14-01-1982 అవ్యక్త మురళి

* 14-01-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కర్మేంద్రియజీతులే విశ్వ రాజ్యాధికారులు.

శబ్దంలోకి వచ్చేందుకు లేక శబ్దమును వినేందుకు ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు! బాప్ దాదా కూడా శబ్దంలోకి వచ్చేందుకు శరీరరూపీ సాధనమును ధారణ చేయవలసి వస్తుంది, కానీ శబ్దం నుండి అతీతముగా వెళ్ళేందుకు ఈ సాధనాల ప్రపంచమును దాటి వెళ్ళవలసి ఉంటుంది. సాధనాలు ఈ సాకార ప్రపంచములో ఉన్నాయి. సేవ కొరకు శబ్దంలోకి వచ్చేందుకు ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు. కానీ శబ్దము నుండి అతీతమైన స్థితిని పొందే అభ్యాసకులు క్షణములో వీటన్నింటినీ దాటి వెళ్ళిపోతారు. అటువంటి అభ్యాసకులుగా అయ్యారా? ఇప్పుడిప్పుడే శబ్దములోకి రావడం, మళ్ళీ ఇప్పుడిప్పుడే శబ్దం నుండి అతీతముగా వెళ్ళిపోవడం. ఇటువంటి నిగ్రహ శక్తి, రూలింగ్ పవర్ ను మీలో అనుభవం చేసుకుంటున్నారా? సంకల్ప శక్తి యొక్క విషయంలో కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సంకల్పములోకి రండి, విస్తారములోకి రండి, మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విస్తారమును ఫుల్‌స్టాప్ లో ఇమిడ్చివేయండి. స్టార్ట్ చేసే మరియు స్టాప్ చేసే రెండు శక్తులూ సమానరూపములో ఉన్నాయా?

హే కర్మేంద్రియాల యొక్క రాజ్యాధికారులారా, మీ రాజ్యశక్తిని అనుభవం చేసుకుంటున్నారా? రాజ్యశక్తి శ్రేష్ఠముగా ఉందా లేక కర్మేంద్రియాలు అనగా ప్రజల యొక్క శక్తి శ్రేష్ఠముగా ఉందా? ప్రజాపతిగా అయ్యారా? మీరు ఏమి అనుభవం చేసుకుంటున్నారు? స్టాప్ అనగానే అవి ఆగిపోతున్నాయా? మీరు స్టాప్ అని అన్నాక అవి స్టార్ట్ అయిపోవడం లేదు కదా! కేవలం ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి కనుసైగ చేయగానే ఆ కనుసైగతోటే వాటిని ఎలా కావాలనుకుంటే అలా నడపగలగాలి. ఇటువంటి కర్మేంద్రియజీతులుగా అవ్వండి, అప్పుడు ప్రకృతిజీతులుగా అయి కర్మాతీత స్థితి యొక్క ఆసనధారులుగా అయి విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. కావున మొదట కర్మేంద్రియజీతులుగా అయ్యామా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ కర్మేంద్రియాలు 'జీ హజూర్', 'జీ హాజర్' అంటూ నడుచుకుంటున్నాయా? రాజ్యాధికారులైన మీకు సదా స్వాగతం పలుకుతున్నాయా? అనగా నమస్కరిస్తున్నాయా? రాజు ముందు మొత్తం ప్రజలంతా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారా?

హే రాజ్యాధికారులారా! మీ అందరి రాజ్య కార్య వ్యవహారము ఎలా ఉంది? మంత్రులు, ఉపమంత్రులు మోసం చేయడం లేదు కదా? మీ రాజ్యాధికారాన్ని పరిశీలించుకుంటున్నారా? మీ రాజదర్బారును రోజూ నిర్వహిస్తున్నారా లేక అప్పుడప్పుడూ నిర్వహిస్తున్నారా? ఏం చేస్తున్నారు? పవర్ లేదు - అనగా నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు కానీ పవర్‌ఫుల్ గా లేరు. శస్త్రధారులుగా ఉన్నారు కానీ సమయం వచ్చినప్పుడు కార్యములో వినియోగించలేరు. స్టాక్ ఉంది కానీ సమయం వచ్చినప్పుడు స్వయమూ ఉపయోగించలేరు మరియు ఇతరుల చేత కూడా ఉపయోగింపజేయలేరు. విధానం వస్తుంది కానీ విధి రాదు. ఇటువంటి సంస్కారాలు గల ఆత్మలు కూడా ఉన్నారు, అనగా షావుకార సంస్కారాలు కలవారు. వారు రాజ్య అధికారీ ఆత్మల యొక్క సదా సమీపమైన తోటివారిగా ఉంటారు. కానీ స్వ అధికారులుగా అవ్వరు, అర్ధమయ్యిందా? వర్తమాన సమయంలో ఇప్పటివరకూ నేను ఎలా అయ్యాను? అని ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు. ఫైనల్ సీట్లను సెట్టింగ్ చేసుకునేందుకు ఇంకా ఆ ఈల మ్రోగలేదు. పూర్తి అవకాశం ఉంది, కానీ ఇతరులకు కూడా మీరు ఏమని చెబుతారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ లేదు అని చెబుతారు. ఎందుకంటే కొంతకాలం ముందే ఈ సంస్కారాలు రావాలి. అంతేకానీ చివరి సమయంలో కాదు కావున డబుల్ విదేశీ గ్రూప్ వారు స్వర్ణిమ అవకాశం తీసుకునే ఛాన్స్ గ్రూప్ అవ్వండి. కావున మీరంతా ఏ గ్రూప్ వారు? అచ్ఛా!

ఈ రోజు అమెరికా మరియు ఆస్ట్రేలియా వారి వంతు - కావున ఇరువురూ ఏగ్రూప్ వారు, ఏ గ్రూప్ వారు వచ్చారు? ఆస్ట్రేలియావారు ఏమి భావిస్తున్నారు? ఛాన్స్ లర్ గ్రూపేనా? ఆస్ట్రేలియా యొక్క శక్తులు ఏమి భావిస్తున్నారు? శక్తిదళం కూడా తక్కువేమీకాదు. పాండవులూ ఉన్నారు, శక్తులూ తక్కువేమికాదు. ఇరువురూ తమ తమ వేగాలతో ముందుకు వెళుతున్నారు. ఆస్ట్రేలియాలో శక్తులు ఎక్కువగా ఉన్నారా లేక పాండవులు ఎక్కువగా ఉన్నారా? (ఇరువురూ సమానంగా ఉన్నారు) శక్తులు కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత ఎక్కువగా ఎగురుతారు కదా! కావున ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ నెంబర్ వన్ గానే వెళ్ళాలి. మధ్యలో కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫాస్ట్ గా
వెళతాము మరియు లక్ష్యాన్ని చేరుకుంటాము అని కొందరు అంటారు. అచ్చా!

సదా కర్మేంద్రియజీతులకు, ప్రకృతీజీతులకు, సూక్ష్మ సంస్కారజీతులకు అనగా మాయాజీతులకు స్వరాజ్యాధికారులుగా అయి విశ్వరాజ్యాధికారులుగా అయ్యే ఇటువంటి రాజవంశీయులకు, రాజ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఆస్ట్రేలియా పార్టీతో - బాప్ దాదాకు మీకన్నా ఎక్కువగా పిల్లల యొక్క స్మృతి కలుగుతూ ఉంటుంది. బాప్ దాదా కూడా రోజూ పిల్లల యొక్క మాలను స్మరిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మిస్ చేసినా కానీ బాప్ దాదా అయితే ఎప్పుడూ మిస్ చేయరు. ప్రతి యొక్క మణికి తమ తమ నెంబర్ ఉంది. ఉన్నది మాలలోనే. ఎన్నిసార్లు బాప్ దాదా మీ అందరి మాలను స్మరించి ఉంటారు? ఆస్ట్రేలియావారిపైనైతే బాప్ దాదాకు సదా గర్వం ఉంటుంది, ఎందుకు? ఎందుకంటే, ఆస్ట్రేలియా నివాసులు బాబాను గుర్తించి తమవారిగా చేసుకోవడంలో నెంబర్ వన్ రికార్డును చూపించారు. సంఖ్యలో చూసినా, వృద్ధిలో చూసినా, క్వాలిటీలో చూసినా అన్నింటిలోనూ ముందు ఉన్నారు మరియు మంచిగా సంభాళిస్తున్నారు. కావున ఆస్ట్రేలియా తక్కువేమీ కాదు. లండన్ లో కొంతైనా భారతవాసీయులైన ఆత్మలు ఎక్కువగా ఉన్నారు. కానీ, ఆస్ట్రేలియాలోనైతే అందరూ పరదా లోపల దాగియున్న తండ్రిని గుర్తించడంలో నెంబర్ వన్ గా అయ్యారు. కావున వారు బాప్ దాదాకు ప్రియమైనవారు, అర్ధమయ్యిందా?

2. ఆస్ట్రేలియా వాసులందరూ తమను డబుల్ లైట్ స్వరూపముగా అనుభవం చేసుకుంటున్నారా? డబుల్ లైట్ అనగా సదా ప్రతి సమస్యను సహజముగా దాటి వెళ్ళేవారు. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? శక్తులు ఏమి భావిస్తున్నారు? ఎవరైనా మధువనం నుండి వరదానమును తీసుకొని వెళ్ళి అక్కడకు వెళ్ళగానే విజయం యొక్క జండాను ఎగురవేయాలి అని శక్తులు భావిస్తారు. ఆస్ట్రేలియా వాసులపై బాప్ దాదా సదా మహిమ యొక్క పుష్పాలను జల్లుతారు. ఎందుకంటే, మొట్టమొదట సేవా వృద్ధి యొక్క ప్రమాణము ఆస్ట్రేలియా నివాసులదే. లండన్లో కూడా రాజ్యాధికారము యొక్క ఇక్కడి సంస్కారాలు భవిష్యత్తులో పని చేస్తాయి. వర్తమాన సమయంలో ఆత్మనైన నా యొక్క రాజ్యాధికారపు సంస్కారాలు - హద్దులోని రాజ్యాధికారం యొక్క సంస్కారాలుగా ఉన్నాయా లేక అనంతమైన విశ్వమహారాజన్ యొక్క సంస్కారాలుగా ఉన్నాయా? లేక చివరి పదవి అయిన దాసదాసీ సంస్కారాలున్నాయా? దాసదాసీలుగా అయ్యే గుర్తులు ఏమిటో సాకారములో కూడా వినిపించారు. ఏదైనా సమస్య లేక సంస్కారానికి ఆధీనముగా అయి ఎవరైతే ఉదాసీనముగా ఉంటారో ఆ ఉదాసీనతయే దాసదాసీలుగా అయ్యేందుకు గుర్తు. కావున నేను ఎవరు? అని స్వయమే స్వయమును పరిశీలించుకోండి. ఎక్కడా ఎటువంటి ఉదాసీనత యొక్క అల రావడం లేదు కదా! ఉదాసీనత అనగా ఇప్పుడూ దాసులుగానే అవ్వడం, మరి అటువంటివారిని రాజ్యాధికారులు అని ఎలా అంటారు? ఇదేవిధంగా షావుకార ప్రజలుగా కూడా అవుతారు. కావున ఇక్కడ కూడా చాలామంది రాజులుగా అవ్వలేదు, షావుకార్లుగా అయ్యారు, ఎందుకంటే జ్ఞానరత్నాల యొక్క ఖజానా ఎంతగానో ఉంది, సేవ చేసి పుణ్య ఖాతాను కూడా ఎంతో జమా చేసుకున్నారు, కానీ సమయం వచ్చినప్పుడు స్వయమును అధికారిగా చేసుకొని సఫలతా మూర్తులుగా అయ్యే నిగ్రహశక్తి మరియు రూలింగ్ సేవ వృద్ధినొందింది, కానీ వృక్షములో కొన్ని శాఖలు కూడా కాండముగా అయిపోతాయి. అలాగే ఆస్ట్రేలియా కూడా లండన్ నుండి వెలువడింది కానీ ఇప్పుడు కాండముగా అయిపోయింది. ఇది కూడా విశేషతయే కదా! సదా అన్నింటిలోనూ రాజీగా ఉంటారు. రాజీగా ఉండడం అనగా అన్ని రహస్యాలనూ తెలుసుకోవడం. కావున మెజార్టీ సంతుష్ట ఆత్మలే. మీరు సంతుష్టమణులు. ఎటువంటి వాయుమండలంలోనైనా అలజడి ఉన్నా కానీ మీరు సదా అచలముగా ఉండేవారే కదా! ఎందుకంటే మీరు బాబాతో కలిసి ఉంటారు. ఏ విధంగా సదా బాబా అచలముగా ఉన్నారో అలాగే వారి తోడుగా ఉండేవారు కూడా అచలముగానే ఉంటారు కదా!

శాన్ ఫ్రాన్సిస్కో:- బ్రహ్మాకుమారీ, కుమారులందరి యొక్క విశేష కర్తవ్యము ఏమిటి? బ్రహ్మా బాబా యొక్క విశేష కర్తవ్యము ఏమిటి? కొత్త ప్రపంచము యొక్క స్థాపనయే బ్రహ్మ యొక్క కర్తవ్యము. మరి బ్రహ్మాకుమారీ, కుమారుల యొక్క విశేష కర్తవ్యము ఏమిటీ? స్థాపనా కార్యములో వారు సహయోగులు. కావున ఏ విధంగా అమెరికాలో వినాశకారుల, వినాశనం యొక్క స్పీడ్ పెరుగుతోందో అలాగే స్థాపనకు నిమిత్తులైన పిల్లల యొక్క స్పీడ్ కూడా తీవ్రముగా ఉందా? వారైతే చాలా తీవ్ర గతితో వినాశనం కొరకు తయారుగా ఉన్నారు. అలాగే మీరందరూ కూడా స్థాపనా కార్యములో ఇంత ఎవర్రెడీగా తీవ్ర గతితో ముందుకు వెళుతున్నారా? వారి వేగం తీవ్రముగా ఉందా లేక మీ వేగము తీవ్రంగా ఉందా? వారు 5 క్షణాలలో వినాశనం చేసేందుకు తయారుగా ఉన్నారు మరియు మీరు ఒక్క క్షణములో తయారుగా ఉన్నారా? గతి ఎలా ఉంది? సెకనులో స్థాపన యొక్క కార్యము అనగా క్షణములో దృష్టినివ్వగానే సృష్టి తయారైపోవాలి. అటువంటి వేగం ఉందా? కావున మా గతి వినాశకారుల యొక్క వేగం కన్నా ఎక్కువ వేగంతో ఉండాలి అని స్థాపనకు నిమిత్తులైయున్న ఆత్మలు సదా ఈ స్మృతిని ఉంచుకోవాలి. ఎందుకంటే, పురాతన ప్రపంచము యొక్క వినాశనానికి కొత్త ప్రపంచ స్థాపనతో సంబంధం ఉంది. మొదట స్థాపన జరగాలా లేక వినాశనమా? స్థాపన యొక్క గతిని తీవ్రతరం చేసేందుకు విశేష ఆధారము - సదా స్వయమును శక్తిశాలి స్థితిలో ఉంచుకోండి. జ్ఞాన స్వరూపులుగా అవ్వడంతో పాటు శక్తిశాలీ స్థితిలో ఉంచుకోండి. నాలెడ్జ్ ఫుల్ తో పాటు పవర్‌ఫుల్ గా ఉండండి. రెండూ కంబైన్డ్ గా ఉండాలి, అప్పుడే స్థాపన యొక్క కార్యము తీవ్రగతితో జరుగుతుంది, కావున తీవ్రగతి యొక్క పునాది ఎక్కడి నుండి వేయబడుతుంది? అమెరికా నుండా? అమెరికాలో కూడా ఎన్నో సేవా కేంద్రాలున్నాయి. కావున అందరూ నెంబర్ వన్ గా మేమే వెళతాము అన్న లక్ష్యమును ఉంచండి. మరి మీ సెంటర్‌ నుండి మొట్టమొదటి ఆత్మిక బాంబు వెలువడుతుంది కదా! దాని ద్వారా ఏమి జరుగుతుంది? అందరూ తండ్రి యొక్క పరిచయమును తెలుసుకుంటారు. ఏ విధముగా ఆ బాంబులతో వినాశనం జరుగుతుందో అలా ఈ ఆత్మిక బాంబుల ద్వారా అంధకారము యొక్క వినాశనం జరుగుతుంది. కావున ఈ బాంబును వదిలేందుకు తారీకు ఏమిటి? ఆ గవర్నమెంట్ కూడా ఫలానా రోజున రిహార్సల్ జరుగుతుంది అని తారీకు చెబుతుంది కదా! మరి మీ రిహార్సల్ యొక్క డేట్ ఎప్పుడు? అచ్చా!

విదేశీ టీచర్ అక్కయ్యలు అవ్యక్త బాప్ దాదాతో పిక్నిక్ జరిపారు. పిక్నిక్ అయిపోయిందా? వింటూనే ఉంటారు. కాసేపు తింటారు. కాసేపు వింటారు - ఇదే ఈశ్వరీయ పరివారము యొక్క విశేషత. ఇప్పుడిప్పుడే శిక్షకుని ముందు కూర్చుంటారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే తండ్రి ముందుకు వస్తారు, మళ్ళీ అప్పుడే స్నేహితుని ముందుకు వస్తారు. ఈ బహురూపాల యొక్క అనుభవమును మొత్తం కల్పమంతటిలోనూ ఎవరూ పొందలేరు మరియు ఎవరూ ప్రాప్తింపజేయలేరు. సంగమయుగములో ఇది ఒక్క తండ్రి యొక్క పాత్రయే. సత్యయుగములో బాప్ దాదాతో పాటు పిక్నిక్ జరపాలి అని కోరుకున్నా జరుపుకోగలరా? ఇప్పుడు ఏది కావాలనుకుంటే అది, ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో మిలనమును జరపవచ్చు. కావున ఇది కూడా విశేష సేవాధారులైన మీ యొక్క భాగ్యమే. 

బాప్ దాదా అయితే అమృతవేళ నుండి పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యమును చూస్తూ ఉంటారు. ఎన్ని రకాల భాగ్యాలు ప్రతి ఆత్మకూ రచింపబడియున్నాయి అని గమనిస్తారు. అమృతవేళయే భాగ్యాన్ని తీసుకువస్తుంది. ఆత్మిక మిలనము యొక్క భాగ్యమును అమృతవేళయే తీసుకువస్తుంది కదా! ప్రతి అడుగులోనూ మీ యొక్క భాగ్యము ఉంది. తండ్రినే చూస్తారు. తండ్రిని చూసేందుకే ఈ కళ్ళు లభించాయి. తండ్రి మాటలు వినేందుకే చెవులు లభించాయి. మరి అది భాగ్యమే కదా! ప్రతి కర్మేంద్రియం యొక్క భాగ్యమూ ఉంది. ప్రతి అడుగులోనూ అడుగు వేసేందుకు కాళ్ళు లభించాయి. ఈ విధంగా ప్రతి కర్మేంద్రియానికి తమ తమ భాగ్యము ఉంది, కావున ఎన్ని రకాల భాగ్యాలు రోజంతటిలో ప్రాప్తమవుతాయో వాటి లిస్ట్ తీయండి! బాబాను చూసారు, బాబా మాటలు విన్నారు, బాబాతో పడుకున్నారు. బాబా తోడుగా తిన్నారు. ఇలా అన్నీ బాబాతో కలిసి చేస్తారు. సేవ చేసినా అందులోనూ తండ్రి యొక్క పరిచయాన్నే ఇచ్చారు. తండ్రితో కలిపించారు... మరి ఇది ఎంత గొప్ప భాగ్యము? కావున బాప్ దాదా సదా పిల్లల ప్రతి ఒక్కరి యొక్క భాగ్యరేఖ ఎంత స్పష్టముగా మరియు పొడుగ్గా మరియు క్లియర్ గా ఉందో చూస్తూ ఉంటారు. భాగ్యము యొక్క రేఖ మధ్య మధ్యలో ఖండితం అవ్వడం లేదు కదా! జోడింపబడి మళ్ళీ ఖండింపబడుతూ ఉందా? లేక ఎప్పటినుండైతే జోడింపబడిందో అప్పటి నుండి అఖండముగా, తెగిపోకుండా ఉందా? ఖండితమైతే రేఖ మారిపోతుంది. కావున అఖండముగా ఉండాలి. కావున ఇటువంటి పిల్లల యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. బాబాకు ఇంకే పని ఉంది? విశ్వసేవ కొరకు మిమ్మల్ని నిమిత్తముగా చేసేసారు. ఇక తండ్రికి పని ఏముంది? (బాబాయే అన్నీ చేస్తున్నారు కదా!) కేవలం వెన్నెముకగా అవ్వడం బాబా యొక్క పని. పిల్లలతో కలుసుకోవడం, పిల్లలను చూడడం, పిల్లలతో ఆత్మిక సంభాషణ చేయడం, పిల్లలను నడిపించడం - ఇదే పని మిగిలియుంది కదా! మీకు విశ్వంతో పని ఉంది మరియు బాబాకు పిల్లలైన మీతో పని ఉంది. విశ్వం ముందు బాబాను చూపించేది పిల్లలైన మీరే కదా! పిల్లల ద్వారానే తండ్రి కనిపిస్తారు. వెన్నెముకగా బాబా ఉన్నారు. బాబా వెన్నెముకగా అవ్వకపోతే మీరు ఒంటరిగా అలసిపోతారు. మోహము కూడా ఉంది కదా! పిల్లల యొక్క అలసటను కూడా బాబా చూడలేరు, కావున ప్రతి సంవత్సరం అలసటను తీర్చుకునేందుకు మీరు ఇక్కడకు వస్తారు కదా! ఇక్కడకు వచ్చి సేవా భాధ్యత యొక్క కిరీటాన్ని దించుకుంటారు కదా! అక్కడైతే, ఒక్కొక్క విషయములోనూ ఎవరూ చూడడం లేదు కదా? ఎవరూ వినడం లేదు కదా? అని గమనం ఉంచుతారు. ఇక్కడ ఏమైనా జరిగినా దాదీ, దీదీలు ఉన్నారు, బాప్ దాదా ఉన్నారు, వారే సరి చేసేస్తారులే అని భావిస్తారు. ఇక్కడ ఫ్రీగా ఉన్నారు. కావున విదేశ సేవలో అనుభవాలు కూడా బాగా జరుగుతాయి కదా! డబుల్ నాలెడ్జ్ ఫుల్ గా అయిపోయారు కదా, అచ్ఛా!

Comments