14-01-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఆత్మిక సేనతో ఆత్మిక సేనాపతి (కమాండర్) కలయిక.
ఈ రోజు ఇది విశేషంగా ఎవరి సంఘటన? ఈ సంఘటన డబల్ సేవాధారీ పిల్లలది. ఎవరైతే డబల్ సేవాధారులుగా లేక డబల్ జ్ఞాన స్వరూపులుగా ఉన్నారో వారి సంఘటన. ఈ సమూహాన్ని (గ్రూపును) చూచి ఈ రోజు వతనంలో విశేషంగా ఒక సంవాదము నడిచింది-
వీరంతా నా విశేష భుజాలని బ్రహ్మబాబా శివబాబాతో చెప్పారు. అందుకు శివబాబా - "ఇదంతా నా రుద్రమాల " అని అన్నారు. రుద్రమాలలో విశేష మణులున్నారు. ఈ విధంగా పిచ్చాపాటీ (చిట్ చాట్) నడుస్తున్నపుడు శివబాబా బ్రహ్మబాబాను - "ఈ భుజాలన్నీ కుడి చేతులా లేక ఇందులో ఎడమ చేతులు కూడా ఉన్నారా?" అని అడిగారు. కుడి చేతులనగా సదా సమానమైనవారు, స్వచ్ఛమైనవారు. అంతేకాక సత్యవాదులు అనగా సత్యము చెప్పేవారు. మరి అందరూ కుడి చేతులేనా? అందుకు బ్రహ్మబాబా మందహాసము చేశారు. చిరునవ్వుతో బాబా, ప్రతి ఒక్కరి లెక్కాచారము మీ వద్ద ఉండనే ఉంది కదా అని చెప్పాడు. లెక్కాచారము చూచే మాట వస్తూనే ప్రతీ పుత్రుని లెక్కాచారము వారి ముందు ఎమర్జ్ అయ్యింది. ఏ రూపంలో ఎమర్జ్(ఉత్పన్నమయింది) అయ్యింది? ఒక గడియారము రూపంలో ఉత్పన్నమయ్యింది. అందులో ప్రతి ఒక్కరి 4 సబ్జక్టులు(విషయాలు) నాలుగు భాగాలుగా ఉన్నాయి. ఇక్కడ మీరు సృష్టి చక్రము చిత్రాన్ని తయారు చేశారు కదా. అలా ప్రతీ భాగములో ఉన్న వేరు వేరు ముళ్లు నాలుగు విషయాలలో ఎంతెంత శాతముందో చూపుతూ ఉన్నాయి. అందరి లెక్కా చారాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లెక్కాచారాలు చూస్తూ బాప్ దాదా పరస్పరములో సమయాన్ని తెలిపే గడియారము, పిల్లల పురుషార్థమును తెలిపే గడియారము రెండిటినీ చూస్తూ ఉంటే ఏమి కనిపించింది? అని మాట్లాడుకుంటున్నారు. రెండు గడియారాలలో మెజారిటీ పిల్లల రెండు భాగాలు అనగా రెండు సబ్జక్టులలో 75 శాతము మంది రిజల్టు బాగుంది. కాని మిగిలిన రెండు సబ్జక్టులలో రిజల్టు శాతము చాలా తక్కువగా ఉంది. అందువలన బాప్ దాదా - ఈ రిజల్టు అనుసారము ఎవరెడీ గ్రూపు అని అంటారా? అని అడుగుచున్నారు. ఎలాగైతే బటన్ నొక్కగానే వినాశనమవుతుందో, అందుకు ఒక సెకండు కూడా పట్టదో అలా స్థాపనకు నిమిత్తమైన పిల్లల వద్ద ఒక సెకండులో తయారయ్యే స్మృతి బటన్ తయారుగా ఉందా? సంకల్పము చేస్తూనే అశరీరులుగా అయిపోవాలి. సంకల్పము చేస్తూనే సర్వులకు కళ్యాణము చేసే ఉన్నతమైన విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితమైపోవాలి. అదే స్థితిలో స్థితమై, సాక్షి దృష్టితో వినాశ లీలను చూడగలగాలి. అన్ని దేహ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు - ఈ ఆకర్షణలన్నిటికీ అతీతంగా, ప్రకృతి ఆందోళనల ఆకర్షణలకు అతీతంగా, ఫరిస్తాలై ఉన్నత స్థితిలో స్థితమై శాంతి మరియు శక్తుల కిరణాలను సర్వ ఆత్మలకు ఇవ్వగలగాలి. ఇటువంటి స్మృతి కలిగించు బటన్ రెడీగా ఉందా? ఈ రెండు బటన్లు తయారైనపుడు సమాప్తమవుతుంది.
ఈ గ్రూపును చూచి వతనంలో లెక్కాచారాలు ఎమర్జ్ అయ్యాయి. ఎలాగైతే బాహుబలము గల సైన్యములో కూడా అనేక ప్రకారాల సైనికులుంటారు కదా. కొంతమంది బార్డరును రక్షించువారు, కొంతమంది యుద్ధ మైదానములోకి వెళ్లేవారు అనగా నేరుగా యుద్ధము చేసేవారు, మరి కొంతమంది వెనుక ఉండి వారిని పాలన చేయువారు ఉంటారు. డైరక్టరు వెన్నముకగా ఉంటాడు. అలాగే ఈ గ్రూపులోని వారు మైదానములో సేవ చేసే గ్రూపు. మైదానములోకి వచ్చి సేవ చేసే వారి ఆధారము పైననే జయము లేక అపజయము ఆధారపడి ఉంటుంది. మైదానములోకి వచ్చు వారు బలహీనులుగా, శస్త్రహీనులుగా, పిరికివారుగా ఉంటే డైరక్టరు ఎప్పుడూ విజయము పొందలేడు. ఈ సేవాధారీ గ్రూపు విశ్వ కళ్యాణము చేసే మైదానములో ఉంది. ఈ గ్రూపులోని వారు వీరులు, నిర్భయులు. ఎదుర్కొనే శక్తి అనగా అనుభవము చేయించే శక్తి, తమ శ్రేష్ఠ చరిత్ర ద్వారా బాప్ దాదా చిత్రాన్ని చూపించే శక్తి - ఇటువంటి శస్త్రధారులుగా ఉన్నారా? ఏమనుకుంటున్నారు. ఇటువంటి శక్తి స్వరూపం గలవారి గ్రూపుగా ఉందా? నాలుగు సబ్జక్టులలో నాలుగు అలంకారాలను ధరించి ఉన్నారా? రెండు భుజాల శక్తి స్వరూపులా లేక నాలుగు భుజాల వారా? ఈ నాలుగు అలంకారాలు నాలుగు సబ్జక్టులకు గుర్తు. మీరందరూ అన్ని అలంకారాలను ధారణ చేశారా? లేక కొంతమంది రెండు, కొంతమంది మూడు ధారణ చేశారా? లేక ఒకటి ధారణ చేస్తూ ఉంటే మరొకటి వెళ్లిపోతూ ఉందా? ఈ గ్రూపు గొప్పదనం ఏమిటో అర్థమయిందా?
సేవా మైదానంలోకి వచ్చే గ్రూపు అనగా విజయానికి ఆధారమూర్తుల గ్రూపు. ఆధారమూర్తులు గట్టిగా (శక్తిశాలిగా) ఉన్నారు కదా? ఆధారం కదిలేది కాదు కదా? ఎలాగైతే జ్ఞానము మరియు సేవ ఈ రెండు సబ్జక్టులలో 75 శాతం ఫలితాన్ని చూశారో అలాగే స్మృతి(యోగం) మరియు ధారణ ఈ రెండు సబ్జక్టులపై కూడా ఎక్కువ గమనముంచి నాలుగు అలంకారధారులుగా కండి. లేకుంటే సృష్టిలోని ఆత్మలకు సంపూర్ణ సాక్షాత్కారం స్పష్టంగా చేయించలేరు. అందువలన ఈ రెండు అలంకారాలను ధారణ చేసేందుకు విశేషంగా ఏ అటెన్షన్ ఉంచుతారు? మీరు డబల్ సేవాధారులు కదా. లౌకిక మరియు ఈశ్వరీయ (అలౌకిక) సేవాధారులు. శరీర నిర్వహణార్థం మరియు ఆత్మ నిర్వహణార్థం డబల్ సేవ లభించింది. రెండు సేవలూ బాప్ దాదా ఆదేశానుసారమే లభించాయి. అయితే రెండు సేవలలో సమయం, శక్తులు రెండిటిని సమానంగా ఉపయోగించుటకు అటెన్షన్ ఇస్తున్నారా? త్రాసు రెండు వైపులా సమాన అటెన్షన్ ఉంచుతున్నారా? ముల్లు సరిగ్గా ఉంచుతున్నారా? లేక ముల్లు లేని త్రాసు ఉంచుతున్నారా? ముల్లు అంటే శ్రీమతం. శ్రీమతమనే ముల్లు సరిగ్గా ఉంటే రెండు వైపులా సరిగ్గా ఉంటుంది. అనగా త్రాసు బ్యాలన్స్ సరిగ్గా ఉంటుంది (సమానంగా ఉంటుంది). ముల్లే సరిగ్గా లేకుంటే బ్యాలన్స్ ఉండదు. కొంతమంది పిల్లలు ఒకవైపు ఎక్కువ బరువు ఉంచుతున్నారు. అది ఎలా? లౌకిక బాధ్యతలను తప్పక నిర్వహించాల్సిందే అని భావిస్తారు. ఈశ్వరీయ బాధ్యతలనైతే నిభాయించాలి అని అంటారు. అదేమో తప్పక నిభాయించాల్సిందే, ఇదేమో నిభాయించాలి. అందువలన ఒకవైపు బరువు ఎక్కువైపోతుంది. కనుక రిజల్టు ఏమవుతుంది? ఆ బరువు వారినే కిందికి తీసుకొస్తుంది. పైకి లేవలేరు. బరువున్న వైపు సదా కింద భూమిని తగులుతూ ఉంటుంది. తేలికగా ఉండేది భూమిని తగలక పైకి లేస్తుంది. సమానంగా ఉండినా భూమికి తగలదు, పైకి లేచి ఉంటుంది. భూమికి తగిలేందుకు కారణము భూమ్యాకర్షణకు వశమైపోతున్నారు. బరువు వలన ఈశ్వరీయ సేవ చేయు మైదానములో అజాగ్రత్తగా (తేలికగా) ఉండి సదా సఫలతా మూర్తులుగా అవ్వలేకపోతున్నారు. కర్మబంధనాల బరువు, లోక మర్యాదల బరువు కిందికి తీసుకొచ్చేస్తున్నాయి. ఏ లోకాన్నైతే వదిలేశారో, ఆ లోకంపై గౌరవముంచుతారు. ఏ సంగమయుగము లేక సంగమ లోకము వారిగా అయ్యారో ఆ లోకాన్ని గౌరవించుట మర్చిపోతున్నారు. ఏ లోకమైతే భస్మము కానున్నదో ఆ లోక మర్యాదలు సదా స్మృతిలో ఉంచుకుంటున్నారు. ఏ లోకమైతే అవినాశిగా ఉండి, దాని నుండే భవిష్య లోకము తయారవుతుందో ఆ లోక స్మృతిని ఇప్పించినా అప్పుడప్పుడు మాత్రమే స్మృతి స్వరూపులుగా అవుతున్నారు. గృహస్థ వ్యవహారము, ఈశ్వరీయ వ్యవహారము - రెండిటిలో సమానత ఉంచడం అనగా సదా రెండిటిలో తేలికగా ఉండి సఫలత పొందడం.
వాస్తవానికి గృహస్థ వ్యవహారమనే శబ్దాన్ని మార్చేయండి గృహస్థమనే శబ్ధం మాట్లాడుతూ, వింటూ గృహస్థులుగా అయిపోతున్నారు. అందువలన మీరు గృహస్థులు కాదు, ట్రస్టీలు. గృహస్థ వ్యవహారము కాదు, ట్రస్టు వ్యవహారము. గృహస్థులుగా అయినారంటే ఏమి చేస్తారు? గృహస్థుల ఆట ఏది? గృహస్థులుగా అయితే సాకులు ఎక్కువగా చెప్తారు. ఇలా, అలా అనే భాష ఎక్కువగా మాట్లాడారు. ఇలా కదా, అలా కదా అని విషయాన్ని పెంచడంలో లగ్నమౌతున్నారు. ఇది మీకు తెలుసు కదా, ఇది చేయాల్సే వస్తుంది, ఇది ఇలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది - ఈ పాఠాన్ని తండ్రికి కూడా చదివించడం ప్రారంభిస్తారు. ట్రస్టీలుగా అయితే సాకులన్నీ సమాప్తమైపోతాయి. ఉన్నతమయ్యే కళ ప్రారంభమవుతుంది. కనుక ఈ రోజు నుండి స్వయాన్ని గృహస్థ వ్యవహారములోని వారమని భావించకండి, ట్రస్టీలుగా వ్యవహరించండి. బాధ్యత మరొకరిది(బాబాది) మీరు నిమిత్తమాత్రులు. ఎప్పుడైతే సంకల్పాన్ని ఇలా పరివర్తన చేసుకుంటారో, మాటలు, కర్మలు పరివర్తన అవ్వనే అవుతాయి. కనుక ఈ గ్రూపులో ఒక్కొక్కరు చాలా చాలా అద్భుతాలు చేయగలరు. ప్రతి ఒక్కరు కర్మయోగి, రాజయోగికి స్యాంపుల్ గా అయ్యి అనేక ఆత్మలచే శ్రేష్ఠ వ్యాపారము చేయించుటకు నిమిత్తులుగా అవుతారు. హద్దులోని గురువులైతే వారి శిష్యులలో ఒక్కరు మాత్రమే గురువు గద్దెపై కూర్చొని గురువు పేరును ప్రఖ్యాతము చేస్తాడు. కాని ఇక్కడ సద్గురువుకు అనేకమంది సింహాసనాధికారీ పిల్లలున్నారు. ఒక్కొక్క పుత్రుడు ఎంతో శ్రేష్ఠ కార్యాన్ని చేయగలడు.
బాప్ దాదా పిల్లలందరినీ ఇటువంటి సేవాధారులుగా, విశ్వములో పేరు ప్రఖ్యాతము చేసే విశ్వకళ్యాణకారీ పిల్లలుగా భావిస్తారు. ఒక్కొక్క దీపము ఒక్కొక్క దీపమాలను తయారు చేస్తుంది. అలా ఒక్కొక్క దీపమైన మీరు మొత్తం విశ్వాన్ని దీపావళిగా చేసేస్తారు. ఈ గ్రూపు ఏమి చేయాలో తెలిసిందా.
వెరైటీ గ్రూపు వెరైటీ వర్గ ఆత్మలకు సేవాధారులై సర్వుల సద్గతిదాతగా లేక శ్రేష్ఠ జీవితాన్ని తయారుచేయుటకు ఆధారమూర్తులుగా అవ్వాలి. ఎలాగైతే డబల్ విదేశీయులున్నారో అలా ఇక్కడ డబల్ జ్ఞానస్వరూపులూ ఉన్నారు, డబల్ సేవాధారులూ ఉన్నారు. ఫలితము కూడా డబల్ గా తీసుకు రావాలి.
ఇటువంటి సదా సర్వ బంధన ముక్తులకు, జీవన్ముక్తులకు, విశ్వమనే షోకేసులోని విశేష షోపీసులకు, విశ్వ పరివర్తన చేయు ఆధారమూర్తులకు, సదా శ్రీమతము ఆధారముపై స్వయాన్ని ఉద్ధరించుకొని విశ్వాన్ని ఉద్ధరించువారికి, ఇటువంటి సదా విశ్వ సేవాధారులకు, బేహద్ సేవాధారులకు బాప్ దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే.
డాక్టర్లకు అవ్యక్త బాప్ దాదా మధుర మహావాక్యాలు :- ఇది డబల్ డాక్టర్ల గ్రూపు కదా, ఎలాగైతే డాక్టర్లు తమ హద్దు వైద్య వృత్తిలో స్పెషలిస్టులుగా ఉన్నారో, అలా ఆత్మిక వైద్య వృత్తిలో విశేషంగా ఏ సేవకు నిమిత్తంగా ఉన్నారు? ఎలాగైతే హద్దు డాక్టర్లలో కొంతమంది కన్నులకు, కొంతమంది గొంతుకు, కొంతమంది శస్త్ర చికిత్సలో, కొంతమంది కేవలం మందులిచ్చేందుకు స్పెషలిస్టులుగా ఉంటారో అలా ఈ ఆత్మిక వైద్యములో ఏ విశేషత ఉంది? ఒక సెకండులో ఎవరిదైనా పాత సంస్కారాలనే జబ్బును దృష్టి ద్వారా సమాప్తము చేసెయ్యాలి. అనగా ఆ సమయములో ఆ వ్యాధి నుండి వారిని మరపింపజేయాలి. అటువంటి విశేషతలు గల డాక్టర్లు ఉన్నారా? ఎలాగైతే ఆ కనులను బాగు చేస్తారో అలా మీ దృష్టి ద్వారా ఎవరివైనా పాత సంస్కారాలను మొదట అణచివేసి తర్వాత సమాప్తము చేసెయ్యాలి. ఆ సమయములో శాంతిగా చేసెయ్యాలి. ఇటువంటి విశేషతలు గల డాక్టర్లుగా ఉన్నారా? మీరు దృష్టితో పరివర్తన చేసే కనుల డాక్టర్లు, ఎలాగైతే డాక్టర్లు మాత్రలనిచ్చి తాత్కాలికంగా కొంత సమయం నొప్పిని అణిచి వేస్తారో అలా దృష్టితో సంతుష్టము చేసేవారు కనుల డాక్టర్లు, హద్దు డాక్టర్లు కాదు. ఆత్మిక డాక్టర్లు. అత్మిక కంటి డాక్టరు అనగా ఆత్మిక దృష్టితో ఆరోగ్యమునిచ్చేవారు.
2) సర్జన్లు - ఎలాగైతే ఆ సాధనాలతో ఆపరేషన్ చేస్తారో అలా ఇక్కడ మీలో ఉన్న శక్తులే సాధనాలు. ఈ యంత్రాల ద్వారా వారి బలహీనతలు సమాప్తమైపోతాయి. ఎలాగైతే మీరు ఆపరేషన్ థియేటర్లోని యంత్రాల ద్వారా ఆపరేషన్ చేస్తారో, పేషంట్ల యంత్రాలను ఉపయోగించరో అలా మీ శక్తులనే యంత్రాల ద్వారా జబ్బులు బాగు చేయండి. కాముకుని నిష్కామిగా, క్రోధిని నిక్రోధిగా చేసేయండి. అందుకై మీలోని సహనశక్తి అను యంత్రమును ఉపయోగించాల్సి వస్తుంది. ఇటువంటి సర్జన్లుగా ఉన్నారా? ఎలాగైతే అక్కడ కనులు, ముక్కు అన్నిటికి వేరు వేరు స్పెషలిస్టులు ఉంటారో అలా ఇక్కడ కూడా వేరు వేరు విశేషతలున్నాయి. ఇక్కడ కూడా ఎవరైనా ఎన్ని డిగ్రీలు తీసుకోవాలనుకుంటే అన్ని డిగ్రీలు తీసుకోవచ్చు. అన్ని విశేషతలలో ఆల్ రౌండరుగా అయ్యేవారు ప్రసిద్ధి చెందుతారు.
డాక్టర్లు సేవ చాలా చేయవచ్చు - ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో పేషంట్లు పూర్తి భికారి రూపంలో మీ వద్దకు వస్తారు. ఆ సమయంలో డాక్టర్లు ఏ మందు ఇచ్చినా, కేవలం నీరు ఇచ్చినా భావన వలన వారు బాగైపోతారు. వారికి సంతోషమనే టానిక్ లభిస్తుంది, దానితో బాగైపోతారు. మందుతో కాదు, సంతోషంతో బాగైపోతారు. కనుక డాక్టర్ల వద్దకు బికారి రూపంలో వస్తారు. రెండు ఘడియలు వారి బాధను పోగొట్టినా ఆ సమయంలో మీరు ఏమి వినిపించినా వారు వినుటకు రెడీగా ఉంటారు. ఎలాగైతే ఇంజక్షన్ వేసి ఒక సెకండులో పేషంటు నొప్పిని మరపింపజేస్తారో అలా జ్ఞానమనే ఇంజక్షన్ వేస్తే పాత సంస్కారాలను మర్చిపోవాలి. ఇటువంటి ఇంజక్షన్ మీ అందరి వద్ద ఉంది కదా. మొదట ఆ ఇంజక్షన్ స్వయం వేసుకొని మీ సంస్కారాలను మర్చిపోవాలి. ఈ అనుభవం ఆధారముతో ఇతరులకు కూడా ఆ ఇంజక్షన్ వేయవచ్చు. డబల్ డాక్టర్లకు ఏదైనా విశేషత ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా మీ వద్దకు పంపుతాము, కేసు వాపసు పోరాదు. సేవలో ముందుకెళ్లుటకు ఇది చాలా మంచి అవకాశము. డాక్టర్లు ఒక్క రోజులోనే చాలామంది ప్రజలను తయారు చేసుకోవచ్చు. ప్రతీ రోజు రెడీమేడ్ ప్రజలు మీ వద్దకు వస్తారు. మీరు వెతికే అవసరముండదు. మేళాలకు, ప్రదర్శినీలకు చాలా ఖర్చు చేసి పిలవవలసి వస్తుంది. మీకు చాలా సులభము. సంబంధములోకి తీసుకొస్తే పిల్లలుగా కూడా కావచ్చు. కొంతమంది బాగుంది, బాగుంది అని వెళ్లిపోయినా చివర్లో ఆందోళన సమయంలో ఇష్టపడి, అనుభూతి శక్తితో పాటు వస్తారు. అందువలన సేవ చేస్తూ ఉండండి. మిమ్ములను ఇష్ట దేవతల వలె తప్పక గౌరవిస్తారు. మరేమీ కాకున్నా కనీసము మీ భక్తులుగానైనా అవుతారు. ఒకవేళ చివర్లో వీరు సందేశమునిచ్చారు. సందేశకులుగా ఉండినారని గుర్తు వచ్చినా వారు మీ భక్తులుగా అయిపోతారు. చివరి స్టేజి భక్తులది. వారు కూడా కావాలి కదా!
ఇప్పుడు వచ్చేవారు 7 రోజుల కోర్సుతో, స్వంత ధైర్యముతో నడిచేవారు చాలా తక్కువ. చివరి రాశి వారు కదా. వారికి శక్తి ఉండదు. అందువలన ఇది ఇప్పుడు వచ్చే ఆత్మలను మీ శక్తుల సహయోగము ద్వారా ముందుకు తీసుకెళ్లే సమయము. మీతో పోలుస్తే ఇప్పుడు వచ్చేవారు "టూ లేట్" వారు. ఎందుకంటే చివరి రాశి వారు. అందువలన స్వయం మీరే వారికి ఆనందమునిచ్చి ముందుకు నడిపించాలి. మీరు మహాదానులు, వరదానులుగా కావలసి వస్తుంది. వారు స్వంత ఆధారముతో నడవలేరు. కనుక ఒక్క సెకండులో అనుభవము చేయించే శక్తిశాలి యంత్రమును ఏదైనా కనుక్కోండి. ఇప్పుడు మీ తోటివారి సంఖ్యను పెంచండి. ఇప్పుడు వేసిన వెంటనే మిగిలినవన్నీ మర్చిపోయే ఇంజక్షన్ తయారు చేయండి. ఆ ప్రపంచము నుండి మూర్ఛిల్లి ఈ ప్రపంచములోకి వచ్చేయాలి. ఇటువంటి ఇంజక్షన్ తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడీ సంవత్సరంలో మీ సంఖ్యను ఎంత పెంచుతారో చూస్తాము. కనీసము మీ తోటివారు మాకు తెలపనే లేదు అనే ఫిర్యాదు చేయరాదు. మేము మేలుకోకుంటే మేల్కొలిపే కర్తవ్యము చేయాలి కదా అని ఫిర్యాదు చేస్తారు. ఒకసారి ఆహ్వానించి కరపత్రము ఇస్తూనే వారెలా మేల్కుంటారు? కుంభకర్ణుని నిద్రలో నిదురించే వారిని ఒకసారి - ఏయ్ మేలుకో అని అంటూనే వారెలా మేల్కుంటారు? కనుక మాటిమాటికి మేల్కొల్పాల్సి వస్తుంది.
Comments
Post a Comment