వినడము మరియు అలా అవ్వడము అదే మనో రసము. మన్మనాభవ అన్న మంత్రమే ఉంది. మనస్సును బాబాలో నిమగ్నం చేయాలి. ఎప్పుడైతే మనస్సు నిమగ్నమై ఉంటుందో, ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడ స్వరూపంగా కూడా సహజముగానే అయిపోతారు. ఏదైనా స్థానంలో కూర్చొని సుఖము లేక సంతోషం యొక్క విషయాలలో మనస్సు తిరుగుతూ ఉంటే అది స్వరూపంగా అయిపోతుంది. కావున మనోరసము అనగా ఎక్కడైతే మనస్సు ఉంటుందో అలా వారిలా అయిపోతారు. ఇప్పుడిక కర్ణరసం యొక్క సమయం సమాప్తమయ్యింది మరియు మనోరసం యొక్క సమయం నడుస్తోంది. మరి ఇప్పుడు మీరు ఎలా అయ్యారు? భాగ్యం యొక్క ఖజానాలకు అధిపతులుగా, సర్వశ్రేష్ఠ భాగ్యవంతులుగా అయిపోయారు కదా! తండ్రి ఎలా ఉన్నారో అలా మనం ఉన్నాము అని అలా భావిస్తున్నారు కదా! తాళంచెవిని గూర్చి వినిపించారు మరియు విధిని కూడా వినిపించారు. ఇప్పుడు దాన్ని వినియోగించడం మీ పని. తాళంచెవిని వాడడం అయితే వస్తుంది కదా! తాళంచెవి తప్పుగా తిరిగితే ఎంతో కష్టమైపోతుంది. అప్పుడు తాళంచెవీ పోతుంది మరియు ఖజానా కూడా పోతుంది. కావున మీరందరూ సరైన తాళంచెవిని వాడే పదమాపదమ భాగ్యశాలురే కదా! పదమాపదమ భాగ్యశాలుల గుర్తులు ఏమిటి? వారి ప్రతి అడుగులోనూ ఎన్నో కోటాను కోట్లు ఉంటాయి మరియు వారు ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదనను జమా చేసుకుంటారు. ఒక్క అడుగు కూడా కోట్ల సంపాదన నుండి వంచితమవ్వదు. కావున డబల్ పదమములు ఉంటాయి. ఒకటేమో, కమలపుష్పమును పద్మము అని అంటారు. కమల పుష్ప సమానంగా లేకపోయినా మీ భాగ్యాన్ని తయారుచేసుకోలేరు. బురదలో చిక్కుకోవడము అనగా భాగ్యాన్ని పోగొట్టుకోవడము. కావున పదమాపదమ భాగ్యాశాలులు అనగా పద్మ సమానంగా ఉండడము మరియు పదమముల (కోటాను రెట్ల) సంపాదనను చేసుకోవడము. మరి ఈ రెండు గుర్తులు ఉన్నాయో లేవో చూసుకోండి. సదా అతీతముగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయ్యారా? అతీతంగా ఉండడము బాబాకు ప్రియము. ఎవరు ఎంతగా అతీతముగా ఉంటారో అంతగా బాబాకు ప్రియమైనవారిగా అయిపోతారు. ఎందుకంటే బాబా కూడా సదా అతీతంగా ఉంటారు. కావున వారు బాబా సమానంగా అయినట్లే కదా! కావున ప్రతి అడుగులోనూ అనగా ప్రతీ క్షణము, ప్రతీ మాటలో, ప్రతీ కర్మలో కోటాను రెట్ల సంపాదన జరుగుతోందా అని పరిశీలించుకోండి. మీ మాటలు సమర్థంగా ఉండాలి. కర్మలూ సమర్థంగా ఉండాలి, సంకల్పాలూ సమర్థంగా ఉండాలి. సమర్థతలో సంపాదన ఉంటుంది, వ్యర్థంలో సంపాదన పోతుంది. కావున ప్రతి ఒక్కరూ మీ చార్టును మీరే పరిశీలించుకోండి. చేసేముందే పరిశీలించుకోవడం యదార్థమైన చెకింగ్. కాని చేసిన తర్వాత పరిశీలించుకున్నట్లయితే మీరు ఏదైతే చేసేశారో అది జరిగిపోయింది కదా! కావున మొదట పరిశీలించాలి. ఆ తర్వాత చేయాలి. వివేకవంతులు లేక జ్ఞాన స్వరూపుల యొక్క గుర్తు మొదట ఆలోచించడము, ఆ తర్వాత చేయడము. చేసింతర్వాత ఆలోచించినట్లయితే సగం పోగొట్టుకుంటారు. సగం పొందుతారు. చేసేముందే ఆలోచించినట్లయితే సదా పొందుతారు. జ్ఞానీ ఆత్మలు అనగా వివేకవంతులు. కేవలం ఉదయము లేక రాత్రి మాత్రమే పరిశీలించుకోరు. కాని, ప్రతి సమయము మొదట పరిశీలించుకుంటారు. ఆ తర్వాత చేస్తారు. గొప్ప వ్యక్తులు మొదట భోజనాన్ని పరిశీలింపజేస్తారు. ఆ తర్వాత తింటారు. అలాగే ఈ సంకల్పాలు కూడా బుద్ధి యొక్క భోజనమే. కావున పిల్లలైన మీరు సంకల్పాన్ని కూడా పరిశీలించి ఆ తర్వాత స్వీకరించాలి అనగా కర్మలోకి తీసుకురావాలి. సంకల్పాలే పరిశీలింపబడ్డాక మరి ఇక వాణి మరియు కర్మలు కూడా స్వతహాగానే పరిశీలింపబడతాయి. బీజమైతే సంకల్పమే కదా! మీవంటి గొప్పవారిగా మొత్తం కల్పమంతటిలోనూ ఇంకెవరూ లేరు.

2. సదా కర్మ యోగులుగా అయి ప్రతి కర్మనూ చేస్తున్నారా? కర్మ మరియు యోగము రెండూ కంబైండ్ గా ఉంటున్నాయా? ఏ విధంగా శరీరము మరియు ఆత్మ రెండూ కంబైండ్ గా అయి కర్మ చేస్తున్నాయో అలాగే కర్మ మరియు యోగము రెండూ కంబైండ్ గా ఉంటున్నాయా? కర్మ చేస్తూ స్మృతిని మర్చిపోకూడదు మరియు స్మృతిలో ఉంటూ కర్మను మరిచిపోకూడదు. కొంతమంది అలా కర్మ క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు స్మృతిని మరిచిపోతారు. కావున దాని ద్వారా కర్మ మరియు యోగము రెండూ వేరైపోయాయని అర్థమౌతుంది. కాని ఈ రెండూ కంబైండ్ గా ఉంటాయి. మీ టైటిలే కర్మయోగులు, కర్మ చేస్తూ స్మృతిలో ఉండేవారు సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు, తేలికగా ఉంటారు. ఏ కర్మలోనూ భారమును అనుభవము చేసుకోరు. కర్మయోగులనే వేరే పదాలలో కమల పుష్ప సమానులు అని అంటారు. మరి మీరు కమల పుష్ప సమానంగా ఉంటున్నారా? ఎప్పుడూ ఎటువంటి చెత్తా అనగా మాయ యొక్క వైబ్రేషన్లు మిమ్మల్ని స్పర్శించడం లేదు కదా! అప్పుడప్పుడూ మాయ వస్తుందా లేక వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయిందా? మాయను మీతో పాటు కూర్చోబెట్టుకోలేదు కదా! మాయను కూర్చోబెట్టుకోవడము అనగా బాబా నుండి దూరమవ్వడము. కావున మాయ యొక్క జ్ఞాన స్వరూపులుగా కూడా అయి దానిని దూరం నుండే పారద్రోలండి. జ్ఞాన స్వరూపులు మాయ యొక్క ఉత్పత్తి ఎప్పుడు మరియు ఎలా జరుగుతుందో అనుభవం యొక్క ఆధారంపై తెలుసుకుంటారు. మాయ యొక్క జన్మ బలహీనత ద్వారా జరుగుతుంది. ఎటువంటి బలహీనత ఉన్నా మాయ వస్తుంది. ఏ విధంగా బలహీనత వల్ల అనేక రకాలైన రోగాల యొక్క క్రిములు జన్మిస్తాయో అలాగే ఆత్మ యొక్క బలహీనతతో మాయకు జన్మ లభిస్తుంది. దానికి కారణం తమ యొక్క బలహీనత మరియు దీని యొక్క నివారణ రోజూ మురళి వినడం. మురళియే తాజా భోజనము, శక్తిశాలి భోజనము. ఏ శక్తి కావాలనుకున్నా వాటన్నిటితో సంపన్నమైన భోజనము రోజూ లభిస్తుంది. ఎవరైతే రోజూ శక్తిశాలి భోజనాన్ని తింటూ ఉంటారో వారు బలహీనంగా అవ్వలేరు. రోజూ ఈ భోజనాన్నయితే తింటారు కదా! ఈ భోజనాన్ని మానేస్తాము అని వ్రతం చేపట్టవలసిన అవసరం లేదు. రోజూ ఇటువంటి శక్తిశాలీ భోజనం లభించడం ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారు. భోజనం చేయడంతో పాటు ఆ భోజనాన్ని అరగించుకొనే శక్తి కూడా కావాలి. కేవలం వినే శక్తి ఉంటూ మననం చేసుకొనే శక్తి లేకపోయినా కూడా శక్తిశాలురుగా అవ్వలేరు. వినే శక్తి అనగా భోజనం తినడము మరియు మనన శక్తి అనగా భోజనాన్ని అరగించుకోవడము. ఈ రెండు శక్తులు ఉన్నవారు బలహీనంగా అవ్వలేరు.

టీచర్లతో - సేవాధారుల యొక్క విశేషతయే త్యాగము మరియు తపస్సు. ఎక్కడైతే త్యాగము మరియు తపస్సు ఉంటుందో అక్కడ ఆ సేవాధారికి సఫలత ఉంటుంది. సేవాధారి అనగా తనకు ఒక్క బాబా తప్ప ఇంక ఎవరూ లేనివారు. ఒక్క బాబాయే మొత్తం ప్రపంచం. తండ్రియే ప్రపంచమైనప్పుడు మరి ఇంకేం కావాలి? ఒక్క తండ్రి తప్ప ఇంక ఎవ్వరూ కనిపించకూడదు. నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ ఒక్క తండ్రి తప్ప ఇంక ఎవ్వరూ కనిపించకూడదు. దీనినే స్మృతిలో ఉంచుకోవాలి అనగా సఫలతా మూర్తులుగా అవ్వాలి. సఫలత తక్కువగా ఉంటే తప్పకుండా బాబాతో పాటు మధ్యలో ఇంక ఎవరైనా వచ్చి ఉంటారు. అది పరిశీలించుకోండి. ఒక్క బాబాలోనే మొత్తం ప్రపంచమంతా ఉండడం సఫలతా మూర్తులకు గుర్తు.

Comments